నా పుస్తకోద్ఘాటన సమావేశమున నా ప్రసంగము
ఇది 5 సంవత్సరముల
క్రితము జరిగిన నా పుస్తకముల ఆవిష్కరణ సభ. ఉద్దండులు ఆసనములనలంకరించిన సభ. కొందరు
ప్రముఖులు ఆత్మీయులు ఆరోగ్యము, వార్ధక్యము అడ్డుపెట్టుటచే
హైదరాబాద్ రాలేకపోయినారు. వారి ఆశీస్సులు అభినందనలను మాత్రము అందజేసినారు. నా
ఉపన్యాసములో వారందరినీ గూర్చి తగినమేరకు వ్రాసినాను. ఇందులో కొందరు మన మధ్యలేరు.
వారి ఆశీస్సులు అభిమానము నన్నంటుకొనియే ఉంటాయి. సమకాలీన విజ్ఞులను గూర్చి
తెలుసుకొంటారని, నా ఆశ. అందుకే నాటి విషయము నేడు తిరిగీ
మీముందు ఉంచుచున్నాను.
నా సమావేశ
ఉపన్యాస విన్యాసము
పుస్తకావిష్కరణ
సమయమున నాచే చేయబడిన ఉపన్యాసము:
నా పేరు రామ
మోహన్ రావు. మా తండ్రి నన్ను 'రాముడూ' అని పిలిచేవారు. ఆయన
పెద్దవాడు కావున DO అని శాసించేవాడు. నేను ఆ అవకాశమును
ఇప్పుడు పోగొట్టుకొన్నాను. కారణం ఆయన శివుని రాముని తలచి-తలచి , తన్మయుడై తపించి జపించి కైలాసము చేరినాడు.
దేవుని కలియుటకై. 'అమ్మ' లేని నన్ను
పెంచిన మా అమ్మమ్మ కూడా శివారాధన చేసి-చేసి శివ సాయుజ్యము చేరింది. ఇక ఇద్దరూ
అక్కడ వున్నపుడు, ఆ సాంబశివుని శిశువును మచ్చిక చేసుకొంటే
నన్ను శివునికి వారు మువ్వురూ కొంచెము 'Recommend' చేస్తారన్న
నమ్మకముతో మొదట ఆయనను ప్రార్థించి నా ఉపన్యాసమును ప్రారంభిస్తాను. తప్పక చెవులు
మూసుకొని శ్రద్ధగా వింటారని ఆశ.
మీ వంటి
సహృదయుల అభిమానమును తప్పించి జీవితములో నేను సాధించినది ఏమీ లేదు. సాధించినది లేదు
కాబట్టి నన్ను నేను దండగ రాముడు అని
అనుకొంటూవుంటాను. ఇక వినాయకునికి నా ప్రార్థన:
దండగ రాముడ
నీకై
దండల తగు
అండనివ్వు దాక్షిణ్య నిధీ
దండములు గూర్చి
దండిగ
దండగ
మెడవైతునేక దంతుడ నీకున్
శ్రీకరమౌ
కరమ్ము మది చింతలు బాపుచు సేద తీర్చుచున్
ఆకరమౌచు నాకవన
మమృత ప్రాయము గాగ ప్రణవమై
భీకర భావజాలముల
భీతిని బాపుచు మార్దవమ్ముగా
శ్రీకర
భావసంపదల సిద్ధిని గూర్చు గణేశు గొల్చెదన్
సభనలంకరించిన
విజ్ఞులకు, ప్రాజ్ఞులకు, ఉపజ్ఞులకు, సర్వజ్ఞులకు,
సంస్కార సంయుక్తులగు సదస్యులలోని సరస్వతీ మాతకు సవిధేయతా నమస్కారము.
ఒక కార్యక్రమము సక్రమముగా జరుగ వలెను అంటే అందుకు అత్యంత ప్రధానమగు ఉపాంగము వేదిక.
అది లేదంటే ఆవిష్కరణే లేదిక. కావున నా కృతజ్ఞత మొదట 'భారత్
వికాస్ పరిషత్' కు సమర్పించుకొంటాను. సంస్థకు ప్రాణము దానిని
నడిపే వ్యక్తులే. ఈ సంస్థకు ఇంతటి పేరు ప్రతిష్ఠ కూర్చిన శ్రీయుతులు సుబ్బారావు
గారు, హనుమంత రావు గారు, రాజేశ్వర రావు
గారు, ఇంకా ఎందఱో ప్రముఖులు, నాకు
పేర్లు గుర్తులేక తెలుపలేక పోతున్నాను, ఎన్నో సేవా కార్యక్రమములకు
తోడుగా ఈ సారస్వత వ్యాసంగమును కూడా పెట్టుకొని సమర్థవంతముగా సాగిస్తున్నారంటే
వీరపర భగీరతులు కాక వేరెవ్వరు. నన్ను అన్ని విధముల ఆదుకున్న, అట్టి సౌమనస్కులగు వారందరికీ నా సవినయ కృతజ్ఞతలు. ఇటువంటి వారి పరిచయము
కలుగుట నా అదృష్టము, కలిగించిన శ్రీయుతులు నాగేశ్వరరావు,
మూర్తి గార్లకు నా ఆశీస్సులు. నేను అను కదలలేని ఈ రథాన్ని కదిలించే
రెండు చక్రాలు వారిరువురు.
ఇక పుస్తకము
విషయమునకు వస్తే, కృతిని ఆర్యులు ‘కవన కన్య’ అంటారు. కన్యకకు నేను పితృత్వమును బడసిన తరువాత
తగిన సమయములో తగిన వరుని తప్పక చూడవలసినదే కదా! అసలు మానవుడు ఆశాజీవి. అందునా
తండ్రి తన కుమార్తెల మీద కొంచెము మమతానురాగములను ఎక్కువగా పెంచుకొంటాడు.
పుట్టబోయేది ‘కవన కన్యక’ అంటే కూతురే కాబట్టి పుట్టుటకు ముందే వరాన్వేషణ
ప్రారంభించినాను. శివుడు తగినవాడనిపించింది. ఎందుకంటే విష్ణువు వలె పట్టు
వస్త్రములు కోరడు, ఎగరడానికి ఏ విమానమో కదలడానికి ఖరీదయిన
కారో కోరడు. ఆయనకు ఎద్దు, ఆ ఎద్దుకు ఇంత మేత నీళ్ళు వుంటే
చాలు. ప్రేమగా దువ్వి ఎంత దూరమయినా ప్రయాణము సాగించుతాడు. మరి అల్లుని మర్యాదకు
పెట్టే ఖర్చు నాకు తగ్గిపోయినట్లే కదా! ఆయన నిత్య నిరంతర నిఖిలాత్మకుడు. అమేయుడు,
అజేయుడు, అజరామరుడు. అప్పుడు నా కూతురు కూడా
కలకాలము దీర్ఘుసుమంగళిగానే ఉండిపోతుంది కదా! ఆయన కాలకాలుడు. మరి తనతో ఉన్నవారికి
నాశము ఉండదు కదా! అందుకే ఆయనను నా కూతురికి భర్తగా ఒప్పించినాను.
ఇక
పెళ్లికుమార్తెను సర్వాంగ సుందరముగా తయారు చేయుటకు ‘Bridal Makeup’ అవసరము
కదా! అంటే Printing అని నా ఉద్దేశ్యము. దానికి ప్రత్యేకముగా
విశాఖపట్న వాస్తవ్యుడు శ్రీ ధర్మతేజ వెంకట్రావు ప్రత్యేకమగు శ్రద్ధ తీసుకొని అచ్చొత్తించి
సమయమునకు అందజేసినారు. ఆయనకు మిక్కిలి కృతజ్ఞుడను.
ఇక పెళ్లి
పెద్దలను గురించి చెప్పుకొనవలె. నేను ఇటీవల అరుణాచలేశుని దర్శనమునకు పోయినపుడు
ఆయనతో ‘స్వామీ మరి నీ పెళ్ళికి పెద్ద ఎవరని మొరపెట్టుకొన్నాను.’ అందుకు బదులుగా
ఆయన “మూర్ఖుడా! కంటి ముందే నా పేరు గలిగిన నీ గురువును
పెట్టుకొని కలియ జూస్తున్నావే కనిపించని వారి కోసం “ అన్నాడు. నా జ్ఞాననేత్రము
విప్పారింది. ఒక బరువు తీరింది. మరి ఈ పెళ్ళికి పురోహితుడెవరు అని అడిగినాను.
అందుకు స్వామి “ విద్వన్ మణి, అవధాన సహస్ర ఫణి, మాడుగుల నాగఫణి వుండగా చింత ఏల” అన్నాడు. ఆవిధముగా శర్మగారు కూడా
అమరినారు. మరి పెళ్ళిపెద్దలో, అవధానం నాగరాజ రావు, చొప్పకట్ల సత్యనారాయణ, చప్పిడి నీలకంఠా రెడ్డి ,
ఉన్నారు అని స్వామి అన్నారు. ఈ పెద్దల పేర్లకు ‘గారు’ ఎందుకు
చేర్చలేదంటే వారి పేర్లు తెలియజేస్తూ వుండేది శంకరుడు కదా! ఇక ప్రేక్షకులు అంటావా
నీ సభలో ఉండబోయేవారంతా నా గణములే! అన్నారు. నేను ఎంతో భాగ్యశాలిని, ఇంతటి ఉత్తమ ప్రేక్షకులు కలుగుట. ఎండాకాలము కాబట్టి మామిడి తోరణాలు కోయిల
సన్నాయి ప్రకృతే సమకూర్చింది. ఇక నాకేమి కొదవ.
ఇంకొక
ముఖ్యమయిన విషయము , అసలు వివాహము హిమాలయములలోనే జరుగుచున్నదా అన్నట్లు మన భారత్ వికాస్
పరిషత్తు సమకూర్చిన ఈ వాతానుకూల వేదిక (Air Conditioned hall) అతిధులకు ఆహ్లాదమును సమకూర్చుతుంది. ఆడపిల్ల పెళ్ళి కదా! అంతో ఇంతో ఎంతో
కొంత సహకరించుట ఉచితమని తలచి, ఈ పెళ్ళి ఖర్చునకు తమవంతు
ఆర్ధిక సహాయమును చేసిన వితరణ శీలులందరికీ మనఃపూర్వక నమస్కారము నాచరించుచున్నాను.
ఈ పెళ్ళి ఇంత
వైభవముగా జరుగుటకు దోహదపడిన ప్రముఖులకు పద్య రూపములో నా కృతజ్ఞతలు, వస్త్రమునకు
నూలుపోగులా, అగరు బత్తీకి వెదురు పుల్లలా, వెన్నిలా ఐస్క్రీముకు వేఫర్ కోనులా, TV బొమ్మకు cable
connection లా, నా కృతజ్ఞతలు చెప్పుకుంటాను.
1. Dr. శ్రీ
పి వి అరుణాచలం గారు
వీరికున్న
డిగ్రీలు వీరు నిర్వహించిన పదవులు గణితమునకు సంబంధించినవయితే ఆంధ్రమున వీరి
పాండిత్యము అపూర్వము. వారి బిరుదులూ, హోదాలు, పట్టాలు నేను
చదువబట్టితే సమయము అందుకే సరిపోతుంది. అందుకు ‘దాసరి తప్పు దండముతో సరి’ అన్నట్లు
వారికి నమస్కరించి నా ప్రసంగము కొనసాగించుతాను. మొన్న ఈ మధ్య ‘తెలుగు విశ్వ
విద్యాలయము వారు’ వీరిని సన్మానించుటయే ఇందుకు తార్కాణము.
కళ్ళు మసక
గొన్న, కంటియద్దమతడు
జ్ఞానవని యతండు జ్ఞాన ఖనియు
దారి గనని వాని
దైవమే యాతండు
గురుతునుంచుకొనుము గురువతండు
‘పి’
వివరమెరుగ ప్రొఫెసరు (S V University)
‘వి’
విషయము తెలుసుకొన్న వీసీయగు నీ (Dravidian University, Kuppam)
‘పీవీ’
ని ముందు గల్గిన
పీవీ
అరుణాచలార్యు ప్రీతిగ కొలుతున్
2. Dr. వల్లూరి
విశ్వేశ్వర సుబ్రహ్మణ్య శర్మ గారు
వీరు ఆది నుండి
తుది వరకు చదువులో అగ్ర తాంబూల గ్రహీత. దేశంలో సుప్రసిద్ధమైన భారతీయ విఙ్ఞాన్
సంస్థాన్ (Indian Institute Of Science)) విద్యుత్
తాంత్రిక విభాగమునుండి 1964, 1966, 1971 లో BE, ME,
PhDలు పొందినారు. 1967లో అక్కడే ఉపన్యాసకునిగా
చేరిన వీరు, 2006 లో కంప్యూటర్ సైన్సు మరియు ఆటోమేషన్
విభాగంలో ఆచార్యునిగా పదవీ నివృత్తి పొందినారు. 2012 వరకు
అక్కడే INAE Distinguished Professor గా ఉండినారు. ఎన్నో దేశ
విదేశ విశ్వ విద్యాలయములకు Visiting Professor గా వుండినారు.
సద్గురు శివానంద మూర్తిగారు స్థాపించిన సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్టు నుండి 2010
– విశిష్ట పౌర సన్మానాన్ని అందుకున్నారు. Indian Academy of
Science, Indian National Academy of Science మరియు Indian
Academy of Engineering లలో విశిష్ట సభ్యునిగా ఎన్నికైనారు. వారు
తెలుగు ఇంగ్లీషులలో చరిత్ర, తత్వ శాస్త్రము, సాహిత్య విషయాలపై వ్యాసరచనా వ్యాసంగమును సద్గురువు శివానంద మూర్తిగారి
కోరిక మేరకు చేబట్టి నిరాఘాటముగా నిరంతరాయముగా కొనసాగించుచున్నారు. నా మాట వీరిని
గూర్చి
సాంకేతికంబైన
చదువు నెవ్వరు సాటి
కలన విద్య యందు
గాంచ మేటి
ఆచార్య పదవికే
యాతడౌను కిరీటి
సందేహతప్తుని
సతత సురటి
సరస
గీర్వాణాంధ్ర సాహిత్య ఘనపాఠి
ధర్మ దర్శక
వితతి ధన్వి ధాటి
విజ్ఞాన
మధుపుష్ప విష్టపమ్మున తేటి
వసుధ
మేధావిగ్రావంపుకోటి
నాదు ప్రార్థన
మన్నించి నలువ రీతి
అట్టి
విద్వచ్ఛిరోమణి యాదరాన
వ్రాసె దనమాట, శివునాఙ్ఞ
వాటుగొనుచు
శంకరునిదాస
విరచిత శతకమునకు
౩. Dr. మాడుగుల నాగఫణి
శర్మ గారు
అజ్ఞాన
తిమిరాంధక ద్యుమణి నాగఫణి. ఈయన జగమెరిగిన బ్రాహ్మణుడు. ఆ స్వయంప్రకాశక మణికి జీరో
బల్బు అవసరమా! అయినా నా మాటగా ఒక మాట చెప్పుట నా బాధ్యత.
సంస్కృతాంధ్రమునందు
సవ్యసాచియతడు
దేవగురుని, ధాత్రి, దీటతండు
ప్రావాణి
మెడలోని ప్రాలంబ మాతండు
కచ్ఛ పీరవయుక్త కంఠుడతడు
పృచ్ఛక కల్హార
పృశ్నిపూషుడతండు
వైరి పండిత
దంతి వెట్టమతడు
శత
సహస్రవధానజగతి ప్రఖ్యాతుండు
మన తెల్గుగళసీమ
మణియతండు
మాడుగుల వంశ
మకుటాయమానమతడు
మంచియను
మాటకవనిలో మారతండు
గతము మరువక
దలపోయు ఘనుడతండు
నాగఫణి శర్మ
నామాన నెగడునతడు
4. వేదమూర్తులు
సామవేదం షణ్ముఖ శర్మ గారు
ఈయన విజ్ఞాన
ఖని, ప్రజ్ఞాధని,
సుజ్ఞాన సుమవని. ఈయనను గూర్చి నేను చెప్ప బూనటము శ్రీ గంధపు చెట్టు
నకు చందనము వ్రాయుటయే! బాధ్యత కాబట్టి ఒక మాట చెప్పక తప్పదు.
ఋషుల ఘనత దెల్ప
ఋషి పీఠమును నిల్పి
జనుల సేవ జేసె
జగతి మెచ్చ
అపర
షణ్ముఖుడతడన్యుండు కాదిల
మనకు మంచి పంచు
మార్గదర్శి
సామవేదమన్న
సామన్యుడామరి
సకల వేద మూర్తి
సత్వవర్తి
అట్టి వ్యక్తి
చిత్తమందున్న షణ్ముఖు
నర్చి
మ్రోక్కులిడుదు నాత్మ సాక్షి
5. Dr. వేటూరి
ఆనంద మూర్తి గారు
వీరు అన్నమయ్య
కృతులను వెలుగులోనికి తెచ్చుటయే గాక బహుళ పరిశోధనా గ్రంధములను వ్రాసి గొప్పగొప్ప
విషయముల వెలికి తెచ్చిన మహనీయులు, బ్ర.శ్రీ.వే. వేటూరి ప్రభాకరశాస్త్రి గారి కుమారులు. పద
కవితలపై doctorate పట్టా సాధించినారు. ఉస్మానియా విశ్వ
విద్యాలయమున Professor గా 35 సంవత్సరములు
పనిచేయుటయే కాక శ్రీలంక మొరీషియస్ విశ్వ విద్యాలయములకు పనిచేసి Cambridge
University visiting Professor గా కూడా వుండినారు.
క్రొత్త యన్న
చింత కొంతయైనను లేక
కావ్య
మెట్టిదన్న కలత లేక
కూర్చె తనదు
మాట కోరిన తడవుగా
అట్టి
విజ్ఞునతము నంజలింతు
ఆనంద మూర్తి
మనసది
ఆ నందన వనము, పలుకు, నాత్మీయతయున్
ఆనంద
బంధురములవి
ఆ నందకుమారు
పగిది యాతడు నాకున్
6. బ్ర||శ్రీ||వే|| చొప్పకట్ల
సత్యనారాయణ గారు
వీరు
సత్యసాయిబాబా గారి పరమ భక్తులు. వీరి రచనలన్నీ సాయి సంకీర్తనే. వీరు శ్రీ సత్యసాయి
గీతాంజలి (2 భాగములు) శ్రీ సత్యసాయి సంకీర్తనా త్రిశతి,
శ్రీ సత్యసాయి చరితము (2 భాగములు)
శ్రీసత్యసాయి భాగవత సత్కథామృతము (4 భాగములు) (చంపూ ప్రబంధము
-3419 గద్య పద్యములు) వ్రాసిన మేటి కవి
పండితులు. నాటి భారతి పత్రికకు ఎన్నో వ్యాసములు వ్రాసినవారు. విద్యా జ్యోతి అన్న
మాస పత్రికకు సంపాదకునిగా 2 సంవత్సరములు పని చేసినారు. ఆంధ్రప్రాచ్య
కళాశాలా ఉపన్యాసకులుగా 30 సంవత్సరములు
పనిజేసి ఇప్పుడు D.D. Colony లోని
తమ స్వగృహములో విశ్రాంతి తీసుకుంటూ వున్నారు.
సరసమైన రీతి
సాహితీ రసప్రీతి
పాప కార్య భీతి
బహుళ నీతి
సరకు గొనని
ఖ్యాతి షడ్వర్గపు అరాతి
చొప్పకట్ల
నియతి జయతిజయతి
7. Dr. నాగరాజారావు
గారు
నాగరాజారావు
గారు నాకు ఒక పెద్ద దిక్కు. ఆయనను ఎప్పుడు నాకు
అన్నగానే తలుస్తాను. ఆయన సహవాసము
బ్యాంకి ద్వారానే అయినా, ఆ తరువాత మాత్రము విడిపోని ముడియై
నిలిచినది.
శ్రీకృష్ణదేవరాయ
విశ్వవిద్యాలయములో Reader
గా పని చేసి ఇపుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. దత్త మండలమైన కడప
కర్నూలు అనంతపురము బళ్ళారి జిల్లాలకు ‘రాయలసీమ’ అన్న నామకరణము చేసిన మహనీయుడగు చిలుకూరి నారాయణ
రావు గారి పై పరిశోధన జరిపి Doctorate పొందినవారు.
రావా కల్గెను
నాకు కష్టమనగా రాకెట్ల నేనుందు నీ
రావాలేల యటంచు
తక్షణమునన్ రాగంబుయున్ దీక్ష పా
రావారంబుగ నొప్ప నాకు తగుసా
రంబైన సద్బోధతో
రావా! వత్తువు నీవు నాగ, మహ,రాజావధానంబుతో
8. శ్రీ
నీలకంఠారెడ్డి గారు
నీలకంఠారెడ్డి
నాకు నిజమైన తమ్ముడు. నిజమునకతడు నా బహిః ప్రాణము. అసలా శంకరుడే తన
అంశనీ నీలకంఠుని రూపములో పంపినాడని నా నిశ్చితాభిప్రాయము. ఏమి విజ్ఞత. ఎంత
సంస్కారము. ఆ నీలకంఠుడు దేవతల కష్టములను తీర్చ హాలాహలమును ఒక సారి మ్రింగితే తడవ
తడవకు నాకు సంభవించిన హాలాహల సాదృశ్య మైన కష్టములను
అణుమాత్రము కూడా సంశయించక ఆరగించి అరిగించుకున్నాడు. ఆతనికీ సంస్కారము
నిచ్చిన తల్లిదండ్రులకు, గురువు మరియు బిడ్డ నిచ్చిన మామయగు శ్రీ
శివశంకరరెడ్డి గారికి త్రికరణ శుద్ధిగా నమస్కరించుచున్నాను.
నిక్కమైన మనసు
నీటైన తలపులు
నింగి మీద బడ్డ
నిలచునట్టి
తపనయున్నవాడు తానాయె నాతోడు
నీలకంఠారెడ్డి
నిజముగాను
మనసు వాడి పోని
మల్లెల పూదండ
నిక్కమైన
రెడ్డి నిండుకుండ
ఆపదన్న వారి
కతడండయునుదండ
వైరి దయ్యములకు
వేపమండ
9. శ్రీ గొట్టిముక్కల సుబ్రహ్మణ్య
శాస్త్రి గారు
శ్రీ గొట్టిముక్కల సుబ్రహ్మణ్య
శాస్త్రి గారు నిజమునకు ఒక అరుదైన వ్యక్తి . వారి పరిచయ భాగ్యము నా పూర్వ జన్మ సుకృతము. ఆయన మహోన్నత
వ్యక్తి. వందకు పైచిలుకు కావ్యములు వ్రాసినా పేరుకు
ప్రాకులాడని మహా కవి, పండితుడు. వీరు విశ్రాంత ఆంధ్ర
పండితులుగా కర్నూలు జిల్లా నంద్యాల లో నివసించుచున్నారు. సాహితీ వాచస్పతి
మొవ్వ వృషాద్రిపతి వంటి లబ్ధప్రతిష్ఠులు శాస్త్రి గారిని
గూర్చి ‘ వీరు కవివతంసులు విపశ్చిదగ్రగణ్యులు అనుటలో సందేహము
లేదు అన్నారు.
ఈయన
సంస్కృతాంధ్రాంగ్ల కన్నడ భాషా ప్రవీణులు. ఈయన చేపట్టని
సాహిత్య ప్రక్రియ లేదు. ప్రసిద్ధ మాసపత్రిక
జ్యోతి కి ఒక నవలను వ్రాయుటయే కాక బుడ్డా వెంగలరెడ్డి గారి చరిత్ర పద్య కావ్యముగా
వ్రాసి రేనాటి ఋణము తీర్చుకున్నాడు. వీరికివే నా కృతజ్ఞతలు
మహనందీశ మహా
కృపాబ్ధిగతమౌ మాణిక్య మీరీతిగా
మహానీయంబగు
గొట్టిముక్కల మహా మన్యంపు వంశంబునన్
మహదానందము
గూర్చగా తెలుగుకున్ మహాత్మ్యమున్ చేర్చగా
మహ దేవాంకిత
సుబ్రహ్మణ్య కవిగా మాన్యుండు గల్గెన్ ధరన్.
10. Dr. కోడూరి
ప్రభాకర రెడ్డి గారు
పుస్తక రచన
సంపూర్ణమౌతూనే నేను మాటలాడిన మొదటి వ్యక్తి డా.ప్రభాకరరెడ్డి గారు. ఆయన
ప్రోద్దటూరి లో శిశు వైద్య నిపుణుడు. ఆయన సేద్యము, వైద్యము, పద్యము దేనిలోనైనా దిట్ట.
సేద్యములో
వైద్యములో
పద్యములో
గద్యములో
విజ్ఞతలో
విభవములో
లేడుసాటి
లేదుపోటి
‘కోమల
సాహితీ వల్లభ’ బిరుదాంకితుడు అనేకానేక పద్య, గద్య, నాటక రచయిత. వారు వ్రాసిన ‘రేనాటి పలుకుబళ్ళు’ అన్న కరదీపికతో రాయల సీమ
మారు మూలాలు కూడా సులభముగా చూడవచ్చును. ఇంత వైదుష్యమున్నా నేను వ్రాసిన శతకములో DTP
తప్పులు, వ్యాకరణ దోషములు సవరించి పంపిన వారి
అభిమానమునకు సర్వదా కృతజ్ఞుణ్ణి.
స్నిగ్ధ భావ కమలాలను
ముగ్ధ
మొహనముజేసే
కవితా సవితా మూర్తికి
కడు కోమల
హృదయానికి
సేద్య వైద్య
పద్య విద్య
చేయగలుగు
చేవగలుగు
ప్రతిభాకరుడౌ
శ్రీయుత
ప్రభాకరున
కిదేనా
సవినయంపు హృది
స్పందన
సారస్వత
అభినందన
కోమల సాహితీ
వల్లభ
కొనుము కడప
సుర్యపభ
చివరిగా ఒక్క
మాటతో నా ఉపన్యాస విన్యాసము నుండి సన్యాసమును గైకొనుచున్నాను. నేను కొన్ని పుస్తక
ఆవిష్కరణ సభలలో చూసిన ఒక ప్రత్యేక పాఠక వర్గమును గమనించిన తరువాత ఈ పద్యము
వ్రాసినాను. మేధో పటుత్వము,
ఆలోచనా సరళి, ఊహాలోకావలోకనము, పద సంపద, అన్నింటికీ మించి పాఠకాకర్షణా యోగ్యత కలిగిన మానసిక
సమతౌల్యము అవసరము వ్రాయసకానికి. సహాయ సహకారమునందించగల అంగ బలము అవసరము. ఇక మూడవది
అర్థము. అర్థము లేకుండా పనిని తలపెట్టుట వ్యర్థము. అందుకే ఈ మాట వ్రాసినాను.
చదివియు
పద్యమందుగల సాంద్రత గాంచగ లేని విజ్ఞునిన్
మొదలు తుదంట దా
చదివి మోదము తెల్పని బుద్ధిమంతునిన్
ఉదియగొనంగదా
కృతిని ఊరక పొందగా జూచు శ్రేష్ఠునిన్
కదియగ
వీరికిద్ధరను గానము వీరికి వీరె సాటియౌ
శ్రద్ధతో
వినిపింపజేసిన మీ సహనమునకు నమస్కరించుతూ ఇక ఈ ఉపన్యాస విన్యాసము నుండి సన్యాసము
స్వీకరించుతాను.
స్వస్తి.
No comments:
Post a Comment