Thursday, 4 April 2019

దోసె దండకము


దోశ దండకము

http://cherukuramamohan.blogspot.com/2019/04/blog-post_4.html
దోశే రుచుల విలాసము
దోశే ఫలహార రాజు దుర్జయ రీతిన్
దోశే స్వర్గ ద్వారము
దోశే సుఖసాగరాన ద్రోణిక రామా!
ఓ దోశ నా మానసాధీశ కామేశ ప్రాణేశ జీవేశ ఆంధ్రేశ పాండ్యేశ చోళేశ చేరేశ కర్నాటకాధీశ విశ్వేశ నాదౌ ఫలాహార సామ్రాజ్య సింహాసనాధీశ తామ్రార్క సంకాశ సర్వ క్షుదా క్లేశ వైరీశ నీపేరు ప్రఖ్యాతులన్ దేశ దేశాలు ఎంతెంతయో మెచ్చి నిన్ దెచ్చి గుండెన్ ప్రతిష్ఠించి దీపాన్ని వెల్గించి ప్రార్థించి ప్రార్థించి నీదౌ సుస్వాదిష్ట సల్లక్షణాలన్ మదిన్ నిల్పి నీస్నిగ్ధ కారుణ్య వారుణ్య సర్వాగ్ర గణ్యాది తత్వంబు విశ్వాంతరాళాలలో జాటి లేరంచు నీ సాటి లేదంచు నేనెంచితిన్ నీకు  ఏ పోటి ఆనాటికీనాటి కేనాటికీ లేదు లేదంచు నేచాటుచుంటిన్ సదా నీకు నీవే కదా సాటి అబ్బబ్బ నీధాటి నేచెప్పనేపాటి నీతోటి నా భేటి ఐనట్టి ఆనాటి నుండీ సదా నేను నీ అర్చనల్ జేయుచున్ ధూప దీపమ్ముతో నిత్య నైవేద్య యుక్తమ్ముగా నాదు భక్తిన్ ప్రపత్తిన్ సదా చాటి నీ మాన్యతన్ దెల్పుచున్నట్టి నాదౌ మొరాలించు నీ పొందు వేరెందు నేకందు నావిందు నా మందు అన్నింట నీవుందు వన్నన్ యధార్థమ్ము వేరేయనర్థమ్ము లేదందు నా భక్తి కాకుండగా వమ్ము నామాటలన్ నమ్ము నిన్వీడ నేజాల లేకుండ ఏ గోల నే నిల్చి నీమ్రోల వర్ణింతు నీలీల వేరొండు నాకేల లోకమ్మునన్ దోశగా అట్టుగా పట్టుగా ఫిట్టు బ్రేక్ ఫాస్టుగా గాడ్సు క్యూట్ గిఫ్టుగా నీవునా జట్టుగా ఇంటి లోగుట్టుగా దండిగా మెండుగా నిండుగా పిండిగా ఫ్రిజ్జి లో నుండగా నాకదే పండుగంచున్నికన్ లేక నాకింక ఏడౌటు టెన్ డేసు నో డౌటు నేనౌదులే స్టౌటు నీ ఉన్కి లేకున్న నేనౌటు నన్ వీడి దాటొద్దు మాగేటు నీవట్టువై పట్టువై పిండి ఇన్ పుట్టువై అట్టు ఔట్ పుట్టువై మైండు అత్లెట్టువై బ్రైను వాల్ నట్టువై హెల్తు గ్రౌండ్ నట్టువై ఆ హెవెన్ యొక్క స్టేర్కేసు పై మెట్టువై నీవు శ్రీ విష్ణువున్ బోలె ఎన్నెన్నొ రూపాల ప్రత్యక్షమయ్యేవు నేనందులో కొన్ని వర్ణింపగా బూని సూపర్ పవర్ మైకులన్ ఆంప్లిఫయ్యర్లు పెట్టించుచున్ తెల్పెదన్ నాకు నీతోడిదే పట్టు లేకున్న ఇక్కట్టు నా జట్టు నాజెట్టు కాదన్నచో బెట్టు నీదైన కనికట్టు రూపావళిన్ దల్చుచున్  అర్చనల్ చేయ నుంకింతు నా దైవమా నిన్ను మిన్పట్టు పెస్రట్టు రవ్వట్టు దిబ్బట్టు బొబ్బట్టు గోధూమ పిండట్టు సేమ్యాట్టు సెట్టట్టు ఉల్లట్టు ఉర్లట్టివే చాలవన్నట్టు అట్టన్న నీపేరు హిందీన నంబర్సులో కూడ ఇక్సట్టు బాసట్టు తిర్సట్టు చౌన్సట్టు పైఁసట్టు ఛస్సట్టు సడ్సట్టు అడ్సట్టు గానెంచుచున్నారు దేశమ్మునన్ పంచుచున్నారు ఈ రీతి నీపేరు వేర్వేరు రూపాల గన్పట్టు నీగొప్ప నేజెప్పగాలేను మా ప్రోద్దుటూరందు నీరేటు మామూలు దోశల్ల అంగట్లొ ఐనూరు రూపాయలయ్యింది ఐనన్ తినే వారలున్నారు ఆశ్చర్యమే గాంచగన్ నాకు ఆ శక్తి లేకున్ననూ తెల్పుచున్నాను లోకానికిన్  నేను నీ దాసుడన్ కాన నా శక్తియున్నంతలో నిన్ను తిన్కుండ  ఎట్లుండెదన్ నాకు నీవే సదా అండ లేకున్న ఆతిండి యౌ కొండ లో బండ ఓ దోశ నిన్ బాగుగా నేతితో కాల్చి బొంబాయి చెట్నీని పైనేసి ఆపైని నీరుల్లిపాయల్ల తోజేయు కారమ్ము దట్టించి నీపైన రాచేసి తర్వాత పుట్నాల పౌడర్ను జల్లేసి  ఆలూమసాలాను అందుంచి టేస్టుల్ను చిందించి ప్లేట్లోనికిన్ దించి నాముందు ఉంచేయగా నేను టెంకాయ చెట్నీతొ ఓ పట్టు పట్టన్ దివిన్ నాట్యమాడేటి ఆరంభ ఆ ఊర్వశీ మేనకా ద్యప్సరల్ నన్ను దేవేంద్రుగాదల్చి నాముందు హిప్ హాపు ఫ్రీ స్టైలు ఫోక్లోరుయున్ క్లాసికల్ హాలివుడ్ బాలివుడ్ టాలివుడ్ కోలివుడ్ నాట్య రీతుల్ల నర్తించి నట్లౌను అంగారకమ్మందు ఆనంద సౌధమ్మునన్ హంసికా తూలికా తల్పమానందమందివ్వ నాయామినీ దివ్యసౌదామినీ భామినీ వీణ గానామృతమ్మందు నేతన్మయత్వంబునన్ మున్గుచున్ తేలుచున్నట్లు డోలాయమానంబులో నన్నుమైమర్చినట్లాయె ఇంకొక్క సత్యమ్ము చెప్పేను చూడొక్క పంచర్ను తాగల్గ ఏ బైసికిల్ కూడ ఒన్నించి మువ్ కాదు నీవట్లు కాకుండ నీ ఒళ్ళు పంచర్లతో నిండి యున్నాసరే కష్టమేలేక నాజీర్ణ కోశాన్ని చేరేవు నీ గొప్పలన్ జెప్ప ఆ బ్రహ్మకున్ దప్ప నా ముద్దు ఊతప్ప నాకెట్లు వీలౌను అట్లయ్యు నేనిప్డు నీదివ్య నామావళిన్ ఆత్మలో నెంచుచున్ నిన్ను పూజింతు నోపుల్లదోశా మహా సెట్టుదోశా మరెన్నో మసాలాల దోశా బలెమ్మెల్యె దోశా సుస్వాదిష్ట పన్నీరు దోశా ఒ పాలాకు దోశా ఓహో రాగి దోశా ఆహా జొన్న దోశా ఇహీ సజ్జ దోశా ఉహూ గుడ్డు దోశా ఒ మిల్లెట్ల దోశా బలే కాజు దోశా మహా ఇంపు బెల్లంపు దోశాధిదోశా ఇదే నాదు సాష్టాంగ దండప్రణామంబు గైకొంచు నీప్రేమ నాపైన నిత్యమ్ము నుండంగ ప్రార్థింతు నిన్ దూదిదోశా మహా క్రిస్పి దోశా జబర్దస్తు దోశా ఒ క్యూట్ కోను దోశా ఫిదా నెయ్యి దోశా సదా నాదు ఆశా నిజం నాదు నాసాంతరాళాల ఉఛ్వాస నిశ్వాస వౌ మంద హాసా మనోల్లాస ఆహార ధ్యాసా వికాసా స్వదేశీయ దోశా మనోక్లేశ నాశా క్షుదార్తాళి సంతోష కోశా మహా దుర్గ హృద్వన్య కీశా సుషీయుక్త ధావళ్య ప్రాశా మదీశా  నమస్తే నమస్తే నమః


No comments:

Post a Comment