Saturday, 11 July 2020

కృతజ్ఞత (నా జీవితపు మధుర స్మృతి)


కృతజ్ఞత (నా జీవితపు మధురస్మృతి)
నేను నా గురించి ఈ ఆస్యగ్రంధి మాధ్యమములో అవసరమయితే తప్ప తెలుపుకోను. అది నా అలవాటు, అహంకారము కాదు. అట్లని నాలో అహంకారము లేదు అని చెప్పుటలేదు. కానీ దానిని వీలయినంతవరకు తగ్గించుకొనే ప్రయత్నము నిరంతరమూ చేస్తూనే వుంటాను. ఇది వాస్తముగా గ్రహించ ప్రార్థన. స్వోత్కర్ష కాదు.
కృతజ్ఞత అన్నది మానవునికి భూషణము కాని ఆభూషణము. అదివుంటే తనవెంట  ఇంకెన్నో సల్లక్షణాలను చేర్చుతుంది. కృతఘ్నత అన్నది మనిషిని రాక్షసుని చేస్తుంది. ఈ విషయమై ఒక పది దినముల క్రితము మీకు తెలిపిన శ్లోకమునే సందర్భోచితమగుటవల్ల తిరిగీ తెలుపుచున్నాను.
బ్రహ్మఘ్నేచ సురాపేచ స్తేనే భగ్న వ్రతే తథాl
నిష్కృతిర్విహితా బుద్ధిః కృతఘ్నే నాస్తి నిష్కృతిఃll
బ్రహ్మహత్య చేయువారికి, త్రాగుబోతులకు, దొంగలకు, వ్రతభంగము చేయువారికి, సత్పురుషులు ప్రాయశ్చిత్త విధానమును తెలిపిరి, కానీ కృతఘ్నులను ఉద్ధరించుటకు ఎటువంటి నిష్కృతిని తెలుపలేదు. కృతఘ్నతకు మించిన పాపమే లేదు. చేసిన మేలు మరచినవాడు ఒక పూజకు పనికిరాని పూవు. తినుటకు పనికిరాని పండు. దుర్గంధభూయిష్టమైన వాయువు.
నేను సంఘములో గుర్తింపు పొందుటకు కారణభూతులు మా అమ్మమ్మ, మాతండ్రి. నా తండ్రికి నేను ఒకడినే సంతానము. తల్లి నాకు ఒక సంవత్సరము నిండగనే పరమ పదము చేరుకొంది. ఆడదిక్కు లేమిచే విధవరాలయిన నాఅమ్మమ్మను బ్రతిమలాడి  నన్ను ఒప్పజేప్పినాడు నా తండ్రి.
తదాదిగా వారి జీవిత ధ్యేయము నా ఉన్నతి మాత్రమే! ఎంతో కష్టపడి నన్ను
గణిత పారంగత ప్రక్రమము న (M.Sc. Maths.) తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వరా విశ్వవిద్యాలయములో చేర్చినారు. ఆ రెండు సంవత్సరముల ప్రక్రమములో చివరి రెండునెలలు నా తండ్రి కొంత ఆర్థికపరమగు ఇబ్బందులను ఎదుర్కొనవలసి వచ్చినది. నేను ఛాత్రవాసిని(Hostler) కాను.
అప్పుడు ఆ పరమాత్ముడే పంపినట్లు, శ్రీ రామకృష్ణ జూనియర్ కాలేజి అప్పటి ప్రిన్సిపాలయిన
శ్రీ రామ మూర్తిగారు మరియు వారి ఆచార్య బృందములో మువ్వురు, వారిలో ఒకరి స్నేహితుడయిన నరసింహారావు గారితో,  స్నాతకోత్తర పట్టాలు ఉండికూడా, మళ్ళీ MA చేయడానికి వచ్చినారు.
నా తండ్రి శ్రీ రామూర్తి గారికి తెలుసు. నేను రామకృష్ణ కాలేజిలో ఒక్క తరగతి కూడా చదువలేదు. గోపాలకృష్ణముర్తిగారు మాకు ఇరుగు పొరుగు. సీతారామయ్యగారు దూరపు బంధువు. అయినా నన్ను చూడవలెనను తలంపు కలిగినది రామమూర్తి గారికి. వారు 5మందీ కలిసి నేను ఉన్న గదికి వచ్చినారు. కుశల ప్రశ్నలు ముగిసిన వెంటనే రామమూర్తిగారు, నీవు ఒక్కనివే ఇక్కడ ఎందుకు,? మాతోబాటూ వుండి చదువుకొందువుగానీ అని, ఆ కొద్ది పరిచయముతోనే ఆయన ఎంతో ఆప్యాయతతో కూడిన అధికార స్వరములో నన్ను పిలచినారు. అప్పటికప్పుడు రూము ఖాళీ చేసి ఇవ్వవలసిన బాడుగ కట్టివేసి వారితో బయలుదేరినాను.
ఆరోజునుండి నా భారము పూర్తిగా వారిదే! వ్యక్తిగతముగా మాత్రము నా మంచిచెడులు రామమూర్తిగారే చూసేవారు. నాచదువు, తిండి, నిద్రల బాధ్యత అంతా ఆయనదే! ఆకాలములో పరిక్షలు దగ్గరగా ఉన్నందువల్ల ఎవరికీ ఏవిధమైన వ్యాయామము కూడా లేదు. అందుకొరకు ఆయన తన పాతవిద్యార్థులు, Medicine చదివే వారితో చెప్పి అరుగుదలకు అందరికీ కలిపి ఒక పెద్ద సీసా Corminative Mixture తెప్పించి ఎవరికీ కావలసినపుడు వారిని తీసుకొమ్మని చెప్పినారు. నా బాధ్యత మాత్రము వారిదే! అదేవిధముగా భోజనమునకు ఒక బ్రాహ్మణ మెస్ నుండి carrier వచ్చేది. తనప్రక్కన కూర్చోబెట్టుకొని సరిగా తింటున్నానా లేదా గమనించేవారు. ఇక చదువు విషయములో నేను రోజూ వారు చదివినంతసేపూ చదువ వలసిందే! రాత్రి నేను నిద్ర ఆపుకోలేకపోతే ఆయన తెప్పించియుంచిన Dexidrin మాత్ర ఒకటి ఇచ్చి వేసుకోమ్మనేవారు. అదివేసుకొంటే చదివినంతసేపూ, అంటే ఏదయినా పనిలో ఉన్నంతసేపూ, నిద్ర వచ్చేదికాదు. నిద్ర పోదలచి పడుకొని కళ్ళు మూసుకొంటే నిద్రవచ్చివేసేది.
పరీక్షలు అందరమూ, ముఖ్యముగా, రామమూర్తిగారి దయవల్ల నేను, చక్కగా వ్రాసి ఊరుచేరుకొన్నాము. ఒకరోజు అర్ధరాత్రి సమయములో ఇంట్లో అందరమూ నిదురబోయే సమయములో ఇంటిముందు శబ్దముచేస్తూ ఒక 2wheeler ఆగింది. మెలుకువలో వున్న మాతండ్రి లేచి చూస్తే, ఎదురుగా రామమూర్తిగారు. ఒక్క క్షణము ఆలస్యము చేయకుండా వెంకప్పగారూ! మీ కుమారునికి 1st class వచ్చింది. అని ఎంతో ఉద్వేగాముగా చెప్పినారు అదే సమయములో నాకూ మెళుకువ వచ్చి మరి మీరంతా సార్! అంటే అందరమూ అదే క్లాస్ లో పాసయినాము అన్నారు. ఈ వేళలో Results ఎట్లు తెలిసినవని నా తండ్రి వారినడిగినారు. యూనివర్సిటీ లో పనిజేసే నా పాత students, Telegram ఇచ్చినారని చూపించినారు. వారి వయసు అప్పటికే 56, 57 సంవత్సరములు ఉంటాయి. ఎంత ప్రేమ ఎంత అభిమానము. మరచితే నాకు అన్నము కూడా పుట్టదు. ఇవి అన్నీ ఇట్లు ఉంటే, తిరుపతిలో  సరదాగా మాట్లాడే సమయములో నేను చొరవ తీసుకొని ఆయనతో ఒకమాట అన్నాను. ఆరోజులలో PANAMA సిగరెట్లు ఒక పాకెట్ లో 20 వచ్చేవి. అటువంటివి ఆయన రోజుకు తక్కువంటే 2 పెట్టెలు కాల్చేవారు. ఆయన వస్తున్నారు అంటే ముందు పొగ కనిపించేది. అందుచేత నేను ఆయనను నడిచే పొగబండి అని ప్రక్కనున్న స్నేహితులతో అనేవాడిని అని చెప్పినాను. పిల్ల సొయ్యము అంటారు, అంటే పెద్ద చిన్న తారతమ్యమెరుగకుండా నేను ఆ మాట ఆయనతో చెబితే ఎంతగా నవ్వినారో నాకు ఈనాటికీ గుర్తే! పదే పదే అదే అదే మాట నన్ను అడిగడిగీ చెప్పించుకొని నవ్వేవారు. ఇంతటి అనుబంధము ఎంతమందికి కలిగే అవకాశమొస్తుంది.
       రోజులు గడిచిపొయినాయి. ఫలితములు తెలిసిన కొన్నినెలలకే నాకు పెళ్లి అయిపోయింది. ఉద్యోగము లేదు. పెళ్ళికి వచ్చి ఆయన నేను Interview లకు వెళ్ళుటకు గానూ నా Documents పెట్టుకొనుటకు ఖరీదయిన, అందమయిన Bag చదివించినారు. అది జీర్ణమైనా కూడా ఆయన జ్ఞాపకార్థము ఇప్పటికీనా దగ్గరగా ఉంచుకొన్నాను.
SBI లో ఉద్యోగమూ , కాలాంతరములో ఆఫీసరును అయినాను. తిరుపతి Zonal Office లో పనిచేసే కాలములో, ఆయన కుమారుడు, పేరు కుమార్, చార్టర్డకౌంటెంటు, నేను ప్రకాశం Region లో పని చేస్తూ వుంటే నావద్దకు వచ్చినాడు.కుశల ప్రశ్నలు ముగిసినతరువాత తనకు కారు లోను కావాలనీ, నావద్దకు వెళ్ళమని సారుచెప్పినారానీ అన్నాడు. అతనికి లోను ఇవ్వవలసినది కడప రీజియన్, రీజినల్ మేనేజర్. వారు నాకు బాగా తెలిసినవారే కాబట్టి, కుమార్ను పిలుచుకొనిపోయి వారికి పరిచయము చేసి లోను విషయము చెప్పినాను.  వారు తప్పకుండా చేద్దామనుటతో సమస్య తీరిపోయింది. ‘Thanks అన్నా’ అన్నాడు కుమార్. నేను ‘వద్దు కుమార్. ఆదినా బాధ్యత. సారు నన్ను నీతో సమానముగా చూసుకొంటారు.  మరి ఆమాత్రము నీకు సాయము చేయలేనా’ అని చెప్పి పంపినాను.
కారు లోను Sanction అయినది. కొత్త తెల్ల Ambassador కారు కొని మొదట తిరుమల వేంకటేశ్వరుని దర్శనమును ముగించుకొని నేరుగా కారు దిగువ తిరుపతిన మాయింటిముందు నిలుపుట జరిగినది. నా అడ్రసు సారు వద్ద ఉండినది కాబట్టి ఇల్లు తెలుసుకొనుట వారికి కష్టముకాలేదు. కారు ఎవరికొరకు ఆగినది అన్న ఆతురుతతో నేను బయటికి అడుగులు వేసినాను. అమ్మగారు కుమారు అతని భార్య పిల్లలు దిగినంతనే రందిరందని ఆహ్వానించి ‘సారూ ఏడీ’ అని అడిగినాను. కారు లోపల ఉన్నారని చెబుతూ వారు ఇంటిలోనికి దారి తీసినారు. నేను అచటనే నిలిచి తెరచిన తలుపుగుండా సారును చూసి ‘లోపలికి రండి సార్’,  అని అత్యంత ఆదరముతో పిలచినాను. నేను కారులోపలికి తలవంచి మాట్లాడుతూవుంటే ఆయన నా భుజములు పట్టుకొని నీరునిండిన కళ్ళతో ‘Brittle Bone Disease (Osteogenesis Imperfecta) వచ్చినది. కాస్త ఎక్కువగా కదిలినా ఎముకలు చిట్లుతాయి. ఇపుడు నడిచే  పొగబండి నడువలేన్ని బండి అయిపోయినది. సిగరెట్స్ కూడా మానివేసినాను’ అన్నారు. అసంకల్పితముగా నాకూ కంట నీరు కారినది. నన్ను నేను సర్దుకొని Tiffin చేయించుతాను అని ఎంతబలవంత పరచినా Tea మాత్రమే తాగుతానన్న వారికి నేను ఇంటిలోనికి వెళ్లి కప్పుతో Tea తెచ్చి వారికి ఇచ్చినాను. త్రాగి వారు ‘మళ్ళీ చూడనౌతుందో కాదో’ అన్నారు. ధైర్యము చెప్పే ప్రయత్నములో ‘మీకు బాగయిపోతుంది లెండి’ అన్నాను. తన కుటుంబ సభ్యులను రమ్మనమని చెబితే, నేను అలాగేచేసి, మేమందరమూ కూడా బయటికి వచ్చినాము. అవే కడసారి చూపులు. ఆతరువాత ఒక నెలలోపే ఆయన పరమపదించినారు. గాడిచెర్ల రామారావు గారి వీధినుండి NGO కాలనీ కి ఇల్లు మారుటలో నా అడ్రసు పోగొట్టుకొన్నందుచేత నాకు తెలియబరుపలేకపోయినారు. ఇంకా బాధాకరమైన విషయము ఏమిటంటే ఆయన కుమారుడు కూడా ఆతరువాత ఎక్కువ కాలము బ్రతుకలేదు. ఆవిధముగా నాతండ్రి గురువు, దైవమును దూరము చేసుకొన్నా మందభాగ్యుడను.
రెండు నెలలే కావచ్చు నావున్నతి కుంటు పడకుండా కాపాడిన వారు నాకు తండ్రివంటివారు కాక మరేమిటి. పాఠ్యాంశములు నేర్పక పోయివుండవచ్చును గానీ జీవిత పాఠాలతో బాటూ మాటలాడే తీరు తెన్నూ మొదలయినవి వారివద్దనుండి నేర్చుకొన్నాను. ఆ విధముగా వారు నాకు గురువులే! నాదారిని సరిదిద్ది నన్ను ఋజుమార్గములోనుంచి దానినుండి తప్పకుండా జూచిన వారు నాకు దైవమే కదా! దేవుడు అమరుడు. ఆయన నాలో దీపకళికయై నేనున్నంత వరకూ నాకు దిశానిర్దేశము చేస్తూనే ఉంటారు.
అసలు ఈ విషయమును పంచుకొనుటకు కారణము నా కుమార్తె. ఆమె నిన్న దేనికోసమో వెదుకుతూ వుంటే పోగొట్టుకొన్నాననుకొన్న ఈ ఫోటోను నాకు Scan చేసి, వీలయినంతవరకు మరకలను తీసివేసి చూపించి, నేను ఆ ఫోటోను పదిమందికి చూపించి ఈ వృత్తాంతము వ్రాయుటకు దోహదము చేసినది.
స్వస్తి.
                                                            
                                         






4 comments:

  1. Sahayamu chesinavaarini maruvakudadu ane neethini chakkagaa cheppinaaru

    ReplyDelete
  2. Maama, Idhi chaduvuthunnatha sepu kalla lo neellu kadhaladuthunnai. Aapyathalu,Anubhandlu kanumarugavuthunna kaalamu lo atuvanti goppa vyakthulanu gurthukuthechheukovadam chaala avasaram.Mee laanti goppavari margadarshakathvam maaku avasaram.

    ReplyDelete
    Replies
    1. ఆయన అభిమానము నేను ఆజన్మాంతమూ మరువలేనిది. ఆయన నాకు తరగతుల విద్య నేర్పకున్నా స్థిరగతుల విద్య నేర్పిన మహనీయుడు. ఆయన పాదములకు సాష్టాంగ నమస్కారము.

      Delete