Saturday, 21 November 2015

వాక్కు -- భాష


వాక్కు -- భాష
https://cherukuramamohan.blogspot.com/2015/11/blog-post.html
ప్రాణి లోకములో ప్రతి జీవికి మనోభావనలు వుండునన్నది మనకు తెలిసిన విషయమే. ఈ భావనను రెండు విధములుగా వర్గీకరించ వచ్చును. 1. ధ్వన్యాత్మకము 2. వర్ణాత్మకము. అవ్యక్తమైన శబ్దాన్ని ధ్వని అంటారు.ఉదాహరణకు పశువులు ధ్వనించుచున్నాయి గానీ అవి తమ భావమును తమకు తెలిసిన విధముగా వ్యక్తీకరించినా మనకు అవగతమగుట లేదు. అయినా కానీ మానవులమైన మనము పశువుల భావనలను తెలిపే కొన్ని శబ్దములను అర్థము చేసుకొన గలుగు చున్నాము. రామాయణములో మహర్షి విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు జీవ భాషల కూడా నేర్పించుతాడు. మనము ఎన్నో కథలలోగూడా ఈ విషయాన్ని వినియుంటాము.
పశువుల అవసరాలు మితము.కానీ మన అవసరాలు అమితము.ఎన్నోసూక్ష్మ భావాలను కొన్ని సమయాలలో వ్యక్తపరచావలసి వస్తుంది.కాబట్టి శబ్ద వ్యక్తీకరణ అవసరము. కావున అది వ్యక్త భాష ఔతుంది. '' కారాత్ 'క్ష' కార పర్యంతం అక్షర సముదాయము కలిగిన భాష వ్యక్త భాష.కానీ ఈ వర్ణక్రమమును పాటించని భాషలు ప్రపంచము లో ఉన్నవి. వానిని మ్లేచ్చ భాషలంటారు.'అవ్యక్త శబ్దే మ్లిచ్చః' అన్నది ఆర్య వాక్కు. ఉదాహరణకు '' కార శబ్దోచ్చరణకు ఆంగ్లములో 'C','K','Q' అన్న అక్షరాలను వారు ఏర్పరచుకొన్న వ్యాకరణ నియమానుసారము వాడుతారు. ( వారి వ్యాకరణ నియమాలు వారి పండితుల బుధ్యనుసారము మారుతూ వుంటాయి.) చాలా చిన్న ఉదాహరణ 'PUT' మరియు 'BUT' , ఒకటేమో పుట్ మరొకటేమో 'బట్'. అక్షరములు ఒకటే అయినపుడు ఉచ్చారణ భేదము ఎందుకు అంటే వచ్చే జవాబు 'ఏమో' నే. కొంచెము కష్టముతో కూడుకొన్నా 'అమరము' పెద్ద బాలశిక్ష' ల సహకారముతో అక్షర మాల శబ్దార్థాలు గనుక తెలుసుకోగలిగితే జీవితాంతము మన భావ వ్యక్తీకరణలోని సౌలభ్యమును ఎంత కలిగియుందుమో అర్థము చేసుకొనవచ్చును.భావ వ్యక్తీకరణ ల్కొని లోపములవల్ల ఎన్ని అనర్థములు నేటి కాలమున వాటిల్లు చున్నవో చెప్పుటకు నా శక్తి చాలదు. చాలామంది తమ సంభాషణ 'మీకు తెలియదు...' అనియంటూ మొదలుపెడతారు. దాని అర్థము 'మీరు మూర్ఖులు నేను జ్ఞానిని' అనే కదా. మాటలాడుట ఒక కళ. మన వద్ధ భాష పుష్కలముగా వుంటే మనము అనువుగా వాడుకోన వచ్చు. లేకుంటే అపార్థాలు అనర్థాలే కదా !'
ఇదంతా ఎందుకు చెప్పుకోస్తున్నానంటే మహామహులకైన ఈ మ్లేచ్చ భాషలు వాడునపుడు నిఘంటువు ఆవశ్యకత  తప్పనిసరి.
దేనికైనా మాతృక లేనిదే మనుగడ లేదు. 'పురుషుడు' అన్న మాటకు పరమాత్మ అన్న అర్థము వుంది. (పురుష  సూక్తము పరమాత్మను గూర్చియే కదా తెలిపేది.) వేదమును అపౌరుషేయము అంటారు. అంటే దేవుడు వేదములను సృష్టించలేదు, పవిత్ర మత గ్రంధాలైన బైబిలు, ఖురాను లవలె. కానీ ఈ వేదములు వేదపురుషుని  వర్ణించినాయి. కాబట్టి చెట్టు ముందా విత్తు ముందా అన్న మీమాంస బయలుదేరుతుంది. కాబట్టి రెండూ ముందునుండి ఉన్నాయి ముందుకు గూడా వుంటాయి అనుకొంటే పేచీ లేదు. కావున వేదము వేదం విదితుల  నడుమ అవినాభావ సంబంధము ఉన్నది.జవాబు 'దేవ భాషలో'. దేవతలలో ఎక్కువ తక్కువలు ఉన్నా వారు 'పర బ్రహ్మ' పరిధికి కట్టుబడినవారే. కావున పర బ్రహ్మ , వేదములు , వాణిని వ్యక్తీకరించిన భాష దేవ భాష అయినది. 'దేవ' తిరుగాబడితే 'వేద' మె కదా!. కావున బ్రహ్మము తో బాటు దేవభాష లేక వేద భాష వోతప్రోతములై మనుచున్నవి. కఠినమైన ఈ భాషను పాణిని వంటి మహా ఋషులు సంస్కరించి వ్యాకరణము వ్రాసి 'సంస్కృతం'  అన్న' పేరుతో మనకందించినారు. ఆ వియత్ గంగ ఆ విధంగా 'ఆకాశంబుననుండి శంభుని శిరం బందుండి శీతాద్రి శుశ్లోకంబైన హిమాద్రి నుండి' భువికి ఏతెంచినది. ఈ మాటలన్నీ నడిచే దేవుడనిపించుకొన్న మహాజ్ఞాని చంద్రశేఖర  సరస్వతీ స్వాములవారి ఉపదేశ సారమని మనవి చేసుకోను చున్నాను.నా మనసుకు వారిమాట వేదము. దేశాభాషలే కాకుండా పాశాత్యభాషలన్నీ కూడా సంస్కృత జన్యములని ఎందఱో పాశాత్య పండితులే నొక్కి  వక్కాణించినారు. హిబ్రూ గ్రీకు మొదలగు భాషలమూలములు సంస్కృతము లో కలవని మహా పండితులైన Gene D. Matlock మరియు Paola Mosconi, Pococke మొదలగు పాశ్చాత్యుల రచనలు చదివితే నమ్మకము కుడురుతుందేమో.మనవారెందరో కూడా సంస్కృతము నుండి ఆంధ్రమును విడ దీయలేదు. క్రీడాభిరామము నుండి  ఈ మాట వినండి.
జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశభాషలందు తెలుగు లెస్స
జగతి తల్లి కంటె సౌభాగ్య సంపద
మెచ్చుటాడుబిడ్డ మేలు కాదె
(శ్రీనాధకవిసార్వభౌముని క్రీడాభిరామము నుండి). ఈ పద్యము క్రీడాభిరామము లోనిదే కానీ దీనిని వినుకొండ వల్లభారాయ కవి వ్రాసినట్లు కూడా చెబుతారు. వల్లభరాయుడు కడప జిల్లా పులివెందుల ప్రాంతంలోని  లోని మోపూరు గ్రామాధిపతి. మోపూరు గ్రామంలోనే ఆయన ఇష్టదైవం భైరవస్వామి కొలువై ఉన్నాడు. వల్లభరాయుడు 15వ శతాబ్ది ప్రథమార్థం (క్రీ.శ.1400-1450) లో జీవించినట్టుగా చరిత్రకారులు నిర్ధారించారు. ఈ కావ్యమును ఆయన వ్రాసినట్లు కూడా చెబుతారు.మిగతా విషయాలు తరువాత మాట్లాడుకొందాము.
పాశ్చాత్యులకు సంబందిచి ఏ అతిపురాతన భాష తీసుకొన్నా అందలి అక్షర సముదాయమును వారి అక్షరమాల లోని మొదటి రెండుమూడు అక్షరాములా పేరుతోనే పిలుస్తారు. ABC అనిగానీ 'ఆల్ఫా బీట '(ఆల్ఫాబిట్ అన్న పేరు ఇక్కడినుండి వచ్చినదే.)  కానీ మన మూల భాష వానికి 'అఆఈ' లని నామకరణము చేయలేదు. ప్రతి యొక్క ధ్వనిని 'అక్షరము' అన్నారు. క్షరము (to perish ) అంటే నశించేది అని అర్థము . అక్షరము అంటే నాశము లేనిది. ఎంతటి సంస్కారముంటే సర్వజ్ఞులైన మన పూర్వులు ఆ మాటను ఉత్పత్తి చేయగలుగుతారో ఆలోచించండి.ఈ ఒక్క మాట చాలు సంస్కృతము ఎంత పూర్వమైనదో ఎంత అపూర్వమైనదో చెప్పడానికి.
కొంచెము ఆంధ్రము  విషయానికోద్దాము.ఆంద్ర భాషను గూర్చి ఆంద్ర లిపిని గూర్చి కాస్త పరిశీలిస్తాము. లిపి అంటే మనోభావాలను వాగ్రూపములో కాక రేఖా రూపములో ప్రకటిస్తే అది లిపి అవుతుంది పరాశక్తి యంత్రము అన్న పేరుతో, శ్రీ చక్రము లాగా, ఒక యంత్రము వున్నది. అందులోని బీజాక్షరాలకు తెలుగు లిపి వాడటం జరిగింది.పరాశక్తి స్త్రీ స్వరూపిణి. ఆమె అంబికయై పరమేశ్వరుని వామ భాగమున (స్వామికి ఎడమ ప్రక్క )
నిలిచియుంటుంది. అంబికకు వామావర్త పూజ చేయుట ఆనవాయితీ. అంటే ఆంగ్లములో ANTI-CLOCKWISE DIRECTION అని అర్థము. తెలుగు లిపి కూడా వామావర్తమే. తక్కిన భాషల లిపులు దక్షిణావర్తమై దనరారుచున్నవి. అమ్మ స్వామికి ఎడమ ప్రక్క నిలుస్తుంది, వామావర్త పూజలందుకొంటుంది,అందువల్లనే అమ్మ యంత్రానికి తెలుగు భాష వాడినారేమో. అంటే తెలుగు లిపి పరాశక్తి ప్రధానమైనది. ఇక భాష విషయానికొస్తే ఈ ఆంధ్రభాష శివ ప్రధానమైనది. మా కాలము వరకు  'ఓ న మః శి వ యః సి ధం న మః' తోనే అక్షరాభ్యాసము చేయించేవారు. దీనికి వైష్ణవ బౌద్ధ ఇత్యాది తారతమ్యములు లేకుండా 'ఓం నమఃశ్శివాయః' అని ఉచ్చరించేవారు. అంటే ఈ ఆంధ్రభాష పరమేశ్వర పరమేశ్వరీ స్వరూపమై యోప్పారుచున్నదనే కదా అర్థము.కాళిదాస మహాకవి   కూడా 'వాగార్థాత్ వివ సంపృక్తౌ వాగర్థాత్ ప్రతిపత్తయేl
         జగతఃపితరౌవందే పార్వతీపరమేశ్వరౌI’ll అన్నారు.
అంటే పార్వతీ పరమేశ్వర స్వరూపమైనది మన ఆంద్ర భాష అని శబ్దించుచున్నది కదా!
అసలు అక్షరధ్వనులు మహేశ్వర డమరుక స్వనము నుండి ఉద్భవించిన ధ్వనులు. ఈ శ్లోకం చూడండి :
"నృత్తావసానే నటరాజరాజో ననాద ఢక్కాం నవపంచవారంl
ఉద్ధర్తు కామః సనకాది సిద్ధాదినేతత్‌ విమర్శే శివసూత్ర జాలంll"
ఆ డమరుక వాద్యం అంతం కావస్తున్నప్పుడు వేగంగా వాయిస్తారు. దానిని "చోపు అంటారు. ఆ విధంగానే నృత్యం చివరికి వస్తున్నపుడు (నృత్తావసానే) చోపు ధ్వని వినబడింది. పై శ్లోకంలోని 'నవపంచవారం' అన్న పదం ఈ పధ్నాలుగు (తొమ్మిదికి అయిదు కలిపితే వచ్చేవి) దరువులనీ సూచిస్తుంది. నర్తనం చివరిలో డమరుకపు పధ్నాలుగు దరువుల సహాయంతో పరమ శివుడు వ్యాకరణ సూత్రాలకు బీజము నాటినాడు. ఆ పధ్నాలుగు సూత్రాలను పాణిని కంఠస్తం చేసుకొని 'అష్టాధ్యాయి అనే ప్రాథమిక గ్రంథాన్ని రచించినాడు. దీనిలో ఎనిమిది అధ్యాయాలుండటం వల్ల దీనిని 'అష్టాధ్యాయి' అంటారు.
1‘అ ఇ ఉ ణ్’ (అకార, ఇకార, ఉకారాలు), 2‘ఋ లు క్’ (ఋకార అలుకారాలు), 3‘ఏ ఓం గ్’ ( ఏకార, ఓకారాలు), 4‘ ఐ ఔ చ్’ (ఐ కారము, ఔ కారము), 5‘హ య వ ర ట్’ (హకార, యకార, వకార, రకారాలు.), 6‘ల ణ్’ (లకారం), 7‘ఙ, , , ణ నం’ ( వర్గల యొక్క చివరి ఐదు అక్షరాలు ), 8‘ఝ, భ య్’ ( ఝాకార, భకారాలు), 9‘ఘ,,ధ ష్’ ( ఘకారం, ఢ కారం, ధకారం), 10‘జ, , , డ ద శ్’ ( ఐదు అక్షరాలు ), 11‘ఖ ఫ ఛ ఠ థ చ ట త వ్’ ( ఎనిమిది అక్షరాలు), 12‘క ప య్’ (క & ప ), 13‘శ ష స ర్’( శకార, షకార,సకారాలు ), 14‘హల్’ ( హకారం)
“ఇతి మాహేశ్వరాణి సూత్రాణి” ఈ పదునాలుగు మహేశ్వరుని సూత్రాలు.
ఈ ఆంద్ర భాష శివ ప్రధానమైనదని గుర్తించిన వారు ,తమిళనాడులోని ఆరణి కి దగ్గరైన అడయపాలెం లో జన్మించిన, శివుడినే సాక్షాత్కరింప జేసుకొని శివోత్కృష్టత చాటిచెప్పిన   అప్పయ్య దీక్షితులవారు ఈ క్రింది విధముగా చెప్పినారు. ఆయన సామవేది. ఆయన ఆత్మగతము గాంచండి:
 ఆంధ్రత్వ మాంధ్ర భాషాచా ప్యాంధ్రదేశ స్వజన్మభూఃl
తత్రాపి యజుషీ శాఖా నాల్పస్య తపనం ఫలంll
ఆంధ్రత్వము, ఆంద్ర భాష , ఆంధ్రదేశము , యజుశ్శాఖాధ్యయనము ఎంత తపస్సు చేస్తేనో దొరుకుతుంది, నాకు దొరకలేదు కదా అని వాపోయినాడు.ఇది త్రిలింగదేశమై లింగాకృతిన యోప్పారుచున్నదనికూడా ఆయన వినిపించిన అంతర్లీన భావము.
నేను భాషా శాస్త్రము చడువుకొనలేదు. అయినా నా భాష తెలుగు అంటే నాకు అభిమానము. నేను తెలుగువాడినగుట వలననే పర భాషలు కూడా కొన్ని సులభముగా నేర్చుకోన్నానేమో నన్నది నా నమ్మకము.
నేను తెలుగును గూర్చి వ్రాయదలచుటకు రెండు కారణాలున్నాయి. 1. నా భాష తమిళము కన్నా అధునాతనము కాదు. 2.నా భాషకు కావ్య సంపద మెండు. అన్నవి నా మదిలో కలిగిన ఆలోచనలు. అట్లని పర భాషలలో తక్కువ అని చెప్పుట నా ఉద్దేశ్యము కాదు. ఇక్కడ ఇంకొక మాట చెప్పవలసి వుంది. ఈ వ్యాసము వ్రాయుటకు కారణము, నేను ఎక్కడ చదివింది గుర్తులేదు కానీ రాళ్ళపల్లి వారు, వీరు నెల్లూరు వాస్తవ్యులనుకొంటాను (అనంత కృష్ణ శర్మ గారు కాదు) తరువాత ఇటీవల వెలుగులోనికి వచ్చిన రాము గారు తెనుగు లెంకగా తెలుగు వారికి సుపరిచితులు.
ప్రపంచంలో ఏ భాషలో లేని విధంగా 72 వేల నాడులను కదిలించే అమోఘశక్తి ఉన్న ఏకైక భాష తెలుగుభాష అని రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు రాళ్ళబండి కవితాప్రసాద్ గారు తిరుపతిలో జరిగిన తెలుగుమహాసభలలో ఉద్ఘాటించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో 2372 భాషలున్నాయని, భారతదేశంలో 23 భాషలున్నాయన్నారు. ప్రపంచంలో సాంప్రదాయ భాషలుగా గుర్తించినది కేవలం 6 భాషలన్నారు. అవి వరుసగా సంస్కృతం, గ్రీకు, లాటిన్, తమిళం, తెలుగు, పర్షియా భాషలన్నారు. ఈ భాషలకు సంస్కృతము మూలమని ముందే చర్చించుకొన్నాము.
ఇక తెలుగును గూర్చి:
ప్రపంచములో 6౦౦౦ భాషలున్నాయని అంచనా. అందులో లిపి కలిగిన భాషలు మహావుంటే 200,250వుండవచ్చు. శాస్త్ర,సాంకేతిక  పరిజ్ఞానమునకు వలయు భాషా సంపద లేక వాఙ్మయము కలిగిన 5,6 భాషలలో తెలుగు ఒకటి. మొహెంజొదారో హరప్పా లో దొరికిన లిపికి సమాంతరముగా సుమారుగా 5000 సంవత్సరముల నాటికే తెలుగులిపి ఉండినది అని మళయాండి,కాశీ పాండియన్ అన్న ఇరువురు తమిళ భాషా శాస్త్రజ్ఞులు కర్నూలు జిల్లా లోని తుంగభద్ర లోయలో చేసిన పరిశోధనల మూలముగా తెలియజేసినారు.ఇదికాక మన భట్టిప్రోలు శాసనము తరువాతనే అశోకుని శిలా శాసనములు వేయించినాడన్నది చరిత్ర చెప్పేసత్యము.
 కొన్ని వేల సంవత్సరాలుగా వాడుకలో ఉండి, శాసనభాషగా, సాహిత్యభాషగా నిలదొక్కుకొని, ఇంకా సజీవంగా ఉన్న విశిష్ట భాష తెలుగు. 480 క్రియా ధాతువులు కలిగిన తమిళము స్వయం సంవృద్ధ స్థితిని చేరి శాస్త్ర సాంకేతిక ఉపయోగమునకు ఉపకరణమైన భాష గా ప్రభవించగా 1480 ధాతువులు కలిగి ప్రపంచములోనే అత్యంత చేవ గలిగిన భాషయై కూడా ప్రాభావమునకు నోచుకోలేక మన పూర్వీకుల అతి తెలివికి, మన అలసత్వానికి బలియై ఒక మూలాన నిలిచి భోరుమంతూంది.
 ఇంకొక పర్యాయము మరికొంత........
ప్రాచీన భాషగా తెలుగును గురించి తెలుసుకొనేటప్పుడు తెలుగు జాతిని గురించి, తెలుగునాడును గురించి కూడా ఆలోచించవలసి ఉంటుంది.
 ఇంటిపేరు, గోత్రనామము కలిగిన ఏకైక మూక తెలుగు వారు. కన్నడిగులకు గోత్రము ఉంటుంది ఇంటిపేరు ఉండదు. అసలు కర్నాటక లో కమ్మ బ్రాహ్మణులు అన్న ఒక తెగ వుంది. అసలు ఈ కమ్మ ఏమిటి అన్నది ఇటీవలి ఒక కన్నడ పరిశోధన గ్రంథము లో ఈ విధముగా వివరించినారు. ఒంగోలు జిల్లాలో గుండ్లకమ్మ కృష్ణ జిల్లాలోని పేరికమ్మ అన్న రెండు చిన్న నదుల నడుమ గలిగిన ప్రాంతములో నివశించిన పూర్వీకులు గలిగిన వారు అన్నది అసలైన అర్థము. వాళ్లెప్పుడో కర్నాటకు వలస పోయి ఉండినారు.తమిళులకు ఇంటిపేరు గోత్రము రెండూ వుండవట.తెలుగు జాతి అనేది ఒక జనసముదాయం. ఈ జనసముదాయం కొన్ని సాంస్కృతిక కారణాలవల్ల ఏర్పడింది. ఈ సాంస్కృతిక కారణాలే తెలుగుజాతిని కొన్ని వేల సంవత్సరాల నుంచి ఒక విశిష్ట జనసముద్రముగా నిలబెడుతున్నాయి. సంస్కృతి అనేది జనసమూహాలను దగ్గరికి చేరుస్తుంది. భాషకన్నా నివసించే ప్రదేశం కన్నా ‘మనమంతా ఒక జాతికి చెందిన వాళ్ళం’ అనే భావన మనుషుల్ని దగ్గర చేస్తుంది.
 తెలుగువారు కొన్ని వందల,వేల ఏళ్ళనుంచి ప్రపంచంలోని ఇతర ప్రదేశాలతో సంబంధబాంధవ్యాలు కలిగి ఉన్నారు. తెలుగు జాతి అనుసరించే సంప్రదాయాలు, ఆచారాలు, పండుగలు, ఆటలు, పాటలు, కర్మకాండలు, నమ్మకాలు, బంధుత్వ వాచకాలు మొదలైనవి వీళ్ళందరినీ ఇంకా ఒక జాతిగా గుర్తించేట్లు చేస్తున్నాయి. ఇతర దేశాలకు వలసపోయి తెలుగు భాషను మాట్లాడడం మానినా మనుషుల పేర్లలోనో, ఆచరించే సంప్రదాయాలలోనో, కులాచారాలలోనో, పండుగలలోనో, నమ్మకాలలోనో తెలుగు జాతి లక్షణాలు తొంగిచూస్తుంటాయి. భాషకన్నా, ప్రదేశంకన్నా జాతి బలమైంది. ఒక జన సముదాయాన్ని గుర్తించడానికి జాతి లక్షణాలే ముఖ్యమైనవి. ఒకే జాతికి చెందిన వారు కొన్ని కారణాల వల్ల ఇతర భాషల్ని మాట్లాడవచ్చు. వేరు వేరు ప్రదేశాలలో నివసించవచ్చు. కాని వందల సంవత్సరాలు గడిచినా మనిషి తన జాతి లక్షణాలను అంత త్వరగా మర్చిపోడు.
 ఈనాడు తెలుగువారు కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు, కర్నాటకలాంటి ప్రదేశాలలో నివసిస్తున్నా తెలుగు భాష ఈ ప్రదేశాలకంటే పాతది. తెలుగు భాషకంటె తెలుగు జాతి ఇంకా ప్రాచీనమైంది. ఈ జాతి మూలాలను వెతకాలంటే ఎన్నో వేల సంవత్సరాల వెనక్కి వెళ్ళవలసి వుంటుంది.
 తెలుగు భాషను ద్రావిడ భాషలలో ఒకటిగా భాషాశాస్త్రవేత్తలు గుర్తించినారు. ‘ద్రావిడ’ పదం చాలా ప్రాచీనమైనా ‘ద్రావిడ భాషలు’ అనే పదాన్ని సృష్టించడం గందరగోళానికి దారి తీసింది. ద్రావిడ భాషలు సోదర భాషలనడంలోనూ వాటికీ సంస్కృతానికీ జన్యజనక సంబంధం లేదనడం లోనూ ప్రస్తుతం ఎవ్వరికీ సందేహాలు లేవు. కాని ద్రావిడ భాషల మూలాలను గుర్తించడంలోనూ ద్రావిడుల మూలాలను గుర్తించడంలోనూ శాస్త్రవేత్తలలో ఏకాభిప్రాయం లేదు. తెలుగు భాష ద్రావిడ భాష అనే పేరుతో చలామణీ కావడం శాస్త్రానికి సంబంధించిన విషయమే అయినా ద్రావిడ భాషలనే పేరే కృత్రిమ కల్పన అన్నది నిజం. ఎవరో భరతుడి పేరుతో మొత్తం భారతదేశాన్ని పిలుస్తున్నాం కదా, సింధునదీ తీరంలో వెలసిన నాగరకతే హిందువులనే పేరుకు దారి తీసింది కదా అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. కాని ఇలాంటి అర్థవ్యాకోచం సహజంగా సంభవిస్తుంటుంది. అయితే ‘ద్రావిడ’ పదం అలాంటిది కాదు.
 ప్రసిద్ధ ద్రావిడ భాషాశాస్త్రవేత్త డా.సునీతికుమార్ ఛటర్జి ‘ద్రవిడియన్’ పేరుతో ఇచ్చిన ఉపన్యాసంలో ఈ పదం భారతదేశంలో బ్రిటిష్ పండితులు సృష్టించిందని, దీని మూలమైన ద్రమిడ, ద్రవిడ, ద్రావిడ పదాలకు తమిళమనే అర్థమే కాని తెలుగువారనే అర్థం లేదని స్పష్టంగా చెప్పారు. తెలుగు వాళ్ళని సూచించటానికి ‘ఆంధ్ర’ అనే పదాన్ని వాడేవారు కాని ‘ద్రావిడ’ పదాన్ని కాదని స్పష్టం చేశారు. మొత్తం మీద భాషాశాస్త్రవేత్తలు తెలుగును ద్రావిడ భాషగా పేర్కొంటున్నా తెలుగు వారు మాత్రం ద్రావిడులు కాదని స్పష్టం. పంచద్రావిడులనే మాట గూర్జర, మహరాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, ద్రావిడ బ్రాహ్మణులను గురించి చెప్పింది. వీరు బహుశా తమిళ దేశంనుంచి వచ్చినవారై ఉండవచ్చు. పుదూరు ద్రావిడులు, ఆరామ ద్రావిడులు తమిళదేశంనుంచి వచ్చినవారే. వీరంతా బ్రాహ్మణులు. బ్రాహ్మణులందరూ ఆర్యులని చెప్పే తమిళులు ఈ బ్రాహ్మణుల్ని ద్రావిడ జాతికి చెందిన వారుగా ఎలా అంగీకరిస్తారు? ఇవన్నీ ఎలా ఉన్నా ద్రావిడ భాషలనే పదం అశాస్త్రీయమనీ ద్రావిడ జాతికి (తమిళ జాతికి) ఆంధ్ర జాతికి సంబంధం లేదనీ అభిప్రాయపడవచ్చు.
 మరో వింత వాదం ఏమిటంటే తమిళులు తమిళమే అత్యంత ప్రాచీనమనీ ప్రపంచంలోనే అంత ప్రాచీన భాషలేదనీ ప్రచారం చేస్తుంటారు. నిజానికి మూలద్రావిడ భాషనుంచి మొదట వేరయింది తెలుగు. ధ్వనుల్లో కలిగిన పెక్కు మార్పుల్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది భాషాశాస్త్రవేత్తలు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమిళంలో ప్రాచీన రూపాలు ఎక్కువగా ఉన్నాయని, అందువల్ల తమిళమే ప్రాచీనమని కొందరు వాదిస్తారు. కాని ప్రాచీన రూపాలు ఉండటానికి ఎన్నో కారణాలున్నాయి. సాహిత్యం ముందుగా వెలువడటానికి కూడా చారిత్రక కారణాలు, రాజకీయ కారణాలు ఉంటాయి. కాని ఒక స్వతంత్ర భాషగా తెలుగు చాలా ప్రాచీనమైందని, కనీసం మూడువేల సంవత్సరాలనుంచి ఈ భాషను (స్వతంత్రంగా) వాడుతున్నారని భద్రిరాజు కృష్ణమూర్తి లాంటి ప్రసిద్ధ భాషాశాస్త్రవేత్తలు సోపపత్తికంగా నిరూపించారు (Telugu Language and Culture 3000 Years ago, DLA Souvenir, 1981.)
 తమ వ్యాసంలోనే భద్రిరాజు తెలుగును గురించి చెప్తూ, ఆ భాషకు 1600 సంవత్సరాల చరిత్ర పూర్వ యుగం, ఆ తర్వాత 1400 సంవత్సరాల చారిత్రక (దాఖలాలుండే) యుగం ఉందని చెప్పారు. మూడువేల సంవత్సరాలకు పూర్వమే తెలుగు-గోండి-కుయి భాషావర్గం తమిళం,కన్నడం-తుళు భాషావర్గం నుంచి విడివడిందని తమిళంలో మాత్రం సాహిత్యం, వ్యాకరణం క్రీ.పూ. మూడవ శతాబ్ది నాటికే ఏర్పడ్డాయని భద్రిరాజు తమిళ పండితుల అభిప్రాయాలకు ఇదే వ్యాసంలో ఆమోదముద్ర వేశారు. కానీ తమిళాన్ని ఒక భాషగా క్ర్రీస్తు పూర్వానికి తీసుకు వెళ్ళగలిగినా, సాహిత్యాన్ని క్రీస్తు పూర్వం అనేక శతాబ్దాల వెనక్కు నెట్టడం సాధ్యం కాదు. భాషా చరిత్రను కాని, సాహిత్య చరిత్రను కాని పుక్కిటి పురాణాల ఆధారంగా నిర్మించడం సాధ్యం కాదు, సమంజసమూ కాదు. ఏ చరిత్రకారుడూ దీన్ని అంగీకరించడు.
 క్రీస్తు పూర్వమే తమిళంలో సాహిత్యం ఉందనటానికి శాసనాధారం కాని, ఇతర చారిత్రక ఆధారాలు కాని లేవు. తమిళ బ్రాహ్మిని గురించి ఐరావతం మహాదేవన్ కాని, భద్రిరాజు కృష్ణమూర్తి కాని చెప్పే విషయాలను అంగీకరించడం కష్టం. ఎందుకంటె తమిళంలో శాసనాలన్నీ తెలుగు, కన్నడం తర్వాతే వచ్చాయి. తమిళ బ్రాహ్మిగా ఈ పండితులు పేర్కొనేవి కేవలం కొన్ని పదాలు మాత్రమే. అలాంటి తెలుగు పదాలు కూడా క్రీస్తు పూర్వం నుంచే ఉన్నాయి. అంతేకాదు. ప్రాకృతానికీ దేశ భాషలకూ మర్యాద కల్పించిన బౌద్ధమూ జైనమూ ఆంధ్ర ప్రాంతానికి వచ్చిన తర్వాతనే తమిళ ప్రాంతానికి వెళ్ళాయి. ఇవన్నీ గమనిస్తే కాని తెలుగు భాష ప్రాచీనతను గురించి తర్కబద్ధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చెయ్యటానికి కుదరదు.
 మరో ఉదాహరణ చెప్పవచ్చు. ఒక భాషగా కన్నడం తెలుగంత ప్రాచీనమైంది కాదు. కాని రాష్ట్రకూటులు, చాళుక్యులు దేశ భాషను ఆదరించడం వల్ల కన్నడంలో తెలుగుకంటే ముందే శిష్ట సాహిత్యం వెలువడింది. అంత మాత్రం చేత కన్నడం తెలుగుకంటే ప్రాచీన భాష అయిపోదు. ఈ విషయం తెలియక ఎంతోమంది తెలుగు పండితులు భాషకు సాహిత్యానికీ ముడిపెట్టి తెలుగు భాష కూడా కన్నడం తర్వాతే వచ్చిందని చెప్తుంటారు.
 ఈ విషయాలను గురించి ప్రఖ్యాత చారిత్రకులు, శాసన శాస్త్ర పరిశోధకులు, డా.ఎస్. శెట్టార్ శంగం తమిళగం మత్తు కన్నడ నాడు-నుడి పుస్తకంలో వివరంగా చర్చించారు. కేంద్ర సాహిత్య అకాడెమి వారి భాషా సమ్మాన్ ప్రశస్తి పొందిన ఈ పుస్తకంలో (మొదటి ముద్రణ 2007, ఎనిమిదవ ముద్రణ 2011) ప్రారంభ కాలం నాటి ద్రావిడ సంబంధాలను గురించిన విశ్లేషణ ఉంది. ఈ పుస్తకంలో శెట్టార్ ఇలా రాస్తున్నారు (కన్నడానికి తెలుగు):
 దాఖలాలో ఉన్న ఉల్లేఖనాలను గమనిస్తే మన పొరుగు వారయిన ఆంధ్రులకు కన్నడిగులకంటె స్పష్టమయిన ప్రాచీనత ఉందని స్పష్టమవుతుంది. అయితే వారు “తెలుగు” అనే పదంతో తమను తాము గుర్తించడం తర్వాత చాలా కాలానికి జరిగింది. …నిజానికి తమిళులనీ కలుపుకొని క్రీస్తు శకానికి అటూ ఇటూ (క్రీ.పూ. 3 నుంచి క్రీ.శ. 3 వరకు) మనదేశంలో ఏ భాషకూ తమదే అయిన లిపి లేదు. అందువల్లనే ఉత్తరాన సింధూ నుండి దక్షిణాన కుమరి వరకూ ఏకైక లిపిగా బ్రాహ్మి ప్రసారమయింది. క్రీ.పూ. 2వ శతాబ్దిలో ఉన్న తమిళ-బ్రాహ్మీ లిపి కూడా దేశీయమైంది కాదు. తమిళ దేశీ లిపి అనదగిన వట్టెళుత్తు క్రీ.శ 4వ శతాబ్దికి గాని సిద్ధం కాలేదు (పు. 24-25.)
 ఈ విషయాన్ని గురించి, లిపి పరిణామం గురించి శెట్టార్ సుదీర్ఘంగా చర్చించారు. సింహళం, తమిళగంలలో బ్రాహ్మీ లిపి ప్రవేశించటానికి ముందే అది ఆంధ్ర-కర్నాటక ప్రాంతాలలో ప్రవేశించిందన్న విషయాన్ని గమనించాలి. తమిళ బ్రాహ్మిని గురించి మాట్లాడే పెద్దలు తెలుగు-కన్నడ బ్రాహ్మిని చెప్పకుండా దాన్ని దక్షిణ బ్రాహ్మి అని పేర్కొనటం తప్పని శెట్టార్ అభిప్రాయం (పు.73.) తమిళ బ్రాహ్మీ శాసనాలుగా చలామణీ అవుతున్నవి కేవలం పదాలే కాని శాసనాలు కావు. వీటిలో ఒకటి రెండు పదాలు లేక వాక్యాలు ఉన్నాయి. సుదీర్ఘమయిన మంగళం శాసనంలో కేవలం 56 అక్షరాలున్నాయి. క్రీ.శ. 2-4 వరకు ఉన్న శాసనాలలో కూడా ఎక్కువ, అంటే 65 అక్షరాలు ఉన్నాయి. ఆ కాలానికి తెలుగు-కన్నడ ప్రదేశాలలో బ్రాహ్మి శాసనాలు వెయ్యికి పైగా ఉన్నాయి. వాటిలో కోకొల్లలుగా తెలుగు-కన్నడ పదాలున్నాయి. అంతిమంగా తమది అంటూ ఒక లిపిని స్థిరీకరించుకొని తమిళులు పూర్తి శాసనాలను నిర్మించుకోవటం 8వ శతాబ్ది తర్వాతనే జరిగిందని శెట్టార్ అభిప్రాయం (పు.91.)
 ఇలాంటివన్నీ సక్రమమైన దారిలో నడవాలంటే ఎన్నో విషయాలను గురించి లోతైన పరిశోధన జరపాల్సి ఉంటుంది. ఆఫ్రికన్ భాషలకు ద్రావిడ భాషలకు ఉండే సంబంధాలను గురించి కొన్ని పరిశోధనలు జరిగాయి (ఉపాధ్యాయ దంపతుల ద్రవిడియన్ అండ్ నీగ్రో-అఫ్రికన్, 1983) . అలాగే సుమేరియన్ సంస్కృతికి, దక్షిణ భారతీయ సంస్కృతికి ఉండే సంబంధం కూడా ఎన్నో ఆలోచనలకు తావిస్తుంది. ప్రపంచంలోని ప్రాచీన భాషలలో మనం గమనిస్తున్న ద్రావిడ భాషా పదాలలో తెలుగు పదాలేవి అన్నదాన్ని గురించి ఆలోచించాల్సి ఉంది. సుమేరియన్ సంస్కృతిలో కనిపించే ఊరు, తెల్మన్, ఎంకిడు, నిప్పూరులాంటివి తెలుగు పదాలా అన్నది పరిశీలించవలసిందే.
 భాషాశాస్త్రవేత్తల ప్రకారం తెలుగు భాష 3000 సంవత్సరాలనుంచి ఉన్నదన్న మాటను ఒప్పుకోవలసిందే. అప్పటినుంచే పదాలు, వాక్యాలు, పాటలు, సామెతలు లాంటివి ఉండే ఉంటాయి. క్రీస్తు పూర్వం నుంచే తెలుగు మాటలు ఉన్నందుకు ప్రాకృత శాసనాలూ సంస్కృత శాసనాలూ సాక్ష్యం ఇస్తున్నాయి. ఈ శాసనాలలో ఉండే ఊర్ల పేర్లలో తాలవ్యీకరణం లాంటి ధ్వనుల మార్పులు తెలుగు చాలా కాలం క్రితమే స్వతంత్ర భాష అయిందని నిరూపిస్తున్నాయి. గాథాసప్తశతి లోని తెలుగు పదాలు క్రీస్తు శకారంభం నాటికే తెలుగు ప్రాకృత సాహిత్యం మీద చూపిన ప్రభావాన్ని విశదపరుస్తున్నాయి.
 తెలుగు భాషావికాసాన్ని అధ్యయనం చేసే వారికి అందులో ఒక క్రమం గోచరిస్తుందనటంలో సందేహం లేదు. చరిత్రకందని యుగాలలో తెలుగు భాష, నాట్యశాస్త్రం వంటి గ్రంథాలలో పేర్కొనబడిన ఆంధ్ర భాష, ప్రాకృత,సంస్కృత శాసనాలలో తెలుగు భాష, గాథాసప్తశతిలో తెలుగు పదాలు, ఆరవ శతాబ్ది నుంచి అవిచ్చిన్నంగా వెలువడిన తెలుగు గద్యపద్య శాసనాలు ఒక పద్ధతిలో వికాసం చెందిన తెలుగు భాషాస్వరూపాన్ని తెలియజేస్తున్నాయి. తమిళం, కన్నడం లాంటి భాషలతో పోల్చినప్పుడు కేవలం ఊహలతోనే భాషా వికాసాన్ని చూపించవలసిన అవసరం తెలుగు భాష విషయంలో లేదని స్పష్టమవుతుంది.
 కలమళ్ళ శాసనం, చిక్కుళ్ళ శాసనం మొదలయినవన్నీ ఆనాటి (5-6 శతాబ్దులనాటి) తెలుగు భాషా స్వరూపాన్ని తెలియజేస్తున్నాయి. కన్నడంలో దొరికిన మొదటి శాసనం అయిదవ శతాబ్దికి చెందిన హల్మిడి శాసనం. అయితే అందులో కన్నడ పదాలకంటే సంస్కృత పదాలే ఎక్కువగా ఉన్నాయి. అప్పటికి తమిళంలో శాసనమని చెప్పదగిందే లేదు. కాని తెలుగు శాసనాలు వరసగా తెలుగు పదాలతోనే వెలువడ్డాయి. తొమ్మిదవ శతాబ్ది నుంచి తెలుగులో పద్యశాసనాలు ఉన్నాయి. అందులోనూ తెలుగుకు విశిష్టమైన వడిప్రాసలతో ఈ పద్య శాసనాలు ఉండడం విశేషం. తెలుగు కావ్య రచన తనదైన పద్ధతిలో సాగుతూ ఉండిన విషయాన్ని ఈ శాసనాలు నిరూపిస్తున్నాయి. ఈ అన్ని విషయాలనూ ఇరుగు పొరుగు భాషలతోనూ సంస్కృతప్రాకృతాలతోనూ పోల్చి చూచినప్పుడే తెలుగు లోని విషయాలను విశదీకరించటానికి వీలుంటుంది.
ఉపయుక్త గ్రంథాలు, వ్యాసాలు
భద్రిరాజు కృష్ణమూర్తి (సం.), తెలుగు భాషాచరిత్ర, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి, హైదరాబాదు, 1974.
దివాకర్ల వేంకటావధాని, ప్రాఙ్నన్నయ యుగము, హైదరాబాదు, 1960.
S. శెట్టార్, శంగం తమిళగం మత్తు కన్నడ నాడు-నుడి, ఆరంభ కాలద ద్రావిడ సంబంధద చింతనె, అభినవ, బెంగళూరు, ఎనిమిదవ ముద్రణ, 2011.
ఆర్వీయస్ సుందరం, కన్నడ సాహిత్య చరిత్ర, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమి, హైదరాబాదు, 1977.
ఆర్వీయస్ సుందరం, ప్రాచీన భాషగా తెలుగు, నడుస్తున్న చరిత్ర, విజయవాడ, 2008.
S.K. Chatterji, Dravidian, Annamalai University, Annamalainagar, 1965.
Bh. Krishnamurty, XI All India Conference of Dravidian Linguists, Souvenir, Osmania University, Hyderabad, 1981.
U.P. Upadhyaya, S.P. Upadhyaya (Mrs), Dravidian and Negro-African, Rashtrakavi Govinda Pai Research Institute, Udupi, 1983.
 తమిళ ప్రచారాన్ని కాస్త పక్కన పెట్టి శాస్త్రీయంగా ఆలొచిస్తే శాసన భాష తర్వాతే కావ్య భాష. తమిళ లిపిలో వచ్చిన శాసనం 7 వ శతాబ్ది నాటిదని వారి ప్రభుత్వ సంస్థే తెలుపుతుంది (http://www.tnarch.gov.in/epi/ins2.htm)
తొల్కాప్పియం A. C. Burnell అభిప్రాయ పడినట్లుగా could not be dated to “much later than the eighth century”
ఈ మధ్య కాలంలో Herman Tieken (Kavya in South India : Old Tamil Chankam, 2001) అన్న డచ్చి పండితుడు గూబ గుయ్యిమనే ఒక సిద్ధాంతం ఒకటి ప్రతిపాదించాడు: అరవాన్ని అమరవాణి సంస్కృతానికి ధీటుగా నిలబెట్టడానికి- తొల్కాప్పియం /సంగం కాలాన్ని వెనక్కు నెట్టడం, పాండ్యుల (9 శ.) బృహత్ ప్రణాళిక లో భాగమే. తమిళాన్ని వెనక్కు నెట్టే ప్రయత్నాలకు చాల చరిత్ర ఉన్నది అని తెలుసుకోవడం మేలు.
 భాషా శాస్త్రాల్లో అభిరుచిగల సురేశం లాంటి వారు దీనిమీద సమీక్ష వ్యాసం వ్రాస్తారేమోనని ఎదురు చూశాను, చివరికి శెట్టార్ గారి పుస్తక ప్రస్తావన చదవగానే ఒళాందుని సిద్ధాంతం గుర్తుకొచ్చింది.
ఆంద్ర సాహిత్యం లో మనకు మొదట లభిస్తున్న కావ్యం నన్నయ గారి " ఆంద్ర మహా భారతం" అయినా, ఆయనకు ఒక శతాబ్దం ముందే మల్లియ రేచనుడు అనే కవి 'కవి జనాశ్రయము' అనే లక్షణ గ్రంధాన్ని తెలుగు లో రాసినాడు. కానీ అతని మాటల్లోని "తెలుగు" పదాన్ని సంశయించినారు మన కవిపుంగవులు. ఇంకా ప్రాచీనుడు ఉద్యోతనుడు, ఆయన ఆంద్ర ప్రసక్తి చేసినాడు తన రచనల్లో. ప్రాకృతం లో రాసిన ఆంధ్ర ప్రసక్తి ఉంది చూడండి.
"పియ మహిళా సంగామే సుందర గత్తేయ భోయణే రొద్దే,
అటుపుటు రటుం భణంతే ఆంధ్రే కుమారో సలోయేతి"
అంటే అర్ధం ఏమిటంటే.. పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి ఇలా చెప్పారు.
"అందగత్తెలన్నా...అధవా.. యుద్ధరంగామన్నా..సమానంగా ప్రేమించే వాళ్ళు, అందమైన శరీరాలు గల వాళ్ళూ.. తిండి లో దిట్టలూ... అయిన ఆంధ్రులు... అటూ పుటూ, రటూ, అనుకుంటూ వస్తూ ఉండగా చూసినాడు."
తొలి తెలుగు మాట?
మన అమరావతీ స్తూపం, చాలా ప్రాచీనమైనది. క్రీస్తు పూర్వం ౨౦౦ మొదలుకుని క్రీ.స. ౨౦౦ వరకూ అనేక దశలలో దాని నిర్మాణం సాగింది. ఇక్కడ దొరికిన ఒక రాతి పలక మీద "నాగబు" అనే మాట కనపడింది. దీన్ని వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఇది తెలుగు పదమని మొదటగా గుర్తించారు.ఇదే మనకు లభించిన మొదటి తెలుగు మాట. దాని అసలు సిసలు ద్రావిడ పదం "చెంబు" అంటారు.
ఈ విషయాలతో కూడా మరెన్నో వివరాలను తెలియజేస్తూ నా 'సరసరస' పుస్తకములో తెలుగు మరియు తెలుగు వారిని గూర్చి వ్యక్తపరచడమైనది.
స్వస్తి.











































No comments:

Post a Comment