కోడిపిల్ల పాట
జానపదమునకు రచయిత లేడు.
దినమంతయు కాయకష్టపడు కర్షకునికి, పొద్దుతురుగుతూనే ఇంటివైపు
మరలి సంకటో అంబలో నోట్లో వేసుకొని, తన యింటి
ముంగిట మట్టి అరుగుపై జారగిల బడుకొని తనకొచ్చిన కూనిరాగముల
పాడును. అదియే మన సంగీతమునకు పునాది రాళ్ళు.
పల్లెటూరి పడుచులు తమ ఇండ్ల రోళ్లు యొద్ద, ధాన్యమును
దంపునపుడునూ, తమ యిండ్లలో పిండ్లు తిరగలితో విసరుచునూ,
తమ భర్తలకు, అన్నదమ్ములకు సహాయపడుచు పైర్లలో
కలుపుతీయుచును, నిద్రకై ఏడ్చెడి పాపాయిల జోకొట్టుచునూ పాడెడి
పాటలే మన సంగీతమునకు ఆధార షడ్జమములు. ఈ పాటలు చట్ట
బద్ధములు కావు. ఎవరెవరికో తోచిన భావములను వారు
వాటిని తమ తమ ఇష్టమెట్టులతో ఇమిడ్చిన పాటలివి.
వీటికి కష్టమైన సంచారములు కానీ, సాంగతులు గాని ఉండవు. ఇవి
అపూర్వ రాగాలలో రచింపబడి యుండవు. తాళము
ఎక్కువగా అది తాళము వుంటుంది. అట్లని వేరుతాళములలో వుండవు
అని కాదు నా ఉద్దేశ్యము .
ఇది ఒక జానపద గీతము . నాకు ఇందులో కొంత వేదాంతము కనిపించింది. ఇది ఒక కోడిపిల్ల తన స్వగతాన్ని నాతో చెబితే నేను మీతో చెబుతున్నట్లు వ్రాయబడినది. . తనను పట్టుట మొదలు తనను కూర వండి తినే వరకూ తనకు జరిగే ప్రతి పనినీ తన మంచికే అని తలపోస్తుంది కానీ తనకేదో అయిపోతూ వున్నదన్న బాధను చూపదు. ఆసాంతము ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగానే వుంటుంది.
ఇది, బాణీ తో సహా రాయల సీమ జానపద గేయము. నాకు ఇందులోని కొన్ని
చరణాలు యధాతథముగా గుర్తు లేనందువల్ల నేనే పూరించుకో వలసి వచ్చింది. నా సహపాఠి,
ఆప్త మిత్రుడు, జానపద బ్రహ్మ అన్న పేరు గాంచిన మునయ్య ఈ పాటకు ఎనలేని ఖ్యాతి నార్జించి
పెట్టినాడు. తానూ , నేను కడప జిల్లా జమ్మలమడుగులోని జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాలలో
కలిసి చదువుకున్నాము. నేను అతనికి దీటుగా పాడలేనని తెలుసు. ఆతను ఇపుడు మనతో లేడు. ప్రదర్శన
ఇచ్చి వస్తూ ఒక రోడ్డు ప్రమాదములు దాదాపు 15 సంవత్సరముల క్రితమే దివంగతుడగుట
జరిగినది. మదిలో నిలిచిన ఆతని జ్ఞాపకములతో , ఈ పాటను మీతో పంచుకుంటున్నాను.
ఈ పాటలో గొంచబోయ్, కొండబోయ్, తీస్కొంబోయ్
లాంటి పదాలు వస్తాయి . అవియన్నీ తీసుకుపోవుటకే అన్వయములు. శిలంకూరు అన్నది చిలమ
కూరు. ఇది సిమెంటు పరిశ్రమకు పేరుగన్నది. శిన్నప్ప అన్న మాట అనుప్రాస కోసమే!
దాసాని పూలు అంటే మందారపు పూవులు. పుట్టశెండు అంటే బంతి.
ఇక పాట వినండి.
పిల్లో .......
అబ్బో ........
కోడిపిల్లా .........
ఆమాట అంటదె , అమైన అంటదే,
అట్టాగ నంటదే , ఆ లయ్య బడతదే కోడిపిల్ల
ఆహా !
కోయ్యీ కొయ్యంగానె కోడికూత మానేసి
కైలాసం నేను పోయినా నంటదె
ఆమాట అంటదె , అట్టాగ నంటదే ,
అమైన అంటదే, ఆ లయ్య బడతదే కోడిపిల్ల
తుంట కట్టె తీసుకోని తరిం గిరిం కొడ్తాంటె
తరిం గిరిం కొడ్తాంటె ......
తరిం గిరిం కొడ్తాంటె ........
యమ్మ భూమీ భూలోకమంత తిరిగినానంటదే
ఆమాట అంటదె , అట్టాగ నంటదే ,
అమైన అంటదే, ఆ లయ్య బడతదే కోడిపిల్ల (1)
బాయికాడిగ్గొంచబోయ్ దుద్ది, దుద్ది
కడుగుతాంటే
దుద్ది, దుద్ది కడుగుతాంటే దుద్ది, దుద్ది
కడుగుతాంటే.........
యమ్మ కాశీ గంగలోన జలకమాడ్న్యానంటదే
ఆమాట అంటదె , అట్టాగ నంటదే ,
అమైన అంటదే, ఆ లయ్య బడతదే కోడిపిల్ల (2)
దిబ్బ కాడిగ్గొంచబోయ్ జుట్టుగిట్టు ఈకుతాంటె
జుట్టుగిట్టు ఈకుతాంటె జుట్టుగిట్టు ఈకుతాంటె...........
యమ్మ శిలంకూరు శిన్నప్ప సౌరం జేస్న్యాడంటదే
ఆమాట అంటదె , అట్టాగ నంటదే ,
అమైన అంటదే, ఆ లయ్య బడతదే కోడిపిల్ల ......... (౩)
మచ్చు కాడిగ్గొండబోయ్ తుంటల్, తుంటల్
నర్కుతాంటె
తుంటల్, తుంటల్ నర్కుతాంటె .....
యమ్మ దాసాని పూలతోట దగ్గరున్నా నంటదే...
ఆమాట అంటదె , అట్టాగ నంటదే ,
అమైన అంటదే, ఆ లయ్య బడతదే కోడిపిల్ల..... (4)
పొయ్యి మీంద సట్టి లోన కుత్, కుత్, కుత్,
కుత్
వుడ్కుతాంటే, కుత్, కుత్, కుత్ వుడ్కుతాంటే,
యమ్మ పుట్టశెండు మాదిర్నేనేనెగిర్న్యానంటదే
ఆమాట అంటదె , అట్టాగ నంటదే ,
అమైన అంటదే, ఆ లయ్య బడతదే కోడిపిల్ల ......... (5)
ఒక్కా గంటెడు పుల్సు బువ్వ మీంద బోసుకొంటె
కూటిమీంద బోసుకొంటె బువ్వ మీంద బోసుకొంటె
యమ్మ మల్లె పరుపు పైన నేను పండుకొన్యానంటదే
ఆమాట అంటదె , అట్టాగ నంటదే ,
అమైన అంటదే, ఆ లయ్య బడతదే కోడిపిల్ల ......... (6)
ఆహా కోయ్యీ ......
No comments:
Post a Comment