వేదాల్లో అన్నీ ఉన్నాయిష కాదు ....ఉన్నాయి
(వేదఘనతను
నాడు చాటిన దండిభట్ల విశ్వనాథ శాస్త్రి గారు,
నేడు చాటుచున్న
రేమెళ్ల అవధాన్లు గారు)
లంకె
https://cherukuramamohan.blogspot.com/2016/08/blog-post_25.html
లంకె
https://cherukuramamohan.blogspot.com/2016/08/blog-post_25.html
ఈ
శీర్షిక క్రింద నేను ఇద్దరు వ్యక్తులను
మీకు పరిచయము చేయబోతున్నాను. ఆ పరిచయమునకు ముందుగా ఈ ఉపోద్ఘాతమును చదువండి.
‘వేదాల్లో అన్నీ ఉన్నాయిష’ అన్న ఈ మాట గురజాడ వారి కన్యా శుల్కము నాటకములో
వారు ప్రయోగించిన వాక్యము. ఈ వాక్యమును
గూర్చి నాలో నేను తర్కించుకొన్నా ఇందులో వేదములపై ఒక తిరస్కారభావము తప్ప అన్యథా
తెలియుటలేదు. బహుశ ఆంగ్లేయ పురస్కారమునకై ఈ వేద తిరస్కార శబ్దము వాడియుంటే వారి సంస్కారమునకు నా
నమస్కారము. మహనీయుడగు కుమారిలభట్టు బౌద్ధులతో లేక జైనులతో వాదించుటకు, వేదము యొక్క ఔన్నత్యమును చాటుటకు, ప్రచ్ఛన్నముగా
వారి ఆరామములకు పోయి బౌద్ధము/జైనము నకు సంబందించిన విషయము గ్రహించిన పిదప వారితో
వాదించినారు. శంకరులవారు, వేదసారమయిన అద్వైత సిద్ధాంతమును
ప్రతిష్ఠించుటకై, పరకాయ
ప్రవేశియై కామకళా శాస్త్రము నేర్చి ఉభాయభారతీ దేవితో వాదించి, గెలిచి, ఆమె భర్తయగు మండనమిశ్రుని సార్వభౌమ ఆమ్నాయ
పీఠమగు శృంగేరికి మొదటి పీఠాధిపతిని గావించినారు.
‘అన్నీ వేదాలలో ఉన్నాయిష’ అని నాటక పాత్రలచే పలికించినవారు మాత్రము,
వేదాధ్యయనము చేసియుంటే తప్పక ఈ మాట అనియుండేవారు కాదు. వారు
చెప్పినదే నిజమని వేల సంవత్సరముల క్రితము మన శాస్త్రజ్ఞులు అనుకొని వుంటే వారు
గణిత, ఖగోళ, జ్యోతిష, భౌతిక, రసాయనిక, ఖనిజ, లోహ, వాస్తు, గృహనిర్మాణ,
వస్త్ర, విమాన, యుద్ధ
యంత్ర, ఆది శాస్త్రములను భావితరాలకు అందించి యుండగలిగేవారు
కాదు. నూలు బట్టలు మన దేశమున ఉపయోగించు కాలములో పాశ్చాత్యులు పురాతన నాగరికత
కలిగినవారు అని చెప్పుకునే గ్రీకులు జంతు
చర్మములు ధరించేవారు. మన దేశమునకు వేరువేరు నెపములతో వచ్చి మన శాస్త్రవిజ్ఞానమును.
గ్రహించి, సంగ్రహించి, తమ దేశమునకు
పోయి తమ పేరుతో ఈ విజ్ఞానమును చలామణి చేసుకొన్న వారు లెక్కకు మిక్కుటముగా
వున్నారు. ఇవేవీ తెలుసుకొనక ఆంగ్లముపై మమకారముతో, ఆంగ్లేయుల
ప్రాపునకై అర్రులు సాచి అనుచితమని కూడా ఆలోచించక వేదములను తూలనాడినారు.
అదే
నిజమయిన మేధావి వర్గమునకు చెందిన పాశ్చాత్య శాస్త్రజ్ఞులగు,Alfred North white Head, Dr, Lin
Yutang, Charles H Towness, Ervin Schrodinger, Werner Heisenberg, Albert
Einstein, John Archibald Wheeler, Brian David Josephson, Roger Pol Droit,
Julius R. Oppenheimer, Francois Voltaire మన దేశమును గూర్చి,
మన సంస్కృతిని గూర్చి, మన శాస్త్ర విజ్ఞానమును
గూర్చి మన వేదముల గూర్చి ఎంతో ఘనంగా లోకానికి చాటినారు. ‘ఇంట్లో వాడే పెట్టేరా
కంట్లో పుల్ల’ అన్నట్లు తాము సంపాదించిన జ్ఞానమే అఖండ జ్ఞానమని తలచి మన వేదములనే
మనము అవమానించుకున్నాము.
అట్టి
మహనీయులు తాము జన్మించిన బ్రాహ్మణ వర్గమును కూడా దూషించి, ఎంతో పేరు ప్రఖ్యాతి
సంపాదించి మరణానంతరము కూడా మహనీయులన్న పేరును నిలుపుకున్నారు.
మరి
మన మధ్యనే ఉంటూ వేద మాహాత్మ్యమును గుర్తించి, శ్రమించి వేదాధ్యయనము గావించి వేద ప్రతిభ చాటిన ఎందఱో మహనీయులలో శ్రీయుతులు
రేమేళ్ల అవధాన్లు గారు ఒకరు. వీరి పూర్తిపేరు రేమెళ్ల వెంకట సూర్య సుబ్బావధాన్లు అని తలుస్తాను.
ఇటువంటి
వారిని గూర్చి పదుగురికి తెలుపుదాము. వేదము యొక్క ఔన్నత్యమును లోకానికెరుకపరచిన అటువంటి అరుదైన వ్యక్తులను గురించి తెలుసుకొందాము.
తెలిసివుంటే గురుతు చేసుకొందాము. లేని
వారి చిత్ర పటములు పెట్టి జోహారులర్పించే దానికంటే మన మధ్యనేయున్న ఇటువంటి వారిని
తలచి, సన్మానించి మనలను మనము సన్మానించుకొన్నవారమగుదాము
. ఆయన
నిజమైన ‘వేదమూర్తులు’. అంతకు మించి ఆయన నిరహంకారి. కొందరు పురాణ ప్రవచనకారులతో
పోల్చినపుడు ఈయన సాత్వికత మనకు అవగతమౌతుంది. ఎందఱో మహామహులచేత సెబాసనిపించుకొన్న ఈయన తనను గూర్చి చెప్పుకొనునది స్వోత్కర్షగా భావించే నిగర్వి. గౌరవనీయులగు నాటి దేశాధ్యక్షుడు శంకర్ దయాళ్ శర్మ, నాటి ప్రధాని అటల్
బిహరి వాజపేయి, బైరాన్ సింగ్ షెకావత్, మురళి మనోహర్ జోషి, మొదలయిన ఎందరిచేతనో
గౌరవింపబడి కూడా తన పేరుకు ప్రచారమివ్వక ఎంతో అణకువను ప్రదర్శించటమే ఆయన గొప్పదనము.
భారతీయ
భాషలను కంప్యూటరైజ్ చేసిన మొట్ట మొదటి కంప్యూటర్ మేధావి ఆయన. వేదాలను కంప్యూటరైజ్ చేసిన మొదటి భారతీయుడూ
ఆయనే . ‘వేదాల్లో అన్నీ ఉన్నాయిష ‘అన్న వెటకారపు మాట ఆయన్ను వేదాల పరిశోధనకు
పురిగొల్పినది. ఆ పరిశోధనలతో ....
వేదాల్లో నిజంగానే అన్ని ఉన్నాయని
నిరూపించారు . ఆయనే డాక్టర్
రేమెళ్ల అవధానులు . ‘అంతరించి పోతున్న వేదాలను కొంతైనా పరిరక్షించినందుకు
సంతోషంగా వుంది.’అంటారాయన . నిజం చెప్పాలంటే ఆయన జీవితమంతా వేద శోధనే .
ఆ పరిశోధన గురించి ఆయన మాటల్లోనే .....
ఋగ్
, యజుః,
సామ , అధర్వణ వేదాలలో మొత్తం 1131 శాఖలుండేవి . కానీ ఋగ్వేదం లో 2, యజుర్వేదం లో 6,
సామవేదంలో 3, అధర్వణవేదం లో రెండు శాఖలు ...అంటే
13 శాఖలే ఇప్పుడు లభిస్తున్నాయి . ఇందులో అధ్యయనం జరుగుతున్నవి ఏడు శాఖలే. కేవలం వేదాలే
కాదు... మన ప్రాచీన గ్రంధాలూ ఇప్పుడు
దొరకడం లేదు.
‘వేదాల్లో అన్నీ ఉన్నాయిష’ అని వెటకారంగా అనుకునే వాళ్లకు ఇదేమంత ఉపవద్రంలా
అనిపించకపోవచ్చు. అలాంటి వాళ్ళంతా కొన్ని నిజాలు తెలుసుకోవాలి.
యజుర్వేద
సహితం లో ...పది టు ద పవర్ ఆఫ్ 19 వరకూ అంకెల ప్రస్తావన ఉంది. దీన్ని ‘లోక ‘ అని పిలుస్తారు. వాల్మీకి
రామాయణం లో ఏకంగా మహౌఘ అంటే ...పది టు ద పవర్ ఆఫ్ 62 ప్రస్తాపన ఉంది .
లంబకోణ
త్రిభుజానికి సంబంధించి పైథాగరస్ కనిపెట్టాడని మనమంతా చెప్పుకునే సిద్దాంతం బౌధాయనశుల్బ సూత్రాల్లో
ఉంది.
గణితశాస్త్రంలో
మనం తరచూ వాడే ‘ఇన్ఫినిటి’ గురించి ‘పూర్ణమదః , పూర్ణమిదం
పూర్ణాత్ పూర్ణముదచ్యతే ...’ శ్లోకంలో ఎప్పుడో చెప్పేశారు మన పెద్దలు.
హైడ్రోజన్
ఐసోటోపుల ప్రస్తావన కృష్ణ యజుర్వేదంలో కనిపిస్తుంది.
‘ఏకతాయస్వాహా, ద్వితాయ స్వాహా, త్రితాయ
స్వాహా’...ఇందులో ద్వితా అనే పదాన్నే డ్యుటీరియం గానూ, అలాగే
త్రితా అనే పదాన్నే ట్రిటియం గానూ మార్చినట్లు అర్థమవుతుంది.
త్రికోణమితిని
మనవాళ్ళు ఎప్పుడో కనుక్కొన్నారు .
ఆర్యభట్ట, వరాహమిహురుడు వంటివాళ్ళు సైన్, కాస్ విలువలనూ
చెప్పారు.
స్టీమ్
అనే పదం పాణిని రచించిన అష్టాధ్యాయిలో కనిపిస్తుంది . ‘స్టీమ అర్ధ్రీభావే ‘అంటే ...ఆవిరవడం అని
చెప్పారు.
గురుత్వాకర్షణ
శక్తిని న్యూటన్ కంటే ముందు 12 వ శతాబ్దానికి చెందిన భాస్కరాచార్యుడు తన ‘సిద్దాంత శిరోమణి’ లో భూమ్యాకర్షణ సిద్ధాంతంగా చెప్పాడు.
భౌతిక,రసాయన , వైద్య, వైమానిక...ఇలా ఏ శాస్త్రం తీసుకున్నా
తత్సంబంధ సమాచారం మన వేదాల్లో కనిపిస్తుంది. మనకు లభ్యమవుతున్న వాటిలోనే ఇంత
సమాచారం ఉంటే అంతరించి పోయిన వాటిలో ఇంకెంత ఉండి
ఉండాలి?
ఇదంతా
చదివాక చాలామంది ఆలోచనల్లో పడతారు. కానీ, ఇప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఉన్న
వాటినైనా కాపాడుకోవాలి . నేనూ అదే
చేశాను..చేస్తున్నాను .
అదే
మొదటిమెట్టు ...
ఇక
ఆయననను గురించి వారి మాటల్లోనే! :
మాది తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని
పొడగట్లపల్లి. చిన్నప్పటి నుంచీ వేదాలూ, మంత్రాల మీద అవగాహన ఉండేది . కాకపోతే , నా లక్ష్యం
వేరేగా ఉంది. 1969 లో నేను పరమాణు భౌతిక శాస్త్రం
(Nuclear Physics) లో ఎమ్మెస్సీ చేశాను. అప్పుడే మన దేశం లో కంప్యూటర్ కోర్సుకు
సంబంధించిన మొట్టమొదటి ప్రకటన ఓ ప్రైవేటు కంపెనీ నుంచి వెలువడింది. నేను అందులో చేరి డిప్లొమా పూర్తిచేశాను. తరవాత
రాజోలు డిగ్రీ కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్
గా ఉద్యోగం వచ్చింది. రోజూ డ్యూటీ అయిపోయాక ఖాళీగా ఉండటం ఇష్టంలేక పక్కనే ఉన్న
వేదపాఠశాలకు వెళ్లి వేదం నేర్చుకునేవాణ్ణి
. ఇది పూర్తి కాకుండానే హైదరాబాదులోని
ఇసిఐల్ లో టెక్నికల్ ఆఫీసర్ గా ఉద్యోగం
రావడంతో 1971 లో హైదరాబాదు వచ్చేశాను. మన దేశం లో మొట్ట
మొదటి కంప్యూటర్ తయారీ కంపెనీ ఇసిఐల్ .
అక్కడ శిక్షణ సమయం లో కొన్ని పుస్తకాలు చదువుతుంటే ఎ ప్లస్ బి హోల్ స్క్వేర్ చరిత్ర కనిపించింది . దాన్ని
భారితీయులు మూడువేల ఏళ్ళ కిందటే కనుక్కున్నారట.
ఆ విషయం చదివాక మన ప్రాచీన గ్రంధాలపై ఆసక్తి పెరిగింది .
తెలుగును
కంప్యూటర్లోకి ....
ఇసిఐల్
లో ఎనిమిదేళ్ళు పని చేశాను. ఇక్కడ కూడా Duty అయిపోయాక వేదం నేర్చుకునేవాణ్ణి.
అప్పటికి ఏ భారతీయ భాషనూ కంప్యుటరీకరించలేదు. అప్పుడు మాకు తెలుగును
కంప్యూటరీకరి౦చాలన్న ఆలోచన వచ్చింది .
అందుకోసం నేనూ మా స్నేహితులమూ ఆరునెలల పాటు శ్రమించా౦. తెలుగు అక్షరాలను
కంప్యుటర్లో పెట్టాం .అలా 1976 లో మనదేశం లో కంప్యుటర్లోకి వచ్చిన మొదటి దేశభాష తెలుగే...అప్పట్లో
అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్న వావిలాల గోపాల కృష్ణయ్య గారికీ ఈ విషయం తెలిసి
మా ఆఫీసుకు వచ్చి నన్ను అభినందించారు, నా పనిని
కొనసాగించమన్నారు. కానీ, ఆఫీసులో ప్రోత్సహించక పోవడంతో దాన్ని పక్కన పెట్టేశా.”
ఒక
వాస్తవాన్ని ఇక్కడ తెలియజేయుట అప్రస్తుతమని నాకు అనిపించుటలేదు. నేను కొందరు ఖ్యాతికెక్కిన
ప్రవచనకారులను చూసినాను. వారు సంస్కృతాంధ్రములయందు కృషి చేసినవారు. తమ
ప్రవచనములలో తమ తమ లౌకికతలను జోడించి
చెప్పగలుగుతారు. కానీ వారి వచనములు శాస్త్రపరిధి లోనికి రావు. తమ వాగ్ధాటి చేత ప్రజల
గుర్తింపు పొందిన వెంటనే ఒకింత అహంభావము ఆవహించుతుంది. అది వారు తమ మాటలలోనూ
హావభావములలోనూ వ్యక్తము చేస్తూనే వుంటారు. మరి పరమాణు భౌతిక శాస్త్రములు (PHYSICS
ELECTRONICS) లో స్నాతకోత్తర పట్టాతోకూడా, సంస్కృతములో స్నాతకోత్తర పట్టా మరియు PhD
జ్యోతిషములో స్నాతకోత్తర పట్టా మరియు PhD కలిగినవ్యక్తి లేశమాత్రమయినా అహంభావము
చూపక తనతో మాట్లాడు వారి స్థాయినెరిగి తదనుగుణముగా సహనమును వీడక, ఆ మాటకు వస్తే పాఠశాల
విద్యార్థులకు కూడా సుబోధకముగా ఎన్నో వేదగణిత విధానములను తెలియబరచే ఆయన
ప్రజ్ఞావిజ్ఞతలను ప్రశంశించలేకుండా ఉండలేక పోతున్నాను. వేదవిజ్ఞాన శాస్త్రమును సాధికారికముగా
తెలియబరచే గొప్పదనము ఆయనది.
అనేకపర్యాయములు
ఆయనకు ‘పద్మ పురస్కారములు’ ఎందుకు రాలేదు అని ఎంతగానో ఆలోచించి ఆయన విజ్ఞానమునకు
విజ్ఞతకు అవి కొలబద్దలు కావు అన్న నిర్ధారణకు వచ్చినాను. మహోన్నతమైన ఆంధ్ర భాషలో
అక్షరము ముక్క రాకపోయినా, వచ్చిన అరకొర అక్షరాలను సక్రమముగా పలుకలేకపోయినా మహానటులమనుకొనే
కొందరు
‘పద్మవిభూషణులు’ కాగలిగినారు. అట్లగుటయే వారి
గొప్పదనము కావచ్చు. అందుకే ఆ బిరుదూ వచ్చియుండవచ్చు. కానీ శ్రీయుతులు అవధాన్లు
వంటివారు బాహ్యాడంబరమునకు దూరముగా ఉంటూ తామస రహితులై, కర్తవ్య దీక్షా దక్షులై, తమ
జన్మకు సార్థకత ఏర్పరచుకొనుటయే పరమావధిగా ఎంచుకొని, నిరంతరాయముగా తమ పని తాము
చేసుకొని పోవుచున్నారు. ఇట్టి కృషీవలుర నిబద్ధకు
అవనత శిరస్కుడనై నమస్కరించుచున్నాను.
భగవంతుడు
వారికి దీర్ఘాయుస్సు, ఆరోగ్యము, వేదాభిమానము, కృషి, పట్టుదల కలకాలమూ సమకూర్చి వేదములు
తెలియజేసిన ఎన్నో ఆవిష్కరణలను మనకు అందిచుతారని ఆశించుతూ, అటువంటి సార్థకజన్ములు ఇంకా
ఇంకా ఈ దేశమున జన్మించి ఈ దేశ ఔన్నత్యమును జగతికి చాటవలెనని పరమాత్ముని పదేపదే
ప్రార్థించుచున్నాను.
******************
మిగిలినది మళ్ళీ............
ఇక
దండిభట్లవారిని గూర్చినాకు తెలిసిన మేరకు విశధపరచుతాను.
రెండవ
ప్రపంచ యుద్ధములోని అక్ష రాజ్యములలోని ప్రధాన రాజ్యమయిన జర్మనీ నియంతయగు హిట్లరు, మిత్ర పక్షాలలో
ప్రధానమయిన బ్రిటనుకు పరాధీనయై
పనిచేయుచున్న భారత దేశ వేదసంపదను గుర్తెరింగి ఇచ్చటి ఒక మహా వేదపండితుని తన
గూఢచారుల
సహాయముతో జర్మనీకి రప్పించుకొని ఏవిధముగా
తన అణ్వస్త్ర సంపదను అభివృద్ధి చేసుకొన్నాడో అచటి పార్లమెంట్ The German Bundestag భవనము
మనకు చెప్తుంది.. ఫ్రంక్పర్ట్ యూనివర్సిటీ మనకు చెబుతుంది.
ఆ
మహానుభావుని పేరే బ్ర.శ్రీ.వే. దండిభట్ల విశ్వనాధ శాస్త్రి గారు.
ఒక్క
యజుర్వేదమే నాలుగు ముఖములుగా, నాలుగు రూపములలో అవగతమవుతుంది అని పెద్దలు చెబుతారు.
వాటిని ఆపోశనము పట్టినవాడు ఈ మహానుభావుడు. అంతటి సమున్నత ప్రతిభావంతుడు కాబట్టే
హిట్లర్ ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఆయనను జర్మనీకి రప్పించుకొన్నారు.
రాజమహేంద్రవరం
లో వ్యాకరణశాస్త్ర పండితులుగా పేరుపొందిన ఈ దండిభట్ల విశ్వనాథశాస్త్రి గురించి
ఇప్పుడు తెలుసుకొందాము. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నరోజుల్లో పశ్చిమ జర్మనీకి
పంపిన రాయబారికి అక్కడి అధికారులు తమ కార్యాలయములను దర్శింప జేయుచుండగా ఓ చోట ఒక
సనాతన భారతీయ విప్రవర్యుని ఛాయా చిత్ర పటము కనిపించింది. విస్మితుడైన ఆరాయబారి ఆయన
ఎవరు అని జర్మనీ అధికారులను అడుగుటతో వారు
అతనికి బ్ర.శ్రీ.వే. దండిభట్ల విశ్వనాథశాస్త్రి గారిని గూర్చి విపులముగా చెప్పవలసి
వచ్చినది.
ఇక్కడ,
మీరు గమనించవలసిన ముఖ్యవిషయము ఏమిటంటే లక్షలాది యూదులను చంపిన నియంత యగు హిట్లరును
నేను వెనుకేసుకు రావటములేదు. అతనికి మన వేదములపై గల నమ్మకమును గూర్చి తెలుపుటకు ఈ
ఉపోద్ఘాతమును వ్ర్రాయవలసి వచ్చినది.
తొలి
ప్రపంచ యుద్ధము అణగారి పోవుట, జర్మనీలో కెయిజర్
ప్రభుత్వం పతనమగుట, ప్రపంచమంతా ఆర్థికమాంద్యము నెలకొనుట మనకు
ఎరుకపడిన అంశాలే! ఆ యుద్ధమునందు బందీలయిన
వేలాదిమంది జర్మనీ సైనికుల్లో ఒకరు హిట్లర్. ఆయన ఆ అవమానమును దిగమింగుకోలేక,
ప్రపంచ జాతుల్లో తనదే గొప్పజాతియన్న తన విశ్వాసమును పుష్టి చేయదలచి,
తమ జాతి ఆధిపత్యమును నిరూపించదలచి ఆయన నాజీ పార్టీ స్థాపించి,
వైజ్ఞానికంగా, పారిశ్రామికంగా జర్మనీది పైచేయిగా
మార్చడానికి ఎన్నో సంస్కరణలు ప్రారంభించినాడు. అదే రీతిలో కొత్త కొత్త మారణాయుధాల
అన్వేషణ ప్రారంభించినారు. సంస్కృతము తమ జాతి మూలభాష అని తాను నమ్మి సంస్కృత భాషాధ్యయనము
పట్ల జర్మన్లకు ఆసక్తి పెంపొందించినాడు.
భారతీయ వేద-శాస్త్ర వాఞ్మయములలో
మారణాయుధముల రహస్యములు దాగియున్నవని ఆయన గ్రహించి,
సంస్కృత సాహిత్యాన్ని తమప్రజలకు అర్థమయ్యేలా
అనువదింపచేసినాడు. ఆ విధంగా తొలిసారిగా ముద్రణకు నోచుకొన్న ఆ వాఙ్మయము నుండి
జర్మన్లు లబ్ధిపొందడానికి గట్టిచర్యలు
తీసుకొన్నాడు. అయితే యుద్ధ పరికరాలు, ఆయుధాల నిర్మాణానికి సంబంధించిన రహస్యాలను
వేదశాస్త్ర వాఙ్మయము నుండి విడమరిచి చెప్పేవారికోసం ఆయన అన్వేషణ సాగిస్తూనే
వచ్చినాడు. అదే సమయంలో దండిభట్ల విశ్వనాథశాస్త్రి గురించి తెలుసుకున్న హిట్లర్
గుప్తచరులు, ఆయన కోసం భారత దేశములో అన్వేషణ ప్రారంభించినారు.
మనలో
అత్యధిక శాతమునకు దండిభట్ల వారిని గూర్చి ఏమాత్రమూ తెలియదని తలచి నాకు తెలిసిన
మేరకు తెలియజేయుచున్నాను.
కొన్ని
నెలల క్రితము గ్రంధముఖిలో(Face
Book) మన తెలుగు గడ్డ రాజమహేంద్రవరము నుండి జర్మనీకి పిలుచుకొని
పోయి వేదశాస్త్ర రీత్యా అస్త్రములను తయారుచేయు విధమును బ్ర.శ్రీ.వే. దండిభట్ల
విశ్వనాథ శాస్త్రి గారి గురుత్వమున బడసినారని విను. కానీ వివరములు అంతగా లేవు.
అందువలన నేను సంపాదించిన వివరములతో ఆ మహనీయుని గూర్చి తెలియబరచుతాను. ఇటువంటి తపస్సంపన్నులైన
పురుషులే వేదములను ఈ దేశమును
కాపాడుచున్నారు. వేదాలను వెక్కిరించేవారు కాదు.
రాజమహేంద్రి
వాస్తవ్యులైన దండిభట్ల విశ్వనాథ శాస్త్రి గారు నిజమునకు బాల మేధావి. వేద వేదాంగ నిష్ణాతుడు. వయసుతో బాటూ యజుర్వేద కర్మ
కాండను ఆమూలము ఆపోశన పట్టి, అథర్వణ వేద ప్రయోగ భాగమును కూడా ఆమూలాగ్రము ఆకళింపు
చేసుకొన్నాడు ఆయన. అటువంటి ఒక మహా
పండితుడు ఆంధ్రదేశమందున్నట్లు అడాల్ఫ్ హిట్లరు
కనుగొన్నాడు. ఇక రాజు తలచుకొంటే రానిదేముంటుంది. అందులోనూ హిట్లరాయె!
హిట్లరుకు
వేదములందు అస్త్ర నిర్మాణ విభాగమున్నదని తెలుసు. అసలు జర్మనీ కి భారతదేశమునకు
సాన్నిహిత్యము కూడా చాలా కాలముగా ఉంటూ వచ్చినది, నేతాజీ కూడా ఒక కారణము. సంస్కృతములో
దీనిని శర్మణ్యదేశము అంటారు. మన సంస్కృతి, సంస్కృతము పై
వారికి మక్కువ ఎక్కువ. 19వ శతాబ్దపు ప్రారంభములోనే జర్మనీ
విశ్వవిద్యాలయములందు సంస్కృతమును ప్రవేశపెట్టినారు. 1843 లో
మర్బుర్గ్ నందు ఫ్రాంజ్ ఓర్లాండర్ ప్రవేశపెట్టినట్లు చెబుతారు. హిట్లరుకు వేదముల
పైన సంస్కృతము పైన ఎక్కువగా నమ్మకము గౌరవము ఉండేవి అని చెబుతారు. ఆ విషయము వేదమూర్తులగు దండిభట్ల వారిని
ఆహ్వానించుట తోనే తెలియుచున్నది కదా!
జర్మనులు
Pulse jet engines మన వేదమూలముల నుండియే గ్రహించి V-
8 Rocket ‘Buzz Bombs’ కు అమర్చుట జరిగినదంటారు. అందుకే వారు 1930 ప్రాంతము నుండియే భారత్ మరియు తిబ్బత్ (Tibet) దేశాలపై
కన్నుంచి తమ గూఢచారి దళములను ఆయా ప్రాంతములకు పంపియుంచినారు. ఆ సమయములోనే చైనా
వారు లాసా పట్టణములో దొరకిన కొన్ని తాళపత్ర ప్రతులను చండీఘడ్ కు అనువదించుటకు గానూ
పంపి వాని మూలమున అంతర్నక్షత్రమండల నౌకా
నిర్మాణమునకు గడంగినారు. ఈ విధానము అష్ట
సిద్దులలోని ‘లఘిమ’ అను సిద్ధికి
సంబంధించినది అని పెద్దల మూలమున తెలుసుకొన్నాను. ఇది గురుత్వాకర్షణ శక్తికి
విరుద్ధమగు అపకేంద్ర శక్తి(Centrifugal
Force). అణిమా మహిమాచైవ గరిమ లఘిమా తథా ప్రాప్తిః
ప్రాకామ్యమీశత్వం వశత్వంచాష్ట సిద్ధయోః అని మన పూర్వులు అష్ట
సిద్ధులను గూర్చి తెలిపినారు. మన విజ్ఞాన సంపద
ప్రతి దేశము తన స్వంతము చేసుకోన ప్రయత్నించినదే! ఒక్క మనము తప్ప?
ఇటువంటి
పరిస్థితులలో ‘ఆకొన్న వానికి అన్నము దొరకినట్లు’ హిట్లరుకు మన శాస్త్రిగారు దొరకినారు. వారు ఆయన గురుత్వమును గ్రహించి ఎన్నో
విషయములను సేకరించి తాము కోరిన విషయమును, వివరములను వారు గ్రహించినారు. అస్త్ర
నిర్మాణము ఏ దేశామునకైనా సహజమే! కానీ వారు
కృతజ్ఞతకు పెద్ద పీట వేసి ఆయన చిత్రపటమును తమ విదేశీ కార్యాలయములో నేటికీ అలంకరించి
సముచితముగా గౌరవించుతున్నారు.
మరి
వేదములలో గొప్పగొప్ప విషయములున్నట్లా లేక ‘అన్నీ ఉన్నాయిష అన్నట్లా!’ ఒక ఉన్నత
స్థితి
చేరినవారు నిజానిజములనరసి భావ ప్రకటన చేస్తే భావి తరానికి మార్గదర్శకులౌతారు.
దండిభట్ల వారిని గూర్చి ఇంకాస్త వివరముగా
తెలుసుకొందాము. దండిభట్ల విశ్వనాథశాస్త్రి గారు తమ ఇంటికి వచ్చేవారితో నిత్యం
శాస్త్ర విషయాలపై చర్చలు జరిపేవారు తప్ప లౌకిక విషయాలను పట్టించుకొనేవారు కారు.
ఒకానొక దినమున ఆయన విశాఖపట్టణపు
సమీపానవున్న కొత్తవలస దగ్గర ఒక పల్లెటూరికి వెళ్లవలసి వచ్చింది. ఆ కాలములో
బస్సుల వసతి తక్కువ. వ్యక్తులలో దార్ఢ్యము ఎక్కువ. అందువల్ల ఊళ్ళు వెళ్ళుటకు
కాలినడకను ఉపయోగించేవారు. ఆ విధంగా వారు వెళుతూవున్న సమయంలో హిట్లర్ గూఢచారులు
ఆయనను సమీపించి ప్రతిఘటనకు తావులేని రీతిలో
ఆయనను అక్కడినుండి ముందుగా విశాఖపట్నానికి, తర్వాత కలకత్తాకు ఆపైన జర్మనీకి
తరలించినారు. ప్రతిఘటన వుండినదా లేదా అన్నది నాకు తెలియని విషయము. దండిభట్ల
గారు జర్మనీ చేరుకొన్న సమయానికి రెండో
ప్రపంచ యుద్ధానికి (1939-1945) రంగం సిద్ధమయి వుంది.
బాంబులు
మిక్కుటముగా తయారుచేస్తున్నారు కానీ నిలువ చేయుటలో ఏర్పడు వత్తిడికి అవి ప్రేలిపోతూవుండుటతో
విపరీతమైన ధన జన అస్త్ర నష్టము సంభవించేది. తమ దీన స్థితిని వివరించి వేదములనుండి
తగిన ఉపాయమును సూచించమని అర్థించినారు వారు. హిట్లరు గుణగణములు తెలియని
శాస్త్రిగారు ఆర్త రక్షకుడై యజుర్వేదం
నుండి ఆ సమస్యకు పరిష్కారం సూచించినారు. వారి సలహా ఫలించింది. సైనిక దళపతులు
దానితో ఆయనకు బ్రహ్మరథము పట్టినారు. అప్పటినుండి ఆయన వారికి పరమ పూజనీయులైనారు.
తన
వేదపాండితీ ప్రకర్షచే జర్మనులకు తనవంతు సహకారం అందించి జర్మనీ పురోభివృద్ధికి
ఇతోదికముగా పాటుబడినారు. కానీ వారు తర్వాత కాలములో తిరిగీ భారతదేశమునకు రాలేక పోయినారు. కారణములు నేను
చదివిన మేరకు పెద్దలద్వారా విన్నమేరకు తెలిసిరాలేదు.
దండిభట్ల
వారు జర్మనీకి పోయినప్పటి నుండి వారి సతీమణికి మూడువందల రూపాయల సొమ్ము ప్రతినెలా
అందేదని వినికిడి. ఆయన మరణం తర్వాత కుటుంబ
భృతిగా
తొంభై రూపాయల వంతున వారి శ్రీమతికి అందేదట. ఆ తరువాత ఎప్పుడు ఆగిపోయింది అన్నది
మనకు ఊహకు అందని విషయము.
వేదమూర్తులగు
దండిభట్ల వారు దేశానికి దూరమైనా, తర్వాత కాలములో దేశ స్వాతంత్ర్యము వచ్చినా, అటు దేశము, ఇటు రాష్ట్రము కూడా ఆయనను వెనుకకు
తెప్పించే ఆలోచన చేయలేదు. అసలు అటువంటి ఒక మహనీయుడు ఆంధ్రుడై రాజమహేంద్రి లో
నివసించినాడు అన్న విషయమునే పట్టించుకొని వుండరు. కానీ జర్మనులు మాత్రం ఆయనను తమవానిగా, మాననీయునిగా,
మహనీయునిగా ఇప్పటికి జర్మనీలో
పార్లమెంట్ లోని , విదేశాంగ శాఖ కార్యలయంలో,దండిభట్ల వారి చిత్ర పటమును
ఉంచుకొనుట వారి కృతజ్ఞతా హృదయమునకు, వారి పై గురుత్వమునకు
వేదము పై భారత దేశము పై గౌరవ భావమునకు మనము ధన్యవాదములు చెప్పవలసి వుంటుంది.
అది
మన జ్ఞాన సంపద, అది మన జాతి వైభవం. అటువంటి వేదాలను, వేదా
విజ్ఞానాన్ని నాశనం చెయ్యాలని ఎందరో ప్రయత్నిస్తూనే ఉన్నారు. మనము కూడా వారి
నికృష్ట కార్యములకు మన మూఢ జ్ఞానమును జోడిచి మన సంస్కృతిని, మన
వేదములను, మన సంస్కృతమును అవహేళన చేస్తూ అవనత శిరస్కులమై
అవమానముల ఊబిలో కూరుకొని యుండుటకే ఇచ్చగించుచున్నాము.
గుర్తుపెట్టుకోవలసినది ఏమిటంటే భారతదేశం అంటే ప్రపంచానికి జ్ఞాన జ్యోతి, మనము పాలు త్రాగిన
రొమ్మునే గుద్దుతూ వున్నా ఆతల్లిని ఆదరించే సంస్కారవంతులు విదేశాలలో వుండుటయేగాక
అంకిత భావముతో ఆ తల్లి సేవ చేస్తున్నారు. ఇకనైనా మన వేదములను, సంస్కృతిని, మన ఋషి ముని శాస్త్రజ్ఞులను అవహేళన చేయక
వారు మనకు అందించిన వెలుగులో క్రొత్త క్రొత్త ఆవిష్కరణలు చేసి లోకానికి అందించి మన
దేశము యొక్క గొప్పదనమును చాటుదాము.
స్వస్తి.
‘
ఎంత అద్భుతమైన సమాచారం అందించారు.. ఇంత గొప్ప జ్ఞానాన్ని మనం కలిగి ఉండి ఎందుకు ఇలా బానిస మనస్తత్వాన్ని చంపుకోలేక ఇతర దేశాల విజ్ఞానం కోసం అర్రులు చాస్తున్నాము.. నాకు తెలిసీ ఇంత అద్భుతమైన సమాచారం కలిగిన వ్యాసాన్ని మీరు ఎక్కువ ప్రచారం జరిగే ఫేస్ బుక్ లో పెట్టి ఉండాల్సింది కదా.. నేను చూడలేదేమో మరి.. నిన్ననే రేమెళ్ళ గారిని కలిసి వచ్చాను.. ఆయన ఒక అద్భుతం, నడిచే ఉద్గ్రంధం,, శాస్త్రం తెలిసిన మహా ముని.. అంత ప్రసన్నత కలిగిన వ్యక్తి ని ఇప్పటి వరకు చూడలేదు.. ఇద్దరు మహానుభావుల గురించి మీరు రాయటం అభినందనీయం 👏💐💐💐
ReplyDeleteమీ అభిమానమునకు ధన్యవాదములు. అవధాన్లు గారిని గూర్చి మీరు చెప్పినది అక్షర సత్యము. ఆయన నాకు మంచి మిత్రుడు.
ReplyDeleteమహానుభావా.. మీకు హృదయపూర్వక వందనములు.....
ReplyDeleteఇంతటి అరుదైన విశేషాలు చెప్పి యూన్నందులకు...