Thursday, 1 September 2016

నానాటికి తీసికట్టు .....

నానాటికి తీసికట్టు ......




నానాటికి తీసికట్టు

రామకృష్ణ గారు చాలా మంచి విషయాన్ని స్పృశించినారు. మొదటి పేరా లో వారు వ్రాసిన అభిప్రాయముతో ఏకీభవిస్తున్నాను . నేటి యువతకు తాతల తరము నాది. బహుశా రామకృష్ణ గారిది తండ్రుల తరము కావచ్చును . ఈ తరము నేటి యువతది. మా తండ్రిగారి తరము లో పూర్తిగా ఇల్లాలు ఇంటికే పరిమితము. అప్పుడు అన్ని పనులూ ఇల్లాలు చెసుకొనుటయే కాకుండా దేవుని వత్తులు చేసియో విస్తరాకులు కుట్టియో ఎబ్రోయిడరీ పని చేసియో వెడినీళ్ళకు చల్ల నీళ్ళను జత జేసేవారు. అవ్వ తాతలు పిల్లలను కనిపెట్టుకొని వాళ్ళకు ఎన్నో అనుభవాలు చెప్పేవారు.
మా కాలములో గోలీలు ,బొంగరాలు, బిళ్ళంగోడు మొదలగు ఖర్చులేని ఆటలు, అంటే అన్నీ కలిపినా ఒక రూపాయి అయ్యేదికాదు,వుండేవి. కాని ఆ ఆటల్లో లక్ష్యము, గురి, సాధన, పట్టుదల,గెలువవలెనను ఆకాంక్ష ఉండేవి. రోగనిరోధక సామర్థ్యము పెరిగేది. ఆటల్లో గాయమైతే చాలా మెత్తటి మట్టిని, భూమి పై ఉన్న మట్టిని చేతితో చెరిగి ( నేమి అంటే బరువు పదార్థము దిగజార్చి తేలిక పదార్థము నిలుచునట్లు), గాయము పై వేసే వాళ్ళము. ఈ విషయంలో తల్లి దండ్రుల ప్రమేయము వుండేది కాదు. పాఠ్యాంశాలు ఇప్పుడున్నవే కానీ అందులో పాఠాల బరువు తక్కువ . ఉపాధ్యాయులకు తమకు తెలిసినది చెప్పవలసిన మేరకు సుబోధకముగా పాఠము యొక్క పరిధిని దాటకుండా, ఒక్కొక్కసారి దాటి కూడా, చెప్పేవారు. ఇప్పుడు పాఠము చెప్పుటకన్నా ఏవేవో ఊహాజనిత ప్రశ్న లను అంతర్జాలమున చూచి ఇవ్వగా వారి శిష్యులు కూడా ఇంటికి వచ్చి అందులోనుండి నే జవాబులు చూసి వ్రాస్తున్నారు. ఇప్పటి ఆటలకు ఎంత ఖర్చౌతోంది అనేది ఒక్క సారి గమనించితే అర్థమౌతుంది. ఇంట్లో మా అమ్మమ్మ (నేను నాకు మొదటి సం. దాటుతూనే తల్లిని పోగొట్టుకొన్నాను. తదుపరి మా తండ్రి పునర్వివాహము చేసుకోకుండా నా సంరక్షణా భారాన్ని ఆమెకు ఒప్పజెప్పి భగవత్సాయుజ్యము చేరువరకు నా బాగు కే పాటుబడినారు. మా అమ్మమ్మ కూడా కన్నతల్లి లేదన్న చింత నాకు కలగనీకుండా పెంచింది. వారి ఋణము నేను ఎన్ని జన్మలకైనా తీర్చుకోలేనిది.) అన్ని రకాల పిండివంటలు చేసిపెడితే నిక్కరు జేబులనిండా పోసుకొని తింటూ మట్టిలోనే ఆడుకొనేవాణ్ణి . ఆ 'ఇమ్మ్యునిటీ' నే, ఇప్పుడు నన్ను కాపాడుతోందని అనుకొంటున్నాను. ఇవన్నీ నా గొప్ప కోసం కాదు ఆనాటి సాంఘీక పరిస్థితులను గూర్చి చెప్పుచున్నాను. నేను చదువు పూర్తి జేసి, సంపాదన అవసరము లేని భార్యనే కావాలని పెళ్ళిచేసుకొన్నాను . నేను సాంఘీకముగా వెనుకబడిందేమియు లేదు. 'పెన్నీ సేవ్డ్ ఈస్ పెన్నీ అర్న్డ్' అన్న ఆంగ్ల సామెతను అక్షరాలా నిజము చేసింది ఆ ఇల్లాలు.
కాలం మారింది. భార్య భర్త ఉద్యోగాలకు పోతేకాని సంఘం లో అంతస్తు, ఆర్ధిక పెంపుదల అన్న అపప్రధలు బెల్లము చుట్టూ మూగిన ఈగలైపోగా ఇద్దరూ ఆఫీసులకు కదిలినారు. ఒకటి పొందాలంటే ఒకటి పోగొట్టుకోవలసిందే. తల్లి తండ్రి వృద్ధాశ్రమము పాలైనారు. పిల్లలు అమ్మ చేయిమారి ఆయమ్మ చేతికి చేరినారు. అనువంశీకమైన ఆచారాలు అటకెక్కినాయి. వేల సంవత్సరముల సంస్కారం సాంప్రదాయాలు కరి మ్రింగిన వెలగ పళ్ళై పోయినాయి . ఈ తరం వారు ఇంటిపట్టు చదువు కంటే పట్నం చదువులకు ప్రాముఖ్యత ఇచ్చుట చేత ఇంటి ఆచార వ్యవహారాలు గమనించే అవకాశాలను పోగొట్టుకొన్నారు. పులి మీద పుట్రలా అతిశయించిన ఆంగ్ల భాషా ప్రభావము, ఆదరము లేని అమ్మ భాష అన్నీ నేటి స్థితికి కారణాలు. ఇంతకూ మునుపొకసారి నేను చెప్పిన పద్యం గుర్తుకొస్తున్నది .
నరవర నీచే నాచే
వరమడిగిన కుంతి చేత వాసవు చేతన్
ధర చేత భార్గవునిచే
నరయంగా కర్ణుడీల్గె నార్గురి చేతన్
అది నేటి దుస్థితి . ఎప్పుడైనా తండ్రి తో వెళ్ళే కొడుకు దారి లో కనిపించిన దేనినో చూపించి 'నాన్నా అదేంది' అంటే ' ఛ! నీకు తెలియదు నోరు మూస్కో'అన్నాడట. అసలు విషయమేమిటంటే తనకే తెలియదని కదా! అందువల్ల పిల్లలు గాలిపటాలై పోతున్నారు. తెగితే అధోగతే. ఆ మాటనే నేరను ఈ విధముగా చెప్పినాను.

పైకి చేరినాను పనియేమి తాడుతో 
నన్న గాలిపడగ యాహము దీర్ప
తాడు తెగెను పటము తానంటె నేలను
రామ మోహనుక్తి రమ్య సూక్తి

అందుకే

నీవదెంత ఎత్తు నిజముగా నెదిగిన
పాదములను భూమి పైన యుంచు 
పొగరు పడితివేని పొర్లేవు భూమిపై 
రామ మోహనుక్తి రమ్య సూక్తి

 జ్ఞానము పిల్లలు స్వతంత్రముగా సముపార్జించే అవకాశమే పోగా వాళ్ళు అంతర్జాలాన్ని ఆశ్రయించి వారి వయసుకు నిషిద్ధములైన విషయాలపై దృష్టి మరల్చుతున్నారు . తల్లిదండ్రులకు తీరికలేక కార్పొరేట్ స్కూళ్ళలో చేర్చి ఎక్కువ డబ్బు కట్టినాము కదా ఎక్కువ చదువొస్తుంది అనుకొంటున్నారు. చదువు బజారు దినుసు కాదు. ఈ కార్పొరేటు స్కూళ్ళలో విద్యార్థికి ఎక్కువ శాతం మార్కులు వచ్చినట్లు భ్రమింపజేసే గారడీలు కొన్ని వున్నాయి. ఆ గారడీలతో తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తున్నారు. మా వానికి 99% మా వానికి 99.9% అని ఊగిపోయెటట్లు చేస్తున్నారు తల్లిదండ్రుల్ని. నేటి చదువుల గూర్చి ఒక్క మాటలో చెప్పాలంటే :
ఏనాటి అగ్రహారమొ
మా నాటికి మాన్యమాయె మా పని దీరన్
మీ నాటి కండ్రిగాయెను
నానాటికి తీసికట్టు నాగంభోట్టూ
అన్నట్లు తయారయ్యింది.
ఇక రెండవ విషయం 'ఏకాగ్రత తో ఒకే పని చేస్తే ఆలోచనాశక్తి క్షీణిస్తుంది. పిల్లలు పది రకాలు గా ఆలోచించాలి.' ఆలోచన , ఏకాగ్రత నా దృష్టి లో భిన్న ధృవాలు. ఆలొచనలుంటే ఏకాగ్రత పని చేయదు. ఏకాగ్రత వుంటే ఆ దరికి ఆలోచన రాకూడదు. కానీ విద్యార్థికి రెండూ కావలసిందే. పాండవులే గెలవాలనే ఆలోచన గురువు డ్రోణునికీ వుండినది శిష్యులు పాండవులకు వుండినది. ఏకాగ్రత తోనే విద్యను సాధించి వైరులపై విజయము సాధించినారు. ఇక ఏకాగ్రత చిట్కాలకంటె, చెప్పే\ఇచ్చే దానికంటే, ఇచ్చే వానిమీద నమ్మకము వుండాలి.
ఇక మూడవ విషయానికొస్తే టీచర్ల విషయం లో వారితో నేను ఏకీభవించుచున్నాను. మన సాంప్రదాయములో శిష్యునికి'గురువు' వుంటాడుగానీ టీచర్ (బోధకుడు) ఉండడు. గురుత్వము అన్న మాటకు ఇంగ్లీషులో అర్థం 'డెన్సిటీ.' 'గురువు'జ్ఞానమునకు తోడుగా
సమయస్పూర్తి , విద్యార్థి పై శ్రద్ధ కలిగి ఉంటాడు. ఇంగ్లీషు లో 'కమిట్మెంట్' అంటారు. దీనికి ఈ ఉపనిషద్వాక్యము తార్కాణము :
ఓం సహనావవతు
సహనౌ భునక్తు
సహవీర్యం కరవావహైః
తేజస్వినా వధీతమస్తు మా విద్విషావహై
గురుశిష్యులమైన మనలను భగవంతుడు రక్షించు గాక. మనలను పోషించు గాక. మనము ఊర్జిత శక్తితో పరిశ్రమించెదముగాక. మన స్వాధ్యాయము ఏకాగ్రత ఫలవంతము అగుగాక. మనము ద్వేష రహితులమై నడచుకొందుముగాక . ఇది గురుకులవిద్య గురుశిష్య సంబంధము .


*************ఇక ఉద్యోగాల విషయానికొస్తే ఆర్ధిక స్తోమత, ఉద్యోగావసరమును బట్టి ప్రయత్నాలుంటాయి .టెండూల్కర్ తో కూడా క్రికెట్ నేర్చుకొన్న వాళ్ళందరూ అంతటి గొప్పవారు కాలేదు. ఒక సారి సహస్రావధాని వేదముర్తులు మాడుగుల నాగఫణి శర్మ గారితో ముచ్చటించేటపుడు ఆయన అన్న ఒక మాట నా మనసుకు హత్తుకొని పోయింది. 'ఆ శ్రీ మాత దయ వల్ల నేనీ స్థితి లో ఉన్నాను గానీ నాకన్నా ఎందరో పండితులు, విద్వాంసులు ఉన్నారన్నారు. 'దానే దానే పె ఖానేవాలేకా నాం లిఖ్ఖా రహ్తాహై' అంటే ఇదేనేమో. ఎంతటి గొప్పదనము ఉన్నా వారివారి అదృష్టము మీదనే వారి గుర్తింపు సంఘములో ఆధారపడుతుంది. దానికి మనము కర్తలము కాదు. అట్లని జ్ఞాన సముపార్జన చేయుట వాళ్ళ ప్రయోజనమేమి అనుకొంటే అది మూర్ఖత్వమే ఔతుంది. ఎవరు గుర్తించినా గుర్తించక పోయినా ఆ జ్ఞానము భగవంతుని గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. భగవంతుడు మనలను గుర్తించి తత్వసాదనలో మనకు ఉన్నతి ప్రసాదించుతాడు.
ఈ సందర్భములో నా అనుభవమును తెలుపుకుంటాను.

ఒకసారి నేను నా పై అధికారితో కార్యాలయ వెలలు ముగిసిన తరువాత ఎదో లోకాభిరామాయణము మాట్లాడుకుంటూ వుండినాము.  అప్పుడు నేను పనిపైన ఎంత శ్రద్ధ, భక్తి, ఉత్సాహము ఉన్నా తగిన గుర్తింపు అన్నది అదృష్టము పైనే ఆధార పడుతుంది అని ఆయనతో అన్నాను. మీ మాటను ఏ విధముగా సమర్ధించుకొంటారు అని వారు అడుగుట తటస్థించినది.

సంతప్తాయతి సంస్తితస్య పయసో నామాపినఃశ్రూయతే
ముక్తాకారతయా తదేవ నళినీ పత్రస్థితం రాజతే
మధ్యే సాగర శుక్తి మధ్య పతితం తన్మౌక్తికం జాయతే
ప్రాయేణాధమ మధ్యమోత్తమ గుణాః సంసర్గతో దేహినాం|
అని తమ నీతి శతకములో భర్తృహరి గారు  చెప్పినారు.

మీ కొరకు ఆ శ్లోకము యొక్క తెనుగుసేత కూడా వినిపిస్తాను. ఇది ఏనుగు లక్ష్మణ కవి గారి అనువాదము.
నీరము తప్త లోహమున నిల్చి యనామకమై నశించు యా
నీరమె ముత్యమట్లు నళినీదళ సంస్థితమై దనర్చు యా
నీరమె శుక్తిలో బడి మణిత్వము గాంచు సమంచిత ప్రభన్
బౌరుష వృత్తులిట్లధము మధ్యము నుత్తము గొల్చు వారికిన్
నీటి బిందువు వేడి ఇనుముపై బడితే ఆవిరైపోతుంది. అదే నీటి చుక్క తామర ఆకుపై పడితే ముత్యమువలె ప్రకాశించుతుంది. అదే ముత్యపు చిప్పలోనే పడితే నిజముగా ముత్యమే అయి కూర్చొంటుంది . కావున మనము అధము, మధ్యము నుత్తముల గొలుచుటకు ఇది చక్కని ఉదాహరణము. అని ఆయనతో నేనన్నాను. ఆయన తిరిగీ ఒక ప్రశ్న వేసినారు. మరి ఆవిరయిన నీటి చుక్క  ఈసారి ముత్యపు చిప్పలో పడవచ్చు కదా! అని. అందుకు జవాబుగా నేనన్నాను ‘ఆవిరయిన నీటి చుక్క ముత్యపుచిప్పలో పడగలుగు సంభావ్యత (Probability) 33.3 శాతమే కదా! అది తిరిగీ వేడి ఇనుము మీద కూడా పడవచ్చును అన్నాను. ఆయన నా మాటను ఒప్పుకొనక తప్పలేదు. కావున మనము అదృష్టమును గూర్చి ఆలోచించక మన బాధ్యత అంటే జ్ఞాన సముపార్జన మాత్రము మనము అకుంఠితముగా చేయ వలసినదే!

, పెద్దల మాటను గమనించండి. జీవితానికీ మరియు వ్యక్తిత్వ వికాసమునకు ఈ మాటలు ఎంతగా తోడ్పడుతాయో గమనించండి.

విలువైన మాట -PERSONALITY DEVELOPMENT


కో లాభః? గుణి సంగమః, కిం సుఖం? ప్రాజ్ఞతరై సంగతి:

కా హాని? సమయచ్యుతి, నిపుణతా కా?ధర్మ తత్వే రతి:

కిం శూరః?విజితేంద్రియ:;ప్రియతమా కా?సువ్రతా. కిం ధనం?

విద్యా, కిం సుఖం?మప్రవాస గమనం రాజ్యం కిం?మాజ్ఞా ఫలం. 

అర్థము:--మనకు లాభం కలిగించేది సద్గుణాలు కలిగిన సజ్జనుల సాంగత్యము. ఇబ్బంది కలిగించే విషయం 

ప్రాజ్ఞులు కాని పామరుల సాంగత్యం, విలువైన సమయాన్ని వృథాగా గడపటం అనేది మనకు హాని 

కలిగిస్తుంది.(సమయము చాలా విలువైనది దాన్ని వృథాగా గడప కూడదు). నైపుణ్యం సిద్ధించాలంటే  

ధర్మాన్ని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి . జితేంద్రియత కలిగియుండవలెను. వాడే శూరుడనబడతాడు. 

అనుకూలవతి యైన భార్యయే ప్రియతమురాలు. విద్యయే నిజమైన ధనం. సుఖమంటే ఏమిటి?

విదేశాలకు పోకుండా స్వదేశం లోనే వుండి వున్న దానితో తృప్తి పడి జీవించటం .నీ ఆదేశం ఎంత మేర వరకు చెల్లుబాటవుతుందో అంతవరకే నీ రాజ్యం.

Friendship with the virtuous is
 beneficial for character building. It is always the best to keep away from selfish and greedy. Spending time in gossips is suicidal. Time will never wait for us. To become an expert in following the righteous path learn about the dos and don'ts from the right guru (Here Guru need not be a teacher, anybody who can lead you in the right direction.). Here, control over the sensory organs is to be perfected. That will make you remain undeterred by the circumstances. The thickest friend is wife, They should always endure to be the admixture of milk and water.  Knowledge and Education form the real wealth. Happiness is that which comes only by contentment and not by going abroad for earning wealth. Your kingdom is only up to that extent till which, your word is final.
ఈ నాటి భోజనపు అలవాట్లు పిల్లలపై ఎంతటి ప్రభావాన్ని చూపుతున్నాయో గమనించండి. పిల్లలలో అధికాంశము ఊబకాయముతోనే ఊపిరి పీల్చుటకు కూడా కష్టపడుతూ చెత్త తిండినే (Junk Food) తినుటకు ఇష్ట పడుతూ వున్నారు. జీన్స్ మీద యువతకు మోజు పెరిగిన కాలమునకు నాకు 40సంవత్సరములు. నా ఈడు వారు కూడా అవి వేసే వారు. నేను అవి శరీరములోని మర్మావయవములను అణచిపెట్టుటవల్ల ఆరోగ్యమునకు ముప్పు అని చెప్పేవాడిని. విన్నవారు లేరు. ఈ రోజు పెద్దపెద్ద వైద్య నిపుణులు ఆ వస్త్రమును వాడుట వల్ల సంతానోత్పత్తికి విఘాతమని తెలుపుచున్నారు . ఇది తెలుసుకొని తీరవలసిన మాట కావున అరమరిక లేకుండా చెప్పుచున్నాను. దయతో తప్పుగా తలవకుండా జాగ్రత్తగా గమనించేది. శరీరములో వేడి పెరిగితే పురుషులకు వృషణములు క్రిందికి జారుతాయి అసంకల్పితముగానే! అదే చల్లదనము కలిగితే అవి శరీరముతో సంఘటితమౌతాయి. ఇది శరీర ప్రకృతి. మరి జీన్సు పాంటు వేస్తే ఆ అవకాశమేలేదు. దానివల్ల బీజోత్పత్తి సన్నగిలుతుంది. వంద్యత్వము (Infertility) పెరుగుతుంది అది ఆడవారికైనా మగవారికైనా! ఇవికాక వేరు రుగ్మతలు కూడా రావచ్చు. మరి దీనిని ‘దారిన బోయే దరిద్రమా మాయింటి వరకూ వచ్చి పో ‘ అనుట కాదా!

ఈ నాటి భోజనపు అలవాట్లు నేను వ్రాసిన పద్య రూపములో  ఒకసారి గమనించండి.
పిజ్జాలు బర్గర్లు ప్రియ భోజనమ్మాయె 
మంచిజొన్నల రొట్టె మరుగు పడియె

నూడుల్సు ఫాస్తాలు నోరూరగా జేసె
సద్దియంబళులెల్ల సమసి పోయె 

చాక్లెట్లు కేకులు చాల ప్రియమును గూర్చె
వేరుశెనగలుండ వెగటుగలిగె

కెంటకీ చికెనేమొ కంటికింపైపోయె 
ఇంటి వంటకాలు మంట గలిసె 

వైను బ్రాందీల విస్కీల వరద మునిగి
స్టారు హోటళ్ళ కేగేటి సరళి పెరిగి 
పనికిమాలిన యలవాట్ల ఫలితమంది
ఆసుపత్రుల పాలైరి అధిక యువత 

జీన్సు పాంటు లేక జీవితమ్మే లేద
టంచు తలచి తనదు డాబు జూప
సంతు కలుగ తనకు సాధ్యపడదటంచు
పెళ్ళిచేసుకున్న పిదప తెలిసె
ఇది నేటి పాశ్చాత్య నాగరికతా వ్యామోహము.
నేను FACE BOOK లో వ్రాసిన వ్యాసమునకు




1. As we are experienced and belonged to older generations we feel that is right and appropriate for all times. ఇది వారి విమర్శలో నేను గమనించిన మొదటి మాట.
ఎన్నో సినిమాలు వచ్చినాయి. పోయినాయి. మాయాబజారు స్థానము నేటికీ సుస్థిరమే! నేటి కాలపు ప్రేక్షకులకు అనుకూలముగా 'బాహుబలి' వచ్చియుండ వచ్చును. అత్యన్నతమైన సాంకేతిక విలువలనూ కలిగియుండ వచ్చును. కానీ నటన అన్న అంశమును మరియు దిగ్దర్శనము (Direction) అన్న అంశములను తీసుకొంటే అందులోని భావుకత, స్నిగ్ధత, సౌకుమార్యము, కథనము, ముఖ్యముగా పాండవులే లేకుండా కథను నడిపించిన విధానము నభూతో నభవిష్యతి అని ముక్త కంఠము తో చలనచిత్ర పండిత దిగ్దంతులు తెలిపుతూనే వున్నారు. మంచిని మెచ్చుకొనుట మానవ సహజము. దీనికి క్రొత్త పాత అన్న భేదము ప్రాధాన్యము కాదు. అసలు 'Steering' త్రిప్పకుండా బండి ఒకే
Road పై మలుపులు లేకుండా పయనించదు. స్థానికముగా ఎన్నివెంకటేశ్వరాస్వామి గుళ్ళు 
వున్నా భక్తులు తిరుమలకే పోవ ఉత్సాహము కలిగి యుంటారు. కావున పెద్దలయి నంత మాత్రమున వారుచెప్పేదే సమంజసము కానవసరములేదు అట్టులని కాకుండానూ వుండనవసరము లేదు. కానీ చదివేవారు/వినేవారు మంచిచెడ్డల నరసి తమకనుకూలమగు విధానమును పాటించవచ్చును.
వినదగు నెవ్వరు చెప్పిన
వినిననంతనే వేగుపడక వివరింపదగున్
కని కల్ల నిజము తెలిసిన
మనుజుడెపో నీతిపరుఁడు మహిలో సుమతీ!  అని బద్దెనామాత్యుడు చెప్పనే చెప్పినాడు కదా!


మానవులు అంటే మానవ సంబంధము కలిగియుంటేనే కదా! ఎంత కంప్యూటరు చదువులు చదువుతూ వుండినా, ఆట వచ్చినా రాకపోయినా కొన్ని వేల రూపాయలు పెట్టి క్రికెట్ బాట్ పట్టి, గ్రౌండ్ లేకపోయినా బంతిని బలంగా కొట్టి, గాజు కిటికీలను పగులగొట్టి, తమ ఇంటివి కాదు సుమా!, సంతోషించుట నేడు సహజ సాధారణ విషయము. మరి పిల్లలు బయటికి పోకుండా తమ కంప్యూటరుకు అతుకు కొనియే ఉండవచ్చును కదా! మట్టిలో ఆడుట మంచిది కాదు అన్న అభిప్రాయముతో తల్లిదండ్రులు పిల్లలకు సులభమైన ఆటలకు దూరము చేసినారు. మరి క్రికెట్టు మట్టిలో కాదా ఆడేది. ఇక చదువు విషయమునకు వస్తే ముందు పిల్లలు నేర్చుకొన వలసినది వాచకము. ఈరోజు '', '', '' లు లేవు. మరి ఆ ధ్వనులు పలుక వలసి వచ్చినపుడు ఎంత కృతకముగా పలుక వలసి వస్తుందో? అసలు కొన్ని పదాలను ఈ అక్షరాలు లేకుండా పలికితే బూతు మాటలౌతాయి.
ఇక విద్య. ఈ భారతదేశము యెన్నో ఆవిష్కరణలకు ఆలవాలము. కానీ ఇప్పటికీ ఈ భూమికి చెందిన ఆ మహనీయులను గూర్చి పిల్లలకు నేర్పుచున్నది లేదు. ఆత్మగౌరవము అన్నింటికీ ముఖ్యము. అదే నేర్పించకపోతే అమెరికా పంౘయే మనకు గతి. అసలు ఇక్కడ నేను '' కు బదులు '' వ్రాస్తే అమెరికా 'పంచ' అయిపోయి అర్థము అనర్థ మౌతుంది.

2. Everything is individual, his interests, his concentration, his intellect, his application, his thoughts to shape himself.
Any progress requires clarity, communication, understanding appreciation and involvement.
మరి దానికి ఇది మంచి ఇది చెడ్డ అని విడమరిచి చెప్పే పెద్దలు/గురువు(అది తల్లిదండ్రి రూపములో కూడా కావచ్చును) కావలెను కదా! అంతా ఎవరికి వారే నిర్ణేతలైతే ఒకే కుటుంబము సమాజము ప్రాంతము దేశము ఏమీ అవసరము ఉండదు. ఏదయినా మనది అనుకొన్నపుడే మనకు ఒక బాధ్యత ఏర్పడుతుంది. అసలు అద్వైత సిద్ధాంతము చెప్పేదే ఆ మాట! అట్లని నేను ‘ అనిత్యాని శరీరాణి అందరి సొమ్ము మనకే రానీ’ అని అంటున్నానని తలువవద్దు. ఒక ప్రియ భావన కలిగియుండవలెనని చెబుతున్నాను.

3. People learn without teachers through distance education today.

అందుకే అటు చెప్పే వారి సత్తా కానీ ఇటు వినేవారి ఏకాగ్రత కానీ ఎవరూపట్టించుకొనుట లేదు. 'ఎద్దు ఈనింది అంటే గాట కట్టివేయ మన్నట్లయింది' నేటి చదువుల తంతు. 'అసలు గురువు' అన్నమాటే కనుమరుగై పోయినది. ఈవిధముగా అన్నీ పోగొట్టుకొంటూ పోతే 'తిరుమలకుపోయి వచ్చిన వాని జుట్టు చంద మౌతుంది' నా బాధ ఒకటే! మనకు నమ్మకముగా తెలుసు ననుకొన్నది పదిమందికి పంచుదాము. విందుకు వెళ్ళినవాడు మనము వడ్డించిన వన్నీ తిని తీరవలెనను పట్టింపు ఉండదు కదా! 'లోకో భిన్న రుచి.'
మనమంతా ఒకటై మంచిని పంచుదాము. మంచిని పెంచుదాము. అసలు మాతృభాషకు మళ్ళీ పట్టము కడదాము.

ఈ మాటను ఒకసారి గమనించండి :
మాతృమూర్తి, మాతృ భూమి మాతృభాష మన సర్వం
మన సంస్కృతి మరచినచో   నరకారోహణ పర్వం
అంటే అమ్మరా అంటే ఆవురా
అంటే ఇల్లుఇలఈ అంటే ఈశుడురా
అద్భుతమౌ  ఈ పదాల కాలంబన ’ ‘లు 
అవి నేర్వక పోయినచో మన సంస్కృతి  నేల రాలు
మన ఉగాది, సంక్రాంతి, సంబరాల దీపావళి
మన కిచ్చిన పురాణములకు ఇదే మనదు నివాళి
అర్థమున్న పండుగలివి ఆచరించ దగినవి  
అన్యుల పండగలన్నీ అవసరాల కేర్పడినవి
జన్మదినము జరుపు కొనగ దీప మొకటి దేవుని కడ
వెలిగించుచు  మ్రొక్కరయ్య భక్తి తోడ ఆయనయెడ
దీపమార్పు పద్ధతులను దరి జేరగ నీయ కండి
అర్ధరాత్రి దయ్యాలకు ఆటపట్టు తెలుసుకోండి 
నీ భాషా నీ సంస్కృతి అగునయ్యా నీ ప్రకృతి
అది కాదని అనుకుంటే  నీ వౌదువు వికృతి 
తెనుగు తేనె తేట మరియు మల్లె విరుల తోట

అవి కలిగిన నీ బ్రతుకగు నిక్కముగా పైడి బాట  
శుభం భూయాత్  


No comments:

Post a Comment