Saturday, 31 January 2015

తెలుగు వారు తెలుగు భాష -- ప్రాచీనత

తెలుగు వారు తెలుగు భాష -- ప్రాచీనత

 

నేను భాషా శాస్త్రము చదువుకొనలేదు. అయినా నా భాష తెలుగు అంటే నాకు అభిమానము. నేను తెలుగువాడినగుట వలననే పర భాషలు కూడా కొన్ని సులభముగా నేర్చుకోన్నానేమో నన్నది నా నమ్మకము.

నేను తెలుగును గూర్చి వ్రాయదలచుటకు రెండు కారణాలున్నాయి. 1. నా భాష తమిళము కన్నా అధునాతనము కాదు. 2.నా భాషకు కావ్య సంపద మెండు. అన్నవి నా మదిలో కలిగిన ఆలోచనలు. అట్లని పర భాషలలో తక్కువ లేక పర భాషలు తక్కువ అని చెప్పుట నా ఉద్దేశ్యము కాదు. ఇక్కడ ఇంకొక మాట చెప్పవలసి వుంది. ఈ వ్యాసము వ్రాయుటకు కారణము, నేను ఎక్కడ చదివింది గుర్తులేదు కానీ రాళ్ళపల్లి వారు, వీరు నెల్లూరు వాస్తవ్యులనుకొంటాను (అనంత కృష్ణ శర్మ గారు కాదు) తరువాత ఇటీవల వెలుగులోనికి వచ్చిన రాము గారు తెనుగు లెంకగా తెలుగు వారికి సుపరిచితులు.

ప్రపంచంలో ఏ భాషలో లేని విధంగా 72 వేల నాడులను కదిలించే అమోఘశక్తి ఉన్న ఏకైక భాష తెలుగుభాష అని రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు రాళ్ళబండి కవితాప్రసాద్ గారు తిరుపతిలో జరిగిన telugu మహాసభలలో ఉద్ఘాటించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో 2372 భాషలున్నాయని, భారతదేశంలో 23 భాషలున్నాయన్నారు. ప్రపంచంలో సాంప్రదాయ భాషలుగా గుర్తించినది కేవలం 6 భాషలన్నారు. అవి వరుసగా సంస్కృతం, గ్రీకు, లాటిన్, తమిళం, తెలుగు, పర్షియా భాషలన్నారు. ఈ భాషలకు సంస్కృతము మూలమని ముందే చర్చిన్చుకోన్నాము.

ఇక తెలుగును మరియు తెలుగు వారిని గూర్చి:

తమిళులకు అటు ఇంటిపెరుగానీ ఇటు గోత్రము గానీ ఉండదు. కన్నడిగులకు గోత్రము మాత్రము వుంటుంది కానీ తెలుగు వారికి మాత్రమే రెండూ వుంటాయి. వీనివల్ల మన కుదురు అంటే మూలము మనము తెలుసుకొన గలిగెదము. ఉదాహరణకు కాకతీయులు అన్న తెగను తీసుకొందాము. కాకు అంటే యోధులు పరాక్రమవంతులు అని అర్థమున్నాడని విన్నాను. వీరి ప్రస్తాపన సంఘ సాహిత్యములోనే వుంది .

సంఘ సాహిత్యము దాదాపు 2500 ఏండ్ల నుండి3000 సంవత్సరముల నాటిదని తమిళులు చెబుతూ వుంటారు. ఇందులో పత్తు పాట్టు ఎట్టుతొఘై ఉన్నాయంటారు. తోఘై అంటే సంకలనములు. పాట్టు అంటే పాటలు పత్తు అంటే 10. అంటే పది పాటలు ఎనిమిది సంకలనములు అని అర్థము.ఇందులో నాటి ఆచారములు , వ్యవహారములు, రాజులు, రాజ్యాలు, యుద్ధములు, ప్రజలు మొదలగు వానిని గూర్చి విస్తారముగా చెప్పబడినవి. కాకుమాను అన్న ఇంటిపేరు మనము విన్నదే. వీరొక కాలమున యోధులుగా వుంది ఆ తరువాత వ్యవసాయమును ఆశ్రయించినారు.లోతుకు పోయిచూస్తే ఇందు వాడబడిన భాష తమిళులకు పూర్తిగా అర్థము కాదట. ఎందుకంటే ఇందు తెలుగు, తెలుగు యోధులను గూర్చి విస్తారముగా చెప్పబడినది. ఇంకా ముఖ్యముగా ఇందు ముల్లె,కురింజి,మరందు,పాలై, నైదర్ అన్న తెగల ఆచార వ్యవహారాలను గూర్చి ఉంటుందట. ఈ ఎత్తు తొఘై లో కలి తొఘై అన్నది ఒకటి. తొఘై అంటే సంకలనము అని చెప్పుకొన్నాము. కానీ కలి అన్న మాటకు సరియైన అర్థము ఏమిటని తమిళ పండితులకే అర్థముగాక సంస్కృతము నాశ్రయించి చీకటి అన్న అర్థము చెప్పుకొని సర్దిపుచ్చుకోన్నారని విన్నాను. అసలు ఈ పదమునకు మూలము తెలుగులో వున్నది. కలి అంటే కలియ బడుట ఎదురించుట అన్న అర్థములో వాడుతాము. అంటే వీరులకు సంబంధించిన సంకలనము అని అర్థము. అందుకు అనుబంధముగానే ఇందులో వీర చరిత్రలు కాన వస్తాయి. ఇందులో కొంగు నాడు అన్న దేశపు ప్రస్తావన కూడా వస్తుందట. విచిత్రమైన విషయమేమిటంటే ఈ నాటిని వీరరాయ కలిఅరసన్ పరిపాలించినాడు. కలి అంటే కలబడు వాడు అంటే వీరుడే కదా సంస్కృత శబ్దము రాజన్ కు అ చేర్చి తమిళములో అరసన్ అంటారు . కావున కలిఅరాసన్ అంటే వీర రాయలు అనే అర్థము. ఇటీవల లభించిన ఒక తాళపత్ర గ్రంధముకూడా ఈ విషయమును ధృవపరచుతూ వుంది. ఈ తను తెలుగు వాడు. మొదటి బంగారు నాణెములు ముద్రించినది ఈయనే. ఇక్కడి బంగారము అచ్చమై నందువల్లనే కొంగు బంగారమన్న మాట వ్యాప్తిలోనికి వచ్చింది. దీనిని మనము కోయబత్తూరు ప్రాంతములో చూడవచ్చు. ఈ కోయంబత్తూరు ప్రాంతములో 50 శాతము రోమను నాణెములు లభించినవి. అంటే వ్యాపార సంబంధాలు ఈ ప్రాంతముతో రోము దేశమునకు అంత ఎక్కువగా వుండిన వన్నమాట. ఈ ప్రాంతము లోని కరూరు మన ఆంధ్ర  వైశ్యులకు ప్రసిద్ధి. కరూర్ వైశ్య బ్యాంకు వారిదే మొన్నటి దాకా!  ఈ వూరికి దగ్గరగా ఇప్పుడు చితికిపోయిన ఒక ఊరిని రాజధాని గా చేసుకొని ఈ ప్రాంతమును తెలుగు రాజులు ఏలే వారు. ఈ కరూరులో నాణెములు ముద్రించే వారు. కరువు అన్నమాటకు కరిగించు అన్న అర్థము కూడా వుంది.

ఇక యుద్ధాల విషయమునకు వస్తే పూర్వము పాండ్య చేర చోళ పల్లవ రాజులు తమ నడుమ ఎన్నో యుద్ధములలో పాల్గొనేవారు. చోళులు దిరిసెన కొమ్మ, చిన్నది , తమ సిరస్త్రాణమునకు తగిలించుకునే వారట.

అదే విధంగా పాండ్య సైనికులు వేపను, పల్లవులు దొండను , చేరులు తుమ్మను వాడే వారట. ఈ తుమ్మను వాడిన యోధుల ఇంటిపేరు తుమ్మల అయినది. అదే విధముగా దిరిసెన కొమ్మను బాగ లేక వాగ అనికూడా అంటారు. వారి ఇంటి  పేరు బాగల లేక వాగల అయినది. బాగల్ కోట్, బాగల్ పుర పేర్లు ఆవిధముగా వచ్చినవే , ఆ కాపు యోధులు ఆ ప్రాంతాలకు వలస పోయి స్థిరపడుటే అందుకు కారణము. ఇక కోడి వలె దుమికి యుద్ధము చేసేవారు వుండేవారట. అంటే అంగ ఆంగ్లములో చెప్పవలసివస్తే one jump , కోడిలాగా వేసి యుద్ధము చేసేవారట. ఆ విధముగా అంగలూరు అంగల కుదురు అన్న ఊళ్ళు వెలసినవి. ఆకాలములో కమ్మ వెలమ కాపు ఈ మూడు తెగల వారూ మహా యోధులు. ఈ సంఘ సాహిత్యమును గూర్చి ఈమాట వినండి.

 ఈ మధ్య కాలంలో Herman Tieken (Kavya in South India : Old Tamil Chankam, 2001) అన్న డచ్చి పండితుడు గూబ గుయ్యిమనే ఒక సిద్ధాంతం ఒకటి ప్రతిపాదించాడు: అరవాన్ని అమరవాణి సంస్కృతానికి ధీటుగా నిలబెట్టడానికి- తొల్కాప్పియం /సంగం కాలాన్ని వెనక్కు నెట్టడం, పాండ్యుల (9 శ.) బృహత్ ప్రణాళిక లో భాగమే. తమిళాన్ని వెనక్కు నెట్టే ప్రయత్నాలకు చాల చరిత్ర ఉన్నది అని తెలుసుకోవడం మేలు.

Title: Kaavya in South India: Old Tamil Cankam Poetry. Author: Herman Tieken Publ.: Groningen: Egbert Forsten, 2001

 From the back cover: "Old Tamil Cankam poetry consists of eight anthologies of short poems on love and war, and a treatise on grammar and poetics. The main part of this corpus has generally been dated to the first centuries AD and is believed to be the product of a native Tamil culture. The present study argues that the poems do not

describe a contemporary society but a society from the past or one not yet affected by North-Indian Sanskrit culture. Consequently the main argument for the current early dating of Cankam poetry is no longer valid. Furthermore, on the basis of a study of the historical setting of the heroic poems and of the role of Tamil as a literary language in the Cankam corpus, it is argued that the poetic tradition

was developed by the PaaNTiyas in the ninth or tenth century. ... ...

the identification of the various genres of Cankam poetry with literary types from the Sanskrit Kaavya tradition ... indicates that in Cankam poetry Tamil has been specifically assigned the role of a Praakrit. ... "

ఇక కర్ణాటకకు ప్రయాణ మౌదాము. కర్ణాటకలోని శుద్ధ కన్నడము మాట్లాడుకొనే జిల్లాలు అని చెప్ప బడేవి ఐదు. అవి మైసూరు, మాండ్య,ఆసన, శివమొగ్గ, చిక్కమగళూరు. ఇక్కడ బ్రాహ్మలను కర్నాటక బ్రాహ్మలు అంటారు. ఆది కర్నాట బ్రాహ్మలని కూడా అంటారు. వీరిలో ఉలిచి, మార్కులు  అన్న రెండు తెగలున్నాయి. ఇవి ఉలిచి మార్కాపురము అన్న ప్రాంతములు. ఇప్పుడు ప్రకాశం జిల్లలో వున్నాయనుకొంటాను. వీరు తమను కమ్మ బ్రాహ్మలుగా చెప్పుకొంటారు ఎందుకంటే కమ్మ అన్న పదానికి చిన్న యేరు అన్న అర్థము కూడా వుంది. ప్రకాశము లోని గుండ్ల కమ్మ గుంటూరులోని పెరకమ్మ మధ్య ప్రాంతము వారు వీరు. అందువల్ల కమ్మ బ్రాహ్మలైనారు. కన్నడ ఆదికవి 'పంప'నిది వంగిపర్రు. ఇది గుంటూరు ప్రాంతమే! వేములవాడ ను పరిపాలించుచున్న అరికేసరి యన్న చాళుక్య రాజును ఆశ్రయించినాడు ఆ పిదప కర్ణాటకలో బనవాసి అన్న ప్రాంతములో స్థిరపడినారు. వీరితల్లి కన్నడ దేశస్తురాలు. ఇక కన్నడ కవిత్రయములోని పొన్న కూడా ఆంధ్రుడే . ఈయన వేంగి దేశాస్తుడని చరిత్రకారులైన నీలకంఠత శాస్త్రి మరియు E.P.Rice గారు నిర్ధారించినారు. పిమ్మట మాన్యఖేట అన్న గుల్భార్గా ప్రాంతమునకు చెందిన వూరిలో ఈయన స్థిరపడినాడు.ఇంకొక విషయానికి వస్తాము.కర్ణాటకలో వక్క లింగలు అన్న ఒక తెగ వుంది. ఇందులో 18 శాఖలున్నాయి. వారిలో 10 శాఖలవారు  ఇప్పటికీ తెలుగే మాట్లాడుతారు. మిగిలినవారు కన్నడమే

మాట్లాడుతారు గానీ ఆచార వ్యవహారాలూ ఇంకా అట్టిపెట్టుకునే వున్నారు. కురిచేడు, ఇప్పటి ఒంగోలుజిల్లాలో వుంది, ప్రాంతమునుండి పోయిన కాపులను కుంచితిగులు వక్కలింగలు అంటారు . దేవే గౌడ గారు S.M. కృష్ణ గారిని గంగటకార వక్కలింగలు అంటారు. వీరి పూర్వులు కడప ప్రాంతమునకు చెందినవారట. ఇక ఉపకులములైన మేదరి, మంగలి, మాదిగ , ఈడిగ , కుమ్మరి మొదలగు తెగల వారందరూ ఈ శుద్ధ కన్నడ జిల్లాలలో తెలుగే మాట్లాడుతారు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు , వారి వియ్యంకుడు మాజీ కర్నాటక ముఖ్య మంత్రి బంగారప్ప గారు తెలుగువారే . వారు తమ నడుమ తెలుగే మాట్లాడుకునేవారు. మైసూరును మహిష మండలము అంటారు స్తానికముగా ఎరుమై నాడు అని అంటారు . అమ్మవారు మహిషాసురుని ఇచ్చటే చంపినదని ప్రతీతి. ఎరుము అంటే ఎనుము బర్రె అని అర్థము. అసలు మైసూరు అన్న పేరు ఆ ప్రాంతమునకు మైసమ్మ అను రాణి ఏలుట వలన వచ్చినది. ఈ మైసమ్మ తెలంగాణాకు చెందిన మాదిగ కుల  వీర నారి . అసలు ఒక గొప్ప విషయమేమిటంటే మాదిగలు దక్షిణ దేశమంతా వ్యాపించియున్నారు. వీరి భాషాభిమానమునకు తలవంచి నమస్కరిస్తున్నాను. వారు తమ మధ్యన గానీ తెలుగు తెలిసిన వారితోగానీ తెలుగులోనే మాట్లాడుతారు.

ఇక ఒక సారి కేరళకు పోదాము. పైన చెప్పిన ఈ ఎరూము నాటి గొల్లలు కేరళ లోని కొచ్చిన్ ప్రాంతమునకు వలస వెళ్ళినారు. ఇప్పుడైతే తమ మధ్య మాలయాళమే మాట్లాడుకొంటారు గానీ ఇప్పటికీ వారు తెలుగు ఉగాది మాత్రమె చేసుకొంటారు. ఇంకొక గొప్ప విషమేమిటంటే కేరళలోని ఒక ప్రాంతమును  ఒక తెలుగు సంచార తెగ స్థావరము చేసుకొన్నారు. ఒకసారి నేను పైన తెలిపిన 'రాము' గారు ఒక నది పడవలో దాటవలసి వచ్చినపుడు తన పడవ వాడు వేరొక పడవ వానితో ఈ విధముగా చెప్పటము విన్నాడు: ' ఎత్తర ప్రావశ్యమాయ్ నిన్నే అందుకే ముప్పు తెలియలేరు ముప్పదేండ్లకైన.' ఈ మళయాళ దేశములో సగము మలయాళము సగము తెలుగు ఎట్లు వచ్చినది అన్న సందేహము ఆయనకు గలిగి ఆ పడవ వాడిని ఆ మాటకు అర్థము అడిగినాడు. ఆ పడవ వాడు నీవు మూర్ఖునివి అని ఎదుటివానిని అనవలసి వస్తే ఈ మాట అంటాము. ఇంతకుమించి నాకేమీ తెలియదన్నాడు. ఈ మాట అంటూ దీని వివరము మా గురువులకు మాత్రమే తెలుస్తుందన్నాడు. వారి పెళ్ళిళ్ళు మంచి చెడ్డ అంతా వారి గురువులే చేయించుతారు. రాము గారికి ఈ వాడబడిన తెలుగు మాట అర్థమైనది. ఇది వేమన పద్యమని ,మరియు మూర్హునిగూర్చియే చెప్పబడినదని. ఉత్కంఠత కలిగి మీ గురువు వద్దకు నన్ను పిలుచుకు పో అన్నాడట ఆయన. అనుకోకుండా పడవ దిగి కొంత దూరము నడుస్తూనే వారిరువురికి ఆ గురువు ఎదురైనాడు. పడవ వాడు అతనే తన గురువని చెప్పినాడు.  రాముగారు ఆయనకు మంత్రమునకు 50 రూపాయలు సమర్పించుకుంటే ఆ గురువు మూడు మంత్రాలు చెప్పి నాకింతే వచ్చు. ఆ కాలములో మా తండ్రి 50 మంత్రాలు వచ్చేవి అన్నాడట. ఇంతకూ ఆతను చెప్పిన మూడు మంత్రములు 3 వేమన పద్యములు. ఎవా మంత్రాలు అని అనుకొనుటకు బదులు రాము గారు ఔరా తమదేశామును వీడినా తమ కుదురు విడువని వీరు ఎంత ప్రశంసనీయులు అని అనుకొన్నారట. చూచినారు కదా తెలుగువారు ప్రాచీన కాలములో ఎక్కడెక్కడికి ప్రాకినారో! మరొక ఆశ్చర్యమైన విషయము ఏమిటంటే ఈ వలసలు ఇక్కడితో ఆగలేదు. తెలుగువారు మరాఠా గుజరాతు ,రాజస్థాన్ బీహారు ఉత్తర ప్రదేశ్ లలో కూడా వున్నారు కానీ వారు ఇపుడు తెలుగు కాకుండా స్థానిక భాషలు మాత్రమే మాట్లాడగలరు. అసలు బంగ్లా ఒరియా భాషలకు మూలము ఆంధ్రమని రాము గారు వేరొక సందర్భమున తెలుపగా నేను తెలుసుకొనుట జరిగినది. తమిళులు చెప్పే సంఘసాహిత్యము కాలములో మనము ప్రాకృతము తో కలిసి శాతవాహనులచే పరిపాలింప బడుచుండినాము. 

 కొన్ని వేల సంవత్సరాలుగా వాడుకలో ఉండి, శాసనభాషగా, సాహిత్యభాషగా నిలదొక్కుకొని, ఇంకా సజీవంగా ఉన్న విశిష్ట భాష తెలుగు. ప్రాచీన భాషగా తెలుగును గురించి తెలుసుకొనేటప్పుడు తెలుగు జాతిని గురించి, తెలుగునాడును గురించి కూడా ఆలోచించవలసి ఉంటుంది.

ఇంటిపేరు, గోత్రనామము కలిగిన ఏకైక మూక తెలుగు వారు. కన్నడిగులకు గోత్రము ఉంటుంది ఇంటిపేరు ఉండదు.తమిళులకు రెండూ వుండవట. తెలుగు జాతి అనేది ఒక జనసముదాయం. ఈ జనసముదాయం కొన్ని సాంస్కృతిక కారణాలవల్ల ఏర్పడింది. ఈ సాంస్కృతిక కారణాలే తెలుగుజాతిని కొన్ని వేల సంవత్సరాల నుంచి ఒక విశిష్ట జనసముదాయంగా నిలబెడుతున్నాయి. సంస్కృతి అనేది జనసముదాయాలను దగ్గరికి చేరుస్తుంది. భాషకన్నా నివసించే ప్రదేశం కన్నా ‘మనమంతా ఒక జాతికి చెందిన వాళ్ళం’ అనే భావన మనుషుల్ని దగ్గర చేస్తుంది.

అసలు అశోకుని కాలమునకంటే ముందుది మన భట్టిప్రోలు శాసనము. మౌర్యులు క్రీస్తుకు పూర్వము 4వ శతాబ్ది వారని నిరూపించినారు బ్ర.శ్రీ. వే. కోట వెంకటాచలముగారు . అంటే మనకు లిపి ఏర్పడే ఎంత కాలమైనదో ఆలోచించండి.

తెలుగువారు కొన్ని వందల,వేల ఏళ్ళనుంచి ప్రపంచంలోని ఇతర ప్రదేశాలతో సంబంధబాంధవ్యాలు కలిగి ఉన్నారు. తెలుగు జాతి అనుసరించే సంప్రదాయాలు, ఆచారాలు, పండుగలు, ఆటలు, పాటలు, కర్మకాండలు, నమ్మకాలు, బంధుత్వ వాచకాలు మొదలైనవి వీళ్ళందరినీ ఇంకా ఒక జాతిగా గుర్తించేట్లు చేస్తున్నాయి. ఇతర దేశాలకు వలసపోయి తెలుగు భాషను మాట్లాడడం మానినా మనుషుల పేర్లలోనో, ఆచరించే సంప్రదాయాలలోనో, కులాచారాలలోనో, పండుగలలోనో, నమ్మకాలలోనో తెలుగు జాతి లక్షణాలు తొంగిచూస్తుంటాయి. భాషకన్నా, ప్రదేశంకన్నా జాతి బలమైంది. ఒక జన సముదాయాన్ని గుర్తించడానికి జాతి లక్షణాలే ముఖ్యమైనవి. ఒకే జాతికి చెందిన వారు కొన్ని కారణాల వల్ల ఇతర భాషల్ని మాట్లాడవచ్చు. వేరు వేరు ప్రదేశాలలో నివసించవచ్చు. కాని వందల సంవత్సరాలు గడిచినా మనిషి తన జాతి లక్షణాలను అంత త్వరగా మర్చిపోడు.

తెలుగు పుట్టు పూర్వోత్తరాలు

 

ఈనాడు తెలుగువారు కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు, కర్నాటకలాంటి ప్రదేశాలలో నివసిస్తున్నా తెలుగు భాష ఈ ప్రదేశాలకంటే పాతది. తెలుగు భాషకంటె తెలుగు జాతి ఇంకా ప్రాచీనమైంది. ఈ జాతి మూలాలను వెతకాలంటే కొన్ని వేల సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి.

తెలుగు భాషను ద్రావిడ భాషలలో ఒకటిగా భాషాశాస్త్రవేత్తలు గుర్తించినారు. ‘ద్రావిడ’ పదం చాలా ప్రాచీనమైనా ‘ద్రావిడ భాషలు’ అనే పదాన్ని సృష్టించడం గందరగోళానికి దారి తీసింది. ద్రావిడ భాషలు సోదర భాషలనడంలోనూ వాటికీ సంస్కృతానికీ జన్యజనక సంబంధం లేదనడం లోనూ ప్రస్తుతం ఎవ్వరికీ సందేహాలు లేవు. కాని ద్రావిడ భాషల మూలాలను గుర్తించడంలోనూ ద్రావిడుల మూలాలను గుర్తించడంలోనూ శాస్త్రవేత్తలలో ఏకాభిప్రాయం లేదు. తెలుగు భాష ద్రావిడ భాష అనే పేరుతో చలామణీ కావడం శాస్త్రానికి సంబంధించిన విషయమే అయినా ద్రావిడ భాషలనే పేరే కృత్రిమ కల్పన అన్నది నిజం. ఎవరో భరతుడి పేరుతో మొత్తం భారతదేశాన్ని పిలుస్తున్నాం కదా, సింధునదీ తీరంలో వెలసిన నాగరకతే హిందువులనే పేరుకు దారి తీసింది కదా అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. కాని ఇలాంటి అర్థవ్యాకోచం సహజంగా సంభవిస్తుంటుంది. అయితే ‘ద్రావిడ’ పదం అలాంటిది కాదు.

ప్రసిద్ధ ద్రావిడ భాషాశాస్త్రవేత్త డా.సునీతికుమార్ ఛటర్జి ‘ద్రవిడియన్’ పేరుతో ఇచ్చిన ఉపన్యాసంలో ఈ పదం భారతదేశంలో బ్రిటిష్ పండితులు సృష్టించిందని, దీని మూలమైన ద్రమిడ, ద్రవిడ, ద్రావిడ పదాలకు తమిళమనే అర్థమే కాని తెలుగువారనే అర్థం లేదని స్పష్టంగా చెప్పినారు. తెలుగు వాళ్ళని సూచించటానికి ‘ఆంధ్ర’ అనే పదాన్ని వాడేవారు కాని ‘ద్రావిడ’ పదాన్ని కాదని స్పష్టం చేసినారు. మొత్తం మీద భాషాశాస్త్రవేత్తలు తెలుగును ద్రావిడ భాషగా పేర్కొంటున్నా తెలుగు వారు మాత్రం ద్రావిడులు కాదనేది స్పష్టం. పంచద్రావిడులనే మాట గూర్జర, మహరాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, ద్రావిడ బ్రాహ్మణులను గురించి చెప్పింది. పైన తెలిపిన 5 ప్రాంతములూ సముద్రములచే వలయితమయి ఉన్నవి. ద్రవము అనగా ఒక అర్థము నీరు. ఈ ద్రవము నండి పుట్టినదే ద్రావిడ శబ్దము. పుదూరు ద్రావిడులు, ఆరామ ద్రావిడులు తమిళదేశంనుంచి వచ్చినవారే. వీరంతా బ్రాహ్మణులు. బ్రాహ్మణులందరూ ఆర్యులని చెప్పే తమిళులు ఈ బ్రాహ్మణుల్ని ద్రావిడ జాతికి చెందిన వారుగా ఎలా అంగీకరిస్తారు? ఇవన్నీ ఎలా ఉన్నా ద్రావిడ భాషలనే పదం అశాస్త్రీయమనీ ద్రావిడ జాతికి (తమిళ జాతికి) ఆంధ్ర జాతికి సంబంధం లేదనీ అభిప్రాయపడవచ్చు.

మరో వింత వాదం ఏమిటంటే తమిళులు తమిళమే అత్యంత ప్రాచీనమనీ ప్రపంచంలోనే అంత ప్రాచీన భాషలేదనీ ప్రచారం చేస్తుంటారు. నిజానికి మూలద్రావిడ భాషనుంచి మొదట వేరయింది తెలుగు. ధ్వనుల్లో కలిగిన పెక్కు మార్పుల్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది భాషాశాస్త్రవేత్తలు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినారు. తమిళంలో ప్రాచీన రూపాలు ఎక్కువగా ఉన్నాయని, అందువల్ల తమిళమే ప్రాచీనమని కొందరు వాదిస్తారు. కాని ప్రాచీన రూపాలు ఉండటానికి ఎన్నో కారణాలున్నాయి. సాహిత్యం ముందుగా వెలువడటానికి కూడా చారిత్రక కారణాలు, రాజకీయ కారణాలు ఉంటాయి. కాని ఒక స్వతంత్ర భాషగా తెలుగు చాలా ప్రాచీనమైందని, కనీసం మూడువేల సంవత్సరాలనుంచి ఈ భాషను (స్వతంత్రంగా) వాడుతున్నారని భద్రిరాజు కృష్ణమూర్తి లాంటి ప్రసిద్ధ భాషాశాస్త్రవేత్తలు సోపపత్తికంగా నిరూపించారు (Telugu Language and Culture 3000 Years ago, DLA Souvenir, 1981.)

తమ వ్యాసంలోనే భద్రిరాజు తెలుగును గురించి చెప్తూ, ఆ భాషకు 1600 సంవత్సరాల చరిత్రపూర్వ యుగం, ఆ తర్వాత 1400 సంవత్సరాల చారిత్రక (దాఖలాలుండే) యుగం ఉందని చెప్పినారు. మూడువేల సంవత్సరాలకు పూర్వమే తెలుగు-గోండి-కుయి భాషావర్గం తమిళం,కన్నడం-తుళు భాషావర్గం నుంచి విడివడిందని తమిళంలో మాత్రం సాహిత్యం, వ్యాకరణం క్రీ.పూ. మూడవ శతాబ్ది నాటికే ఏర్పడ్డాయని భద్రిరాజు తమిళ పండితుల అభిప్రాయాలకు ఇదే వ్యాసంలో ఆమోదముద్ర వేసినారు. కానీ తమిళాన్ని ఒక భాషగా  క్రీస్తు పూర్వానికి  తీసుకు వెళ్ళగలిగినా, సాహిత్యాన్ని క్రీస్తు పూర్వం అనేక శతాబ్దాల వెనక్కు నెట్టడం సాధ్యం కాదు. భాషా చరిత్రను కాని, సాహిత్య చరిత్రను కాని పుక్కిటి పురాణాల ఆధారంగా నిర్మించడం సాధ్యం కాదు, సమంజసమూ కాదు. ఏ చరిత్రకారుడూ దీన్ని అంగీకరించడు.

క్రీస్తు పూర్వమే తమిళంలో సాహిత్యం ఉందనటానికి శాసనాధారం కాని, ఇతర చారిత్రక ఆధారాలు కాని లేవు. తమిళ బ్రాహ్మిని గురించి ఐరావతం మహాదేవన్ కాని, భద్రిరాజు కృష్ణమూర్తి కాని చెప్పే విషయాలను అంగీకరించడం కష్టం. ఎందుకంటె తమిళంలో శాసనాలన్నీ తెలుగు, కన్నడం తర్వాతే వచ్చాయి. తమిళ బ్రాహ్మిగా ఈ పండితులు పేర్కొనేవి కేవలం కొన్ని పదాలు మాత్రమే. అలాంటి తెలుగు పదాలు కూడా క్రీస్తు పూర్వం నుంచే ఉన్నాయి. అంతేకాదు. ప్రాకృతానికీ దేశ భాషలకూ మర్యాద కల్పించిన బౌద్ధమూ జైనమూ ఆంధ్ర ప్రాంతానికి వచ్చిన తర్వాతనే తమిళ ప్రాంతానికి వెళ్ళాయి. ఇవన్నీ గమనిస్తే కాని తెలుగు భాష ప్రాచీనతను గురించి తర్కబద్ధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చెయ్యటానికి కుదరదు.

మరో ఉదాహరణ చెప్పవచ్చు. ఒక భాషగా కన్నడం తెలుగంత ప్రాచీనమైంది కాదు. కాని రాష్ట్రకూటులు, చాళుక్యులు దేశ భాషను ఆదరించడం వల్ల కన్నడంలో తెలుగుకంటే ముందే శిష్ట సాహిత్యం వెలువడింది. అంత మాత్రం చేత కన్నడం తెలుగుకంటే ప్రాచీన భాష అయిపోదు. ఈ విషయం తెలియక ఎంతోమంది తెలుగు పండితులు భాషకు సాహిత్యానికీ ముడిపెట్టి తెలుగు భాష కూడా కన్నడం తర్వాతే వచ్చిందని చెప్తుంటారు.

ఈ విషయాలను గురించి ప్రఖ్యాత చారిత్రకులు, శాసన శాస్త్ర పరిశోధకులు, డా.ఎస్. శెట్టార్ శంగం తమిళగం మత్తు కన్నడ నాడు-నుడి పుస్తకంలో వివరంగా చర్చించారు. కేంద్ర సాహిత్య అకాడెమి వారి భాషా సమ్మాన్ ప్రశస్తి పొందిన ఈ పుస్తకంలో (మొదటి ముద్రణ 2007, ఎనిమిదవ ముద్రణ 2011) ప్రారంభ కాలం నాటి ద్రావిడ సంబంధాలను గురించిన విశ్లేషణ ఉంది. ఈ పుస్తకంలో శెట్టార్ ఇలా రాస్తున్నారు (కన్నడానికి తెలుగు):

“దాఖలాలో ఉన్న ఉల్లేఖనాలను గమనిస్తే మన పొరుగు వారయిన ఆంధ్రులకు కన్నడిగులకంటె స్పష్టమయిన ప్రాచీనత ఉందని స్పష్టమవుతుంది. అయితే వారు “తెలుగు” అనే పదంతో తమను తాము గుర్తించడం తర్వాత చాలా కాలానికి జరిగింది. …నిజానికి తమిళులనీ కలుపుకొని క్రీస్తు శకానికి అటూ ఇటూ (క్రీ.పూ. 3 నుంచి క్రీ.శ. 3 వరకు) మనదేశంలో ఏ భాషకూ తమదే అయిన లిపి లేదు. అందువల్లనే ఉత్తరాన సింధూ నుండి దక్షిణాన కుమరి వరకూ ఏకైక లిపిగా బ్రాహ్మి ప్రసారమయింది. క్రీ.పూ. 2వ శతాబ్దిలో ఉన్న తమిళ-బ్రాహ్మీ లిపి కూడా దేశీయమైంది కాదు. తమిళ దేశీ లిపి అనదగిన వట్టెళుత్తు క్రీ.శ 4వ శతాబ్దికి గాని సిద్ధం కాలేదు (పు. 24-25.)

తమిళ ప్రచారాన్ని కాస్త పక్కన పెట్టి శాస్త్రీయంగా ఆలొచిస్తే శాసన భాష తర్వాతే కావ్య భాష. తమిళ లిపిలో వచ్చిన శాసనం 7 వ శతాబ్ది నాటిదని వారి ప్రభుత్వ సంస్థే తెలుపుతుంది (http://www.tnarch.gov.in/epi/ins2.htm)

Tamil Brahmi script was prevalent in Tamil Nadu from 3rd century BCE onwards and continued with variations upto 4th century of Common Era. During this time, the practice of writing Sanskrit letters in Tamil Nadu, commonly known as Grantha script was popularised by the Pallavas. This continued for nearly two centuries i.e. from 4th – 6th century. The Tamil script evolved from the Grantha script around 7th century CE.

 తొల్కాప్పియం A. C. Burnell అభిప్రాయ పడినట్లుగా could not be dated to “much later than the eighth century”

 ఈ విషయాన్ని గురించి, లిపి పరిణామం గురించి శెట్టార్ సుదీర్ఘంగా చర్చించారు. సింహళం, తమిళగంలలో బ్రాహ్మీ లిపి ప్రవేశించటానికి ముందే అది ఆంధ్ర-కర్నాటక ప్రాంతాలలో ప్రవేశించిందన్న విషయాన్ని గమనించాలి. తమిళ బ్రాహ్మిని గురించి మాట్లాడే పెద్దలు తెలుగు-కన్నడ బ్రాహ్మిని చెప్పకుండా దాన్ని దక్షిణ బ్రాహ్మి అని పేర్కొనటం తప్పని శెట్టార్ అభిప్రాయం (పు.73.) తమిళ బ్రాహ్మీ శాసనాలుగా చలామణీ అవుతున్నవి కేవలం పదాలే కాని శాసనాలు కావు. వీటిలో ఒకటి రెండు పదాలు లేక వాక్యాలు ఉన్నాయి. సుదీర్ఘమయిన మంగళం శాసనంలో కేవలం 56 అక్షరాలున్నాయి. క్రీ.శ. 2-4 వరకు ఉన్న శాసనాలలో కూడా ఎక్కువ, అంటే 65 అక్షరాలు ఉన్నాయి. ఆ కాలానికి తెలుగు-కన్నడ ప్రదేశాలలో బ్రాహ్మి శాసనాలు వెయ్యికి పైగా ఉన్నాయి. వాటిలో కోకొల్లలుగా తెలుగు-కన్నడ పదాలున్నాయి. అంతిమంగా తమది అంటూ ఒక లిపిని స్థిరీకరించుకొని తమిళులు పూర్తి శాసనాలను నిర్మించుకోవటం 8వ శతాబ్ది తర్వాతనే జరిగిందని శెట్టార్ అభిప్రాయం (పు.91.)

ఆఫ్రికన్ భాషలకు ద్రావిడ భాషలకు ఉండే సంబంధాలను గురించి కొన్ని పరిశోధనలు జరిగినాయి (ఉపాధ్యాయ దంపతుల ద్రవిడియన్ అండ్ నీగ్రో-అఫ్రికన్, 1983) . అలాగే సుమేరియన్ సంస్కృతికి, దక్షిణ భారతీయ సంస్కృతికి ఉండే సంబంధం కూడా ఎన్నో ఆలోచనలకు తావిస్తుంది. ప్రపంచంలోని ప్రాచీన భాషలలో మనం గమనిస్తున్న ద్రావిడ భాషా పదాలలో తెలుగు పదాలేవి అన్నదాన్ని గురించి ఆలోచించాల్సి ఉంది. సుమేరియన్ సంస్కృతిలో కనిపించే ఊరు, తెల్మన్, ఎంకిడు, నిప్పూరులాంటివి తెలుగు పదాలా అన్నది పరిశీలించవలసిందే.

భాషాశాస్త్రవేత్తల ప్రకారం తెలుగు భాష 3000 సంవత్సరాలనుంచి ఉన్నదన్న మాటను ఒప్పుకోవలసిందే. అప్పటినుంచే పదాలు, వాక్యాలు, పాటలు, సామెతలు లాంటివి ఉండే ఉంటాయి. క్రీస్తు పూర్వం నుంచే తెలుగు మాటలు ఉన్నందుకు ప్రాకృత శాసనాలూ సంస్కృత శాసనాలూ సాక్ష్యం ఇస్తున్నాయి. ఈ శాసనాలలో ఉండే ఊర్ల పేర్లలో తాలవ్యీకరణం లాంటి ధ్వనుల మార్పులు తెలుగు చాలా కాలం క్రితమే స్వతంత్ర భాష అయిందని నిరూపిస్తున్నాయి. గాథాసప్తశతి లోని తెలుగు పదాలు క్రీస్తు శకారంభం నాటికే తెలుగు ప్రాకృత సాహిత్యం మీద చూపిన ప్రభావాన్ని విశదపరుస్తున్నాయి.

తెలుగు భాషావికాసాన్ని అధ్యయనం చేసే వారికి అందులో ఒక క్రమం గోచరిస్తుందనటంలో సందేహం లేదు. చరిత్రకందని యుగాలలో తెలుగు భాష, నాట్యశాస్త్రం వంటి గ్రంథాలలో పేర్కొనబడిన ఆంధ్ర భాష, ప్రాకృత,సంస్కృత శాసనాలలో తెలుగు భాష, గాథాసప్తశతిలో తెలుగు పదాలు, ఆరవ శతాబ్ది నుంచి అవిచ్చిన్నంగా వెలువడిన తెలుగు గద్యపద్య శాసనాలు ఒక పద్ధతిలో వికాసం చెందిన తెలుగు భాషాస్వరూపాన్ని తెలియజేస్తున్నాయి. తమిళం, కన్నడం లాంటి భాషలతో పోల్చినప్పుడు కేవలం ఊహలతోనే భాషా వికాసాన్ని చూపించవలసిన అవసరం తెలుగు భాష విషయంలో లేదని స్పష్టమవుతుంది.

కలమళ్ళ శాసనం, చిక్కుళ్ళ శాసనం మొదలయినవన్నీ ఆనాటి (5-6 శతాబ్దులనాటి) తెలుగు భాషా స్వరూపాన్ని తెలియజేస్తున్నాయి. కన్నడంలో దొరికిన మొదటి శాసనం అయిదవ శతాబ్దికి చెందిన హల్మిడి శాసనం. అయితే అందులో కన్నడ పదాలకంటే సంస్కృత పదాలే ఎక్కువగా ఉన్నాయి. అప్పటికి తమిళంలో శాసనమని చెప్పదగిందే లేదు. కాని తెలుగు శాసనాలు వరసగా తెలుగు పదాలతోనే వెలువడ్డాయి. తొమ్మిదవ శతాబ్ది నుంచి తెలుగులో పద్యశాసనాలు ఉన్నాయి. అందులోనూ తెలుగుకు విశిష్టమైన వడిప్రాసలతో ఈ పద్య శాసనాలు ఉండడం విశేషం. తెలుగు కావ్య రచన తనదైన పద్ధతిలో సాగుతూ ఉండిన విషయాన్ని ఈ శాసనాలు నిరూపిస్తున్నాయి. ఈ అన్ని విషయాలనూ ఇరుగు పొరుగు భాషలతోనూ సంస్కృతప్రాకృతాలతోనూ పోల్చి చూచినప్పుడే తెలుగు లోని విషయాలను విశదీకరించటానికి వీలుంటుంది.

ఉపయుక్త గ్రంథాలు, వ్యాసాలు

భద్రిరాజు కృష్ణమూర్తి (సం.), తెలుగు భాషాచరిత్ర, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి, హైదరాబాదు, 1974.

దివాకర్ల వేంకటావధాని, ప్రాఙ్నన్నయ యుగము, హైదరాబాదు, 1960.

S. శెట్టార్, శంగం తమిళగం మత్తు కన్నడ నాడు-నుడి, ఆరంభ కాలద ద్రావిడ సంబంధద చింతనె, అభినవ, బెంగళూరు, ఎనిమిదవ ముద్రణ, 2011.

ఆర్వీయస్ సుందరం, కన్నడ సాహిత్య చరిత్ర, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమి, హైదరాబాదు, 1977.

ఆర్వీయస్ సుందరం, ప్రాచీన భాషగా తెలుగు, నడుస్తున్న చరిత్ర, విజయవాడ, 2008.

S.K. Chatterji, Dravidian, Annamalai University, Annamalainagar, 1965.

Bh. Krishnamurty, XI All India Conference of Dravidian Linguists, Souvenir, Osmania University, Hyderabad,1981.

U.P. Upadhyaya,, S.P. Upadhyaya (Mrs), Dravidian and Negro-African, Rashtrakavi Govinda Pai Research Institute, Udupi, 1983.

 

తమిళ ప్రచారాన్ని కాస్త పక్కన పెట్టి శాస్త్రీయంగా ఆలొచిస్తే శాసన భాష తర్వాతే కావ్య భాష. తమిళ లిపిలో వచ్చిన శాసనం 7 వ శతాబ్ది నాటిదని వారి ప్రభుత్వ సంస్థే తెలుపుతుంది (http://www.tnarch.gov.in/epi/ins2.htm)

తొల్కాప్పియం A. C. Burnell అభిప్రాయ పడినట్లుగా could not be dated to “much later than the eighth century”

ఈ మధ్య కాలంలో Herman Tieken (Kavya in South India : Old Tamil Chankam, 2001) అన్న డచ్చి పండితుడు గూబ గుయ్యిమనే ఒక సిద్ధాంతం ఒకటి ప్రతిపాదించాడు: అరవాన్ని అమరవాణి సంస్కృతానికి ధీటుగా నిలబెట్టడానికి- తొల్కాప్పియం /సంగం కాలాన్ని వెనక్కు నెట్టడం, పాండ్యుల (9 శ.) బృహత్ ప్రణాళిక లో భాగమే. తమిళాన్ని వెనక్కు నెట్టే ప్రయత్నాలకు చాల చరిత్ర ఉన్నది అని తెలుసుకోవడం మేలు.

భాషా శాస్త్రాల్లో అభిరుచిగల సురేశం లాంటి వారు దీనిమీద సమీక్ష వ్యాసం వ్రాస్తారేమోనని ఎదురు చూశాను, చివరికి శెట్టార్ గారి పుస్తక ప్రస్తావన చదవగానే ఒళాందుని సిద్ధాంతం గుర్తుకొచ్చింది.

 

ఆంద్ర సాహిత్యం లో మనకు మొదట లభిస్తున్న కావ్యం నన్నయ గారి " ఆంద్ర మహా భారతం" ఐనా, ఆయనకు ఒక శతాబ్దం ముందే మల్లియ రేచనుడు అనే కవి కవి జనాశ్రయము అనే లక్షణ గ్రంధాన్ని తెలుగు లో రాసినాడు. కానీ అతని మాటల్లోని "తెలుగు" పదాన్ని సంశయించినారు మన కవిపుంగవులు. ఇంకా ప్రాచీనుడు ఉద్యోతనుడు, ఆయన ఆంద్ర ప్రసక్తి చేసినాడు తన రచనల్లో. ప్రాకృతం లో రాసిన ఆంద్ర ప్రసక్తి ఉంది చూడండి.

"పియ మహిళా సంగామే సుందర గత్తేయ భోయణే రొద్దే,

అటుపుటు రటుం భణంతే ఆంధ్రే కుమారో సలోయేతి"

అంటే అర్ధం ఏమిటంటే.. పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి ఇలా చెప్పినారు.

"అందగత్తెలన్నా..అధవా.. యుద్ధరంగామన్నా..సమానంగా ప్రేమించే వాళ్ళు, అందమైన శరీరాలు గల వాళ్ళూ.. తిండి లో దిట్టలూ... అయిన ఆంధ్రులు... అటూ పుటూ, రటూ, అనుకుంటూ వస్తూ ఉండగా చూచాడు."

తొలి తెలుగు మాట?

మన అమరావతీ స్తూపం, చాలా ప్రాచీనమైనది. క్రీస్తు పూర్వం ౨౦౦ మొదలుకుని క్రీ.స. ౨౦౦ వరకూ అనేక దశలలో దాని నిర్మాణం సాగింది. ఇక్కడ దొరికిన ఒక రాతి పలక మీద "నాగబు" అనే మాట కనపడింది. దీన్ని వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఇది తెలుగు పదమని మొదటగా గుర్తించినారు.ఇదే మనకు లభించిన మొదటి తెలుగు మాట. దాని అసలు సిసలు ద్రావిడ పదం "చెంబు" అంటారు.

5 comments:

  1. చాలా అద్భుతంగా వ్రాశారు..

    ReplyDelete
  2. మాకు తెలియని ఎన్నో విషయాలను ఇంత సవివరంగా వివరించినందుకు నెనర్లు :)

    ReplyDelete
  3. మీ అనుమతి లభిస్తే ఈ వ్యాసాన్ని సహరి డిజిటల్ మాగజైన్ లో ముద్రించాలనుకుంటున్నాము. సహరి అంతర్జాలంలో తొలి సమగ్ర వారపత్రిక/మాసపత్రిక. ఈ డిజిటల్ మాగజైన్స్ చూడాలనుకుంటే మీ మైల్ ఐడి గాని వాట్సప్ నెంబర్ గాని నాకు మైల్ చేయండి లేదా వాట్సప్ చేయండి. sahari.letters@gmail.com 9553678686/8106678978.

    ReplyDelete