జానపద
బ్రహ్మ కలిమి శెట్టి మునయ్య
మునయ్య పేరు చెబుతూనే నాలో ఒక
ఉత్సాహము ఒక ఉద్వేగము తెలియకుండానే కలుగుతాయి. ఈయన పుట్టినది 1943 లో. జానపద
గాయకునిగా లోకానికి పరిచయమైనది 1979 లో. అంటే తన ౩6 వ సంవత్సరములో . రోడ్డు ప్రమాదము ఆయన వెళుతూ వుండిన జీపునకు జరుగుటతో కీర్తిశేషుడైనది 1997లో (మె1). అంటే ఆయన గుర్తింప
బడిన జానపద కళాకారునిగా కొనసాగినది కేవలము 18 సంవత్సరములు
మాత్రమే! అయినా రాయల సీమను ఆంద్ర దేశాన్ని ఒక ఊపు వూపినాడు. తాను అకాల మరణము
చెందకుండా వుండియుంటే ఎన్నో విదేశాలలో నిస్సందేహముగా తన గానామృత ఝరిని ప్రవహింప
జేసి యుండే వాడు.
సాలెవారగుటచే పెద్దలది చేనేత
వృత్తియైనా వారి తాత శ్రీయుతులు చౌడప్ప గారి వద్ద యక్షగానము, కోలాటము, పండరి భజన
మొదలుగునవి బాల్యముననే సాధన చేసినాడు. తండ్రి కీ.శే. పెద్ద రామయ్య గారి వద్ద నుండి
కూడా ఆయన ఎంతో నేర్చుకొన్నారు. అసలు తన అన్న తనను తెల్లవారు ఝామున నీటి లో ముంచి
సాధన చేయించే వారన్నది తాను నాకు చెప్పిన మాట. ఎందుకంటే నేను అయన స్నేహితుడిని మరియు సహాధ్యాయిని. ఈ సందర్భములో
ఒకమాట చెప్పుకొనవలసి వస్తుంది. మేము ఇరువురము ఒకే తరగతి ఒకే కక్ష్యలో వుండే వారము.
ఆయన నాకన్నా 4 సంవత్సరముల పెద్దవాడు. 7వ తరగతి 8వ తరగతి లో మేము మంచి స్నేహితులము. మా
డ్రిల్ టీచర్ శ్రీయుతులు సుబ్బారెడ్డి గారు
ఎండ అమితముగా వుంటే డ్రిల్ క్లాసులో ఒక నీడనిచ్చే చెట్టుక్రింద
కూర్చోబెట్టి పాటలు పాడించే వాడు. మునయ్యది ప్రథమ స్థానము. అప్పటికే ఆయన గొంతు
ఘంటసాల గారిలాగా ఖంగుమనేది. ఆ తరువాత మరియొక మిత్రుడు గంగాధరయ్య. ఆయన గొంతు A.M.
రాజా, షణ్ముఖి ఆంజనేఅరాజు గారిలాగా ఉండేది. ఆతరువాత నా మిత్రుడు గోపాలకృష్ణ మూర్తి దారినబోయే
దానయ్య లాగా పాడితే నేను మందు గొట్టిన మానయ్య లాగా పాడేవాడిని. మా పాటల కచ్చేరీ తో
ఆ పీరియడ్ గడచి పోయేది. కానీ మునయ్య ఘంటసాల గారి పాటలు పద్యములు పాడేవాడు. ఈ మాట
వ్రాసేటపుడు కూడా ఆ దృశ్యము యధా తథముగా మనో ఫలకముపై మెదలుతూ వున్నది. గంగాధరయ్య గారి ఇంట్లో ఆ
కాలానికే గ్రామఫోను వుండేది. మునయ్య పాడిన ఆ పాటలు ఈనాటికీ ఆపాత మధురాలు. ఆయన
ఎనిమిదవ తరగతి వరకు స్కూలులో ఫస్ట్ వచ్చేవాడు. అక్షరాలూ ఆణిముత్యాలే. 8వ తరగతి
తరువాత ఎందుకో చదువు చాలించవలసి వచ్చింది. వెంటనే ఆయన మా గురువు తెలుగు పండితులైన వెల్లాల
శేషాద్రి శర్మ గారి వద్దకు పోయి తెలుగు మరియు
సంగీతము లోని కొన్ని మెళుకువలు గ్రహించేవాడు . అనతి కాలములోనే ఒక శతకమును
వ్రాసి కవియైనాడు. ఆ తరువాత మరిన్ని రచనలు చేసినాడు.
మునయ్య మంచి చిత్రకారుడు. ఆయన దానినే
వృత్తిగాచేసుకొని వీరపనాయని పల్లెలో డ్రాయింగ్ టీచరుగా ఉండినాడు. ప్రవృత్తి
మాత్రము వదలేదు. అదే ఆయన కీర్తిని ఉన్నత శిఖరాలకు చేర్చింది.
ఎంతో కష్టపడినాడు ఆయన జానపద గీతములను
పల్లె పల్లె తిరిగి సేకరించుటకు. అసలు ఈ జానపద కళకు వెలుగు తెప్పించినది జే.ఏ.
బాయ్లీ అన్న ఆంగ్లేయ దొర యని ఆయన తన
పరిశోధన లో పేర్కొన్నాడు. గురువు పాలూరు సుబ్బన్న గారి వద్ద ఈ జానపద సాహిత్యమును
గూర్చి తెలుసు కొనుటయే గాక ఆయన ద్వారా G.N.రెడ్డి డా. బిరుదురాజు రామరాజు వంటి ప్రముఖులతో కూడా పరిచయము అయినది. ఎన్నో
విధములైన సహాయములు మరెన్నో వివరములు వారివద్ద నుండి గ్రహించి యా అనుభవములను తన
పోత్తము లో వ్రాసినాడు.
ఆయన పాడిన పాటలు అన్నీ సుధా రస ధారలే.
'సైరా నరశింహా రెడ్డి....' అన్న పాట, ఆంగ్లేయులపై ధ్వజమెత్తి కోయలకుంట్ల
తాలూకాఫీసుకే పోయి తహసీలుదారుని తలకోసి ఆంధ్రావని లోని మొదటి స్వాతంత్ర్య
యోధుడైనాడు.
నరసింహారెడ్డి గారు అల్లూరి సీతారామ రాజు గారి కంటే ముందు వాడు, పాడితే వెంట్రుకలు ఎవరికైనా నిక్కబొడుచుకొని తీరవలసినదే! 'తూరుపూదిక్కూన...' అన్నపాట మరియు
‘పిల్లో కోడిపిల్లా...’ అన్న పాట నాకు ఎంతవిన్నా ఇంకా వినాలని అనిపిస్తూనే
ఉంటుంది.
ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయము
చెప్పవలసినది ఉన్నది. నేను తిరుపతి ప్రాంతీయ కార్యాలయములో ఉన్న రోజులలో మా
పరిచయమును పురస్కరించుకొని, మునయ్యగారితో ఒక సంగీత విభావరి ఏర్పాటు
చేయించినాను. దీనికి అప్పుడు ఉన్న maa పైఅధికారుల ప్రోత్సాహము ఎంతో ఉండినది. ఈ
కార్యక్రమము చిరకాలము నిలచిపోవలసిన తీరుగా ఉండవలెనని maa మునయ్యతో చెప్పినాను. maa
కార్యాలయపు బహిరంగ ప్రదేశములో పెద్ద
వేదికను ఏర్పరుపజేసి కార్యక్రమమును సాయంకాలము 6.30 ప్రారంభింప జేసినాము. వినాయక
ప్రార్థనతో మొదలుపెట్టి ఒక పాట ఆయన పాడిన తరువాత ఆయనను గూర్చి నాలుగు పరిచయము
చేస్తూ ఈ నాలుగు మాటలు చెప్పినాను.
రాళ్ళ సీమన అతడు రతనాల కయ్య
జాన పదమునకతడు నిజము బ్రహ్మయ్య
గళము వెన్నుని పెదవి పై వేణువయ్య
వేరెవరు అతడు నా మిత్రుడు మునయ్య
ముందే ఆయన పాత రుచి చూసినారు కాబట్టి ఆయన దయవల్ల నామాతలకు
కూడా మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమములో అప్పుడు బాలుడైన ఆయన కుమారుడు రమేష్ ‘వదినకు
ఒక్కసారి .....’ అన్న పాట ఎంతో మనోజ్ఞముగా పాడి సభను ఆకట్టుకొన్నాడు. మరియొక
ఆశ్చర్యజనకమైన విషయము ఏమిటంటే, నాటి maa ప్రాంతీయ కార్యాలయము తృప్తి తానేగికి (Bus-stand)
దగ్గరగా ఉండేది. మునయ్య రెండు మూడు పాటలు
ముగించగానే, ప్రయాణీకులు ఎక్కవలసిన బస్సులు వదిలిపెట్టి కార్యక్రమము ముగిసేవరకు ఒకజ బలమైన ప్రహరీ గోడలాగా నిలుచుంది పోయినారు. ఆ
విధముగా ఈ కార్యక్రమము నాడు ప్రాంతీయకార్యాలములో ఉన్న ప్రతి ఉద్యోగి హృదయములో చిరస్థాయిగా
నిలచిపోయినది.
ఇటువంటి ఒక మహా కళాకారుని అకాల మరణము అదికూడా
రోడ్డు ప్రమాదములో, జరిగి జానపద సంగీత కళాప్రియులను దుఃఖసాగరములో ముంచివేసినది.
ఇప్పుడు మీకు అర్థమై వుంటుంది నా ఉత్సాహానికి
ఉద్వేగానికి కారణము.
ఆయన పాడిన సైరా నరసింహారెడ్డి మీ
కోసం....,.
స్వస్తి.
No comments:
Post a Comment