Showing posts with label వాస్తవము. ఈ వాస్తవమును చదవండి. Show all posts
Showing posts with label వాస్తవము. ఈ వాస్తవమును చదవండి. Show all posts

Sunday, 23 July 2017

భారవి – సహసా విదధీత నక్రియా

భారవి – సహసా విదధీత నక్రియా

https://cherukuramamohan.blogspot.com/2017/07/blog-post_23.html
భారవి దక్షిణభారత దేశానికి చెందినవాడు. పశ్చిమ గంగ సామ్రాజ్యము నకు చెందిన దుర్వినిత మరియు పల్లవ రాజైన సింహవిష్ణు కాలంలో ఈ కావ్యరచన గావించినట్లు తెలియవస్తూ వుంది. చాలా మంది సంస్కృత కవులవలెనే  భారవి జీవిత విశేషాల గురించి కూడా చాలా కొద్ది సమాచారం మాత్రమే లభ్యమవుతోంది. క్రీ.పూ 634 సంవత్సరానికి చెందిన చాళుక్యుల శాసనంలో కాళిదాసు మరియు భారవి పేరు పొందిన కవులుగా పేర్కొన్నారు. 8వ శతాబ్దానికి చెందిన మాఘ కవి, భారవిచే ప్రభావితుడయినాడని ప్రతీతి. దురద్ర్ష్టకరమగు విషయమేమిటంటే భారవి  రచనల్లో మనకు కిరాతార్జునీయం మాత్రమే లభ్యమవుతూ వుంది. 'ఏకోపి గుణవాన్ పుత్రః నిర్గుణైన శతిరపి' అన్నట్లు భారవి ఒక్క కావ్యంతోనే ప్రఖ్యాతి గాంచినాడు.
కిరాతార్జునీయమునకు తెలఘాణ్యమునకు చెందిన మల్లినాథ సూరి గారు ఘంటాపథ వ్యాఖ్యానము వ్రాసినారు.
కిరాతార్జునీయమునండలి ఈ శ్లోకము సుప్రసిద్దము. ఒక పర్యాయము ఈ కతనమును ఆసాంతమూ చదవండి.
శ్లో. సహసా విదధీత న క్రియా

మవివేకః పరమాపదాం పదం

వృణుతే హి విమృశ్యకారిణం


గుణలుబ్ధా స్స్వయమేవ సంపదః - 
  
సంస్కృత సాహిత్యంలో భారవిది తిరుగులేని స్థానం. అతని కవిత్వంలో ఉండే గొప్పదనం" భారవే రర్ధగౌరవమ్" అనేయీప్రసిధ్ధివల్ల తెలుపబడుతోంది. అంటే ,చాలాఅర్ధవంతంగా కవిత్వం చెపుతాడని భావం! పైశ్లోకం యితని కిరాతార్జునీయం కావ్యమ్ లోనిది.
పాండవులు అరణ్యవాసంలోఉన్నారు. అరణ్య, అజ్ఙాత వాసాలుముగిసినా సుయోధనుడు తమరాజ్యం తిరిగి యిస్తాడనేృనమ్మకంలేదు. అందువల్ల తమప్రయత్నంలో తాము ఉండటం మంచిదని కార్యాచరణగురించి సమావేశమయ్యారు. అప్పుడు ద్రౌపది వారితో అన్నమాటలు ఈశ్లోకంలో ఉన్నాయి.
“ఏపనిచేసినా చాలాజాగ్రత్తగా ఆలోచించి చెయ్యాలి. తొందరపాటు పనికి రాదు. అవివేకం అనేక కష్టనష్టాలకు మూలం. బాగాఆలోచించి కార్యనిర్వహణమునకు పూనుకొనే వివేక వంతుని సద్గుణములయందు ప్రీతిగల సంపదలు స్వయముగా తామేవచ్చి వరించునుగదా"- అంటున్నది.
ద్రౌపదిని కేవలం స్త్రీగాభావించి తక్కువ చేయరాదు. ఆమెనీతిశాస్త్ర విశారద.చక్కని నైతికోపదేశముచేసింది. దీనివెనుక నేపధ్యముగా కవికి సంబంధించిన యొక కథ వినవచ్చుచున్నది.
భారవి మహాపండితుడైనను, లోకులకడ నాతని పాండిత్యమును భారవి తండ్రి మెచ్చెడివాడుగాదట! "ఆపోదురూ వాడేంపండితుడు?వట్టి కుర్రకుంక" యని చెప్పుచుండెనట. ఆమాటలు భారవికి మనోవేదన గలిగింప యెటులైన తండ్రిని మడియింప వలసినదేయను ధృఢసంకల్పమును గైకొనెను.
పాతకాలంలో ప్రతియింట వంటింటిలో పైన సామానులుభద్ర పరుచుటకు అటకలు ఉండెడివి. తండ్రిని జంపనెంచి కవిగారు అటకనెక్కి నక్కి కూర్చున్నాడు. చేతిలోనొక పెద్ద రుబ్బురాయి ఉన్నది. దానితోతండ్రిపని పూర్తిచేయ నాతనితలంపు.భోజన సమయమునకు ఆతనితండ్రివచ్చి వంగదిలో పీటపై కూర్చున్నాడు.భారవితల్లి యతనికి వడ్డన చేయుచు"మీరు పదేపదే భారవిని అవమానించుట తగునా? వాడెంతో కుమిలిపోవుచున్నాడో మీకుతెలియునా? యికనైన మానుకొనుడ"న, భారవితండ్రి 
"పిచ్చిదానా! నేనెరుగనా వాడి పాండిత్యము? అట్టిసత్పుత్రుడు జన్మించుట మనయదృష్టముగదా! అయినను వాడి యెదుట వాని పాండిత్యమును పొగడరాదు. అట్లుచేసిన గర్వపరుడై యహంకారమున జెడిపోవును. నామాట నమ్ముము. మనవాడు గొప్పపండితుడేకాడు గొప్ప కవి కూడా! అందులో సందేహమేలేదు." అనిపలికెను. అందుకే పెద్దలు ఈ విధముగా తెల్పినారు అని ఈ మాటను భార్యకు తెలియబరచినాడు:
ప్రత్యక్షే గురవః స్తుత్యా
పరోక్షే మిత్రబాన్ధవాః
కార్యాన్తే దాస భృత్యస్య
పుత్రఃస్తుత్య కదాచన
గురువులను ప్రత్యక్షముగా పొగడవలెను. బంధుమిత్రులను పరోక్షమున

పొగడవలెను. కార్యము ముగిసిన పిమ్మట దాస దాసీ జనములను పొగడవలెను. కానీ సంతానమును మాత్య్రము ఎప్పుడూ పొగడరాదు.
ఆమాటలువిని పశ్చాత్తప్తుడై యటక దిగివచ్చి తండ్రి కాళ్ళపై బడి క్షమింపగోరెనట! అంతేగాక అందుకు తగిన శిక్షను ఇచ్చితీరవలేనని కోరెనట.
ఫరవాలేదని అన్నా వదల లేదు. ఇక మార్గాంతరములేక ఆయన పుత్రునితో భార్యా సమేతముగా ఒక ఆరు నెలల కాలము ఆత్తగార్తింట్లో ఉండమన్నాడు.
ఇదికూడా శిక్షేనా అని మది తలచి తండ్రిని ఇంతకన్నా పెద్ద శిక్ష వేయం,అని కోరినాడట. తండ్రి “ ముందు దీనిని అనుభవించిరా! ఆపిడప నీవు నీకీశిక్ష చాలలేదు అనిపిస్తే అప్పుడు నీకు ఇంతకు మించినది విధిస్తా” నన్నాడట. వల్లెయని  భారవి తన భార్య చారుమతితో‌, మావఁగారు  అన్నంభట్టు ఇంటికి చేరుకున్నాడు.  అంతా మహామర్యాద చేసినారు. తమ ఊళ్ళో భారవి పేరు గొప్పగా  మారుమోగుతోందో తమకు ఎంత గర్వంగా ఉందో‌ పస్దేపడే చెప్పినారు. భారవికి సంతోషం‌ కలిగింది. రోజులు గడవటంతో మెల్లగా మర్యాదలు మాయమైనాయి. అల్లుడుగారి రాకకు కారణం అడిగితే సమాధానం లేదు. మామతో సహా ఇంటిల్లపాదీ చీదరించుకోవటం మొదలుపెట్టినారు. మెల్లగా పొలంపనులతో సహా అన్నిపనులూ వారు అప్పగించ మొదలుపెట్టినారు. భారవికి తండ్రిగారు వేసిన శిక్ష యొక్క అంతరార్థము తెలియవచ్చింది.
ఒకరోజున చారుమతి ఎప్పటి లాగానే పొలానికి అన్నం తీసుకొని వచ్చి, కళ్ళనిండా నీళ్ళునింపుకొని భర్తతో “ నా పరిస్థితి దినదినానికీ చౌకబారిపోతూ వుంది. రేపు వరలక్ష్మీవ్రతము చేసుకొనే యోగము నాకున్నట్లు లేదు. వదినలు ఏర్పాట్లు వైభవంగా చేసుకుంటున్నారు. నా చేతిలో చిల్లిగవ్వ లేదు. ణా బతుకునకు కనీసం‌ కొత్తచీరైనా లేదు కదా!” అని వాపోయింది.  భారవి ఆమె బాధను అర్థము చేసుకొన్నవాడై  కొంచెం ఆలోచించి చిరునవ్వుతో‌ "ఈ వూళ్ళో వరహాలసెట్టి నా మిత్రుడని నీకూ‌ తెలుసు కదా. ఇదిగో‌ ఈ‌ శ్లోకం అతనివద్ద తాకట్టు పెట్టి అతడిని అడిగి డబ్బు తీసుకొని కావలసిన  సరకులు తెచ్చుకో తరువాత ఆ అప్పును నేను తీర్చుతాను” అన్నాడు.
వరహాల సెట్టి ఆమె చెప్పినది సాంతము విని శ్లోకాన్ని కళ్ళకద్దుకుని, " రేపుండే వాణ్ణి కాదు ఊళ్ళో. కావలసినంత తీసుకోండి. తాకట్టు పెరుతోనయినా ఆయన వ్రాసిన శ్లోకమును నావద్ద ఉంచుకొనే అదృష్టానికి నోచుకొంటాను" అన్నాడు. వరలక్ష్మీ వ్రతం బ్రహ్మాండంగా చేసుకుంది చారుమతి. వదినలకూ‌ అన్నలకూ‌ మరి నోట మాట రాలేదు.  వరహాలసెట్టి దేశంతర సముద్రయానమునకు వెళ్ళిపోయినాడు. ఆరు నెలల కాలము ముగిసిన పిమ్మట భారవి దంపతులు ఉన్నవిషయమును ఇంట్లో తెలియజేస్తే వారెంతో శిగ్గుచేంది క్షమాపననర్తించి ఉచిత మర్యాదలతో వారిని సాగనంపినారు.

వరహాల శెట్టి సముద్రవ్యాపారంలో ఓడమునిగి ఎన్నో ఇబ్బందులుపడి వూరు చేరుకొన్నాడు. పూర్తిగా చీకటి పడింది. ఇద్దరూ ఒకరినొకరు చూచుకొని ఆనందాతిశయమును అనుభవించినారు కానీ  ఇంట్లో ఎవడో నవయువకుడు మ్+అంచముపై పడుకొని యున్నది గమనించి ఆవేశం‌ అణచుకోలేక తనతో తీసుకుపోయిన పెట్టెలో వున్న బాకును  తటాలున బయటకు లాగినాడు. ఒరతో సహా పట్టుబట్టలో చుట్టి యున్న ఏదో తాళపత్రం బయట పడింది. దాన్ని తీసి చదివినాడు అంత ఆదుర్దాలో కూడా! అందులో ఆయనకు మనము పైన తెలిపిన శ్లోకమే కనిపించింది.
శ్లో: సహసా విదధీత న క్రియా
మవివేకః పర మాపదాం పదం
వృణుతేహి విమృశ్య కారిణో
గుణ లుబ్ధాః స్వయమేవ సంపదః!!
 
అంత కోపం లోనూ ఆ శ్లోకం భావం తలకెక్కింది శేట్టిగారికి. కేవలం సాహసించి యే పనయినా చేయరాదు. అవివేకం వలన అతిప్రమాదకరమైన ఆపదలు కలుగుతాయి. బాగా మంచీ చెడు విచారించి పనిచేయటం ఉత్తమం. అటువంటి గుణవంతులను సంపదలు స్వయంగా వచ్చి చేరుతాయి అని. వరహాల శెట్టి నెమ్మదించినాడు. వివరము కనుగొనిన తరువాతే కర్తవ్యమును  ఆలోచించవచ్చును అని శాంతించినాడు.

తెల్లవారింది. ఊరంతా అభినందనలు తెలుపుతూ వుంటే శేట్టిగారికి మాత్రము కోపము కట్టలు తెంచుకొని వస్తూ వుండినది. అంతం+అంది సమక్షములో ఏమీ అనలేక నిలబడిన అతని వద్దకు ఆ యువకునితెచ్చి శెట్టిగారిభార్య “ఈయనే మీతండ్రి. ఆయన సముద్రయానము చేయబోవు సమయమునకు నిన్ను కడుపులో మోస్తూ వుండినాను. ఆయనకు పాదములంటి నమస్కరించ”మని చెప్పింది.  విషయం అర్థమయిన శెట్టి ఎంత ప్రమాదం తప్పిందీ! ఆ శ్లోకం రక్షించకపోతే ఇంకేమన్నా ఉందా! అనుకున్నాడు. విషయమును వివరముగా భార్యతో చెప్పినాడు. అంతటితో ఆగక భారవి దంపతులను ఎంతో మర్యాదగా తమ వూరికి రప్పించి కనకాభిషేకము చేయించి తన కృతజ్ఞత చాటుకొన్నాడు. భారవి ఇచ్చిన డబ్బు తీసుకొనక ఆయనకు ధనకనక వస్తువాహనములనిచ్చి సగౌరవముగా వారిని వారి వూరికి పంపినాడు.
మానవతా విలువను ఒకసారి గమనించండి. ఎదుటి మనిషిని, కంటి చూపు సాక్ష్యాధారముగా కొని దండించరాదు అని తెలియుట లేదా! చూచినారుకదా! ఆలోచన మనిషియావేశము నరికట్టినది. అనర్థము జరుగ కుండా కాపాడినది. కాబట్టి మీరందరూ బాగాయోచించి పనులు చేస్తూ ఉండుట అన్నది ఇందలిఉపదేశము.
మన కావ్యాలను  చదివితే ఎటువంటి HR TRAINING PROGRAMMES కు పోవలసిన అవసరము వుండదు.


స్వస్తి.