Saturday, 4 July 2020

కడప శ్రీపతి గడపరా!


కడప శ్రీపతి గడపరా!
https://cherukuramamohan.blogspot.com/2020/07/blog-post.html
దేశమంటే మట్టిరా
ఆ మట్టియే మా తల్లిరా
ఆ తల్లి పేరే కడప రా
ఆ కడప శ్రీపతి గడపరా!
మనసు మల్లెల తోట రా
మా మాట తేనెల వూట రా
మమత పూవుల బాటరా
ఇది శౌర్యవంతుల కోట రా!
ఆంధ్ర సీమన ఆదిశంకర
పీఠమిదియే తెలియరా
దాని పేరే పుష్పగిరి యది
పురాణాల ప్రసిద్ధిరా!
నటులకిది పుట్టిల్లురా
కవిశేఖరుల కాణాచిరా
వాణి గళమున వాడిపోవని
మల్లెమరువపు మాలరా!
నిర్మాత దర్శక నట విరాట్టుల
నిరుపమానపు గడ్డ రా
ఏషియాలో పెద్ద స్టూడియొ
కట్టె కడపకు బిడ్డ రా!
పైడి భూషల పేట రా
చేనేత కళలకు నేత రా
జానపద గేయాలకీయది
మధువులోలికే వూటరా!
అచ్చతెలుగుల వెల్గురా
అవధాన మణిహారమ్మురా
అసమాన పండిత వల్లిరా
ఈ గడ్డకే అది చెల్లురా!
నోట నీరూరించు మా, తెలి
 కజ్జికాయల చూడరా
మా ఎర్ర కారెము కల్గియుండే
దోశలను చవి జూడరా!
తమలపాకులు దోసపళ్ళు
స్వర్గమును తలపించురా
కోడూరు చీనీ నారునకు
ఈ లోకమే తలయొగ్గురా!
వజ్రాల గనులిటనుండెరా
ఖనిజాల గనులకు తల్లిరా
మా కొర్రలారికజొన్నసొజ్జల
తిండియే మా శక్తిరా!

రెడ్లు కమ్మల పాలనమ్మున
వైశ్య వర్గపు వితరణమ్మున
వృత్తి నైపుణ్యతల యందున
సాటి లేనిది కడప రా!
              కడప రాయను పెరుతో మా
                నాపరాయి ప్రసిద్ధిరా
                 మా ఫెక్టరీల సిమెంటురా
                  మా ఉక్కుగుండెను చాటురా!

చౌడప్ప బద్దెన వేమనల
శతకాలు పుట్టిన ఇల్లురా
తెలుగు వెల్గుల ఉదయభానుడు
బ్రౌను దొర మా కల్కటేరు ర!

శౌర్యమంటే గండికోటర
యుద్ధమొక సయ్యాటరా
పౌరుషమ్ముల గడ్డ రా
అది నేడు ఇంగువ గుడ్డరా

చెడుగనే కుబుసమ్ము గల్గిన
స్వార్థపూరిత శాంతి దూతలు 
కడపకొచ్చిన ముప్పు రా
మా రాతనది ఎటు తప్పు రా!
కల్మషమ్ములు కలిసి కూడా
నిర్మలమ్మగు గంగ రా
కడపరా ఇది కడప రా
కడప దేవుని గడప రా!

No comments:

Post a Comment