Friday, 19 April 2019

పృథ్వీరాజ్ చౌహాన్

పృథ్వీ రాజ్ చౌహాన్
https://cherukuramamohan.blogspot.com/2019/04/blog-post_19.html
ప్రాయము మానవాళికగు ప్రాయికలక్షణమంచు నమ్ముచున్
న్యాయము దాన ధర్మములు నర్తిల రాజ్యమునందు నిత్యమున్
శ్రేయము కూర్చి తప్తులకు శీతల శీకరమై చెలంగుచున్   
కాయము మాయమౌ వరకు కాచిరి దేశము నాటి వల్లభుల్  
అట్టి ప్రజారంజకుల కోవకు చెందినవారే పృథ్వీరాజ్ చౌహాన్ మరియు జయచంద్ర ఘడ్వాల్. ప్రజల స్మృతిలో ఉన్న సమాచారం కావడంతో చారిత్రిక యాధార్థ్యం నిరూపణ అయినదని కాదు.
అంతమాత్రాన అన్నీ కల్పితాలుఅతిశయోక్తులు అనేందుకు వీలులేదు. ఇలాంటి కథల్లో చరిత్రకల్పనఅతిశయోక్తి వేర్వేరు పాళ్లలో కలగలిసిపోతూ ఆకర్షణీయమైన రూపాన్ని సంతరించుకుటాయి.
వీరత్వంధీరత్వం ఉన్నవారు ప్రేమకు బానిసలే. 12 వ శతాబ్దమునందు రాథోడ్ వంశీయుడగు జయచంద్రుడు కనౌజ్ (కాన్యకుబ్జ) రాజ్యమునుచౌహాణ (చౌహాన్) వంశొద్ధారకుడగు పృధివీరాజు డిల్లీరాజ్యమును పాలించు చుండిరి. ఇరువురూ అసామాన్య పరాక్రమవంతులు. ఇరువురిలో సంయుక్త జయచంద్రునకు గూతురునుపృథివీరాజునకు భార్యయు అయినది.
జయచంద్రునకు సంయుక్త యొక్కతయే కూతురగుట వలనజయచంద్రుడు సంయుక్త నెక్కువ గారాబముతో బెంచినాడు. రూప లావణ్య విద్యా వినయ సంయుక్త యగు సంయుక్తకు, యుక్తవయసు రాగానే  బిడ్డకు దగినవరు డెవరాయని జయచంద్రుడు చింతింపసాగినాడు. పుష్పగంధము వనమునకే పరిమితము కానట్లు సంయుక్త గుణగణములు లోకమంతటికీ వ్యాపింపగా,  పృథివీరాజు కూడా యామెను నెటులయిన జేపట్ట నిశ్చయించినాడు. సంయుక్తకూడా  అనేకపర్యాయములు పృథివీరాజు పరాక్రమమ రూపముల గూర్చి వినియున్నందువలన నాతనినే వరించెదనని మనంబున నిశ్చయించుకొనింది.
పృథ్వీరాజ్ చౌహాన్ (యీతడు నిజానికి పృథ్వీరాజు-3) (1168-1192 క్రీ.శ ) సోమేశ్వర చౌహాన్, రాణి కర్పూరాదేవిల కుమారుడు. పృథ్వీరాజ విజయ ప్రకారం పృథ్వీరాజ్ జ్యేష్ట ద్వాదశిన జన్మించినట్లు చెప్పబడింది. కానీ  పుట్టిన సంవత్సరాన్ని ప్రస్తావించలేదు. అయినాకూడా జన్మ సమయంలో జ్యోతిషశాస్త్ర అనుబంధ జాతకచక్ర ఆధారంగా దశరథ శర్మ అను ప్రఖ్యాత జ్యోతిషిపృథ్వీరాజు జనన కాలాన్ని గణించి ఆయన పృథ్వీరాజు పుట్టిన సంవత్సరం  విక్రమ సంవత్సరం 1223 (క్రీ.శ. 1166)   గా నిర్ణయించినాడు.
పృథ్వీరాజ్ రాసో 14 భాషలను నేర్చుకున్నాడని పృథ్వీరాజ విజయము 6 భాషలను చక్కగా ఎరిగినవాడని వివరిస్తున్నాయి. ఆయన 14 భాషలు నేర్చినాడన్న మాటను కొందరు చరిత్రకారులు అతిశయోక్తి అని అన్నట్లు పెద్దల ద్వారా విన్నాను. మరి అదే అతిశయోక్తి అయితే శ్రీమాన్ పుతపర్తి నారాయనాచార్యులవారు 14 భాషలలో పాండిత్యమును బడసినారన్నది. నేను ప్రత్యక్షముగా వారి ముఖతః విన్న విషయము. రష్యన్ కాన్సలేట్ జెనరల్ ఆయనను సన్మానింప పిలిచినప్పుడు అనర్గళముగా అయన గంట 30 నిముసములు రష్యన్ భాషలో అనర్గళలముగా మాట్లాడినట్లు ఆధారమున్నది. కావున మనకు తెలియపోతే ఇంకెవరికీ తెలియదు అన్న మాట భావ సంకుచితత్వాన్ని తెలుపుతుందేమో నన్న విషయమును గూర్చి ఆలోచింపవిజ్ఞులకే విడిచి పెడుతున్నాను.చరిత్రగణితముఆయుర్వేదముయుద్ధతంత్రము,
చిత్రకళతత్వశాస్త్రము (మీమాంస) వంటి అనేక విషయములలో అతను బాగా ప్రావీణ్యం పొందినాడని రాసోలో  తెలియజేసినాడు చంద్ర వరదాయి. పై రెండు రచనలూ ఆయన విలువిద్యలో ప్రత్యేకంగా నైపుణ్యం కలిగి యుండినాడని పేర్కొన్నాయి.
ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయమును గూర్చి చెప్పుకొనవలసియున్నది.జయపూర్ పట్టణమున ప్రసిద్ధ పత్రకారునిగాసాహిత్యకారునిగాచరిత్రకారునిగా ఖ్యాతిగాంచిన ఆనంద్ శర్మ గారుమన పూర్వ ఉపరాష్ట్రపతి భైరాన్ సింగ్ షెకావత్ గారికి తానువ్రాసిన 'అమృత్ పుత్రిఅన్న చారిత్రిక నవలను అంకితమిచ్చినపుడుతత్కారణములను వివరించుతూపుస్తకము యొక్క భూమిక యందు జయచంద్రుని గూర్చిన తన పరిశోధనలో  జయచంద్రుడు  దేశద్రోహమును చేసినట్లు ఒక సందర్భము కూడా తనకగుపించలేదన్నాడు. దీనికి కారణము, ఒకానొక సందర్భములో భైరాన్ సింగ్ షెకావత్ గారు ఆనంద్ శర్మ గారికి ఆయన నవల  'నరవద్ సుప్యావదేచదివిన తరువాత జయచంద్రుని గూర్చి మాట్లాడుతూజయచంద్రుడు మీరన్నట్లు దేశద్రోహి అయిఉండడు. మీరు పరిశోధన చేసి అభిప్రాయమును తెలుపండి అన్నాడట. షెకావత్ గారి మనస్తత్వము తెలిసినవాడగుటచే శర్మ గారు వారి మాటను శిరస్సున దాల్చి ఆదిశగా తన పరిశోధన మొదలు పెట్టినారట.
తన పరిశోధనా పరిశ్రమ ఎంత అకుంఠిత దీక్షతో చేసినా కూడా సంయుక్త ఆనవాలే ఆయన
పరిశోధనలలో దొరకలేదట. కావున సంయుక్త వారిరువురి వైరమునకు కారణము కాదు
అన్న నిర్ణయమునకు వచ్చినాడు. మరి వారి శత్రుత్వమునకు కారణము ఏమయి ఉండవచ్చు
అన్న తలంపు ఆయనను ఇంకా గాఢముగా పరిశోధనచేయ పురిగొల్పింది. ఆయనకు వారి
మనస్పర్ధకు కారణము భవిష్య పురాణములో దొరకినది. ఆ కథనము ఈ విధముగా వుంది.
మిగిలినది మరొకసారి........


ఆ కథనము ఈ విధముగా వుంది.

దిల్లీ రాజగు అనంగ పాలునికి ఇరువురు కుమార్తెలు. వారిలో 'చంద్రకాంతి' పెద్దది, 'కీర్తిమాలిని' చిన్నది. చంద్రకాంతి వివాహము కన్నౌజ్ రాజయిన దేవపాల్(విజయపాల్) తో జరిగింది. కీర్తిమాలిని వివాహము ఆజ్మేరు రాజగు సోమేశ్వరునితో జరిగింది. అజ్మేరు కన్నౌజ్ తో పోలిస్తే చిన్న రాజ్యము. ఇది ఇలాగా ఉంటే సోమేశ్వర కీర్తిమాలినులకు పృథ్వీరాజు తరువాత కొంతకాలానికి హరిరాజు జన్మించినారు. దిల్లీ రాజయిన అనంగపాలుడు పుత్రహీనుడగుటచే, పెద్ద కుమార్తె కుమారుడు పృథ్వీరాజుకన్నా పెద్దవాడు మరియు అజ్మేరుకన్నా విశాలసామ్రాజ్యము కలిగినవాడునగు జయచంద్రుని కోరుకొనక చిన్న కుమార్తె ద్వారా కలిగిన దౌహిత్రునే భావి దిల్లీకి భావి రాజుగా ఎంచుకొన్నాడు. ఇది జయచంద్ర పృథ్వీరాజు వైషమ్యములకు మూల కారణము. ఈ విషయము భవిష్య పురాణములో ఉన్నట్లు

ఆనంద్ శర్మ గారు చెప్పుట జరిగింది. కానీ మహమ్మదీయ రచయితలు మరియు పాశ్చాత్య కుహనా పండితులు వారి దేశీయ అనుచరులు, ఈ పురాణమున మున ఎన్నో ప్రక్షిప్తములను చేర్చి అపభ్రంశము చేసినారని మనకు తెలుసు. అల్లోపనిషత్తు, ఏసు, మహమ్మదు ప్రవక్తలను ఇందులో చేర్చడము ఇత్యాదులు ప్రక్షిప్తములే కదా!.

ఇదే కాకుండా అనంగపాలుని కుమార్తెలుగా చెప్పబడిన ‘చంద్రకాంతి’ ‘కీర్తిమాలిని’ అన్న పేర్లను దిగువ కనబరచిన పృథ్వీరాజు చరిత్రలలో ఎవరూ తెలియబరచలేదు. కొన్ని హిందీలోని చారిత్రిక గ్రంధములను పరిశీలించినతరువాత నా మనసుకు ఈ విధముగా తోచినది.

అపరాగంగాయ్ లేక అపర గాంగేయ గా ఉండవచ్చునేమో ,పృథ్వీరాజు -2, సోమేశ్వరుడు, ఈ మువ్వురు అర్ణోరాజ్ పుత్రులు. అపర గాంగేయ సింహాసనము కొరకు తన తండ్రిని సంహరిస్తాడు. కానీ పృథ్వీరాజ్ -2 అతనిని యమసదనమునకు అంపుతాడు. ఈ గృహ కలహములవల్ల సోమేశ్వరుడు తన తాత గారయిన సిద్ధరాజ్ వద్దనే గుజరాత్ లోనే ఉండిపొయినాడు. ఆయన వివాహము హేహయ వంశ కన్యక, చేది రాకుమారి యగు కర్పూరీ దేవితో తన తాత గారి ఇంట్లోనే జరిగింది.
పృథ్వీరాజ్-2 అజ్మేరు పై ముస్లిం దండయాత్రలను నిలువరించుతూ మరణించిన తరువాత సోమేశ్వరుడు అజ్మేర్ రాజవుతాడు. డిల్లీ అప్పటికే విగ్రహరాజ్ ఏలుబడిలో వుండినది కాబట్టి సోమేశ్వరుడు దిల్లీని కూడా తన ఏలుబడిలోనే ఉంచుకొంటాడు. (ఈ వాస్తవాన్ని నేటికికూడా ఫిరోజ్ షా కోట్లా లోని, అశోకుడు ఏర్పాటుచేసిన బ్బౌద ప్రతిమ పైభాగమున స్థంభముపై  చూడవచ్చును.) ఆవిద్ఫ్హముగా సోమేశ్వరుడు ఆయన తరువాత పృథ్వీరాజు దిల్లీ సింహాసనమునకు కూడా వారసులైనారు. కావున వీరు పుట్టుటకు ఎంతోకాలము పూర్వము రాజ్యము పోగొట్టుకొన్న అనంగపాలునికి సోమేశ్వర, పృథ్వీరాజులకు, ఎటువంటి సంబంధమూ లేదు. అంతేకాక జయచంద్రుడు, పృథ్వీరాజు విషయములో, పరస్పరము వైషమ్యము ఉన్నా, ఏనాడు గోరీని పృథ్వీరాజు పై దండెత్తుటకు ఆహ్వానించలేదు.  ఈవిషయములను స్పస్టముగా ఇతిహాసకారులైన రతన్ లాల్ వర్మ, అలీ హసన్ చౌహాన్(పాకిస్తానీయుడు), ఫరిస్తా, తజ్కాయీ నస్రీ మరియు జైన కవి నయన చంద్ సూరి, కాయం రాసో(పృథ్వీరాజు వంశజుడేకానీ ఇస్లాం పుచ్చుకొన్నాడు.) తమ రచనలలో పుష్టి చేసినారు.

తిరిగీ పృథ్వీరాజు విషయమునకు వస్తే, సోమేశ్వరుడు పృథ్వీరాజు 11 సంవత్సరముల బాలునిగా ఉండగానే తండ్రి మరణించుటచేత అజ్మేరు సింహాసనమును అధిష్ఠించినాడు. తల్లి కర్పూరీదేవి కొడుకునకు సామ్రాజ్య పాలనమున తోడుగా నిలిచి సమర్తవంతులు నమ్మకస్తులు అని తలచిన కైమాస్ మరియు కదంబవాస్ అన్న ఇరువురు మంత్రుల సహకారముతో రాజ్యమును పాలింపజేయ ప్రారంభించినది. పృథ్వీరాజు ఒక సంవత్సర కాలములో పాలనాదక్షతను అలవరచుకొన్నాడు. చంద్ర వరదాయి(ఈయనకు పృథ్వీ భట్ అన్న పేరు కూడా ఉన్నట్లు తెలియవస్తూవున్నది) అన్న కవి పృథ్వీరాజు కు సమవయస్కుడు మరియు ఆతని ప్రాణమిత్రుడు. పృథ్వీరాజ్ రాసో కావ్య రచయిత ఈయన. C.V. వైద్య, Dr. గోపీనాథ్ శర్మ, Dr. దశరథ్ శర్మ ఆదిగాగల చరిత్రకారులు పృథ్వీరాజ సంయుక్తల పరిణయమును చరిత్రలోని భాగముగా గుర్తించినారు.

తిరిగీ విషయానికి వస్తే, రాను రానూ తనపై కదంబవాస్ పెత్తనము ఎక్కువగుచున్నది మరియు పాలనా విషయమున  తాను స్వతంత్ర నిర్ణయము తీసుకొనుటకు అడ్డుతగులుచున్నాడని తలపోసి ఆతనిని నిర్మూలింపజేసినాడు పృథ్వీరాజని కొందరంటే యౌవ్వనములోనున్న ఆయన ఉంపుడుకత్తె క్రాంతి అన్న ఆమెను బలాత్కరించుట జూసి, (ఇది పృథ్వీరాజ్ రాసో లో చెప్పినమాట), పృథ్వీరాజ్ ప్రబంధము లో ప్రతాపసింహుడనువాడు పృథ్వీరాజును తరచుగా వచ్చుచున్న ముస్లిం దండయాత్రలకు కారణము కదంబవాస్ అని నమ్మించి ఆయనను చంపించినట్లు చెప్పబడింది. ఈవిధముగా పృథ్వీరాజు చరిత్రము ఎవరికి తోచిన విధముగా వారు వ్రాసి నిజమగు ఇతిహాసము మనకు అందకుండాజేసినారు. అయినా మన చేతనయినంతవరకూ తర్కమునుపయోగించి నిజము తెలుసుకొనే ప్రయత్నమూ చేద్దాము. మేరునగధీరుడైనట్టి పృథ్వీరాజు పై కథలను కల్పించి వాస్తవ చరిత్రను వక్రీకరించిన వక్ర బుద్ధులను మహానీయులని అనుటకు మాటలు వచ్చుట లేదు.
ఇక కాస్త రాణీ సంయుక్తను గూర్చి మరొక పర్యాయము తెలుసుకొందాము........
ఇక సంయుక్తను గూర్చి తెలుసుకొందాము. సంయుక్తను గూర్చి తెలుసుకొనే ముందు, పైన చెప్పుకొన్న విధముగా, జయచంద్ర పృథ్వీరాజుల బాంధవ్యము ప్రకారము సంయుక్త పృథ్వీరాజునకు వరుస ఎట్లవుతుంది అన్నది కాస్త విమర్శించుకొందాము. నిజానికి సంయుక్తకు  పృథ్వీరాజు చిన్నాన్న అవుతాడు. అటువంటప్పుడు పృథ్వీరాజు సంయుక్తకు హైందవ ధర్మములో వరుస కాడు. పైన మనము విశధముగా పృథ్వీరాజునకు జయచంద్రునకు కుటుంబపరమైన బంధుత్వము లేదని నిర్ణయించినాము. ఇరువురూ శౌర్యవంతులే ఆత్మా గౌరవము కలవారే! సామ్రాజ్య విస్తరణాభిలాష కలిగినవారే! అందుకే ఒకరంటే ఒకరికి న్స్దరిపోకుండా వున్దిపోయినారు.
మరి పృథ్వీరాజు గుణగణములు రూపలావణ్యములు సంయుక్తకు ఎట్లు తెలిసినది అనుటకు ఈ విషయమును గూర్చి నేను ‘దైనిక్ భాస్కర్’ అన్న హిందీ పత్రిక నుండి నేను తెలుసుకొన్నాను.(DAINIK BHASKAR . COM) యుక్త వయసుకు వచ్చిన రాకుమారికి, బహుశ రాజు ఆదేశముతో, రాజకుమారుల చిత్ర పటములు చూపుటకు పన్నారాయ్ అన్న ఒక చిత్రకారుడు వచ్చినాడు. రాకుమారి మందిరములో అందరికళ్ళూ పృథ్వీరాజు చిత్రము పైనే! మరి నవయౌవ్వనవతి యైన సంయుక్త మనసును వేరేవారికి అంకితము చేయగలదు. ప్రేమకు ఆవిధముగా అంకురార్పణము జరిగినది. అదేపని పన్నారాయ్ సంయుక్త ప్రతిరూపమును పృథ్వీరాజుకు చూపి అతనిలోకూడా ఆమెపై ప్రేమను అంకురింపజేసినాడు. ఇది ఇలా ఉండగా రాజసూయము చేయనెంచి దానితోబాటూ సంయుక్త స్వయంవరమును కూడా చాటించినాడు జయచంద్రుడు. ఆరోజు రానే వచ్చింది. పృథ్వీరాజుకు ఆహ్వానము పంపనందున ఆయన రాలేదు. కానీ సభాద్వారమువద్ద ఆయన మూర్తిని ద్వారపాలకునివలె ఏర్పాటు చేయించినాడు. త్రికరణ శుద్ధితో పృథ్వీరాజును ప్రేమించిన సంయుక్త ఆ మూర్తి మెడలోనే మాల వేసినది. ఆక్షణమే అచటికి వచ్చిన పృథ్వీరాజు సంయుక్తను అందుకొని గుర్రముపై గూర్చుండ బెట్టుకొని తన రాజధానివైపు దౌడు తీసినాడు జయచంద్రుని సైన్యమునకు అందకుండా! ఆ తరువాత జయచంద్రుడు మహమ్మద్ గోరీ సహాయముతో యుద్దముచేసి పృథ్వీరాజును బంధించి కన్నులుపీకించి చెరలో బంధించగా ఆతడు తన మిత్రుడు చంద్ర వరదాయీ సాయముతో శబ్దవేది విద్యతో ఘోరీని చంపినట్లు చెప్పబడినది. ఇది ‘దైనిక్ భాస్కర్’ లో తెలిపిన మాట. మొత్తమునంతా వాస్తవముగా గైకొనుటకు నా తర్కము అంగీకరించలేదు. అందుచేత నా ఆతురత సహాయముతో అడుగు ముందుకు వేసినాను.
నా ఉత్సుకత నన్ను తర్కమునకు దగ్గరగా వున్న ఈ విషయము వద్దకు చేర్చినది.
జయచంద్రుడు అవమానమును సహింపజాలక కోపావేశపరవశుడై కుమార్తెను కారాగారామున యుంచమని యాజ్ఞాపించినాడు. రాజులందరు నిరాశనుబొంది తమతమ నగరములకు వెడలిపోయినారు. దీనిని యీ దేశమున జరిగిన కడపటి స్వయంవరముగా చెప్పుకొంటారు.
ఈ సంగతి యంతయు విని, పృథివీరాజు సంయుక్తకు తనపై గల ప్రేమకు  పరమానంద భరితుడయ్యెను. జయచంద్రుడు తనకు చేసిన అవమానముమరియు సంయుక్తకు తనయందు గల ప్రేమ త్వరపెట్ట పృథివీరాజు జయచంద్రునిపై యుద్ధయాత్ర వెడలెను. ఇట్లాయన శూరులగు యోధులతో కనోజ్ పట్టణము సమీపమున విడిదిచేసెను. అచటనున్న కాలముననే యొక రాత్రి మిగుల రహస్యముగా పృథివీరాజు సంయుక్తను గలిసి గాంధర్వ విధిచే నామెను వివాహమాడినాడు.
వీరి వివాహవార్త యొకరిద్దరు దాసీలకు దప్ప నితరుల కెంతమాత్రము దెలియదు, పృథివీరాజు వచ్చి తన నగరము పొలిమేరల బైట విడిడి చేసియుండుట విని యాతనినిబట్టి తెండని జయచంద్రుడు మూడువేల సైన్యము నంపెను. కహరకంఠీరుడను వాని నేతృత్వమున  శత్రుసైన్యములు తమవైపునకు వచ్చుట గని పృథ్వీరాజును వారితోబోరుటకు సిద్ధముగా నుండెను. తదనంతర మారెండుసైన్యంబు లొండొంటిందాకి మిగుల ఘోరంబుగా బోరసాగెను. అందు పృథివీరాజు సేనానియగు ఆతతాయికిని, జయచంద్రుని సైన్యాధిపతియగు కహరకంఠీరునకును ద్వంద్వయుద్ధము జరుగజొచ్చెను. అట్టి సమయమున కహరకంఠీరుడు రెట్టించిన రోషముతో ఆతతాయిని తన ఖడ్గమునకు బలియిచ్చి పృథివీరాజు కంఠము తెగవేయ నుంకించెను. అట్టి సమయమున ఆకస్మికముగా నొక వీరుని  కరవాలము పృథివీరాజు కంఠముపైబడనున్న ఖడ్గమును దునియలుచేసి కరకంఠీరుని దునిమెను. పృథివీరాజును ఆవిధముగా కాపాడినది వేరెవరోకాదు ఆతని పత్ని సంయుక్తయే! ఆమె తన భర్తను చేరి యాతనితో వెళ్ళవలయునని బహు ప్రయాసతో గారాగృహము నుండి తప్పించుకొని యుద్ధప్రాంతమునస్కు వచ్చి పృథ్వీరాజును వెన్నంటియుండెను. ఖడ్గాచాలనమును బాల్యముననే అభ్యసించిన సంయుక్త తన విద్యను ప్రదర్శించి  యుద్ధముచేసి తన భర్తప్రాణముల గాపాడగలిగింది. ఇక యుద్ధము చేయనవసరము కనిపించని పృథ్వీరాజు సంయుక్తా సంయుక్తుడై తన రాజధానిని చేరుకొన్నాడు. 
వచ్చేసారి గోరీని గూర్చి తెలుసుకొందాము..........
పృథ్వీరాజ్ చౌహాన్ --
 ఇక గోరీని గూర్చి......
ఇక షహబుద్దీన్ గోరీ లేక మహమ్మద్ గోరీని (వ్యాసములో ఇకపై గోరీ అని వ్రాస్తాను)  గూర్చి కొంత తెలుసుకొందాము. గోరీ, గజనీ సామ్రాజ్యములోని గోర్ ప్రాంతపు శాసకుడు.(1173-1206 క్రీ.శ.) మన దేశ సంపద కొల్లగొట్టుటయేగాక ఇచట ముస్లీం సామ్రాజ్యమును స్థాపించవలెనన్నది అతని సునిశ్చితాశయము. అందుకు గానూ తనతమ్ముడు ఘియాజుద్దీన్ గోరీకి పరిపాలనను అప్పజెప్పి తన యుద్ధపిపాస తీర్చుకొన దలచినాడు. ఆ తపనతో  క్రీ.శ. 1178 లో రెండవ భీమ చాళుక్యునిపై యుద్ధము ప్రకటించి పరాజితుడై వెనుదిరిగినాడు. కాల క్రమమున పశ్చిమ పంజాబువరకు ఉత్తరమున సింద్ మరియు ముల్తాన్ వరకు గోరీ పాలన లోనికి వచ్చినది. క్రీ.శ.1181 లో సియాల్ కోట్ కట్టించినాడు. లాహోర్ ను క్రీ.శ.1186 లో మాలిక్ ఖుస్రో ను జయించి ఆ కోటను హస్తగతము చేసుకొన్నాడు.

పైన తెలిపిన అదే భీమచాళుక్యుడు-2 పృథ్వీరాజుతో యుద్ధము చేసి  సంధి చేసుకొన్నాడు. ఈ విషయము ఖరతర గచ్ఛ పట్టాలి అన్న కావ్యములో ఈ విధముగా వున్నది. ‘చాళుక్య భీముడు-2 కు పృథ్వీరాజు -3 కు  క్రీ.శ. 1184 - 87 మధ్యన జరిగిన యుద్ధములో పృథ్వీరాజు భీముని ఓడించుటచే, భీమునిమహాఁమంత్రి జగదేవ్ ప్రతీహార్ ఎంతో ప్రయాసతో ఇరువురికీ షరతులతో కూడిన సంధి కుదిర్చినాడు. ‘పృథ్వీరాజ్ రాసో’ లో భీముని పృథ్వీరాజు చంపినట్లు ఉన్నది కానీ ఇది ప్రక్షిప్తమై ఉండనోపును. అదేవిధముగా పృథ్వీరాజు భండాణకులను నాగులను చందేల్ రాజులను ఓడించి తన రాజ్యమును గుజరాత్ వరకు విస్తరించినాడు. కన్నౌజ్ కు చెందిన జయచంద్ర ఘడ్వాల్ తో బహుశ మామయైన కారణముతో నేమో యుద్ధము చేయలేదు. కానీ వారి నడుమ సత్సంబంధము లేవీ చదువుటకు దొరుకలేదు.
గోరీ తన రాజ్య కాంక్ష మరియు భారతీయ సంపదలపై వెర్రి వ్యామోహమును ఏర్పరచుకొన్న గోరీ ఎన్నో మార్లు తన సరిహద్దులకావలనున్న హిందూ రాజ్యములపై దండయాత్ర సలిపినాడు. వానిలో దిల్లీ ముఖ్యమైనది. అతను దండయాత్ర చేసినపుడల్లా దేశమును మిగుల నాశనము చేసినాడు. అనేక దేవాలయముల బడగొట్టియు, సాదుజనుల నన్యాయంబుగా జంపియు, స్త్రీల పాతివ్రత్యంబుల జెరిచియు, అటు ఆడువారిని ఇటు మగవారిని  అదిరించి బెదిరించి మతమార్పిడులు చేసియు, మహాకౄరుడై మెలగెను. కాన వాని నోడించి పతివ్రతల పాతివ్రత్యమును, మఠమందిరములను గాపాడనెంచి పృథివీరాజు గోరీని శిక్షింప వెడలెను. పృథ్వీరాజు ఎవరినీ యుద్ధము కొరకు ఏవిధమైన సహాయమూ అడిగినట్లు కావ్యములలో గానరాదు. కోపమే ప్రధానముగా గల జయచంద్రుడు దేశక్షేమముగోరి పృథివీరాజునకు దోడుపడకున్నను, గోరికి సాహాయము చేయక తటస్థముగా నుండిపోయెను.
ఈ దండయాత్రల గూర్చి పృథ్వీరాజును గూర్చి వ్రాసిన ఒక్కొక్క కావ్యము ఒక్కొక్క విధముగా తెల్పినది. ఆవిషయమును ఈ దిగువన గమనించగలరు.
కావ్యము పేరు ----------రచయిత-----------గోరీ దండయాత్రల సంఖ్య
పృథ్వీరాజ్ రాసో ------చంద్ర వరదాయి -------------21 మార్లు
సుర్జన్ చరిత్ర ---------చంద్రశేఖర్------------------21 మార్లు
హామీర్ మహాకావ్యము-----నయన చంద్ర సూరి---------7 మార్లు
ప్రబంధ కోశము---------రాజశేఖర్----------------20 మార్లు
ప్రబంధ చింతామణి-------ఆచార్య మేరుతుంగ-------- 23 మార్లు
ఒక్క సర్జన్ చరిత్ర మాత్రము రాసో తో ఎకీభవించుచున్నది.
ఇంకా కొన్ని కావ్యములు కూడా ఈ విషయమై వివిధ అభిప్రాయములను ప్రకటించినా అందరి ఒప్పు దలనూ పొందినవి రెండు యుద్ధములు. అవి స్థానేశ్వరమునకు చేరువలో ఉన్న తరాయిన్ యుద్ధములు.
మొదటి తరాయిన్ లేక తారావాడీ యుద్ధము --- క్రీ.శ. 1191
రెండవ తరాయిన్ లేక తారావాడీ యుద్ధము --- క్రీ.శ. 1192
మిగతవి కేవలము సరిహద్దు తగాదాలుగా ప్రముఖ చరిత్రకారులచే భావింపబడినవి. క్రీ.శ. 1191 లో జరిగిన యుద్ధములో పృథ్వీరాజు సేనానాయకుడు గోవిందరాజ్ తో తలపదినపుడు గోరీ విసరిన బల్లెము తగిలి ఆయన ముందరి పళ్ళు రెండు ఊడినాయట. కృద్ధుడైన గోవిందరాజ్ విసిరిన బల్లెము గోరీకి కడుపు పై భాగములో పెద్దగాయము అయినదట. అప్పటికే విపరీతమైన సైన్యనష్టము కలిగిన గోరీ పలాయన మంత్రము పఠించినాడట. మొదటి తరాయన్ యుద్ధము ఆవిధముగా ముగిసింది.
అవమాన దావానల తప్తుడగు గోరీ ఓటమిని అరిగించుకోలేక సంవత్సరము ముగిసీ ముగియగనే 1192 లో ఒక లక్షా ఇరవై వేల సైన్యముతో తిరిగీ పృథ్వీరాజు పై దండెత్తినాడట. ఈ పర్యాయము పోయిన యుద్ధము వలె గాక ముందు పృథ్వీరాజు శత్రువుల వివరములు సేకరించి వారికి తన వైపు నుండి లేఖలను పంపినాడు. జయచంద్రునికి పంపినా తటస్తముగానే ఉండిపోయినాడు కానీ మాత్సర్య మత్తులైన ఇతర, పృథ్వీరాజుకు, సామంత రాజులు గోరీతో చేతులు కలిపినారు.
బలము కూడినదని గ్రహించి లాహోరు చేరుతూనే  పృథ్వీరాజుకు గోరీ ‘ఇస్లాం స్వీకరించి లొంగిపోతావా లేక యుద్ధమునకు సిద్ధమౌతావా?’ అని. అందుకు పృథ్వీరాజు ‘ఎల్లలు దాటి పోతే సరి లేకుంటే మనకలయిక రణరంగములోనే’ అని ప్రత్యుత్తరము పంపినాడు. దీనితో గోరీ తన యుద్ధప్రణాలిక మార్చుకొన్నాడు. పృథ్వీరాజు లేఖకు బదులుగా ‘యుద్ధము ఇద్దరికీ నష్టము కావున సందిచేసుకొందాము. నేను క్రొత్తగా  జయించిన పంజాబ్ ముల్తాన్, సర్ హింద్ లతో సరిపుచ్చుకుంటాను. కానీ ఈ విషయమును గజనీని ఏలుచున్న నా తమ్మునికి తెలియజేసి తన నుండి వర్తమానము అందిన వెంటనే వెనుదిరిగి పోతానన్నాడు. ఈ విషయములను హసన్ నిజామీ వ్రాసిన తాజ్-ఉల్-మాసిర్ లో చూడవచ్చు.

దీనిని గుడ్డిగా నమ్మడమే పృథ్వీరాజు చేసిన పెద్ద తప్పు. దానికి తోడుగా పృథ్వీరాజు 23, 24 సంవత్సరముల నిండు యౌవ్వనము, ఆక్రోశము, పౌరుషము కట్టలు తెంచుకొని దేహము నిండిపోగా తనపై నమ్మకమును ఉంచుకొనుట తప్ప మంత్రాంగమునకుగానీ ఆలోచనకు గానీ తావునివ్వలేదు. ఇరుగుపొరుగు రాజ్కులను గానీ తనతో కలుపుకొనలేదు. గోరీ తానాశించిన విధముగా తన మిత్రరాజ్యములనుండి జవాబు అందిన పిదప పృథ్వీరాజు పై దండెత్తి ఆతనిని చక్రబంధములో బంధించినాడు. ఎంతపోరినా శత్రుబలాలు శక్తికి మించినపుడు వేరుమార్గములేక ఏనుగును దిగి గుర్రమునెక్కి పారిపోవు చుండాగా సిర్సా వద్ద ఆ మహావీరుని చంపినట్లు హసన్ నిజామీ వ్రాసినాడు. ఆయన పృథ్వీరాజ్ కాలమునాటి వాడు కాదు. అందుచేత ఇదే వాస్తవమని మనము తలువనక్కరలేదు.
పృథ్వీరాజు మరణమును గూర్చి, ఆయన చరిత్రను వ్రాసిన ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా వ్రాసినారు. ఆ వివరములు చూసిన తరువాత ఒక నిర్ణయానికి వద్దాము.
పృథ్వీరాజు మరణించిన పిదప కూడా గోరీ జీవించియుండినాడు. అతను క్రీ.శ. 1206 లో చనిపోయినాడు.
ఇక పృథ్వీరాజు మరణమును గూర్చి ఏ ఏ రచయిత ఏమన్నాడో కాస్త వివవివరాలలోకి పోదాము.
ఆ వివరములు వేరొకమారు తెలుసుకొందాము......

పృథ్వీరాజ్ చౌహాన్ – 5
 హసన్ నిజామీ తప్ప తక్కిన రచయితలు గోరీ పృథ్వీరాజును బంధించినట్లు, గుడ్లు పీకించినట్లు ఆతరువాత కొంత కాలమునకు చంపినట్లు వ్రాసినారు. కానీ ఏవిధముగా, ఏపరిస్థితులలో అన్నది వ్రాయుటలో ఐక్యత లేదు. చంద్ర వరదాయి పృథ్వీరాజుకు సమకాలీనుడు మరియు ప్రాణస్నేహితుడు. కానీ నేటి చరిత్రకారులు ఆయన రచనను పృథ్వీరాజు జీవితమునకు సాక్షిగా తీసుకోలేదు. మరి అందులో తీసుకోనవలసినది అసలేమీ లేదా అన్నది చివరిగా విశ్లేషించుకొందాము.
హమ్మీర్ మహాకావ్యములో నయన చంద్ర సూరి పృథ్వీరాజును కారాగారములో బంధించి ఆ తరువాత ఆయనను హత్య చేసినట్లు వ్రాసినాడు. ప్రబల శత్రువు చేతికే చిక్కినపుడు వెంటనే చంపక వేరేపుడో చంప పనియేమి?
లక్ష్మీధరుడు వ్రాసిన ‘విరుద్ధ విధి విధ్వంసము’ ప్రకారము పృథ్వీరాజు గోరీ తో యుద్ధములోనే మరణించినాడు. ఇంకొక కావ్యము ముని జనవిజయ్ అను వ్యక్తికి భారతీయ విద్యాభవన్ ముంబాయి (జైన పుస్తక భాండాగారము) లో లభించిన ‘పురాతన ప్రబంధ సంగ్రహ్’ లోని పృథ్వీరాజ్ ప్రబంధ్’ లో ఘోరీ పృథ్వీరాజును ఖైదు చేసి కళ్ళు పీకించి , అతని రాజధానియైన ఆజ్మేరులోనే చెరలో బంధించి, సభ జరుగు సమయమున గతములో తాను కూర్చున్న సింహాసనముపై గోరీ కూర్చొని సభాసదులకు ఆజ్ఞల నొసంగుట చూచి సహించలేక తన పూర్వ మంత్రి ప్రతాప్ సింగ్ అనువానితో ధనుర్బాణములను తెప్పించుకొని సముచిత సమయము కొరకై ఎదురుచూస్తూ వుండినాడట. కానీ ఆ ద్రోహి ఆ విషయమును గోరీతో చెప్పుటచే, గోరీ పృథ్వీరాజును ఒక కందకము త్రవ్వించి ప్రుత్వీరాజును అందులో త్రోసి పైన నుండి కొండరాల్లను త్రోయించి సంహరించినాడట. గోపీనాథ్ శర్మ అన్న ప్రసిద్ధ చరిత్రకారుడు తన రాజస్థాన్ క ఇతిహాస్ లో హసన్ నిజామీ (కుతుబుద్దీన్ వద్ద ఆస్తాన పండితునిగా కూడా ఉండినాడు, పృథ్వీరాజు మరణించిన తరువాతి కాలము అంటే 12-13 శతాబ్ద  సంధి ) వ్రాసిన తాజుల్ మాసిర్ లో గోరీ ప్రుత్వీరాజును చెరలో బంధించి తరువాత చంపినట్లు వ్రాసిన విషయమును గ్రహించినాడు. ఈయన పృథ్వీరాజ్ ప్రబంధ్ ను కూడా తన పరిశోధనకు వాడుకొన్నాడు. ఈ విధముగా ఒక్కొక్క కావ్యములో ఒక్కొక్కరీతిగా ఉండుటచే వాస్తవికతను గ్రహించుట జటిలమై పోయినది.
     ఇక ఇపుడు ‘పృథ్వీరాజ్ రాసో’ లో చంద్ర వరదాయి పృథ్వీరాజు మరణమును గూర్చి ఏమి తెలిపినాడో, అతనికీ పృథ్వీరాజుకు గల సంబంధము ఇత్యాది విషయములను పరిశీలించుదాము.
ఈ గ్రంధము నిజామునకు వాసిలోనూ రాశిలోనూ చాలపెద్దది. ఈ రోజు ఇదే పుస్తకము, బృహత్, లఘు, లఘుతర రీతులలో మూడు భిన్న పుస్తకములుగా కన్పట్టుచున్నది. ఈ మూడింటిలోనూ సమానత చాలా అంశములలో లేదు. ఒక్క పృథ్వీరాజు మరణ విషయములో మాత్రము అభేదముగా కన్పట్టుచున్నది. దీనిని బట్టి మొదట వ్రాసిన కావ్యములో అనేక ప్రక్షిప్తములు చోటు చేసుకొన్నట్లు మనకు తెలియవస్తూవున్నది.
ఇక అసలు విషయమునకు వస్తే చంద్ర వరదాయి పృథ్వీరాజుకు బాల్య స్నేహితుడు, అత్యంత ఆప్తుడు ప్రాణసమానుడు గొప్ప విద్వాంసుడు మహాకవి. కవి కావున జరిగిన సంఘటనలకు అలంకారములు అక్కడక్కడ అతిశ్యోక్తులను కూడా అద్ది అతి రమ్యమగు కావ్యమును మనకొసంగినాడు. ఈయన కుమారుడు జల్హణుడు. ‘పృథ్వీరాజ్ రాసో’ ప్రకారము పృథ్వీరాజు రెండవ తరాయిన్ (క్రీ.శ.1192) యూద్ధములో ఓడిపోయిన పిదప తన ఘనతను చాటుకొనుటకు, ఆయనను బంధించి గజినీ తీసుకొని పోయినాడు గోరీ. ఆయనను గుడ్డివానిని చేసి చెరలో బంధించియుంచినాడు. విషయము తెలిసిన వరదాయి సమయము కొరకు వేచియుండి, సరయిన సమయము వచ్చినంతనే, తన కుమారుని చేతికి తాను వ్రాయుచుండిన  ‘పృథ్వీరాజ్ రాసో’ కావ్యమునిచ్చి తన తదనంతరము జరిగిన విషయములతో పూరించమని చెప్పినాడు. ఇందుకు సంబంధించిన, ఆయన వ్రాసిన త్రిపద ( మనకు పద్యము వంటిది) ఈ విధముగా వుంది.
పుస్తక్ జల్హణ హత్థ దై చలి గజ్జన్ నృపకాజ్l
రఘునాథన చరిత హనుమంతకృత్ భూప భోజ ఉద్ధరియ జిమిl
పృథిరాజసుజస్ కవి చంద కృత చంద నంద ఉద్ధరియ తిమి ll
పైపద్య భావము ఈ విధముగా చెప్పుకొనవచ్చును. పుస్తకమును కుమారుడగు జల్హణుని చేతికిచ్చి, నేను రాచకార్యము మీద గజినీ వెళ్ళుచున్నాను. శ్రీరామచంద్రుని చరిత్ర హనుమంతుడు వ్రాసిన రీతి నేను నా ప్రభువగు పృథ్వీరాజు చరిత్ర వ్రాయుచూ దీనిని పూరించే బసధ్యత నీకొసగుచున్నాను అన్నాడు.
ఒక్కడే పోదు కాబట్టి వెంట ఒక నమ్మకస్తుడగు అనుచరుని తొడుకొని పోయివుంటాడు. అక్కడికి వెళ్ళిన తరువాత గోరీ నమ్మకము సంపాదించి, పృథ్వీరాజు యొక్క ఒక ముఖ్యమయిన ఘనతను గూర్చి అతని చెవిన వేసినాడు. గోరీతో “పృథ్వీరాజు కు ‘శబ్దభేది’ విద్య తెలుసు, ఆయన గ్రుడ్డియయినాకూడా శబ్దము విని లక్ష్యము ఛేదించగలడు” అని. ఆతురత కలిగినవాడైన గోరి ఆ పాటవ పరీక్షకు తగిన సమయమును నిర్ణయించి సంసిద్దుడై విషయమును తన సైనికులచే పృథ్వీరాజునకు చెప్పించి విల్లంబులనందించి వేడుక చూచుటకు వేదికనెక్కి కూర్చున్నాడు. గోరీ ఎప్పుడయితే తన ప్రతిపాదనకు ఒప్పుకొని రోజును నిర్ణయించినాడో వరదాయి పృథ్వీరాజు నిలువబడబోవు బోను, గోరీ కూర్చొనబోవు వేదిక ఎత్తు, బోను వేదికల మధ్యదూరము అన్నీ లెక్కించి పెట్టుకొన్నాడు వరదాయి. రంగము సిద్ధమైనది.   ఆ సమయములో, గట్టిగా చంద్ర వరదాయి గొంతు పృథ్వీరాజుకు వినబడింది. శరీరములో ఆనందము ఉత్సాహము పెల్లుబికింది. మస్తిష్కము పదునెక్కింది. గోరీ వరదాయికి అనుజ్ఞనొసగి పృథ్వీరాజుకు తెలియజేయమన్నాడు. అప్పుడు బిగ్గరగా చంద్ర వరదాయి ఈ దోహా అనగా ద్విపద  ఆశువుగా చెప్పినాడు.

చార్ బాఁస్ చౌబీస్ గజ్ అంగుల్ అష్ట ప్రమాణ్
తా ఊపర్ సుల్తాన్ హై మత్ చూకె చౌహాన్
అంటూ గోరీ దిశగా శబ్దము చేయుట జరిగింది. అంతే ఆలస్యము లేకుండా బాణము గోరీకి తగిలి గద్దె మీదినుండి పడిపోయినాడు. హాహాకారాలతో రాజోద్యోగులు రాజును చుట్టుకొన్నారు. ఇదే సమయమని ఎంచి చంద్ర వరదాయి తన ఛురికను బలముగా పృథ్వీరాజు గుండెలలో దింపి బయటకు తీసి దానితోనే తానూ పొడుచుకొని మరణించినాడు. ఇది మైత్రి అంటే!
    ఉత్సవే వ్యసనే ప్రాప్తే దుర్భిక్షే శత్రు సంకటే l
    రాజద్వారే శ్మశానేచ య తిష్ఠతి స బాంధవః ll
ఆనందములోన ఆపత్తులోనూ దుర్భిక్షము లోనూ దుష్ట బాధలందును మహారాజు ఆస్థానములోనైనా మరుభూమియందైనా అండగా నిలచినవాడే అసలైన మిత్రుడు. ఆతడే చంద్ర వరదాయీ.
పృథ్వీరాజ్ రాసో లోని మూల కథకు నా తర్కము జోడించి మరీ మీముందు ఉంచినాను. మిగత కావ్యాలలో ఏవిధముగా పృథ్వీరాజు మరణించినదీ మీకు ముందే తెలియజేసినాను.
ఇక ఇప్పుడు ఈ విషయమును ఎందువల్ల నమ్మవచ్చును అన్నది హేతువునకు దగ్గరగా వుండు విధమున మీకు తెలియజేస్తాను.
పృథ్వీరాజు గోరీ పైకి బాణము విడిచిన తరువాత ఏమిజరగినది అని తెలుసుకొనుటకు చంద్ర వరదాయి బ్రతికి లేడు. బాణము తగిలినవెంటనే మరణించి ఉంటాడు అన్నది ఒక ఊహ. వరదాయితో వచ్చిన వాడు వార్తను తిరిగీ కనౌజ్ కు చేరవేయవలె కాబట్టి గోరీ మరణించియే ఉంటాడని నమ్మి వెనుదిరిగిపోయి తాను వాస్తవమని నమ్మినది వరదాయి కుమారుడు జల్హణునికి చెప్పి తాను గుప్తముగా వ్రాసుకొన్న దోహాను అందివ్వడముతో జల్హణుడు కావ్యమును పూర్తిచేసియుంటాడు.
ఇక్కడ గోరీకి బాణమైతే బలంగానే తగిలింది కానీ ఆఘమేఘాలపై ఆతని సేవక బృందము తగిన వైద్య చికిత్స చేయించి అతనిని కాపాడి ఉంటారు. అది చంద్ర వరదాయికి తెలిసే అవకాశము లేదు కారణం ఆయన బ్రతికిలేదు కాబట్టి. అతని వెంట వచ్చిన అనుచరుడు తనను కాపాడుకొని చివరి ‘దోహాజల్హణునకు ఇచ్చుటకు ఆజ్మీర్ వెళ్ళి ఉంటాడు. విషయము తెలుసుకొన్న జల్హణుడు ఆవిధంగానే కావ్యమును ముగించియుంటాడు. ఇక గోరీ వైపు ఆలోచించితే అతను పూర్తిగా కోలుకున్నతరువాత తిరిగీ ఆజ్మేరు దిల్లీలపై దండయాత్ర సాగించి అప్పటి పాలకుడైన పృథ్వీరాజ్ కుమారుడు, చిరువయస్కుడు అయిన గోవిందరాజ్ ను సామంతుని చేసియుంచినాడు. అజ్మేరు లో దొరకిన కొన్ని నాణేలపై ఒక ప్రక్క గోరీ పేరు ఒక ప్రక్క పృథ్వీరాజు పేరు ఉండుటవల్ల పృథ్వీరాజు యుద్ధములో వోడి సామంతుడై నాణెములను ఆ విధముగా ముద్రింపజేయించి ఉంటాడని కొందరు చరిత్రకారులు అభిప్రాయ పడినారు.
అజ్మేరు నాణేలపై ఒక ప్రక్క తన పేరును ముహమ్మద్ బిన్ సాం (అంటే శాహబుద్దిన్ గోరీ ) వేయించుకొని రెండవవైపున పృథ్వీరాజు పేరును అట్లే వుంచినాడు. దీనికి కారణము చలామణిలో నున్న అన్ని నాణెములను వెనుకకు తెప్పించలేక రాజ కోశములో ఉన్న నాణెములపై ఈ విధముగా మార్పించియుండవచ్చు. ఇవి 20 వ శతాబ్దములో లభించినవి. వీనిని బట్టి కొందరు చరిత్రకారులు పృథ్వీరాజు శౌర్యమునే శంకించి ఆయన గోరీ సామంతునిగా కూడా ఉండియుండవచ్చునని తెలిపినారు.
ప్రాణం వాపి పరిత్యజ్యా మాన మే వాభి రక్షతుl
అనిత్యో భవతిః ప్రాణం మానమాచంద్ర తారకంll
అన్న నీతికి కట్టుబడినవారు. प्राण जाय पर आन शान और वचन जाय అని నమ్మిన శౌర్య వంతులగు రాజపుత్రులు ప్రాణమిచ్చుటకే సిద్ధపడుతారు కానీ ప్రతిష్ఠ కు మచ్చ తెచ్చిపెట్టారు. గోరీని పృథ్వీరాజు శబ్దభేది తో చంపినాడు అని నేను హిందీలో వ్రాయబడిన చరిత్ర పుస్తకము ‘క్షత్రియ గౌరవ గాథ’ లో ఈ విధముగా చదివినాను. అందుచేత ఈ ముఖ్యమైన విషయమును  ప్రస్తావించుతాను. 'క్షత్రియ గౌరవ గాథా' ప్రకారము నిశ్చితముగా శబ్దభేదివిద్య ద్వారా పృథ్వీరాజు గోరీని చంపినట్లు తెలియవస్తూవుంది. అటుపై అతని సహోదరుడు ఘియాత్ అల్ దిన్ ముహమ్మద్ భారత దేశముపై దండయాత్రకు వచ్చినట్లుకూడా చదివినాను. ప్రజల ఆమోదము కొనసాగించుటకు నాణెములపై ఒక ప్రక్క పృథ్వీరాజు మరియొక ప్రక్క షహబుద్దీన్ చిత్రమును వుంచినాడు అని తెలుసుకొన్నాను.  దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు 'గురుదేవ్' అన్న గౌరవనీయుడైన ఒక ప్రముఖుడు 'క్షత్రియ గౌరవ గాథా' లో విస్తృతముగా వ్రాయబోవు చున్నారని తెలియజేయబడింది. దానిని నేను ఇంకా చూచుట తటస్థించలేదు.
నిర్ద్వంద్వముగా పృథ్వీరాజు సుతుడు చిన్నవయసు కావచ్చు, అంతేవాసుల సలహాలు తీసుకొని యుండవచ్చు, అయినా ఆ కళంకమును కోరి తెచ్చుకొన్నాడు. అందుకు ప్రతిగా అమూల్య అపూర్వ సంపదలను గోరీకి కానుకగా సమర్పించుకొన్నాడు. పద్మము వున్నచోట బురుద కూడా ఉంటుందికదా!
ఇంతకూ పృథ్వీరాజు జీవించినది 24 సంవత్సరాలే! తానూ రాజ సింహాసనమును అధిష్ఠించినది 11 సంవత్సరాల వయసులో! ఒక సంవత్సరము తల్లిచాటునే ఉండినాడు. కాబట్టి ఆయన రాజ్యమేలిన కాలము కేవలము 12 సంవత్సరాలు. అంత తక్కువకాలము ఏలి కూడా ఎంత గొప్ప పేరు సంపాదించినాడో ఆ అసహాయ శూరుడు. పృథ్వీరాజు ఎక్కువకాలము బ్రతికినట్లు కూడా కొందరు వ్రాసినారు కానీ ఎక్కువమంది ఏకీభవించిన విషయమును నేను గ్రహించినాను. ప్రుత్వీరజును గూర్చి ఒక్క మాటలో చెప్పాలంటే:
సుగుణవంతుడైన సుతుడు ఒక్కడు చాలు
గుణములేని వేల  కొడుకులేల 
చుక్కలెట్లు సురుచి సూతికి సరిసాటి
రామమోహనుక్తి రమ్యసూక్తి!
ఇక జయచంద్రుని గూర్చిన అపప్రథ ఎంతవరకు నిజము అన్నది నిగ్గుదేల్చవలసి యుంటుంది. ఈయనను గూర్చి భవిష్య పురాణము ఏమి చెబుతున్నదో చూస్తాము.
త్యక్త్వా దేహం సంశుద్ధాచంద్రకాన్త్యాం సుతో భవత్l
జయచంద్ర ఇతిఖ్యాతో బాహుశ్జాలీ జితేంద్రియాll
ఈ శ్లోకము వల్ల జయచంద్రుడు అమిత బలశాలి, జితేంద్రియుడే కాక క్షీర సదృశుడైన స్వచ్ఛ మనస్కుడు అని మనకు అర్థమౌతూవుంది. అతని తమ్ముడు రత్నభానుడు అన్నకు లక్ష్మణుడై, గోడ,మరు మర్తియు వంగ దేశాలను జయించి అన్నగారి సామ్రాజ్యమును విస్తరించినాడు. ఇదికూడా భవిష్య పురాణము లోని మాటే! (ప్రతిసర్గ పర్వము 3.5.1.4) దీనినిబట్టి జయచంద్ర పృథ్వీరాజులకు దేశము మొత్తము పై తమ సార్వభౌమాధికారము స్థాపించుటలో, అహము తోడై  వైరము ప్రబలి బద్ధశాత్రువులైనారని తెలియవస్తూవున్నది. అయినాకూడా వారిరువురూ నీతిమార్గమును విడువలేదు. పృథ్వీరాజ్ రాసోలో రచనా విధానమును బట్టి, జయచంద్రుడు గోరీ సహాయము కోరినది ముస్లిం మరియు పాశ్చాత్య ప్రముఖుల నిర్వాకము ఈ ప్రక్షిప్త కార్యము అని తెలియుచున్నది. 12వ శతాబ్దములో వ్రాసిన పృథ్వీరాజ్ రాసోలో తైమూరు చంగేజ్ ఖాన్, మేవార్ రాజు రావాల్ రతన్ సింగ్ పద్మావతిల ప్రస్తాపన వుంది. వారు 13,14 శాతాబ్దములవారు. మరి వారిని గూర్చి చంద్ర వరదాయి వ్రాయలేడు కదా!
  ధర్మమునకు కట్టుబడిన రాజులు ఎప్పుడూ నీచమైన తుచ్ఛమైన అసహ్యం,ఐన ఆలోచనలకు తావివ్వరు. ధర్మమునకు కట్టుబడిన రాజులలో ఒకడే జయచంద్రుడు. చాలా క్లుప్తముగా చెప్పవలసివస్తే ఆయన దేశ విద్రోహి మరియు పృథ్వీరాజును చంపుటకై గోరీని దండయాత్రకై పురికోల్పినాడు అన్నది శుద్ధ అబద్ధమని సులభముగా నిర్ణయించగలిగినాము కదా! ఆయన పృథ్వీరాజు పైకి గోరీని దండయాత్రకు రమ్మన్నట్లు, పృథ్వీరాజ్ విజయ్ లోగానీ, హంమీర్ మహాకావ్య లోగానీ, రంభా మంజరి లోగానీ, ప్రబంద్ కోశ్ లోగానీ, ఇవియే కాక ఇంకా ఎన్నో ఈ కథకు సంబంధించిన కావ్యములలో లేదు. ఆయన మాన ధనుడు కావున అల్లుడైనా పిలువని పేరంటము కావున పోలేదు. గోరీ తన నమ్మకమైన బానిస కుతుబుద్దీన్ ఐబక్ ను దిల్లీ గద్దెపై కూర్చుండజేసి తానూ గజనీ కి వెళ్ళిపొయినాడు. కానీ 1194 లో కుతుబుద్దీన్ తో కలిసి రాజ్యవిస్తరణ కై అమిత బలగముతో గోరీ వచ్చి   జయచంద్రునితో యుద్దముచేసి ఆయనను సంహరించినాడు. ఇది చందవార్ లో జరిగిన యుద్ధము. ఇబ్న్ నసీర్ అన్న ముస్లిం చరిత్రకారుడు కూడా తన కామిల్-ఉల్-తవారీ లో ఎదే విషయమును పుష్ఠిచేసినాడు. ఎందులోనూ పృథ్వీరాజుపై దండెత్తామని గోరీని జయచంద్రుడు కోరినట్లు కనిపించదు.
ఇక గోరీ కూడా 1206 లో జీలం నది ఒడ్డున విడిది చేసి నిదురించు సమయములో, తమ వారిని చంపినాదన్న పగతో గోరీని హత్య చేసినారు.
భోజులు విక్రమార్కులును భూరి యశస్వులు శాతవాహనుల్
భ్రాజిత క్షాత్ర వంశజులు భాసిలు కాలము లంతరించగా
ఓజము తేజమంతయును ఓర్పుయు నేర్పుయు మట్టికాగ సా
మ్రాజ్యములుండె స్వార్థపర  రాక్షస మూకల పట్టుకొమ్మలై

స్వస్తి


Thursday, 18 April 2019

మన నేత – మన భవిత


మన నేత – మన భవిత
చెట్టు పేరుతో చెడిన కాయలను
అమ్మగ జూపే అతడొక నేత
ఇంగువ గుడ్డను ఎగురవేయుచూ 
ఇంగువ పంచితి  నిదె యను నేత
దేశ సేవయను దీపము క్రిందుగ
దాచెను దోచిన ధనమొక నేత
పశువులతోనే పంతముపెట్టి
గడ్డిని మేసిన ఘనుడొక నేత
తిన్న ఇంటి వాసాలను ఎంచి
తిన్నగ ఇల్లే నాదను నేత
భూకబ్జాలు భూరి సంపదల
పరిశుద్ధాత్ముడు ప్రజలకు నేత
పాలూ పాలన పంచి జనాలకు
ధనము తరాలకు దాచెడు నేత
నటనకు నటనపు నాణ్యత నేర్పిన
అభినవ భరతుడు అతడొక నేత
మంచి ముసుగులో మతప్రచారము
మరువక చేసెను మరియొక నేత
ఏడు కొండలకె ఎగనామాలను
పెట్టజూపె నొక ప్రియజన నేత
రాజకీయమున రాబడి కొరకై
చేర్చెను స్వజనుల చెడుగుడు నేత
వక్ర మార్గముల అక్రమార్జనల
విక్రమార్కులిల చక్రము త్రిప్పుచు
వీధికి ఒక్కడ విజృంభించగ
శవాగ్నిలోబడు శలభములై ప్రజ
మౌనధారులై మొదళ్ళు నరికిన
చెట్లను బొలుచు చేష్టలు ఉడిగిన
విధము, కంట తడి విధిగా మింగుచు
సజీవ శవముల సరళిని బ్రతుకును
‘అ’కారమన్నది అగుపడనీయని 
అసురుల నమ్ముచు అసువుల బాసెడు
మానవ మనుగడ మారుట ఎన్నడు
నయవంచన యను నవనీతమ్మును
కరగదీయు కసి కలిగేదెన్నడు
దేశపు వెలుగులు దేదీప్యమ్ముగ
మిలమిల తళతళ మేరిసేదెన్నడు
నెడో రేపో రాకపోయినా
సంకల్పమ్మును సందిట జేర్చిన
వినువీధిన మన విజయ పతాకము
ఎగురవేసెదము ఎప్పటికైనా
ఇదే పథము మనదిదే శపథము
మనరథమియ్యదె మనోరథమిదే

Monday, 15 April 2019

పృథ్వీరాజ్ చౌహాన్ చరిత్ర ఆస్య గ్రంధి సంబంధ ఉపోద్ఘాతము


పృథ్వీరాజ్ చౌహాన్ చరిత్ర
ఆస్య గ్రంధి సంబంధ ఉపోద్ఘాతము

పృథ్వీరాజ్ చౌహాన్ రాణీ సంయుక్త, రాజ జయచంద్ర రాథోడ్, షహబుద్దీన్ మహమ్మద్ గోరీ పేర్లు ఎంతమందికి తెలుసును అన్నది  నేను అంచనా వేయలేను.  పృథ్వీరాజురాణీ సంయుక్తలది ప్రేమవివాహము. పృథ్వీరాజు ఆమెను తన గుఱ్ఱము మీదికి లాక్కొని తన దేశమునకు వెళ్లి పెళ్ళి చేసుకొన్నాడు. జయచంద్రుడు గోరీ సహాయముతో పృథ్వీరాజును  హతమార్చినాడు అన్నది కొందరికి తెలిసి ఉండవచ్చు. ఇందలి నిజానిజాలు నాకు చేతనయినంత మేరకు నిగ్గు దేల్చే ప్రయత్నమూ చేసినాను.
ఈ విషయమై నేను వ్రాయుటకు తీసుకొన్న గడువు 10 రోజులు. ఎన్నేన్నో పుస్తకములు, E-పుస్తకములు త్రిప్పి అవసరమగు విషయ సేకరణ గావించి దానికి నా తర్కమును జోడించి ఒక ఉపయోగకరమైన రచనా రూపమునకు తెచ్చి  మీముందు ఉంచుచున్నాను.

ఇది ఒక Image నో లేక Video నో లేక Photograph నో లేక Stock YouTube Files నో
Likes కొరకు మీ ముందుంచుట కాదు. గర్వించదగిన ఈ దేశ చరిత్రను మీరు తెలుసుకొనవలెను అను తపన ఈ కష్టమునకు నన్ను పాలుపడ జేసింది.

నాకు తెలుసు చాలామంది ఆస్య గ్రంధిని కేవలము హాస్య గ్రంధిగా వాడుతారు. కొందరు
FB Friendship Accept చేయుటతో సరి. మళ్ళీ తెరువరు . తెరిచిరి పో, అది Good Morning
Good Afternoon, Good Night లకే. Video ఒకటి FB లో చక్కర్లు కొడుతూనే వుంది. అంతంతమంది దానిని share చేయుట చేత పొందే Likes కంటే తమకు అర్థమైనది తమదైన శైలిలో వ్రాస్తే తృప్తి ఉంటుంది. నలుగురు చదివితే ఆనందము ఉంటుంది. ఆవిధముగా Share చేయుటచేత తామెంత తెలుసుకొన్నాము అన్నది ప్రక్కన ఉంచుతున్నారు. ఎవరికి వారు You Tube లో Search చేస్తే చాలు ఏరోజుకారోజు You Tube లోనే గడుపవచ్చు. లేక అలాంటివి Browse చేసి కూడా కాలము వెలిబుచ్చవచ్చు.

కొందరు అసలు వ్యాసము దేనిని గురించి వ్రాసినారు అన్న విషయముతో సంబంధమే లేకుండా Good Morning అని Comment Box లో పెట్టేస్తారు. ఈ Good Morning లు ఉనికిని చాటుకొనుటకా అన్నది నాకర్థము కాని విషయము. కొందరికయితే చదవడమే బద్ధకము.  ఈ మధ్య కాలములో  తెలుగు సరిగా రాని, పలుకలేని పరమతస్తులు తమ Book Shelf లలో తెలుగులో ఎందరెందరో వ్రాసిన భగవద్గీతలను ఇంకా ముఖ్యమైన వేదాంత గ్రంధములను పెట్టుకొని వక్రభాష్యాలు You Tube లో Load చేస్తున్నారు. అదే నిజమనుకొనే హైందవులు ఎంతమందో! పరమతస్తులయిన వారు ఆపనయినా చేస్తున్నారు. అసలు మనకు అవి అంటేనే Allergy.

ఈ విషయము మీకు తెలుసునో లేదో యూరోప్ లో దినదినమునకు జనన సంఖ్య క్రైస్తవులలో తగ్గిపోవుచున్నది. సంఖ్య పెరుగుతుంది కదా వారి శత్రు మతస్తుల రానిస్తే వారు వచ్చి తమ జనాభా అభివృద్ధి చేసుకొంటున్నారు. ఇంకొక విషయము, London 1500 మంది Capacity ఉన్న Church కి Professor R. వైద్యనాథన్ ఆదివారము నాడు పోతే 7గురు కూర్చొని యున్దినారట. ఈయన 8 వ వాడు. పలు యూరోప్ దేశాలు తమ Church లను ముస్లీములకమ్మివేస్తే వాళ్ళు ఆ స్థలములో మసీదులు కట్టిస్తున్నారు. మన స్వామినారాయణ్ దేవస్థానము వారు, ISCON వారు, కూడా విదేశాలలో Church లను కొని దేవాలయాలుగా మారుస్తున్నారు. Europe, Eurebia గా మారబోతూ వుందని గగ్గోలు చెందుతున్నారు. ఇంకొక విషయము ఘజ్వా-ఏ- హింద్ హిందూ దేశమును ముస్లిం దేశముగా మార్చే ఉద్యమము చాప క్రింద నీరులా ప్రాకుతూనే వుంది. దయతో వితండ లౌకిక వాదము విడిచిపెట్టండి.
నిజానికి మీ ముందున్న రాక్షస సమస్య ఇది. దీనిని నివారించాలంటే ముందు మీ సనాతన ధర్మమును గూర్చి అవగాహన ఏర్పరచుకొని తీరవలసిందే . మీ ధర్మము రాను రానూ ఎంత దిగజారుతూ వున్నదని మీరే  తెలుసుకోలేక పోతే, తెలుసుకొని తగిన చర్యలు చేపట్టక పోతే ‘పవిత్రమైన గంగ సముద్రములో కలిసినట్లౌతుంది. దానికి కారణమైన మీకు  పరితాపమే మిగులుతుంది. చదవండి ఆకళింపుచేసుకోండి, వ్రాయండి చదివించండి , పిల్లలకు మన ధర్మమునకు సంబంధించిన సంస్కారములను నేర్పించండి.

అందుకే కఠోపనిషత్తు లోని ఈ శ్లోకమును వివేకానందుడు మంత్రమువలె జపించేవాడు:

ఉత్తిష్ఠత! జాగ్రత !ప్రాప్యవరాన్ నిబోధత క్షురస్య ధారా
నిశితా దురంతయా దుర్ల పథస్తత్కవ యోవదంతి

లెండి! మేల్కొనండి! గమ్యాన్ని చేరే వరకూ విశ్రమించకండి. ప్రస్థానం చేయవలసిన
మార్గం దుర్గమమైంది. ఈ దారిన పయనించుట అసిధారా వ్రతమే! అంటే పదునైన
కత్తి అంచుపై నడవడమే!  అయితే పెద్దల మాటపై గురుత్వము, సంకల్ప బలము
ఉన్న హృదయానికి సాధ్యము కానిది ఏముంది?
స్వస్తి
మన పూర్వపు రాజుల గొప్పదనము గ్రహించండి మీరు తెలుసుకొని మీ పిల్లలకు తెలుపండి.

Thursday, 4 April 2019

దోసె దండకము


దోశ దండకము

http://cherukuramamohan.blogspot.com/2019/04/blog-post_4.html
దోశే రుచుల విలాసము
దోశే ఫలహార రాజు దుర్జయ రీతిన్
దోశే స్వర్గ ద్వారము
దోశే సుఖసాగరాన ద్రోణిక రామా!
ఓ దోశ నా మానసాధీశ కామేశ ప్రాణేశ జీవేశ ఆంధ్రేశ పాండ్యేశ చోళేశ చేరేశ కర్నాటకాధీశ విశ్వేశ నాదౌ ఫలాహార సామ్రాజ్య సింహాసనాధీశ తామ్రార్క సంకాశ సర్వ క్షుదా క్లేశ వైరీశ నీపేరు ప్రఖ్యాతులన్ దేశ దేశాలు ఎంతెంతయో మెచ్చి నిన్ దెచ్చి గుండెన్ ప్రతిష్ఠించి దీపాన్ని వెల్గించి ప్రార్థించి ప్రార్థించి నీదౌ సుస్వాదిష్ట సల్లక్షణాలన్ మదిన్ నిల్పి నీస్నిగ్ధ కారుణ్య వారుణ్య సర్వాగ్ర గణ్యాది తత్వంబు విశ్వాంతరాళాలలో జాటి లేరంచు నీ సాటి లేదంచు నేనెంచితిన్ నీకు  ఏ పోటి ఆనాటికీనాటి కేనాటికీ లేదు లేదంచు నేచాటుచుంటిన్ సదా నీకు నీవే కదా సాటి అబ్బబ్బ నీధాటి నేచెప్పనేపాటి నీతోటి నా భేటి ఐనట్టి ఆనాటి నుండీ సదా నేను నీ అర్చనల్ జేయుచున్ ధూప దీపమ్ముతో నిత్య నైవేద్య యుక్తమ్ముగా నాదు భక్తిన్ ప్రపత్తిన్ సదా చాటి నీ మాన్యతన్ దెల్పుచున్నట్టి నాదౌ మొరాలించు నీ పొందు వేరెందు నేకందు నావిందు నా మందు అన్నింట నీవుందు వన్నన్ యధార్థమ్ము వేరేయనర్థమ్ము లేదందు నా భక్తి కాకుండగా వమ్ము నామాటలన్ నమ్ము నిన్వీడ నేజాల లేకుండ ఏ గోల నే నిల్చి నీమ్రోల వర్ణింతు నీలీల వేరొండు నాకేల లోకమ్మునన్ దోశగా అట్టుగా పట్టుగా ఫిట్టు బ్రేక్ ఫాస్టుగా గాడ్సు క్యూట్ గిఫ్టుగా నీవునా జట్టుగా ఇంటి లోగుట్టుగా దండిగా మెండుగా నిండుగా పిండిగా ఫ్రిజ్జి లో నుండగా నాకదే పండుగంచున్నికన్ లేక నాకింక ఏడౌటు టెన్ డేసు నో డౌటు నేనౌదులే స్టౌటు నీ ఉన్కి లేకున్న నేనౌటు నన్ వీడి దాటొద్దు మాగేటు నీవట్టువై పట్టువై పిండి ఇన్ పుట్టువై అట్టు ఔట్ పుట్టువై మైండు అత్లెట్టువై బ్రైను వాల్ నట్టువై హెల్తు గ్రౌండ్ నట్టువై ఆ హెవెన్ యొక్క స్టేర్కేసు పై మెట్టువై నీవు శ్రీ విష్ణువున్ బోలె ఎన్నెన్నొ రూపాల ప్రత్యక్షమయ్యేవు నేనందులో కొన్ని వర్ణింపగా బూని సూపర్ పవర్ మైకులన్ ఆంప్లిఫయ్యర్లు పెట్టించుచున్ తెల్పెదన్ నాకు నీతోడిదే పట్టు లేకున్న ఇక్కట్టు నా జట్టు నాజెట్టు కాదన్నచో బెట్టు నీదైన కనికట్టు రూపావళిన్ దల్చుచున్  అర్చనల్ చేయ నుంకింతు నా దైవమా నిన్ను మిన్పట్టు పెస్రట్టు రవ్వట్టు దిబ్బట్టు బొబ్బట్టు గోధూమ పిండట్టు సేమ్యాట్టు సెట్టట్టు ఉల్లట్టు ఉర్లట్టివే చాలవన్నట్టు అట్టన్న నీపేరు హిందీన నంబర్సులో కూడ ఇక్సట్టు బాసట్టు తిర్సట్టు చౌన్సట్టు పైఁసట్టు ఛస్సట్టు సడ్సట్టు అడ్సట్టు గానెంచుచున్నారు దేశమ్మునన్ పంచుచున్నారు ఈ రీతి నీపేరు వేర్వేరు రూపాల గన్పట్టు నీగొప్ప నేజెప్పగాలేను మా ప్రోద్దుటూరందు నీరేటు మామూలు దోశల్ల అంగట్లొ ఐనూరు రూపాయలయ్యింది ఐనన్ తినే వారలున్నారు ఆశ్చర్యమే గాంచగన్ నాకు ఆ శక్తి లేకున్ననూ తెల్పుచున్నాను లోకానికిన్  నేను నీ దాసుడన్ కాన నా శక్తియున్నంతలో నిన్ను తిన్కుండ  ఎట్లుండెదన్ నాకు నీవే సదా అండ లేకున్న ఆతిండి యౌ కొండ లో బండ ఓ దోశ నిన్ బాగుగా నేతితో కాల్చి బొంబాయి చెట్నీని పైనేసి ఆపైని నీరుల్లిపాయల్ల తోజేయు కారమ్ము దట్టించి నీపైన రాచేసి తర్వాత పుట్నాల పౌడర్ను జల్లేసి  ఆలూమసాలాను అందుంచి టేస్టుల్ను చిందించి ప్లేట్లోనికిన్ దించి నాముందు ఉంచేయగా నేను టెంకాయ చెట్నీతొ ఓ పట్టు పట్టన్ దివిన్ నాట్యమాడేటి ఆరంభ ఆ ఊర్వశీ మేనకా ద్యప్సరల్ నన్ను దేవేంద్రుగాదల్చి నాముందు హిప్ హాపు ఫ్రీ స్టైలు ఫోక్లోరుయున్ క్లాసికల్ హాలివుడ్ బాలివుడ్ టాలివుడ్ కోలివుడ్ నాట్య రీతుల్ల నర్తించి నట్లౌను అంగారకమ్మందు ఆనంద సౌధమ్మునన్ హంసికా తూలికా తల్పమానందమందివ్వ నాయామినీ దివ్యసౌదామినీ భామినీ వీణ గానామృతమ్మందు నేతన్మయత్వంబునన్ మున్గుచున్ తేలుచున్నట్లు డోలాయమానంబులో నన్నుమైమర్చినట్లాయె ఇంకొక్క సత్యమ్ము చెప్పేను చూడొక్క పంచర్ను తాగల్గ ఏ బైసికిల్ కూడ ఒన్నించి మువ్ కాదు నీవట్లు కాకుండ నీ ఒళ్ళు పంచర్లతో నిండి యున్నాసరే కష్టమేలేక నాజీర్ణ కోశాన్ని చేరేవు నీ గొప్పలన్ జెప్ప ఆ బ్రహ్మకున్ దప్ప నా ముద్దు ఊతప్ప నాకెట్లు వీలౌను అట్లయ్యు నేనిప్డు నీదివ్య నామావళిన్ ఆత్మలో నెంచుచున్ నిన్ను పూజింతు నోపుల్లదోశా మహా సెట్టుదోశా మరెన్నో మసాలాల దోశా బలెమ్మెల్యె దోశా సుస్వాదిష్ట పన్నీరు దోశా ఒ పాలాకు దోశా ఓహో రాగి దోశా ఆహా జొన్న దోశా ఇహీ సజ్జ దోశా ఉహూ గుడ్డు దోశా ఒ మిల్లెట్ల దోశా బలే కాజు దోశా మహా ఇంపు బెల్లంపు దోశాధిదోశా ఇదే నాదు సాష్టాంగ దండప్రణామంబు గైకొంచు నీప్రేమ నాపైన నిత్యమ్ము నుండంగ ప్రార్థింతు నిన్ దూదిదోశా మహా క్రిస్పి దోశా జబర్దస్తు దోశా ఒ క్యూట్ కోను దోశా ఫిదా నెయ్యి దోశా సదా నాదు ఆశా నిజం నాదు నాసాంతరాళాల ఉఛ్వాస నిశ్వాస వౌ మంద హాసా మనోల్లాస ఆహార ధ్యాసా వికాసా స్వదేశీయ దోశా మనోక్లేశ నాశా క్షుదార్తాళి సంతోష కోశా మహా దుర్గ హృద్వన్య కీశా సుషీయుక్త ధావళ్య ప్రాశా మదీశా  నమస్తే నమస్తే నమః


Monday, 1 April 2019

ఏప్రిల్ ఫూల్


ఏప్రిల్ ఫూల్
యూరప్‌లో కూడా, పదహారో శతాబ్దం మధ్య వరకు సంవత్సరాది మార్చి మధ్యలోనే జరుపుకొనేవారు, అంటే విశ్వమంతటా ఉగాది ఇంచుమించు ఒకేసారి జరుపుకొనేవారన్నమాట.  ఈ నూతన సంవత్సరపు ఉత్సవాలు, వసంత కాలపు ఉత్సవాలు ఓ పది రోజుల పాటు జరిగేవి, మన వసంత నవరాత్రుల లాగా! ఏప్రిల్‌ 1న  ఈ ఉత్సవాలకు ముగింపు పలుకుతూ  ఒకరికొకరు తమ శక్త్యానుసారము బహుమానాలు ఇచ్చి పుచ్చుకునేవారు. క్రైస్తవము యొక్క ప్రాబల్యముతో  ఒక పెనుమార్పు వచ్చి పడింది. అప్పటి ఫ్రాన్సు దేశపు రాజు సంవత్సరాదిని మార్చి మధ్య నుండి జనవరి 1 వ తేదీకి మార్చుతూ ఒక తాఖీదు జారీ చేసి చాటింపు వేయించినాడు. ఆరోజులలో ప్రసార మాధ్యమాలు లేవు కదా! రాజుగారి చాటింపు వినకనో, లేక తమ పాత అలవాట్లను మార్చుకోలేకనో  దేశము లో  ఏప్రిల్‌ 1 న బహుమానాలు ఇచ్చుకోవటం మానలేదు. ఆవిధముగా బహుమతులు ఇచ్చిపుచ్చుకొనే వారిని  ఏప్రిల్‌ ఫూల్స్‌ అని ఎగతాళి చేసేవారు. పాశ్చాత్యుల పెత్తనము మనపై ఇంచుమించు 300 సంవత్సరములు ఉండినది కాబట్టి వారి అసంగత ఆచారము మనపై పులిమినారు.
ఇకనైనా మనము ఒకరినొకరు మూర్ఖులుగా చేసుకొనుట మానుకొని గౌరవించుకొందాము.
స్వస్తి.