శంకర దాస అష్టోత్తర శతి
ఒక పరిచితుడి స్పందన
దీనిని శంకర దాసుని కవిత్వము గురించిన సమీక్ష కన్నా అష్టోత్తరశతి ఆవిర్భావ సందర్భములో కవి గురించిన పరిచయ వాక్యాలంటే ఉచితంగా వుంటుందేమో!
ఎందుకంటే ఈ కవిత్వాన్ని చదివే స్థాయి ఉందేమో కాని సమీక్షించే స్థాయి నాకుందని నేననుకోవట్లేదు కాబాట్టి.
దాదాపు మూడున్నర దశాబ్దాల పరిచయములో రామ్మోహన్ రావు గారి కవితా సాధన గురించి చెప్పాలంటే ఇంత వరకు విద్యాభ్యాసములో గణితములోను,
తరువాత వృత్తి లో బ్యాంకింగ్ లోను, వాటిని
(గణితము బ్యాంకింగ్) సాధన చేసియుండవచ్చు గానీ, కవిత్వాన్ని వ్యాకరణాన్ని గురుముఖంగా గానీ స్వతంత్రంగా కానీ
పూర్తి స్థాయిలో సాధన చేసినారని చెప్పుట కుదరదు అదీ గాక చదివిన చదువు చేసిన ఉద్యోగం ఇప్పుడు వ్రాసిన కృతికి ప్రత్యక్ష సంబంధం వుందని అనలేము. ఈయన జీవితములో వృత్తి -
ప్రవృత్తి (banking – కవిత్వము) విజాతి
ధృవాలుగానే ఉన్నాయి. రెండింటికీ సామీప్యత కానీ సారూప్యత కానీ ఏమైనా ఉందీ అంటే ’ఆర్జవ’మొక్కటే. ఉద్యోగ పర్వములో సంఘ ప్రతినిధిగా (Union Representative) “మీరు నిజం
చెబుతున్నారనుకున్నా” అని ఒక జాతీయ స్థాయి నాయకుని కొర్రు కాల్చి వాత పెట్టినా, “మదర్ తెరెసా”
లాంటి వారిని Bank Premises కు రప్పించ గలిగినా మాటల లోని సరళత్వముతో పాటు మనిషిలో వుండే సూటి తనము ధాటి తనము తో మాట్లాడే
నేర్పరి తనము మాత్రమే కనిపిస్తాయి
మనకు. మొదట్లో తన కవిత్వాన్ని చిన్నచిన్న టుమ్రీ లగాను , స్వతంత్ర పద్యాలు గానూ చాటువుల్లా
గానూ కలమునుండి వెలువరించిన ఈ కవి కాలము గడిచే
కొద్దీ వయసూ దానితోబాటూ అనుభవము జ్ఞానము పెరిగి
ఆయన ‘రామ మొహనుక్తి రమ్య సూక్తి’ వ్రాయటం జరిగింది. స్వయముగా సంస్కృతాంధ్ర మహా పండితుడైన శ్రీయుతులు C.V. సుబ్బన్న
శతావధానిగారు
పుస్తకావిష్కరణ సభలో వీరిని గూర్చి మాట్లాడుతూ రామమోహన్ గారి లోకానుశీలన
అసాధారణము అన్నారు. బహుగ్రంధకర్త యగు Dr. ప్రభాకర రెడ్డి గారు, వీరు అల్లిన ఆటవెలదులను గూర్చి అమితముగా ప్రశంసించినారు.
ఆ పుస్తకము వేమన శతకము వలె
సమకాలీన లోకానుభవ, సందేశముల, గూడి యున్నది.
వీరిని గూర్చి ఇంకొక మాట చెప్పవలసియుంది. ఒక సారి వారు తమ పనిమీద కడప వచ్చుట తటస్థించినది.
నేను అప్పుడు SBI కడప AGM గా వుండినాను. తన పని ముగిసిన పిదప దాదాపు సాయంకాలము
4.30 సమయములో ఆయన తాను కడప వచ్చినట్లు
ఫోన్ చేస్తే ఉభయ కుశలానంతరము నేను ఆయనతో ‘ఒక సారస్వత సమావేశము BANK లో ఏర్పాటు
చేస్తాను మీరు మాట్లాడుతారా?’ అని అడిగినాను. నా మాట కాదనలేని వారు సరేనన్నారు.
నేను వెంటనే Staff కు ఒక circular పంపి
ఉపన్యాసమునకు తగిన ఏర్పాట్లను చేయించినాను.
వారు ‘కాలగణన’ అన్న అంశముపై మన ఋషులు, శాస్త్రజ్ఞులు ఏవిధముగా ఈ ఖగోళ గణనను
ఎంత నిర్దుష్టముగా అందించినారు నేటికినీ పాశ్చాత్య కాల గణన లోని లోసుగులేమిటి అన్న విషయాలను గూర్చి అనర్గళముగా మాట్లాడుతూ
ఆకట్టుకొన్నపుడూ, ఆ తరువాత శ్రోతల ప్రశ్నలకు సమాధానాలిచ్చినపుడూ, నాకర్థమైనది ఏమిటంటే, అది తన ఉద్యోగమైనా,
వ్యాసంగమైనా, Union విషయమైనా అంకిత భావముతో చేస్తాడన్నది. బహుశ అది ఆయనకు
భగవంతుడొసగిన విశేషగుణము కావచ్చు. అసలు
పరమేశ్వరానుగ్రహము లేకుండా, వ్యాకరణ ఛందశ్శాస్త్రాలు గురుముఖతః నేర్చుకోకుండా
పద్యరచనా వైదుష్యము కలుగుట భగవత్కటాక్షము
గాక వేరేమిటి? అని నాకెప్పుడూ అనిపిస్తూవుంటుంది. అట్లు కాకుంటే ఆంధ్ర సంస్కృతాంగ్లములందసమాన పండితులై, అవధాన
రారాజైన రాళ్ళబండి కవితా ప్రసాద్(Director, Cultural
Council, The then Andhra Pradesh) గారి చేత, ఏమాత్రమూ పరిచయము లేకపోయినా, Facebook లో పద్యముతో కూడిన వీరి రచనను చూసి ‘Sir, you are highly resourceful and creative! మీ పద్య ధారా
చక్కగా వుంది’ అన్న ‘కామెంట్’ పొందగాలుగుతారా! కర్మ నిష్ఠా, సంభాషణా చాతుర్యము, భగవద్భక్తి,
దేవుడు ఆయనకిచ్చిన వరములు. గనుకనే ఈ నిసర్గ
రమణీయ భక్తి రస అష్టోత్తర శత కృతి .
ఈ కావ్యములో నాకు కనిపించిన, నాకనిపించిన కొన్ని మెరుపులు
1.
కందెన లేని బండి – చాలా సబబైన ప్రయోగమనిపిస్తుంది. పెట్రోలు, డీజిల్ లేకుంటే Automobiles
అస్సలు కదలవు. కానీ ఎడ్ల బండి లాంటి బండికి కందెన లేకుంటే ఘర్షణ
పెరుగుతుంది కాబట్టి బండి ఆగిపోదుగానీ నడవటం కష్టతరమై పోతుంది. జీవితమూ అంతే! (17)
2.
సంద్రములో త్రాగు నీరు ఎక్కడైనా దొరుకుతుందా?
అలాగే నాలో అన్నీ తప్పులే
ఉన్నాయన్నది కాస్త అతిశయ మనిపించినా చాలా Open Submission . (4)
3.
నేటి నాయకుల ఆగడాలను అధికార దుర్వినియోగాన్నీ ధన దాహాన్ని ప్రజల అసహాయతను ప్రజాస్వామ్య విలువల పతనాన్ని చూసి, నిస్సహాయంగా లయకారుని నిగ్గదీసి ప్రార్థించిన తీరు నేటి సగటు మనిషి నిస్పృహకు అద్దం పట్టినట్లుంది (39-42)
4.
జానెడు జిట్టెడు బెత్తెడు మూరెడు అట్లే
చిట్టీ చటాకు పావు సోల
ఇవన్నీ Units of measurements for length/distance and volume ఈ పదాలు చాలా స్థానిక మైనవి (కొన్ని మాత్రం నిఘంటువులలో దొరుకుతాయి )
5.
గడ్డితో నడిచే ఎద్దు వాహనం – ఈ ప్రయోగం రావాలంటే కొంత Minimum గ్రామీణ నేపధ్యం (లేదా
పరిశీలన) ఉంటేనే సాధ్య పడుతుందేమో! అట్లే Cell, Jeans, Bike లాంటి పదాల్ని ‘మల్లెల
వంటి బాలికల’ తో linc
పెట్టటము చమత్కారంగా వుంది.
6.
‘కంతులు కట్టునో’ (43 వ పద్యం 4 వ పాదం లో మొదటి పదాలు)
ఈ పద్య పాదం చూసి కాసేపు నిజంగానే Confuse అయిపోయినాను ఎందుకంటే ఈ భక్తి
రసములో ‘కంతులు కట్టటము ‘ (Instalments
repay చేయటం) ఏమిటి
అని? ఎందుకంటే అది mobile లో page break లో (6 వ పేజీ) 1st line గా immediate గా open అయింది
(అంటే cell on చేయం గానే) ఆ తరువాత scroll
down/up చేసుకున్న తరువాత గానీ ఆ పద్య పాదం యొక్క తత్వము బోధ పడలేదు. దానికి తోడూ ఆ పద్యమే మయసభ తో ప్రారంభ మౌతుంది. ఇది మాత్రం బహుశా బ్యాంకర్స్ కే స్పురిస్తుందేమో !
ఎవ్వరు లోకనాథు
డతడెవ్వడు భక్త వశంకరుండు,
తో
డెవ్వడు సర్వదీన
తతికెవ్వడు భూత శుభంకరుండు,వా
డెవ్వడు
సర్వలోకముల నేర్పడ జేయుచు కాచి డాకొనున్
అవ్వలిదిప్ప
యల్లునికి అంజలి నేను ఘటింతు శంకరా!
పై పద్యము 50వది. ఇందులోని ప్రత్యేకత ఏమిటంటే, ఇది పోతన్న భాగవతము, అష్టమ స్కందము
లోని గజేంద్రమోక్ష ఘట్టములో ‘ఎవ్వని చే జనించు ......’ అన్న పద్యమును పోలియున్నా ఇక్కడ పద్యము మొత్తము ప్రథమ పురుషలో
చెప్పి ‘శంకరా’ అంటూ మధ్యమ పురుషలో ముగించడము
నాకు చాలా బాగా నచ్చింది. పూర్వము రాయల సీమలో ఈ విధమైన పలకరింపు వుండేది గానీ ఇటువంటి పద్ధతి మళయాళ దేశములో నేటికీ
మనకు కనిపిస్తుంది.
ఇట్లు చెప్పుకుంటూ పోతే ఉపోద్ఘాతమే బంగాళాఖాతమౌతుంది. చదువుతూ బోతే
ఇలాంటివెన్నో , ఎన్నో.........
(C
నీలకంఠా రెడ్డి)
సామవేదం షణ్ముఖ శర్మ
పద్య రచనను సాధించడం, దానిలో భావాలను ఆవిష్కరించ గలగడం దానిని ఈశ్వరునకు
నివేదించడం – ఒక సాధన.
ఆ సాధన లో ధన్యులయ్యారు శ్రీ చెరుకు రామ మోహన్ రావు గారు. శంకరునకర్పించిన ఈ
ఉత్పల మాలిక నిష్కపట భక్తి
నివేదిక.
“.....కాలమంత నైవేద్యము
చేసి నీకు కడు వేడుక తోడుత పద్యం మిచ్చెదన్ “ అన్న అభివ్యక్తి చక్కనిది. సమాజ
గతికి స్పందించడం, వైయక్తిక జీవితాన్ని పరిశీలించుకోవడం శివలీలలను సంస్మరిచడం,
ఆర్తిని వ్యక్తపరచడం, తననుతాను శివాంకితం చేసుకొనడం ఈ పద్యాల విషయ వస్తువులు.
తన సాధనగా వ్రాసుకున్న
పద్యమాలిక సహృదయులకు కానుకగా ప్రచురిస్తున్నందుకు సంతోషం. ఎన్నో లోకోక్తులు, నానుడులు కూడా మేళవించి మెత్తని పూలదండల
వంటి పద్యాలనల్లిన వైఖరి కవితా ప్రియులకు ఆనంద జనకం.
ఈ శివార్చనాఫలానికి వందనలర్పిస్తూ
సామవేదం షణ్ముఖ శర్మ
చందస్సుందర శంకర
కావ్యం యశసే 2 ర్థ కృతే వ్యవహార విదే
శివేత రక్షతయే సద్యః పరనివృతయే
కాంతసమ్మితతయోప దేశయుజే
అన్నది కావ్య లాక్షణికోక్తి. “ కవి కర్మ కావ్యం” అనిన్నీ. కవి అనే వాడేంచేస్తాడు?
కవనం అల్లుతుంటాడు. వాడి పనే అది. కనుక కవి
యొక్క ఆ పనినే కావ్యం అంటారు
ఆ కావ్యం ఒక్క రూపం ఏదయినా కావచ్చు. ‘
తారావళి మొదలు లఘుకావ్యం, మహాకావ్యం వరకు; శతకం మొదలు ఖండకావ్యం వరకూ’ ఏదయినా
కావ్యమే.
అయితే ‘ సాహిత్య చరిత్ర రచయితలు తమతమ ఆలోచనల మేరకు పరిశీలనలో తమకందిన విధాన
దర్శనం మేరకు ‘అనువాద కావ్య ప్రబంధ’ యుగాలనీ; ‘తూర్పు చాళుక్య, కాకతీయ, రెడ్డిరాజుల,
రాయల యుగాలని పలురీతుల సాహిత్య యుగ విభజన’ గావించారు.
కాని.....ఏ యుగంలో, ఏ కవి వ్రాసిన, ఏ రచన అయినా ‘ అది కావ్యమే’. ఆ రీతిని శతకమూ
ఒక చిరు కావ్యమే. నన్నయ కాలం నుండే ఈ శతక రచన ఆరంభమైన దని చెప్పవచ్చు.
ఏ ప్రక్రియ ఏ కాలము నుండి ఆరంభమైనా అసలు ఎందుకు ఈ కవులు కావ్యాలు రాస్తారు?
అనే ప్రశ్నకు సమాధానమే పై లాక్షణికోక్తి.
ఆదృష్ట్యా “ శంకర శతక కర్త “ శ్రీ చెరుకు రామ మోహన్ రావు గారు ఈ రచనెందుకు
చేసినట్లు ? అని ఆలోచిస్తే “ శివేత
రక్షతం” అన్న నిమిత్తమే ఇది వ్రాశారు అని నిశ్చయంగా అర్థమౌతుంది.
ఎందుకంటే శ్రీ రావు గారు తానందుకొన్న విద్యార్హతల రీత్యా ‘భాషాపండితుడో,
బోధకుడో’ కాదు. వృత్తి రీత్యా స్టేటు బ్యాంకి ఉన్నతాధికారిగా బహువత్సర పదవీ నిర్వహణ గావించి విశ్రాంతి తీసుకుంటున్న వారు. ఇంట్లోనూ
ఆధునిక సాంకేతిక విధ్యాధ్యయన వాతావరణమే తప్ప ‘భాషాభిరుచో, అభినివేశమో’ కల కుటుంబ
సభ్యత్వం కానరాదు.
మరెందుకు వీరికీ కావ్యరచానాభిలాష అంకురించింది?
“కవిత కన్య మనింటి ఆడపడచు కాకున్న ఇల్లాలు” అంటూ ఒక పద్యం చెబుతూ కీ.శే. కావ్య
తీర్థ ముద్దులపల్లి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు “అది కేవలం పూర్వ జన్మ కృత పుణ్య వశాన లభించేదే” అంటారు. ‘అదుగో అలాంటి
పూర్వజన్మ పుణ్య కర్మ ఫలంగా’ రావు గారికి ఈ పద్య విద్య అలవడింది. దానికి వారి మాతృభాషాభిమానము,
నిరంతర గ్రంధ పఠన , పరిశీలనాది విశేషములు, శబ్దార్థ విషయజ్ఞాన సంపాదనేచ్ఛ, పండితులు, కవులు తదితర భాష కోవిదుల సాంగత్యము
తోడై పూవునకు తావి అబ్బిన చందాన కవిత పంకజం వెల్లివిరిసింది.
కేవలం తన ఆత్మా సంతృప్తి కోసమే కవి రచన చేస్తాడు. ఇదే ఏ కవి కైనా తొలి
ఉద్దేశ్యం. తాను వ్రాసినది తనకు సంతృప్తిని కలిగిస్తే మహదానందం చెందడం కవి సహజ
లక్షణం. ఆ తరువాత ఆ ఆనందాన్ని ఇతరులతో పంచుకోవాలని తాపత్రయ పడుతాడు.
‘తన కవిత సమాజాన్ని దేశాన్ని ఉద్ధరించేది కావాలి’ అని ఏ కవీ ప్రారంభ దశలో
సంకల్పించడు. ‘తన రచనలు తనకు సంపదనందించాలి’ అనుకొనే ‘కవుల దారి వేరు’.
కానీ శ్రీ రావు లాంటి ఎందరో కవులు శ్రీ రావు లాంటి కవులు ‘తమ కవిత్వం
స్వాత్మానందాన్నిస్తే చాలు , దానిని చదివి ఇతరులున్నూ ఆనందిస్తే చాలు’ అనుకొంటారు.
అలాంటి సద్భావన తోనే రావు గారు ఈ ‘శంకర శతకాన్ని’ రచించారు.
ఇందులో విశేషమేమిటంటే ‘కవిత్వ రచన
వీరి వృత్తి కాదు, నిత్యాభ్యాస విద్య కాదు;
కాక పోయినప్పటికీ తమకున్న పరిమిత శబ్దార్థ పరిజ్ఞానము తోటే – పద ప్రయోగం లోనూ, ప్రాస ప్రయోగం లోనూ, చమత్కృతి
ప్రయోగించారు. అదే విశేషం.
ఇక శంకరుడు ‘శ్రీకంఠుడు’ గా విష్ణువు ‘శ్రీధరుడు’
గా ప్రసిద్ధులు. శంకరుని ‘శ్రీధరా! అని సంబోధించడం లో చాతుర్యమేమిటంటే ‘శ్రీ – విషమును, ధరుడు – కంఠము నందు
ధరించిన వాడు అనే విశిష్టార్థములో
వాడుకోవడం.
అలాగే అనుప్రాసా సౌందర్య సృష్టి .
‘అల్లము ,బెల్లము, ఉల్లము, ఉల్లసిల్లు, తల్లికి తల్లి’
‘యోగము, యాగము, రాగము, త్యాగము’
‘శాంతము, దాంతము, సాంతము, ప్రాంతము’
‘కింకర, వశంకర, శంకర, పరా’
‘వచ్చును, కలుగ వచ్చును, లోపమున్ వచ్చును’
‘ఇల్లు ముల్లె, సెల్లు, ఎల్లలు, ఎల్లరి, అల్లరి, మల్లెల’
‘నారద, పారద, జార ద, మార ద’ వంటివి అనేకం దర్శనమిస్తాయి, రావు గారి
శబ్దప్రయోగాభిలాషలో. అలాగే యమకాలంకార వైచిత్రిని ఎడనెడ ప్రదర్శించే ఉత్సాహాన్ని
నింపుకున్నారు తమ కవిత్వ రచనలో. ‘తారక’ శబ్దాన్నీ ‘వాసన’ శబ్దాన్నీ అర్థవంతంగా
యమకం గా మలచుకొనిన తీరు, రావు గారి ప్రాచీన కావ్యాధ్యయన, పరిశీలనాసక్తిని చాటేవే.
వీటన్నిటికీ తోడు ఈ శతకంలో ‘స్వీయ రచనానుభూతులు, విరక్తి, విచారము, శరణ భావన, ఆస్తిక్య
భావము, సమాజ దురంతాలు, నేటి నేతల రీతులు, యువత పెడదారులు’ వంటి సమాజ దృశ్యాన్ని, వాటి
ఎడ తమ, సంతాపాన్ని, ప్రజలను, సమాజాన్ని, దేశాన్ని, కాపాడ రమ్మని అర్థించే వేదనా
నివేదనము – వారి సహజ శైలి పాఠకుల కళ్ళకు శతక పఠన కుతూహలాన్ని
రేకెత్తిస్తాయి. ఏది ఏమయినా, శ్రీ రావు గారి మాతృభాషాభిమానము, ఆంద్ర కవుల యెడల
వారికి గల అపారగౌరవాదరాలు, తెలుగు వర్ధిల్లాలనే వారి తపన, వీటన్నింటినీ ప్రతిబింబింప
జేయాలి గనుక, అందుకు వారెన్నుకున్న ‘పద్య రచనా మార్గము సర్వథా ప్రశంసనీయము.
తమ కవితా పాటవాన్ని పరమ లోక రక్షకుడైన
శంకరుని ఛందస్సుందరునిగా మలచిన తీరు అవశ్యం శ్లాఘ్యమానం!
అస్తు!
ఇతిశం
నంద్యాల
13.12.2015
జి. సుబ్రహ్మణ్య శాస్త్రి.
కార్య
దర్శి సూరన సారస్వత సంఘం
Prof. P.V.
Arunachalam
M.A.,
Ph.D., Dip. In German, F.N.A.Sc.,
Founder
Vice –Chancellor
Dravidian
University, Kuppam, Andhra Pradesh
Former
President, Indian Mathematical Society
Retd.
Professor of Mathematics and Principal
Sri
Venkateswara University, Tirupati
Charter
President, Rotary Club, Greater Tirupati
11.04.2016
అభిప్రాయం
మిత్రులు శ్రీ చెరుకు రామమోహన్ రావు, శంకరా! అన్న మకుటం తో వ్రాసిన శంకరదాస
అష్టోత్తర శతి, అన్నారు కానీ ఇందులో 135 వృత్తాలున్నాయి. ఆద్యంతం చదివాను. ఆత్మాశ్రయ
కవితకు అనువైన వాహికగా అనాదిగా ప్రాచుర్యానికెక్కినది శతక ప్రక్రియ. ఈ వాహికను
ఎంపిక జేసుకొని, జీవుని (తన) వేదనను, ఆర్తిని ఆ పరమేశ్వరునకు తెలుపుతూ, ప్రార్థనా పూర్వకంగా,
ఆర్ద్రమైన భావాలను, స్వామికి నివేదిస్తూ కొనసాగిన ఒక మంచి రచనను మన కందించారు
కవిగారు.
కృతులకు తొలిపలుకులో, అభిప్రాయాలో, ముందుమాటలో రాస్తూ, రచనలోని రసరమ్య భావాలను
ఉటంకిస్తూ, ఉదాహరణలు చూపడం ఆనవాయితీ.
ఇట్లా ప్రారంభిస్తే శతకం లోని పద్యాలను కోకొల్లలుగా ఉటంకించవలసి
వస్తుంది. అది వాంఛనీయం కాదు. పాఠకులు మెచ్చారు కూడా! అయినప్పటికీ వాచవిగా
కొన్నిటిని చూపాలి అన్న ఆకాంక్ష ప్రబలంగా వున్న కారణంగా నా అభిప్రాయాన్ని
రాస్తున్నాను.
కవిగారిని ప్రోత్సాహించిన శక్తి శంకర
భక్తి.
అందువల్లనే తొలి అడుగు లోనే
“శ్రీ గిరి వాసియై అలరు శ్రీధర కావుము..... ఏగలేను ఈ బ్రతుకు , నేవిధి బ్రోతువొ
నన్ను శంకరా! అని ప్రారంభించారు.
శంకరా! మకుటం తో మహేశ్వరుని మీద వెలువడిన
శతకాల సంఖ్య తక్కువే! వేనకువేలుగా లభించే విస్తృతమైన శతక
వాఙ్మయం లో శంకరుని మీద ఉన్న శతక సంఖ్యకు, మరొకటి చేర్చి సంఖ్యను పెంచి, మధురమైన
కవిత ధారతో మనోజ్ఞమైన కావ్య శిల్పాన్ని రూపొందించి, మన మనసులను కదిలించి, ఆహా
అనిపించే ఒక చక్కని శతకాన్ని అందించినందుకు శ్రీ రామ మోహన్ రావు గారికి అభినందనలు.
చదవండి 6 వ పద్యాన్ని :
ఉత్పల పుష్పసంపదలు ఉద్భవమందెను గుండె చెర్వులో
మత్పులకాంకితమ్మయిన మానసమందలి శ్రేష్ఠ కంజముల్
తత్పరతన్ మదీయ మృదు తత్వపు సూత్రముతో గ్రధించుచున్
హృత్పతి! మాల జేసి బహు హృద్యముగా, మెడవైతు శంకరా!
ఇందలి ప్రయోగాలు : మృదు తత్వపు సూత్రము , హృత్పతి అపూర్వాలు, కర్ణ పర్వాలు.
పద్యం 17 లోని “కందెన లేని బండి” ప్రయోగము నాకు బాగా నచ్చింది.
చూడండి 19 వ పద్యము ఎంత భావ బంధురమో !
19. వేదము నందు నుంటి వని వింటిని నేనది నేర్వలేదు ఏ
వాదము నందు పాల్గొనను వాచకమన్నది లేదుకాన నా
రాధన చేయలేనసలు రాక నిజమ్ముగ దేవతార్చనల్
శోధన మాని కావుమయ శూలి మహేశ్వర లోక శంకరా!
తన లోని భక్తి ఎంత గాఢమైనదో, ఎంత తీవ్రమైనదో, ఎంత నిక్కమైనదో వివరించే పద్యము 47 చదవండి.
47. గ్రాసము లేక సృక్కిన జరాకృశమైనను
శీర్ణమైననున్
నీ సముఖమ్ము వీడనయ
నిక్కము జీర్ణతృణమ్ము నేను,ఈ
వేసములోని పాత్రయును
వీడు క్షణంబులు దగ్గరాయె, నా
కూసము జారులోన మరి
కూర్చుము సద్వపుషమ్ము శంకరా!
భగవంతుని చమత్కారాలను
కవి వర్ణించిన తీరు చూడండి:
62. ఒక్కడు రూపవంతుడగు నొక్కడపార ధనాఢ్యుడౌ గనన్
ఒక్కడు బుద్ధిమంతుడగు నొక్కడశేష యశోవిభాసియౌ
నొక్కడదృష్ట వంతుడగు నోక్కడనంత ప్రజాభిమానియౌ
నక్కట నీచమత్కృతుల కర్థము నీవయె తెల్పు శంకరా!
సమాస నిర్మాణంలో, పదాల ఎంపికలో , అలంకారాలు అమర్చడంలో అందే వేసిన చెయ్యి మన
రామ మోహన్ రావుది.
ప్రాచీన కవితలను తలపింప జేసే పద్యాలెన్నో వున్నాయి ఈ శతకం లో!
పద్యం 78, పద్యం 81, పద్యం 84 చదవండి.
అక్కడక్కడా కాసింత హాస్యాన్ని కూడా జోడించి, పదాల విరుపులో సరికొత్త భావాలను
ప్రకటించే నేర్పరి ఈ కవి.
చూడండి పద్యం 89 :
89.సున్నయిపోయె కోరికలు సున్నయి పోయెను సర్వసంపదల్
సున్నయిపోయె బంధుతతి సున్నయిపోయెను దేహకాంతులున్
సున్నయె సన్న సన్నగను చూపులు విన్కియు జుట్టు తోడుతన్
ఎన్నగ నన్ను కావగల ఏలిక నీవయె లోక శంకరా!
సున్న అన్న పదాన్ని ఎంత శక్తివంతంగా వాడుకున్నాడో చూడండి ఈ కవి.
పద్యాలు 112, 114, పోతనను తలపింప జేస్తాయి.
112.చెట్టును వీడు మండ నెరె చీలినదౌ యొక మట్టికుండ, ఏ
పట్టుకు రాని కండ వసి వాడిన పూవుల దండ జూడ బొ
బ్బట్టుకు రాని వుండ జత బాయుచు మబ్బును వీడు ఎండ, ఏ
బట్టలు లేని మొండెముగ భాసిలె నాదు మనంబు శంకరా!
114. పేలవమైన పాటయును ప్రేలని నవ్వుల మాట పాంథులే
కాలిడనట్టి బాట భట కంధిని గల్గని కోట నీరమే
చాలని తోట తేటయగు చక్కటి మాటలు లేనిచోటు లే
*జాలము లేక నిన్ దలువ జాలని పూట లవేల శంకరా!
మానవ సమాజం లో సహజంగా వుండే బలహీనతల్ని, ఎంత చక్కగా వివరించారో కవి, చూడండి
పద్యం 117 :
117. త్రాగనివాడు నిత్య ధన దాహము చెందనివాడు
కల్లలన్
వాగనివాడు పార్శ్వ జన వంచన చేయనివాడు సంతతో
ద్వేగము లేనివా డొరుల దెప్పర కోరక యుండు
వాడెదో
రోగము లేనివా డెపుడు రూఢిగ నీభువి లేడు శంకరా!
ఈ కవికి ఉత్పలమాలలంటే అత్యంత ప్రియం. అందువల్లే ఒక్క బిగిని
130 ఉత్పలమాలలు కట్టి, చివరిగా రెండు చంపక మాలలు జత జేర్చి, రెండు శార్దూలాలు, ఒక
మత్తేభమును సంధించి వున్నారు కవి గారు. ఈ మత్తేభ శార్దూలాలు సాగిన తీరు
ప్రశంసనీయముగా వున్నది. ఛందస్సు మీద మంచి పట్టున్నదని నిరూపించుకున్నారు ఈ కవి
గారు.
ఇతివృత్తం, శైలి, అలంకార వైభవం, సమాస నిర్మాణ కౌశలం,
వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని చదివి ఆనందించామని పాఠకులను ప్రార్థిస్తున్నాను.
*****************************
శంకర శతకం – అభిప్రాయం
( వేటూరివారు)
శంకర కింకరుడైన
చెఱుకు రామమోహన్ రావుగారి శంకర శతకాన్ని
నిన్ననే అందుకొని స్థాలీపులాకన్యాయంగా పరిశీలించి ఆనందించాను. వారీ శతకాన్ని
“అష్టోత్తర శతి” అన్నారే గానీ వాస్తవానికి ఇందులో 135 పద్యకృతు లున్నవి.
ఉన్నవన్నీకూడా మకుట వైఖరినిబట్టి, శంకరుని పాదద్వయి
నర్చించడానికి ఎన్నుకొన్న ఉత్పలమాలావృత్త
కుసుమాలే! - ముచ్చటగా చివరికి చేర్చుకున్న ఐదు వృత్తాల్లోని
రెండు చంపకములు, మరి రెండు శార్దూలములు, ఒక
మత్తేభము తప్ప.
ఇదొక చమత్కారము !
రచనలో ప్రాత కొత్తల మేలు కలయికతో పాటు నేటి
కాలానికి చాలా అవసరమైన ఆస్తిక చిత్తవృత్తిని కూడా రంగరించుకున్న సత్కృతి
యిది. విశేషించి ఆర్తి ని ( 73, 198); ఆర్ద్రతను (38.61); ఆర్జవమును ( 23,40); సదాశయములను (68, 74, 77); శుభాశంసనమును (25, 26) నిండుగా నింపుకొన్న సుందర
శతక రచన.
మచ్చుకి
రెండుపద్యాలు-
“మూడవకన్ను నెన్నుదుట, ముమ్మొనవాలది చేతిలోన, రే
రేడు జటాళిపైన, బహురీతుల పారెడు గంగ నెత్తిపై,
కాడు నివాసమై దనర, కాయము భోగ విభూషణమ్ము లై
వీడక నిల్చు
శ్రీధరుడ ! వేడెద కావ గదయ్య శంకరా ! “
“ఎన్నకు నాదు
తప్పులను, ఎన్నకు ఒప్పులుకూడ నే లనన్
ఉన్నవి తప్పులే
అసలు ఒప్పులు ఉండగ నేర వయ్యరో
పన్నగభూష ! సంద్రమున పానము చేసెడు నీరుకల్గునా ?
ఉన్నటువంటి
వాస్తవము వున్నవిధాన గ్రహించు శంకరా ! ”
వీరి రచనలోని
సమర్పణ భావన, తాత్త్విక దృష్టి, భావసారళ్యము నన్ను ఆకర్షించినవి.
ఈ శతాబ్ది తొలిపాదంలొ వచ్చిన ఈ ‘శంకర శతక’ రచన నామ
సారూప్యాన్నిబట్టి , గత శతాబ్ది ఆరంభంలోనే (1900 ల్లో ) రూపుదిద్దుకొన్నా ఎనభై యేళ్ళ తర్వాతగానీ వెలుగుచూడని మరో విశిష్టకృతిని నా స్మృతిపథానికి తెచ్చింది.
అది ప్రాత: స్మరణీయులు పితృపాదులు వేటూరి ప్రభాకరశాస్త్రిగారూ, వారి సహాధ్యాయి పిశుపాటి వే0కటరామశాస్త్రిగారూ కలిసి జంటకవులై చెరొక పాదం
గానో, పద్యం గానో చెప్పిన “శంకర శతక” మది. ఆ కృతిలోనూ
బోలెడు ఆస్తిక భావనలూ,ఆధునికములైన విప్లవాత్మక భావనలూ ఆనాడే చోటు
చేసుకొన్నవి. ఇది లభ్య మైనంతవరకు , గ్రంథ రూపాన రాకున్నా , వెనుకటి పత్రికల్లో
అచ్చుపడ్డది.
పైవి రెండూ నేను
చదివి ఆనందించిన గ్రంథాలే. మీరూ చదివి ఆనందింతురు గాకని వారివీ రెండుపద్యా
లుదాహరిస్తున్నాను.
“దాసుడ నేను నీకు
నను దప్పక డగ్గర జేర దీసి నా
కోసము
శ్రద్ధబూని చెడుగుల్ తెగ ద్రెంపి త్వదేకసక్తుగా
జేసి యనుగ్రహింపు
మని చేతులు మోడ్చితి నీ వెఱుంగవే
దాసుని తప్పు
లన్నియును దండముతో సరి గాదె శంకరా ! “
“ విప్రుల బ్రహ్మ
వర్చసము వీడ్పడె, రాజుల దుర్భర ప్రతా
పప్రభ లారిపోయె, ఋషివంశ్యుల తొల్లిటి ధర్మమర్మ మాం
గ్లప్రజ పాలబడ్డది, వికావిక లైనది, భావికాల ధ
ర్మ
ప్రతిపత్తి కేమిగతి ? మా కెఱిగింపగదయ్య శంకరా ! “
( పి. వే0. – వే. ప్ర. )
నేటి ‘శంకర శతక ’ రచయిత శ్రీ చెఱుకు రామ మోహన్ రావుగారికి
హార్దాభినందన లందిస్తూ, మరిన్నిమంచి రచనలు
చేయుచు0దురుగాకని కోరుతున్నాను.
అంశ0 బుత్కృష్టమ్మై /
స0శ్రుత
పద్యోత్పలార్చ సాకల్య శుభా
శంసనమై శంభుని
కృప/
స0శ్రయమై మెఱయు చెఱకు సత్కృతి నెంతున్.
( వేటూరి
ఆనందమూర్తి - బెంగళూరు -560098. మొబైల్ .
09742486122.)
***********************************************************************************************
అవధాన సరస్వతీ పీఠం
అవధాన సహస్ర ఫణి-బృహత్ ద్వి సహస్రావధాని
బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణి శర్మ M.A., Ph.D.
ఆశీరుద్రాక్షం
05.02.2016
శ్రీ రామ మోహన్ రావు గారు రచించిన ‘శంకరదాస – అష్టోత్తర శతి’ ని ఆమూలాగ్రం చదివాను. ఆయన
భాష కే సంబంధించిన ఏ ఉపాధ్యాయుడో – పండితుడో వేదాంతియో గాక – నిరంతర ఆర్ధిక వ్యవహారాలతో ముడి బడ్డ Bank
ఉద్యోగి.
అందునా ఉన్నతాధికారి.
అయినప్పటికీ – ఈ అష్టోత్తరశతిలో ఆర్తితో నిండి నిబిడీకృతమైన అక్షర కవితాధార
మందాకినీ ధారా వలె పొంగినది. శ్రీ రావు గారు ఫోన్ లో మాట్లాడినపుడంతా వారి సహజ
మృదు లక్షణ స్వభావం తెలుస్తూనే వుంటుంది.
బ్యాంకు లో ఎంతో పెద్ద పదవి చేపట్టినా అది లౌకిక లక్షణం- అని-దానిలో
ఆయన తృప్తి చెందలేదు. అందుకే 61వ పద్యములో “కాలము వెళ్ళబుచ్చితిని కాపురుషావళి
నీడలోన, కాజాలను వారి బానిసగ” అన్నారు. పరమశివ సేవే కావాలన్న వారి ఆరాటం ఈ మాట
వారి చేత అనిపించింది. ఈయన ధూర్జటి మహాకవిని బాగా ఉపాసించిన వారేమో అనిపిస్తుంది.
ఆ ఛాయలు కోకొల్లలు. - 69 వ పద్యం లో “ వర్షము లేక కొంత ,అతి వర్షముతో మరికొంత, క్షామ
సంధర్షితమౌచు కొంత , కలి తాడితమై మరి కొంత, అన్న ఈ పద్యం “ శ్రీ విద్యుత్ కలితాజవంజవ
మహా జీమూత ధారా పాతమ్మున మన్మనోబ్జ సముధీర్ణత్వంబు కోల్పోయితిన్” అన్న
ధూర్జటి పద్యానికి తమ్ముడిలాగా వుంది.
“బంజరు భూమి నా మదిని ...” 72వ పద్యం ,”సాధన లేని
సిద్ధియును..”74 మొదలగు పద్యాలు బాగున్నాయి.
పాదులలో భుజంగములు... – ఈ పద్యం నాకు చాలాచాలా నచ్చింది.
స్వభావతః ఇంత రాయని నాచేత ఇంత వ్రాయిస్తున్న ఈ అష్టోత్తర శతి సహజ పరీమళాన్విత శతదళ పద్మం. “రామ మొహనుక్తి రమ్య సూక్తి” తో
చేయి తిరిగిన వారే.
135 పద్యాల ఈ చిన్ని కృతిలో ఆధ్యాత్మిక విభూతి అలదుకొన్న
ఒక అనుభవశీలి కనిపిస్తున్నాడు.
ఆ.వె. శివ విభూతి
నెల్ల చే(న్) అక్షరాలుగా
రాల్చి అనుభవాల
తేల్చి- వ్రేల్చి
భద్రమైన
భసిత రుద్రాక్ష మాలగా
మోసినావు
రామ మోహనార్య!
అమేయ అక్షర ఆశీర్వచనములతో
(మాడుగుల నాగ ఫణి శర్మ)
*****************************
శ్రీ సత్య సాయి పరబ్రహ్మణే నమః
శ్రీ శంకరదాస అష్టోత్తర శతనామావళి అనుశీలనం
ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం
యౌవనం
ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః |
లక్ష్మీస్తోయతరంగభంగచపలా విద్యుచ్చలం జీవితం
తస్మాన్మాం శరణాగతం కరుణయా త్వం రక్ష రక్షాధునా ||
ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః |
లక్ష్మీస్తోయతరంగభంగచపలా విద్యుచ్చలం జీవితం
తస్మాన్మాం శరణాగతం కరుణయా త్వం రక్ష రక్షాధునా ||
శివాపరాధ స్తోత్రము
స్వామీ!
ప్రతిదినం ఆయువు తగ్గిపోతూనే వుంది; యౌవ్వనమా
క్షతురతౌతూనే ఉన్నది. గడచిన రోజులు మళ్ళి తిరిగి రావు. కాలము జగద్భక్షకమైనది కదా!
లక్ష్మి (సంపదలు )నీటిలో కెరటాల రీతి చంచలమైనవి. జీవితమూ విద్యుత్తు, మెరుపు
వంటిదే, అందుచేత నాపై కరుణతో ఇప్పుడు నీవే రక్షించాలయ్యా! అంటున్నాడు భక్తుడు.
అనాది కాలంగా ఇది జరుగుతూనే వుంది. తప్పదు. జీవుడు, దేవుడు ఉన్నంత వరకు ఇది
తప్పదు. జీవుడు దేవుడిలో ఐక్యమైతే ఇక సమస్యే ఉండదు. అందుకే మన ఋషుల ప్రయత్నం-నిరంతర
ప్రయాణం, ప్రయాసం-ఇది ఒక రోజుతో ముగిసేది కాదు.
ఈ మార్గములో సాధకుడు పడిన తపనకు అక్షర రూపమే ఈ
శంకర దాస అష్టోత్తరశతి.
మాన్యులు శ్రీ చెరుకు రామ మోహన్ రావు గారు తమ
ఆధ్యాత్మిక సాధనలో భాగంగా ఈ అక్షర కృతిని నిర్మించారు. దానిని అనుశీలనం కోసం నాకు
పంపారు.
నిజానికి దీని వస్తూస్వభావాన్ని పరిశీలిస్తే
ఇది శతక కోటికి చెందిన గ్రంధంగా తోపక మానదు. దాని కధనంగా మరికొన్ని పద్యాలిందులో
చోటు చేసుకున్నాయి.
శంకరా అనే మకుటం, ముక్తక లక్షణాలు గల పద్యాలు
గల ఈ గ్రంధం శతకం కాక మరేమౌతుంది? శతకమే! సందేహం లేదు. కాబట్టి ముందుగా శతక వాఙ్మయాన్ని
పరిచయం చేసికొని ముందుకు ప్రయాణం సాగిద్దాం.
శతక రచన చాలా ప్రాచీనమైనది. శివకవి పాల్కురికి
సోమనాధుని తో ఈ ప్రక్రియ ఆరంభమైనట్లు మనకు వాఙ్మయాధారములు గనిపించుచున్నవి. అతని వృషాధిప
శతకమే ఇట్టి రచనలకాద్యమని విజ్ఞుల అభిప్రాయము.
శతకములో భక్తి, జ్ఞాన, వైరాగ్య, నైతిక ప్రబోదార్థమై
యనేక విభాగములుగా నవతరించిన లఘుకృతులు. వీని యందు
‘ముక్తక’ లక్షణములతో మూర్తీభవించెడు పద్యములు
నూరు చోటు చేసికొనుచుండును. ముక్తకమనగా ఏక
శ్లోక గ్రంధము. ఒక్కొక్క శ్లోకమును లేదా ఒక్కొక్క పద్యమును ఒక గ్రంధముగా పరిగణించుట
. శతకము నందలి పద్యములు ఒకే వస్తువునకు చెందక, పలు విషయములను ప్రస్తావించుచుండును.
ఒక్కొక్క పద్యమున ఒక్కొక్క విషయము ప్రతిపాదింపబడుట. సమర్థింప బడుటయు జరుగును.
పూర్వాపరములతో దానికి సంబంధం వుండదు. దేనికదియే స్వతంత్రము.
ప్రాయికముగా పద్యమునకు నాలుగు పాదములుండునుగదా!
అందు చివరి పాదము “మకుట”మునకే సరిపోవును.
మిగిలిన మూడు పాదములలోనే రచయిత తానూ చెప్పవలసిన విషయమును సంక్షేపముగా
చెప్పవలసియుండును. కొండొకచో మకుటము చిన్నదయిన (ఉదా. శంకరా) మరి కొంత చోటు
లభించును. ఆ పరిమితిని దాటి ముందుకేగుటకు కవికి స్వాతంత్ర్యము పూజ్యము. పాల్కురికి
చెప్పిన “అల్పాక్షరంబుల ననల్పార్థరచన” ఈ శతక రచనయే ఉదాహరణమని చెప్పక తప్పదు. ఇంత
క్లేశము శతక రచనలో నున్నది. తెలుగునా నది
మరింత యధికము. ఛందస్సు, యతిప్రాసలు, గణములు, ఇన్ని దాటుకొని తాను తాననుకొన్న
భావమును పద్యములో జొప్పించి ఒప్పించవలసి యుండును.
అప్పుడా శతకము విజ్ఞుల మన్ననకు బాత్రమగును.
కష్టసాధ్యమైన ఈ ప్రక్రియలో నందెవేసిన చేతులైన
కవులు పరశ్శతముగా శతకముల రచించి పరిపుష్టమొనరించిరి. రాను రానూ వీని సంఖ్య పెరిగిన
కొలది వాసి తగ్గుటకు బదులు మరింత వాసికెక్కిన రచనలీ విభాగమున వెలుగు చూచుట విశేషము.
వీనిలో నైతిక ప్రబోధ రచనలకు, విశేష ప్రాముఖ్యము లభించుచుండుట యదార్థము. అట్టి
విశిష్ట భక్తీ ప్రతిపాదకమైన శతక కోటిలో చేర్చ దగిన రచన.
శ్రీ శంకర దాస అష్టోత్తర శతి
నూట ముప్పైయైదు పద్యములతో పరమేశ్వరారాధనకై
విరచింపబడిన ఈ శతకము స్వాత్మ నివేదనా రూపమయిన చక్కని రచన.
శ్రీ రామ మోహన రావు గారు వృత్తిచే భిన్న భిన్న మార్గముల నాశ్రయించిననూ, పరమేశ్వరారాధనము
మరువని నిక్కపు భక్తులు. కవులు, విమర్శకులు, ఆధ్యాత్మిక వివేచనా తత్పరులు, అగుట నీ
గ్రంధ రచనమునకవకాశము కల్గినది. అయిననూ వీరు వేదాది విద్యలేమియు తామెఱుంగమని బల్కుట విడ్డూరమే!
19 వ పద్యం
19. వేదము నందు నుంటి వని వింటిని నేనది నేర్వలేదు ఏ
వాదము నందు పాల్గొనను వాచకమన్నది లేదుకాన నా
రాధన చేయలేనసలు రాక నిజమ్ముగ దేవతార్చనల్
శోధన మాని కావుమయ శూలి మహేశ్వర లోక శంకరా!
నాకీ పద్యం చూశాక “ధూర్జటి పద్యం” గుర్తుకు వచ్చింది.
ఏ వేదంబు
పఠించె లూత? భుజగం బే శాస్త్రముల్
సూచెఁ దా
నే విద్యాభ్యసనం బొరచెఁగరి; చెం చే మంత్ర మూహించె? బో
ధావిర్భావ నిదానముల్ చదువు లయ్యా? కావు; నీపాద సం
సేవాసక్తియె కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వరా!
నే విద్యాభ్యసనం బొరచెఁగరి; చెం చే మంత్ర మూహించె? బో
ధావిర్భావ నిదానముల్ చదువు లయ్యా? కావు; నీపాద సం
సేవాసక్తియె కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వరా!
సాలె పురుగు యేవేదం చదివింది? పామేశాస్త్రాలు నేర్చింది?
ఏనుగు ఏ విద్యనభ్యసించింది? బోయ తిన్నడే మంత్రం అభ్యసించాడు? చదువు (వేదా)లేవీ
విజ్ఞాన దాయకాలు కావయ్యా !ఒక్క నీ సేవా భాగ్యానికే ఆ అవకాశం వుంది అంటాడు ధూర్జటి
కవి. అది యదార్థమే గదా! ఒక్క పరమేశ్వరారాధనమే అన్నింటికీ మూలం. మనసా, వాచా ,
కర్మణః అది మన కవిగారికి పుష్కలం. ఇంక కొదవేముంది. అఖండ విజ్ఞానం ఆత్మగతమే!
కవి గారికి
కాలమంతా వృధా చేశానే అనే తపన అధికంగా కనబడుతున్నది. పరమేశ్వరారాధన కోసం మనస్సు
పరుగులు తీస్తోంది. ఇప్పుడు గతజల సేతుబంధన వల్ల ప్రయోజనమేమి?
అయినా అది తాపమూ
పశ్చాత్తాపమో పద్యాలలో చాలా చోట్ల ప్రద్యోతమానమౌతూ వచ్చింది.
31 వ పద్యం
31.బ్రాహ్మముహుర్తమున్ నిదురబాయకలేయని పాపినయ్య,నే
బ్రాహ్మణ జన్మమెత్తితిని ప్రాజదువెన్నడు చదువనైతి నో
జిహ్మగభూష ఆహ్నికము చేయుట యన్నది చేత కాదయా
బ్రహ్మపదార్థ మన్నయది బ్రహ్మ పదార్థమె నాకు శంకరా!
వృత్తిని బట్టి ప్రవృత్తి. ప్రవృత్తిని బట్టి నడక (జీవన శైలి). ఆధునిక జీవనమున
నిది తప్పదు. కాబట్టి వారి విచారమునకర్థము లేదు. కానీ వారి మాటలలోని నిజాయితీని
శంకింప జాలము.
నిరంతర శివ ధ్యానం తో, వారేవిధంగా శంకరాభేదత్వాన్ని పొందారో వివరించటం చాలా
గొప్పగా కనిపిస్తోంది. “బ్రహ్మ విద్ బ్రహ్మైవ భవతి” అన్న దానికిది సాక్ష్యం.
1౩౩.శంకరమయ్యె నామనసు శంకరమయ్యెను మాట కాయమున్
శంకరమయ్యె భావనలు శంకర మయ్యెను సర్వ కార్యముల్
శంకరమయ్యెలే నడత శంకరమయ్యెను నాదు ఉన్కియున్
శంకరమయ్యె జీవితము శంకరమైతిని భక్త శంకరా!
భ్రమర కీటక న్యాయముగా వారి భక్తి నిరంతర ధ్యానం తో పునీతమైన వారికి
శంకరాభేదత్వాని కలిగించిందనటంలో నాకు సందేహం కనబడుట లేదు. ఈ విధంగా సంభాషించుకోగల్గటం
గూడా ఒక అదృష్టం కాదా!
కవిగారిలో భక్తి యే గాదు అటనట సామాజిక స్పృహయు నాకు అక్షర గోచరమైనది. నేటి సమాజ గతమైన దురవస్థలను
ఈ రీతిగా తూర్పారబడుతున్నారు.
18 వ పద్యం
18. రాజులు పోయినారిలను రాజ్యములున్ మటుమాయమయ్యె పో
బూజులు పట్టె విద్య పరిపూర్ణత లేనటువంటి పండితుల్
రోజుకు రోజుకున్ బెరిగి రొక్కము పై ప్రకటించి రాశలున్
రాజిత బాలచంద్ర ధర రాదది నామది జేర శంకరా!
“అలంకార ప్రియో విష్ణుః అభిషేక ప్రియో శివః” అన్నారు గదా! నెత్తిన గంగ యున్నను,
తనివి గనని, శంకరుని అభిషేక ప్రియత్వమును వెక్కిరించుచు కవి గారు చెప్పిన పద్యమును
చిత్తగించండి.
58 వ పద్యం
58. గంగను కొప్పులోపలను గట్టున చక్కని చంద్రవంకయున్
హంగగు హైమ శైలమును ఆభరణాలగు కాళజాలముల్
అంగములన్ని ప్రాక మరి ఆర్ద్రత ఎంతయు కల్గుచుండ యా
సంగతి వీడి నీటికయి సాచెద వర్రు లదేల శంకరా!
ఇంకొక పద్యమున శంకరుని వంకరల నొక వంక జూపుచు, మరియొక వంక ఉన్నవి చాలవేమో? నావి
గూడా ఇస్తాను పుచ్చుకోవయ్యా అంటూ నిండా
స్తుతి నిర్వహించిన కవిగారి చాతుర్యాన్ని అభినందించకుండా ఉండలేము. చూడండి ఈ పద్యం – 105
105. పాములు వంకరాయె తలపై గల చంద్రుడు వంకరాయె,నీ
కామిని గంగయున్ సుపథ గామిని యయ్యును వంకరాయె,నీ
నీమపు తాండవమ్మదియు నిక్కము వంకరయాయె కన్నులున్
నీ మునుముందు నిల్చితిని నిక్కము నావియు గొమ్ము శంకరా!
ఈ తీరుగా వీరి భక్తి ప్రపత్తులు శతక పద్యాలలోకి ప్రాకి, తీగెలై సాగి, మొగ్గలై
తొడిగి, విరులై విరిసి, చివరకిదిగో నిట్లుగ అష్టోత్తర శతకమై అవతరించినది. ఇంతటి ఈ
వ్యవసాయమునకు ఫలితముగా వీరు శంకరుని యపేక్షించునదేమో
యవలోకింపుడు.
127. నమకమ్మున్ చమకమ్ము తోడుత మహాన్యాసమ్ముతో ధ్యాసతోన్
విమలంబైన రవంబుతో నమితమౌ విశ్వాసమున్ భక్తితోన్
అమలానంద మనమ్ముతో నభిరతి న్నాజన్మమున్ గోల్చుచున్
భ్రమ పాపాంకిత పంకముల్ గడుపగా ప్రార్థింతు నిన్ శంకరా! (మత్తేభము )
ముముక్షు యోగ్యమైన వీరి కోరిక ఫలించు గాక! ఇట్లీ శతకము శంకర భక్తీ నివేదన
పాత్రమై , యోగ్య తరమైన రచనగా యలరారు చున్నదనుటలో, సందియమేమున్నది?
పద్య రచన యే అరుదగుచున్న నేటి కాలమున, పద్య రచనకుపక్రమించుట సాహసమే యనక
తప్పదు. అయినను శంకర భక్తి యుపకరణముగా వీరీ
సముద్రమును దరియనీదినారు.
కైవల్య పదాభిలాషతో ఎల్లరు భక్త శిఖామణుల
కత్యంత ప్రీతీ పాత్రమై, ఈ శతకము కర్తకనంతామోద కీర్తులననుగ్రహించును గాక!
ఇంతటి చక్కని రచననొనరించిన సన్మిత్రులు చెరుకు రామ మోహన్ రావు గారిని ఈ
సందర్భముగా మనసార నభినందించుచు — సెలవు.
స్వస్తిర్భవతు
ఇట్లు
బుధజన విధేయుడు
చొప్పకట్ల సత్య నారాయణ
విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు
మార్గశిర శుక్ల పంచమీ
సౌమ్య వాసరం, తేదీ 14.12.15
C.9A, చంద్రల నివాస్
D.D. కాలనీ – బాగ్ అంబర్ పేట్
హైదరాబాదు – 500౦౦7
Cell No. 98489554౩8
*****************************
డా. అవధానం నాగరాజ రావు; M.A., Ph.D.
విశ్రాంత తెలుగు రీడరు
13.౦1.525/2
శ్రీ విద్యానగర్ లెక్చరర్స్ కాలని
అనంతపురము
515001
చర వాణి: 09866498౩10
అనంతపురము
25.౦2.2016
‘రామ మొహనుక్తి రమ్య సూక్తి’ అనెడి మకుటం తో లోగడ శ్రీ రామ మోహన్ రావు గారు ఒక
రమణీయమైన శతకాన్ని ప్రచురించారు. ఆ కావ్య కన్యక ఆయన ప్రథమ పుత్రిక. ఆ శతకం లో
ఎన్నో ప్రాపంచిక సత్యాలను, నీతులను, సమయోచితంగా చమత్కారం, నర్మగర్భోక్తి, చురకలు,
చెణుకులు చొప్పించి ఆలోచనాత్మకమైనదిగా కూర్చారు. ఆ శతకం చదువరులనెంతో ఆకట్టుకొని
ప్రశంసలనందుకొంది.
ఆ ప్రోత్సాహం తో అంతర్వాణి ప్రేరణతో ఇప్పుడు
“శంకరదాస అష్టోత్తర శతి” అనెడి పేరుతో ఈ కావ్య కన్యకకు జన్మనిచ్చారు.
శతక శ్రేణికి చెందినా ఈ కావ్యంలో
శతక నియమాన్ని అనుసరించి మకుటముండాలి. ఆ నియమం మేరకు ఇందులో
‘శంకరా!’ అనే సంబోధనతో మకుట రూపం లో ప్రతి పద్యం ముగుస్తుంది. ఒకే విధమైన ఛందఃపద్యాన్ని
ఉపయోగించడం శతక నియమాలలో ఒకటి. ఉత్పలమాలా వృత్త పద్యాన్ని ఉపయోగించి ఈ శంకర దాసుడు
(కృతి కర్త) ఆ శంకరుణ్ణి ఉత్పలమాలాలంకృతుణ్ణి చేసి అటు పద్య నియమాన్ని ఇటు శంకర
భక్తిని చాటుకొన్నారు.
అష్టోత్తర శతి అనే నామ కరణాన్ననుసరించి ఇందులో 108 పద్యాలుండాలి. మంత్రం
శాస్త్ర పరంగా 108 సంఖ్యకు మహత్తరమైన వ్యాఖ్యానాలున్నాయి. ఆ చర్చ ఇక్కడ
అప్రస్తుతం.
108 పద్యాలకు అదనంగా మరికొన్ని పద్యాలు చేర్చి 1౩5 కి శతకాన్ని ముగించారీ కవి.
బహుశః భాక్తిభావావేశ కారణంగా ఈ అదనపు పద్యాలు ఆయన కలం నుండి జాలువారియుండ వచ్చు.
శతక సంఖ్యా నియమాన్ని త్రోసిరాజనటం కావ్య విషయ పరమైన అందానికి అవరోధం కానందున ఇది
దోషం కాదనుకొంటాను. వేమన మొదలైన ప్రాచీనకవులు శతక నియమాన్ని అతిక్రమించినా (ఇందులో
ప్రక్షిప్తాలు ఉన్నాయనే వాదమూ వుంది. అది వేరు విషయం.) ఆ వేమన శతకానికి వన్నె వాసి
తగ్గలేదు. వేమన కవి కాక పోలేదు.
మంచిమంచి పూలను ఏర్చి కూర్చి కూర్పులో
తన కళాత్మకతను ప్రకటించే మాలాకారుడు హారానికి సొగసుల కోసం కొన్ని రంగురంగుల పూలను అదనంగా
చేర్చి కూర్చు రీతిగా ఈ కృతి కర్త సొగసులద్దడానికి శతకం చివరిలో ఉత్పలమాలేతర
పద్యాలను కొన్నింటిని అదనంగా చేర్చటం ఒక విశేషం.
Bank ఉద్యోగము వీరి వృత్తి. పండిత్యముతో కవిత్వముతో గ్రాంధికాంధ్రముతో సంబంధమే లేని ఈ వృత్తిలో ఉంటూ
కవనమును ప్రవృత్తి గా కల్గుట వాణీ కటాక్షము గాక వేరేమయి ఉండవచ్చు? ఇది వారి పూర్వ
జన్మ వాసనేమో!
ఈ శతకం లోని పద్యాలన్నీ కమ్మెచ్చున సాగే అపరంజి తీగె లాగా కుంటువడని పుష్కలమైన
ధారా శుద్ధితో సాగడం కాదు ప్రశంసనీయం. పద్య రచన వీరికి రక్త గతమైనది. ఈయనకు ఆర్ష
ధర్మమన్నా, ప్రాచీన సాహిత్యమన్నా, ఆతరం కవులన్నా మక్కువ ఎక్కువ. ఆ మక్కువే వీరి
పద్య రచనా ధోరణిలో భర్తృహరి సుభాషిత అనుకర్త ఏనుగు లక్ష్మణ కవి, భక్తి భావం లో తన్మయం
చెందే పోతన, శివభక్తి దురంధరుడైన ధూర్జటి,
శతక కవి శిఖామణియైన పెమ్మయ శింగకవి, మొదలైన కవుల రచనా ఛాయలు పుష్కలంగా
కనిపిస్తాయి. ఆ కవులపై ఆయనకున్న ఆరాధనా భావానికి స్థాలీ పులాకంగా కొన్ని ఉదాహరణలు
చూడండి. ‘రాజులు పోయినారిలను రాజ్యములున్ మటుమాయమయ్యె’ (18) అనే పద్యం పోతనగారి ‘కారే
రాజులు రాజ్యముల్...’ అనే పద్యాన్ని స్ఫురింపజేస్తుంది. ‘నల్లని నాకురుల్ నెరిసె.....’(2౩)
పద్యం ‘దంతంబుల్ పడినప్పుడే .....’ అనే ధూర్జటి కాళహస్తీశ్వర శతక పద్యం
గుర్తుకొస్తుంది. ‘సారము లేని సంపదయు.....’ (24) అనే పద్యం ‘వాసన లేని పువ్వు.....’
అనే పెమ్మయ శింగకవి పద్యం తలపుకు
వస్తుంది. 74వ పద్యం ‘సాధన లేని సిద్ధియును...’ 119వ పద్యం ‘దారయు లేనిదౌ
గృహము.....’ అనే పద్యాలు పై పోకడను గుర్తు చేసేవే!
భక్తి వైరాగ్య శతకాల్లో ఆత్మా నివేదన, ఈహా విరక్తి, శరణాగతి ప్రదానంగా
కనిపిస్తాయి. ఈ శతకం లో 12,13 పద్యాల్లో ఆత్మనివేదన 16,23,38,46,53, పద్యాల్లో
శరణాగతి, 1, 22, 29, 56, పద్యాల్లో ఈహా విరక్తి కనిపిస్తాయి. ఇవి కవియొక్క మనః పరిపక్వ
స్థితికి అద్దం పట్టడమే కాదు, మానవుని సన్మార్గ ప్రవర్తనకివి యవసరమని సూచిస్తాయి.
భక్తీ జ్ఞాన వైరాగ్యాది భావాలను ఆవిష్కరించడమే గాక, మానవుని మనుగడకు అవసరమైన
నైతికాంశాలను శతక కవులు పేర్కొనడం పరిపాటి. ఈ శతకం లో మతద్వేష భావాల ఈసడింపు (౩7)రాజకీయ
నేతలను నమ్మి మోసపోయే సామాన్యుల దుస్థితి(౩9), శుష్క వాగ్దానాలుజేసే నేతలను సంస్కరించి ప్రజలను కావుమనే భావన(40),
వెన్నుపోటు రాజకీయాల ఖండన, మోసపూరిత అసత్య భరిత రాజకీయాల ఈసడింపు(42, 4౩, 44,) పద్యాల్లో
కనిపిస్తాయి. కవికున్న రాజకీయ స్పృహకివి కొన్ని ఉదాహరణలు.
‘అక్కర తీరిన పిదప తక్కెడ పొయిలో పెట్టే వారికిది ఎటువంటి చురకో చూడండి.
82. వంచన నేర్చినట్టి బహు వన్నెలచిన్నెల మాయమాంత్రికుల్
పంచనజేరి వారికగు పంటలు చేతికి వచ్చినంత నే
కొంచెము గూడ మానవత గూర్చిదలంచక వీడినట్టి ఈ
కుంచిత వర్గమెంత? మము కూరిమి నీవయె గావ శంకరా!
పాదులలో భుజంగములు అనే 49వ పద్యం లో పాములు, (ఇవి ప్రమాద కారులు) పక్షులు, కోతులు
(ఇవి చంచల స్వభావము కలవి)
పూవులు, తుమ్మెదలు (మనోరంజకమైనవి)వీనితో కూడిన శ్రీగంధపు చెట్టు అని శంకరుణ్ణి
పోల్చారీకవి. శ్రీ శంకరాచార్యులవారి శివానంద
లహరి లోని ‘సదా మోహాటవ్యాం ......’(20 వ శ్లోకం)
‘చందశ్శాఖీ.....’ (45 వ శ్లోకం) అనే
శ్లోకాల భావచ్ఛాయలందులో వున్నాయి . శ్రీ
శంకరులవారి వైదిక తాత్విక సాహిత్యంపై వీరికున్న భక్తికి ప్రీతికి ఇది ప్రతీక. పద్యము
యొక్క పూర్తి పాఠము ఈ దిగువ చూడండి.
49. పాదులలో భుజంగములు పైన విహంగములుండ,శాఖలన్
మోదముతోడ మర్కటపు మూకలు కొమ్మలపైన , పుష్పముల్
స్వాదు మరంద పానమున సంతసమందెడు బంబరాళి బల్
సందడి జేయునట్టి తిరు చందన భూజము నీవు శంకరా!
నారాయణ సూక్తం లోని ‘నీలతోయదమధ్యస్థ ద్విద్యుల్లేఖేవభాస్వర
నీవారశూక మత్తన్వి పీతాభా స్వస్త్యణూపమా’ అనే మంత్రం ‘వెలుగును విరజిమ్మే
మెరుపు తీగలా వరి మొలకలా(నీవార శూకము) సన్నమైన బంగారు ఛాయలా అణువులా, సూక్ష్మంగా భగవత్
స్వరూప ఆత్మ ప్రకాశిస్తూ వుంది.’ అని వ్యాఖ్యానించింది. తాత్విక చింతన,
నిత్యాను[RMR1] ష్ఠాన శీలి యైన ఈ రామమోహన కవి ‘తేరును
జేయనందముగ.....(57) అనే పద్యములో ‘నీవారపు శూకమై వెలుగు వత్సల మూర్తిగ చేరియుండ...’
అనే పాదములో ఎంతో అందముగా కూర్చి ఆర్ష సాహిత్యాన్ని తలకెత్తుకొన్నారు.
పాశ్చాత్య విద్యలకు సంస్కృతికి దాసులై అదియే జీవిత సర్వస్వమని భ్రమలోనుండి
మనుగడ సాగించే ఈ తరం యువతను ఉద్ధరించమంటారీకవి (94 వ పద్యం) ఇది ఈయనకున్న
సామాజిక స్పృహకు ఒక మచ్చు.
సెల్లు (Cell Phone[RMR2] [RMR3] [RMR4] ) జీన్స్ (ప్యాంటు) బైకు అనే ఆధునిక ఆంగ్ల పదాలనుపయోగించి జల్సాలతో జులాయి గా
తిరుగుచూ అమ్మాయిలను ఏడ్పించే యువతకు చిత్త సంస్కారాన్ని ప్రసాదించుమని (76
వ పద్యం) ఆ శంకరుని వేడుకొంటారు.
ఇది వీరి ఆధునిక దృష్టికి, లోకజ్ఞతకు ఒక నిదర్శనం.
రామమోహన కవిది హాస్యశీలము. ఆ శీలాన్ని అక్షర రూపములో చమత్కారవంతంగా ఆవిష్కరించటం ఈయనకు
వెన్నతో పెట్టిన విద్య. అందుకు ఉదాహరణమిది:-
కారు పుకారు షికారు అనే ఆధునిక పదాలతో (85) ఇంధన దుర్వ్యయాన్ని అరికట్టాలని చెప్పడానికి ‘గడ్డిని, నీటిని ఇంధనముగా చేసుకొన్న ఎద్దునెక్కి సాగించే శంకరుని ప్రయాణం’ మిత వ్యయానికి ప్రతీక
అని చమత్కరించారు. కవికున్న సామాజిక
స్పృహకు ఇది ఒక మంచి ఉదాహరణ. అవధానాల్లో
అవధానికిచ్చే దత్త పది లాగా వుంది ఈ పద్య పూరణం.
పూర్తి పాఠం ఇదుగో చదవండి.
85. కారులు బారులై తిరుగు కాలము నందునకూడ నీవు, ఏ
కారు పుకారు నమ్మక షికారులు చేతువు ఎద్దునెక్కి , నీ
కారణ మర్థమయ్యె భవ! గడ్డిని నీటిని ఇంధనమ్ముగా
గూరుచు నీ ప్రయాణములు కొంచెపు ఖర్చును గల్గు శంకరా!
112 వ పద్యములో మండ, కుండ, దండ, ఉండ, ఎండ, అనే బిందు పూర్వక ‘డ’ కారంతో వృత్త్యను
ప్రాసాలంకారాన్ని జోడించి అన్ని పోయి
చివరకు మొండెముగా శరీరము మిగిలింది అనటంలో చమత్కార వంత మైన తాత్విక భావంతో బాటు ‘నిర్వేదమూ
వుంది.
కవి సంఘ జీవి. సమాజ వ్యహారంలోని
పలుకుబళ్ళు ఆయన కవిత్వం పై ప్రభావము
చూపుతాయి. వానిని కవి సమయోచితంగా చొప్పించి
తన రచనకు సొగసులద్దుతాడు కందెనలేని బండి (17)
నల్లుల మంచము (75) ఆవము లేని కుండ (76) అనే పలుకుబళ్ళు వీరి కవితలో కనిపించే
కొన్ని మచ్చులు.
111 వ పద్యములో పద్మ, శివకామిని, కాంచన వాణి, కల్పన, సాధన, అనే ఆధునికమైన
పేర్లను ఉపయోగించి వాటి అంతరార్ధాలను అన్వయించుకొని జీవితములో అన్నీ పోయినవి ఇంక
నిన్నెటుల భజింతు స్వామీ అనే వేడుకోలు లోనూ చమత్కృతి, నిర్వేదం వున్నాయి.
సంప్రదాయబద్ధమైన కావ్యాలలో కావ్యం యొక్క ఆది, మధ్య, అంతాలలో మంగళ శబ్దం వాచ్యం
కావాలనే నియమం వుంది. ఈ శంకర దాస శతకములో
శ్రీగిరి వాసమై అనే మొదటి పద్యములో శ్రీ శబ్దముతో మంగళం వాచ్యమైనది. కావ్యం మధ్యలో 14, 48, పద్యాలలో మంగళం వాచ్యమైంది. చిట్టచివరి పద్యం ‘మంగళమయ్య సాంబశివ’
పద్యములోనూ మంగళం వాచ్యం అయింది. ఇట్లా కావ్యాన్ని మంగళప్రదం చేసి సాంప్రదాయాన్ని గౌరవించారీకవి.
ఇది శతకం. ఏక వస్తువు వున్నది కాదు. తీర్థానికి తీర్థం. ప్రసాదానికి ప్రసాదం లాగ ఏ పద్యానికి ఆ పద్యం విడివిడిగా భావాన్ని
తెల్పుతుంది. దేనికదే సమగ్రం. (వీటినే
ముక్తకాలంటారు). తీర్థ ప్రసాదాలు
విడివిడిగా సేవించినా రెండూ జీర్ణకోశములోనికి చేరి మిళితమై ఆరోగ్యాన్ని,
ఆహ్లాదాన్ని అందించినట్లే ఈ శతకములోని
పద్యాలన్నీ నీటిని, భక్తిని, తాత్విక చింతనను, సామాజిక స్పృహను రేకెత్తించి పూర్ణ
మానసిక వికాసానికి దోహదం చేస్తాయి.
శతక కవుల ప్రధానోద్దేశ్యం నీతి ప్రబోధం, భక్తి, తాత్విక చింతన, న్యాయం,
సత్యం, ధర్మం, సమభావం, ప్రేమ, శాంతి, మాతృ
పితృ సేవ, సోదర భావం, స్త్రీల పట్ల గౌరవ భావం మొదలైన అంశాలనెన్నింటినో పద్యాలలో
హృదయాకర్షణీయముగా చెప్పి సమాజానికి హితం కూర్చడానికి ప్రయత్నిస్తారు సామాజిక స్పృహ
కలిగిన కవులు. ప్రజలు సంఘజీవులు, నీతి,
సచ్ఛీలబద్ధులై జీవించాలని పడే తపన ఇది. ఈ విషయములో రామమోహనరావు గారు శత ప్రతిశతము
కృతకృత్యులైనారు. ‘హితేన సహితం సాహిత్యం’
అన్నా, ‘విశ్వశ్రేయః కావ్యం’ అన్నా ఇదే పరమార్థం. ఈ పరమార్థాన్ని వ్యర్థం కానివ్వకుండా అర్ధం
చేసుకొన్న వ్యక్తి మన రామమోహన కవి.
ఆ దేవదేవుడైన శంకరునకు అక్షరాభిషేకం చేసిన ఈ శంకరదాసు (కృతి కర్త) కు ఆ
శంకరుని అనుగ్రహ విభూతి సమృద్ధి గ లభించు
గాక! అని ఆశిస్తూ, ఆశీర్వదిస్తున్నాను.
ఈ శతకములోని పద్య శైలి సరళ సుందరమైనది.
క్లిష్టత లేదు. సులభ గ్రాహ్యమైనది. ప్రతియోక్కరు
– సామాన్య పాఠకుడు సైతం దీన్ని చదివి ఆనందించవచ్చు.
‘ఇతి శమ్’
అనంతపురము
25.౦2.2016
డా. అవధానం
నాగరాజ రావు; M.A., Ph.D.
విశ్రాంత తెలుగు రీడరు
13.౦1.525/2
శ్రీ విద్యానగర్ లెక్చరర్స్ కాలని
అనంతపురము
515001
చర వాణి: 09866498౩10
*****************************
శ్రీకరమౌకరమ్ము మది చింతలు బాపుచు సేదదీర్చుచున్
ఆకరమౌచు నా కవన మమృత ప్రాయముగాగ ప్రణవమై
భీకర భావజాలముల భీతిని బాపుచు మార్దవమ్ముగా
శ్రీ కర భావ సంపదల సిద్ధిని గూర్చు గణేశు
గొల్చెదన్
ఏ దేవి సకల కవీంద్ర జిహ్వా
పుండ
రీక నివాస మంగీకరించు
ఏ దేవి జడ పైన ఎనలేని
రత్నమై
ఒదుగు చంద్రుండెంతొ ఉజ్వలముగ
ఏ దేవి గళసీమ
నింపునింపెడు సౌరు
నీహార హారాల
నిండుకాంతి
ఏ దేవి ఎకిరింత ఎన్న
రాయంచయై
స్వేతపద్మాసన సేవ
కొదుగు
హస్తముల కీర పుస్తక
అక్షమాల
వీణ కల్గిన ఏ దేవి
విధికి సుదతి
అట్టి తల్లిని
తిరముగానాత్మ దలచి
వేడుకొందుము శుభముల
వెల్లువలకు
కర్ణామృతంబైన కథల కారకుడీవు
వర్ణాల కందని వస్తువీవు
వర్ణనా తీతమౌ వర భూరుహము నీవు
పర్ణఛాయల నీదు బరగనివ్వు
జీర్ణమైతిని విధి చీర్ణ సమ్మెట పోట్ల
చూర్ణమైపోనట్లు చూడుమయ్య
కీర్ణుండ జరచేత శీర్ణుండ బ్రతుకనే
ఆర్ణవం దాటించు పూర్ణ పురుష
బాల్యమందున బుద్ది నే బడయనైతి
యౌవ్వనపు క్రొవ్వు తోడ నిన్నరయనైతి
కాలునకు చేరువగు నెడ కలిగె బుద్ధి
కాలకాలుడ కావుమా కరుణ తోడ
పరమేశ్వరా!
చెవులకింపైన కథలు కల్గినవాడవు, అక్షరాలకు అందనివాడవు అంటే వర్ణనాతీతుడవు, పొగడలేనంత మహిమలు కలిగిన కల్పవృక్షము నీవు, నీ నీడలలో నన్ను ఉండనివ్వు. విధి యొక్క ఉలి సమ్మెట పోట్లకు
బాగా గురియైన వాణ్ణి. నేను పొడిపొడి కాకుండా చూసుకో. ముసలితనముచేత కప్పబడి చిక్కిన వాడను . ఈ బ్రతుకనే సముద్రము దాటించు మహానుభావా.
చిన్న వయసు లో బుద్ది వికసించ లేదు.
యౌవ్వనములో క్రోవ్వుతో కళ్ళు కనిపించ లేదు. యమునికి చేరువైతినని తెలిసినతరువ్వత
నాకు బుద్ది కలిగింది. యమునికి యముడైన మహాప్రభో నన్ను కాపాడు తండ్రీ.
వారించి
మహిమ చే వాంఛితాల వరద
వరద రాజులు
బ్రోచు ‘వ’ర’ద’ యనుచు
కామాక్షి
కన్నులు కామ కోటిని జేర్చు
కామ కోటిని
జేర్చు కడలి యడుగు
ఏకామ్ర
నాథుని ఎన్ని మదిని గొల్వ
కొల్వ వీలే
లేని కోర్కె లడచు
కామ కోటి
పీఠ కరుణా సుధాధారి
దారి చూపు
తనదు దరిని జేర
అన్న చెల్లి
బావ ఆది శంకర పీఠ
పీఠమయ్యి కాంచి
పేరు గాంచ
కాంచ పుడమి
తల్లి కటికి నయ్యెను కాంచి
గాంచి నిలుప
భక్తి కలుగు ముక్తి
శంకర దాస అష్టోత్తర శతి
1. శ్రీ గిరి వాసమై యలరు శ్రీధర కావుము పత్ని తోడుతన్
సాగగ జేసి నా బ్రతుకు సాంతము నీ పదపద్మ సేవలో
నా గత కంటకమ్ములను నాశము జేయుచు చేర్చుకొమ్ము నే
నేగగలేను ఈ బ్రతుకు నేవిధి బ్రోతువొ నన్ను శంకరా!
2. వంటకుయౌచుదారుచిగ వానకు ఛత్రముము గాగ బెంచె, నా
ఒంటికి పట్టు వస్త్రముగ ఒప్పుచు వాకిట తోరణమ్ముగా
పంటికి దాడిమీ పలిత పక్వ సుబీజము చేయు వీఢ్యమై
మేటిగ సాకి చేరె నిను మేలగు తల్లికి తల్లి శంకరా!
౩. అల్లము తండ్రిగాగ మరి యందున
బెల్లము గాగ నవ్వ నా
యుల్లము నుల్లసిల్ల పెను యూర్ముల నెంతయు లెక్కసేయకన్
ఎల్ల విధాలనన్ను బహు ఎక్కుడు శ్రద్ధగ బెంచినట్టియా
తల్లికి తల్లికిన్ మరియు తండ్రికి జోతలు చేతు శంకరా!
4. తోయజనేత్రి భర్తయును తోయజసూతి నుతించు రీతి నా
ఛాయలనైన రాదు కద చంద్ర విభాసుర మౌళి, నేను ఛం
దోయజనైక తత్పరుడ దోయిలి యొగ్గి నుతింతు, చిత్తమున్
బాయక నిల్చు సోముడుగ , భావము భాషయు పొంగ శంకరా!
5. శ్రీ రమణీశ చిత్త గత చిన్మయ మూర్తి పరాత్పరా హరా
ఘోర వికార కిల్బిష విఘార్ణకరాసుర వందితేశ్వరా
కారణ కారణా గరళకంఠ మహేశ్వర సోమశేఖరా
చేరగ దీసి కావుమయ చేతులు మోడ్చి నుతింతు శంకరా!
6. ఉత్పల పుష్పసంపదలు ఉద్భవమందెను గుండె చెర్వులో
మత్పులకాంకితమ్మయిన మానసమందలి శ్రేష్ఠ కంజముల్
తత్పరతన్ మదీయ మృదు తత్వపు సూత్రముతో గ్రధించుచున్
హృత్పతి! మాల జేసి బహు హృద్యముగా, మెడవైతు శంకరా!
7. యోగము యాగమున్ మిగుల యోగ్యతపస్సును మూఢభక్తియున్
రాగము త్యాగమున్ గలిగి రంజిలునట్టి యనేక భక్తులున్
*దాగర బూని నీ దయను తగ్గ విధంబుగ పొందజూతు రీ
లాగగు విద్య లేక యొక లాలస తోడ భజింతు శంకరా!*దాగర=జోలె
8. శంకలు వేన వేలు గళ శల్యములై నను బాధపెట్ట, నే
బింకము మాని నిన్ను నెద బిందువుగా నొనరించి మ్రొక్కెదన్
పొంకము తోడ నన్నుగొని పోరిమితోడ పరిష్కరించి, ఈ
సంకులమౌ సమస్యలను సాంతము బాపుము లోకశంకరా!
9. నీ కమనీయ విగ్రహము నీ కరుణార్ద్ర విలోకనమ్ము, న
స్తోక విభూతి, భక్తితతి తోడుత బంధము నంబతో రసో
ద్రేకము జీవులాత్మగను రీతులు నీతులు బోధసేయు, ఓ
ప్రాకట రూప ప్రావిదిత! భ్రష్టుడ కావుము నన్ను శంకరా!
10. పెద్దలయందు గౌరవము పిన్నలయందున రాగ భావమున్
విద్దెలయందు శ్రద్ధయును వేత్తలయందు ప్రపత్తియున్ మహా
పద్దశలందు ధైర్యము నుపాసన దీక్షయు గల్గజేసి ఈ
కొద్దితనంపు బుద్ధికిని కూర్చుము మెండుగ బుద్ధి శంకరా!
11. చిత్తమునందు నెల్లపుడు చింతన చేయగ నిల్చుమయ్య, నే
దత్తము చేసియుంచెదను దాంతమొకింత యులేని నా మదిన్
రిత్తను చేయకయ్య నిను రేపులు మాపులు తల్చి పద్యముల్
ఉత్తమశైలి వ్రాసెదను ఉండిన నామది నీవు శంకరా!
12. కానన కేగలేను మది కల్మషమెల్లను మాపలేను, శో
కానన మూర్తియై బహుళ గాఢ విషాద పయోధి మున్గితిన్
కాన, ననున్ దయాకలిత కాంతి కరమ్ములు సాచి కాచు లో
కాన, నరుల్ దయాళువని కన్గొని నిన్ను భజింప శంకరా!
1౩. ఎద్దును ఏనుగున్ ఎలుక లెట్టుల నీదగు భక్తులయ్యిరో
వద్దనకుండ వారినెటు వాటముగా నువు కాచుచుంటివో
వద్దిక చెప్పవద్దసలు వారధి లేని దయాపయోనిధీ
హద్దులు లేని నీ మదికి అంజలి నేను ఘటింతు శంకరా!
14. దానము చేయగా దరిన దాచిన సొమ్మది లేదుకాన నా
దానము చేతు నీ దయ ప్రదానము చేసిన నార్తరక్షకా
దాన, ముదంబు తోడ, చెయి దాచిన వానికి మెచ్చుకోలు వా
గ్దానము గాక, చేతనగు దారి, సహాయ మొనర్తు శంకరా!
15. పావన మూర్తి నీదు పని పట్టగ బూనిన కంతు ప్రాణముల్
ఆవిరులయ్యె నావిరుల అంగజ బాణములెల్ల మాడెనే
నే విధమందు బోల్తు నను ఎట్టుల నీజత
చేర్తువయ్య నా
జీవన గంగ నీశిరము చేర్చుము గంగకు తోడు శంకరా!
16. ఏదశనున్న ఎప్డయిన ఏ స్థలి నున్నను ఏమి జేసినన్
నీదగునామమే నిరత నిష్ఠయు నిశ్చలతన్ మదిన్ సదా
నాదగు చిత్తమున్నిలిపి నాలుక నొచ్చెడు నంతదాక నా
పై దయచూపుదాక నిను పాదములంటి భజింతు శంకరా!
17. కందెను నీ శిరస్సు మరి కందెను నీదగు కంఠసీమయున్
కందెను నీదు హస్తములు కందెను నీదు శరీరమంతయున్
కందెను పాద యుగ్మమును కందక చేకొనుమయ్య ప్రేమతో
కందెన లేని బండి నను కావగ నీదరి జేర్చి శంకరా!
18. రాజులు పోయినారిలను రాజ్యములున్ మటుమాయమయ్యె పో
బూజులు పట్టె విద్య పరిపూర్ణత లేనటువంటి పండితుల్
రోజుకు రోజుకున్ బెరిగి రొక్కము పై ప్రకటించి రాశలున్
రాజిత బాలచంద్ర ధర రాదది నామది జేర శంకరా!
19. వేదము నందు నుంటి వని వింటిని నేనది నేర్వలేదు ఏ
వాదము నందు పాల్గొనను వాచకమన్నది లేదుకాన నా
రాధన చేయలేనసలు రాక నిజమ్ముగ దేవతార్చనల్
శోధన మాని కావుమయ శూలి మహేశ్వర లోక శంకరా!
20. మూడవకన్ను నెన్నుదుటముమ్మొన వాలది చేతిలోన, రే
రేడు జటాళి పైన బహు రీతుల పారెడు గంగ నెత్తిపై
కాడు నివాసమై దనర కాయము భోగి విభూషణమ్ములై
వీడక నిల్చు శ్రీధరుడ వేడెద కావగ నన్ను శంకరా!
21. ఎన్నకు నాదు తప్పులను ఎన్నకు ఒప్పులు కూడ ఏలనన్
ఉన్నవి తప్పులే అసలు ఒప్పులు ఉండగ నేరవయ్యరో
పన్నగ భూష ! సంద్రమున పానము చేసేడు నీరు కల్గునా
యున్నటువంటి వాస్తవము నున్న విధాన గ్రహించు శంకరా!
22. వాసన లేని పూవునని వాడరు భక్తులు నీదు పూజలో
వాసనదేల నాకనుచు వద్దని నీకడ చెప్పియుంటినా
దోసము నాది కానపుడు దూరము సేయక నీదు చెంతనే
వాసము చేయనిమ్ము నిహ వాసన లింకవి ఏల శంకరా!
23. నల్లని నాకురుల్ నెరిసె నాదు ప్రమేయము లేకనే శివా
నల్లని నామనస్సదెటు నాణ్యత వీడక నిల్చిపోయె, నే
నెల్ల ప్రయత్నముల్ మిగుల నిష్ఠుర కష్ట విధాన సేయగా
తెల్లబడంగలేదు ఇది తెల్పుము చోద్యము కాదె శంకరా!
24. పారములేని సంపదయు బాయక పొందెడు సర్వసౌఖ్యముల్
సారము లేక కర్గి/ర్గు ఘనసారము పోలిక మాయమౌను , నా
కీరము పంజరమ్ము విడి ఖేచరమై జనువేళ , నీపయిన్
భారము నుంచి వేడెదను పాదము వీడక నీదు శంకరా!
25. దేవ మహానుభావ నిను దిక్కని నమ్ముచు వ్రాయబూనితిన్
ఏవిధి నాదు ఉల్లమున ఏర్పడ నిల్చి అనుగ్రహింతువో
మావి రసంబు పాల్గలిపి మాధురి నింపెడునాదు కావ్యమున్
కావుము లోకమందు కల కాలము నిల్చు విధాన శంకరా!
26. ఎచ్చట దీను లుండెద రెదేచ్ఛగ నీవట నుందు వంట నే
నిచ్చట ముక్కు మూసుకొని ఈశ జపమ్మును చేయుచుంటి నే
నెచ్చటికైన పోవగల నేడ్తెర లేనటువంటి వాడ నే
నచ్చిన వచ్చి కావుమయ నమ్మితి నిన్నెదబూని శంకరా!
27. ముప్పురమేలు రక్కసుల ముక్కలుజేసితివంట, ఆపయిన్
చెప్పగ వింటి నంగజుని చేసితివంట యనంగ మూర్తిగా
అప్పటి గొప్పలెట్లు ఇపుడద్భుత మంచును నమ్మనౌను, నీ
విప్పుడు చేసి చూపు మది ఇమ్ముగ నీపదమిచ్చి శంకరా!
28. మందులసామి నీ మహిమ మానవమాత్రుడ నాదు ఊహకున్
అందదు నయ్యరో గరళ మన్నముగా నది యెట్లు తింటివో
ఎందిది కద్దు ఎవ్వరిది ఏవిధమైనను చేయ నేర్తు రా
నంద ముఖారవింద హర నాకును దేల్పుమదెట్లొ శంకరా!
29. పాలిత కింకరా సుకర భక్తవశంకర శంకరా పరా
ఏలికవౌచు నామదిని ఏలిక నేనిక వేగలేను నీ
జాలిని చూపి ఈ భవపు జాలము నుండి తొలంగజేయుమో
కాలహరా హరా కరుణ కావుమయా త్రిపురారి శంకరా!
30. కంచిపురమ్ము నందు గల కామసునేత్రిని గూడి అయ్యారో
గాంచుచు నాదు బాధలను కాముని దర్పమడంచి వాని చే
వంచితు గాక , మీ పదపు వాకిట చేర్చుము వాకదాలుపా
ఎంచగ ప్రేమ భావమున ఎవ్వరు మీ సరిసాటి శంకరా!
31. బ్రాహ్మముహుర్తమున్ నిదుర బాయక లేయని పాపినయ్య, నే
బ్రాహ్మణ జన్మమెత్తితిని ప్రాజదువెన్నడు చదువనైతి నో
జిహ్మగభూష ఆహ్నికము చేయుట యన్నది చేత కాదయా
బ్రహ్మపదార్థ మన్నయది బ్రహ్మ పదార్థమె నాకు శంకరా!
32. శాంతము గూర్చి భూతగణ సంతతులన్నిటి చేర దీయుచున్
దాంతము గూర్చి వారలను ధన్యులజేసితివీవు, భూతముల్
సాంతము నాదు చిత్తమున సంసరణమ్ము ఘటించుచుండె నీ
ప్రాంతము జేర్చి నీ యెడల ప్రాప్తిల జేయుము రక్తి శంకరా!
33. రామ జపంబుచేసెదవు రాముని చేతనె పూజ గొందువే
రా,మది లోని సందియము రద్దును జేయుచు నాదు చిత్తమా
రామము జేసి నిల్వు రసరమ్య సుధామయ మంగళాంగ, శ్రీ
రామ రమేశ వాణివిభు రాజిత పూజిత నేత శంకరా!
34. కంచిని పృథ్వి లింగమయి కానగ జంబుక మంబులింగమై
ఎంచగ బ్రధ్నశైలమున నింపుగ నిల్చితి విస్ఫులింగమై
కాంచితిమయ్య సాంబశివ కాంచనవాహిని వాయులింగమై
మించిన నింగి లింగముగ మెచ్చ చిదంబర మందు శంకరా!
35. లోకుల సాయమంద మదిలోతలపోయను నేనదేలనన్
ఆకులు లేని చేట్టుకెవరయ్య నమర్తురు తెచ్చి పత్రముల్
నీకది సాధ్య మన్యులకు నెప్పుడు సాధ్యము కాదు దేవరా
నాకును గూర్చుమయ్య ధృతి నమ్మిన దాసుల బ్రోచు శంకరా!
36. ఎందరొ పండితుల్ మరియు నెందరొ సత్కవులెందరోమునుల్
ఎందరొ వేదమూర్తులును ఎందరొ భక్తులు ఎందరో యతుల్
కంధర సర్పహార బహు కష్టపు రీతుల నాశ్రయించి , వే
పొందిరి వారి సాటి ఎటు బోలుదు నీ దరి జేర శంకరా!(౩వ పంక్తి= ముందర నిన్ను జేర పథముల్ గని యర్చన
లాచరించి నిన్)
37. గడ్డము బెంచి మా మతమె గాటమటంచును తెల్పువారలున్
అడ్డము నిల్వు పట్టెలకు ఆకరమైన మతానువర్తులున్
గొడ్డల నడ్డుపెట్టి మన గొప్పను కూల్చగనెంచ జూచు ఈ
గడ్డుల నడ్డదిడ్డముగ కట్టడి చేయుము నీవు శంకరా!
38. పాదరసంబు వోలె మది పారక నిల్చును నీవు చూచినన్
స్వేదరసంబులావిరయి సేదను తీర్చును నిన్ను తల్చినన్
వేదన పొందు మానసము విశ్లద మందును నిన్నుగాంచ,వే
రేదియు వద్దు దీవెనల నెన్నగ గూర్చుము నాకు శంకరా!
39. గుడ్డయు కూడునున్ మరియు గూడును లేక తపించు మాకు నీ
గొడ్డులబోలు కుత్సితులు కూళలు, నేతలు! మేము వారిచే
బడ్డటువంటి పౌరులము, ప్రాచిన కూటికి సాటి యైతి మీ
ఎడ్డెతనమ్మునున్ గడిపి ఏలుము మమ్ముల నీవు శంకరా!
40. చెప్పుట తప్ప ఏవిధపు చేతలు చూపని నేతలెల్లరున్
ఇప్పుడు కల్గినారిలను ఇంగితమున్ మరి సిగ్గుఎగ్గులన్
దుప్పటికప్పి యుంచుచును ధూర్తత దౌష్ట్యత చెంత జేర్తురీ
త్రుప్పును త్రిప్పికొట్టి ప్రజ త్రొక్కని తావుల జేర్చు శంకరా!
41. కాయము మాయమైన పర కాయ ప్రవేశము చేయ రాదు గా
జాయయు తోడురాదు గన జాతలు కూడయు తోడురారుగా
మాయ జగమ్ములోన గల మానవులెల్లరు డబ్బు కోసమై
చేయని చెడ్డ లేదు మరి చెప్పగ వీరికి లేరు శంకరా!
42. మన్నన గల్గి లోకమున మంచికి నెప్పుడు మారుపేరుగన్
సన్నుతికెక్కి సంతతము సర్వ హితంబులు గూర్చు నేతలున్
ఎన్నికయై ప్రజాభిమతమేర్పడ జేసిరి నేతలప్పుడున్
మిన్నగు వెన్నుపోటరులె మిక్కుటమయ్యిరి నేడు శంకరా!
43. అంతయు రాజకీయమయమై మయ నిర్మిత ధర్మరాట్సభా
భ్యంతర సీమ వోలె నొకటన్న మరొక్కటి గానుపించు నే
క్రంతకు నీడ్చునో నెచట కాలుదిగంబడునో శిరంబులే
కంతులు కట్టునో యనెడు కాలము వచ్చె కదయ్యశంకరా!
44. చేయని మంచి నెల్లయును చేసితిమంచును మభ్యపెట్టుచున్
మాయలు పన్నుచున్ ధనము మానక బొక్కసమందు చేర్చుఈ
మాయల మంత్రగాళ్ళు మదమన్నతురంగము నెక్కినోళ్ళు మా
ఛాయల చేరనీక ఎటు చల్లగ కాతువొ మమ్ము శంకరా!
45. అంకిలి చెప్పలేదు చతురానన మాధవ వందితా పరా
పంకము జీవితమ్మనెడు భావన నాయెద కల్గలేక నే
బింకము తోడ నీ వసల భేద్యుడ వన్నది గానలేక, నీ
వాకిట చేరితిన్ తుదకు, వద్దనకుండగ కావు శంకరా!
46. మాయల పాశ బద్ధుడను మానక యత్నము చేయుచుంటి, నే
గాయము లేక బైటబడు కల్పనలెన్నియొ వ్యర్థమయ్యె, నా
ప్రాయము పండువారగ నుపాయము యెద్దియు గానరాక, నీ
సాయము కోరుచుంటినయ సాంబసదాశివ శంభుశంకరా!
47. గ్రాసము లేక స్రుక్కిన జరాకృశమైనను శీర్ణమైననున్
నీ సముఖమ్ము వీడనయ నిక్కము జీర్ణతృణమ్ము నేను,ఈ
వేసములోని పాత్రయును వీడు క్షణంబులు దగ్గరాయె, నా
కూసము జారులోన మరి కూర్చుము సద్వపుషమ్ము శంకరా!
48. శ్రీయును కాళమున్ కరియు సేవల సత్ఫల ప్రాప్తి చెంది రా
బోయయు మూఢభక్తుడయి భూరి భవత్పద సీమ చేరె, వే
రేయది ఏల దేవ నిను రేయి బవళ్ళు తలంచ జాలు, నా
ప్యాయత జేరనిచ్చెదవు బాయక నీ పదమందు శంకరా!
49. పాదులలో భుజంగములు పైన విహంగములుండ,శాఖలన్
మోదముతోడ మర్కటపు మూకలు కొమ్మలపైన , పుష్పముల్
స్వాదు మరంద పానమున సంతసమందెడు బంబరాళి బల్
సందడి జేయునట్టి తిరు చందన భూజము నీవు శంకరా!
50. ఎవ్వరు లోకనాథు డతడెవ్వడు భక్త వశంకరుండు ,తో
డెవ్వడు సర్వదీన తతికెవ్వడు భూత శుభంకరుండు,వా
డెవ్వడు సర్వలోకముల నేర్పడ జేయుచు కాచి డాకొనున్
అవ్వలిదిప్ప యల్లునికి అంజలి నేను ఘటింతు శంకరా!
51. జిట్టెడు లింగమైనసరి చిన్నదిగా తలపోయకుండ, నో
చిట్టెడు నీరు పోయుచును చిన్మయరూపుడ నిన్ను తల్చుచున్
పట్టెడు బూది పూయుచును పావన బిల్వము నెత్తినుంచగన్
ఇట్టె సమస్త సౌఖ్యముల నిచ్చెదవంట కదయ్య శంకరా!
52. అదియు అంతమున్ దెలియ నచ్యుతుడాపయి నబ్జయోనియున్
ఏదరి గానలేక తమ ఏపు నడంచుచు నిస్సహాయులై
నీదరి నిల్చినారు మరి నేనొక దీనుడ నాకుదారి నీ
పాదములే కదా పరుడ, పాపవినాశక, భక్త శంకరా!
53. అయ్యరొ ఇచ్చినావుమరి, ఆలిని ఆకలియున్ సుషుప్తియున్
ఇయ్యవు చిత్త శుద్ధియును ఇయ్యవు నిల్కడ భక్తి భావమున్
దయ్యము పట్టినట్లు మది దారిని తప్పి చరించుచుండె,నే
వెయ్యి నమస్కృతుల్ నిడెద వేగమె నా మది మార్చు శంకరా!
54. ఎల్లలు లేవు నా మదికి ఏ దిశ కోరిన యట్లు దా జనున్
కల్లలు కావు మాటలివి గాలిని బోలు,న దెల్ల వేళ , తా
చిల్లరమల్లరౌ పనులు చేయగ జేయుచు చేసె బంటు న
న్నల్లరి మానసం, బదెటు ఆడక నిల్పెదవయ్య శంకరా!
55. కాము దహించి వేసియును కామిని మోహము చేత జిక్కి నీ
వామెను పెళ్లియాడితివి అంగజ బంటును నేను ఈశ్వరా
నా మనసాడుచున్నయది నా యజమానుని సైగచేతనే
ఏమని చెప్పుకోగలను ఎట్టుల కాతువొ నన్ను శంకరా!
56. వద్దికచాలు జన్మమిది వచ్చెద నీదరికంచు వేడితిన్
ఒద్దిక కూర్చుకోతగిన ఓర్పును పొందక చేరలేను నీ
వద్దకు చేరగల్గుటకు వారధి ఎట్టుల వేయనౌను వే
రెద్దిక దారి గాన, నను ఇద్దరి దాటగ జేయి శంకరా!
57. తేరును జేయ నందముగ, తీరుగ కూర్చొని తిర్గు నీకు ఈ
తీరుబడెట్లు వచ్చె నను తేరుగ జేయుచు నందు నీవు నీ
వారపు శూకమై వెలుగు వత్సల మూర్తిగ చేరియుండ నే
మారితి నో పరాత్మ నను మానస వీధికి జేర్చు శంకరా!
58. గంగను కొప్పులోపలను గట్టున చక్కని చంద్రవంకయున్
హంగగు హైమ శైలమును ఆభరణాలగు కాళజాలముల్
అంగములన్ని ప్రాక మరి ఆర్ద్రత ఎంతయు కల్గుచుండ యా
సంగతి వీడి నీటికయి సాచెద వర్రు లదేల శంకరా!
59. ఆర్ద్రత ఎంత కల్గినను అల్లది తీరగ నేను నీకు సౌ
హార్ద్రత తోడ నొక్క విషయమ్మును చెప్పెద నాలకించు నీ
వార్ద్రత చూపి నామదిని ఆశ్రయ మందిన వేడి పుట్టు నో
ఆర్ద్ర జలాభిషేకరత ఆవము కోర్కెల కద్ది శంకరా!
60. జన్మము మరణమున్ మరియు జన్మము నెత్తుట వింత కాదు ఈ
జన్మపు మానవాకృతిని చక్కని చిక్కని నీ పదాలపై
సన్మది తోడ యుంచుచును సాధన వీడక నిన్ను కొల్తునో
చిన్మయ రూప కావుమయ చిద్ర రతమ్ముల బాపి శంకరా!
61. కాలము వెళ్ళబుచ్చితిని కాపురుషావళి నీడలోన, కా
జాలక వారి బానిసగ జాగు వహింపక నీ పదాలపై
వాలితి కావుమయ్య నను వారిజనాభ సహోదరీప్రియా
జాలము చేయబోకు విడ జాలను నీ పదదోయి శంకరా!
62. ఒక్కడు రూపవంతుడగు నొక్కడపార ధనాఢ్యుడౌ గనన్
ఒక్కడు బుద్ధిమంతుడగు నొక్కడశేష యశోవిభాసియౌ
నొక్కడదృష్ట వంతుడగు నోక్కడనంత ప్రజాభిమానియౌ
నక్కట నీచమత్కృతుల కర్థము నీవయె తెల్పు శంకరా!
63. దేవత లందరున్ మరియు దేశ విదేశ మహాజనుల్ ఘనుల్
భూవరు లేగుదెంచిరట భూరి హిమాద్రి వివాహ వేదికా
గ్రావతలమ్ము నందెడము కన్పడలేదట , నీదు పెళ్లి హై
మావతి తోడుతన్ జరుగ , మాకది ఎట్లగు చూడ శంకరా!
64. మేళమునూద మారుతము మేలగు తాళము గూర్చ గంగయున్
కాళ కలాపి జాలములు కక్షలు మానుచు నాట్యమాడగా
మాలిమి చేత మాతయును మాకును చేరిన మల్లె తీవెలా
కేళికి సిద్ధమై దనరు కేళి విలాసము జూపు శంకరా!
65.నీ కమనీయ విగ్రహము నీ కరుణార్ద్ర విలోకనమ్ము, న
స్తోక విభూతి, భక్తితతి తోడుత బంధము నంబతో రసో
ద్రేకము జీవులాత్మగను రీతులు నీతులు బోధసేయు, ఓ
ప్రాకట రూప ప్రావిదిత! భ్రష్టుడ కావుము నన్ను శంకరా!
65. కట్టెను బొమ్మజేసి కనికట్టునుజేయుచు వూపిరూది యో
పట్టెడు కూటినిచ్చి, తగు భార్యను గూర్చుచు తోడునీడగా
పుట్టెడు సద్గుణాలు గల పుత్రిక లిచ్చితి వయ్య చాలు నా
పుట్టుక ధన్యమయ్యె నిక పూనిక నిన్ భజియింతు శంకరా
దుష్టులుగా చరించుచును దూరము జేయుచు తల్లిదండ్రులన్
భ్రష్టులు గాగ వంచనను భ్రాతలకుం ఘటియించి నేర్పుతో
సుష్టుగ తాము దిన్చు తమసోదరి కెల్లెడ నేగ్గుజేయు ఈ
త్రాష్టుల తాట నొల్చగల దక్షత యున్నది నీకె శంకరా!
67. వచ్చును మచ్చయున్ కలుగ వచ్చును నీకు ప్రతిష్ఠ లోపమున్
వచ్చును చెడ్డపేరు గనవచ్చు విమర్శల వెల్లువైన కా
వచ్చును భక్తులెల్ల తవ వైరి జనాళిగ నందువల్ల నీ
విచ్చకు ధూర్త మానవుల ఈప్సిత కర్తవు గాకు శంకరా!
68. పద్యము లిప్తలో నుడువు పండితు గానను బాధలేక యా
విద్యకు నోచలే దనెడు వేదన జెందక కాలమంత నై
వేద్యము జేసి నీకు కడు వేడుక తోడుత పద్యమిచ్చెదన్
హృద్య హిమాతనూజ యుత! హృద్గత మయ్యెడు రీతి శంకరా!
69. వర్షము లేక కొంత యతి వర్షముచే మరికొంత క్షామ సం
దర్షిత మౌచు కొంత కలి తాడితమై మరికొంత ఏమి యా
కర్షణ లేని పంట పయి కర్షక లోకపు చింత కొంత యై
హర్షము కోలుపోయితిమి అయ్యరొ కావుము మమ్ము శంకరా!
70. చొప్పడ చేయి జూచియును జూచి మనుష్యుని జాతకస్థితిన్
చప్పున పుట్టుమచ్చలను సాంతము జూచియు , చెప్పుచుందురీ
టప్పను జీవికీ భువిని ఠావును దప్పక నిల్చు మార్గముల్
తప్పని జీవితాంతమును తామెటు మార్చెదరయ్య శంకరా!
71. అక్షయమైన నీదు కృప నందగ జేసెడు వేద మంత్రముల్
దీక్షగ నే పఠింపగను ధీబల మావిధి యీయలేదు పం
చాక్షరి మంత్ర మొక్కటియె సన్మతి తోడ పరీప్స లేకయున్
త్ర్యక్ష జపించుచుండెదను తప్పక కాతువటంచు శంకరా!
72. కొందరు సింహముల్ మరియు కొందరు జూడగ పుండరీకముల్
కొందరు మత్త దంతులును కొందరు చూడగ గుంటనక్కలున్
కొందరు దోమలీగలును కొందరు కప్పలు తక్కె డందునన్
ఇందరి మధ్య నుండ మరి ఎట్టుల కాతువు
నన్ను శంకరా!
73. ఇల్లును ముల్లె లేకయును, ఇంపితమొప్పెడు తిండి లేకయున్
సెల్లును చేతబూనుచును జీన్సు ధరించుచు బైకు తోడుతన్
ఎల్లలు లేక వెంటబడు నెల్లరి యల్ల రడంచి వేయుచున్
మల్లెల వంటి బాలికల మాన్యత భూమిన నిల్పు శంకరా!
74. సాధన లేని సిద్ధియును సద్గురు సేవలు లేని విద్దె,సం
పాదన లేని భోగమును పాపము పుణ్యము లేని కార్యముల్
మోదము లేని జీవితము మూలము లేనటువంటి సాలముల్
నీదగు నామ చింతనము నేరని వారలు లేరు శంకరా!
75. కల్లలు కొల్లలాయె గన కాపురుషార్థము వల్ల జేబులో
చిల్లుల వెల్లువాయె మరి చిత్తము నల్లుల మంచమాయె,నే
నొల్లగలేను ఈ బ్రతుకు, నొక్కడనైతిని మెల్లమెల్లగన్
గుల్లయి పోయినా నిటుల గూర్చుమయా దయ నీవు శంకరా!
76. ఆవము లోని కుండనయి నగ్గల మందుచునుంటి నయ్యరో
ఈవల నన్ను కాచుటకు నిక్కడ లే రొకరైన నా విరిం
చేవల పన్నునో ఎటుల నేర్పడ జేయునొ మాయజాలముల్
కేవల మొక్క నీ కెరుక గైకొను నాకరమింక శంకరా!
77. శంకర దేశికున్ బహుళ శంకలు తీరగ నాత్మ బూనెదన్
వంకరటింకరౌ వివిధ వాసనలన్ దలపోయ నీయకన్
పంకిల పాప కూప గత ప్రాణికి రజ్జువు
నందజేయుచున్
బింకము రూపుమాపు గతి, పేరిమి గల్గగ జేయి శంకరా!
78. కప్పల తక్కెడాయె పెను గాలికి లోలకమాయె నయ్యయో
ముప్పులు తప్పవాయె మరి ముందర జూచిన చీకటాయె, నా
తిప్పల తెప్పలన్ మునిగి తేలగనైతి మహార్ణవంబునన్
ఎప్పటికయ్య నాపయిన నేర్పడు నీదయ దాస శంకరా!
79. వంచన చేయలేనెవరి వద్దకు జేరుచు నుండలేను, ఏ
కొంచెము కల్గినన్నదియె కోరికమేర భుజించుచున్ సదా
సంచిత పాపపుణ్యఫల సారము ప్రాప్తము మేర పొందుచున్
ఎంచుచు నిన్ను ఏలికగ నేర్పడ గొల్చెద నయ్య శంకరా!
80. చందన వర్ణ పూర్ణశశి చందము కమ్మని వెన్నెలిచ్చు మ
ధ్యందినభానుమండల విధంబున నొప్పుచు మ్రగ్గజేయు, నీ
వందవు నాదు యూహతతి కాప్త సుధాకర వైరి విక్రమా
వందనమందుకొంచు నను వద్దకు గైకొను మయ్య శంకరా!
81. ధూర్జటి కాలిగోటి కొన ధూళికి సాటినిగాను చూడగన్
నిర్జర భాష యాంధ్రముల నేర్వగలేదు గురూరు సన్నిధిన్
ఆర్జవమొక్కటే మనసునంతయు నింపుచు నిన్ను గొల్చు ఈ
కర్జము చేత బూనితిని కావుము నాయెద నుండి శంకరా!
82. వంచన నేర్చినట్టి బహు వన్నెలచిన్నెల మాయమాంత్రికుల్
పంచనజేరి వారికగు పంటలు చేతికి వచ్చినంత నే
కొంచెము గూడ మానవత గూర్చిదలంచక వీడినట్టి ఈ
కుంచిత వర్గమెంత? మము కూరిమి నీవయె గావ శంకరా!
83. ఓటును నోటుతో కొనెడు ఓగుల కాలము సంక్రమించుటన్
మాటలచేతనో మరియు మన్యువు చేతనొ మాయ చేతనో
మూటలు మూటలౌ ధనము ముఖ్య పదంబులు తాము పొందుచున్
బీటలు బారజేసి భువి బీడుగ జేసిరి చూడు శంకరా!
84. ఒక్కెడ నున్నతంపు శిఖరోత్కర మొప్పెడు శైలశృంగమం
దొక్కెడ మంద్రవేగమున నొంపుల సొంపుల నొల్క నిర్ఝరుల్
అక్కడి యా మనోహర మహాద్భుత ఉన్నత వృక్ష ఛాయలన్
అక్కర పీఠమేర్పరచి యాత్మ దలంతును నిన్ను శంకరా!
(అక్కర = శ్రద్ధ, ఆపేక్ష)
85. కారులు బారులై తిరుగు కాలము నందునకూడ నీవు, ఏ
కారు పుకారు నమ్మక షికారులు చేతువు ఎద్దునెక్కి , నీ
కారణ మర్థమయ్యె భవ! గడ్డిని నీటిని ఇంధనమ్ముగా
గూరుచు నీ ప్రయాణములు కొంచెపు ఖర్చును గల్గు శంకరా!
86. బంభర మైన నా మనము బాయక నీయపురూప రూపమున్
అంబరచుంబితామరచిదంబర, నా హృది పీఠమందు నన్
సంబరమొప్ప యుంచుచును సంతత నిష్ఠన, నన్నుగన్న నా
యంబ భ్రమించురీతి బహుళాఖ్య, తపింతు భజింతు శంకరా!
87. ఇంకయు కీర్తి వెన్కబడి ఏల తపించెదనో పరాత్పరా
జింకను పట్టుకోగలుగ జెల్లునె బర్విడి నిండు కానలో
ఇంకగ వచ్చె జీవితము ఇంకెటు పోయెద నిల్చినాడ నీ
వంకకు జేర్చుమయ్య భవ పంక విమోచక పాహి శంకరా!
88. తాలిమి లేకపోయె నను తామస మంతయు నావరించగా
తూలితి నంగజన్ము విలు తూపుల రేపుల మాపులందునన్
సోలితి సోక్కిపోయితిని సుంతయు నిన్ను తలంచబోక,నా
కాలము తీరబోవ నిను కల్గితి చిత్తమునందు శంకరా!
89. సున్నయిపోయె కోరికలు సున్నయి పోయెను సర్వసంపదల్
సున్నయిపోయె బంధుతతి సున్నయిపోయెను దేహకాంతులున్
సున్నయె సన్న సన్నగను చూపులు విన్కియు జుట్టు తోడుతన్
ఎన్నగ నన్ను కావగల ఏలిక నీవయె లోక శంకరా!
90. వీరుడగాను, సత్వమును వీడని వాడను, నేను దేవరా
శూరుడగాను రాజసము శూన్యము నామదిలోన చూడరా
ధీరుడ గానెగా నసలు దీప్తియె లేనటువంటి
తామసిన్
పారుడ బీరుడన్, పరుడ! పట్టుము నాదు కరమ్ము
శంకరా!
91. సారథి కమ్ము నాబ్రతుకు సాల రథమ్మున కోపరాత్పరా
తీరగు నశ్వయూధముగ తేరుకు పూన్చుచు నాదు కోర్కులన్
మారవిదార మానసపు మార్గాములందున మంచిదారినిన్
తారణ జేసి చేర్చుమయ తప్పక నీ సదనమ్ము శంకరా!
92. కొందరు స్వార్థ పూరితులు కొందఱు పాపపు కూప వాసులున్
కొందరు మోహ పీడితులు కొందఱు సంపద దాహ బాధితుల్
కొందరు చోరులున్ మరియు కొందరు జారులు మత్తు బానిసల్
గందరగోళ మీ జగతి కాచెద వెట్టుల చెప్పు శంకరా!
93. మంచిని మాయతోడ పొగమంచును జేసి ధరాతలమ్మునన్
వంచన పాదుగొల్పుచును వంకర టింకర బుద్ధిగూర్చుచున్
కొంచెము కూడా నిన్ను మది కుంభిని యుంచి తలంచనీక నన్
చంచలచిత్తు జేసితివి చాలిక నీదు పరీక్ష శంకరా!
94. విద్దె యనంగ పశ్చిమపు వెక్కసమయ్యెడు భంగుహంగు, వే
రెద్దియు లేదటంచు గురి నేర్పడ జేసిన తెల్ల వానికిన్
అద్దము పట్టురీతి తమ హావము భావము మార్చుకొంచు , సం
బద్ధము లేని రీతి భువి బాయక నుందురు నేడు శంకరా!
95. కాలము సాగిపోయె మది కాంక్షల శృంఖల వీడదాయె, నా
చేలము మాసిపోయె గుణశీలము లింకను చేరవాయె, నా
ఆలము తీరదాయె రిపులార్గురు పోరగ భారమాయె, నా
మూలము నీవటన్న నిజమొక్కటి సల్పు నిజమ్ము శంకరా!
96. జంగమదేవరా గొనుము జాలి యొకించుక భారతావనిన్
భంగము చేయ ముష్కరులు బారులు తీరిరి ఎల్లలందు, యో
అంగజభంగ సాంబశివ యద్భుతమౌ భవదీయ శౌర్యమున్
సంగర మందు బోరు మన సైనిక శ్రేణికి గూర్చు శంకరా!
97.ఇయ్యది అర్ఘ్యమున్ మరియు పాద్య మిదే సమూదనం
బియ్యదె పుష్ప పూజనము ఇయ్యదె భక్ష్య ఫలానివేదనం
బియ్యదె ధూప దీప తతి ఇయ్యదె ఆత్మ ప్రదక్షిణల్ ప్రభో
ఇయ్యవె నీదు దీవెనలు ఎన్నక తప్పులు సాంబ శంకరా!
98.గొప్పది యౌ ప్రయోజనము గూర్చెడు మాటలు మాటలాడగా
నొప్పునుగాని యూరకయె నోటిని నొవ్వగజేయు పల్కులె
ట్లొప్పును దానికన్న మది నుంచుచు నిన్ను తదేక దీక్ష, నే
తప్పక గొందు, నాత్మబల తత్పరతన్ సమకూర్చు శంకరా!
99. కొన్ని దినంబులేది మది కోరిన తీరుచునుండ గర్వ సం
ఛన్నుడనై మెలంగితిని కొన్నిదినంబులదృష్ట హీనతన్
ఖిన్నుడనైతి , మేలునకు కీడుకు కర్తవు నీవె యంచు నా
పన్నుల త్రాత వంచు పరిపక్వత నేటికి కల్గెశంకరా!
100. చాలిన విద్య గల్గియును చక్కని వృత్తికి నోచుకోకయున్
మేలిమి సంపదల్ గలిగి మేళనమందగ శాంతి లేకయున్
పాలకులౌచు నీతి నిల పాతర వేసిన వారి తోడుతన్
కాలము కాలిపోదొడగె గాంచవదేమిటి నీవు శంకరా!
101. అగ్గల మయ్యె నాశ లిల ఆరని మంటల రీతి తోడుగా
గుగ్గిల మయ్యెలే ఛలము గూర్చగ మంటల తీవ్రతన్ సదా
బుగ్గిలమయ్యె నీ భరత భూమిన సత్యము, నీటియందునన్
బుగ్గల భంగి మా బ్రతుకు, బ్రోచెద వెట్టుల మమ్ము శంకరా!
102. శాలిని గూర్చుచున్ ప్రబలశాలిగ నాయెద నిల్చుచున్ సుధీ
శాలిగ బుద్ధినిన్ సుగుణశాలిగ నా దినచర్యయందు , గీ
శాలిగ భక్తినిన్ సుహిత శాలిగ భావికి బాట వేయుచున్
శూలి మదీయ జీవితపు శోభగ నిల్వ నుతింతు శంకరా!
(గీశాలి = గీష్పతి)
103. భూత గణంబులన్ విపుల భూత దయన్ దరిజేర్చి నీకడన్
శాంతము దాంతమున్ మరియు సంతత శ్రేయము కల్గజేయు నీ
చెంతన కొంత తావొసగి చింతల నన్నియు పారద్రోలి,నా
చిత్తపు పంచభూతముల చేర్చుము నీదు గణాళి శంకరా!
104. ఆత్మది వేరుకాదు పరమాత్మ యటన్న సుభాషితంబునున్
ఆత్మన బూని ధూర్తుడొక డన్ని సుఖాలను తేలి క్రొవ్వు తో
'ఆత్మకు ప్రీతి సల్పి పరమాత్మగ మారితి' నన్న వాని దు
ష్టాత్ముని భ్రష్టునిన్ మరియు షడ్రిపు మిత్రు నడంచు శంకరా!
105. పాములు వంకరాయె తలపై గల చంద్రుడు వంకరాయె,నీ
కామిని గంగయున్ సుపథ గామిని యయ్యును వంకరాయె,నీ
నీమపు తాండవమ్మదియు నిక్కము వంకరయాయె కన్నులున్
నీ మునుముందు నిల్చితిని నిక్కము నావియు గొమ్ము శంకరా!
106. వచ్చెదమన్న నిన్నుగన, వాసము కొండలలోనయుండె, నే
మెచ్చెదమన్న నాకు మెరమెచ్చులు నచ్చకపోయె, నే
నిచ్చలు నీదు నామ జప నీతి ధరించి తరింతునయ్య నీ
యచ్చపు ప్రేమయాదరమ దబ్బిన చాలును నాకు శంకరా!
107. ఆగమ రూప యార్ద్రతన యక్కున జేరు మృకండ సూనునిన్
భోగవిభూష! తత్పరమ పూర్ణసుభక్తిని గాంచి యాజమున్
సాగగనంపి బాలకుని, సత్కృపకాచిన రీతి నాకు నీ
వాగతి కూర్తువేని యదె యక్షయమౌ పెరవేల శంకరా!
108. ప్రాయము మాయమై తగు నుపాయము తోచక నిల్చిపోయె నా
కాయము లోన కల్గు పస కాయుట కాని పనౌత నీ పయిన్
కాయలు కాగ కన్నులను కష్టము తోడుత నిల్పి కోరెదన్
మాయని నీ కటాక్షమును మానక నాపయి నిల్పు శంకరా!
109. పుట్టుక చావు చేత మరి పుణ్యము పాపము కర్మ చేత, తా
దిట్టమటన్న యౌవనము దీర్ణము చేత, ధనాది సంపదల్
మట్టము చేయునట్టి బహు మాయలచేత నిరర్థమవ్వగా
నెట్టులసాగు నీ బ్రతుకు ఏర్పడ దెల్పుము నాకు శంకరా!
110. బంజరు భూమి నామదిని భక్తియు భావము జేర్చి కాడిగా
రంజుగ దున్ని జేసితివి రాజ విరాజజటాధరా పరా
రంజితమయ్యె నీ దయిన రమ్య సుగంధ సుమాళి వాటిగా
అంజలి దప్ప నేమొసగు దద్భుత హాలిక భక్త శంకరా
111. కాంచగ 'పద్మ' బోయె 'శివ కామిని' నాదరి జేరదాయె,నా
'కాంచన వాణి' యున్ మరియు 'కల్పన'యున్ మది
వీడిపోయె, నన్
కొంచెము జేయుచున్ జనియె కొండొక 'సాధన' కూర్మి వీడుచున్
ఎంచగ నేమికల్గెనిక ఎట్టుల నిన్ భజియింతు శంకరా!
112. చెట్టును వీడు మండ నెరె చీలినదౌ యొక మట్టికుండ, ఏ
పట్టుకు రాని కండ వసి వాడిన పూవుల దండ జూడ బొ
బ్బట్టుకు రాని వుండ జత బాయుచు మబ్బును వీడు ఎండ, ఏ
బట్టలు లేని మొండెముగ భాసిలె నాదు మనంబు శంకరా!
113. మూడు గుణాల కూడలిగమూడు గుణాలను పేనియుంచి దా
వేడుక గంగయున్ యమున వేణి సరస్వతి కూటమౌచు దా
చూడగ గౌరి వాణి రమ చొప్పడి యుండెడు వేదికౌచు దా
*నాడది నిల్చెలే జడగ, నాశిలె నేడది చూడు శంకరా!
*(నాడు+అది)
114. పేలవమైన పాటయును ప్రేలని నవ్వుల మాట పాంథులే
కాలిడనట్టి బాట భట కంధిని గల్గని కోట నీరమే
చాలని తోట తేటయగు చక్కటి మాటలు లేనిచోటు లే
*జాలము లేక నిన్ దలువ జాలని పూట లవేల శంకరా!
*జాలము = కపటము
115. చింతల సోలి సొక్కుచును చిక్కులు పెక్కులు కల్గునట్టి నా
చెంతన జేరి నా వ్యధిత జీవన సారధివౌచు బెర్మితో
శాంతము దాంతమున్ మరియు సంతత శ్రేయము కల్గజేయు
నీ
వెంతటి వాడవో తెలియ నెట్టుల చేతగు నాకు శంకరా!
116. కాలము మారిపోయె నిల కాంతలు
కాంతుల బెంపు పేరుతో
కాల విశాల కేశముల కత్తెరలంటగ జేసి
కొప్పులన్
కాల ప్రవాహమందు బడి కానక కొట్టుక
పోవనివ్వగా
కాలెను సాంప్రదాయమిల కాలక ఏమగునయ్య శంకరా!
117. త్రాగనివాడు నిత్య ధన దాహము చెందనివాడు
కల్లలన్
వాగనివాడు పార్శ్వ జన వంచన చేయనివాడు సంతతో
ద్వేగము లేనివా డొరుల దెప్పర కోరక యుండు
వాడెదో
రోగము లేనివా డెపుడు రూఢిగ నీభువి లేడు శంకరా!
118. సారస మానసా సరస సాదు గణాళి
హృదంతరా పరా
నీరసమైన నా మదిన నీ రస పూరిత నామమొక్కటే
ధీర సమీరమై మిగుల తీరుగ తాకిన యంత యుల్లమే
మారక, మార మారక !సమర్పిత మయ్యెను నీకు శంకరా!
119. దారయె లేనిదౌ గృహము, దాహము
తీర్చగలేని నీరమున్,
దారము లేని సూదియును; దక్షత లేనటువంటి
రాజ్యముల్,
కూరలు లేని భోజనము, కోరిన తీరని కోర్కె
బోల్కె నే
సారవిహీన జీవ ఘనసారపు హారతి నైతి శంకరా!
120. లోక హితైషి యో సకల లోక వినాయక లోక నాయకా
లోక
పితాపతీ నిఖిల లోక విహారక లోక హారకా
లోక శరీర లోకనుత లోక శుభంకర లోక శంకరా
లోకన చేయ నీకుసరి లోకములం దెవరయ్య శంకరా!
121. తారకహారి తండ్రి! భవతాప
విదారక ! ఎల్లవేళలన్
తారక మంత్రమున్ ప్రబల తత్పరతన్
జపియింతువేలనో
తారక రాజమౌళి శివ, తాపసి ! నీ పయి నాదు
భక్తియే
తారకమంచు నమ్మితిని తప్పక నీదరి జేర్చు శంకరా!
122. నారదమంటి నంత తటి నవ్వుచు నాట్యము సల్పు
మింటిపై
పారద మంటుచున్ తలము, ప్రాకును నిల్వక
పుల్కరించుచున్
జారదపార ప్రేమగన చక్కని కూతకు మావి పూతకున్
మారదదేవిధమ్ము మన మాయని బంధ మఖండ శంకరా!
123. లోక హితైషి
యో సకల లోక వినాయక లోక నాయకా
లోక పితాపతీ నిఖిల లోక విహారక లోక హారకా
లోక శరీర లోకనుత లోక శుభంకర లోక కింకరా
లోకన చేయ నీకుసరి లోకములం దెవరయ్య శంకరా!
124. తోరము జేసి భావనల తోయపు జాతము లెన్నొ గూర్చి నే
హారము లెల్ల జేసి పరి హారము చేసుకొనంగ పాపముల్
చేరిచి నిన్ను నా హృదయ సీమన వేసితి నీ గళమ్మునన్
సౌరుగ నీపదాల నిరు చంపకమాలల నుంతు శంకరా!
125. మనసది నిల్వబోదొకట మాయలు నేర్చెను మాట జూడగన్
కనుగవ అందకత్తియల కాయ సరోవర మీనులైజనన్
వినికిడి,చెడ్డ తప్ప మరి వీనుల కేయది చేర్చనీయకన్
కన నను బంది చేసె నెటు కావ తలంతువొ లోక శంకరా!
(చంపక మాల)
126. చదివియు వృత్తిలేక బహు సంపద గల్గియు శాంతి లేక తా
మదమును వీడలేక మది మందిర మందున నిల్పలేక నిన్
ముదమునుపొంద మానవుడు మోసముపై బహుమోహముంచె తా
పదిల ముగాగ నిల్వగల పాటవమెప్పుడు నేర్చు శంకరా!
(చంపక మాల )
127. నమకమ్మున్ చమకమ్ము తోడుత మహాన్యాసమ్ముతో ధ్యాసతోన్
విమలంబైన రవంబుతో నమితమౌ విశ్వాసమున్ భక్తితోన్
అమలానంద మనమ్ముతో నభిరతి న్నాజన్మమున్ గోల్చుచున్
భ్రమ పాపాంకిత పంకముల్ గడుపగా ప్రార్థింతు నిన్ శంకరా! (మత్తేభము )
128. హేమాద్రీశుని ముద్దు పట్టి నిన్ను ఎంతో దీక్షయున్ భక్తితో
ప్రేమావేశముతో ప్రసన్నమతితో ప్రీతిన్ నినున్ గొల్వ , నా
రామ మ్మన్నది లేక తా నిరతమున్ రాజిల్ల గామానసా
రామమ్మన్న తటాక మున్నిల్పెనిన్ రాయంచగా శంకరా!
(శార్ధూలము )
129. వాసన
గొల్పు చందనము వాడగనౌ మెయి పూత రీతి, నీ
వాసన గల్గినట్టి నను
వాడుము పూతగ హేమశైల, సం
వాస! నగాధిరాజ సుత వల్లభ
హైమవతీపతీ, రా
వా, సనకాది
వంద్య సురవారి విరాజిత మౌళి శంకరా!
(సురవారి = గంగ )
130.సారసమౌచు
నా కవిత చందము నందము శయ్యతోడుతన్
ఏ రసమైన పల్కగల ఏపును, రేపును
మాపు గల్గుచున్
ధీర సమీర సాదృశత
దిక్కులు పెక్కులు జేరు రీతిగన్
సారసమేతమై వరల సన్మతి ని
న్నుతియింతు శంకరా!
131.చంపామల్లిక చారుగంధ
యుతమై శబ్దార్థ చాతుర్యతన్
సొంపైయొప్పెడు భావ భూష
లలరన్ సౌందర్య వారాశిగన్
పెంపై యొప్పెడు
పద్యరత్న చయమున్ భేషంచు ధీమంతులున్
ఇంపౌ రీతిగమెచ్చ, గోరు
వినతిన్ ఈడేర్చవా శంకరా!
(శార్ధూలము)
132. ఎండిన మేక పెంటికల నెంచుచు విత్తులుగా మనంబునన్
దండిగా దెచ్చి నాటె నవి తప్పక పంటల నిచ్చు నంచు నా
దండుగమారి యౌ మొరకు దల్చెను తానవి యమ్మినంతనే
మెండుగ డబ్బు పొందగల మేలిమి యోచన యంచు శంకరా
1౩౩.శంకరమయ్యె నామనసు శంకరమయ్యెను మాట కాయమున్
శంకరమయ్యె భావనలు శంకర మయ్యెను సర్వ కార్యముల్
శంకరమయ్యెలే నడత శంకరమయ్యెను నాదు ఉన్కియున్
శంకరమయ్యె జీవితము శంకరమైతిని భక్త శంకరా
134. మంగళమయ్య సాంబశివ మంగళ మయ్య మహేశ్వరా పరా
మంగళమయ్య భూతపతి మంగళమయ్య పురారి శ్రీకరా
మంగళమయ్య భీమ,భవ మంగళమయ్య కపర్ది యో హరా
మంగళమయ్య ధూర్జటి యుమాపతి మాగతి నీవు శంకరా!
135. అర్పణ చేయుచుంటి పరమాత్ముడ నా చిరు కావ్య కన్యకన్
సర్పవిభూష బాధ పరిసర్పితుడై చరియించు నాకు, కం
దర్ప వినాశ ! నీవె భవ తారణ చేయుచు
కావుమయ్య, నే
దర్పణమౌచు నీ రుచిర
దర్శనమాత్మను బొంద శంకరా!
శంకరార్పణమస్తు
No comments:
Post a Comment