Thursday, 2 February 2017

రాణీ పద్మావతి - అల్లాఉద్దీన్ ఖిల్జీ

రాణీ పద్మావతి - అల్లాఉద్దీన్ ఖిల్జీ
ఢిల్లీ పాలకులలో ఈతను రెండవ వాడు. ఇతను టర్కీ కి చెందినవాడు. మనము తెలుగులో వాడే తురక అన్న పదము టర్కీ అన్న పదము నుండీ వచ్చినదే! 1296 నుండి 1316 వరకు 20 సంవత్సరములు ఈయన పరిపాలనా కాలము. తాను రెండవ అలెగ్జాండరు గానూ, ఇస్లామునకు మరియొక ప్రవక్త గానూ కాదలచినాడు. అప్పుడు నాటి ప్రసిద్ధిగన్న ‘సూఫీ సన్యాసి’ యగు అష్రఫ్ జహంగీర్ సేమ్నాని కావాలనుకొంటే  రెండవ అలేగ్జాండరువు కావచ్చు కానీ మత ప్రవక్త అగుటకు ప్రయత్నించవద్దు అని చెప్పుట జరిగింది. సరేనని తలచి ‘సికందర్-ఏ-సాని’ అన్న బిరుదు తగిలించుకున్నాడు. He was a Tyrant, an oppressive ruler who levied heavy taxes on Hindus and even disallowed them to possess weapons.
( గూగుల్ aazad.com సౌజన్యము) 
హిందువులపై ఇతను సాగించిన దురంతములు ఇన్ని అన్ని అని చెప్పనలవి కాదు. లక్షల మందిని తన 20 సంవత్సరముల రాజ్యకాలములో చంపగా , బ్రతికిన హిందువులపై లేనిపోని పన్నులు విధించుటయే గాక వారు చక్కని బట్టలు కూడా వేసుకో కూడదని చెప్పిన క్రూరుడు. తన సామ్రాజ్యము లోని పల్లెలు, పురములు, పట్టణములలో  అర్థబలము, అంగబలము కలిగిన మహమ్మదీయులకు మాత్రమే పెత్తనమిచ్చి అప్రాంతపు హిందువులపై పెత్తనము చలాయింప జేసినాడు.
మాలిక్ కాఫిర్ అన్న నపుంసకుడు ఈతని సర్వ సేనాధిపతి. అలావుద్దీన్ కు ఎన్నో రాజ్యములు ఎన్నో రాజ్యములు జయించి సంపాదించి పెట్టిన ఈతడు నిజమునకు హిందువు. కంభాత్ యుద్ధమున తటస్థించిన ఇతని తల్లిదండ్రులను చంపి బాలునిగా ఉన్న ఇతని అందమునకు మెచ్చి మెచ్చి పుంరతికి అలవాటు పడిన అల్లాఉద్దీన్ 1౦౦౦ దీనారములిచ్చి ఈతనిని కొని నపుంసకుని చేసినాడు. అంతటితో ఆగక ఇస్లామునకు మార్చి ‘మాలిక్ కాఫర్’ అన్న నామకరణము చేసినాడు. అందుకే అతనిని ‘హజార్ దినారీ’ అని కూడా అనేవారు.
అన్నివిధాలా అతని మెప్పు సంపాదించి సర్వోచ్ఛ  సేనానాయకుడైనాడు కాఫర్. దేవగిరి, హోయసల, హలెబీడు, పాండ్య దేశమగు మధుర ను జయించి దక్షిణా పథమును మహమ్మదీయ పాలన లోనికి తెచ్చినాడు. మధుర దేవాలయమున ఈతను చేసిన ఘాతుకములు మాటలకు అందనివి. చివరకు అల్లాఉద్దీన్ ను అతని వారసులను కూడా చంపి 36 దినములు దేశమును పరిపాలించి ఘాతుకముగా తన సిపాయీల చేతనే చంపబడినాడు.
  ఇక రాణీ పద్మిని లేక పద్మావతి విషయమునకు వత్తము.
రావల్ రతన్ సింగ్ యోధుడు, కళా పోషకుడు, ప్రజా హితైషి మరియు సమర్థవంతమైన మహా రాజు. ఆయన పద్మినీ దేవిని స్వయంవరములో గెలిచి వివాహమాడుతాడు. ఆమె తండ్రి మెచ్చి ఆయనకు ఎన్నో అపురూపమగు కానుకలు ఇవ్వగా అతని తోబుట్టువులు రాఘవ్ మరియు చేతన్ తమకు కూడా ఇప్పించమని రతన్ సింగ్ ను అడుగుతారు. ఆయన అది సభ్యత కాదని తెలిపినా పట్టుబట్టుటతో వారిని దేశమునుండి బహిష్కరించుతాడు.
వారు సరాసరి  ఢిల్లీ సుల్తాను అగు అల్లా ఉద్దీన్ ఖిల్జీ వద్దకు వెళ్లి తమను పరిచయము చేసుకొని తగు సమయములో ఆతనికి పద్మావతి (పెళ్ళికి తరువాతి పేరు) అతిశయించిన అందచందాలను గూర్చి చెప్పి అతనిలో కామము రగుల్గొల్పుతారు. ఈ విషయమున ఇంకొక కథ కూడా ప్రచారములో వుంది. రాఘవ్ చేతన్ అనే వేణు వాదకుడు ఆ కళ యందు ఎంతో పేరు గాంచినవాడు. దానికి తోడుగా అతను భూత పిశాచ ఉపాసకుడు. అది రాజ్యములో అనూచానముగా నిషిద్ధము. ఆవిషయము కంటబడి రాజు అతనిని తల సగము గొరిగించి సున్నపు పట్టెలు పెట్టి గాడిద నెక్కించి, ఇతరులెవరూ ఆ పనికి సాహసించని రీతిలో అవమాన పరుస్తాడు.  దానితో అతడు డిల్లీ కి చేరువగు అరణ్యము చేరి అల్లా ఉద్దీన్ ఎప్పుడు వస్తాడా అని కాచుకొని ఉంటాడు. ఆరోజు రానే వస్తుంది.  అతని వేణు గానమునకు ముగ్ధుడై తన శిపాయీలను పంపి ఆతనిని తన సభకు తోడి తెమ్మంటాడు. ఆతను వచ్చి సుల్తానుకు తన వేణుగానము పద్మావతి ముందు దిగదుడుపు అంటూ ఆమె అందమును అతిశయించి పొగుడుతాడు. ఈ రెంటిలో ఏది నిజమయినా ఆ తరువాత జరిగినది మాత్రము ఒకటే! ఖిల్జీ ఒక కుట్ర చేస్తాడు. మేవార్ దుర్గము దుర్భేద్యము కావున రతన్ సింగు నకు తాను మిత్రునిగా మెలగ దలచినట్లును, ఒకసారి సహోదరి సమానురాలగు పద్మిని ముఖము నొకసారి చూపించ వలసినట్లును కోరుతాడు. రాజు వల్లె యంటాడు.
కానీ ఇందు ఎదో మోసమున్నట్లు రాణీ పద్మిని పసి కడుతుంది. అసలు అల్లా ఉద్దీను కుతంత్రము ఏమిటంటే యుద్ధము తో ఆ కోటను జయించుట కష్టమని తెలిసి తనతో బాటు అతి చురుకైన మరియు బలశాలులైన బలగముతో కోట లోనికి ప్రవేశించి రాజును బందీ చేసి తన స్థావరమునకు తీసుకుపోయి రాణిని పొందే బేరమును ఆడుదామనుకొంటాడు.
రాణి తన రూపమును అద్దములో చూపుతుంది. భ్రమించిన ఖిల్జీ తప్పక ఆమె తన జనానా చేరవలసిందేనన్న నిర్ణయానికి వస్తాడు. గౌరవముగా తనను సాగానంపుటకు వచ్చిన రతన్ సింగును బంధించి తన గుడారమునకు తీసుకు పోయి రాణికి ‘ఆమె తనదైతేనే రాజుకు విముక్తి’ అన్న షరతును విధించుతాడు.
ఆమె చాతుర్యము కలిగినది కాబట్టి సరే అంటూ తన వెంట 15౦ పల్లకీలలో తన పరివారముతో వస్తానంటుంది. మెరికల వంటి  యోధులు ఒక్కొక్క పల్లకీ లో నలుగురు కత్తి కటారు బాకులు మొదలగు శాస్త్రములతో కూర్చొనగా నలుగురు దానిని మోసే బోయలుగా ఏర్పాటు చేసి ఇద్దరు కొడుకుల నాయకత్వములో పంపుతుంది. వారు రాజును విడిపించి కోటను చేర్చ గలుగుతారు కానీ తాము మరణించుతారు.
ఆగ్రహోదగ్రుడైన ఖిల్జీ కోట అనుపానములను తను రాజు వద్దకు మైత్రి నెరుపుటకు పోయి ఉండినాడు కాబట్టి కోటలోనికి ఖాద్య వస్తువులు పోకుండా కట్టుదిట్టము చేసినాడు. రానురాను పరిస్థితి విషమించుటతో వీరులగా పోరాడి ప్రాణ త్యాగము చేయ దలంచి యుద్ధము చేస్తారు.
ఇక ప్రాయోపవేశమే శరణమని తలచిన రాణీ పద్మావతి తన పరివారముతో జౌహర్ కుండ్ (చితి మంటలు పేర్చిన అతి పెద్ద గాడి) లో దూకి ప్రాణ త్యాగము చేస్తుంది.
ఈ గాధను 154౦ లో మాలిక్ మొహమ్మద్ జాయసీ తన ‘పద్మావత్’ అన్న కావ్యములో వ్రాసినాడు.  ఒక్క కవిత చదువగలిగిన వారి కొరకు:
तन चितउर, मन राजा कीन्हा। हिय सिंघल, बुधि पदमिनि चीन्हा॥
गुरू सुआ जेइ पंथ देखावा । बिनु गुरु जगत को निरगुन पावा ?॥
नागमती यह दुनिया-धंधा । बाँचा सोइ न एहि चित बंधा ॥
राघव दूत सोई सैतानू । माया अलाउदीन सुलतानू ॥
प्रेम-कथा एहि भाँति बिचारहु । बूझि लेहु जौ बूझै पारहु ॥

13౦3 లో జరిగిన ఈ సంఘటనను 2౦౦ ల సంవత్సరముల తరువాత వ్రాయటము జరిగినది. ఏది ఏమయినా శూరతకు రాజ పుత్ర యోధులు లు పాతీవ్రత్యమునకు రాజపుత్ర మహారాణులు పెట్టినది పేరు గదా!
౩౦,౦౦౦ మంది ముస్లిములను ద్రోహులని ఊహించి, లక్షల మంది హిందువులను పొట్టన పెట్టుకొన్న అల్లా ఉద్దీన్ ఖిల్జీ గోప్పదనమిదియే!

అటువంటి హీన మనస్కునితో, అతని కలలోనికి పద్మావతిని రానిచ్చి చుంబన దృశ్యమును చేర్చ ప్రయత్నించుట నిజమయిన భారతీయత నరములలో ప్రవహించే వ్యక్తి ఎవరయినా నాకు సంబంధించినది కాదు కదా అని ఊరకుండగలడా! అసలటువంటి ఆలోచన ఆ సినిమా దర్శకునికి గానీ, ఆ దృశ్యములో నటించుటకు అభ్యంతరము తెలుపని నటులకు గానీ దేశభక్తి అన్నది లేనట్లేనా! డబ్బు కొరకు ఏమయినా చేయ నిచ్చగించుట వారు నేర్చుకొన్న సంస్కృతి అనుకోనవలెనా! అన్న విషయముల గూర్చి ఆలోచించుట పాఠకుల మనోగతమునకు వదలివేస్తున్నాను.
స్వస్తి





Wednesday, 1 February 2017

నే పొగడకుంటే

నే పొగడకుంటే
సంగీత సాహిత్యములను సరస్వతీ దేవి యొక్క స్థన ద్వయమునకు పోల్పబడినది. పెద్దలు ఈ విధముగా చెబుతారు.
సంగీత మపి సాహిత్యం
సరస్వత్యా స్థన ద్వయం
ఏక మాపాత మధురం
అన్య దాలోచనామృతం .
అంటే ఆ రెంటిదీ విడదీయలేని బంధము. అసలు సంగీతమునకు సాహిత్యము ఊపిరి. అది గమనించకుంటే అర్థము కన్నా అనర్థము ఎక్కువ.
తమిళులు తెలుగు తమ మాతృభాష కానందువల్ల సంగీతమును విడువకుండా పట్టుకొన్నారు. మనము సంగీతము సారస్వతము రెండూ వదలి ఆటవికతను ఆదరించుచున్నాము.

దేవరకొండ సుబ్రహ్మణ్యం గారు శుభ పంతువరాళి రాగం లోని 'నే పొగడకుంటే' అన్న త్యాగారాయ కీర్తన తమ కుడ్యము పై ప్రచురించినారు. దానిని చూసిన తరువాత నాలుగు మాటలు చెప్పవలెనని అనిపించింది.
ఒక తమిళ శాస్త్రీయ గాయకుడు ఈ కీర్తన పల్లవిని ‘నే పకోడా కొంటే నీకేమి కొదవ' అని పల్లవినెత్తుకొన్నాడు. తమిళ, శాస్త్రీయ సంగీత గాయయకులలో, పూర్వమున పెక్కురు త్యాగయ్య కీర్తనలోని భాషకు కానీ భావానికి కానీ ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. ఎందుకంటే వారి భాషలో కవర్గమంతా'జ్ఞ' తప్పించి ఒకే అక్షరము ప్రతినిధిత్వము వహించుతుంది. కావున వారు ఆ అక్షరము కలిగిన పదమును బుద్ధికి తోచినట్లు పలుకుతారు . చ ,ఛ ,సకు ఒకటే అక్షరము వాడుతారు. 'న' తప్పించి త వర్గమునకు ఒకటే అక్షరము.'ణ'తప్పించి 'ట' వర్గమంతా ఒకటే అక్షరమే. ప వర్గము కూడా అంతే. ఒక్క 'za' అన్న అక్షరము ఎక్కువ కానీ అది మనకు లేదు'. మనకు దాని ఉపయోగము లేదు. ఒక 'కృష్ణ' అన్న శబ్దము వ్రాయవలెనంటే
కి రుట్ చ్ న అన్న అక్షరాలను కలపవలె. పైపెచ్చు మనవలె ఆ భాషలో 'అమ్మ' వ్రాయవలసి వస్తే వారు 'అమ్ మ' అని వ్రాయవలె.
ఇంతా ఎందుకు చెప్పుకొస్తున్నాను అంటే అంత ఇబ్బంది వుండి కూడా 'సంగీత త్రిమూర్తులైన' మన ముగ్గురు వాగ్గేయకారులను దైవ సమానులుగా చూసుకొంటారు.(త్యాగయ్య, శ్యామా శాస్త్రి వారి పూర్వులది ఒకప్పటి కడప మండలములోని కంభము కాగా, ముత్తు స్వామి వారి పూర్వులది గోదావరీ తీర ప్రాంతమని చెబుతారు. శ్యామా శాస్త్రి వారికీ త్యాగయ్య గారికి ముత్తుస్వామి గారికి మధ్యన 10 సంవత్సరముల తేడా. వారు సమకాలీనులు. మరి మనమో అసలు కర్నాటక సంగీతాన్ని సినిమా మాధ్యమములో కూడా, కొందరు విశ్వనాథ్ గారి లాంటి దర్శకులను తప్పించి, బ్రహ్మానందం లాంటి హాస్య నటులతో సంగీత కచ్చేరీలో అపాన వాయువుల జోప్పించి అవహేళన చేసినారు. అది చూసి ఆనందిచినామే కానీ అంగుళము మాత్రము కూడా స్పందించని సంగీతాభిమానము మనది. అభినయించిన నటుడు తెలుగు ప్రొఫెసరు. కేవలము బహుశ అతనికి డబ్బు మాత్రమె ప్రధానమేమో! ఇది ఆ నిర్మాతల నాదబ్రహ్మము పై గల అభిరుచి తెలుపుతుంది. ఇక ఆ దర్శకుని కళాభిజ్ఞత గూర్చి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. ఆ దృశ్యమును ఆస్వాదించిన ప్రేక్షకులను అసలు మానవులుగా పరిగణించవలెనో లేదో నాకు తెలియదు. బ్రహ్మ సాక్షాత్కారము పొందిన ఆ నాద బ్రహ్మలు పెట్టిన భిక్షను అవహేళన చేసిన మన సంస్కృతిని ఏమని పొగడగలము. తమిళులైన M.S.సుబ్బలక్ష్మి,D.K. పట్టమ్మాళ్, M.L. వసంత కుమారి, వసంత కొకిలం లాంటి ఎందఱో తమిళ సంగీత విద్వాంసులు ప్రత్యేకంగా తెలుగు సంస్కృత ఉచ్ఛారణ నేర్చుకొని కీర్తనలు పాడేవారు. వారి పాటలలో ఆత్మ కనిపించేది. అసలు ఆత్మయే పరమాత్మ కదా! అచటి సంగీత ఆస్వాదకులకందరికీ రాగము తాళము స్వరమును గూర్చి కొంచెమయినా తెలిసి వుంటుంది.
     తమిళ సంగీత విద్వాంసులైన కొందరు తెలుగు పట్టించుకోకుండా పాడినప్పుడు మనసుపెట్టి వినేవారికి నొప్పి కలుగుతుంది. నిజమే. వారికి సంగీతమే ప్రధానము. ఈ వాస్తవము ఒకసారి గమనించండి.'బంటు రీతి కొలువు ఇయ్యవయ్య స్వామి...' అన్న కీర్తనను తెలుగుపై అశ్రద్ధ కలిగిన తమిళులు ' పండు రీది గోలు వియ్యవయ్య చామి' అని పాడుతారు. ఒక సంగీతము నేర్చుకొనే చిన్న అమ్మాయిని అమ్మా నీకు ఈ పాటకు మీ టీచరు ఏమన్నా అర్థము చేపిందా! అన్నాను. అవును చెప్పింది అని అన్నది ఆ అమ్మాయికి. అయితే పల్లవికి అర్థము చెప్పమని అడిగినాను. ఆ అమ్మాయి చెప్పింది నేను నాదయిన రీతిలో మీకు తెలియజేస్తున్నాను. ‘గొలు’ అంటే ‘బొమ్మల కొలువు’ అని అర్థము. ‘పండు’ అంటే అందులో ఉంచిన ‘బొమ్మ పండు,’ కావున మొత్తమునకు అర్థము ఏమిటంటే మా దశరా బొమ్మల కొలువులో బొమ్మ పండును పెట్టించు ‘చామీ’ అంటే ‘స్వామీ’ అని అర్థము. కావున భాష, భావము సంగీతమునకు రెండు కన్నులు. ఎంతయినా శాస్త్రీయ సంగీతము పై వారికున్న భక్తి ప్రపత్తి సర్వదా సంస్తుతి పాత్రము.

ఒక పేరంటములో (ఇప్పుడు function అనవలెనేమో) ఇద్దరు ఆడవాళ్ళు కలిసినారు. ఒకావిడ ఇంకొక ఆవిడ దుద్దులు చూసి ' అమ్మా! నీవి ఇత్తడి కమ్మలే అనింది'. రెండవ ఆవిడ వెంటనే 'నీకు అవి కూడా లేవే' అంది. 
ఇది నేటి మన శాస్త్రీయ సంగీత దుస్థితి.

Tuesday, 31 January 2017

రాభణ

రాభణ
https://cherukuramamohan.blogspot.com/2017/01/blog-post_31.html
ఇది  కాళీదాసు చాటువు అని చెప్పుకొంటారు. ఒక బ్రాహ్మణుడు కడుపు చేత పట్టుకొని భోజరాజు వద్దకు వచ్చి తాను పౌరాణికుడనని చెప్పుకొన్నాడు. అప్పుడు భోజుడు తను వ్రాసిన చంపూ రామాయణమును గూర్చి కాళిదాసాది కవులతో ముచ్చటిస్తున్నాడు. రావణుని గూర్చి చర్చ జరుగుతూ వుండినది. ఆ పండిత సదస్సులో భోజుడు చంద్రుడి లాగా వెలుగుతూ తన ప్రియమైన రోహిణి చెంతనున్నాడా అన్నట్లు కాళీదాసును తన ప్రక్కన కూర్చుండబెట్టుకొని వున్నాడు. బ్రాహ్మణుడు తనను పరిచయము చేసుకొను ప్రయత్నములో ఆ సదస్సు లో కవి పండిత శ్రేష్ఠులను చూసి జడుసుకొన్నాడు. అంతలో రాజు రావణుని గూర్చి తెలుపమని అడిగితే పండితుడు తత్తరపాటుతో 'రావణ' అని ప్రారంభించుటకు బదులుగా 'రాభణ' అని అన్నాడు. భోజుని ముఖ కవళికలు మారటం కాళీదాసు గమనించినాడు. ఆయన వెంటనే ఆ పౌరాణికుని సమర్థిస్తూ " మహారాజా వారి విద్వత్తును గూర్చి నేను కర్ణాకర్ణిగా ఎన్నోమార్లు విని వున్నాను. ఆయన ఉద్దేశ్యం మనమందరమూ చేసుకోగలమోలేమో అని 'రాభణ' పద ప్రయోగము చేసినాడని చెప్పినాడు.
అంత భోజుడు దాని వివరమడిగితే కాళీదాసు ఇట్లు చెప్పినాడు.
కుంభకర్ణే భకారోస్తి, భకారోస్తి విభీషణే
అగ్రతశ్చ స్వయం రాజా 'రాభణో'నచ 'రావణః'
అని సర్ది చెప్పినాడు. ముగ్దుడైన భోజరాజు అతనిని ఉచిత రీతి సత్కరించి పంపినాడు.
ఇంతకూ కాళీదాసు చెప్పిన శ్లోకమునకు తాత్పర్యమేమిటంటే
రాజా! మొదటి తమ్ముడైన కుం'భ'కర్ణుని పేరులో లో 'భ' వుంది రెండవ వాడిన వి'భీ'షణుడిలో 'భ' వుంది. మరి స్వయంగా రాజు దానికి తోడూ వారికి అగ్రజుడైన వాడు "రా'భ'ణుడు" కాక రావణుడు ఎట్లౌతాడు అని విమర్శచేసి చెప్పినాడు.

అదండీ విషయము.

Wednesday, 25 January 2017

కళ్ళు తెరచి కనరా--వళ్ళు మరచి వినరాఅందుకు వలయు ఉపకరణములు కూడావ్ ముఖ్యము.

కళ్ళు తెరచి కనరా--వళ్ళు మరచి వినరా – 1
https://cherukuramamohan.blogspot.com/2017/01/blog-post_25.html

జాబిల్లి: సవివరంగా ప్రచురించారు. ధన్యవాదాలు... ఒక్క ప్రశ్న.. ఇది నా అజ్ఞానానికి తెలియనిదనానికి తార్కాణం కావచ్చు. ఇంత విజ్ఞానం భావి తరాలకు (అంటే మన పూర్వికుల తరువాతి తరాలకు) ఎందుకు సమగ్రంగా అందించబడలేదు? ఈ విజ్ఞానం మరుగునపడడానికి కారణం ఏమిటి?
నాకు తెలిసినంత వరకు తెలియ జేసే ప్రయత్నము చేస్తాను (రామ మోహన్ రావు జవాబు )
స్వచ్ఛమైన పాలు ఒక పాత్రలో వున్నాయనుకొందాము. ఒకడు ఆ పాలను చూస్తూనే అన్నీ త్రాగేయాలనుకొన్నాడు. అంతలో ఎవరో పిలిస్తే అటు వెళ్లి కాసేపు గడిపినాడు. వచ్చి త్రాగుదామనుకొంటే అంతలో అతని అర్ధాంగి పిలిచి పెరటిలోని కరివేపాకు వెంటనే కోసి ఇవ్వమనింది. ఇచ్చి వచ్చేసరికి కాస్త ఆలస్యమైనది. అంతలో ఇంటికి ఎవరో అతి ముఖ్యమైన అతిథులు వచ్చినారు. వారితో కూర్చొని మాట్లాడకుంటే బాగుండదని కూర్చున్నాడు. ఆటంకాలన్నీ తొలగించుకొని వచ్చి చూస్తే దానిలో ఈగ పడి వుంది. దానిని తీసివేసి కాచమన్నాడు భార్యను. ఆమె కాచితే అవి విరిగి పోయినాయి. ఈగ మాత్రము విమానము వలె ఇంటిలో స్వైరవిహారము చేస్తూ ప్రతి ఖాద్య యోగ్యమగు పదార్ధమును దాని పాత్రను, తాను దిగుటకు అంటే వాలుటకు యోగ్యమగు విమానాశ్రయమును చేసుకొని వుంది.
.....2

కళ్ళు తెరచి కనరా--ఒళ్ళు మరచి వినరా –2

ఇది ఇప్పటి మన తెలుగు పరిస్థితి. పాలు తెలుగైతే ఈగ ఇంగ్లీషు. ఆ వ్యక్తి మా తరము వారి ప్రతీక అని ఉహించుకొంటే, అతను పాలు త్రాగుటకు ఏర్పడిన వివిధ విధములగు ఆలస్యములు వారి జీవితములో ఏర్పడిన అడ్డంకులు అనగా ఉద్యోగమూ, సంపాదన, సంసారము, సంఘ గౌరవము, బంధుమిత్ర సంబంధములు మొదలగు ఎన్నో విషయములుండేవి.  మా తరములో కొన్ని అత్యంత అవసరాలకు సరిపడ డబ్బు వుండేది కాదు. కావున ఉద్యోగము కొరకు చదువుకొన వలసి వచ్చింది. చదువు ముగియగానే ఉద్యోగము. ఉద్యోగము లేకుంటే కుటుంబము గడుచుట కష్టమైపోయేది. ఉద్యోగము పెద్దదైతే పదవీ వ్యామోహము, చిన్నదైతే అలవి మాలిన శ్రమ. ఇక ఇంటికివస్తే మనకు ఇష్టమైనవి చదివే తీరుబాటేదీ. ఇంతలో నవలలు ఒకప్రక్క, డిటెక్టివ్ నవలు ఇంకొకప్రక్క , శృంగార సాహిత్యమను పేరుతో అసభ్య అసహ్య అశ్లీల అవాంఛిత నవలలు వేరొక ప్రక్క, మాసపత్రికలు మరొక ప్రక్క, ప్రొద్దు పుచ్చుటకు సినిమాలు తలకెక్క, ఇక గ్రంథములు చదువుటకు వేసలుబాటేదీ!

ఒక అదృష్టమేమిటిటంటే ఉత్సాహమున్న వారికి చెప్పేవారు మా కాలములో దొరికేవారు. ఇప్పుడు చెప్పేవారూ వినే వారూ కూడా కను మరుగే.

ఒక వాహనచోదకుడు తాను బండి నడిపినంతకాలమూ ఒకే ధ్యేయమే! తన గమ్యమును ఎటువంటి వడి-దుడుకు లేకుండా తన దృష్టిని మరల్చకుండా సజావుగా పోతూ ఉండుట. ఆ వాహన చోదకునిగా మనల నూహించుకొంటే మన జీయిత గమ్యము వరకూ బండి నడచినంతకాలమూ దృష్టి సంపాదనపైనే! అప్పుడు ఏమీ చేయలేని స్థితి వచ్చినపుడు చేతలుడిగి మూలాన కూర్చుంటాము. అదే మనము ఒక పూలతోటకు మాలి అయితే రోజుకునొక పూల చెట్టువద్ద దాని సౌరభామును ఆస్వాదిన్చుతూ ఆనందముగా గడుపవచ్చును. అందుచేత నేను చెప్పవచ్చేదేమిటంటే డబ్బుగాక ప్రపంచములో భక్తీ జ్ఞానము వైరాగ్యము (సన్యాసము కాదు) కూడా ముఖ్యము. 

.......౩

కళ్ళు తెరచి కనరా--వళ్ళు మరచి వినరా –౩

ప్రతి వూరిలో సాయంకాలము 8 గంటల తరువాత హరికథో పురాణ పఠనమో అవధానమో (అవధానము,కవి సమ్మెళనము సా. 5 గం. లకు మొదలయ్యేది.) కవి సమ్మేళనమో ఉండేవి. వినేవారు కూడా అందులోని మధురిమలను ఆస్వాదించే వారు. ఇప్పుడు ఇంకా కొద్దిగా అవధానములను నిర్వహించేవారు వున్నారు. వారికి ధనము, పేరు, పలుకబడి పై మక్కువ ఎక్కువ. వినేవారు మాత్రము తప్పక కొదవయిపోయినారు. ఏతా వాతా ఎవరయినా వచ్చి కూర్చున్నా వారి అర్థమయ్యేది సున్న. అన్నింటికీ మించి ధన పిశాచి మన నెత్తిపై తాండవమాడుతూవుంది. పిల్లల వద్ద వుండేది ఆయ. వారిలో సంస్కారము మాయ. ఇవి స్పీకింగ్లీష్ వాకింగ్లీష్ ఈటింగ్లీష్ రోజులాయె. దీనికి తోడు పిల్లలకు వెబ్బు లో దొరికే గబ్బు మీద మోజెక్కువాయె. మా కాలము వారి సంతానమునకే తెలుగు భాష అంతంత. ఇక వారి పిల్లల కెంతెంత.

ఇది కాక కొందరు మహా పండితులమనుకొన్నవారు మన మానాన మననుండనీక నాటి ఆంగ్లేయాధికారుల మెప్పుకై  వ్యావహారిక భాష అంటూ ఇప్పుడు మనము వాడే తెలుగును ప్రభుత్వమును ఒప్పించి పుస్తకములలో జొప్పించి మనల నొప్పించు చున్నారు.

భాష వుంటే గ్రంధాలుంటాయి. గ్రంధాలుంటే సంస్కృతి నిలుస్తుంది. సంస్కృతి నిలిస్తే మనకు తెలుగు వారిగా లేక ఆంధ్రులుగా గుర్తింపు వుంటుంది. లేకుంటే గ్రంధాలకు బదులు మనకు మిగిలేది దుర్గంధాలే !

మోహము వీడి సంపదల, మొత్తము జీవితమంత డబ్బుకై

దాహము చెందబోక తన దారిన దేహము పోక ముందరే 

ఈహను వీడుచున్ ఇహము ఈ క్షణమే నిను వీడునంచు, దా

సోహము ఆ పరేశుడగు సుందరమూర్తికి యంచు కొల్వరే!  

స్వస్తి.




Monday, 23 January 2017

బాలుడైన గోపాలుని పాదాలకు అంకితం భక్తి తత్వ శిఖరాగ్రణి పాదసేవనం


బాలుడైన గోపాలుని  పాదాలకు అంకితం 
భక్తి తత్వ శిఖరాగ్రణి పాదసేవనం

అజర్ బైజాన్ అన్న దేశము ఒకటి ఉన్నదన్న విషయమే కొందరికి తెలిసి ఉండదు. ఒకప్పుడిది USSR కు అనుబంధ దేశముగా ఉండేది. అందులో ‘బకు’ అన్నది ఒక ఊరు. ఆ ఊరికి చెందిన ఆ భక్తురాలు మార్చుకున్న పేరే పాద సేవనం. పాదముల సేవించుట అన్నది ఈ మాట యొక్క అర్థము అన్న విషయము నేను ప్రత్యేకముగా మీకు తెలుప నవసరము లేదు. ఎవరి పాదములు అంటే బాలగోపాలుని పాదములు.
అసలు ఎక్కడో మారు మూల ఉన్న ఆమెకు ఈ భక్తి ఏవిధముగా అబ్బిందబ్బా అనుకొంటున్నారేమో!
ఒకానొక పర్యాయము ఒక కృష్ణ భక్తుడు భక్తి వేదాంత శ్రీల ప్రభుపాద స్వాములవారు వ్రాసిన భగవద్గీత పుస్తకము ఆమెకు ఇవ్వటము జరిగింది. ఆసాంతము ఆమె దానిని చదివిన పిమ్మట అర్థమైపోయింది అది ఒకసారి చదివి ముగించే పుస్తకము కాదు నిత్య పారాయణము చేయవలసినది అని. ఆమె పిల్లలంతా సంపాదకులై ఎవరి దారిన వారు పోగా ఆమె ఒంటరిగా ఇంట్లో ఉండేది. తన పని ముగిసిన వెంటనే ఆమె భగవద్గీతను పారాయణము చేస్తూ వుండి పోయేది. ఆమె వయసు 74 సంవత్సరములు అప్పటికి. పుస్తకము పై ISCON వారి చిరునామా ఉడుటచే  బకు లోని ఆ గుడిని చేరుకొంది తన జీవితములో మొదటిసారి. అతిథులు కూర్చునే చోట ఆమెను కూడా కూర్చుండజేసి  ఇంకా కొందరు అతిథులను చేరబిలుచుటకు పోయినాడు కార్య కర్త. క్షణము ఆలస్యము లేకుండా తాను భగవద్గీత అధ్యాయాలలో గుర్తులుంచుకొన్న పుటలలోని శ్లోకములను రసవత్తరముగా తనతోబాటూ వున్న భక్త బృందమునకు తనదైన శైలిలో చెప్పుట మొదలుపెట్టినది. ఆశ్చర్యపోయినారు ISCON అంతేవాసులు. ఆమెతో కూర్చొన్నవారు ఆమె వాక్ ఝరి లో ఓలలాడుట  ISCON సదస్యులు గమనించి అచ్చెరువందినారు.
గుడికి వచ్చుట ఆమె నిత్య విధి అయిపోయినది. ఒకరోజు ఆమె అచటి ISCON పెద్దలతో తాను నివసించే తన స్వంత భవనమును అమ్మి ISCON కు ఇచ్చి వేస్తానని చెబుతూ అందుకు ప్రతిగా తన నిత్య నైమిత్తిక అవసరాలకు అనువుగా వుండే విధముగా ఒక్క గదిని తనకు గుడిని ఆనుకొని ఏర్పాటు చేయమని అడిగినది. తర్జన భర్జనల తరువాత ఆమె సరేననడమూ జరిగినది. కాలక్రమేణ ఆమె అచట చేరుటయే కాక అచట తులసి తోటను పెంచింది. వచ్చిన భక్తులకు కృష్ణ తత్వోపదేశములోనే కాలము గడిపేది. రాజకీయములకు ఆమె బహుదూరము. 1974 లో ISCON లో భక్తి వేదాంత స్వామి గురుత్వములో చేరిన రోహిణీ సుత ప్రభు
తన పర్యటన లోని భాగముగా బకు వచ్చినపుడు ఆ మహానీయురాలికి పాద సేవనం  అన్న పేరు పెట్టుట జరిగినది. అది మొదలు ఆమె పేరు అందరూ మరచిపోయినారు. తన కృష్ణ భక్తియే తన లక్ష్యము అన్యము నిర్లక్ష్యమే! చతుర్విధ పురుషార్థములలో అత్యున్నతమైనది మోక్షము. దీనిని ఇంకా అనేక నామములతో పిలుస్తారు. అవి ఏవంటే ముక్తి, విముక్తి, కైవల్యము, నిర్వాణము, వర్గము, నివృత్తి, నిశ్రేయసము, పరమగతి, పరమపదము, అని మనము చెప్పుకోవచ్చు.
ముక్తి త్రయం అనే మూడు పదాలు ఉన్నాయి. అవి : క్రమ ముక్తి, జీవన్ముక్తి, విదేహ ముక్తి. ఇది నాలుగు విధములుగా  కూడా చెప్పబడినది. వానిని ముక్తి చతుష్టయము అని అంటారు. అవి సామీప్యము, సాలోక్యము, సారూప్యము, సాయుజ్యము.
మోక్ష మార్గం - కర్తృత్వ భావన లేకుండా కర్మలను చేసి, సర్వ ప్రాణుల పట్ల దయగా వ్యవహరిస్తూ, సాధన చతుష్టయాన్ని అనుసరించే వారు మోక్షాన్ని సాధిస్తారు. అర్చిరాది మార్గాలతో వీరికి పనిలేదు. ఈ మార్గాన్నే విదేహ కైవల్య మార్గమనీ అంటారు. దీనికి ఆలంబనము భక్తి. ఈ భక్తిని తొమ్మిది విధములుగా విభజించినారు. అవి
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం
ఈ మహా భక్తురాలు నా ఊహ ప్రకారము అటు సాలోక్య మార్గమును ఇటు సఖ్యము మరియు ఆత్మ నివేదనమును ఆశ్రయించినది. ఒక రోజున ఒక అనార్ద్ర ఘటము (Dry Cell) తో నడిచే ఒక బొమ్మ తేరు (Car) ను తెచ్చి ఆమె అందులో తన బాలకృష్ణుని కూర్చుండ బెట్టుకొని తన శక్తి మేరకు ఆ చుట్టుప్రక్కల త్రిప్పుతూ వుండినది. భక్తులు ఆమెను అడిగితే ఆమె చెప్పిన జవాబు ఏమిటంటే నా కృష్ణుడు పసి బాలుడు. తానూ ఆటలాడుకోవాలంటాడు కదా! కారులో త్రిప్పమని నన్నడిగినాడు. త్రిప్పుతూ వున్నాను. ఆమె కృష్ణుని కోసం మంచము వాల్చి పక్క వేసి యుంచేది. ఆమె చేసే ఏపనీ చూపరులకు కొంత చిత్రముగానే వుండేది.
ఆమె ప్రవర్తన ఎంతసేపూ కృష్ణుడు తన కొడుకో మనుమడూ అయినట్లు ఆయన బాగోగులు తానే చూసుకోనవలసినట్లు తలచేది. ఒకరోజు అక్కడ వుండే తనకు కాస్త ఎక్కువగా పరిచయము వున్న వారితో ఈ విధముగా చెప్పింది. “నాకు నా కృష్ణుడు రాత్రి కలలో కనిపించినాడు. నన్ను అహోబళం పొమ్మని నా కృష్ణుడు నన్ను ఆదేశించినాడు. అక్కడ ‘వీర నరసింహుడు’ నిర్జన కీకారణ్యము’ లో వారానికి ఒక రోజు పూజతో వుండిపోతునాడట.” ఎక్కడి అహోబళము ఎక్కడి అజర్ బైజాన్. 74 సంవత్సరముల పండు ముసలి ఆమె, చేరవలసినది పులులు సింహాలు పాములు తేళ్ళు విరివిగా వుండే కీకారణ్యము. పరమాత్మ ఆదేశము ముందు వయసు, దూరము, కష్టము, భయము, నిస్సహాయత ఏవీ ఆమెను నిలుపలేక పోయినాయి. ఆమె అనుచరులు ‘నీవు కృష్ణ భక్తురాలివి కదా బృందావనము నిన్ను క్షేమముగా పంపుతాము నీ జీవితాంతము అక్కడనే వుండు” అని ఎంతగానో బుజ్జగించి చెప్పినారు. “కృష్ణుడు ఇది చెప్పినాడు కానీ అదెందుకు చెప్పలేదు” అని ఎదురు ప్రశ్న వేసింది. “వారు నీవద్ద డబ్బులేక టిక్కట్టుకే యిక్కట్టు పడుతూ ఉన్నావే మరి ఆ అడవిలో నీకు వసతి భోజనము ఏలాగు” అని ఎదురు ప్రశ్న వేసినారు.  మరి ఆమె అన్నది “ఆ విషయము నా కృష్ణునికి తెలియదంటారా” అని. వారి నోటికి తాళము పడింది. 
ఎట్టకేలకు ఆమె ప్రయాణమునకు అన్నీ సిద్ధము చేసినారు. హైదరాబాదు లో విమానము దిగగానే అహోబళము పోవుటకు ఏర్పాటు జరిగి పోయినది. ముందు నేరుగా పూజారిగారి ఇంటికి పొమ్మన్నది ఆమె. పరిచయము అయిన పిదప ఆయనే ఆమెను  ఆమెతో వచ్చిన ఒకరిద్దరిని తన వెంట పిలుచుకు పోయినాడు. ఆమెకు ఒక గుడ్డి లేక బుడ్డి దీపము, దీనిని పలుచటి ఇనుపరేకుతో కిరోసిను పోయుటకు వీలుగా చేసి అందులో కిరోసిను పోసి పాత బట్ట పొడవుగా ఒక తాడులా తయారుచేసి దానిని వత్తిగా ఆ చిన్న డబ్బీ లోనికి జొనిపి పైకి కొద్దిగా కనిపించు విధముగా వుంచి దానిని వెలిగించేవారు, ఏర్పాటు చేసి వెళ్ళిపోయినారు. ఆ రోజుకు ఆమె గుడిలోనే, ఉన్న మేరకే తల దాచుకొనింది. తెల్లవారిన పిదప దగ్గర వూర్లలోని జనము వచ్చి ఆమెకు ఎండుటాకులతో  బస ఏర్పాటు చేసినారు.
అంత ముసలావిడ అక్కడ వుండగా లేనిది నేనెందుకు నిత్య పూజనము చేసి నిత్య నైవేద్యము పెట్టకూడదనుకొన్నాడు పూజారి. రాను-రాను భక్తుల రద్దీ పెరిగింది. విషయము అప్పటి ఆంధ్ర రాజధాని హైదరాబాదు వరకు ప్రాకింది. అప్పటి గవర్నరుగారే వచ్చి అక్కడ జరిగిన పురోగతి గాంచి అబ్బురపడి, ఆమె పాదములకు నమస్కరించి ఆ ప్రదేశములో చేయవలసిన మిగతా ఏర్పాట్లు చేయించుటను తన బాధ్యతగా తీసుకొని వెడలిపోయినాడు.
ఒక రోజు ఆమెను పాము కరచింది. ఆమె ఏ మాత్రము భీతి చెందక నారశింహుని వద్దకు పోయి “నేను చేయవలసినది ఇంకా ఏమయినా వుంటే భూమిపై నన్ను వుంచు, లేకుంటే నీలో చేర్చుకో” అంది. స్వామికి ఆమె ఇంకా జీవించ వలసినది ఉన్నదీ అని అనిపించిందేమో, ఏ మందు మాకు లేకుండానే ఆమె జీవించి స్వామీ సేవలో జీవితము గడిపింది. ఆమె తన కృష్ణుని ఎన్నడూ మరచినది లేదు. ఉదయాత్పూర్వమే లేచి నిత్య కర్మలను ముగించుకొని తన బాల కృష్ణుని నారశింహుని గుడికి ఆనుకొని యుండే తన పాకలో ఒక Plastic chair లో కూర్చొబెట్టి  తనదయిన రీతిలో కోలుచుతూ వుండేది. ఉదయమే భగద్దర్శనమునకు వచ్చిన భక్తులు ఆమెను సందర్శించి మ్రొక్కి నరశింహుని చూడబోయే వారు. ఆరోజు దైవ దర్శనమునకు మొదటిగా వచ్చిన ఒక స్త్రీ పాదసేవనము తలుపు తెరిచి చూస్తే ఆమె తన బాలకృష్ణుని కౌగలించుకొని స్థాణువులా వుంది యుండినది . ఆ పరమ భక్తురాలిని కదిలించిన పిదప గాని, ఆ స్త్రీ కి అర్థము కాలేదు, ఆమె బాలకృష్ణుని లో లీనమైపోయినదని.
స్వస్తి.


Friday, 13 January 2017

దాయం- దానం

దాయం- దానం
దాయం - అంటే ఇవ్వబడినది. దానం అంటే ఇచ్చేది. దానికి సం, ప్ర అనే ఉపసర్గలు చేరిస్తే సంప్రదాయం వస్తుంది. మనకు లభించిన ఉత్కృష్టమైన ఆస్తి. (A legacy, a tradition received as precious ancestral property) సాంప్రదాయం అంటే. కాలానుగుణంగా లేని ప్రతి ఆచారము అనికాదు సాంప్రదాయము యొక్క అర్థము. ఒక్క మాటలో చెప్పవలసి వస్తే వజ్రము సంప్రదాయము, అంతేకానీ అదిపెట్టిన పాత అట్టపెట్టె కాదు.

***********************************************************************************************************************
విమర్శ, ఆక్షేపణ, నింద, ఖండన, సమీక్ష , అనంగీగారం, అభిశంసన, గద్దించు, దూషించు, అసమ్మతి; ఈ పదాల్లో సునిశితమైన అంతరాన్ని గుర్తించడానికి కూడా ఒక స్థాయి కావాలి.

వాతాపి గణపతిం భజే -- ముత్తుస్వామి దీక్షితులవారు


     వాతాపి గణపతిం భజే






కర్ణాటక రాష్ట్రంలోని బాగల్కోట్ జిల్లాలో ఉన్నది బాదామి. బాదామి గుహాలయములకు ప్రసిద్ధి. 

ఈ గుహలు భారతీయ శిల్పకళకు ప్రతీకలుగా నిలుస్తాయి. ముఖ్యంగా ఈ గుహాలయాలు, 

బాదామీ చాళుక్య నిర్మాణశైలిలో నిర్మింపబడిన, 6వ శతాబ్దం కాలంనాటివి. పూర్వము వాతాపి 

అనే ప్రాంతము బాదామిగా సుపరిచితము. ఇది కర్ణాటక రాష్ట్రంలో 6వ శతాబ్దం నుండి 8వ 

శతాబ్దం మధ్య కాలంలో విలసిల్లిన చాళుక్య సామ్రాజ్యానికి ముఖ్యపట్టణంగా ఉండేది.

బాదామి క్షేత్రం బీజాపూర్‌ నుంచి హుబ్లీ వెళ్లే దారిలో ఉంది. ఇక బాదామి  విశిష్ఠత గురించి 

చెప్పవలెనంటే ఇచ్చటి గుహాలయాలు మనదేశములో మాత్రమే కాదు, ప్రపంచంలోనే 

ప్రసిద్ధమయినవి.  ఎర్రని రాతితో ఉండే ఈ గుహలు చూపరులను ఆకర్షిస్తాయి. ప్రసిద్ధ 

పర్యాటక క్షేత్రంగా పేరు పొందిన ఈ ప్రదేశం ఒకప్పుడు తూర్పు చాళుక్యులకు నివాస స్థలం. 

చాళుక్యుల శిల్పకళాభిరుచికి ఈ గుహలు చక్కని ఉదాహరణ. గణపతి, నటరాజస్వామి, 

మహిషాసుర మర్దిని, నెమలి వాహనంపై కుమారస్వామి, విష్ణుమూర్తి శిల్పాలు మనోహరంగా 

ఉంటాయి. ఈ వాతాపి గణపతిని గూర్చిన ముత్తుస్వామి దీక్షితులవారి ‘వాతాపి గణపతిం 

భజే’ అన్న ‘హంసధ్వని రాగము’ లోని కీర్తన అత్యంత లోకఖ్యాతి గాంచినది.


కర్ణాటక సంగీత త్రయంలో ఒకరైన శ్రీ ముత్తుస్వామి దీక్షితులవారు తిరువారూరులో 

జన్మించినారు. వారి పూర్వులు మన రాజమహేంద్రి ప్రాంతము నుండి వలసపోయి 

ఉండినారని విన్నాను. వీరు కర్నాటక సంగీత త్రిమూర్తులు 1. శ్యామశాస్త్రి, 2. త్యాగరాజు, 3. 

ముత్తుస్వామి దీక్షితులు, ఈ ముగ్గురిలో చివరివారు. పైపెచ్చు శ్యామాశాస్త్రి గారి శిష్యులు. 

మరియొక విడ్డూరమయిన విషయము ఏమిటంటే నేను వ్రాసిన క్రమములో ఈ ముగ్గురికీ 

మధ్యన ఇంచుమించు 10 సంవత్సరముల అంతరము. అలనాటి వాతాపి నుండి గణపతి 

విగ్రహాన్ని పల్లవులు చాళుక్యుల పై సాధించిన విజయానికి ప్రతీకగా తిరువారూరు తరలించి 

అచట ప్రతిష్టించినారని చరిత్ర కథనం. ముత్తుస్వామి గారు షోడశ (పదహారు) గణపతి 

కృతులను వ్రాసినారు. అందులో ఒకటి హంసధ్వని రాగంలో బాణీ కట్టిన "వాతాపి గణపతిం 

భజే". ఈ రాగం యొక్క సృజన కర్త ముత్తుస్వామి గారి తండ్రి గారైన శ్రీ రామస్వామి 

దీక్షితులవారు.  అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ కీర్తనను ఒకసారి చిత్తగించండి.

పల్లవి

వాతాపి గణ పతిం భజే(అ)హం వారణాస్యం వరప్రదం శ్రీ

భూతాది సంసేవిత చరణం భూత భౌతిక ప్రపంచ భరణం

వీత రాగిణం వినత యోగినం విశ్వ కారణం విఘ్న వారణం

చరణము

పురా కుంభసంభవ మునివర ప్రపూజితం త్రికోణ మధ్యగతమ్

మురారి ప్రముఖాద్యుపాసితం మూలాధార క్షేత్ర స్థితమ్

పరాది చత్వారి వాగాత్మకం ప్రణవ స్వరూప వక్ర తుండమ్

నిరంతరం నిటల* చంద్ర ఖండం నిజ వామకర విధృతేక్షు దండమ్

కరాంబుజపాశ బీజాపూరం కలుష విదూరం భూతాకారమ్

హరాది గురు గుహ తోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబమ్

తాత్పర్యం: కృతి కర్త యైన శ్రీ ముత్తు స్వామి దీక్షితులవారు ఈ విధముగా అంటున్నారు: నేను 

వాతాపి గణపతిని పూజించుచున్నాను. గజ ముఖుడైన, వరాలను ఇచ్చే గణపతిని 

పూజించుచున్నాను. విషయ వాంఛలకు అతీతమై, యోగులచే కొలువబడి, జగత్కారణమై, 

అడ్డంకులను తొలగించే గణపతి పాదములను ఈ జగత్తున వ్యాపించి యున్న సమస్త 

భూతములు, ఆత్మలు, జీవాత్మలు సేవించుకొనును, అట్టి గణాధిపతిని సేవించుచున్నాను.

మూలాధార చక్రము నందు స్థిరమై, అందున్న త్రికోణ మధ్య స్థానమందు వసించు 

గణపతీ! నిన్ను మునుపటి అగస్త్యుల వంటి ముని శ్రేష్ఠులు, విష్ణువు మొదలయిన ప్రసిద్ధులైన 

దేవతలు పూజించుచున్నారు. పర, పశ్యతి, మధ్యమ వైఖరి  అను నాలుగు విధములైన 

శబ్దములతో కూడి జనించిన ప్రణవ నాదమైన ఓంకారము వలె నీ వంపు తిరిగిన 

తొండము గోచరిస్తోంది. నీవెల్లప్పుడు ఫాలభాగమున చంద్రకళను ధరించి, నీ ఎడమచేత 

బలమైన చెరకుగడను దాల్చి అగుపిస్తావు. అంతే కాక తల్లియైన పార్వతికి ప్రియ పుత్రుడవైన 

నీవుచేతులలో పద్మము, పాశము, దానిమ్మ పండు ధరించి, భక్తుల పాపాలను తొలగిస్తావు. 

శివుడు, షణ్ముఖుడు, మొదలయినవారిచే కొలువబడి హంసధ్వని రాగమును భూషణముగా, 

అమ్మ అయినపార్వతికి ప్రియ పుత్రునిగా గణపతీ నీవు ఒప్పుచున్నావు.

అట్టి వాతాపి గణపతికి మనము కూడా నమస్కరించుదాము. 

1835 దీపావళి దినమున సంధ్యావందన పూజాదికములను ముగించి తన శిష్యులతో 

'గమకక్రియ' రాగములో 'మీనాక్షి మే ముదం' అన్న కీర్తనను ఆలపించమని చెప్పి, వారా 

విధముగా ఆలపించుచుండగా చరణములోని "మీన లోచనీ పాశమోచనీ'' అన్న పదములు 

పాటలో వచ్చినపుడు రెండు చేతులూ పైకెత్తి 'శివే పాహి' అని అంటూ కైలాస పదం 

చేరుకొన్నారు. 

వారి సమాధిని తమిళనాడు ఎట్టయాపురం ( మహాకవి సుబ్రహ్మణ్య భారతి పుట్టిన వూరు) 

లో చూడవచ్చు. ఇది కోయిల్పట్టి టూటికోరిన్ ల నడుమ వుంది.



స్వస్తి.


i