Tuesday, 6 October 2015

పోతన జేసిన పరమేశ్వరుని వర్ణన

భాగవతము - అష్టమస్కందము - అధ్యాయము 7   
పోతన జేసిన పరమేశ్వరుని వర్ణన 
                
        భూతాత్మ! భూతేశ! భూతభావనరూప! దేవ! మహాదేవ! దేవవంద్య!
     యీ లోకములకెల్ల నీశ్వరుండవు నీవ బంధమోక్షములకుఁ బ్రభుఁడ వీవ
     యార్తశరణ్యుండవగు గురుండవు నిన్నుఁ గోరి భజింతురు కుశలమతులు
     సకల సృష్టి స్థితి సంహార కర్తవై బ్రహ్మ విష్ణు శివాఖ్యఁ బరఁగు దీవు
ఆ  పరమగుహ్యమైన బ్రహ్మంబు సదసత్తమంబు నీవ శక్తిమయుఁడ వీవ
     శబ్దయోని వీవ జగదంతరాత్మవు నీవ ప్రాణ మరయ నిఖిలమునకు. 222
క.  నీయంద సంభవించును
     నీయంద వసించి యుండు నిఖిలజగంబుల్‌
     నీయంద లయముఁ బొందును
     నీ యుదరము సర్వభూత నిలయము రుద్రా! 223
సీ. అగ్ని ముఖంబు, పరాపరాత్మక మాత్మ, కాలంబు గతి, రత్నగర్భ పదము,
    శ్వసనంబు నీయూర్పు, రసన జలేశుండు, దిశలు కర్ణంబులు, దివము నాభి,
    సూర్యుండు గన్నులు, శుక్లంబు సలిలంబు, జఠరంబు జలధులు, చదలు శిరము,
    సర్వౌషధులు రోమచయములు, శల్యంబు లద్రులు, మానస మమృతకరుఁడు,  
తే. ఛందములు ధాతువులు, ధర్మసమితి హృదయ, మాస్యపంచక ముపనిషదాహ్వయంబు
    లైన నీరూపు పరతత్త్వమై శివాఖ్యమై స్వయంజ్యోతియై యొప్పు నాద్యమగుచు. 224
క. కొందఱు కలఁడందురు నినుఁ
    గొందఱు లేఁడందు రతఁడు గుణి గాఁడనుచు\న్‌
    గొందఱు కలఁడని లేఁడని
   కొందల మందుదురు నిన్నుఁ గూర్చి మహేశా!

No comments:

Post a Comment