Friday, 5 August 2016

భార్య-గృహిణి-ఇల్లాలు

భార్య-గృహిణి-ఇల్లాలు

https://cherukuramamohan.blogspot.com/2016/08/blog-post_93.html

నేను వ్రాసిన ఈ పద్యాన్ని కొంచెము మనసు పెట్టి చదవండి.

ఫ్రిజ్జి గృహము, పవరు ప్రియమైన ఇల్లాలు

భర్త అందులోని పాయసమ్ము

పవరు లేని ఫ్రిజ్జి పాయసమ్మునకెట్లు

ఉనికినిచ్చదెట్లు పనికి వచ్చు

పెద్దలీవిధంగా చెప్పినారు.

పుత్రపౌత్ర వధూ భ్రుత్యైః ఆకీర్ణ మపి సర్వతః

భార్యాహీన గృహస్తస్య శూన్యమేవ గృహం భవేత్ (మహా భారతము)

 కొడుకులు కోడళ్ళు మనమలు మనవరాళ్ళు దాసదాసీ జనము ఎంతమంది ఉన్నా భార్యలేని వారి బ్రతుకు దుర్భరము. ఎంత నిజమైన మాటో చూడండి. ఇది మన సంస్కృతి. దీనిని పునరుద్ధరించండి.

ధర్మాన్ని కాపాడండి. వయసు ఒకే విధంగా వుండదు. నిన్నటి యువకులము నేటి వృద్ధులము. నేటి యువకులు రేపటి వృద్ధులు. అంతే తేడా. అనురాగము పెంచండి పంచండి. స్త్రీ ని అర్థము చేసుకోండి.

ఇది బ్ర. శ్రీ. వే. జటావల్లభుల పురుషోత్తం గారి 'మౌక్తికము'

గంగా సమానః ఖలు శుద్ధ ధర్మః

సత్ కామ ఏవం యమునోపమశ్చ

తన్మేళనం యత్ర తదేవ పూతం

క్షేత్రం ప్రయాగాస్య మహో గృహేస్తి

ధర్మం అనే గంగ ,కామం అనే యమున ,దాంపత్యమనే అంతర్వాహినియైన సరస్వతితో కలిసి త్రివేణీ సంగమమై తనరారే ప్రయాగనే భార్య అట. ఎటువంటి సద్భావనో గమనించండి . 

శ్లో: నగృహం గృహమిత్యాహుః, గృహిణీ గృహ ముచ్యతే;

    గృహంతు గృహిణీ హీనం,అరణ్య సదృశమ్ మతమ్; 

        అందరూ నివసించినంత మాత్రంతో, ప్రతీయింటినీ గృహమనరాదు. ఏ ఇంటిలో గృహిణి ఉంటుందో దానినే  గృహమనాలి. గృహిణి లేని గృహము అరణ్యంతో సమానమే! ఇంటి బాగోగులను చూసుకునేది గృహిణియే. అసలు ఆవిడ ఇంటికి రాణి. భర్త తెచ్చే సంపాదన, సరుకులను సక్రమంగా కాపాడుతూ, భర్తకు,బిడ్డలకు కడుపు నిండుగా  మమతను కలిపి భోజనము పెడుతూ నిరంతరం వారిని కంటికి రెప్పలా కాపాడేది ఇల్లాలు. అసలు ఇంటికి LAW MAKER ఆమెనే! అందుకే ఇల్లు +LAW ఇల్లాలైనదేమో! (ఇల్లు+ఆలు) ఆమె బాధ్యతలలో బంధుమిత్రుల నాదరించటం, అనువైన ఆతిధ్యము నిచ్చి వారిని యలరించటం, మామూలు విషయం గాదు . ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు. ఇంటిని చూడడము  అంటే ఇంటి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలూ అని అర్థము. ఇంతటి గురుతర బాధ్యతలలోను, తన భర్త ,తన పిల్లలు, తన అత్తా మామలను ఏమరదు. అందుకే ఆమెకంత ప్రాధాన్యం. అటువంటి గృహిణి లేని యిల్లు అరణ్యము గాక, మరేమౌతుంది?

నీతి శాస్త్రము నుండి మనమెప్పుడూ వినే ఈ సూక్తి ఒకసారి తిరిగీ గుర్తు తెచ్చుకోండి.

కార్యేషు దాసీ కరణేషు మంత్రీ రూపేచ లక్ష్మి క్షమయా ధరిత్రి

భోజ్యేషు మాతా శయనేషు రంభా షట్కర్మ యుక్తా సహధర్మ పత్ని

 

ఇన్ని గుణాలు కలిగినది స్త్రీ. ఒకవేళ తనలో తప్పులేవైనా వున్నా మచ్చికతో మార్దవముతో చెబితే అర్థము చేసుకొంటారు. అహంకారానికి ఇరువురు తావివ్వకుంటే జీవితమూ పూవుల బాటే. Divorce, తలాక్ మన సాంప్రదాయము లో లేని విషయాలు.

'ప్రాణం వాపి పరిత్యజ్జ మానమే వాభి రక్షతు' అన్న సంస్కృతి మనది. ఒక్కసారి ఆ మహనీయ సంస్కృతిని గూర్చి పునశ్చరణ చేసుకొందాము.

ప్రపంచంలో  మతమూ, దేశమూ ఇవ్వనంత గౌరవం, మర్యాద, పూజనీయత కేవలం సనాతన ధర్మంలో మాత్రమే స్త్రీకి ఇవ్వబడింది. అసలు ఇంకా చెప్పాలంటే, పురుషునికన్నా స్త్రీనే ఒక మెట్టు ఎక్కువ అని ఎన్నో సార్లు చాటి చెప్పింది ఈ ధర్మం,  దేశం. ఒక అపప్రథ ఈ అత్యాధునిక కాలం లో ప్రాచుర్యములో వుంది నేను క్రింద పొందుపరచే ఈ మనుస్మృతిలోని శ్లోకము మీద:

 ‘’పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవనే 

రక్షంతి స్థావిరే పుత్రా నస్త్రీ స్వాతంత్య్ర మర్హతి’’ (మనుస్మృతి-9-3) 

బాల్యంలో తండ్రి స్త్రీలను రక్షిస్తాడు.  యౌవనంలో మగడు రక్షిస్తాడు.  ముసలితనంలో పుత్రులు రక్షిస్తారు.  కావున స్త్రీలు స్వతంత్రులు కారు అని ప్రకటించింది మనుస్మృతి.  కావున స్త్రీ స్వతంత్రురాలిగా ఉండటానికి వీల్లేదు.  

ఈ మాటను నేడు విపరీతార్థములో వాడుచున్నారు. ఒకసారి ఆలోచించండి మీ బిడ్డ, మీ భార్య, మీ తల్లి , మీ చెల్లి ఒంటరిగా పోతూ వుంటే తోడు పోవాలని మీకనిపించదా! ఈ నాడు పాశ్చాత్య వ్యామోహము వెర్రితలలు వేయుటతో ఈ సాంప్రదాయము మందగించినది గానీ ఒక 30 సంవత్సరముల క్రితము కూడా ఈ సాంప్రదాయము పాటింపబడేది. దానిని వదిలి ఈనాడు మన ఆడుబిడ్డలు సమాజములో ఎన్ని విధములగు కడగళ్ళకు గురియౌతున్నారో వారి యాత్మలకే తెలుసు. నాడు మనకు మంచిచెడ్డలు చెప్పిన మహనీయులు ద్రష్టలు. నోటికి వచ్చినది చెప్పే తత్త్వము కాదు వారిధి. సాంప్రదాయ బద్ధమైన వారి మాటలు సవినయముగా స్వీకరించితే జీవితమును స్వర్గధామము చేసుకొనవచ్చును.

 

ఒక్క భారతదేశంలోనే, ఒక స్త్రీ మూర్తిని చూస్తే మాతృమూర్తిగా గౌరవిస్తాము, 

ఏమమ్మా అని పలకరిస్తాము. ఒక స్త్రీ మూర్తిని చూస్తే అక్కగానో, చెల్లిగానో, 

పిన్నిగానో, వదిన గానో, అమ్మగానో, అమ్మమ్మగానో వరస కలిపి గౌరవించి మాట్లాడడం ఒక్క భారతీయ జాతికి మాత్రమే తెలుసు.

ఒక స్త్రీ మూర్తి భారత దేశంలో కేవలం మనిషి కాదు, దైవం, పరదేవత. సుహాసినీ పూజ చేసినా ఆమెకే, బాల పూజ చేసినా ఆమెకే.

ఒక స్త్రీ మూర్తి వివాహానంతరం, భార్యాభర్తలు ఇద్దరూ సమం, అసలు ఆమెయే 

ఎక్కువ కూడా, మన వేదాలు, శాస్త్రాలు,ప్రమాణ గ్రంథాలు అలానే చెప్పినవి. 

ఆమెయే గృహము, అందుకే ఆమె గృహిణి, ఆమె ఇంటిలో ఉంటున్నందుకు అతడు గృహస్థు. పెళ్ళయిన వెంటనే,  వ్యక్తికి సంబంధించిన సమస్తమునకూ 

ఆమె  యజమానురాలు.  అందుకు భిన్నంగా స్త్రీని ఒక భోగ వస్తువుగా చూడడము, ఆపిదప ఆమెను వదిలేయడము అవైదికమూ, అనాగారీకము అన్యాయము. ఈ సనాతన ధర్మమును పాటించని  అనాగరికులు సంస్కార హీనులైన అన్య జాతులు, 

పాఖండ మతస్తుతలు.

 

రాజ‌కీయ‌ములైన అనేక దండ‌యాత్రల వ‌ల‌న స్త్రీ యొక్క యునికి మ‌ధ్యయుగ‌మున క్షీణించిన‌ద‌ని చెప్పక త‌ప్పదు. స‌మాజ‌మున స్త్రీ పురుషు లిరువురు స‌మానులే. ఒకరి యెక్కువ‌గాని మ‌రియెక‌రి త‌క్కువ‌గాని యుండ‌దు.

 

భార‌త‌దేశ‌మున మ‌హిళ‌కు ల‌భించినంత గౌర‌వ‌ము ప్రపంచ‌ములో మ‌రియే యిత‌ర దేశ‌మునందున‌ లేద‌ని ప్రఖ్యాతిగాంచిన అనిబిసెంటు గారు తమ అభిప్రాయ‌మును వెలిబుచ్చి యున్నారు. సాహిత్య ప్రపంచ‌మున‌ కూడ నింత‌టి గౌర‌వ‌ము స్త్రీల‌కు ల‌భించిన‌ది. ప్రపంచ సాహిత్యం యావ‌త్తూ ప‌రికించి చూస్తే భార‌తీయ సాహిత్యంలో క‌న‌బ‌డే స్త్రీత్వం మ‌రెక్కడా క‌న‌బ‌డ‌దు అని అనిబిసెంటు వ్యక్తముముచేసిన భావ‌మును విజ్ఞాన‌వంతులెవ్వరును ఖండింప సాహ‌సింప‌రు.

 

భార‌తీయ సాహిత్యము వేద‌ముల‌తో ప్రారంభ‌మ‌యిన‌ది క‌నుక వేద‌కాల‌ము యొక్క స్త్రీ ప‌రిస్థితి యెట్లుండినదో తెలిసికొన‌వ‌ల‌సి యుండును. కొన్ని ధ‌ర్మములు, కొన్ని నీతులు, కొన్ని క‌ట్టుబాట్లు, కాలానుగుణమగు పరిస్థితులనుబట్టి మారుచుండును. మార‌వ‌లెను కూడా. ఇట్లు మారుట కాల ప్రభావ‌ము వ‌ల‌న జ‌రుగుతూ వస్తుంది. యుగ‌యుగ‌మునకు ధ‌ర్మము కొన్నికొన్ని మార్పుల‌కు లోన‌గుతూ యుండుట చేత‌నే యుగ‌ధ‌ర్మమ‌న్న మాట ప్రభ‌వించిన‌ది. భార‌తీయుల హృద‌య‌వాదులు, ఆత్మవాదులు

న‌గుట‌చేత స్త్రీల‌ను ఒక విధ‌ముగ పురుషులను ఒక విధ‌ముగ చూడ‌లేద‌నియే చెప్పవ‌లెను. మిగిలిన ప్రపంచ సంస్కృతికిని భార‌తీయ సంస్కృతికినిగ‌ల ముఖ్య భేద‌మిచ్చట‌నే కనిపించును. పాశ్చాత్యులకు ప్లాటో మాట వేదము. ఆయన ఏకంగా స్త్రీలలో ఆత్మ ఉండదు, ఆమె మగవాని ఆనందమునకే సృష్టింపబడినదని చెప్పినారు. అందుకు నిదర్శనమే ఆమెరికా నేటి వరకు ఆడ ప్రెసిడెంటుకు నోచుకోలేదు. ఎట్టకేలకు  హిలరి రోధం క్లింటన్  పోటీ అయితే చేసింది కానీ గెలువలేదు.  శ్రీ ఖండ‌వ‌ల్లి ల‌క్ష్మీరంజ‌న‌ము భార‌తీయ, పాశ్చాత్య భావ‌ముల‌ లోని భేద‌మునిట్లు చెప్పియున్నారు. ‘భార‌తీయుల ఎక్కువ‌గా హృద‌య‌వాదులు. పాశ్చాత్యులు బుద్ధిప‌రులు. మన వారు క‌ర్మబుద్ధులు. దైవ‌మునే బ‌ల‌ముగా నెంచువారు. పాశ్చాత్యులు క‌ర్మసిద్ధాంత‌ము నొప్పుకొన‌రు. పునర్జన్మను వారంగీక‌రింప‌రు. భార‌తీయ‌మైన స‌మ‌స్త క‌ళ‌లును పైన తెలిపిన  భారతీయ సిద్ధాంత‌ము నాధార‌ముగ జేసికొని పాలింప‌బడిన‌వే. భార‌తీయ సిద్ధాంత‌ము ప్రకార‌ము మాన‌వులు శాంతియుత‌ముగ జీవించుట‌కు ఒక చక్కని ప్రణాళిక‌ వంటిది ఏర్పదియున్నది. సుఖ‌దుఃఖ‌ముల‌ను ఒక్క ర‌క‌ముగ చూచుచు క‌ర్తృత్వమును దైవ‌ముపై వ‌ద‌లి క‌ర్మను చేయుట‌యే వ్యక్తి యొక్క విధిగ చెప్పబ‌డిన‌ది. మోక్ష ప్రాప్తికై భ‌క్తి, జ్ఞాన‌, క‌ర్మయోగ  మార్గముల‌లో నొక‌దానిని నిర్ణయించుకొని త‌న్మార్గగామి య‌గుట‌యే భార‌తీయ జీవ‌న విధాన‌ములోని ముఖ్యాంశ‌ము. ఈ విధాన‌మున స్త్రీ పురుష విభేద‌ము చెప్పబ‌డ‌లేదు. ఆత్మయ‌నున‌ది యిరువురికి నొక్కటియే. కాని యిరువురకును కొన్నికొన్ని హద్దులు ఋషుల‌చే నిర్ణయింప‌బడియున్నవి.

 

బృహ‌దార‌ణ్యకోప‌నిషత్తులో పురుషుడు త‌న ఏకాకి త‌న‌మును చూచి భ‌య‌ముచెంది ఆనంద‌ముకొర‌కు భ‌య‌నివార‌ణ‌ము కొర‌కు స్త్రీని సృష్టించెన‌ని యున్నది. ‘ఏకాకీ న‌వైర‌మ‌తా’ అన్నది అతని అభిప్రాయము. ప్రకృతి పురుషులే స్త్రీ పురుషులు రాముడు, దివి నుండి దిగి వచ్చి సూర్యవంశ‌మున‌ను, సీత పృధ్వి నుండియు జ‌నించి జనక తనయ అయినది. ఇచ‌ట రాముడు ఆకాశ‌త‌త్వముగ‌ను సీత పృధ్వీత‌త్వముగ‌ను భావింప‌బడిరి. క‌ర్తృత్వ భ‌ర్తృత్వముల‌లో మార్పులున్నను విధి నిర్వహ‌ణ‌మున స్త్రీ పురుషులిరువురును స‌మానులేయై యుండిరి.

భార‌తీయ త‌త్వమున‌కు అర్ధనారీశ్వర భావ‌ము ముఖ్యాధార‌మైన విష‌య‌ము. ప్రకృతి పురుషుల స‌మాన‌త్వ మిచ‌ట నిరూపింప‌బ‌డిన‌ది. ప్రాచీన కాల‌ములో మాతృస్వామ్యముండెడిద‌ని చ‌రిత్రకారులు చెప్పుచున్నారు. మాతృస్వామ్యమున్నను పితృస్వామ్యమున్నను మాతృదేశ‌ము అన‌గా మాతృదేవ‌త‌కు ప్రథ‌మ స్థాన‌మీయ‌బ‌డుట మాత్రము స‌ర్వకాల‌ముల‌లోను వ్యక్తమ‌గుచున్న విష‌య‌ము. ఇది నేటికినీ  అవిచ్ఛిన్నముగ పాలింప‌బడుచునే యున్నద‌నుట నిస్సంశ‌య‌ము. ధ‌ర్మప‌త్ని భావ‌మును యజుర్వేద‌ములోని శ్లోక‌ము ఇట్లు తెలుపుచున్న‌ది.

సురీయో దేవీయుష‌స‌గ్ం

యోచ‌మునా మ‌రీయః

న‌యోషా య‌భ్యేతు ప‌శ్చాత్‌

సూర్యుడు ఉషాదేవిని ఎలా అనుస‌రిస్తున్నాడో అలాగే పురుషుడు స్త్రీని అనుస‌రిస్తున్నాడ‌ని భావ‌న. స్త్రీ పురుషు లొక‌రికొక‌రు స‌హ‌క‌రించుకొనుట ఇట్లు వెల్లడియ‌గుచున్నది. భార్యను త‌న‌క‌న్ని కార్యములలోను స‌హ‌క‌రింప‌వ‌ల‌సిన‌దిగ అభ్యర్ధించు వివాహ మంత్రములున్నవ‌ని శకుంత‌లారావుగారు వ్రాసియున్నారు. అవి లేనందున హృద‌య బుద్ధుల‌కు ప్రాముఖ్యమీయ‌బ‌డిన‌ద‌ని తెలియుచున్నది. మ‌రియును శ‌రీర‌ము అశాశ్వత‌మైన‌ద‌ని గ్రహించిన ఋషులు శాశ్వత‌మైన మోక్షసాధ‌న‌కు శ‌రీర‌మునే ప‌రిక‌ర‌ము గావించుట‌కు మార్గము న‌న్వేషించిరేగాని ఇంద్రియ‌లోల‌ల‌త్వమును ప్రోత్సహింప‌లేదు. శ‌రీర ధ‌ర్మములైన వాంఛ‌ల‌ను ధ‌ర్మబ‌ద్ధముగ పొందుచుండ‌వ‌లెన‌ని మాత్రమే ఆదేశించియున్నారు. ధ‌ర్మార్ధ కామ‌మోక్షముల‌ను, పురుషార్థముల‌నియందురు. ధ‌ర్మకామ‌ముతో కూడిన అర్థకామము, ఆపై మోక్షకామ‌ము,  ఇట్లొకదానికొక‌టి ముడిప‌డియున్నవి. ధ‌ర్మమును మోక్షమును ప‌ర‌మున‌కును అర్థమును కామ‌మును ఇహ‌మున‌కును నిర్ణయించిరి. అన్ని అర్థముల‌కును ధ‌ర్మమే ప‌ర‌మార్థమైయున్నది.

‘పాతివ్రత్యము’ అన్న విష‌య‌ము మ‌న దేశ‌మున ప్రస్తుతింప‌బ‌డుచు, న‌నూచాన‌ముగ వ‌చ్చుచున్న విష‌య‌ము. పాతివ్రత్యమన‌గా ప‌తి చేయు ధ‌ర్మ కార్యముల‌లో, దైవ‌కార్యముల‌లో తోడ్పడుట‌యేగాని,

మూర్ఖముగ నేడు భావించుచున్నట్లు క‌నులు మూసికొని దుర్మార్గుడైన భ‌ర్తతో కాల‌ము గ‌డుపుట‌ కాదు. ఇది వేదములందెక్కడా చెప్పియుండబడలేదు. భర్త దుర్మార్గుడైతే భ‌ర్తతోపాటుగ నామె బ్రతుకుకూడ న‌ర‌క‌ప్రాయ‌ము అగుట సంభ‌వింప‌వ‌చ్చును. స్వజనమును ఆశ్రయించియైనా తన సంసారమును చక్కదిద్దుకొనవలసిన బాధ్యత ఆమెపై ఉంది. ఇద్దరూ ఎడముఖము పెడముఖమైనారంటే కళకళలాడవలసిన సంసారము కాటికి చేరే అవకాశము మెండుగా ఉంటుంది.  భ‌క్త జ్ఞాన‌దేవ్ వ్రాసిన జ్ఞానేశ్వ‌రియను గ్రంథ‌మున పాతివ్రత్యమ‌న‌నేమో తెలియ‌జేయుచు నిట్లు వ్రాయ‌బ‌డిన‌ది. ‘ప‌తిబియామ‌తా అనుస‌రోనీ’ అని యున్నది. అన‌గా ప‌తి యొక్క అభిప్రాయ‌ము న‌నుస‌రించుట‌లో ప‌తివ్రత‌య‌గు స్త్రీకి శుభ‌ముగ‌ల‌దు. ఇది బాధ్యతాయుతుడైన భర్తతో నడుచుకొనవలసిన విషయము. ప‌తి యొక్క వ్రత‌మున‌కు పోష‌ణ యిచ్చున‌ది ప‌తివ్రత ఇచ‌ట వ్రత‌మున‌కు బ‌దులు అభిమ‌త‌మున‌కు ప్రాధాన్యమీయ‌బ‌డిన‌దని వినోబా భావించుచున్నారు. నిజ‌మున‌కు ‘వ్రత‌’యే స‌రియైన‌ది. ఎందుచేత‌న‌న‌గా య‌జ్ఞయాగాది క్రతువుల స‌మ‌య‌మున భార్యలేనివాడు వానిని చేయుటకు అన‌ర్హుడు. కర్మచేయున‌ప్పుడు భార్య య‌త‌ని ప్రక్కనే యుండ‌వ‌ల‌యును. ఇదియే ధ‌ర్మప‌త్ని భావ‌మున‌కు మూలాధార‌ము. ఈ విష‌య‌ముతోడ‌నే ప‌తివ్రత‌య‌నున‌ది వ‌చ్చియుండ‌వ‌చ్చును. ప‌తితోగూడి వ్రత‌ములు చేయున‌ది గావున ప‌తినే దైవ‌ముగ న‌మ్ముకొనుట‌వ‌ల‌న ప‌తివ్రత‌య‌న్న ప‌ద‌ము పుట్టిన‌ది. అట్లని భర్త వంగమంటే వంగుట లేయమంటే లేచుట అన్నది దీని అర్థము కాదు. పెద్దలు ‘కార్యేషు దాసీ కరణేషు మంత్రీ...’ అన్నారు కదా!

 

సంస్కృత భాష‌లో ఏ ప‌ద‌ము వ్యుత్పత్యర్థము లేక యుండ‌దు. స్త్రీ య‌న‌గా గ‌ర్భమును ధ‌రించున‌ది అని అర్థము. మ‌హిళ య‌న‌గా మహీమ్ లాతీతి మ‌హిళా. మ‌హియ‌న‌గా భూమి (పృధ్వీత్వము) క్షేత్ర స్థాన‌మందున్నది.  రాముడు దివి నుండి భువికి దిగి సూర్యవంశ‌మున‌ను, సీత పృధ్వి నుండియు జ‌నించిరి. ఇచ‌ట రాముడు ఆకాశ‌త‌త్వముగ‌ను సీత పృధ్వీత‌త్వముగ‌ను భావింప‌బడిరి, అని ముందే పైన చెప్పుకొన్నాము. క‌ర్తృత్వ భ‌ర్తృత్వముల‌లో మార్పులున్నను విధి నిర్వహ‌ణ‌మున స్త్రీ పురుషులిరువురును స‌మానులేయై యుండిరి. ఈ విషయాన్ని గ్రహించి భార్యాభర్తలు ఒకరికొకరుగా వుంటే కుటుంబమునకంతకన్నా కావలసినది వేరేమైనా వుంటుందా!

అతిముఖ్యమగు విషయము ఇంటికి లోపల ఇల్లాలే రాణి. ఈ భావము మనసున పెట్టుకొని భర్త నడచుకొని సమన్వయము సాధించుకొంటే ఇల్లు స్వర్గమే!

అందుకే స్వర్గమన్న వేరే కలదా! శాంతి వెలయు గృహమే కాదా! అన్నారు పెద్దలు.

చదువు సంధ్య లేకున్నా సంస్కారములో మిన్న

పెంపకాన మనసుంచును కలిగియున్న బుద్ధికన్న

మెతుకు గతుకునోలేదో తనకు మాత్రమె తెలుసు

బిడ్డ కంటిలో ఎపుడూ పడనీయదు నలుసు

కన్న కలలు పగలంతా రెప్పలపై ఏర్చిపేర్చు

పనులన్నీ ముగియుదాక రేయినిదురనోదార్చు

ఇంటిబయట తనపేరును అంటించగ తా కోరదు

తన సేవాధర్మముతో ఇంటి యశము సమకూర్చు

మొగుని విసుగు నంతయును ముసినవ్వున మరుగుపరచు

మూతిని ముడిచిన మొగ్గను కుసుమముగా వ్యక్త పరచు

మానై తా నెండ నోర్చి తెరువరులకు నీడనిచ్చు

ఇంటికి తా దేవతయై స్వర్గమునే నిలిపియుంచు

స్వస్తి.

 

 

 

1 comment:

  1. అద్భుతమైన విస్తారంగఆ వ్రాసిన వ్యాసం సర్. ధన్యవాదములు

    ReplyDelete