ఏ వయసుకు ఆ ముచ్చట అంటాము గానీ హాస్యము,నవ్వు ఏ వయసుకైనా ముచ్చటే .హాస్యము లేనిదే నవ్వు
రాదు. నవ్వు రాకుంటే హాస్యము లేదు. పండిన పండే తీపు.తీయని పండే పండు.లౌకికమైన ఆనందమునకు
హాస్యము ఆలంబన.ఆరోగ్యమునకు ఆనందము ఆటపట్టు.ఈ సందర్భములో నేను వ్రాసిన ఈ పద్యము గుర్తుకు
వస్తున్నది .
నవ్వు కలుగజేయు నయనమ్ములకు హాయి
నవ్వు రుగ్మతలను నయము చేయు
నవ్వు లేని జన్మ నరజన్మ మెట్లిది
రామమోహనుక్తి రమ్య సూక్తి
మరి నవ్వుతెప్పించుటకు ఒక గీటురాయి ఏదయినా ఉందా? అంటే నేను పరిశీలించిన మేరకు 'లేదు' అనే జవాబే తెలియవస్తూవుంది.'కాదేదీ కవిత కనర్హం'
అన్నట్లే 'కాదేదీ నవ్వుకనర్హం'. ఇది ఇట్లుంటేనే నవ్వవలె లేకుంటే నవ్వకూడదనిగానీ నవ్వవలెనంటే ఈవిధంగా మాత్రమె
వ్రాయవలెనని కానీ మన పూర్వీకులు నిర్ధారించినట్లు నాకు ఎరుకపడలేదు.పైపెచ్చు వారు బూతు,
శృంగారము,ఎకశక్యము,హేళన,సరసము,శ్లేష దేనినీ వదలకుండా హాస్యమునకు రసపుష్టి కలిగించినారు.ఇప్పటికీ
అవధానములలో సమస్యా పూరణములలోనూ అప్రస్తుత ప్రశంశ లోనూ బూతు జొనిపి ప్రశ్నలడగటము కద్దు.అటువంటి
సభలలో స్త్రీలు పృచ్చకులుగానూ,ప్రేక్షకులుగానూ ఉండుటయూ కద్దు.
అత్యంత చాతుర్యముతో ఆశ్లీలతలేని అవధాని జవాబులకు అందరూ ఆనందించడమూ కద్దు. చేదని కాకర
కాయను భోజనములో వాడకుండా వున్నామా.తీపని పాలకోవా మాత్రమే తినగలుగుతామా.అందుకే దేనికైనా
స్పందన ముఖ్యము.
భరతముని తన నాట్య శాస్త్రములో ఈ విధముగా సత్ప్రేక్షకుని గూర్చి తెలుపుతారు
.
యఃతుష్టా తుష్ట ఆప్నోతి శోకే శోకముపైతిచ
క్రోధే క్రుద్ధో భయో భీరు స్సశ్రేష్టః ప్రేక్షకస్మృతః
నవ రసములలోని ప్రతి రసమునకు, రసానుగుణముగా స్పందించేవాడు
సరియైన ప్రేక్షకుడు అని నొక్కి పలుకుచున్నారు. అంటే హాస్యరసమునకు స్పందన ఆనందించుటయే
కానీ అన్యధాకాదు అని చెప్పుచున్నారు.
'భర్తృహరి సుభాషితములలోకూడా,'భూప సభాంతరాళమున పుష్కల
వాక్చతురత్వము' సజ్జనులకు సహజ లక్షణములు అని చెబుతారు. పుష్కల
వాక్చతురత అంటే నోటికొచ్చినది వాగుట కాదుగదా! అతడు మాట్లాడే మాటకు ఒక అర్థము దానికి
తగిన ప్రయోజనము వుండాలి. సంతాప సభలో సరస కవిత్వము చదవలేము కదా!
వినోద సదస్సులో విషణ్ణ వదనులమై ఉండము కదా. కావున భరతముని చెప్పినట్లు
పాఠకునికి,ప్రేక్షకునికి రసానుగున స్పందన కావలె.
ఒకవేళ నవ్వే రాకుంటే నవ్వకుండా ఉండటమే తప్పించి దానిని కువిమర్శకు గురిచేయ
కూడదు. నటన కైనా రచనకైనా , సంభాషణకైనా ఇదే వర్తిస్తుంది.
నవ్వడం కేవలం పిల్లల
పనే అనుకుంటారు కొందరు. నిశ్శబ్దంగా, సీరియస్‌గా ఉండడం హుందాతనంగా భావిస్తారు మరికొందరు.
కానీ, సమయం, సందర్భానుసారం మనసారా నవ్వితేనే
మంచిదంటున్నారు పరిశోధకులు. నవ్వితే మానసిక ఉద్రేకాలు దూరమవుతాయి. సృష్టిలో మనషికి
మాత్రమే నవ్వే గుణం ఉంది. వేరే జంతువులకు లేదనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. నవ్వుతున్న
సమయంలో పనిచేసే కండరాలు చురుకుగా పనిచేస్తాయట. చిన్న ప్రేరణకైనా స్పందించి నవ్వడానికి
అలవాటు పడ్డవారు అదృష్టవంతులు. నిరంతరం ముభావంగా, విషాదంగా కన్పించే
వారిలో ఆత్మహత్యకు పాల్పడే వైఖరి అలవడుతుందని హెచ్చరిస్తున్నారు... మానసిక వైద్యులు. నవ్వు నాలుగువిధాల చేటుఅనే
సామెత నవ్వును కల్పించుకునే సందర్భాలు కడుపుబ్బా నవ్వేవాడు కలకాలం బతుకుతాడు. చిన్న
సాకు దొరికినా పగలబడి నవ్వాలి. నవ్వేవాళ్ల, నవ్వించే వాళ్ల సాంగత్యం
కోరుకోవాలి నవ్వడాన్ని
అదృష్టంగా భావించాలి.
కవిత్వము చెప్పువాని లక్షణములు ఈ విధముగా ఉండవలెనని తిరుపతి వెంకట కవులు
అన్నారు.
శ్రీ వెలయంగ సత్కవిత చెప్పెడివాడన పండితుండునుం
గావలె, లౌకికోత్తరుడు గావలె,బుద్ధి విశేష ధుర్యుడున్
గావలె భోగియోగియును గావలె కొంటెలలోన కొంటెయున్
గావలె మంచిచెడ్డలనకన్ సకలమ్ము నెరుంగ గావలెన్
కాబట్టి జీవితమునకు నవ్వు ఎంతయో అవసరము . అసలు మనసారా నవ్వేవారి ఆయుర్దాయము
పెరుగుతుందని ఆధునిక శాస్త్రజ్ఞులు తేల్చి చెప్పినారు.
నవ్వు ఒక విధమైన ముఖ కవళిక.
నవ్వులో ముఖంలోని వివిధ కండరాలు, ముఖ్యంగా
నోటికి రెండువైపులా ఉండేవి
సంకోచిస్తాయి. మానవులలో నవ్వు సంతోషం, ఆనందానికి బాహ్య సంకేతం.
కొందరు నిశ్శబ్దంగా నవ్వుకుంటే, కొంత మంది బయటకు శబ్దం వచ్చేటట్లుగనవ్వుతారు.
సాధారణంగా చలోక్తులు, కితకితలు మరికొన్ని రకాల ప్రేరేపణల వలన
నవ్వొస్తుంది. నైట్రస్
ఆక్సైడ్ పీల్చడం వలన బిగ్గరగా నవ్వుతారు. బిగ్గరగా
నవ్వినప్పుడు కొన్నిసార్లు కన్నీరు రావచ్చును. మాదక ద్రవ్యములను వాడి నవ్వే వారుకూడా
వున్నారండోయ్. బహుశా వారికి వేరు ఏ విధముగా కూడా నవ్వు రాదేమో! మానవులలో
నవ్వడాన్ని మెదడు నియంత్రిస్తుంది. సంఘంలోని వ్యక్తుల మధ్య సంబంధాలలో మరియు సంభాషణలలో ఉత్తేజాన్ని కలిగిస్తుంది. నవ్వు ఇతరుల నుండి కలయికను కాంక్షిస్తుంది. కొన్ని సార్లు ఇదొక అంటువ్యాధి లాగా ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది.
నవ్వు కోపానికి విరుగుడు మానవులలో నవ్వు మరియు హాస్యానికి సంబంధించిన మానసిక మరియు శరీరధర్మ శాస్త్ర ప్రభావాల్ని గురించి తెలిపే శాస్త్ర విజ్ఞానాన్ని "జెలోటాలజీ"
అంటారు.
అసలు నవ్వులు ఇన్ని
విధాలు అని నిర్వచించుట నాకు సాధ్యము గాని పని. అందుకే నేను నా అసమర్థతను ఈ విధముగా చాటుకొన్నాను.
పూర్ణ చంద్రుని నవ్వు
పులకరింపుల నవ్వు
పూలు విరియు నవ్వు పుచ్చు నవ్వు
వీరోచితపు నవ్వు విశ్వజేతలనవ్వు
వెగటు పుట్టు నవ్వు వెకిలి నవ్వు
తేలుకుట్టిన నవ్వు తేనే బూసిన నవ్వు
తేలికయిన నవ్వు తిక్కనవ్వు
మేలుబంతుల నవ్వు మేధావికగు నవ్వు
ముద్దులొలుకు నవ్వు మొలక నవ్వు
పొగరు కూడిన నవ్వును వగరు నవ్వు
రక్కసుల నవ్వు వెలుపల రాని నవ్వు
చెప్పలేనన్ని నవ్వులు జెలగ భువిని
చెప్పలేకుంటి నెన్నని చేతగాక
నవ్వుకు సమయస్ఫూర్తి చాలా అవసరము. హాస్యము ఎప్పుడూ అపహాస్యము పాలు కాకూడదు. కొన్ని దశాబ్దముల క్రితము
నేను చెన్నై మహానగరములోశాఖా నిర్వహణాదికారిగా వున్నపుడు జరిగిన ఉధంతము తెలుపుతాను.
అవి నేను
మద్రాసులోని ఒక పెద్ద బ్రాంచి లో మానేజరు గా
ఉన్న రోజులు. ఒక రోజు ఒక విశేష అతిధులైన (VIP customers) భార్యా భర్తల
జంట వస్తే వారిని విశేషముగా ఆదరించుట కొరకు వారికెదురేగి స్వాగతసత్కారములు చేసిన పిదప వారి మనోభీష్టమును విచారించితే 'LOCKER' కావాలన్నారు.
పెద్దవి అయిపోయినవి అని తెలుసుకొని సాధారణ 'LOCKERS' చూపించుట జరిగినది. ఆ దంపతులు వచ్చినప్పటినుండి
నేను గమనించుతూనే
వున్నాను. ఆమె కాస్త 'పైచేయే 'ఎంత నేను ఇంట్లో పిల్లినైనా ఆఫీసులో ఆమె అతనిపై చూపే ఆధిక్యము సహించ లేకుండినాను. నాకు అవకాశము ఈ విధంగా
దొరికింది
ఆమె ఆ
చిన్న 'LOCKER'
ను చూసి తన భర్తతో తమిళములో ఇట్లు చెప్పినది 'తంగం వేచ్చికలాం ఆనా వెళ్లి వెచ్చిక ముడియాది' అనింది.
( బంగారు ఉంచుకోవచ్చు కానే పెద్ద
వస్తువులు
కాబట్టి వెండి లోపల ఉంచే వీలు లేదు అంది.
నేను వెంటనే
'వేచ్చికలామే' అన్నా . (వుంచుకోవచ్చునే అన్నా) అష్టావదానములో అప్రస్తుత ప్రశంసకునిలాగా!.
ఆమె ఆశ్చర్యంగా 'అదు ఎప్పిడి' ( అదెట్లా అంది).
నేను వెంటనే 'వడచి వేచ్చికలాం ఇల్లెన్న
మడచి వేచ్చికలాం'అన్నాను (పగలగొట్టి పెట్టుకోవచ్చు లేకుంటే మడచిపెట్టి ఉంచుకోవచ్చు అన్నాను ) అంతే ఆమె 'నీన్గే నల్ల joke
అడికరింగే'( మీరు చాలాబాగా
జోకులు వేస్తారు)
అని నవ్వడము
ప్రారంభించింది. ఆమె భర్త గారు, మిగిలిన వారు అంతా
వంత పాడినారు.
ఒక ప్రాచీన
కాలపు అజ్ఞాత కవిగారి ఈ చాటువును వినండి.
కవులు నిరంకుశులు. తమ గొప్పదనాన్ని
గుర్తించకుంటే వారు తిట్టటం లోకూడా చమత్కారాన్ని రంగరిస్తూ ఉంటారు.
బయటివారికి ఆలోచిస్తేనేగాని, అర్ధంబోధపడకుండా జాగ్రత్తలు తీసికుంటారు.
ఒక్కోసారి ఆలోచిచినా అర్థము కాదు. ఈ పద్యం ఒక పర్యాయము గమనించండి. -
కం:-
నగపగతు పగతు పగతుని
పగతుండగు
మగధరాజు బరిమార్చిన యా
జగజెట్టి
యన్న తండ్రికి
దగువాహనమైనయట్టి
ధన్యుడితండే!
వివరణ:-
నగపగతుడు- పర్వతవిరోధి,
దేవేంద్రుడు; అతని పగతుడు-
నరకుడు; అతనిపగతుడు
- శ్రీకృష్ణుడు; అతనివిరోధి - మగధరాజు జరాసంధుడు; అతనిపరిమార్చన జగజెట్టి - భీముడు;
అతనియన్న- ధర్మరాజు; అతనితండ్రి- యమధర్మరాజు; అతనివాహనము
- దున్నపోతు; చూశారా? అసలది తిట్టా, పొగడ్తా!
తెలియకుండా ఎంతచక్కగా ఒరే దున్నపోతా! అంటూ ఎంత ఇంపుగా చెప్పినాడో!
హాస్యము
అంటే నవ్వు తెప్పించేది ,
సమయస్ఫూర్తి, హాసము అంటే
నవ్వులను గూర్చి మాట్లాడుకొంటూ సంస్కృతమున కాళీదాసు పేరు తీసుకురాకపోవడము
అన్యాయము,
అక్రమము, అధర్మము. అందుకే
వారి ప్రస్తాపన.
కవితా
రీతికి సమయస్పూర్తికి కాళీదాసు పెట్టింది పేరు. సమ్యస్పూర్తి,సరళమైన హాస్యము
సామాన్యుని కూడా మాన్యుని
చేస్తుంది. మరి కాళీ దాసో ఆయన కాళికి దాసుడా లేకకాళి ఆయనకు దాసియా
అన్నది నాలాంటివాని ఊహలకందని విషయము.
ఆయన
చాటువుగా భావింపబడే ఈ శ్లోకమును గుర్తుచేసుకొనేముందు దాని పూర్వ కథనమును
గమనించుదాము.
బంగాళ దేశములో, ఇంకా ఆ చుట్టుప్రక్క ప్రాంతాలలో బ్రాహ్మలు
చేపలు తింటారు.
వారిని 'మత్స్య బ్రాహ్మలని ఇప్పటిలాగానే
అప్పటికాలములో పిలిచేవారో లేదో నాకు తెలియదు. కానీ మన కాళీదాస కవిపుంగవునికి చేపలు తినే
అలవాటున్నదో లేక దేవీ కరుణా కటాక్షవీక్షిత మేధో మేరువైనందువల్ల
తానే ఒక సన్నివేశమును సృష్టించి సమస్యను పరిష్కరించినాడో
మన
ఊహలకందని
విషయము. భోజ కాళీదాసుల అన్యోన్యతకు అద్దము పట్టే ఒకసంఘటన వేరొక పర్యాయము ముచ్చటించుకొందాము.
ఇంత
దగ్గరితనమును చూసి వోర్చుకోలేని సాటి కవి పండితులు ఎటుదిరిగీ
వారిమధ్యన విభేదాలు సృష్టిచవలెననుకొన్నారు.
ఇది గమనించినాడు కాళీదాసు.
ఆ తరువాత రోజు నుండి ఈ కవిపండితులలో ఎవరో ఒకరు
చూసేవిధంగా మస్త్య విక్రయశాలల వద్ద విరివిగా కనిపించి తాను చేపలు
తింటాడన్న భ్రమను వారిలో కలిగించినాడు. అది నిజమనుకొన్న వారు ఆ
విషయానికి కమ్మలు కడియాలు తొడిగి రాజుకు చేరవేసినారు.
రాజు
కాళీదాసును పరిక్షించేరోజు రానే వచ్చింది. భోజుడు మస్త్య విక్రయ వీధి గుండా వచ్చేకాళీదాసును
గమనించినాడు..చంకలో వస్త్రములోచుట్ట బడినది
చేపయా అన్న విధముగా నీచు
నీళ్ళు భూమిపై జారుతూ, పంచె
బయటికి
చేప తోక వచ్చినట్లు కనిపించుతూ
వుండుట గమనించినాడు. కాళీదాసును
తనవద్దకు పిలిపించినాడు.
భోజుడు స్వతహాగా గొప్ప పండితుడు మరియు కవి
అయినందువల్ల తన
సంభాషణ శ్లోక
రూపములో మొదలుపెట్టినాడు.
ఈ చాటువు సంవాద రూపములో
జరుగుతుంది, అంటే ప్రశ్న
ఉత్తర రూపములో!
"కక్షే కిం తవ? పుస్తకం; కిముదకం?
కావ్యార్థ సారోదకం;
గంధః
కిం? నను రామరావణ
మహాసంగ్రామ రంగోద్భవః |
పుచ్ఛః
కిం? నను తాళపత్ర
లిఖితం; కిం పుస్తకం భో కవే?
రాజన్, భూమిసురైశ్చ సేవిత మిదం రామాయణం
పుస్తకం ||"
ఆ
సంభాషణా సారాంశమిది:
భోజుడు:
(కక్షే కిం తవ?) నీ చంకలోని దేమిటి?
కాళిదాసు:
పుస్తకం.
భోజుడు:
(కిముదకం?) నీళ్ళేమిటి?
కాళిదాసు:
(కావ్యార్థ సారోదకం) : : కావ్యార్థ సారపు ద్రవ, అనగా నీటి రూపము
భోజుడు:
(గంధః కిం?) కంపేమిటి?
కాళిదాసు:
(నను రామరావణ మహాసంగ్రామ రంగోద్భవః) రామరావణ
యుద్ధంలో చచ్చిన పీనుగుల కంపు.
భోజుడు:
(పుచ్ఛః కిం?) తోక ఏమిటి?
కాళిదాసు:
(నను తాళపత్ర లిఖితం) ఇంకా తోకలు తుంచని వ్రాయబడిన
తాళ పత్రములు.
భోజుడు:
(కిం పుస్తకం భో కవే?)
ఓ కవీ!ఏమిటా పుస్తకము?
కాళిదాసు:
(రాజన్, భూమిసురైశ్చ
సేవిత మిదం రామాయణం పుస్తకం) ఓ
రాజా! ఇది భూసురులు అంటే బ్రాహ్మలు సేవించే అంటే భక్తిప్రపత్తులటో
గౌరవించే రామాయణ గ్రంధము.
క్షణ
కాలము అవాక్కయిన భోజుడు చూపించమంటే కాళిదాసు . నిజంగానే
చేప గా భ్రమింప జేసిన రామాయణ గ్రంథమును చూపించినాడు.
అదీ
కాళీదాసంటే!
మరి
తెలుగులో తెనాలి రాముని గూర్చి తెలుపకుంటే నామాటలకు పరిపూర్ణత చేకూరదుగదా !
మొల్ల రాయల కాలపు
కవయిత్రి అన్న ప్రతీతి ఉంది. ఆమె ఒక పర్యాయము రాయలవారిని , అష్టదిగ్గజములు గలిగిన వారి సభలో వారిని జూసి ఈ
విధముగా పొగడినది.
ఆతడు గోపాలకుం డితడుభూపాలకుం
డెలమి నాతనికన్న నితడు ఘనుడు
అతడు పాండవపక్షుదితడు పండిత రక్షు
డెలమి నాతనికన్న నితడు ఘనుడు
అతడు యాదవ పోషి ఇతడు యాచక పోషి
యెలమి నాతనికన్న నితడు ఘనుడు
అతడు కంసధ్వంసి యితడు కష్టధ్వంసి
యెలమి నాతనికన్న నితడు ఘనుడు
పల్లెకాతండు పట్టణ ప్రభువితండు
స్త్రీలకాతండు పద్మినీ స్త్రీలకితడు
సురల కాతండు తలప భూ సురులకితడు
కృష్ణుడాతండు తలప శ్రీ కృష్ణుడితడు
అని కృష్ణునికన్న శ్రీకృష్ణదేవరాయలు మిన్న అని పొగిడింది ఆ కవయిత్రి.
వెంటనే మన ఆశు కవియైన తెనాలి రామలింగడు అదే పోకడలతో పరమేశ్వరునికన్నా నంది గొప్పవాడు
అన్న ఈ క్రింది పద్యము చెప్పినాడట.
ఆతడంబకు మగం డితడమ్మకు మగండు
నెలమి నాతనికన్న
నితడు ఘనుడు
అతడు శూలము దిప్పు
నితడు వాలము దిప్పు
నెలమి నాతనికన్న
నితడు ఘనుడు
ఆతడమ్మున నేయు
నితడు కొమ్మున డాయు
నెలమి నాతని
కన్న నితడు ఘనుడు
అతని కంటను
చిచ్చు నితని కంటను బొచ్చు
నెలమి నాతని
కన్న నితడు ఘనుడు
దాతయాతండు గోనెల
మోత యితడు
దక్షుడాతండు
(పజల సంరక్షుడితడు
దేవుడాతండు
కుడితికి దేవుడితడు
పశుపతి యతండు
శ్రీ మహా వశువితండు,
సులభముగా మీకు అర్థమయ్యేవి
కావున అర్థము చెబుతూ మీ నవ్వులకు ఆటంకము గలిగించదలచుకోలేదు.
నేను చెప్పిన మాట ఒకటి దయతో వినండి. అత్తగారింట పరచిన మెత్త పై చిత్తమొచ్చినంత
కాలము తిష్ఠవేసిన అల్లునితో వాని స్నేహితుడు ఏమిరా ఎంతకాలమైనా అత్తగారింతికే అతుక్కుపోయినావే
అంటే ఈవిధముగా జవాబు చెప్పినాడట.
అత్తగారి ఇల్లు ఆనంధనిలయమ్ము
హరికినైన మరియు హరునకైన
అట్టి హరియు హరుడె ఆదర్శప్రాయులు
రామమోహనుక్తి రమ్య సూక్తి
అని రామ మోహనరావు గారు చెప్పిన మాట నాకు వేదవాక్కు వంటిది కాబట్టి అక్కడనుండి
ఇప్పుడప్పుడే కదిలే ఆలోచన లేదని చెప్పినాడట.
ఈ సంభాషణ వినండి.
"నాన్న గారూ మద్దెల నేర్చుకొంటాను నాకు కొనిపెడతారా" అన్నాడు
కొడుకు.
"వద్దునాన్నా పగటిపూట ఇంట్లో పనులుచేసుకొనే మీ అమ్మకు నాన్నమ్మకు,
పని వాళ్లకు అందరికీ ఇబ్బందౌతుంది’ అన్నాడు నాన్న. “నాన్నా మీరు కొనివ్వండి. నేను పగలు
దానిని తాకనుగాక తాకను. చక్కగా రాత్రుళ్ళు మాత్రమె వాయించుకుంటాను." అన్నాడు పుత్ర
రత్నము.
ఈ విధముగా చెప్పుకుంటూపోతే ఎన్నో!
కానీ ఎన్ని చెప్పినా
నవ్వకపోతే ఎవరమేం చేస్తాం!
ఉపసంహారము
"మన ప్రతి అభిప్రాయం ఇతరులందరికీ నచ్చాలని లేదు. అందరికీ
అందరూ నచ్చితే, అందరూ అందరితోఏకీభవిస్తే అసలు సమస్యేముంటుంది.
కాని, మనకు నచ్చని ఏ విషయమైనా నచ్చలేదని సున్నితంగా, అర్ధవంతంగా చెప్పచ్చు. విమర్శ హేతుబధ్ధంగా
ఉండాలి, సంస్కారవంతంగా ఉండాలి. మన విమర్శ ఎదుటి వారిని ఆలోచింపచేసేదిగా ఉన్నప్పుడే గదా ఆ విమర్శ లక్ష్యం నెరవేరినట్లు. విమర్శ ఆ విషయంపట్లే గాని ఒకరి వ్యక్తిత్వం పట్ల కాకూడదు.
విమర్శించటానికి అర్హత అవసరంలేకపోవచ్చు, కాస్త అయిష్టత
చాలేమో, కాని ఒక వ్యక్తిని పొగడుటకు కావలసినది ఆ వ్యక్తిలో అర్హత ఉండాలి. మనమూ ఆవిధముగా అర్హత పొందే దిశగా మనం
కృషి చేద్దాం."
తమ వయసును, అనుభవాన్నే కాకుండా
ఎదుటి వ్యక్తి వయసు,అనుభవము, ఉద్దేశ్యములను
కూడా గుర్తుంచుకొని తమ వ్యాఖ్యలను పొందు పరచితే బాగుంటుంది.
కేవలము బూతు పదాలనే యథాతథముగా వాడి కవిత్వము వ్రాసిన కవిచౌడప్ప శతకమునకుకు ఆదరణ లేకపోయివుంటే ఈ పాటికి ఆయన ఎవరో మనకు తెలిసివుండేదికాదు.ఆయన
మాటల్లో కవి అంటే:
పది నీతులు పది బూతులు
పది శృంగారములు
కల్గు పద్యములు సభన్
చదివినవాడే
కవియగు
కదరప్పా
కుందవరపు కవిచౌడప్పా!
అప్పుడు శ్రవణమే, దో పౌరాణికులో ఉపన్యాసకులో, హరిదాసులో తమదైన
రీతిలో చెబితే వినే వాళ్ళం. ఇప్పుడు శ్రవణము, దృశ్యము కూడా చేరినాయి
. ఒక మహానుభావుడు “నేను చిన్నపిల్లల, సినిమా పాటలకు
నర్తించే ఒక, స్పర్ధ టీవీ లో చూస్తున్నాను, ఇది వారికి అవసరమా”
అని సాటి సభ్యులను ప్రశ్నించినాడు 'ఆస్య గ్రంధి' లో. మరి చూచుట అవసరమా !
ఒక 40 నుండి 50 మందికి నవ్వు
కలిగించిన విషయము ఒక్కడికి నచ్చక పోతే వ్రాసిన
వ్యక్తి చెడ్డవాడు కాకూడదు కదా! ఏతా వాతా నేను చెప్పుకొచ్చేది ఏమంటే నవ్వుటకు వ్రాసిన అంశము పై నవ్వు వస్తే నవ్వండి లేదంటే
చదువుట గూడ మధ్యలోనే ఆపేసి వేరే అంశమేదయినా
చదువుకోండి. అంతేకాని వ్రాసేవాళ్ళను బాహాటముగా విమర్శించుట మంచి పద్ధతి కాదు.
సందేశ (Message) రూపములో చెప్పండి. బాహాటముగా వ్రాసి ఆ రచయిత మానసిక్ సంతులనమునకు
దూరము చేసి అతని ఆనందమును పోగొట్టి మీరు ఆనందించవద్దు.
స్వస్తి.
No comments:
Post a Comment