Tuesday 7 April 2020

సమస్య మనది సలహా గీతది 26-30



సమస్య మనది సలహా గీతది -- 26
సమస్య : అయ్యా ! కర్మ యోగమని భక్తియోగమని జ్ఞానయోగమని ఎవరికి తోచినది వారు గొప్పదని చెబుతారు. మరి నిజానికి ఏది గొప్ప? నేను దేనిని అనుసరించను , దేనిని ఆచరించను?

సలహా: యోగ శబ్దం ‘యుజ్‌ ’ అనే సంస్కృత ధాతువు నుండి పుట్టినది. దీనికి కలిసికొనుట, ఏకమగుట, సమన్వయించుట మొదలైన అర్ధములను చెప్పుకోనవచ్చును. జాతక ఫలితములలో ఈ 'యోగము' అన్న శబ్దము విరివిగా వింటూ ఉంటాము. రెండు అంతకు మించిన పదార్థములు, రెండు అంతకు మించిన మూలకములు ఈ విధముగా ఏవి కలసినా దానిని యోగము సంయోగము అంటారు. కానీ  'జీవాత్మ పరమాత్మ లో లీనము  చెందటమే యోగ పరమార్ధము.  ‘ నయమాత్మాబలహీనేన లభ్యతే ’ అని ముండకోపనిషతు చెపుతోంది. అంటె బలహీనులు ఆత్మను తెలుసుకోలేరు, పొందలేరు అని భావం కాబట్టి ఆత్మ జ్ఞానానికి శక్తిమంతమైన శరీరము , సమాహితమైన బుధ్ధి అత్య అవసర మన్నమాట. దీని వల్ల క్రమంగా శరీరరోగ్యం సమాహితమైన చిత్తం ఏర్పడి ఆత్మను పరమాత్మతో సమ్యోగం చెందింప జేసే శక్తి సాధకునికేర్పడుతుంది. ఈయోగాక్రియకు ఆద్యుడు పతంజలి.
నేడు ఆయన పెట్టిన భిక్షను అమ్ముకొంటూ శరీర సౌష్ఠవమును పెంచు యోగాక్రియలను నేర్పుతూ యోగా గురువులు, అందరి ఆదాయమూ కలిపితే, లక్షల కోట్లు సంపాదించి యుంటారు. ఒకవేళ ఆ మహానీయునికే ఆ హీనమైన ఆలోచన వచ్చియుంటే? అయినా ఆయన మహనీయుడు, అసహ్యకరములగు ఆలోచనలకు అందని దూరములో ఉంటాడు.

 యోగ విజ్ఞానాన్ని తెలుసుకోవడానికి తోడ్పడేవి ప్రధానంగా యోగానికి సంబంధించిన ఉపనిషత్తులు. వాటిలో యోగతత్వోపనిషతు, మండల బ్రాహ్మాణోపనిషతు, యోగకుండల్యోపనిషతు ప్రధానంగా పేర్కొన దగినవి. వీనికి తోడుగా పాతంజలి యోగసూత్రాలు , భగవద్గీత , యోగ వాసిష్ఠం యోగజ్ఞానానికి ప్రమాణ గ్రంధాలు. దీనినిబట్టి  యోగము అన్నది భారత దేశాంలో అత్యంత ప్రాచీన కాలం నుండి అధ్యయన అభ్యాసాలతో కూడియున్నట్లు చెప్పవచ్చును.

యోగోపనిషత్తులలో యోగం నాలుగు విధాలుగా చెప్పబడింది. అవి , హఠయోగం , లయయోగం , మంత్రయోగం , రాజయోగం. అయితే, ఇప్పుడు యోగమంటే హఠ రాజాయోగాల సమ్మేళనం గా భావింప బడుతున్నది. దీనికే ఆష్టాంగయోగమని ప్రసిధ్ధి. ఆష్టాంగ యోగమంటే ఎనమిది అంగాలతో కూడిన యోగమని అర్ధం. యమ, నియమ,ఆసన,ప్రాణాయామ,ప్రత్యాహార, ధారణ,ధ్యాన,సమాధులు అష్టాంగాలు.
ఇక    అసలు విషయానికొస్తే
నీ అదృష్టముకొద్ది మీవూరిలో ఎంతో శుచి శుభ్రతతో చాలా రుచికరముగా వుండే ఒక హోటలును ఊహించుకో ! వాస్తవములో ఇటువంటివి వుండవు అది వేరే విషయము. యోగమునకు హోటలుకు సంబంధమేమి యని అంటావేమో, విను విను నీకే అర్థమౌతుంది. మనసు మంచికి అంకితమైతే అటు హోటలువాడు మంచివాడు కావచ్చు ఇటు నీవూ మంచినికోరే ఆలోచనే చేయవచ్చు.

ఆ హోటలుకు పోతూనే Menu Card చూస్తావు. నీకు కావలసినది నిలుపు నిదానముగా చూసిఎన్నుకొంటావు,

 తింటావు, తృప్తిని పొందుతావు. ఇదీ అంతే! నీకు సులభమైన , సుఖధమైన, అవలంబించదగిన, యోగమార్గమును ఎన్నుకో! మనోనిష్ఠ తో ఎన్నుకొన్న మార్గములో ముందుకు నడు. కోరినతీరము చేరుతావు. ఎ పని చేయుటకైన 'ధృతి' అన్నది ముందు నీవు సొంతము చేసుకో! ధృతి అంటే నీవు తలచిన విషయాన్ని, లేకకోరికను కష్టాలకు కడగళ్ళకు వడగళ్ళే పడినా తావివ్వకుండా  ముందుకు నడిచేది ధృతి. ధృతి ని పొందుటకు ముందు మతిని శృతి చేయి. అప్పుడే నీ గతి సుగమమౌతుంది. యోగము ఏదయినా చేర్చేది నీవు కోరే చోటికే. ఢిల్లీకి నీవు రైలులో నైనా, బస్సులోనయినా, విమానములో నయినా పోవచ్చు. నీ అవసరము, నీ ఎన్నిక . ఇక్కడ కూడా అంతే.
ఈ విషయములో పరమాత్మ ఏమన్నాడో చూద్దాము.
కర్మణైవ హి సంసిద్ధి మాస్థితా జనకాదయః |
లోక సంగ్రహమేవాపి సంపస్యన్ కర్తుమర్హసి ||            20-- 3

కర్మము చేయుట కర్తవ్యమ్మగు
తామరాకు పై నీటి బొట్టులా
జ్ఞానివయ్యును జనహితమునకై
జనకాదులవలె జరుపుము కర్మల                           20-- 3

అసలు జనక, అశ్వపతి ఇరువురూ మహారాజులే కానీ వారిదికేవలము నిష్కామకర్మ. ఇక్కడ జనకుని గూర్చి కొంతకు కొంతన్నా చాలామందికి ఋషితుల్యుడని తెలిసి వుంటుంది. అశ్వపతి మహారాజును గూర్చి రెండు మాటలు చెబుతాను. ఆయన కేకయ వంశము రాజు. జనకునివలెనే నిష్కామ యోగి.ఆయన ఎంత గొప్ప రాజో అంత ఆత్మజ్ఞాని. ఉద్దాలక అరుణి వంటి మహాఋషులు తమ ధర్మ సందేహములను ఆయన వద్ద తీర్చుకోనేవారు. అంటే సన్యసించిన మహాఋషుల కన్నా, ఆయన కర్మల నాచారించేవాడయినా మిన్న. ఆయన వారికి  'వైశ్వానరఆత్మ' ( అంటే విశ్వ వ్యాప్తమైన ఈ ఆత్మను)ను గూర్చి విపులముగా విశదముగా తెలియబరచి వారి సందేహములను తీర్చి పంపుతాడు.అంటే ఈ ప్రతిఫలాపేక్ష లేని కర్మల నాచారించేవారికి అంత గోప్పదనముంది.
ఆది శంకరులు, విజయనగర స్థాపకులు విద్యారణ్యులు ఈ యుగము వారేకదా! వారు జ్ఞాన సిద్ధి పొందియు కాలానుగుణముగా లోకహితార్థమై, తాము కర్మలనాచరించి భగవదైక్యమును పొందినారు. అసలు శంకర భగవత్పాదులను సాక్షాత్తు శంకరుని అవతారమేయని అన్నారు. కాబట్టి మన బాధ్యతలు తదనుగుణమౌ కర్మలు తప్పక ఆచరించి తీరవలసినదే! మరి బాధ్యత మనదైనపుడు విస్మరించుట తప్పు కదా!
నేను జ్ఞానిని అని కార్యాలయములో ఏపని చేయకుండా కూర్చుంటే అసలు నీవు జ్ఞానివి అనికూడా ఎవరూ తలంచరు. మరి తలచకుంటే నీకు తలవంపే. కాబట్టి పరమార్థ జ్ఞానమును పొందికూడా పనులు చేయుట ఆపవద్దు. ఉద్యోగ విషయమైతే పెద్దలకు అంటే పై అధికారులకు వినయముతో తెలియబరచుటలో తప్పులేదు. శంకరాదులు దివ్యకార్యోపనియామకులై (DIVINE DEPUTATION ) వచ్చినవారు. జనకాదులు ధార్మికులై, జిజ్ఞాసువులై ముముక్షువులై, జ్ఞానులై, జ్ఞానదాతలై లోకాన తమపేరు చిరస్తాయిగా నిలుపుకొన్నారు.మరి మనమైనా అంతే కదా ! మన కార్యాలయమునుండి మనము బదిలీ అయిన తరువాత కూడా మన జ్ఞానము మన కర్మలలో ప్రతిఫలిస్తూనే వుంటుంది . నీ కర్మ బలమును బట్టే నీ కర్మ ఫలము. సత్కర్మ ఫలము గంగాజల సాదృశము. అది ఒక Pఫ.D డిగ్రీ లాంటిది. నీ కర్మకు ఫలితముగా నీకు డాక్టరేటు రానే వచ్చినది. కానీ నీకష్టార్జితమైన నీ Research Work ఎందఱో జిజ్ఞాసువులకు కరదీపికయై, వారి గమనమునకు తగిన గమ్యము చూపుతుంది.
నీ మనసు పాలవంటిదయితే నీలో ఉన్న పవిత్రతయే అందుదాగియున్న వెన్న. కాబట్టి పాలలో ఉప్పు పడకుండా చూసుకో!

సత్కర్మ ఫల సిద్ధిరస్తు.
*******************************************
సమస్య మనది సలహా గీతది -- 27 

ఒక శ్రేష్ఠుని ఆదర్శముగాగొని మన జీవితమునకు 
సార్థకత కలిగించుకొనవచ్చునా ?

ఆహా ! నేను ఎంత క్లుప్తముగా ప్రశ్న అడిగినాననుకొంటున్నావు కదూ! దీనికి జవాబు మాత్రము అంత సులభమైనది కాదు.
నా చేతనైన మేరకు నీకు చెప్ప ప్రయత్నించుతాను.
బాల్యములో నున్న పిల్లలకు తండ్రి ఆదర్శము. తండ్రి చేసే పనులను తాము కూడా చేయవలెనని అనుకొంటారు పిల్లలు. లేతవయసులో పిల్లలు చూచుట కంటే గమనించట ఎక్కువగా వుంటుంది. కాబట్టి ఇంటిలోని పెద్దలు, అంటే అమ్మ నాన్న ముఖ్యముగా తాము పిల్లల ముందు ఏమి చేస్తున్నామన్నది గుర్తు చేసుకొని చేయుట మంచిది. ప్రతి విషయానికీ బొమ్మ బొరుసు వుంటుంది. అదేవిధంగా పిల్లలు కూడా తండ్రిచేసే చెడుగును (ఒకవేళ ఏదయినా వుంటే ) గ్రహించ వచ్చు, లేదంటే ఆపని చేయకూడదని కూడా నిర్ధారించుకోవచ్చు. ఆ మనస్తత్వము పిల్లలలో రావాలంటే తల్లి  పిల్లలకు మంచి చెడుగుల నడుమ గీత గీయవలసి యుంటుంది. అది పిల్లల భవితకు మిక్కిలి శ్రేయస్కరము.
జీజాబాయి తన కుమారుడైన శివాజీకి రామాయణ భారత భాగవతాలను గూర్చి బాల్యములో చెప్పుచుండిన విషయము ఆతరువాత ఉన్నతమైన విలువలతో ఆయన మరాఠా సామ్రాజ్యమును ఏలిన విధము అందరికీ తెలిసినదే! మరి ప్రహ్లాదుడు ఎట్లు మంచివాడయినాడంటే తల్లి గర్భములోనే తానూ నేర్వవలసిన మంచి నారడులవారి ద్వారా నేర్చుకొన్నాడు. కాబట్టి తానూ తండ్రిదారిన పోలేదు. ఈ సందర్భములో నేను వ్రాసిన ఈ పద్యమునోకసారి చూడు:
పెద్దచేయుపనులు దద్దయు గమనించి
చేయుచుందురింట చిన్నవారు
బుద్ధి లేని పనుల పోరాదు పెద్దలు
రామమొహనుక్తి రమ్యసూక్తి
తల్లిదండ్రులుగా మనము మనకు తెలియకుండానే  పిల్లల మీద అందరికంటే ఎక్కువ ప్రభావం చూపిస్తాము. వాళ్లు మనల్ని ఎప్పుడూ గమనిస్తుంటారు కాబట్టి వాళ్లకు నేర్పించడానికి మన దగ్గరున్న గొప్ప సాధనం మనం చేసే పనులే!. అవి మంచివయినా చెడ్డవయినా, దగ్గరనుండి చూస్తారు కాబట్టి, అవి ఆదర్శమే. మన ఆదర్శం వాళ్లకు ఎప్పుడూ తెరిచి ఉన్న పుస్తకం లాంటిది. దానినుండి వాళ్లు ఎప్పుడూ పాఠం నేర్చుకుంటూనే ఉంటారు. అందుకే మనము ఎంతో జాగ్రత్తతో వ్యవహరించి ఉండవలసి వుంటుంది. ఇప్పుడు ఇంకొక క్రొత్త సమస్య వచ్చిపడింది, గమనించండి.
పిల్లలు అతిగోప్పగా చదివి డాక్టర్లు ఇంజనీర్లు కావలెనన్న తలంపుతో, మనకు స్తోమత లేకున్నా తప్పనిసరియని తలచి అప్పులు కుప్పలుగా చేసి కార్పోరేట్ కాలేజీలకు పంపుతున్నాము. అక్కడ పనిచేసే ఆచార్యులు యాంత్రికులు. వాళ్ళు ఉపన్యాసకులు మాత్రమే! వారు బోధించే ప్రపంచ జ్ఞానము శూన్యము. ఇక సహవిద్యార్థులు వేరు వేరు సాంప్రదాయముల నుండి, వేరు వేరు కుటుంబములనుండి, వేరువేరు అలవాట్లతో ఒకచోట, ముఖ్యముగా హాస్టళ్ళలో చేరుతారు. చాడువుపెరుతో, యౌవ్వనము సమీపిమ్పబోవు దశలో, ఎంతో జాగ్రత్తగా తల్లిదండ్రుల వెచ్చటి రెక్కల మధ్యనుండి వికసిన్చావలసినవారు, అటు దురలవాట్లకో, ఆత్మా న్యూనతా భావానికో, గురిచేస్తున్నాము. వారి కల్పనలలో రూపుదిద్దుకోవలసిన ఎన్నో ఆవిష్కరణలను మొగ్గలోనే త్రుంచి వారిని నరకమునకు పంపుచున్నాము.
విద్యావిదానపు లొసుగులను సవరించక పోగా తెలుగు వారికి పుట్టిన పిల్లలను ఆంగ్ల మాధ్యమములో చదువమని ప్రభుత్వమే బలవంతపరచుట ఎంతటి బాధాకరమగు విషయమో గమనించండి.
తల్లియన్న యెడల తలువగ దేవత
తల్లిభూమి దీటు ధరన లేదు
తల్లిభాషకన్న తలువగ సాటేది
రామమోహనుక్తి రమ్యసూక్తి
‘గూనికి తోడు దొబ్బుడు వాయువు’ అన్నది ఒక రాయలసీమ సామెత. అంటే ముందే ఆ వ్యక్తి వంగి క్రుంగి పోయినాడు అటువంటివానికి తానూ నిలత్రోక్కుకోలేని ముందునకు త్రోసే  వ్యాధి  వచ్చిందంటే  అతను భూమిపై
నిలువగలడా! అది నిజమైన గురువుల యొక్క పరిస్థితి ఒక రాష్ట్రములో. విద్య చెప్పే గురువు సారాయి కొట్లవద్ద మూకను నియంత్రించే పనిని ఒప్పగించితే, అతడు నిజమైన గురువయితే, తాగుటకు వచ్చిన తన శిష్యులను చూసి, నా శిష్యులు ఎంత ప్రయోజకులైనారని  సంతసించుతాడా!
అందుచేత ముందుగానే పిల్లలకు మంచిచెడుగులను విడమరచిచెప్పి వారిని రుజు మార్గాముపై పెట్టవలసిన బాధ్యత, తల్లిదండ్రులదే నేడు గురువు అన్నవాడు మనకు దొరకడు. మన పిల్లలో కేవలము ఒక పాఠములు చెప్పే ఉద్యోగి మాత్రమే! అట్లని మంచి గురువులే లేరా అంటే ఉన్నారు కానీ ‘ఎక్కడ’ అన్నది తల్లిదండ్రులు గుర్తించుట కష్టము. వాళ్ళ దృష్టి అంతా ఎంత ఎక్కువ డబ్బిస్తే అంత గొప్ప చదువు తమ పిల్లలకు దొరుతుందని.
నిజమైన గురువుకు నిర్వచానముగా ఒక ముఖ్యమైన కథ చెబుతాను విను. ఒక సారి ఒక స్వాములవారు తన శిష్యగణముతో ఒక వూరిలో విడిది చేసినాడట.
మహనీయులు వస్తే ఐహికమైన కోర్కెలు తీర్చుకొన దలచిన భక్తులకు కొదవేమీ ఉండదు కదా! ఒక తల్లి తన బాలుని ఎత్తుకొని స్వామీ వద్దకు వచ్చి ఈ విధముగా చెప్పింది" స్వామీ ఈ బాలుడు ఎప్పుడూ బెల్లము తినుటవల్ల నోటినుండి చిక్కటి ద్రవము కారుతూనే వుంటుంది. ఎన్ని విధములైన మందులు ఇప్పించినా తగ్గలేదు." స్వాములవారికి విషయము అర్థమైపోయినది . ఆమెను పిల్లవానితో ఒక వారము తరువాత రమ్మన్నాడు. ఆమె, చెప్పిన విధంగా రావటమూ స్వామీ ఆ బాలునితో " బెల్లము అతిగా తినుట ఆరోగ్యానికి ముప్పు. అది అవసరానికి తప్ప వ్యసనముగా వాడవద్దు అని చెప్పినాడు. పిల్లవాడు మానివేయడము, తల్లి వచ్చి స్వాములవారికి చెప్పడము స్వామి శుభమస్తు అనడము జరిగిపోయింది. ఈ మూడు పర్యాయములూ గురువు గారిని గమనించుచున్న శిష్యుడు గురువుతో ఇట్లన్నాడు" స్వామీ ఆ బాలునికి తినవద్దు అని మీరు చెప్పడానికి ఒక వారము సమయమేల తీసుకొన్నారు."  వెంటనే గురువుగారు "నాయనా ఆ బలహీనత నాలో కూడా వుండినది ఆ బాలుని మొదటిసారి నా వద్దకు తెచ్చినపుడు.నేను  ప్రయత్నించి మానుకొనుటకు ఒక వారము పడుతుంది కాబట్టి ఆ బాలుని, తల్లిని వారము తరువాత రమ్మన్నాను. నేను నా బలహీనత పై నియంత్రణ సాధించినాను కాబట్టి ఆ బాలునికి చెప్పగలిగినాను ." అనియన్నాడు. శిష్యునికి అర్థమైపోయింది. మరి నీకుగూడా అర్థమై యుంటుందని తలుస్తాను.
ఇప్పుడు అసలు భగవంతుడు ఈ విషయములో అర్జనునితో ఏమంటున్నాడో ఒకసారి చూద్దాము.
యద్యదాచరతి శ్రేష్ఠః తత్త దేవేతరో జనాఃl
స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ll      21 -- 3

శ్రేష్ఠుల బాటలు శ్రేయస్కరములు
ఆ మార్గమ్ములు  ఆదర్శమ్ములు 
ఆ ప్రమాణములె అఖిల జనావళి
అనుసరించి ఇల  నాచరించవలె             21 - 3
శ్రేష్ఠుడైన పురుషుడు ఏది ఆచరించునో ఇతరులును దానిని అనుసరింతురు. అనగా ఏ ప్రమాణమును అతడు నిలిపెనో దానిని వారు  గ్రహింతురు. ఆ శ్రేష్ఠుని గుర్తించడమే తల్లిదండ్రుల గురుతర బాధ్యత. ఆర్యులు "గతానుగతికో లోకః" అన్నారు. స్వంత బుద్ధితో ముందుకుపోయేవారు అరుదు. పైగా " పదుగురాడుమాట పాటియై ధరయిల్లు" అన్న పెద్దలమాట మనకు కొత్తది కాదు.  మన మందుకనే కదా మన మిథ్యా మహనీయులైన నాయకులబాటలో నడిచి సూక్ష్మములో మోక్షమును సంపాదించుటకు మానాభిమానములు కూడా మంటలో కలిపి మనుగడ సాగించుచున్నాము. దీనినే మన ప్రియమైన ఆంగ్లములో Mass Psychology అంటారు.

భగవంతుడు   మంచిదారిన పోయేవారిని అనుసరించమన్నాడు కానీ చెడ్డ దారి త్రోక్కమనలేదు. మన అనుభవము అందుకు విరుద్ధము. మన అనుభవమేమిటంటే 'బర్గరు కోరేవాడు బందరులడ్డు జోలికి పోడు కదా!' అన్నది. బురుదకాళ్ళు ఇంటిలో అడుగుపెట్ట పనికిరావు. మన ఆశయము ఆదర్శము అత్యంత శ్రేష్ఠులైన రమణులను గానీ, చంద్రశేఖర సంయమీంద్రులనుగానీ లేక స్తానికముగా పేరుకు డబ్బుకు ప్రాకులాడని మహనీయులు నేతెకీ వున్నారు, అట్టి వారిని ఆశ్రయించి తమ పిల్లలను అనుసరించునట్టుగా చేయవలె . నీచ నికృష్ఠ, నిర్వీర్య, నిరర్థక, నిర్లజ్జ, నిర్నిబద్ధతా యుతమైన మూకల తోకలు పట్టుకొని నాకము చేరలేము అన్నది మనము సత్వరము గ్రహిమ్పవలసిన విషయము. అందకే పరమాత్మ పవిత్రులను , పునీతులను , పురుష శ్రేష్ఠులను అనుసరించమని చెబుతున్నాడు.ఆ మార్గమే అత్యంత ఆనంద దాయకము.
సద్గురు సౌభాగ్య ప్రాప్తిరస్తు.

స్వస్తి.
*******************************************సమస్య మనది సలహా గీతది -- 28
సమస్య : అసలు నాపైవాడు పనిచేస్తున్నట్లే లేదు. అంత పనీ నా నెత్తిపై పెట్టుకొని చేస్తున్నాను. ఇది ఈ విధముగా కొనసాగవలసినదేనా ?


సలహా : నడుము వంచి పనిచేసేవాడు తలవంచక తప్పుతుందా! తలవంచి పనిచేసుకోనేవాడికి తన పైవాడు కనిపించుతాడా! ఒకవేళ తల ఎత్తి పైకి చూస్తున్నావనుకో ? మరి నీవు పని చేస్తున్నట్లేనా! ఒకవేళ నీవు చూచు సమయములో నీ పైవాడు చేయనంత మాత్రాన ఇక పని చేయనట్లేనా! ఆవిధముగా మనము ఒకరిని గూర్చి నిర్ధారించుట  తప్పు. ఎప్పుడూ నేనే చేస్తున్నాను వాడు చేయుట లేదు అన్న ఆలోచనతో జీవితమును గడుప వద్దు. నీ అర్హతను ఏమేరకు గుర్తించినారో ఆమేరకు పని నీకిచ్చినారు. నీ అర్హత నిరూపించుకొని పై పదవిని పొందు. అంతేగానీ పైవాడు చేయలేదని పరితపించవద్దు. అసలు నీ పైవానికి నీకన్నా పనులు ఎక్కువగా వుంటాయి. నిజానికి అట్లు లేకుంటే అతను ఆ స్థితికి రాడు కదా! అతడు,

నీవుచేసే పనే కాదు, మొత్తము సంస్థలో జరుగు కార్యకలాపాలన్నీ చూసుకోవాలి. ఎందఱో తమ సమస్యల తీర్చుకోనుతకో, సహకారమును పొందుటకో వారి వద్దకు వస్తూ వుంటారు. మరి వారు తమ మనసును నిర్మలముగా ఉంచుకొంటేనే ఎదుటివారికి సరియైన సమాధానము ఇచ్చుటకు వీలవుతుంది. ఆయన కర్తవ్యము విధి బాధ్యత అది. దానిని వదిలి నీపని చేస్తూ కూర్చుంటే మరి వారి పని ఎవరు చేస్తారు. త్రిమూర్తులే తమ తమ పనులను పంచుకొన్నారు. మనమెంత?
ఒక అర్థవంతమైన నవ్వుకొన గలిగిన వాస్తవాన్ని చెబుతా విను. ఒకసారి ఒక సదస్సు, సంగోష్టి (Seminar) లో నేను ఆప్త మిత్రుడు వేరు వేరు కుసీదిక లేక వార్దుషీ శాఖలనుండి (Bank Branches) వచ్చి కలిసినాము. విరామ సమయములో ఇద్దరమూ మాట్లాడుకొంటున్న సమయములో నేను ఆతనితో 'ఫలానా పని' నేను చేసినాను నీవు చేసినావా అని అడిగినాను. మైరువురి నడుమ గాఢమైన చనువు వున్నది కాబట్టి 'అదేముంది ప్రొద్దుటే శాఖా గృహమును (Branch Primisis) శుభ్రము చేసే ఆవిడ కూడా చేస్తుంది' అని అన్నాడు. అందుకు సమాధానముగా నేను ' ఆ మాట వాస్తవము,. ఒకే పనిని వేరు వేరు వ్యక్తులు వేరు వేరు విధములుగా చేస్తారు'. నీ స్థానములో ఆ పని మనిషి కూర్చుంటే ముందు నీవు బల్లపై ఉంచిన ముఖ్యమైన దస్త్రములను (Files) చీపురుతో క్రిందకు త్రోసి, 'ఏమిటో ఈయన గొప్ప పదవినైతే పొందినాడుగానీ తన బల్లను శుభ్రముగా ఉంచుకొనుట తెలియదు అని మనసులో అనుకొంటుంది'. వాని విలువ ఏమిటో, వానిని ఎందుకు బల్లపై ఉంచుకోన్నావో ఊహించలేదు కాబట్టి. ఇదారమూ నవ్వుకొని ఆ విషయమును అంతటితో ముగించినాము. ఇక్కడ నేను చెప్పా వచ్చినదేమిటంటే ఎ పని ఎవరికీ నిర్దారించాబదినదో ఆపని చేసే విధివిధానము, ప్రాముఖ్యత అతనికే తెలుస్తుంది కానీంయులకు కాదు.
అదికాక ఆయన, సంస్థ వ్యాపారాభివృద్ధికి తగిన ప్రణాలికలు రచించి ఆచరణ లో వుంచవలసియుంటుంది. మరి సంస్థ లాభాలబాటలో నడిస్తేనే కదా నీకూ తగిన గుర్తింపు,హోదాజీతము దక్కేది. అసలొక పద్యము చెబుతాను విను:

జానుదేమో బండి జాకోబు డీజలు

జోన్సు తోలె మిగుల జోరుగాను

సొత్తు తనదికాని సోకు రాయని చూడు

రామమోహనుక్తి రమ్య సూక్తి

బాధ్యత లేకుండా చేసే పనులు ఆవిధంగా వుంటాయి. రాత్రి పూట జాగరూకత తో అరిచే బాధ్యత కుక్కది, ఆ పని గాడిద చేస్తే దెబ్బలే బహుమానము. అసలు నీ పైవానికి గల ఆకర్షణీయమైన గుణాలను గుర్తించు. అవకాశామోచ్చినపుడు నీదైన

రీతిలో ఉపయోగించు. ఇంతకు ముందే చెప్పినానుకదా! యద్యద్  ఆచరతి శ్రేష్ఠః ... అని చెప్పినాను కదా! కాబట్టి అతనిలోని శ్రేష్ఠత ను మాత్రమే గుర్తించు, లోపాలను గమనించి వానిని స్వంతము చేసుకోకుండా చూసుకో! 
అసలు అందరికీ పైవాడయిన పరమాత్మ ఏమి చెబుతున్నాడో చూడు:


న మే పార్థాస్తి కర్తవ్యమ్ త్రిషు లోకేషు కించన

నానవాప్తమవాప్తవ్యం వర్త  ఏవ చ కర్మణి                22-3


పార్థా విను,నే పాటించుటకే

కర్మలు గలుగవు గన ముజ్జగముల

ఫలితములేమో బడసెదనన్నియు

అయినను కర్మల నాచారించెదను                        22-3


యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః

మామ వర్త్మానువర్తంతే ముష్యాః పార్థ సర్వశః         23--3


కర్మలు నేనే కాదని యంటే

మదిగొనరికనవి మానవులందరు

ఆదర్శుండే ఆచరించనిచొ

మనుజులకెవ్వడు మార్గదర్శి మరి                       23--3


ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహం

సంకరస్య చ కర్తా శ్యాం ఉపహన్యామివమః ప్రణాః    24 --3


కర్మమ్ముల,నే కాలదన్నితే

లోకములేకల్లోలము చెందును

సాంకర్యమునకు సాధనమగుదును

కష్ట నష్టముల కారణమౌదును                          24 --3

ఆయన చేయవలసిన కర్మా లేదు ,ఆయనకు చెందని ఫలితమూ లేదు. అయినా ఆయన కర్మము చేయ మాన లేదు. రామునిగా అవతరించి ఈ లోకానికే ఆదర్శముగా నిలచినాడు. ధర్మ సంస్థాపనకు లౌకికము కూడా అవసరమేయని మనకు తన కృష్ణావతారముతో మనకెరుక పరచినాడు. ఆయన అడుగుజాడలో మనము ఆనందముగా నడచి ఆవలి ఒడ్డు చేరుకోవచ్చు. కానీ మనము ఈ ప్రాపంచిక లంపతములతో స్మ్లేషలో ఈగ వలె కొట్టుకొంటున్నాము. అసలు ఈ చరాచర సృష్టికి ఆయన కర్మ కాదా మూలము. మరి ఆయన కర్మచెయకుంటే అంతా అస్తవ్యస్తమే! ఆ వాస్తవాన్ని అర్జనునిలో పాదుగొలిపి ఆతనిని కార్యోన్ముఖుని చెస్తున్నాడు, భగవానుడు. అసలిది ఆలొచిస్తే ఎంతటి ఉత్ప్రేరకమో (Motivating Factor) చూడండి. ఆయన కర్మ ఆయనే చేస్తున్నాడు కాబట్టి మన కర్తవ్యము మనము నిర్వహించ వలసినదేకదా! అర్జనునిలో కలిగిన అయోమయమునకు ఆజ్యము పోసి దానిని మసి చేసి ఘృతమునే అందిస్తున్నాడు.అందుకే ఆయన అంటున్నాడు " నీ మాదిరి నేను కూడా కర్మ చెయకుండా వుంటే లొకమేమవుతుంధి. వర్ణాశ్రమాలు,జాతి సమాజము,స్వభావములు, రాష్ట్రములు, దేశము అంతా సాంకర్యమే! విహితము నిహితము అన్న తారతమ్యము ఉండదు. ఈ జ్ఞానమును ఆకళింపు చేసుకోలేక పెడదారి పట్టేవారికి కనువిప్పుగా ఆ పరమాత్మ చెబుతున్నాడు.
ఈ విధముగా ధర్మాచరణ , కర్మాచరణ, మర్మాలను పరాత్పరుడు  ప్రతిపాదించుచున్నాడు. వింటే అర్జునులమౌతాము, వినకుంటే సైంధవులమే!
*******************************************సమస్య మనది సలహా గీతది -- 29

నాకన్నీ  ఎరుక . ఇంకా నేను కర్మల చేయుట అవసరమా?

నా కన్నీ ఎరుక అనటము తోనే నీకు తెలియనిది చాలావున్నదని చెప్పకనే చెబుతున్నావు. ఏమీ లేని ఆకే ఎగిరి పడేది. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందని నీ కు తెలియదా! బహుశా తెలియదు నీకు. తెలిసివుంటే అన్నీ తెలుసునన్న ఆలోచన అసలు నీకు వచ్చియుండదు. ఇక అసలు విషయానికి వస్తే అన్నీ తెలిసిన భగవంతునికే తన కర్మలు తన బాధ్యతగా చేస్తున్నాడు. మరి అపుడు నీవెంత. నీ జ్ఞానము నీతో పని చేసే వారాలకు సర్వదా ఉపయోగ పడటము అత్యంత అవసరము. అసలు నీ మంచితనము నలుగురికీ తెలిసేది అప్పుడే! తెలుసునని నీవు వూరకుండిపోతే అసలు నీకు తెలుసునా లేదా అన్న సంశయాన్ని అందరికీ కలిగిస్తున్నావు. తెలిసినది పంచు తెలియనిది తెలుసుకో!  విజ్ఞానము నదీ ప్రవాహము . నీకు చేతనైన నీరు దొరకబుచ్చుకో . అది సముద్రములో కలువక మునుపే నీవు జాగ్రత్త పడాలి. నదికి పేరు వుంటుంది విజ్ఞానానికి కూడా అంతే కదా! నీకు ఏ నది నీరు కావలిసితే ఆ అనది వద్దకు పోయి నీరు పట్టుకో. సముద్రములో కలిస్తే నీవు ఏది ఎమిటో తెలియక అవస్థ పడుతావు. పైగా నీకపుడు దొరికేది ఉప్పునీరే!
కాబట్టి కర్మ చేయుట , అది చేయుటకు తగిన జ్ఞానమును ఆర్జించుట రెండూ అవసరమే. అసలా రెండింటిదీ అవినాభావ సంబంధము. రాముడు తండ్రి చెబితే పట్టాభిషేకమునకూ  సిద్ధపడినాడు ఆడవులకు పోవుటకూ సిద్ధపడినాడు. అసలు పరమాత్మ నె మానవ రూపములో ఎటువంటి మహిమల జోలికి పోకుండా, మనకు ధర్మ, కర్మలను నిష్కల్మషముగా ఆచరించమని చెప్పినాడు. అదే ధర్మాచారణ ,కర్మాచరణ అంటే! అందుకే  ఆయన మనకు ఆరాధ్యుడైనది. అసలు ఈ విషయములో శ్రీ కృష్ణుడు ఏమంటున్నాడో చూస్తాము. 

సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వన్తి భారత 

కుర్యాద్విద్వాంస్థథాసక్తః  చికీశుర్లోకసంగ్రహం                     25 -- 3

విద్వత్తే  లేని వారు వివిధ కామితములు తీర 

ఆసక్తిగ కర్మల తా మాచారించుచుందు రయ్య

అదేరీతి విద్వాంసులు, అవనికిమేల్జేయుకొరకు 

అమిత శ్రద్ధతో కర్మల నాచరించవలె నర్జున                        25 -- 3     

చూచినావా ! కర్మణి అను పదమును ఉపయోగించి సక్తాః అన్న పదాన్ని వాడి నీకై ఏర్పరుపబడిన కర్మలను నీవు ఆసక్తితో ఆచరించు   అని చెబుతున్నాడు పరాత్పరుడు. అవిద్వాంసః అను పదమునకు అవి ఎందుకు అనుసంధించినాడంటే విహిత కర్మలు అంటే శాస్త్ర విహిత కర్మలజోలికి పొతే వచ్చేది అటువంటి దుష్కర్మ ఫలములే!

ఇక ఇంకొక మాట 'విద్వాన్ ' అసక్తః అని వాడినాడు. ఒకవేళ ఈ 'అసక్తః' అన్నపదము శాస్త్ర విజ్ఞానికయితే 'ఆసక్తే' తప్పితే 'అసక్తత' ఉండదు. అది ఆత్మజ్ఞానమెరిగిన విద్వాంసునికే చెల్లు. ఆత్మజ్ఞానమంతు బట్టినవాడు లోకహిత కార్యాచరణకు వెనుదీయక సదా అదేపనికై పాటుపడతాడు. 

ఒక్క శ్లోకము ఇహపరములకు ఎంతగా బోధించుతూ వుందో చూడు. అదే గీతా మత్మ్యము అంటే. అందుకే విష్ణ్వంశ సంభూతుడైన వేదవ్యాసులు , అసలు, ఈ భగవద్గీతను గలిగిన భారతమును గూర్చి వేదవ్యాసులవారు ప్రారంభములోనే ఏమన్నారంటే 
ధర్మ తత్వజ్ఞులు ధర్మ శాస్త్రంబని

ఆధ్యాత్మ విదులు  వేదాంతమనియు 

నీతి విచక్షణుల్  నీతి శాస్త్రంబని 

కవి వృషభులు మహా కావ్యమనియు 

లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని 

ఐతిహాసకు లితిహాసమనియు 

పరమ పౌరాణికుల్ బహు పురాణ సముచ్చ

యంబని మహి కొనియాడుచుండ  

వివిధ వేద తత్వ వేది  వేదవ్యాసు

డాది ముని పరశారాత్మజుండు, 

విష్ణు సన్నిభుoడు , విశ్వ జనీనమై 

బరగుచుoడజేసే భారతంబు"


సాక్షాత్తు విష్ణు స్వరూపుడైన టు వంటి వేదవ్యాసుడు రచన చేసినటువంటి ఆ మహాభారతము
    ధర్మశాస్త్ర ధురీణులు ఇదే ధర్మ శాస్త్రం అని, ఆధ్యాత్మికతను అవలంబించినవారు అంటే పరమేశ్వర స్వరూప స్వభావజ్ఞులు    "వేదాంతమనియు"  నీతి విచక్షణ కలిగి నీతికే పట్టము కట్టేవారు   నీతి శాస్త్రంబనియు , కవి శ్రేష్ఠులు  "మహా కావ్యమనియు" "లాక్షణికులు అంటే కావ్య లక్షణముల గూర్చి రసప్రాధాన్యత; భావ ప్రాధాన్యత; వర్ణనా ప్రాధాన్యత. మొదలయిన విషయముల గూర్చి కూలంకషముగా తెలిసినవాడు దీనిని "సర్వ లక్షణ సంగ్రహమని, ఐతిహాసికులు అంటే Historians దీనిని చరిత్ర అని , పురాణ వేత్తలు ఇది అతి గొప్ప "పురాణమని" లంటే లోకములో గల వివిధ వైషయిక ప్రజ్ఞావంతులు వారి వారి ప్రజ్ఞలలో ఇంతకు మించినది లేదు అని అనే విధముగా వ్రాసినాడు అంటే ఆయన భగవంతుని అవతారము గాక వెరేమవుతాడు. పైగా పరమాత్మచెప్పినది తన దివ్యదృష్ఠి చేత కని విని చెప్పినది చెప్పిననట్లు వ్రాసినందువల్లనే అటు భగవద్గీత ఇటు భారతము అజరామరమైయోప్పుచున్నవి. సకల శాస్త్ర సంపన్నుడు, సర్వ విజ్ఞాన కోవిదుడు, వేద విభజనా కౌశలుడు, పరమాత్మ స్వరూపుడు అయిన వ్యాసులవారు , నీ సిద్ధాంతము ప్రకారము అయితే ఏమీ వ్రాయకుండా ముక్కు మూసుకొని ఊరక యుండియుండవచ్చు. కానీ కేవలము మనకొరకు వ్రాసినాడు . అది కర్మాచరణ అంటే! దానిని గురించియే పరమాత్మ చెప్పినది.

అటువంటి మహనీయులు స్వలాభామన్నదే లేకుండా విశ్వశ్రేయస్సుకై పాటుపడితే 'నాకన్నీ తెలుసునన్న ' నీకన్నా మూర్ఖుడు ఈ లోకములో దొరకడు.

 'ఉత్తిష్ఠ జాగృత' 
స్వస్తి.


*******************************************

సమస్య మనది సలహా గీతది -- 30
సమస్య:  నేను మంచి చెడ్డల విచక్షణ గలిగిన వాడిని. విషయ పరిజ్ఞానము గలిగిన వానిని. మరి నేను చేపట్టిన పనిని నా పద్ధతిలో గాక ఇంకా మంచి పద్ధతిలో చేయవచ్చును కదా !
సలహా : నీ సస్య యుక్తియుక్తమైనదే! కానీ ఒక తిరకాసున్నది. మానవులమైనందుకు మనము ఆహారము తినవలసినదే! కడుపు నింపుకోవలసిందే!  ఈ కడుపు నింపుకొనుట అన్న పనిని ఎవరి పద్ధతిలో వారు చేస్తారు. కలిగినవాడు కోరింది తింటాడు. కలగని వాడు దొరికింది తింటాడు. ఇందులో కూడా ఎవరి రుచి వారిది. లోకో భిన్న రుచి అన్నారు కదా! ఇక నీవు నిన్ను జ్ఞానము, విచక్షణ కలవానివి అన్నావు  నీకున్న జ్ఞాన మేపాటిది,నా బలమేమి, బలహీనతేమి, నా కార్యమును ఆపుటకు వచ్చే అవరోధములేమి, అందివచ్చే అవకాశాములేమి యన్నది పైగా నా వివేకము ఈ పనిని ఏవిధముగా చేయించుతుంది, అన్నది ఎంతో ముఖ్యము. మరి ఈ వివేకమునకు ప్రేరణ ఎవరు? నా మేధస్సు. మరి మేధస్సుకు ప్రేరణ ఎవరు? నా పూర్వ జన్మ వాసనలే!
ఒక సామూహిక దుర్ఘటన జరిగితే, దానికి గురియైన అందరికీ ఒకే విధమైన గాయములు కలుగుట లేదు. అవి మానే వ్యవధి కూడా ఒకటిగా ఉండుట లేదు. మాట వరుసకు ఇద్దరికీ ఒకే విధమైన గాయములు తగిలినవి అనుకొందాము. గమ్మత్తేమిటంటే ఒకరికి ముందుగా నయమైతే ఒకరికి ఆలస్యము జరుగుతుంది. మరి ఇది   పూర్వ కర్మ ఫలమే కదా! ఈ పూర్వజన్మ వాసనల వాళ్ళ ఏవో చెడ్డ తలపులు ఒకనికి సంభవించినవని తలచెదము. అంటే ఒక గది దుర్గంధ భరితమై యున్నది అనుకొందాము. మన అనుభవము వలన కానీ మన శ్రేయోభిలాషులు ఇచ్చిన సలహా వల్ల కానీ ఆ గదిని శుభ్రముచేసి, దానికి గల కిటికీలను తెరిచి సాంబ్రాణి ధూపము వేసి ఆ గదిని వాస యోగ్యము చేస్తాము. అంటే మన పూర్వ వాసనల వల్ల  మనలో కలిగిన చిత్త వృత్తిని మన యొక్క బుద్ధి పరిపక్వత చేత సరియైన గురూపదేశము చేత, జన్మాంతర వాసనలను సవరించుకుంటూ దాని ప్రభావమును మన పై తగ్గించుకుంటూ ఋజు మార్గములో నడువ బూనుచున్నాము. అంటే రాబోవు జన్మకు ఒక చక్కటి  పునాదిని ఏర్పరచుకొంటున్నాము.
ఇప్పుడు దీనిని ఒక కార్యాలయమునకు అన్వయింకొందాము. అధికారి, కార్యాలయములో ఎంతమంది పనిచేస్తున్నా, ఫలానా పని ఫలానా వ్యక్తికి ఇమ్మని చెబుతారు. అంటే ఏమని? ఆ వ్యక్తిలో సామర్థ్యాన్ని ఇవ్వమన్న అతను గుర్తించినాడన్నమాట. మరి నీ కెందుకు ఆ అవకాశము రాలేదు. నీ జన్మాంతర వాసనలవల్ల నీలో ఒక తపన , ఉత్సాహము, ఉత్తేజము, ఉద్వేగము లేదు. కానీ నీ కిపుడు ఒక ఆదర్శప్రాయుడు  దొరకినాడు. అటువంటి వ్యక్తిని అనుసరించుటవల్ల నీ ప్రకృతిలో కొంత మార్పు తెచ్చుకోవచ్చు. ఆశయము మంచిదైనపుడు ఆశపడుటలో తప్పులేదు. ఆ పని చేసే విధానము నీకు ముందుగానే తెలుసు. నీకు కావలసిందల్లా నీదయిన ఒక పంథా. ఉత్సాహము ఎప్పుడూ ప్రోత్సాహమునకు అనుబంధము. అది అతనిని పరిశీలించుటవల్ల  వల్ల నీలోనూ కలుగుతుంది. అప్పుడు ఆ పనిని నీవు కూడా చేయగల సమర్థుడవౌతావు. నీవు ఆ పనిచేసి ఇంకా పదుగురికి ఆదర్శప్రాయుడ వౌతావు. కాబట్టి లౌకిక జ్ఞానము పొందితే నీ సంఘములో నీవు ఆరాధింప బడుతావు. అదే పారలౌకిక జ్ఞానార్జన చేస్తే  పరమాత్మను కనుగొంటావు.
దేనికైనా కూడా నీ నైజమును సన్మార్గమువైపుకు మరలించుతూ నీవు సత్కర్మలు చేస్తూ జీవితములో పురోభివృద్ధి సాధించటమే!
అసలు భగవాన్ శ్రీ కృష్ణుడు ఈ విషయమై ఏమంటున్నాడో విందాము.

సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి 
ప్రకృతిం యాన్తి భూతాని నిగ్రహః కిం కరిష్యతి    33-3

జ్ఞాని యైన న జ్ఞాని యైనను
మనో ప్రవృత్తికి మరి బానిసలు
చేకొని చిత్తము, చేతురు  కర్మలు              
కర దీపికగా కంటి చూపుగా                          33-3
       
ఆత్మజ్ఞానులు కానివారు అంటే  సాధారణమైన మన లాంటి మానవులు స్వభావానుసారమే   కర్మల  నిర్వర్తించి కోరికలు  బడిసెదరు. అదే జ్ఞానులు కూడా కర్మఫలము తమ కొరకు కాకపోయినా సంఘ దేశ శ్రేయస్సుకు కొరకు కర్మల నాచరించుతారు. కానీ వారు కూడా తమ చిత్తప్రవృత్తులను బట్ట్ట్టియే.! ఉదాహరణకు వశిష్ఠ మహర్షిని, దూర్వాసో మహర్షినీ తీసుకొందాము.  ఇరువురి ధ్యేయమూ విశ్వకల్యాణమే! కానీ వశిష్ఠుడు పరిశుద్ధ, పరిపూర్ణ సాత్వికుడు, ఆగ్రహానుగ్రహ సమర్థుడు కానీ దూర్వాసుడు రజోగుణ సంపన్నుడు. కోపము మెండు. ఆగ్రహ మెక్కువ, నిగ్రహము తక్కువ. అంటే మనోరథ మొకటైనా సారధులైన మనోప్రవృత్తులు వేరు. ఈ శ్లోకములోని అర్థమును స్థూలముగా గైకొని నిరాశావాదమును తెరపైకి తెస్తారు. ఎంత జ్ఞానియైనా  పూర్వజన్మ వాసనా ఫలమైన ప్రకృతిని అనుసరించి యే నడుచుకొనునప్పుడు ఇక జ్ఞానార్జన చేసి ఫలమేమున్నది అన్నది వారి సందేహము. ఇక్కడ అర్థము చేసుకోవలసిన ఒక చిన్న విషయము వుంది. అది ఏమిటంటే జ్ఞానము వేరు వివేకము వేరు. జ్ఞానము వంటకు సంబంధించిన ఒక వస్తువుల గది లాంటిది. వివేకము వంటవాడు. వస్తువుల గదినుండి తనకు కావలసిన వస్తువు కావలసిన మేరకు తీసుకొని తాను వంట చేస్తాడు. ఆ వంటకము యొక్క బాగు ఓగు ఆ వంట వాని మీదనే ఆధారపడుతుంది. బాగుంటే అతను ధీమంతుడే  లేకుంటే తన వివేకమును అభివృద్ధి పరచుకోవలసినదే!  తన వివేకము పెరిగే వరకు తనదైన కర్మ యగు వంట చేస్తూ వుండవలసినదే! అందువల్ల జ్ఞాని అజ్ఞాని అన్న తారతమ్యము లేకుండా ఎవరి కర్మ వారు చేయవలసినదే! పూర్వజన్మ కృతమైన చిత్తవృత్తులను మాత్రము సవరించుకొని /సవరించుకుంటూ సాగావలసినదే!
సద్గమన ప్రాప్తిరస్తు.
*********************************************************************************

No comments:

Post a Comment