Tuesday, 7 April 2020

సమస్య మనది సలహా గీతది 26-30



సమస్య మనది సలహా గీతది -- 26
సమస్య : అయ్యా ! కర్మ యోగమని భక్తియోగమని జ్ఞానయోగమని ఎవరికి తోచినది వారు గొప్పదని చెబుతారు. మరి నిజానికి ఏది గొప్ప? నేను దేనిని అనుసరించను , దేనిని ఆచరించను?

సలహా: యోగ శబ్దం ‘యుజ్‌ ’ అనే సంస్కృత ధాతువు నుండి పుట్టినది. దీనికి కలిసికొనుట, ఏకమగుట, సమన్వయించుట మొదలైన అర్ధములను చెప్పుకోనవచ్చును. జాతక ఫలితములలో ఈ 'యోగము' అన్న శబ్దము విరివిగా వింటూ ఉంటాము. రెండు అంతకు మించిన పదార్థములు, రెండు అంతకు మించిన మూలకములు ఈ విధముగా ఏవి కలసినా దానిని యోగము సంయోగము అంటారు. కానీ  'జీవాత్మ పరమాత్మ లో లీనము  చెందటమే యోగ పరమార్ధము.  ‘ నయమాత్మాబలహీనేన లభ్యతే ’ అని ముండకోపనిషతు చెపుతోంది. అంటె బలహీనులు ఆత్మను తెలుసుకోలేరు, పొందలేరు అని భావం కాబట్టి ఆత్మ జ్ఞానానికి శక్తిమంతమైన శరీరము , సమాహితమైన బుధ్ధి అత్య అవసర మన్నమాట. దీని వల్ల క్రమంగా శరీరరోగ్యం సమాహితమైన చిత్తం ఏర్పడి ఆత్మను పరమాత్మతో సమ్యోగం చెందింప జేసే శక్తి సాధకునికేర్పడుతుంది. ఈయోగాక్రియకు ఆద్యుడు పతంజలి.
నేడు ఆయన పెట్టిన భిక్షను అమ్ముకొంటూ శరీర సౌష్ఠవమును పెంచు యోగాక్రియలను నేర్పుతూ యోగా గురువులు, అందరి ఆదాయమూ కలిపితే, లక్షల కోట్లు సంపాదించి యుంటారు. ఒకవేళ ఆ మహానీయునికే ఆ హీనమైన ఆలోచన వచ్చియుంటే? అయినా ఆయన మహనీయుడు, అసహ్యకరములగు ఆలోచనలకు అందని దూరములో ఉంటాడు.

 యోగ విజ్ఞానాన్ని తెలుసుకోవడానికి తోడ్పడేవి ప్రధానంగా యోగానికి సంబంధించిన ఉపనిషత్తులు. వాటిలో యోగతత్వోపనిషతు, మండల బ్రాహ్మాణోపనిషతు, యోగకుండల్యోపనిషతు ప్రధానంగా పేర్కొన దగినవి. వీనికి తోడుగా పాతంజలి యోగసూత్రాలు , భగవద్గీత , యోగ వాసిష్ఠం యోగజ్ఞానానికి ప్రమాణ గ్రంధాలు. దీనినిబట్టి  యోగము అన్నది భారత దేశాంలో అత్యంత ప్రాచీన కాలం నుండి అధ్యయన అభ్యాసాలతో కూడియున్నట్లు చెప్పవచ్చును.

యోగోపనిషత్తులలో యోగం నాలుగు విధాలుగా చెప్పబడింది. అవి , హఠయోగం , లయయోగం , మంత్రయోగం , రాజయోగం. అయితే, ఇప్పుడు యోగమంటే హఠ రాజాయోగాల సమ్మేళనం గా భావింప బడుతున్నది. దీనికే ఆష్టాంగయోగమని ప్రసిధ్ధి. ఆష్టాంగ యోగమంటే ఎనమిది అంగాలతో కూడిన యోగమని అర్ధం. యమ, నియమ,ఆసన,ప్రాణాయామ,ప్రత్యాహార, ధారణ,ధ్యాన,సమాధులు అష్టాంగాలు.
ఇక    అసలు విషయానికొస్తే
నీ అదృష్టముకొద్ది మీవూరిలో ఎంతో శుచి శుభ్రతతో చాలా రుచికరముగా వుండే ఒక హోటలును ఊహించుకో ! వాస్తవములో ఇటువంటివి వుండవు అది వేరే విషయము. యోగమునకు హోటలుకు సంబంధమేమి యని అంటావేమో, విను విను నీకే అర్థమౌతుంది. మనసు మంచికి అంకితమైతే అటు హోటలువాడు మంచివాడు కావచ్చు ఇటు నీవూ మంచినికోరే ఆలోచనే చేయవచ్చు.

ఆ హోటలుకు పోతూనే Menu Card చూస్తావు. నీకు కావలసినది నిలుపు నిదానముగా చూసిఎన్నుకొంటావు,

 తింటావు, తృప్తిని పొందుతావు. ఇదీ అంతే! నీకు సులభమైన , సుఖధమైన, అవలంబించదగిన, యోగమార్గమును ఎన్నుకో! మనోనిష్ఠ తో ఎన్నుకొన్న మార్గములో ముందుకు నడు. కోరినతీరము చేరుతావు. ఎ పని చేయుటకైన 'ధృతి' అన్నది ముందు నీవు సొంతము చేసుకో! ధృతి అంటే నీవు తలచిన విషయాన్ని, లేకకోరికను కష్టాలకు కడగళ్ళకు వడగళ్ళే పడినా తావివ్వకుండా  ముందుకు నడిచేది ధృతి. ధృతి ని పొందుటకు ముందు మతిని శృతి చేయి. అప్పుడే నీ గతి సుగమమౌతుంది. యోగము ఏదయినా చేర్చేది నీవు కోరే చోటికే. ఢిల్లీకి నీవు రైలులో నైనా, బస్సులోనయినా, విమానములో నయినా పోవచ్చు. నీ అవసరము, నీ ఎన్నిక . ఇక్కడ కూడా అంతే.
ఈ విషయములో పరమాత్మ ఏమన్నాడో చూద్దాము.
కర్మణైవ హి సంసిద్ధి మాస్థితా జనకాదయః |
లోక సంగ్రహమేవాపి సంపస్యన్ కర్తుమర్హసి ||            20-- 3

కర్మము చేయుట కర్తవ్యమ్మగు
తామరాకు పై నీటి బొట్టులా
జ్ఞానివయ్యును జనహితమునకై
జనకాదులవలె జరుపుము కర్మల                           20-- 3

అసలు జనక, అశ్వపతి ఇరువురూ మహారాజులే కానీ వారిదికేవలము నిష్కామకర్మ. ఇక్కడ జనకుని గూర్చి కొంతకు కొంతన్నా చాలామందికి ఋషితుల్యుడని తెలిసి వుంటుంది. అశ్వపతి మహారాజును గూర్చి రెండు మాటలు చెబుతాను. ఆయన కేకయ వంశము రాజు. జనకునివలెనే నిష్కామ యోగి.ఆయన ఎంత గొప్ప రాజో అంత ఆత్మజ్ఞాని. ఉద్దాలక అరుణి వంటి మహాఋషులు తమ ధర్మ సందేహములను ఆయన వద్ద తీర్చుకోనేవారు. అంటే సన్యసించిన మహాఋషుల కన్నా, ఆయన కర్మల నాచారించేవాడయినా మిన్న. ఆయన వారికి  'వైశ్వానరఆత్మ' ( అంటే విశ్వ వ్యాప్తమైన ఈ ఆత్మను)ను గూర్చి విపులముగా విశదముగా తెలియబరచి వారి సందేహములను తీర్చి పంపుతాడు.అంటే ఈ ప్రతిఫలాపేక్ష లేని కర్మల నాచారించేవారికి అంత గోప్పదనముంది.
ఆది శంకరులు, విజయనగర స్థాపకులు విద్యారణ్యులు ఈ యుగము వారేకదా! వారు జ్ఞాన సిద్ధి పొందియు కాలానుగుణముగా లోకహితార్థమై, తాము కర్మలనాచరించి భగవదైక్యమును పొందినారు. అసలు శంకర భగవత్పాదులను సాక్షాత్తు శంకరుని అవతారమేయని అన్నారు. కాబట్టి మన బాధ్యతలు తదనుగుణమౌ కర్మలు తప్పక ఆచరించి తీరవలసినదే! మరి బాధ్యత మనదైనపుడు విస్మరించుట తప్పు కదా!
నేను జ్ఞానిని అని కార్యాలయములో ఏపని చేయకుండా కూర్చుంటే అసలు నీవు జ్ఞానివి అనికూడా ఎవరూ తలంచరు. మరి తలచకుంటే నీకు తలవంపే. కాబట్టి పరమార్థ జ్ఞానమును పొందికూడా పనులు చేయుట ఆపవద్దు. ఉద్యోగ విషయమైతే పెద్దలకు అంటే పై అధికారులకు వినయముతో తెలియబరచుటలో తప్పులేదు. శంకరాదులు దివ్యకార్యోపనియామకులై (DIVINE DEPUTATION ) వచ్చినవారు. జనకాదులు ధార్మికులై, జిజ్ఞాసువులై ముముక్షువులై, జ్ఞానులై, జ్ఞానదాతలై లోకాన తమపేరు చిరస్తాయిగా నిలుపుకొన్నారు.మరి మనమైనా అంతే కదా ! మన కార్యాలయమునుండి మనము బదిలీ అయిన తరువాత కూడా మన జ్ఞానము మన కర్మలలో ప్రతిఫలిస్తూనే వుంటుంది . నీ కర్మ బలమును బట్టే నీ కర్మ ఫలము. సత్కర్మ ఫలము గంగాజల సాదృశము. అది ఒక Pఫ.D డిగ్రీ లాంటిది. నీ కర్మకు ఫలితముగా నీకు డాక్టరేటు రానే వచ్చినది. కానీ నీకష్టార్జితమైన నీ Research Work ఎందఱో జిజ్ఞాసువులకు కరదీపికయై, వారి గమనమునకు తగిన గమ్యము చూపుతుంది.
నీ మనసు పాలవంటిదయితే నీలో ఉన్న పవిత్రతయే అందుదాగియున్న వెన్న. కాబట్టి పాలలో ఉప్పు పడకుండా చూసుకో!

సత్కర్మ ఫల సిద్ధిరస్తు.
*******************************************
సమస్య మనది సలహా గీతది -- 27 

ఒక శ్రేష్ఠుని ఆదర్శముగాగొని మన జీవితమునకు 
సార్థకత కలిగించుకొనవచ్చునా ?

ఆహా ! నేను ఎంత క్లుప్తముగా ప్రశ్న అడిగినాననుకొంటున్నావు కదూ! దీనికి జవాబు మాత్రము అంత సులభమైనది కాదు.
నా చేతనైన మేరకు నీకు చెప్ప ప్రయత్నించుతాను.
బాల్యములో నున్న పిల్లలకు తండ్రి ఆదర్శము. తండ్రి చేసే పనులను తాము కూడా చేయవలెనని అనుకొంటారు పిల్లలు. లేతవయసులో పిల్లలు చూచుట కంటే గమనించట ఎక్కువగా వుంటుంది. కాబట్టి ఇంటిలోని పెద్దలు, అంటే అమ్మ నాన్న ముఖ్యముగా తాము పిల్లల ముందు ఏమి చేస్తున్నామన్నది గుర్తు చేసుకొని చేయుట మంచిది. ప్రతి విషయానికీ బొమ్మ బొరుసు వుంటుంది. అదేవిధంగా పిల్లలు కూడా తండ్రిచేసే చెడుగును (ఒకవేళ ఏదయినా వుంటే ) గ్రహించ వచ్చు, లేదంటే ఆపని చేయకూడదని కూడా నిర్ధారించుకోవచ్చు. ఆ మనస్తత్వము పిల్లలలో రావాలంటే తల్లి  పిల్లలకు మంచి చెడుగుల నడుమ గీత గీయవలసి యుంటుంది. అది పిల్లల భవితకు మిక్కిలి శ్రేయస్కరము.
జీజాబాయి తన కుమారుడైన శివాజీకి రామాయణ భారత భాగవతాలను గూర్చి బాల్యములో చెప్పుచుండిన విషయము ఆతరువాత ఉన్నతమైన విలువలతో ఆయన మరాఠా సామ్రాజ్యమును ఏలిన విధము అందరికీ తెలిసినదే! మరి ప్రహ్లాదుడు ఎట్లు మంచివాడయినాడంటే తల్లి గర్భములోనే తానూ నేర్వవలసిన మంచి నారడులవారి ద్వారా నేర్చుకొన్నాడు. కాబట్టి తానూ తండ్రిదారిన పోలేదు. ఈ సందర్భములో నేను వ్రాసిన ఈ పద్యమునోకసారి చూడు:
పెద్దచేయుపనులు దద్దయు గమనించి
చేయుచుందురింట చిన్నవారు
బుద్ధి లేని పనుల పోరాదు పెద్దలు
రామమొహనుక్తి రమ్యసూక్తి
తల్లిదండ్రులుగా మనము మనకు తెలియకుండానే  పిల్లల మీద అందరికంటే ఎక్కువ ప్రభావం చూపిస్తాము. వాళ్లు మనల్ని ఎప్పుడూ గమనిస్తుంటారు కాబట్టి వాళ్లకు నేర్పించడానికి మన దగ్గరున్న గొప్ప సాధనం మనం చేసే పనులే!. అవి మంచివయినా చెడ్డవయినా, దగ్గరనుండి చూస్తారు కాబట్టి, అవి ఆదర్శమే. మన ఆదర్శం వాళ్లకు ఎప్పుడూ తెరిచి ఉన్న పుస్తకం లాంటిది. దానినుండి వాళ్లు ఎప్పుడూ పాఠం నేర్చుకుంటూనే ఉంటారు. అందుకే మనము ఎంతో జాగ్రత్తతో వ్యవహరించి ఉండవలసి వుంటుంది. ఇప్పుడు ఇంకొక క్రొత్త సమస్య వచ్చిపడింది, గమనించండి.
పిల్లలు అతిగోప్పగా చదివి డాక్టర్లు ఇంజనీర్లు కావలెనన్న తలంపుతో, మనకు స్తోమత లేకున్నా తప్పనిసరియని తలచి అప్పులు కుప్పలుగా చేసి కార్పోరేట్ కాలేజీలకు పంపుతున్నాము. అక్కడ పనిచేసే ఆచార్యులు యాంత్రికులు. వాళ్ళు ఉపన్యాసకులు మాత్రమే! వారు బోధించే ప్రపంచ జ్ఞానము శూన్యము. ఇక సహవిద్యార్థులు వేరు వేరు సాంప్రదాయముల నుండి, వేరు వేరు కుటుంబములనుండి, వేరువేరు అలవాట్లతో ఒకచోట, ముఖ్యముగా హాస్టళ్ళలో చేరుతారు. చాడువుపెరుతో, యౌవ్వనము సమీపిమ్పబోవు దశలో, ఎంతో జాగ్రత్తగా తల్లిదండ్రుల వెచ్చటి రెక్కల మధ్యనుండి వికసిన్చావలసినవారు, అటు దురలవాట్లకో, ఆత్మా న్యూనతా భావానికో, గురిచేస్తున్నాము. వారి కల్పనలలో రూపుదిద్దుకోవలసిన ఎన్నో ఆవిష్కరణలను మొగ్గలోనే త్రుంచి వారిని నరకమునకు పంపుచున్నాము.
విద్యావిదానపు లొసుగులను సవరించక పోగా తెలుగు వారికి పుట్టిన పిల్లలను ఆంగ్ల మాధ్యమములో చదువమని ప్రభుత్వమే బలవంతపరచుట ఎంతటి బాధాకరమగు విషయమో గమనించండి.
తల్లియన్న యెడల తలువగ దేవత
తల్లిభూమి దీటు ధరన లేదు
తల్లిభాషకన్న తలువగ సాటేది
రామమోహనుక్తి రమ్యసూక్తి
‘గూనికి తోడు దొబ్బుడు వాయువు’ అన్నది ఒక రాయలసీమ సామెత. అంటే ముందే ఆ వ్యక్తి వంగి క్రుంగి పోయినాడు అటువంటివానికి తానూ నిలత్రోక్కుకోలేని ముందునకు త్రోసే  వ్యాధి  వచ్చిందంటే  అతను భూమిపై
నిలువగలడా! అది నిజమైన గురువుల యొక్క పరిస్థితి ఒక రాష్ట్రములో. విద్య చెప్పే గురువు సారాయి కొట్లవద్ద మూకను నియంత్రించే పనిని ఒప్పగించితే, అతడు నిజమైన గురువయితే, తాగుటకు వచ్చిన తన శిష్యులను చూసి, నా శిష్యులు ఎంత ప్రయోజకులైనారని  సంతసించుతాడా!
అందుచేత ముందుగానే పిల్లలకు మంచిచెడుగులను విడమరచిచెప్పి వారిని రుజు మార్గాముపై పెట్టవలసిన బాధ్యత, తల్లిదండ్రులదే నేడు గురువు అన్నవాడు మనకు దొరకడు. మన పిల్లలో కేవలము ఒక పాఠములు చెప్పే ఉద్యోగి మాత్రమే! అట్లని మంచి గురువులే లేరా అంటే ఉన్నారు కానీ ‘ఎక్కడ’ అన్నది తల్లిదండ్రులు గుర్తించుట కష్టము. వాళ్ళ దృష్టి అంతా ఎంత ఎక్కువ డబ్బిస్తే అంత గొప్ప చదువు తమ పిల్లలకు దొరుతుందని.
నిజమైన గురువుకు నిర్వచానముగా ఒక ముఖ్యమైన కథ చెబుతాను విను. ఒక సారి ఒక స్వాములవారు తన శిష్యగణముతో ఒక వూరిలో విడిది చేసినాడట.
మహనీయులు వస్తే ఐహికమైన కోర్కెలు తీర్చుకొన దలచిన భక్తులకు కొదవేమీ ఉండదు కదా! ఒక తల్లి తన బాలుని ఎత్తుకొని స్వామీ వద్దకు వచ్చి ఈ విధముగా చెప్పింది" స్వామీ ఈ బాలుడు ఎప్పుడూ బెల్లము తినుటవల్ల నోటినుండి చిక్కటి ద్రవము కారుతూనే వుంటుంది. ఎన్ని విధములైన మందులు ఇప్పించినా తగ్గలేదు." స్వాములవారికి విషయము అర్థమైపోయినది . ఆమెను పిల్లవానితో ఒక వారము తరువాత రమ్మన్నాడు. ఆమె, చెప్పిన విధంగా రావటమూ స్వామీ ఆ బాలునితో " బెల్లము అతిగా తినుట ఆరోగ్యానికి ముప్పు. అది అవసరానికి తప్ప వ్యసనముగా వాడవద్దు అని చెప్పినాడు. పిల్లవాడు మానివేయడము, తల్లి వచ్చి స్వాములవారికి చెప్పడము స్వామి శుభమస్తు అనడము జరిగిపోయింది. ఈ మూడు పర్యాయములూ గురువు గారిని గమనించుచున్న శిష్యుడు గురువుతో ఇట్లన్నాడు" స్వామీ ఆ బాలునికి తినవద్దు అని మీరు చెప్పడానికి ఒక వారము సమయమేల తీసుకొన్నారు."  వెంటనే గురువుగారు "నాయనా ఆ బలహీనత నాలో కూడా వుండినది ఆ బాలుని మొదటిసారి నా వద్దకు తెచ్చినపుడు.నేను  ప్రయత్నించి మానుకొనుటకు ఒక వారము పడుతుంది కాబట్టి ఆ బాలుని, తల్లిని వారము తరువాత రమ్మన్నాను. నేను నా బలహీనత పై నియంత్రణ సాధించినాను కాబట్టి ఆ బాలునికి చెప్పగలిగినాను ." అనియన్నాడు. శిష్యునికి అర్థమైపోయింది. మరి నీకుగూడా అర్థమై యుంటుందని తలుస్తాను.
ఇప్పుడు అసలు భగవంతుడు ఈ విషయములో అర్జనునితో ఏమంటున్నాడో ఒకసారి చూద్దాము.
యద్యదాచరతి శ్రేష్ఠః తత్త దేవేతరో జనాఃl
స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ll      21 -- 3

శ్రేష్ఠుల బాటలు శ్రేయస్కరములు
ఆ మార్గమ్ములు  ఆదర్శమ్ములు 
ఆ ప్రమాణములె అఖిల జనావళి
అనుసరించి ఇల  నాచరించవలె             21 - 3
శ్రేష్ఠుడైన పురుషుడు ఏది ఆచరించునో ఇతరులును దానిని అనుసరింతురు. అనగా ఏ ప్రమాణమును అతడు నిలిపెనో దానిని వారు  గ్రహింతురు. ఆ శ్రేష్ఠుని గుర్తించడమే తల్లిదండ్రుల గురుతర బాధ్యత. ఆర్యులు "గతానుగతికో లోకః" అన్నారు. స్వంత బుద్ధితో ముందుకుపోయేవారు అరుదు. పైగా " పదుగురాడుమాట పాటియై ధరయిల్లు" అన్న పెద్దలమాట మనకు కొత్తది కాదు.  మన మందుకనే కదా మన మిథ్యా మహనీయులైన నాయకులబాటలో నడిచి సూక్ష్మములో మోక్షమును సంపాదించుటకు మానాభిమానములు కూడా మంటలో కలిపి మనుగడ సాగించుచున్నాము. దీనినే మన ప్రియమైన ఆంగ్లములో Mass Psychology అంటారు.

భగవంతుడు   మంచిదారిన పోయేవారిని అనుసరించమన్నాడు కానీ చెడ్డ దారి త్రోక్కమనలేదు. మన అనుభవము అందుకు విరుద్ధము. మన అనుభవమేమిటంటే 'బర్గరు కోరేవాడు బందరులడ్డు జోలికి పోడు కదా!' అన్నది. బురుదకాళ్ళు ఇంటిలో అడుగుపెట్ట పనికిరావు. మన ఆశయము ఆదర్శము అత్యంత శ్రేష్ఠులైన రమణులను గానీ, చంద్రశేఖర సంయమీంద్రులనుగానీ లేక స్తానికముగా పేరుకు డబ్బుకు ప్రాకులాడని మహనీయులు నేతెకీ వున్నారు, అట్టి వారిని ఆశ్రయించి తమ పిల్లలను అనుసరించునట్టుగా చేయవలె . నీచ నికృష్ఠ, నిర్వీర్య, నిరర్థక, నిర్లజ్జ, నిర్నిబద్ధతా యుతమైన మూకల తోకలు పట్టుకొని నాకము చేరలేము అన్నది మనము సత్వరము గ్రహిమ్పవలసిన విషయము. అందకే పరమాత్మ పవిత్రులను , పునీతులను , పురుష శ్రేష్ఠులను అనుసరించమని చెబుతున్నాడు.ఆ మార్గమే అత్యంత ఆనంద దాయకము.
సద్గురు సౌభాగ్య ప్రాప్తిరస్తు.

స్వస్తి.
*******************************************సమస్య మనది సలహా గీతది -- 28
సమస్య : అసలు నాపైవాడు పనిచేస్తున్నట్లే లేదు. అంత పనీ నా నెత్తిపై పెట్టుకొని చేస్తున్నాను. ఇది ఈ విధముగా కొనసాగవలసినదేనా ?


సలహా : నడుము వంచి పనిచేసేవాడు తలవంచక తప్పుతుందా! తలవంచి పనిచేసుకోనేవాడికి తన పైవాడు కనిపించుతాడా! ఒకవేళ తల ఎత్తి పైకి చూస్తున్నావనుకో ? మరి నీవు పని చేస్తున్నట్లేనా! ఒకవేళ నీవు చూచు సమయములో నీ పైవాడు చేయనంత మాత్రాన ఇక పని చేయనట్లేనా! ఆవిధముగా మనము ఒకరిని గూర్చి నిర్ధారించుట  తప్పు. ఎప్పుడూ నేనే చేస్తున్నాను వాడు చేయుట లేదు అన్న ఆలోచనతో జీవితమును గడుప వద్దు. నీ అర్హతను ఏమేరకు గుర్తించినారో ఆమేరకు పని నీకిచ్చినారు. నీ అర్హత నిరూపించుకొని పై పదవిని పొందు. అంతేగానీ పైవాడు చేయలేదని పరితపించవద్దు. అసలు నీ పైవానికి నీకన్నా పనులు ఎక్కువగా వుంటాయి. నిజానికి అట్లు లేకుంటే అతను ఆ స్థితికి రాడు కదా! అతడు,

నీవుచేసే పనే కాదు, మొత్తము సంస్థలో జరుగు కార్యకలాపాలన్నీ చూసుకోవాలి. ఎందఱో తమ సమస్యల తీర్చుకోనుతకో, సహకారమును పొందుటకో వారి వద్దకు వస్తూ వుంటారు. మరి వారు తమ మనసును నిర్మలముగా ఉంచుకొంటేనే ఎదుటివారికి సరియైన సమాధానము ఇచ్చుటకు వీలవుతుంది. ఆయన కర్తవ్యము విధి బాధ్యత అది. దానిని వదిలి నీపని చేస్తూ కూర్చుంటే మరి వారి పని ఎవరు చేస్తారు. త్రిమూర్తులే తమ తమ పనులను పంచుకొన్నారు. మనమెంత?
ఒక అర్థవంతమైన నవ్వుకొన గలిగిన వాస్తవాన్ని చెబుతా విను. ఒకసారి ఒక సదస్సు, సంగోష్టి (Seminar) లో నేను ఆప్త మిత్రుడు వేరు వేరు కుసీదిక లేక వార్దుషీ శాఖలనుండి (Bank Branches) వచ్చి కలిసినాము. విరామ సమయములో ఇద్దరమూ మాట్లాడుకొంటున్న సమయములో నేను ఆతనితో 'ఫలానా పని' నేను చేసినాను నీవు చేసినావా అని అడిగినాను. మైరువురి నడుమ గాఢమైన చనువు వున్నది కాబట్టి 'అదేముంది ప్రొద్దుటే శాఖా గృహమును (Branch Primisis) శుభ్రము చేసే ఆవిడ కూడా చేస్తుంది' అని అన్నాడు. అందుకు సమాధానముగా నేను ' ఆ మాట వాస్తవము,. ఒకే పనిని వేరు వేరు వ్యక్తులు వేరు వేరు విధములుగా చేస్తారు'. నీ స్థానములో ఆ పని మనిషి కూర్చుంటే ముందు నీవు బల్లపై ఉంచిన ముఖ్యమైన దస్త్రములను (Files) చీపురుతో క్రిందకు త్రోసి, 'ఏమిటో ఈయన గొప్ప పదవినైతే పొందినాడుగానీ తన బల్లను శుభ్రముగా ఉంచుకొనుట తెలియదు అని మనసులో అనుకొంటుంది'. వాని విలువ ఏమిటో, వానిని ఎందుకు బల్లపై ఉంచుకోన్నావో ఊహించలేదు కాబట్టి. ఇదారమూ నవ్వుకొని ఆ విషయమును అంతటితో ముగించినాము. ఇక్కడ నేను చెప్పా వచ్చినదేమిటంటే ఎ పని ఎవరికీ నిర్దారించాబదినదో ఆపని చేసే విధివిధానము, ప్రాముఖ్యత అతనికే తెలుస్తుంది కానీంయులకు కాదు.
అదికాక ఆయన, సంస్థ వ్యాపారాభివృద్ధికి తగిన ప్రణాలికలు రచించి ఆచరణ లో వుంచవలసియుంటుంది. మరి సంస్థ లాభాలబాటలో నడిస్తేనే కదా నీకూ తగిన గుర్తింపు,హోదాజీతము దక్కేది. అసలొక పద్యము చెబుతాను విను:

జానుదేమో బండి జాకోబు డీజలు

జోన్సు తోలె మిగుల జోరుగాను

సొత్తు తనదికాని సోకు రాయని చూడు

రామమోహనుక్తి రమ్య సూక్తి

బాధ్యత లేకుండా చేసే పనులు ఆవిధంగా వుంటాయి. రాత్రి పూట జాగరూకత తో అరిచే బాధ్యత కుక్కది, ఆ పని గాడిద చేస్తే దెబ్బలే బహుమానము. అసలు నీ పైవానికి గల ఆకర్షణీయమైన గుణాలను గుర్తించు. అవకాశామోచ్చినపుడు నీదైన

రీతిలో ఉపయోగించు. ఇంతకు ముందే చెప్పినానుకదా! యద్యద్  ఆచరతి శ్రేష్ఠః ... అని చెప్పినాను కదా! కాబట్టి అతనిలోని శ్రేష్ఠత ను మాత్రమే గుర్తించు, లోపాలను గమనించి వానిని స్వంతము చేసుకోకుండా చూసుకో! 
అసలు అందరికీ పైవాడయిన పరమాత్మ ఏమి చెబుతున్నాడో చూడు:


న మే పార్థాస్తి కర్తవ్యమ్ త్రిషు లోకేషు కించన

నానవాప్తమవాప్తవ్యం వర్త  ఏవ చ కర్మణి                22-3


పార్థా విను,నే పాటించుటకే

కర్మలు గలుగవు గన ముజ్జగముల

ఫలితములేమో బడసెదనన్నియు

అయినను కర్మల నాచారించెదను                        22-3


యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః

మామ వర్త్మానువర్తంతే ముష్యాః పార్థ సర్వశః         23--3


కర్మలు నేనే కాదని యంటే

మదిగొనరికనవి మానవులందరు

ఆదర్శుండే ఆచరించనిచొ

మనుజులకెవ్వడు మార్గదర్శి మరి                       23--3


ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహం

సంకరస్య చ కర్తా శ్యాం ఉపహన్యామివమః ప్రణాః    24 --3


కర్మమ్ముల,నే కాలదన్నితే

లోకములేకల్లోలము చెందును

సాంకర్యమునకు సాధనమగుదును

కష్ట నష్టముల కారణమౌదును                          24 --3

ఆయన చేయవలసిన కర్మా లేదు ,ఆయనకు చెందని ఫలితమూ లేదు. అయినా ఆయన కర్మము చేయ మాన లేదు. రామునిగా అవతరించి ఈ లోకానికే ఆదర్శముగా నిలచినాడు. ధర్మ సంస్థాపనకు లౌకికము కూడా అవసరమేయని మనకు తన కృష్ణావతారముతో మనకెరుక పరచినాడు. ఆయన అడుగుజాడలో మనము ఆనందముగా నడచి ఆవలి ఒడ్డు చేరుకోవచ్చు. కానీ మనము ఈ ప్రాపంచిక లంపతములతో స్మ్లేషలో ఈగ వలె కొట్టుకొంటున్నాము. అసలు ఈ చరాచర సృష్టికి ఆయన కర్మ కాదా మూలము. మరి ఆయన కర్మచెయకుంటే అంతా అస్తవ్యస్తమే! ఆ వాస్తవాన్ని అర్జనునిలో పాదుగొలిపి ఆతనిని కార్యోన్ముఖుని చెస్తున్నాడు, భగవానుడు. అసలిది ఆలొచిస్తే ఎంతటి ఉత్ప్రేరకమో (Motivating Factor) చూడండి. ఆయన కర్మ ఆయనే చేస్తున్నాడు కాబట్టి మన కర్తవ్యము మనము నిర్వహించ వలసినదేకదా! అర్జనునిలో కలిగిన అయోమయమునకు ఆజ్యము పోసి దానిని మసి చేసి ఘృతమునే అందిస్తున్నాడు.అందుకే ఆయన అంటున్నాడు " నీ మాదిరి నేను కూడా కర్మ చెయకుండా వుంటే లొకమేమవుతుంధి. వర్ణాశ్రమాలు,జాతి సమాజము,స్వభావములు, రాష్ట్రములు, దేశము అంతా సాంకర్యమే! విహితము నిహితము అన్న తారతమ్యము ఉండదు. ఈ జ్ఞానమును ఆకళింపు చేసుకోలేక పెడదారి పట్టేవారికి కనువిప్పుగా ఆ పరమాత్మ చెబుతున్నాడు.
ఈ విధముగా ధర్మాచరణ , కర్మాచరణ, మర్మాలను పరాత్పరుడు  ప్రతిపాదించుచున్నాడు. వింటే అర్జునులమౌతాము, వినకుంటే సైంధవులమే!
*******************************************సమస్య మనది సలహా గీతది -- 29

నాకన్నీ  ఎరుక . ఇంకా నేను కర్మల చేయుట అవసరమా?

నా కన్నీ ఎరుక అనటము తోనే నీకు తెలియనిది చాలావున్నదని చెప్పకనే చెబుతున్నావు. ఏమీ లేని ఆకే ఎగిరి పడేది. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందని నీ కు తెలియదా! బహుశా తెలియదు నీకు. తెలిసివుంటే అన్నీ తెలుసునన్న ఆలోచన అసలు నీకు వచ్చియుండదు. ఇక అసలు విషయానికి వస్తే అన్నీ తెలిసిన భగవంతునికే తన కర్మలు తన బాధ్యతగా చేస్తున్నాడు. మరి అపుడు నీవెంత. నీ జ్ఞానము నీతో పని చేసే వారాలకు సర్వదా ఉపయోగ పడటము అత్యంత అవసరము. అసలు నీ మంచితనము నలుగురికీ తెలిసేది అప్పుడే! తెలుసునని నీవు వూరకుండిపోతే అసలు నీకు తెలుసునా లేదా అన్న సంశయాన్ని అందరికీ కలిగిస్తున్నావు. తెలిసినది పంచు తెలియనిది తెలుసుకో!  విజ్ఞానము నదీ ప్రవాహము . నీకు చేతనైన నీరు దొరకబుచ్చుకో . అది సముద్రములో కలువక మునుపే నీవు జాగ్రత్త పడాలి. నదికి పేరు వుంటుంది విజ్ఞానానికి కూడా అంతే కదా! నీకు ఏ నది నీరు కావలిసితే ఆ అనది వద్దకు పోయి నీరు పట్టుకో. సముద్రములో కలిస్తే నీవు ఏది ఎమిటో తెలియక అవస్థ పడుతావు. పైగా నీకపుడు దొరికేది ఉప్పునీరే!
కాబట్టి కర్మ చేయుట , అది చేయుటకు తగిన జ్ఞానమును ఆర్జించుట రెండూ అవసరమే. అసలా రెండింటిదీ అవినాభావ సంబంధము. రాముడు తండ్రి చెబితే పట్టాభిషేకమునకూ  సిద్ధపడినాడు ఆడవులకు పోవుటకూ సిద్ధపడినాడు. అసలు పరమాత్మ నె మానవ రూపములో ఎటువంటి మహిమల జోలికి పోకుండా, మనకు ధర్మ, కర్మలను నిష్కల్మషముగా ఆచరించమని చెప్పినాడు. అదే ధర్మాచారణ ,కర్మాచరణ అంటే! అందుకే  ఆయన మనకు ఆరాధ్యుడైనది. అసలు ఈ విషయములో శ్రీ కృష్ణుడు ఏమంటున్నాడో చూస్తాము. 

సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వన్తి భారత 

కుర్యాద్విద్వాంస్థథాసక్తః  చికీశుర్లోకసంగ్రహం                     25 -- 3

విద్వత్తే  లేని వారు వివిధ కామితములు తీర 

ఆసక్తిగ కర్మల తా మాచారించుచుందు రయ్య

అదేరీతి విద్వాంసులు, అవనికిమేల్జేయుకొరకు 

అమిత శ్రద్ధతో కర్మల నాచరించవలె నర్జున                        25 -- 3     

చూచినావా ! కర్మణి అను పదమును ఉపయోగించి సక్తాః అన్న పదాన్ని వాడి నీకై ఏర్పరుపబడిన కర్మలను నీవు ఆసక్తితో ఆచరించు   అని చెబుతున్నాడు పరాత్పరుడు. అవిద్వాంసః అను పదమునకు అవి ఎందుకు అనుసంధించినాడంటే విహిత కర్మలు అంటే శాస్త్ర విహిత కర్మలజోలికి పొతే వచ్చేది అటువంటి దుష్కర్మ ఫలములే!

ఇక ఇంకొక మాట 'విద్వాన్ ' అసక్తః అని వాడినాడు. ఒకవేళ ఈ 'అసక్తః' అన్నపదము శాస్త్ర విజ్ఞానికయితే 'ఆసక్తే' తప్పితే 'అసక్తత' ఉండదు. అది ఆత్మజ్ఞానమెరిగిన విద్వాంసునికే చెల్లు. ఆత్మజ్ఞానమంతు బట్టినవాడు లోకహిత కార్యాచరణకు వెనుదీయక సదా అదేపనికై పాటుపడతాడు. 

ఒక్క శ్లోకము ఇహపరములకు ఎంతగా బోధించుతూ వుందో చూడు. అదే గీతా మత్మ్యము అంటే. అందుకే విష్ణ్వంశ సంభూతుడైన వేదవ్యాసులు , అసలు, ఈ భగవద్గీతను గలిగిన భారతమును గూర్చి వేదవ్యాసులవారు ప్రారంభములోనే ఏమన్నారంటే 
ధర్మ తత్వజ్ఞులు ధర్మ శాస్త్రంబని

ఆధ్యాత్మ విదులు  వేదాంతమనియు 

నీతి విచక్షణుల్  నీతి శాస్త్రంబని 

కవి వృషభులు మహా కావ్యమనియు 

లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని 

ఐతిహాసకు లితిహాసమనియు 

పరమ పౌరాణికుల్ బహు పురాణ సముచ్చ

యంబని మహి కొనియాడుచుండ  

వివిధ వేద తత్వ వేది  వేదవ్యాసు

డాది ముని పరశారాత్మజుండు, 

విష్ణు సన్నిభుoడు , విశ్వ జనీనమై 

బరగుచుoడజేసే భారతంబు"


సాక్షాత్తు విష్ణు స్వరూపుడైన టు వంటి వేదవ్యాసుడు రచన చేసినటువంటి ఆ మహాభారతము
    ధర్మశాస్త్ర ధురీణులు ఇదే ధర్మ శాస్త్రం అని, ఆధ్యాత్మికతను అవలంబించినవారు అంటే పరమేశ్వర స్వరూప స్వభావజ్ఞులు    "వేదాంతమనియు"  నీతి విచక్షణ కలిగి నీతికే పట్టము కట్టేవారు   నీతి శాస్త్రంబనియు , కవి శ్రేష్ఠులు  "మహా కావ్యమనియు" "లాక్షణికులు అంటే కావ్య లక్షణముల గూర్చి రసప్రాధాన్యత; భావ ప్రాధాన్యత; వర్ణనా ప్రాధాన్యత. మొదలయిన విషయముల గూర్చి కూలంకషముగా తెలిసినవాడు దీనిని "సర్వ లక్షణ సంగ్రహమని, ఐతిహాసికులు అంటే Historians దీనిని చరిత్ర అని , పురాణ వేత్తలు ఇది అతి గొప్ప "పురాణమని" లంటే లోకములో గల వివిధ వైషయిక ప్రజ్ఞావంతులు వారి వారి ప్రజ్ఞలలో ఇంతకు మించినది లేదు అని అనే విధముగా వ్రాసినాడు అంటే ఆయన భగవంతుని అవతారము గాక వెరేమవుతాడు. పైగా పరమాత్మచెప్పినది తన దివ్యదృష్ఠి చేత కని విని చెప్పినది చెప్పిననట్లు వ్రాసినందువల్లనే అటు భగవద్గీత ఇటు భారతము అజరామరమైయోప్పుచున్నవి. సకల శాస్త్ర సంపన్నుడు, సర్వ విజ్ఞాన కోవిదుడు, వేద విభజనా కౌశలుడు, పరమాత్మ స్వరూపుడు అయిన వ్యాసులవారు , నీ సిద్ధాంతము ప్రకారము అయితే ఏమీ వ్రాయకుండా ముక్కు మూసుకొని ఊరక యుండియుండవచ్చు. కానీ కేవలము మనకొరకు వ్రాసినాడు . అది కర్మాచరణ అంటే! దానిని గురించియే పరమాత్మ చెప్పినది.

అటువంటి మహనీయులు స్వలాభామన్నదే లేకుండా విశ్వశ్రేయస్సుకై పాటుపడితే 'నాకన్నీ తెలుసునన్న ' నీకన్నా మూర్ఖుడు ఈ లోకములో దొరకడు.

 'ఉత్తిష్ఠ జాగృత' 
స్వస్తి.


*******************************************

సమస్య మనది సలహా గీతది -- 30
సమస్య:  నేను మంచి చెడ్డల విచక్షణ గలిగిన వాడిని. విషయ పరిజ్ఞానము గలిగిన వానిని. మరి నేను చేపట్టిన పనిని నా పద్ధతిలో గాక ఇంకా మంచి పద్ధతిలో చేయవచ్చును కదా !
సలహా : నీ సస్య యుక్తియుక్తమైనదే! కానీ ఒక తిరకాసున్నది. మానవులమైనందుకు మనము ఆహారము తినవలసినదే! కడుపు నింపుకోవలసిందే!  ఈ కడుపు నింపుకొనుట అన్న పనిని ఎవరి పద్ధతిలో వారు చేస్తారు. కలిగినవాడు కోరింది తింటాడు. కలగని వాడు దొరికింది తింటాడు. ఇందులో కూడా ఎవరి రుచి వారిది. లోకో భిన్న రుచి అన్నారు కదా! ఇక నీవు నిన్ను జ్ఞానము, విచక్షణ కలవానివి అన్నావు  నీకున్న జ్ఞాన మేపాటిది,నా బలమేమి, బలహీనతేమి, నా కార్యమును ఆపుటకు వచ్చే అవరోధములేమి, అందివచ్చే అవకాశాములేమి యన్నది పైగా నా వివేకము ఈ పనిని ఏవిధముగా చేయించుతుంది, అన్నది ఎంతో ముఖ్యము. మరి ఈ వివేకమునకు ప్రేరణ ఎవరు? నా మేధస్సు. మరి మేధస్సుకు ప్రేరణ ఎవరు? నా పూర్వ జన్మ వాసనలే!
ఒక సామూహిక దుర్ఘటన జరిగితే, దానికి గురియైన అందరికీ ఒకే విధమైన గాయములు కలుగుట లేదు. అవి మానే వ్యవధి కూడా ఒకటిగా ఉండుట లేదు. మాట వరుసకు ఇద్దరికీ ఒకే విధమైన గాయములు తగిలినవి అనుకొందాము. గమ్మత్తేమిటంటే ఒకరికి ముందుగా నయమైతే ఒకరికి ఆలస్యము జరుగుతుంది. మరి ఇది   పూర్వ కర్మ ఫలమే కదా! ఈ పూర్వజన్మ వాసనల వాళ్ళ ఏవో చెడ్డ తలపులు ఒకనికి సంభవించినవని తలచెదము. అంటే ఒక గది దుర్గంధ భరితమై యున్నది అనుకొందాము. మన అనుభవము వలన కానీ మన శ్రేయోభిలాషులు ఇచ్చిన సలహా వల్ల కానీ ఆ గదిని శుభ్రముచేసి, దానికి గల కిటికీలను తెరిచి సాంబ్రాణి ధూపము వేసి ఆ గదిని వాస యోగ్యము చేస్తాము. అంటే మన పూర్వ వాసనల వల్ల  మనలో కలిగిన చిత్త వృత్తిని మన యొక్క బుద్ధి పరిపక్వత చేత సరియైన గురూపదేశము చేత, జన్మాంతర వాసనలను సవరించుకుంటూ దాని ప్రభావమును మన పై తగ్గించుకుంటూ ఋజు మార్గములో నడువ బూనుచున్నాము. అంటే రాబోవు జన్మకు ఒక చక్కటి  పునాదిని ఏర్పరచుకొంటున్నాము.
ఇప్పుడు దీనిని ఒక కార్యాలయమునకు అన్వయింకొందాము. అధికారి, కార్యాలయములో ఎంతమంది పనిచేస్తున్నా, ఫలానా పని ఫలానా వ్యక్తికి ఇమ్మని చెబుతారు. అంటే ఏమని? ఆ వ్యక్తిలో సామర్థ్యాన్ని ఇవ్వమన్న అతను గుర్తించినాడన్నమాట. మరి నీ కెందుకు ఆ అవకాశము రాలేదు. నీ జన్మాంతర వాసనలవల్ల నీలో ఒక తపన , ఉత్సాహము, ఉత్తేజము, ఉద్వేగము లేదు. కానీ నీ కిపుడు ఒక ఆదర్శప్రాయుడు  దొరకినాడు. అటువంటి వ్యక్తిని అనుసరించుటవల్ల నీ ప్రకృతిలో కొంత మార్పు తెచ్చుకోవచ్చు. ఆశయము మంచిదైనపుడు ఆశపడుటలో తప్పులేదు. ఆ పని చేసే విధానము నీకు ముందుగానే తెలుసు. నీకు కావలసిందల్లా నీదయిన ఒక పంథా. ఉత్సాహము ఎప్పుడూ ప్రోత్సాహమునకు అనుబంధము. అది అతనిని పరిశీలించుటవల్ల  వల్ల నీలోనూ కలుగుతుంది. అప్పుడు ఆ పనిని నీవు కూడా చేయగల సమర్థుడవౌతావు. నీవు ఆ పనిచేసి ఇంకా పదుగురికి ఆదర్శప్రాయుడ వౌతావు. కాబట్టి లౌకిక జ్ఞానము పొందితే నీ సంఘములో నీవు ఆరాధింప బడుతావు. అదే పారలౌకిక జ్ఞానార్జన చేస్తే  పరమాత్మను కనుగొంటావు.
దేనికైనా కూడా నీ నైజమును సన్మార్గమువైపుకు మరలించుతూ నీవు సత్కర్మలు చేస్తూ జీవితములో పురోభివృద్ధి సాధించటమే!
అసలు భగవాన్ శ్రీ కృష్ణుడు ఈ విషయమై ఏమంటున్నాడో విందాము.

సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి 
ప్రకృతిం యాన్తి భూతాని నిగ్రహః కిం కరిష్యతి    33-3

జ్ఞాని యైన న జ్ఞాని యైనను
మనో ప్రవృత్తికి మరి బానిసలు
చేకొని చిత్తము, చేతురు  కర్మలు              
కర దీపికగా కంటి చూపుగా                          33-3
       
ఆత్మజ్ఞానులు కానివారు అంటే  సాధారణమైన మన లాంటి మానవులు స్వభావానుసారమే   కర్మల  నిర్వర్తించి కోరికలు  బడిసెదరు. అదే జ్ఞానులు కూడా కర్మఫలము తమ కొరకు కాకపోయినా సంఘ దేశ శ్రేయస్సుకు కొరకు కర్మల నాచరించుతారు. కానీ వారు కూడా తమ చిత్తప్రవృత్తులను బట్ట్ట్టియే.! ఉదాహరణకు వశిష్ఠ మహర్షిని, దూర్వాసో మహర్షినీ తీసుకొందాము.  ఇరువురి ధ్యేయమూ విశ్వకల్యాణమే! కానీ వశిష్ఠుడు పరిశుద్ధ, పరిపూర్ణ సాత్వికుడు, ఆగ్రహానుగ్రహ సమర్థుడు కానీ దూర్వాసుడు రజోగుణ సంపన్నుడు. కోపము మెండు. ఆగ్రహ మెక్కువ, నిగ్రహము తక్కువ. అంటే మనోరథ మొకటైనా సారధులైన మనోప్రవృత్తులు వేరు. ఈ శ్లోకములోని అర్థమును స్థూలముగా గైకొని నిరాశావాదమును తెరపైకి తెస్తారు. ఎంత జ్ఞానియైనా  పూర్వజన్మ వాసనా ఫలమైన ప్రకృతిని అనుసరించి యే నడుచుకొనునప్పుడు ఇక జ్ఞానార్జన చేసి ఫలమేమున్నది అన్నది వారి సందేహము. ఇక్కడ అర్థము చేసుకోవలసిన ఒక చిన్న విషయము వుంది. అది ఏమిటంటే జ్ఞానము వేరు వివేకము వేరు. జ్ఞానము వంటకు సంబంధించిన ఒక వస్తువుల గది లాంటిది. వివేకము వంటవాడు. వస్తువుల గదినుండి తనకు కావలసిన వస్తువు కావలసిన మేరకు తీసుకొని తాను వంట చేస్తాడు. ఆ వంటకము యొక్క బాగు ఓగు ఆ వంట వాని మీదనే ఆధారపడుతుంది. బాగుంటే అతను ధీమంతుడే  లేకుంటే తన వివేకమును అభివృద్ధి పరచుకోవలసినదే!  తన వివేకము పెరిగే వరకు తనదైన కర్మ యగు వంట చేస్తూ వుండవలసినదే! అందువల్ల జ్ఞాని అజ్ఞాని అన్న తారతమ్యము లేకుండా ఎవరి కర్మ వారు చేయవలసినదే! పూర్వజన్మ కృతమైన చిత్తవృత్తులను మాత్రము సవరించుకొని /సవరించుకుంటూ సాగావలసినదే!
సద్గమన ప్రాప్తిరస్తు.
*********************************************************************************

Thursday, 12 March 2020

చంద్రమోహనా
సూర్యకాంతి చవి చూడని చంద్రమోహనా
 సహనమన్నదే ఎరుగని సదాతప్త సూర్యగుణా
సంతత నాసార్ద్రతప్త సారస సుర వదనా
ఎంజీయార్ నగరేశా వెంపటి గృహ స్థిరవాసా
రామ లక్ష్మి ప్రాణేశా బంధుమిత్ర మనోక్లేశ
గజ మదనా గజ వదనా గజ శరీర గజగమనా
గతము మరచిపోయినట్టి గతిగల్గిన ఓ సుమనా 
రస రాజా రుచి భోజా సుషుప్తిలో రవితేజా
అసూయనే అమృతమును అనవరతము గల కూజా 
మకుట నాస్తి మహరాజ మరులుగొల్పు మాకాజా
ఆపుతాను ఇక బాజా హాయిహాయిగా సోజా

Sunday, 8 March 2020

సమస్య మనది – సలహా గీతది – 19-25



సమస్య మనది -- సలహా గీతది -- 19  

సమస్య : నేను ఒక వ్యక్తి చేత ఆకర్షితుడ నైనాను. ఆ వ్యక్తీ నాకే చెందాలన్న తపన. ఆ వ్యక్తి వేరెవరినైనా చూస్తే ఓర్వలేను. వేరెవరైనా ఆ వ్యక్తిని చూస్తే నాకు మితి మీరిన కోపము. నేనేమి చేయాలి ?
సలహా : సమాధానానికి ముందు సంస్కారాన్ని గూర్చి ఒక మాట చెబుతాను.
నీవు గుడిలోకి పోబోతూ గుడి ముంగిట నిలిచినట్లు ఊహించుకో ! ఆ వాతావరణములో ఏమి కనిపిస్తాయిపసుపు కుంకుమకొబ్బరికాయలుకర్పూరముఅగరు వత్తులుదేవుని చిత్ర పటాలుభక్తి పుస్తకాలు తమలపాకులువక్కలుఅరటిపళ్ళు మొదలైనవి మాత్రమె వుంటాయి. KFC, పిజ్జాలు మొదలైనవి దొరకవు . ఎందుకు. అది పరిసరపు ప్రభావము. దీనివల్ల మనకు ఏమి అర్థమౌతుంది. తలపునకు తగినట్టే తగిన వస్తు సముదాయమును తల సమకూర్చుతుంది. అందుకే బాల్యములోనే తల్లిదండ్రులు తగిన శ్రద్ధ తీసుకొని సంస్కారాన్ని నేర్పిస్తే  సన్మార్గాన పోయే అవకాశము వుంటుంది. అసలు నీ బుద్ధి అనేది బాల్యములో సామాను చేర్చని కొత్త ఇల్లు లాంటిది. మరి ఆ ఇంటిలో వుండదలచినవారు తగిన సామాను ఉంచితే అందంగా ఉండడమే గాక చూచే వారందరికీ ఆనందాన్ని కూడా సమకూర్చుతుంది. అసలు ఇంటికే ప్రాణముంటే నలుగురి మెచ్చుకోళ్ళు విని ఎంత ఆనందించుతుందో ! మనము చేయవలసినది అదే ! అదే ఇంటిని పెంటకుప్ప జేసి కంటికి నచ్చిందని మనమనుకొంటే ప్రయోజనముండదు. 
నలుగురు నచ్చేవిధమున
నలుగురిచే మెప్పుపొంది నాణ్యత మీరన్ 
నలువ దయ కల్గి మెలగుము
నలుతెరగుల నిన్ను మెచ్చ నడువుము రామా!
 ఒకసారి నీవుసన్మార్గము దుర్మార్గము అన్న ఆరెండు మాటలు ప్రక్కన వుంచినీకు కలిగిన కోరిక వల్ల నీకు మానసికంగా కలిగే గ్లాని ఎంతఅన్నది ఒకసారి బేరీజు వేయి! ఆ గ్లానిని గూర్చి  ఆలోచించుతూ వుంటే ఆరోగ్య మేమవుతుంది అన్న  చింత మనసుకు కొంతయినా వచ్చిందా! నీ కోరిక తీరుతుందో లేదో తెలియదు. తెలిసే వరకు నీ మనసుకు నిలకడ లేదు. నిలకడ లేకుంటే పడిపోవుట తథ్యము కాదా!   నీ మనసులో ఒక విధమైన తాత్వికత నీ తలిదండ్రి గురువులు కలిగించినారంటే నీ ఆలోచనలు అన్యథా పోవు. ఎద్దు చేలో మేస్తే దూడ గట్టున మేయదు కదా!  
ఒకసారి 'బాహుబలిసినిమా ను గూర్చి ఊహించుకో ! ఇప్పటికది మొదలు పెట్టి మూడు సంవత్సరాలు అవుతూ ఉందేమో అది చూడాలని నీకు ఆకాంక్ష . అది తీరేవరకు మనసులో క్షోభ . ఎవరైనా నెగెటివ్ గా చెబితే వారిపై కోపము. చివరికి అది ఒకానొక రోజు విడుదల కానేఅయ్యింది. ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి టికెట్ కొన్నావు. కారులో సంసారముతో  వెళ్ళుతూ వుంటే నీ మిత్రుడు నీకోసమేనీ 50 లక్షల బాకీ చెల్లించడానికి వస్తున్నట్లు తెలిపినాడు. ఒక్క క్షణము మెదడు మొద్దుబారి పోయింది. ముందుకు పోలేవు వెనక్కు రాలేవు. సరే అతనితో మాటలాడిఒక సంకేతమును ఏర్అపరచుకొనిఅనుకొన్న ప్రకారముగా దారిలో కలిసి డబ్బు తీసుకొని కారులో పెట్టుకొని థియేటర్ చేరినావు. ఆలస్యమైంది. సినిమా మొదలైంది. ఆ హడావుడిలో కారు తాళాలు మరచినావు. సినిమా చాలా బాగుందని అందరూ అనందించుతుంటే  నీకు కారు తాళాలు గుర్తుకొచ్చి సినిమా వదిలి పార్కింగ్ ప్లేస్ కు పోయినావు. కారు లేదుడబ్బు కారుతోబాటే పోయింది నీ కుటుంబము ధియేటర్ లో వుంది. సమస్య పరిష్కారమైనదాలేదా లేదా ఇప్పుడు అప్రస్తుతము. నీకోరిక తీరినట్లా లేనట్లా చెప్పు  ఆనందము పొందినట్లా లేనట్లాఅందుకే ఆశను ఆకాశమునకు అంటించ వద్దు. నీకు రక్ష నీ నడవడిక.నీ దైవ చింతన. నీ ధర్మ బుద్ధి. నాకు పలుకుటకు వీనికి ప్రానముందా అనవచ్చు. ప్రాణమున్న పులి నిన్ను చంపుతుంది. అదే ప్రాణమున్న నిన్నే అంటిపెట్టుకొని ఉంటుంది. కాబట్టి నీ ఆలోచన వ్యాఘ్రమాహరిణమా అన్నది నీ విచక్షణకు సంబంధించినది. 'యద్ భావం తద్ భవతిఅన్నారు ఆర్యులు. కావున నీ ఆలోచనలు హరిణములై ఉన్నంతవరకునీ పరిసరాలునీవు నీ మనసు అంతా ఆనందమే! 
ఈసు సుయోధనుండగు  ఎంచగ నూర్గురనుంగు సోదరుల్
దోసము కుళ్ళు కుట్రలకు మూల విరాట్టులు కర్ణ మాతులుల్
మోసము లెల్ల దాయలకు  దుస్సహ రీతిని జేసి వారిచే
దూసర రీతినిన్ ప్రళయ ధూళిని జేరిరి దుష్ట వాంఛలన్
అవసరములేని అనాయాచితమైనఆలోచనలు అత్యంత అనర్థదాయకములు. 'ధర్మం చరఅన్నది వేదము. నీ ధర్మమూ నీ సంస్కారముచే నిర్ణయింప బడుతుంది. చెడు తలంపులు ఎంత చెడ్డవని పరమాత్మ చెబుతున్నాడో తెలుసుకో! 
ఇక ఈ విషయములో శ్రీకృష్ణుడు ఏమని ఉపదేశించినాడో చూద్దాము.                                                                       ధ్యాయతో విషయాన్ పుంసః సంగాస్తేషూపజాయతే
సంగాత్సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే 62 -- 2  

మనసున తలపే మరులను గూర్చును 
మరులుగొన్నచో మమతలు పెరుగును
మమతలు పెరిగిన మతికంపించును
మతి కంపించిన  మసగును కోపము  62 -- 2 (మసగుట=విజృంభించుట)

క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః
స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశః బుద్ధి నాశాత్ ప్రణశ్యతి 6౩ -- 2 

కోపమన్నదొక కొరివి చూడమది
సమ్మోహాగ్నిని సంతరించును
సమ్మోహముచే స్మృతి గతి తప్పును
స్మృతి గతి తప్పిన మతియె నశించును 63--2

మయ సభను చూచినది మొదలు తన వధ వరకు దుర్యోధనుడు తన మనసున అది తనకు కావలె నాన్న కోరికతో మొదలుపెట్టి తన మరణము కొనితెచ్చుకొనే వరకు పై మానసిక ప్రకంపనలన్నీ పొందుట గమనించవచ్చు.(దుర్యోధనుడు మయసభలో స్థలమని భ్రమించి నీటి గుంటలో పడినపుడు ద్రౌపది నవ్విన వారిలో లేదని సభాపర్వము 47 - అధ్యాయము లో చూడనగును.) ఇంకొక ఉదాహరణము తీసుకొందాము.
ఒక చక్కటి అమ్మాయిని చూడటము అనుకోకుండా తటస్తి స్తే  ఆ అమ్మాయి తల్లిదండ్రులెవరు  ఆమెను  చూచుటకు లేక ఆకర్షించుటకు మనలో పాత్రత యున్నదా సాంఘీక పరమైన కట్టుబాట్ల పరిధిలో వున్నామా అతిశయించిన మన మనో  వాంఛ వల్ల జరుగబోవు విపరీత విపత్కర పరిణామాలేమిటి   అన్న ఇత్యాది విషయములు ఆలోచించక పోగా  ఆమె ఇల్లు ఎక్కడకాలేజి ఎక్కడ ఇంటినుండి కాలేజీ కి ఎప్పుడు బయలుదేరుతుంది అన్న మొదలైన విషయాల గూర్చి ఆలోచిస్తాము. ఆమెను అనుసరించుటే కాక వేరెవరైనా ఆమె వైపు చూసినా సహించలేక విచక్షణా రహితంగా అతనితో యుద్ధానికి సిద్ధమై తన్నులు కూడా తినవచ్చు నెమోఈ వ్యాకులతకు పర్యవసానమేమిఇది సముచితమా !ఇది సంస్కారమా! అన్నది తరువాత ఆలోచిస్తాము.
ఇపుడు 
 మనసులో కలిగిన ప్రకంపనలు ఏమిటి అన్నది చూస్తాము.  అమ్మాయిని చూస్తూనే మనసులో ఈమె బాగుంది అన్న తలంపు కలిగింది. తలంపు పదే  పదే  అదే అదే మనసులో మసలుతూనే ఉండుటకు దారి తీసింది. దానితో ఆమె పై మమత  
ఏర్పడింది. అంటే ఈమె నాది అన్న బలమైన భావన మనసులో పాదు చేసుకోనింది. మతి గతి తప్పింది. అన్ని ఆలోచనలు మాని అమెను గూర్చి మాత్రమే ఆలోచించ దొడిగింది. మహా భారతములో శంతనుడు సత్యవతి విషయములో ఇదే కదా జరిగినది. ఇది జరుగకుంటే భారత యుద్ధము వచ్చేదే కాదు. సత్యవ్రతునికి 'భీష్ముడుఅన్న పేరు వచ్చేది కాదు. ఆయన అవివాహితునిగా ఉండిపోయేవాడు కాదు. కౌరవ పాండవులు జన్మించేవారు కారు. భారతయుద్ధము జరిగియుండేది కాదు. చూచినారా ఎవరు చేసిన పనికి ఎవరు బలి అయినారోఈ విధముగా మతి కంపించడము వలన కోపము వస్తుంది. అది తన చేతగాని తనముపై కావచ్చు లేక  పరులపై కావచ్చు. కోపము ఒక విపరీతమైన మోహమును అంటే ఎవిధముగానైనా నాదే అనే  పట్టుదల  మర్రిచ్ట్టాయి మనసులో నిలుస్తుంది. అది విచక్షణా జ్ఞానాన్ని రూపు మాపుతుంది.  మరి విచక్షణే లేకుంటే బుద్ధి పోయినట్లే కదా ! బుద్దే లేకపోతే మరి మనుషులమెట్లవుతాము.  మనుషులము కాదు విచాల్క్షణ లేదు . అంటే మనము గుడ్డి ఎద్దులమైనాము. 'గుడ్డెద్దు చేనులో పడితే చేనుకూ నష్టమే ఎద్దుకూ నష్టమే. చేనుకు పంట చేటు ఎద్దుకు వంటి చేటు. మరి ఆక్రోశముతో దానిని కొడతాడుకదా పంటమాలి.                                                                                                       
మరి ఒక్క సారి ఆలోచిస్తే మనకు అర్థమౌతుంది దీనంతటికీ కారణము తగిన సంస్కారము లేకపోవుటేయని. అందుకే ఆదిశంకరులు అన్నారు
సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చల తత్వం నిశ్చల తత్వే జేవన్ముక్తిః

కాబట్టి బాల్యమునుంది కూడా బాలునికి శ్రద్ధ వహిచి పెద్దలు సత్సాంగత్యము ఏర్పరచినారంటే మిగతా విషయాలన్నీ తానె చూసుకొని సమాజములో చక్కని పౌరునిగా తీర్చిదిద్దుటే కాకుండా జీవన్ముక్తి కూడా కలిగిస్తుంది. 
    

ఈ 
 సలహా ముఖ్యముగా యువకులు మనసు పెట్టి చదివి తమలో ఎవిధమన బలహీనతలున్నా సవరించుకొని సరియైన జీవన మార్గమునే నమ్ముకొంటారని నమ్ముతూ మీ ముందుంచున్నాను.

స్వస్తి.

******************************************************

సమస్య మనది -- సలహా గీతది -- 20
సమస్య : పాదరస సాదృశమైన నా మనసుకు నిలకడేదీ ?
సలహా : ఎంత సులభముగా అడిగినావు. ఇదేమీ అంగడికిపోయి అరటిపండు కొనటము కాదు. భలే రాముడు సినిమాలో రేలంగి 'బంగారు బొమ్మా ! బలే జోరుగా పదవే పోదాము పై దేశం చూదాము ' అంటూ ఇంకా "కలకత్తా బొయి కారులేక్కుదాం, బొంబాయి వెళ్లి బోటులేక్కుదాం, ఢిల్లీ వెళ్లి విమానమెక్కి మళ్ళీ తిరిగి మన వూరొద్దాం" అని అంటాడు. గమనించితే అంతా అరచేతిలో వైకుంఠమే . ఎందుకంటే అది మూడు నిముసములలో పాట పాడినంత సులభముగాదు,ఎంతో పాటు పడవలసినది వుంది. మరి అంత వేగముతో పయనించే మనసు అనే బండిని మనము కట్టుబాటులో ఉంచాలంటే ఎంత కష్టమో గమనించు. కానీ ,కష్టపడితే కానిదేమీ లేదు. ఈ సందర్భములో నేను వ్రాసిన ఒక చిన్న పద్యము గమనించు :
పచ్చిమిరప బజ్జి బల్ కమ్మగా నుండు
మితము మీరి తినుట హితము కాదు 
ఇష్టమొకటి కాదు ఇంగితమును జూడు 
రామమోహనుక్తి రమ్య సూక్తి
అతి ముఖ్యమైన విషయమేమంటే, అవసరము లేనివి చూసినా, అవసరము లేకుండా తిరిగినా, అవసరము లేని వారితో సావాసము చేసినా అనర్థమే ఆఖరుకు జరిగేది. ఎంతవరకో అంతే . దీనికి జనక మహారాజు మనకు ఆదర్శము. అందుకే ఆయనను జనక మహర్షి అన్నారు . అదే రాముని తండ్రియైన దశరథుని అనలేదు.
ఇక ఈ విషయమి పరమాత్మ ఏమన్నాడో పరిశీలిద్దాము.
రాగద్వేష విముక్తైస్తు విషయానిన్ద్రియైశ్చరన్
ఆత్మా వశ్యైః విధేయాత్మా ప్రసాద మదిగచ్ఛతి 64-- 2
విషయ వాంఛ వీధులలో
ఇంద్రియమ్ములెటు దిరిగిన
రాగద్వేష రహితమైన
ఆత్మ నిగ్రహత గల్గుము 64 -- 2
ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే
ప్రసన్న చేతసోహ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతి 65 -- 2
శాంతము బాధల సాంతమడంచగ
ప్రసన్న చిత్తము ప్రముఖ సాధనము
ఆత్మ నిశ్చలత నందుకొన్నచో 
అంతకు మించిన ఆనందంబెది 64-- 3
ఆత్మ నిగ్రహత కు ఆలంబనము విషయ వాంఛలు బాహ్యేంద్రియములు వానిపై పెత్తనము చేసే మనసు. మన చపలతను మన పెద్దలు ఆరు భాగములుగా విభజించినారు. అవి: శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానము .ఈ ఆరింటిని శమాది షట్క సంపత్తి అంటారు. నిజ జీవితములో వీనిని అనుసరించినట్లైతే అశాంతికి అవకాశమూ ఉండదు ప్రశాంతికి అంతరాయమూ ఉండదు..
శమము అంటే అంతరేంద్రియ నిగ్రహము, దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహము. శమ,దమమూలన్న ఇవి ద్వంద్వములే కానీ పరస్పర వ్యతిరిక్తములు కావు. మనసు వాసనా రహితము చేసుకొనుట శమము. ఇంద్రియ నిగ్రహము దమము. ఒక చిన్న ఉదాహరణతో ఈ రెంటిన విపులీకరించే ప్రయత్నము చేస్తాను. మామిడి పళ్ళు అంటే మీకిష్టం. ఎందుకో అవి ఇక పై తినకూడదనుకొన్నారు. మామిడి పళ్ళ పై ఆలోచనను మనసునుండి చేరిపేస్తే అది శమము. మీకాళ్ళను కళ్ళను కట్టివేసి మీ బాహ్యేంద్రియములను నియంత్రించుకొంటే పండు పై కోరిక రాను రానూ మాసిపోతుంది.అది దమము.ఈ శమదమాల సాన్నిహిత్యము మిమ్ము ద్వంద్వాతీతులను చేయగలదు
ఇంద్రియములు విషయాలను ఆశిస్తాయి. విషయాలు ఇంద్రియాలను ఆశ్రయిస్తాయి. కనుక ఈ రెంటిదీ పరస్పరము విడదీయరాని బంధము.ఈ శరీరమనే కోటకు ఇంద్రియములు ద్వారముల వంటివి. ఈ ద్వారాల నియంత్రణ మన చేతిలో వుంటే మనకు మించిన ఆనందముననుభవించేవాడు లేడు. అది నీవు ఇంద్రియములపై ఆధిపత్యం కలిగి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇంద్రియములపై నీవు ఆధిపత్యం కలిగి ఉండాలి అంటే మనస్సు నీకు స్వాధీనమై ఉండాలి. మనస్సు స్వాధీనమై ఉండవలెనంటే వస్తువుల పై, వైరాగ్య భావన పెంచుకోవాలి.
అసలు, ఆనందము = తీరిన కోర్కెలు/ మొత్తము కోర్కెలు. నీవు చేయ వలసిన పని ఏమిటంటే తీరిన కోర్కెల సంఖ్య పెంచుకొంటూ , అదనపు కోర్కెలను మొత్తము కోర్కె లలోనికి చేర్చకుండా ఉండగలిగితే రాను రాను ఆనందము అందివస్తుంది.
కాబట్టి ఒకప్రక్క ఉన్న కోరికలను తగ్గించు, ఇంకొక ప్రక్క ధర్మబద్ధమైన బలమైన కోర్కెలు తీర్చుకో. తీరిన కోర్కెను తిరిగీ తెచ్చుకోకు. నీకు ఆనందము మిగలక ఏమౌతుంది. ఈ పద్యము విను.

తిండి నలుసు పట్టి తిరముగ గోడపై
ప్రాకుచుండు చీమ పడుచు లేచి 
పట్టుదలకు జయమె ఫలితమ్మురా ఇది 
రామ మొహనుక్తి రమ్యసూక్తి

విజయోస్తు.


*************************************************************

సమస్య మనది  సలహా గీతది  21

సమస్య : నాకు ఆలోచన నాస్తి ఆవేశం జాస్తి. పని మొదలు పెడతాను కానీ పర్యవసానము గోచరించదు లేక నాపాలిటి అనర్థ దాయకమౌతుంది.
అందువల్ల శాంతి లేదు. సుఖములేదు. కర్తవ్యము తెలియలేదు.

సలహా : మొదలు ఈ మాటకు అర్థము తెలుసుకో ! కర్త ఆలోచించి ఆచరించ దలచిన పనికి కర్తవ్యమని పేరు.
ఆలోచన నాస్తి అని నీవే అంటున్నావు. దానికి తోడూ ఆవేశము జాస్తీ అంటున్నావు . మనిషి యొక్క మనసును కోతితో పోల్చవచ్చును.ఆవేశము దానికి తోడైతే  అదే యావతో అది పిచ్చిదై పోతుంది. మరి పిచ్చిదైతే దాని పరిస్థితి ఎట్లుంటుందనేది నాలో కలిగిన భావానికి ఈ అక్షర రూపాన్నిచ్చినాను. ఒకసారి గమనించు, నీకే అర్థమౌతుంది.

మొదలే తానొక పిచ్చికోతి యగుటన్   ముల్ ద్రొక్కె, మైమర్వగా 
మదిరా మత్తపు చిత్తయై దుముకగా మంటల్ పదాలంటగా
కదిలెన్ కందుక రీతిలో, నభమునన్ కన్పింప నాట్యాంగనల్
వదిలెన్ తాళము పక్వమైన ఫలమున్ వైనమ్ముగా నెత్తిపై
ఇప్పుడు నీకు అర్థమై వుంటుంది, ఎంత అనర్థ మౌతుందో, కోతి పిచ్చిదైతే! అదే కోతిని సరియైన దారిలో వుంచితే మనిషి అయినా కాకపోయినా మనిషి ఆడించే విధముగా ఆడుతుంది. కాబట్టి ఏపనికైనా నిబ్బరము అంటే నిర్భరత అవసరము.   
ఇందుకు ఉదాహరణా ఇదేవిధముగా ఆవేశపూరితుడైన అశ్వత్థామ కథ క్లుప్తముగా తెలియజేస్తాను. అశ్వత్థామ ద్రోణుని కుమారుడని తెలియనివారుండరు. ఇతని తల్లి కృపి. ఇతడు సప్తచిరంజీవులగు.
1.    అశ్వత్థామ, 2. బలిచక్రవర్తి. 3. వ్వాసమహర్షి. 4. హనుమంతుడు. 5. విభీషణుడు. 6. కృపాచార్యుడు. 7. పరశురాముడు, లలో ఒకడు.
కురుక్షేత్ర సంగ్రామములో దుర్యోధనుని తొడలు విరుగగొట్టబడిన తరువాత కౌరవ పక్షాన మిగిలిన ముగ్గురిలో ఒకడు. మహా శూరుడు.
 అశ్వత్థామ తొడలు విరిగిన దుర్యోధనుని చూసి ఆరాత్రికి అత్యంత అక్రమమైన రీతిలోనైనా  పాండవుల చంపుతానని మాట ఇచ్చికృతవర్మ, కృపాచార్యునితో కలిసి రాత్రి వేళలో దాడి చేయడానికి పాండవుల శిబిరానికి వెళ్ళినాడు. కానీ అక్కడ దుష్టద్యుమ్నుని  పాండవులనుకొని ఉపపాండవులను కుత్తుకలు కోసి దారుణముగా చంపుతాడు. కారణం పాండవులను శ్రీకృష్ణుడు రక్షించడమే!
అది తెలుసుకొని పాండవులు శ్రీకృష్ణుని తోడుత వెళ్లి  అశ్వత్థామను కనుగొని, అతనితో అర్జనుని యుద్ధము చేయమని శ్రీకృష్ణుడు చెప్పగా, అర్జనుని ధాటికి శరీరము జల్లెడ చిల్లులవలె అయిపోగా   పాండవ వంశమే లేకుండాచేసే తలంపుతో  అపాండవం అగు గాక అని మంత్రించి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించూతాడు. దానిని అర్జునుడు అదే అస్త్త్రంతో ఎదుర్కొంటాడు. రెండు మహాస్త్రాలు ఒకదానిని ఒకటి ఎదుర్కొనడంతో అది విశ్వ వినాశమునకు దారితీయునని ఎరింగినవారయిన  వ్యాస, నారదాదుల వంటివారు వారి ఆయుధములను ఉపసంహరించుకొన కోరగా  అర్జునుడు ఉపసంహరించగలిగినాడు కానీ  అశ్వత్థామకు ఉప సంహారం తెలియదన్నాడు. ఆ మంత్రాన్ని అతను తండ్రి నుండి ఉపదేశం పొంద లేదు కాబట్టి. కృష్ణుడు దానిని పాండవ వంశాంకురమగు ఉత్తర గర్భము నందలి శిశువు వైపు మరల్చమన్నాడు . దాని ప్రభావం వల్ల పరీక్షిత్తు మరణించడం, అతనిని కృష్ణుడు బతికించడం తెలిసిందే. అంతట శ్రీకృష్ణుడు అశ్వత్థామను   మూడు వేల సంవత్సరములపాటు అనామకుడిగా, వ్యాధులు బాధలతో దేశదిమ్మరివి కమ్మని శపించినాడు. దానితో అహం అణిగిన అశ్వత్థామ తన శక్తికి కారణమైన తన శిఖలోని మణిని పాండవులకిచ్చి తపస్సుకై వ్యాసుల వారి వెంట అడవులకు వెళ్ళాడు.
ఈకథలో అశ్వత్థామ ఆవేశానికి అద్దమై, ధర్మమును విడిచి అనవసర ఆగ్రహమునకు పాత్రుడై శాపదష్టుడై చిరంజీవియై కూడా పడరాని పాట్లు పడినాడు.
ఆవేశమునకు ఇంతకన్నా చక్కని ఉదాహరణ ఇవ్వగల పరిధి నాకు లేదు.
శివ సహస్ర నామములలోన ఆయనకు అతంద్రితః  = తొట్రుపాటు లేనివాడు, మర్షణాత్మా = సహనముతో కూడిన ఆత్మకలవాడు , సుసహః = మిక్కిలి సహనము కలవాడు అన్న పేర్లను మనం చూస్తాము. అంటే సహనము అన్నది పరమేశ్వర గుణము, పరమేశ్వర తత్వము, పరమేశ్వర రూపము. సహనమే ఆత్మ నిర్భరత. దానిని పొందుటకు విచక్షణ అవసరము. విచక్షణ వుంది అంటే బుద్ధి వున్నదనే కదా అర్థము. మరి బుద్ది లేమితో ఎన్ని అనర్థా లొస్తాయో , అసలు ఈ విషయములో శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నాడో చూస్తాము :
 నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావన  
న చాభావయతః శాన్తిరశాన్తస్య కుతః సుఖం  66  2
ఎవడయుక్తుడో వానికి  ఎరుక పడదు బుద్ధి ఉనికి
పావనమౌ బుద్ధి లేక భావనయు రాదు పనికి
భావహీనమైన ఎడల   పలుకరించబోదు శాంతి
శాంతి కానరాని చోట సౌఖ్యమన్న దొక భ్రాంతి   66  2
నీలో సమబుద్ది లేదు. కర్మ కౌశలమూ లేదు . దానివల్ల నీకు కార్య సిద్ధి కలిగినా కలుగకున్నా, సమ భావము, అఫలాపేక్ష,లేదు. అది కావాలంటే  నీలో సుకృత దుష్కృత విచక్షణ పెరుగవలె. అది నిరంతరాభ్యాసము వల్లగాని రాదు. ఆబుద్ధి కలుగకుంటే సదాలోచన ,సద్భావనా పరంపర సమీపమునకు రా సాధ్యముగాదు.  సద్భావనా వీచికలు లేని మనసుకు శాంతి చేరువ కాదు. శాంతి చేరకుండా సౌఖ్యము లేదు. నాద బ్రహ్మ త్యాగయ్య కూడా ‘శాంతము లేక సౌఖ్యము లేదు’ అనేకదా అనుభవ పూర్వకముగా శెలవిచ్చినారు.
కాబట్టి మనశ్శాంతిని చూరగొన్న వాడే సదాలోచానాపరుడై కార్యసాధకుడనిపించుకొంటాడు.
ఆదివేదమగు ఋగ్వేదములో ఈ మంత్రమును గమనించు.
ఆనోభద్రాః క్రతవోయంతు విశ్వతోదబ్ధాసో అపరీతాస ఉద్భిదఃI
దేవానోయథా సదమిద్ వృధే ఆసన్నప్రాయువో రక్షితారో దివేదివేII (ఋగ్వేదము)
దశదిశలనుండి నిరంతర కళ్యాణకారకమగు ఆలోచనలే లేక భావనలే మాలో ప్రసరించుగాక. అట్టి భావనలకు ఎటువంటి అవరోధము వుండకుండుగాక. మంగళకరమగు అజ్ఞాత విషయములు కూడా మా కర్ణ శ్రావ్యమగుగాక. నిరంతరమూ సకల దేవతలూ మమ్ము రక్షించుతూ మా ప్రగతికి కారణభూతులగుచుందురుగాక. ఈ ఒక్క శ్లోకము చాలు మనము పరిదినతిక్రమించి ఆవేశము పాలు కాకుండుటకు.
అడుగడుగునా, ప్రతి నుడుగునా, దారి పొడుగునా మంచిని మాత్రమే తెలిపే మన వేదశాస్త్ర పురాణములు వాని సారమైన ఉపనిషత్తులు, వానిసారమైన భగవద్గీత మన ధర్మమునకు పట్టుకొమ్మలు. వీనిలో ఉండేది వేరు ఏ మత గ్రంధముననైనా ఉండవచ్చు కానీ ఇందులో లేకుంటే వేరెక్కడా లేనట్లే!
శాంతి సుఖ సౌభాగ్య ప్రాప్తిరస్తు.

స్వస్తి.

******************************************************

సమస్య మనది  సలహా గీతది  22
బాహ్యేంద్రియాలనే గుర్రాలపై నా కోర్కెలు సవారీ చేస్తున్నాయి.వాటి కళ్ళెములు లాగే శక్తి నాకు గోచరము అగుట లేదు. నాగతి ఏమిటి ?

గాలిబుడగ (Balloon
 )ను చూసివుంటావు. దానిని సాధారణమైన గాలితో నింపవచ్చు లేదా ఉదజని ( hydrogen ) తో కూడా నింపవచ్చు. గాలిబుడగ సాధారణ వాయువుతో నిండియున్నంతసేపూ నీతోనే వుంటుందిదానికి బదులుగా ఉదజనితో నింపినావనుకో అది ఎప్పుడైనా నీచేయి దాటి పోయేదే! ఇందులో నీకేమి అర్థమౌతూవుంది. సాధారణమైన కోరికలు అంటే సహజమైన గాలి తో సంతృప్తి చెందే వరకూ జీవితమనే గాలిబుడగ నీతోనే వుంటుంది. నీ ఆశ పెరిగి పెను కోరికలకు మరిగిఉదజని కొరకు తిరిగి బుడగ నింపితే అది ఎప్పుడైనా నీ చేయి జారేదే ! ఈ వాస్తవము గుర్తెరుగు. వెనుకటికి ఒకడు తన స్నేహితునికి ఒక చెట్టు చూపించి "ఈ చెట్టు ఎక్కితే ఇంజనీరింగ్ విద్యార్థినులు అందరూ కనిపించుతా"రన్నాడటట. స్నేహితుడు వెంటనే " అవును చేతులు వదిలితే మెడికల్ కాలేజి విద్యార్థినులు కూడా కనిపించుతా"రన్నాడట. కాబట్టిఎంత చెట్టుకంత గాలి . దురాశ దుఃఖమునకు చేటు అన్న నానుడులు వినలేదా ! వినియుండవేమో ! అవి ఇంగ్లీషు బళ్ళలో నేర్పించరు కదా!
సాత్త్విక గుణ సంపన్నులు ఆధ్యాత్మిక పురోగతిని అభిలషించితేరాజసిక గునపోషకులు భౌతిక వస్తువిషయ సంపద కొరకు అత్యంత ఆసక్తిని  కనబరచుతారు. ఈ భూమిపై నీవు కోరుకోనేదేదయినా తాత్కాలికమైనదే!  మరియు ఇహపరమగు ఆ వాసనలు అనుభవాలు ఆస్తులు అన్నీ  ఇక్కడ ఎదో ఒకరోజు వదిలి వేయవలసినదేనని అని అర్థంచేసుకోరు. మితిమీరిన రాగముతో ఉద్వేగపూరితులై  పవిత్రత అన్న పదమును దరిజేరనీయరు. అందుకేవారికి అందిన దానితో తృప్తి చెందకఇంకా కావాలనే దురాశతో ఉంటారు. ఇతరులు తమకన్నా ఎక్కువ సాధిస్తూఎక్కువ సంపాదిస్తూఎక్కువ భోగిస్తూ ఉంటే వారు ఈర్ష్యతో హింసాప్రవృత్తులైసాటి మనిషి అన్న జాలినివీడిప్రాణము తీయుటకు కూడా వెనుకాడరు. క్షణికమగు  కోరికలు తీరినప్పుడు అతి సంతోష పడతారుఅవి తీరకపోతే నిరాశ చెందుతారు. ఈ విధంగావారి జీవితములకు నిశాలత ఉండదు. ఎప్పుడూ డోలాయమానమే. ఆకారణముచే ఆరోగ్యము చెడుతుందిఅనర్థము జరుగుతుంది. నీవు నాటుకొన్న విషయ వాంఛా బీజములు విష బీజములై వయసు ఉడిగేకొద్దీ ప్రకోపించి నిన్ను నిర్వీర్యుని చేస్తాయి. సంతృప్తి సంతోషములు స్వర్గసమములు. క్రింద కనబరచిన ఆ అద్వితీయమైన ఆలోచనను ఒకసారి చదువు:
సత్వము సత్యమార్గమును సాధన చేసిన పొందజేయు నా
తత్వము నీవెరింగి రజ తామస రీతుల వీడనాడి యం
ధత్వము నుండి బైట పడి ధర్మము తప్పక సంచరించుచో
సత్వర మీవు చేరనగు సంతత రీతిని చక్రి పాదముల్
ఇక అసలు విషయానికి వస్తాము . నీ సమస్యకు పరమాత్మ ఏమి సలహా చెబుతున్నాడో చూస్తాము.
ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే 
తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావ మివాంభసి     67-2

బాహ్యేంద్రియముల వశ వర్తినియౌ
 
మది  పెనుగాలిగ  మారుచు బుద్ధిని
నడిసంద్రములో నావజేయుచును 
తీసుకపోవును తెలియని దారుల                      67 - 2

తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః
               68 - 2 
ఇంద్ర్యాణీంద్రియార్థేభ్య స్తస్యప్రజ్ఞా ప్రతిష్ఠితా

అందుకేనయా అర్జున! తెలియుము
నీ బాహ్యేంద్రియ నిగ్రహమ్ముతో
బాహ్య విషయముల పరికించనిచో 
నీ వివేకమును నిలువరించెదవు                             68 -2

నీ బాహ్యేంద్రియములు కోరినవి నీమనసుకు చేరవేస్తున్నాయి. నీ మనసు బుద్ధిని కోరిక తీర్చుకొనుటకు వుశిగొల్పుతూవుంది.
మరి నీ బుద్ధికి కళ్ళెం వేస్తే అది మనసుకుమనసు ఇంద్రియాలకు వేయగలుగుతుంది. పరమాత్మునిచే చెప్పబడిన ఈ ఉపమానమును గమనించు. భగవానుడు చెప్పిన నావ నీవు.సముద్రము నీ చుట్టూవుందే ప్రపంచము. గాలులే నీ కోరికలు.నావను నియంత్రించే సరంగు నీ వివేకము. ఇక ఆ నావికుని దిక్సూచియే వేదశాస్త్రాలు. చేరవలసిన తీరమే ప్రశాంతి. అక్కడ ఏ చీకూ చింతాలేదు . రాగం ద్వేషం లేదు. ఈర్ష్యాసూయలు లేవు. అంతా ప్రశాంతము. ఎటువంటిపోలికో చూడండి. ఇటువంటి పోలిక ఇచ్చుట వ్యాసులవారికే చెల్లుతుంది. చెప్పుటకు భగవంతునికే ఒప్పుతుంది. ఆయన ఈయన ద్వారా చెప్పినాడా లేక ఈయన చెప్పినది ఆయన మనకు తెలియబరచినాడా అన్నది మనకు అప్రస్తుతము. ఆమాట మనకు శిలాశాసనము. కాబట్టి శ్రీకృష్ణుడు ఏమయితే అర్జనునికి చెప్పినాడో నీవు నేను చేయవలసినది కూడా అదే! కాబట్టి నీ బాహఎంద్రియముల నిగ్రహించు. అప్పుడు నీవు బాహ్య విషయముల జోలికి పోవు. అప్పుడు నీ మనసుకు తటస్థత పోయి నిశ్చలత సమకూరుతుంది. మనసు నిశ్చలమైతే  బుద్ధిబుద్ధిగా కుదుతబడుతుంది. అర్థమైనదికదా మరి ఆచరణలో పెట్టు.
మనోబల ప్రాప్తిరస్తు.


******************************************************
సమస్య మనది  సలహా గీతది   23

సమస్య: ఏపనీ చేయకుండా ఏదో విధంగా జీవితము గడచిపోవాలని నా కోరిక . అది సాధ్యమౌతుందా?

సలహా: పనీ పాట లేకుండాజీవితము గడచిపోవలెనన్న మాటతోనే, నీకు కష్టమనిపించే అడ్డంకులు ఏవీ లేకుండా 
‘చిన్ని నా బొజ్జకు శ్రీరామ రక్ష’ అన్నట్లు జరిగిపోవలెనన్నది నీ అత్యాశ. నీ ప్రశ్న వింటూవుంటే నాకొక కథ గుర్తుకు వస్తూవుంది.

గ్రీష్మఋతువు రోహిణీ కార్తె లోనిఎర్రటి ఎండలో చెట్టు చేమ కనిపించని బీడుమార్గములోనురగలుకక్కుకుంటూ పరుగెత్తలేక పరుగెత్తుతున్న గుర్రముపైనెక్కి అమితమైన దాహముతో వస్తూ వున్నాడు.
అమితముగా అలసిపోయిన అతనికి అనుకోకుండా అక్కడ ఒక అల్లనేరెడు చెట్టు  అగుపించింది. చెట్టు నీడకు చేరి అశ్వమును అవరోహించి అటు ప్రక్కగా చెట్టు నీడలో,ఒకచేతివ్రేళ్ళ సందులలో మరియొక చేతి వ్రేళ్ళను దూర్చి  తలక్రింద ఆ కలగలిసిన చేతులను చేర్చి  వెల్లకిలా ఆకాశము వంక జూస్తూ పడుకున్న ఒక బవిరి గడ్డము  సాహెబుగారిని గమనించినాడారౌతు.  తదేకముగా అతనిని చూడటముతో రౌతుకు సాహేబుగారి గడ్డముపైకలమాగిన అల్లనేరెడు పండు పడియుండుటను గమనించినాడు. కాసేపు అలాగే చూసిన పిదప తన ఉత్సుకతను ఆపుకోలేక సాహెబుగారినిఆపండు నోటిలోఎందుకు వేసుకోలేదోఅడిగినాడు. దానికతను “నేను, నీలాగా ఎవరో ఒకరు రాకపోతారా నేనడిగితే నోట్లో వెయ్యకపోతారా” అనివేచియున్నా నన్నాడు. వళ్ళుమండిన రౌతు తన నడుముకు వ్రేలాడుతున్న ఒర నుండి వ్రేలాడుతున్న కత్తిని తీసి సాహెబుగారి గొంతుమీద  పెట్టి“పండునోట్లో వేసుకొంటావా లేదా “ అని ఒక్క సారి హూంకరించిన వెంటనే నోట్లో వేసుకొన్నాడు. కాబట్టి ఏతావాతా నేను చెప్పవచ్చిందేమిటంటే కర్మ నుండి నీవు తప్పించుకొనలేవు.

అసలు కర్మ చేయకుండానే ఉండగలుగుట మనిషికి సాధ్యమే కాదు. నీవు దగ్గడము ,తుమ్మడము,  తినడము, త్రాగడము, నిదురించడము ఇవన్నీ కర్మలే. కాకపోతే నీవు చేయదలచు కొంటున్నావు కాబట్టి చేస్తూ వున్నావు. నీ కన్నా బిడ్డ చిన్న బిడ్డగా వున్నపుడు ముక్కున చీమిడి వస్తే  తీయకుండా అట్లే వుంచినావా! తీయడము నీ బాధ్యత, తీసివుంటావు.ఒకసారి ఒక మంచుగడ్డ రాతిగుండుతోఅనిందట
“ మనమిరువురమూ గట్టిపిండాలమే గానీ నాలోవున్న గొప్పదనము నీలో లేదు. వెలుగు నాపై బడితే తళతళ మెరుస్తాను నేను. నీవు అలా కాదు. నాలో సౌకుమార్యము ఎక్కువ. ఎండలోనిలుస్తే చెమటలు విపరీతంగా పట్టేస్తాయ్తి. ఏ మంచుకొండ లోనో, శీతకరండము (Rrefrigerator ) లోనో నా జీవితము గడిచి పోతుంది. అప్పుడు రాతిగుండు ఈ విధంగా అనింది."నీ వుండే చోటనే కలకాలమూ వుండిపోలేవు. నీవు వున్న చోటునుండి బయట పడకనూ తప్పదు ఏవిధముగానయినా ఆవిరి కాకనూ తప్పదు ఆపై వానగా మారి ఏ మురికి గుంటలోనన్నా పడవచ్చు మహా సముద్రమునైనాచేరవచ్చు. ఏది ఎట్లయినా నీవు నీవుగా వుండలేవు. నిరంతరము జనన మరణ చక్రపు పరిధి పై బిందువై తిరుగుతూ వుండవలసినదే. కానీ నేను నా అకారమును తగ్గించుకొంటూ సూక్ష్మరూపమైన ఇసుకరేణువునై శర్వేశ్వరునితో పోల్పబడే సాగరతోనే వుండిపోతాను.నాకు నియమింపబడిన కర్మ నేను చేయకుండా వుండిపోను.జీవికి పరమాత్మ సంగమమే పరమావధి. మరి నాపరిస్థితి ఎప్పటికీ అంతేనా అన్నది మంచు. లేదు అంటూ రాయి ఈ విధంగా చెప్పింది." ఒక్కసారి నీవు వానరూపములో ఒక చెట్టును చేరినావనుకో అంతే ఏదో ఒకరోజు నీవు ఏ విత్తనము రూపములోనో సాగరము చేరిపోతావు. ఇక ఆప్రాంతమే నీ నివాసము. కాబట్టి కర్మల
 చేయకనూ తప్పదు పరమాత్ముని చేరుటకు అవి సత్కర్మలై యుండకనూ తప్పదు.
అసలు అచ్యుతుడౌ కృష్ణ భగవానుడీ విషయములో ఏమంటున్నాడో చూస్తాము.     
  నహి కశ్చిత్ క్షణమపి  జాతు తిష్టత్య కర్మ కృత .
  కార్యతే హ్యనశః కర్మ సర్వః ప్రకృతి జైర్గుణైః            5--3
                                                                               
కర్మలటక నెక్కించి కనులు మూసి కూర్చొనడం
కానేరదు కడు సులభం కాదది హస్తామలకం 
ప్రకృతి తనదు త్రిగుణాలను ప్రసరించుచు నీమీదికి
కర్మకారకుని జేయును కాసింతయు వ్యవధినీక         5--3


అనగా ఎ మనిషైనా ఎ కాలంలో నైనా క్షణం కూడా కర్మను ఆచరించకుండా వుండలేడు .దీనిలో ఎలాంటి సందేహం లేదు . ఎందుకంటేమనుష్యులంతా ప్రకృతికి చెందిన త్రిగుణాలకి లోబడి కర్మలని చేయవలసిందే .

మరి కర్మ అంటే అసలేమిటి ?

క్రియతే ఆనేన ఇతి కర్మ ---చేయబడేది ఏదైనా కర్మయే . కర్మ అనగా మానసికంగా గాని శారీరికంగా గాని చేయబడేది .. పూర్తి అయిన పనిని కర్మ అని, ఇంకా జరుగుతున్న పనికి క్రియ అని అన్నారు .అనగా కర్మ తాలూకు భీజం క్రియ లోనే వుంటుంది . కర్మ మంచి కావచ్చు చెడు కావచ్చు .లేదా మంచి చెడుల మిశ్రమం కావచ్చు .

నిర్మల‌మైన‌దియుప్రకాశింప‌జేయున‌దియుఏ దోష‌ములేనిదియు న‌గు స‌త్వగుణ‌ము . తృష్ణచేత‌నుఆస‌క్తిచేత‌నుపుట్టి మానవులను ఐహికర్మలపై అనురాగమును కలిగించునది ర‌జోగుణ‌ము . జ్ఞాన‌మునావ‌రించి ప్రమాద‌మునుక‌ర్తవ్య మూఢ‌త‌యందాస‌క్తిని క‌లుగ‌జేయునది త‌మోగుణ‌ము. ఈ త్రిగుణముల పౌనఃపున్యములే మానవులను వివిధ సత్కర్మల లేక దుష్కర్మలయన్ దనురక్తుల ఝేయుచున్నది.
               
  నీతు భోగాద్రుతే  పుణ్యం కిమ్చిద్వా కర్మ మానవం 
  పావకం నా పునాత్యాషు క్షయో భోగా త్ప్రజాయతే 
                                                               --కర్మ విపాక సంహిత
అనగా సుఖ దుఃఖ  రూపాలైన కర్మలని అంటే పాప పుణ్యాలని అనుభవించక మానవుడు వాటి నుండి విముక్తుడు కాలేడు   అంటే పరమాత్మను శాశ్వతముగా అందుకోలేడు.

కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ |
ఇంద్రియార్థాన్ విమూఢాత్మా విథ్యాచారఃస ఉచ్యతే     6--3

వాగ్వపుషమ్ముల వనరుగ వంచుచు
మునివేషములో మురియగ తలవకు
మనసునుకోర్కెల మబ్బులు ముసిరిన
కపటవేషమే కనబడు మరువకు                               6--3


బాహ్యేంద్రియ నిగ్రహాన్ని "దమము"అంటాము. అంతరేంద్రియమయిన   మనోనియంత్రణను "శమము" అంటాము. "దమము" వుండి శమము   లేకపోతే  కోరికలు మనస్సులో అంతర్ముఖంగా విజృంభిస్తూనే వుంటాయి; అలాంటి మానవుడు తన అలవాట్లకు బానిసౌతాడు అంటే దుష్కర్మల బానిసైపోతాడు.
అట్లని భాహిరముగా ఇంద్రియ నిగ్రహత చూపుతూ ఆంతర్యములో అన్నీ అనుభవించవలెనను కపటి కలకాలమూ గౌరవము పొందలేడు. జీవితంలో సహజంగా బ్రతకాలి.

"దమము
"తో ప్రారంభమయి,"శమము"నకు చేరుకోవాలి. కాబట్టి మనసును మంచి కర్మలపైకి మరలిచు.అప్పుడు బుద్ధి నీ కర్మలకు అనుగుణముగా వుంటుంది. ఎందుకంటే 'బుద్ధిః కర్మానుసారిణీ అన్నారు కదా! 
ఏపనీ చేయకుండా ఏదో విధంగా జీవితము గడచిపోవాలని ఎప్పటికీ కోరుకోవద్దు. సత్కర్మలనాచరించు. సత్వమునాశ్రయిచు. సత్సమాజమును స్థాపించు.

శుభం భూయాత్

******************************************************
సమస్య మనది  సలహా గీతది   24

సమస్య : నా జీవితము వూరకున్నా జరిగిపోతుంది. పురుగులు తొలిస్తే ఏదో ఒక పని చేస్తాను లేకుంటే వూరకనే 

వుంటాను. చేసే పనులలోకూడా ఆలోచన తక్కువ ఆవేశము ఎక్కువ. అంతా నా కర్మ, నాతలరాత.

సలహా :మొదట నీప్రశ్న లోనే తప్పువుంది. అదేమిటంటే కర్మ, తలరాత అన్నవి క్రైస్తవ ఇస్లాం మతములలో అవి 

ఒకటిగా పరిగణింపవచ్చు గానీ మన వైదిక ధర్మములో అవి వేరు వేరు. పై రెండు ధర్మములలోనూ  దేవుడు జీవి 

చేసే మంచి చెడ్డలను ముందే నుదుట వ్రాసి పంపుతాడని నమ్ముతారు  మన ధర్మము ఆ విధముగా చెప్పదు. 

మనిషి ఆధీనంలో కర్మ మరియు భగవంతుని ఆధీనంలో కర్మఫలం ఉంటాయి. ఈ వ్యత్యాసం ఎరుగక మనలో కూడా కొందరు కర్మని విధి నిర్ణయం (fate) గా పొరబడతారు.

మానవుడు చిత్త చాంచల్యముతో కానీ చిత్త స్థైర్యముతో కానీ తాను చెడ్డ మంచి కర్మలను ఆచరించుతాడు. కాబట్టి కర్మ  మనచేత నుంటుంది కానీ కర్మఫలము పైవాని చేతిలో వుంటుంది.  తలరాత అంటూ తల పట్టుకొని కూర్చుంటే పనులౌతాయా. గాలిలో దీపము పెట్టి దేవుడా నీవే దిక్కంటే అవుతుందా ! దేవుడే 'పనిచేయి ఫలితము నాకొదిలిపెట్టు అన్నాడు. కాబట్టి ఆలోచన వుండవలసిందే అచరణా వుండవలసిందేఅప్పుడే అనుగ్రహము దేవునిది వుంటుంది.
జీవితము నాటకము భూతలము నాటక రంగము మనము పాత్ర ధారులము పైవాడు సూత్ర ధారి అన్నది అందరకూ తెలిసినవిషయమే. మరి నీ పాత్రకు నీవే కర్తవు కదా !కర్తవు నీవైతే కార్యము నీ కొరకు సిద్ధముగా వున్నట్లేకదా ! కార్యము సిద్ధముగా వుంటే నీ క్రియ మొదలు కావలసినదే! క్రియ ముగుసినది అంటే ఆ కర్మ ముగిసినట్లే ! తిరిగీ వేరొకటి మొదలు.నీ కర్మకు ఫలితము పాపము పుణ్యము. కట్టె కాలిన తరువాత నీ వెంట నడిచేది ఈ కర్మ ఫలితాలే అంటే పాపపుణ్యాలే. ఈ విషయాన్నే పెద్దలు ఈ విధంగా అన్నారు

ధనాని భౌమౌ పశవశ్చ గోష్టే
నారీ గృహద్వారె జనః స్మశానే
దేహాశ్చితాయా పరలోక మార్గే
కర్మానుగోగచ్చతి ఏకమాత్రాః
నీధనము దార దాయలు  దేహము అన్నింటికీ తాము నీతో సహగమించుటకు కట్టుబాట్లున్నాయి కానీ నీ కర్మము మాత్రము నీతోబాటే వుంటుంది. అందుకే ఆచరించేవి సత్కర్మలైతే తనువు బాసిన తరువాతకూడా నీకు బాసటగా నిలిచి మేలు చేస్తాయి. ఇక పరమాత్మ ఈ విషయములో ఎమంటున్నాడో చూస్తాము.

నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యరకర్మణః !
 
శరీరయాత్రాపాపి చ తే న ప్రసిద్ధ్యేదకర్మణః !  8 - 3 

చేయవలసినది చేయ మానకుము
చేర్చు కర్మమే జీవన గమ్యము
నిష్క్రియత్వమును నిజముగ జేర్చదు
నీదు వపుషమిది నిక్కము నమ్ముము  8 - 3
నీకు విధించిన కర్మలు నీవు చేయక తప్పదు. అకర్మ కన్నా సకర్మ సర్వస్రేష్ఠము. అసలు నిష్కర్ముడవైతే నీ శరీరమునే 

కాపాడుకోలేవు. విస్త్రుతముగా దిన కర్మలను మూడు . అవి 1. నిత్యకర్మ 2. నైమిత్తిక కర్మ 3.కామ్య కర్మ. వాతిని గూర్చి ఒక్క 

మాట మాట్లాడుకొందాము.

      నిత్యం   :   ప్రతిరోజూ చెయ్యాల్సినవి 
      నైమిత్తికం :      ఒక కారణము కొరకు చేసేవి

      కామ్యం :   ఫలితాన్ని ఆశించి చేసేవి

1996 Atlanta Olympics లో 18 సంవత్సరాల Kerri Allyson Strug అన్న అమెరికా అమ్మాయి Pole Vault లో తన కాలు విరిగినాఆ క్రీడలో నిపుణులైన రష్యా దేశస్థులను అధిగమించి, గెలిచింది. అది కాదు గొప్ప అసలు ఆమె గొప్పదనము ఏమిటంటే ఆ క్రీడ మొదటి round లోనే  ఆమె కాలి  ముణుకు దగ్గర బెణికింది. దానిని ఆమెCoach Béla Károlyi గుర్తించడము జరిగింది.ఇంక ఒక్క round లో పాల్గొంటే ఆమె గెలుస్తుంది. అప్పుడు Károlyi ఆమె "చెంతకుపోయి నీ బాధ నేను గుర్తించినాను. ఈ రాబోయే round లో పాల్గొనేది నీవు కాదు నీ దేశము అన్న ఒక్కమాట గుర్తు పెట్టుకొని పాల్గొను"మన్నాడు. అంతే ఆ ఒక్క మాట లోని స్పూర్తితో ఆమె విజయాన్ని సాధించి కుప్ప కూలిపోయింది. Károlyi ఆమెను medals podium వద్దకు మోసుకుపోయినాడు. తరువాత అంతా సుఖాంతమే.White House కు ఆహ్వానింపబడిన ఆమెనుఅప్పటి President Bill Clinton ఎంతగానో ప్రశంసించినాడు.
ఈ ఉదంతమును  పై మూడు కర్మలకు ఉదాహరణ గా తీసుకొందాము.
ఆమె ప్రతిరోజూ ఆ క్రీడలో ప్రావీణ్యత కొరకు పరిశ్రమించుట నిత్యకర్మ. తన పరిశ్రమను ఇంకా  ఏ అంతస్తువరకు పెంచవలెన్న ఆలోచనతో లేక క్రీడా స్పూర్తి కొరకో చిన్నచిన్న  క్రీడా స్పర్దలలో (ఆటల పోటీలు ) పాల్గొనడము నైమిత్తికము. Olympics లో పాల్గొనుట కామ్య కర్మము మరియు కాంచన పథకము సాధించుట కామితము.
ఇప్పుడు ఆమె కర్మాచరణను  ఒకాసారి తలపుకు తెచ్చుకో. వడలు గగుర్పొడిచితే కర్మచేయుటకు వలయు చిత్తశుద్ధికి నీవు స్పందించినట్లే. 
పైమూడూ ఈ జన్మలో నీవు ఆచరించే కర్మలు. ఇవి కాకుండా నీ జీవి ఆచరించే కర్మలు మూడున్నాయి. అవి జీవిని జన్మ జన్మలకూ వెంటాడుతూనేవుంటాయి. అవి :సంచితం (భూతకాలానికి సంబంధించినది), ప్రారబ్ధం
 (వర్తమానానికి సంబంధించినది) ఆగామి (భవిష్యత్తునకు సంబంధించినది.)  ఈ మూడింటిని త్రివిధ కర్మలు అంటారు.


అబద్ధం, కపటం, చౌర్యం, హింస,మోసం, వ్యభిచారం మొదలైనవన్నీ సామాజిక జీవనాన్ని కలుషితం చేసేవి దుష్కర్మలు.  అందుకే వేత్తలు వీటిని వదిలి జీవించుటను ఉత్తమ జీవనగతిగా పేర్కొంటారు. పునర్జన్మల పై నమ్మకం, స్వర్గప్రాప్తి, నరకభీతి లాంటివి కూడా ఈకర్మవాదం కిందకి వస్తాయి. ఈ స్పృహ నీకు కలిగితే కర్మలు మాని కాళ్ళు ముడుచుకొని కళ్ళు మూసుకొని కూర్చోవు. త్రివిధ కరమలను సత్సంకల్పముతో ఆచరించి శ్రేష్ఠునివనిపించుకొంటావు.



శుభం భూయత్ 

************************************************

సమస్య మనది
  సలహా గీతది   25.

సమస్య : 
 దేవతలు వారికి ప్రీతి గలిగించుటకు యజ్ఞ యాగాలు అర్థవంతముగా నాకగుపించవు మనకు అందుబాటులో వున్నది మన మనుభవించుటలో తప్పేమున్నది దేవతలు మనకగుపించుట లేదు కదా ?

సలహా : చర్మ చక్షువులకిది అక్షరాలా నిజము. ఒక సారి పంచ భూతములను గుర్తు చేసుకో ! భూమికి శబ్దస్పర్శరూపరసగంధములైదూ ఉంటాయి . మరి రెండవదైన నీటి విషయములోనో  శబ్దస్పర్శరూపరసములు మాత్రమే ఉంటాయి . ఇక వెలుగు విషయములొ  శబ్దస్పర్శరూపములే వుంటాయి .వాయువుకంటేనో శబ్దస్పర్శలు మాత్రమే. ఇక మిగిలిపోయింది ఆకాశము ( Ether ). ఆది కేవలము శబ్దాత్మకము.దేవతలకు పంచభూతములకు ఏమిటి సంబంధము అని తలచుతున్నావేమో చెబుతాను విను. పైన తెలిపిన ఈ ఐదు  గుణాలను భూతములలో గమనించితే భూమికి ఐదు గుణాలూ వుంటే నీటికి నాలుగే తరువాత మూడే. ఆపై రెండూఒకటి . మరి గుణాలు తగ్గుతూ వస్తూవున్నా భూతాలు ఐదు అని నమ్ముతున్నావు. ఎందుకంటే ఈ విషయాన్ని ఆధునిక శాస్త్రాలు కూడా ఒప్పుకొన్నాయి కాబట్టి. ఇపుడు ఆకాశము విషయానికి వస్తాము. ఆకాశము అనంతము. దానికి పెరుగుదల కానీ తరుగుదల కానీ లేదు. అర్థము చేసుకొంటే అది శూన్యమే. ఈ విషయము అవగాహనకు వస్తే ఈ పంచ భూతానుభూతులు మాయమయిఅసలు వీటికి కర్త ఎవరు అన్న ఆలోచన వస్తుంది. వస్తువుంటే కర్త వుండవలసినదేకదా ! ఆ కర్తను మనము పరమాత్మ అన్నాము.
కార్యాలయమును మనసునందు ఊహించుకో! దాని ప్రధానాధికారియొకడే కానీ అతనిక్రింద ఇద్దరు వారిక్రింద నలుగురూ ఈ విధముగా పోతూనే వుంటుంది. ఆ కార్యాలయములో మనకు పనిబడినపుడు క్రిందినుండి మన సాధన మొదలుపెట్టి ఏ అంతస్తు అధికారివద్ద మనపని జరిగిపోతే అక్కడితో మనపని ముగుస్తుంది. లేకుంటే సాధనను పెంచి అత్యున్నత అధికారి వరకు పోతాము. దీనిలొ అత్యున్నత అధికారి పరమాత్మ ఐతే మిగిలిన అధికారులే దేవతలు. దీనిని విధుల కేటాయింపు (Allocation of Duties) అనవచ్చు.
గౌరవనీయుల వద్దకు పోయినపుడు పత్రం పుష్పం ... పట్టుక పోవడము మన పెద్దల కట్టుబాటు. అది పెద్దలయందు గౌరవము విధేయతకు చిహ్నముమనము వారియందు మన కోర్కెలనీడేర్చే భగవంతుని చూస్తాము కాబట్టి. ఇది లంచము కానేరదు. పరమాత్మనే ఈ మాట చెప్పినాడు.

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి
తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మన:             (భగవద్గీత 9 - 26)
ఫలమో పుష్పమొ పత్రము జలమో
ఆత్మ శుద్ధితో అమిత శ్రద్ధతో
 పరమ ప్రీతితో భక్తుడొసంగిన
అందుకొందునతి ఆదరమ్ముతో                                  (భగవద్గీత 9 - 26)               
సుదాముడు (కుచేలుడు ) కృష్ణుని స్నేహితునిగానే ఎంచి చూడబోయినాడని మనకు తెలిసినదే అయినా తనకు గలిగిన అటుకులను తీసుకుపోయినాడు. ఈ పద్ధతి గౌరవముప్రేమఅభిమానముభక్తిస్నేహము మొదలగువానికి నిదర్శనము.

దళమైన బుష్పమైనను, 
ఫలమైనను సలిలమైన బాయని భక్తిం
గొలిచిన జను లర్పించిన, 
నెలమిన్ రుచిరాన్నముగనె యేను భుజింతున్. (పొతన భాగవతం-దశమ స్కందము-కుచేలోపాఖ్యానము)

అంటే దేవతలను కూడా భక్తి ప్రేమ భావములటొ వారికి ఫలము నొసగవలెనని తెలియుచున్నది కదా ! ఆ ఫలము నొసగితేఅంటే ఇక్కడ వారి  హవిస్సులు అని అర్థముఎందుకంటే హవిస్సులే యజ్ఞ ఫలములువాని వాహకుడే అగ్ని. ఆయనే దేవతలకు మానవులకు సంధానకర్త. వారు తృప్తులయి మన కోర్కెల నీడేరుస్తారు. కరువు కాటకములళో యజ్ఞములుచేసి వర్షమును కురిపింపజేయుట మనము గమనించే విషయమే కదా! కాబట్టి దేవుడొకడైనా దేవతలు మెండు. చదువు (Education) సరస్వతి ,సంపద (Wealth) లక్ష్మి శౌర్యము (Velour) శక్తి. ఇంద్రుడు సౌభాగ్యము నకు బ్రహ్మ విష్ణు మహేశులు సృష్టిస్థితిలయములకు ఈ విధముగా దేవతలకు వారి వారి విధులు ఏర్పరుపబడినాయి. మనపని ఎవరివల్ల లేక ఎవరి ద్వారా జరుగుతుందో వారిని 
మనము కొలుస్తాము. అందరినీ అంటె యజ్ఞము చే తృప్తుల జేయవచ్చు.

ఇక భగవానుడేమంటున్నాడో విను.
దేవాన్ భావయతా నేన తే దేవా భావయంతు వః
 పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ             11 - 3


ఇచ్చి పుచ్చుకోవడాలు ఇహపరముల సాధనాలు
దైవ ప్రీతి జేయ నరులు దయ వారిది పొందగలరు
నిస్వార్థపు భావనయే నిజము నరుల కండదండ
ఒకరికొకరుఇది గల్గిన ఒనరు నిష్టకామితములు            11--3

ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపఱచుడు. మఱియు ఆ దేవతలు మిమ్మలను అనుగ్రహింతురు. నిస్వార్థ భావముతో మీరు పరస్పరము సంతృప్తిపఱచుకోనుచు పరమశ్రేయస్సును పొందగలరు.

ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః
తైర్ధత్తానప్రదాయైభ్యో యోభుంక్తే స్తేన ఏవ సః    12 --3

హవన ప్రీతులై యఖిల దేవతలు
ఇత్తురయాచిత ఇష్ట భోగములు
ఏమి ఇవ్వకనె ఎల్లసుఖములను
పొందెడువారలు పోల్పగ చోరులు                  12 --3

యజ్ఞముల ద్వారా సంతృప్తి పొందిన దేవతలు మానవులకు ఆయాచితముగనే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు. ఈ విధముగ దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదనచేయక తానే అనుభవించు వాడు నిజముగా చోరుడగును.
దైవానుగ్రహ ప్రాప్తిరస్తు .
ఒక Super Market కు పోతే మనకు కావలసిన వస్తువులను కొంటాము. ఆ వస్తువు పై ఆ company పేరు అందు ఏ పదార్థములు వాడినారో మొదలగు వివరములు వుంటాయి. మరి కలకాలమూ మనము వాడే నేల నీరు నిప్పు మొదలగు పంచభూతములకు Expiry Date లేదు కదా! మరి ఆ వస్తువులనిచ్చిన దేవతలకు మనము కృతజ్ఞత కబరచుకోనవసరము లేదా ! అట్లు కనబరచక అవి వాడుకొనుట కృతఘ్నత మరియు చౌర్యము కాదా!
దదాతి ప్రతిఘృణ్ణాతి గుహ్యమాఖ్యాతి పృచ్ఛతి
భుంక్తేచ భోజయింత్యేవ ఇత్యేతత్ మిత్రలక్షణం
అన్నారు పెద్దలు. మరి దానిని పాటించుట మన బాధ్యత.

కాబట్టి దేవతలు వున్నారని వారి కరుణ చేతనే మనము సుఖముగా వుండ గలుగుతామనివారిని సంతృప్తిపరచ వలసిన బాధ్యత మనపై కలదని గ్రహించి సంచరించి సత్ఫలితములను పొందుము.
దైవానుగ్రహ ప్రాప్తిరస్తు .



K R Narayanachar Narayan Sir meeru chese posting chadevetappudu meelo aikyamai(mee sanidyamulone vundalanna thapana)
Kaluguthundi, samudramula lothu laga Abba yennivishayamulu dakkunnayi andukone sakthi ledu 
Anandinchadam aswadinchadam thappa, dhanyosmi

***********************************************************************************************