Monday, 26 June 2023

ఇది కథ కాదు వాస్తవికత

ఇది కథ కాదు వాస్తవికత

https://cherukuramamohan.blogspot.com/2023/06/l-6-71-73-1933-to-1948.html

అయం నిజః పరో వేతి గణనా లఘుచేతసామ్l

ఉదారచరితానాం తు వసుధైవ కుటుంబకమ్॥

(మహా ఉపనిషత్తు 6వ అధ్యాయము 71 - 73)

మహారాజా దిగ్విజయ్‌సింహ్ జీ రంజిత్‌సింహ్ జీ జడేజాను (1933 to 1948) నవనగర్‌కు చెందిన జామ్ సాహెబ్ అని పిలుస్తారు. దయార్ద్ర హృదయుడగు ఈ మహాపురుషుని గురించి మనము వినము పాఠ్యాంశముగా పొరబాటున కూడా చదువము. రెండవ ప్రపంచ యుద్ధములో పోలిష్ శరణార్ధు లగు తల్లులకు పిల్లలలకు,వారి కష్టములనును గురించి విని గుజరాత్‌లోని తన పాలనా పరిధిలోని ఒక ప్రాంతములో వారికి అన్నివిధములగు వసతులు కల్పించి వారిచే బాపూ అని పిలిపించుకొన అపర శిబి చక్రవర్తి.

మానవత్వం మరియు సర్వమానవ సహోదరత్వము పై ప్రపంచ విశ్వాసాన్ని కలిగించే ఈ వాస్తవ కథనాన్ని చూడండి.రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో పోలెండ్ పిల్లలను రక్షించడానికి కంకణము కట్టుకొన్న భారతీయ రాజు దీనికి ఉదాహరణ.

రెండవ ప్రపంచ యుద్ధము చిన్న చిన్నఐరోపా దేశాలకు వినాశ హేతువుగా పరిణమించినది. సెప్టెంబరు 1939లో హిట్లర్ బలగాలు పోలాండ్‌పై దాడి చేయడంతో దేశంలో లక్షలాది మంది పిల్లలు అనాథలుగా మిగిలిపోయినారు. ప్రమాదకరమైన పరిణామాలతో పోరాడుతూ, అనేక మంది మహిళలు మరియు పిల్లలు ఇతర ప్రదేశాలలో ఆశ్రయం పొందేందుకు ప్రభుత్వము యొక్క ఆజ్ఞ మేరకు దేశము వదిలి ఓడలో శరణార్థులై సాగినారు. కానీ అనేక దేశాలు వారిని అనాదరణకు గురిచేసి  వారిని నిస్సహాయంగా వదిలివేసినారు. చివరికి, మెక్సికో, న్యూజిలాండ్ మరియు భారతదేశము వంటి దేశాలు వారికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాయి

భారతదేశంలో, నవనగర్‌కు చెందిన మహారాజా దిగ్విజయ్‌సింహ్ జీ రంజిత్‌సింహ్ జీ జడేజా వారికి కారుణాకర హృదయుడై తన కారుణాకరమును అందించినాడు. శరణార్థులు బొంబాయి లో  అడుగుపెట్టినప్పుడు బ్రిటీష్ అధికారులు వారి ప్రవేశాన్ని తిరస్కరించ నిర్ణయించుకొని యుండినారు. ఆ శరణార్థుల  కష్టాలను చూసి, దిగ్విజయ సిమ్హులవారు  వారికి సహాయము చేయ కృతనిశ్చయులైనారు.కానీ బ్రిటీషు వారి పాలన కావున  ప్రతిఘటన ఎదుర్కొనవలసి వచ్చినది. అయినప్పటికీ, 'జామ్‌సాహెబ్' గారు వెనుకాడక అకుంఠిత దీక్షతో మొక్కవోని ధైర్యముతో బ్రిటీషు వారిని ఒప్పించి మెప్పించి  పోలిష్ శరణార్థులను తీసుకువెళుతున్న ఓడను రోసీ అనే ఓడరేవు వద్ద నిలపమని ఆదేశించినాడు.ఆయన  తన వేసవి రాజభవనానికి సమీపంలోని జామ్‌నగర్ జిల్లాలోని బాలచాడి అనే పట్టణంలో గుడారాలు వేయించినాడు. 'హోమ్ ఎవే ఫ్రమ్ హోమ్'గా పోలిష్ శరణార్థులకు వేరు దేశంలో ఉన్న భావన   రానీకుండా మహారాజా వారు చూసుకున్నారు. ఆయన  మొత్తం 640 మంది శరణార్థులకు సహాయం చేయటం జరిగింది. అందులో మహిళలు మరియు పిల్లలు ఉన్నారు. భోజన నిద్రా వసతులకు సంబందినంతవరకు  వారికి అవసరమైన వస్తువులను అన్నీ ఆయన సమకూర్చినారు.ఒకసారి బాలచాడి శిబిరంలో ఒక పోలిష్ శరణార్థి శిబిరంలో వండిన బచ్చలికూర  నచ్చలేదని మారాము  చేస్తే , శరణార్థులు అందరూ కలిసి సమ్మె చేయాలని నిర్ణయించుకున్నారు. వారంతా మహారాజావారిని బాపూ అని పిలిచేవారు.ఈ విషయం విని బాపు వెంటనే వంటవాళ్లను ఇకపై ఆ వంటకమును చేయవద్దని వంటవారికి ఆదేశమునిచ్చినాడు.

నేటికీ మహారాజు పెద్ద మనసును ఆ పోలిష్ శరణార్థులు, ఆ ప్రభుత్వానికి మరువలేనిది. 'సర్వైవర్స్ ఆఫ్ బాలచాడి' అనే బృందం అతన్ని ప్రేమమయుడైన 'బాపూ'గా  గుర్తుంచుకొనుటయేగాక  అంతటి ప్రపంచ యుద్ధ సమయములో తమ ప్రాణాలను కాపాడి అక్కున చేర్చుకొన్నందుకు  అతనికి ఎప్పటికీ ఋణపడి ఉండు విధముగా ఆ మహానుభావునికి నివాళిగా, వార్సాలోని ఒక చతురస్రానికి రాజు పేరు పెట్టారు. 2014లో 'స్క్వేర్ ఆఫ్ ది గుడ్ మహారాజా' అనే ప్రాంతంలో ఒక పార్క్ నిర్మించబడింది. ఈ రోజు కూడా స్థానికులు సందర్శించే అతని గౌరవార్థం ఒక స్మారక చిహ్నం నిర్మించబడింది.

స్వస్తి.


No comments:

Post a Comment