అజరామర సూక్తి – 238
अजरामर सूक्ती - 238
Eternal Quote – 238
https://cherukuramamohan.blogspot.com/2021/05/238-2-3-8-eternal-quote-2-3-8.html
दृष्टिपूतं न्यसेत्पादं वस्त्रपूतं पिबेज्जलम् ।
शास्त्रपूतं वदेद्वाक्यं मनः पूतं समाचरेत् ॥ - चाणक्य नीति
దృష్టి పూతం న్యసేత్ పాదం, వస్త్రపూతం జలం పివేత్,
శాస్త్ర పూతం వదేద్ వాక్యం, మనః పూతం సమాచరేత్! - చాణక్య నీతి
ముందుకు అడుగు వేయునపుడు బాగా పరికించి మరీ అడుగు వేయాలి. నీరు
త్రాగేప్పుడు బట్టతో బాగా వడగట్టి శుభ్రమైన నీటినే త్రాగాలి. మాటలాడే సమయమున
బాగా ఆలోచించి శాస్త్ర సమ్మతమైన విధముగానే మాట్లాడాలి. కార్యాచరణలో మనసు
చెప్పిన విధంగా మనసుకు నచ్చిన విధంగానే పనులు శ్రద్ధతో ఏకాగ్రతతో ఆచరించాలి.
వ్యక్తి జీవితమున సార్ధక్యతను పొందుటకు ఏదైనా సాధించాలి. నిస్సారమైన
బ్రతుకుతో ప్రయోజనమేమీ లేదు.
సార్థకతయ లేని జన్మమ్ము మనిషికి
ఉండి యొకటె ఊడి పోవ నొకటె
కంకి తోడ ఎన్ను కలిగియు ఫలమేమి
రామమోహనుక్తి రమ్య సూక్తి.
ఈ మాట ఎందుకు చెప్పవచ్చినానంటే పాలు చక్కర కలుస్తూనే పాయసము కాదు.
దానికి సుగంధ ద్రవ్యాలు, ముంతమామిడి, ద్రాక్ష ఏలకులు సేమ్యా మొదలైనవి కలిస్తేనే
అది పాయసమౌతుంది. అప్పుడు ఆ పాయసమునకు ఒక సార్థకత చేకూరుతుంది.
ఇది మనకు కూడా అవసరమే ! మన నడక లోనే కాదు నడతలో కూడా జాగరూకత
వహించాలి. నీరు అంటూనే త్రాగము కదా! ఆ నీరు శుభ్రముగా ఉంటేనే త్రాగాగలము.
అదేవిధముగ మనసు మాటలోనూ, మాట క్రియ లోనూ ప్రతిఫలించాలి. దానినే
త్రికరణ శుద్ధి అంటారు. అదేవిధముగా ఒక పని తలపెట్టినపుడు పూర్వాపరములు
యోచించి మొదలు పెడితే, ముగియు వరకు పట్టు విడకూడదు. మనిషికి గుర్తింపు
తెచ్చేవి ఈ గుణాలే.
నీటిని వడగట్టడం ద్వారా స్వచ్ఛతను సంతరించుకుంటుంది. అటువంటి స్వచ్ఛమైన
నీటిని మాత్రమే త్రాగాలి. ప్రాచీన భారతీయ సమాజంలో నీటిని వడగట్టేందుకు బట్టను
లేదా చీరను 6 నుండి 8 మడతలుగా చేసి నీటిని వడగట్టేవారు. ఈ విధానం ఈ నాడు
ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన ఒక సర్వేలో అత్యుత్తమమైన విధానంగా
నిరూపితమైనదని విన్నాను. రాత్రి పడుకునేందుకు ముందు ఒక గ్లాసు పరిశుభ్రమైన
నీటిని త్రాగడం వల్ల గుండె పోటు సమస్యలను నివారించ వచ్చునంటారు వైద్యులు.
నిద్దుర లేవగానే మన శరీరమునకు ఒప్పుదలయగు మేరకు, సామాన్యముగా 3\4లీ.
లేక 1లీ. నీలు త్రాగితే ఆనీటితోబాటు నోటిలో మరియు కడుపు వరకు కలిగిన వివిధ
భాగములలోని రసములు చేరి జీర్ణక్రియకు దోహదము చేస్తాయి.
మాట్లాడడం ఒక కళ. దానిని కష్టపడియైనా అభ్యసించి కొంతవరకైనా
సాధించవలసినదే!
మాటే మంత్రము తంత్రము
మాటే మనుషులను కలుపు మాన్యత నిలుపున్
మాటే తెలుపును మనసును
మాటే మరి నేర్వకున్న మనుగడ లేదే!
మరి మాటకున్న ప్రాధాన్యత అతటిది. అందుకే మాట యోచించి మాట్లాడవలెనే తప్ప
నోరున్నదని జారకూడదు.
మన ఆంతశ్ఛేతనకు భిన్నంగా ప్రవర్తించ కూడదు. ప్రవర్తిస్తే అలజడికి గురౌతాము.
అలజడి ఒత్తిడిని పెంచుతుంది. ఒత్తిడి వల్ల మానసిక సమతుల్యత దెబ్బతింటుంది.
దానితో కార్య స్వరూపాన్ని సరిగా అంచనా వేయలేము. అందువల్ల ప్రణాళికలో లోపం
ఏర్పడి ఆచరణ తప్పుతుంది. కార్య భంగం అవుతుంది. మరి అంతశ్చేతనకు
ప్రాతిపదిక ఏది? అంటే మనము తలచిన కార్యము సామాజిక ప్రయోజనము
కలిగినదిగా ఉండవలెను. మనకు ఎదుటివారికి ఆనందం కలగడం కోసము, లేదా
ఏవో ప్రలోభాలకు లొంగి పనిచేయడం లేదా భయపడి పని చేయడం వల్ల మనసును
ఆ కార్యముపై వంద శాతము లగ్నము చేయలేము. అందుకే పెద్దలు ‘ఆత్మ బుద్ధిని
అనుసరించామన్నారు.
ఇది ఎంతో విలువైన శ్లోకము. తరచితే మనకు కావలసినంత సుజ్ఞానమును
లౌకికమును ప్రసాదిన్చుతుంది. ఈ శ్లోకమునందించిన చాణక్యునకు సాష్టాంగ
నమస్కారము.
No comments:
Post a Comment