Showing posts with label నేతల స్థితి - నేటి దుర్గతి. Show all posts
Showing posts with label నేతల స్థితి - నేటి దుర్గతి. Show all posts

Thursday, 18 April 2019

మన నేత – మన భవిత


మన నేత – మన భవిత
చెట్టు పేరుతో చెడిన కాయలను
అమ్మగ జూపే అతడొక నేత
ఇంగువ గుడ్డను ఎగురవేయుచూ 
ఇంగువ పంచితి  నిదె యను నేత
దేశ సేవయను దీపము క్రిందుగ
దాచెను దోచిన ధనమొక నేత
పశువులతోనే పంతముపెట్టి
గడ్డిని మేసిన ఘనుడొక నేత
తిన్న ఇంటి వాసాలను ఎంచి
తిన్నగ ఇల్లే నాదను నేత
భూకబ్జాలు భూరి సంపదల
పరిశుద్ధాత్ముడు ప్రజలకు నేత
పాలూ పాలన పంచి జనాలకు
ధనము తరాలకు దాచెడు నేత
నటనకు నటనపు నాణ్యత నేర్పిన
అభినవ భరతుడు అతడొక నేత
మంచి ముసుగులో మతప్రచారము
మరువక చేసెను మరియొక నేత
ఏడు కొండలకె ఎగనామాలను
పెట్టజూపె నొక ప్రియజన నేత
రాజకీయమున రాబడి కొరకై
చేర్చెను స్వజనుల చెడుగుడు నేత
వక్ర మార్గముల అక్రమార్జనల
విక్రమార్కులిల చక్రము త్రిప్పుచు
వీధికి ఒక్కడ విజృంభించగ
శవాగ్నిలోబడు శలభములై ప్రజ
మౌనధారులై మొదళ్ళు నరికిన
చెట్లను బొలుచు చేష్టలు ఉడిగిన
విధము, కంట తడి విధిగా మింగుచు
సజీవ శవముల సరళిని బ్రతుకును
‘అ’కారమన్నది అగుపడనీయని 
అసురుల నమ్ముచు అసువుల బాసెడు
మానవ మనుగడ మారుట ఎన్నడు
నయవంచన యను నవనీతమ్మును
కరగదీయు కసి కలిగేదెన్నడు
దేశపు వెలుగులు దేదీప్యమ్ముగ
మిలమిల తళతళ మేరిసేదెన్నడు
నెడో రేపో రాకపోయినా
సంకల్పమ్మును సందిట జేర్చిన
వినువీధిన మన విజయ పతాకము
ఎగురవేసెదము ఎప్పటికైనా
ఇదే పథము మనదిదే శపథము
మనరథమియ్యదె మనోరథమిదే