Showing posts with label మహనీయులు చెప్పిన వాస్తవాలను గ్రహించండి. చదివి కళ్ళుతెరిస్తే మంచిది.. Show all posts
Showing posts with label మహనీయులు చెప్పిన వాస్తవాలను గ్రహించండి. చదివి కళ్ళుతెరిస్తే మంచిది.. Show all posts

Monday, 4 July 2016

ఇది విశ్వనాథ వారి మాట

ఇది విశ్వనాథ వారి మాట

 https://cherukuramamohan.blogspot.com/2016/07/blog-post_79.html

"అనాదినుండి, అనగా నా చిన్నప్పటినుండి, ఇంగ్లీషువాడు నేర్పెడి వాని చరిత్ర మనచరిత్రలో పాఠ్యగ్రంధములుగా చదివినప్పటినుండి, Hindu Period అను పాఠ్యగ్రంధాలలో చెప్పబడే పరిమితపుటలు గల చరిత్ర చదివినప్పటినుండి, మన పురాణములు పుక్కిటికథలని మొదలైన ఎన్నో అబద్ధములు చరిత్రలో చదివి చదివి నాకు విసుగెట్టినది. తరువాత శ్రీ చిలుకూరు వీరభద్రరావుగారు, మల్లంపల్లి సోమశేఖరశర్మ గారు, భావరాజు కృష్ణారావు గారు, నేలటూరి వెంకటరమణయ్యగారు, ఈ మొదలైన చరిత్రపరిశోధకులతో నాకు మిక్కిలి దగ్గర తనమేర్పడినది. ఈ చరిత్ర గురించి నేనెంతయో నేర్చుకొంటిని. భారతయుద్ధము రెండువేల యేడ్లక్రింద జరిగినదనీ, రామాయణము కొంచెమించు మించుగా జరిగినదని చదువలేక , వినలేక నా బొమికెలు చిట్టెము కట్టెను. ఇట్లుండగా నేబదిఏండ్ల క్రిందనూ, అంతకుముందును, నర్సారావుపేటలో నడింపల్లి జగన్నాధరావుగారని ఒక వకీలు ' మహాభారత యుద్ధకాలము ' అను ఒక చిన్న గ్రంధము వ్రాసినాడు. అందులో సంస్కృత మహాభారతములో భీష్మ నిర్యాణ దినము - మకర సంక్రమణ దినము - విస్పష్టముగా చెప్పబడియున్నది. ఈ సంక్రాంతి ప్రతి సంవత్సరమును వచ్చును. అచ్చటినుండి లెక్క వేయబడినది.

ఒక పాతికేండ్ల క్రిందవరకు ఫ్రాన్సు దేశపు రాజధానియైన పారీస్ నగరములో నుండెడి గణిత శాస్త్రజ్ఞులు అఖండులు. వాళ్ళు లెక్కలు తేల్చి చూచిరి. విషయము రుజువు చేయబడినది. ఐదేండ్లకొకసారి సంవత్సర పరిమితి కొన్ని సెకండ్లో, ఒకటి రెండు నిముషాలో తగ్గుట ఖండకాల ప్రమాణస్వరూపము. ఒక ముప్పది ఏండ్లక్రిందినాటి ఈ లెక్క ప్రకారము చూడగా భీష్మ నిర్యాణ సమయమున మకరసంక్రమణమెప్పుడయినది?, 1937 సం||న మకర సంక్రమణ మెప్పుడు జరిగినది? ఈ జరిగిన దానికిని దానికిని మధ్య కాలమెంత ఉండినది? ఆకాలమును ఐదైదేండ్లకు కొన్ని కొన్ని సెకండ్లకు తగ్గెడికాలముతో విభజించెడిచో, భీష్మ నిర్యాణము జరిగి, మన పంచాంగములలో వ్రాయబడుచున్న మకర ప్రవేశమునకు, తత్పూర్యము నలుబది ఏండ్లకు పూర్వము మహాభారత యుధము జరిగినదనుటకు సరిపోవుచున్నది. దీనిని పారీస్ లోని మహాగణితశాస్త్రజ్ఞులంగీకరించిరి.

ఈ విషయమును గురించి తత్పూర్వమే మద్రాసులోని ఒక తమిళ పండితుడు, ప్లీడరు - ఆయనపేరు నారాయణయ్యర్ అనుకొందును - ఆయన ' శంకరుని కాలనిర్ణయ ' మను నొక గ్రంధము వ్రాసెను.

 పాశ్చత్య చరిత్రకారులు మన పురాణములందున్న విషయములన్నియు వాళ్ళ ఇష్టమువచ్చినట్లు మార్చివేసిరి. వారి మార్చినదానికి కారణములతో మనకవసరములేదు. ఈ పైన చెప్పిన లెక్కల ప్రకారము మనపురాణములలోనున్న రాజవంశములయొక్క కులములు సరిపోవుచున్నవి. ఇవికాక, మనదేశములోనే ' మగధ రాజ వంశావళి ', ' నేపాళరాజ వంశావళి ' మొదలైన పూర్వ గ్రంధములు కలవు. ఇవికాక కల్హణుని ' రాజతరంగిణి ' కలదు. మనకే చరిత్ర గ్రంధములు చాలాకలవు. విజయవాడలో శ్రీ కోట వెంకటాచలం గారని ఒక మహాపురుషుడు ఈ మహాపరిశోధన అంతయూ జేసి, ఆ నారయణయ్యర్ గారు ఈ జగన్నాధం పంతులుగారు చేసిన పరిశోధనలకు చెట్లు కట్టించి, పూయించి, కాయించి పండించిరి. ఆయన చాలా గొప్ప గ్రంధమ్ములు వ్రాసెను. వానికి ప్రశస్తి ఎందుకు రాలేదనిన మనము బానిస జాతి ఐపోయినాము గనుక.

ఈ మహావిషయాన్ని పురస్కరించుకొని ' పురాణవైర గ్రంధమాల ' అని పండ్రెండు నవలలు వ్రసాను. నేటి ఆంధ్ర చరిత్రనుబట్టి చూస్తే ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణుకుండినులు, ఇటువంటి పేర్లు, వాళ్ళు పాలించిన కొద్ది కొద్ది భూభాగాలు, శాసనములు --- ఈ రీతిగా మన యాంధ్ర చరిత్ర ధ్వంసమైపోయింది.

 భారతయుద్ధమైన తరవాత మగధ సామ్రాజ్యమున్నది. జరాసంధుని వంశమున్నది. గిరివ్రజము రాజధానిగా రెండువేల యేండ్లు మహాప్రభువులు భారతదేశమును సామ్రాజ్యముగా పరిపాలించిరి. అందులో ఆరువందల ఏండ్లు, ఆంధ్రులైన శాతవాహనులు గిరివ్రజము నుండి భారతదేశ సామ్రాజ్యమును నేలిరి. ' ద్రావిడభాషలయొక్క తరతమభేద నిరూపక వ్యాకరణ ' మని కార్డ్వెల్ దొర ఒక గ్రంధాన్ని వ్రాసాడు. పాపమా కార్డ్వెల్ శాసించలేదు. పండితులను విచారించమన్నాడు. మనదేశములో అది ప్రమాణగ్రంధమై పోయినది. పరిశోధనలు దానిమీదనే జరుగుచున్నవి. ఇట్టివి ఎన్నియున్నవి? అది వదలివేద్దాము. ఆ కార్డ్వెల్ ఆఫ్ఘన్ స్థానములో బ్రాహూయీ అను ఒక భాష ఉన్నదనీ, ఆ భాషకు మన తెలుగు భాషకు పలువిషయములయందు సామ్యమున్నదని వ్రాసినాడు. శాతవాహనులాంధ్రులు. వారు భారత సామ్రాజ్యమును పాలించినప్పుడు ఆయాప్రాంతములందరు ఆంధ్రులై ఉందురు. ఆనాటి ఆఫ్ఘన్ స్థానములో నెవ్వడో ఆంధ్రుడు అధిపతి ఐ, ఆ ఆటవికులచేత మన భాష చదివించియుండును. దీని లక్షణములు అక్కడ పాతుకు పోయినవి.

 మన చరిత్ర వేరే యున్నది. ఈ మగధరాజ్యము, మౌర్య చంద్రగుప్తుడు, తరవాత గుప్త రాజ్యము, గుప్త చంద్రగుప్తుడు, అలెగ్జాండర్ మనదేశము మీదికి దండెత్తివచ్చినది గుప్త చంద్రగుప్తుని కాలములో. మౌర్య చంద్రగుప్తుని కాలములో కాదు. మౌర్య చంద్రగుప్తునికాలములో నని 1200 ఏండ్లు పాశ్చాత్య చరిత్రకారులు మన చరిత్రను వెనుకకుతోసిరి. అంతదూరము పోనక్కరలేదు. శివాజీగురించి ఎన్ని అబద్ధములు వ్రాసిరి? కలకత్తా బ్లాక్ హోల్ అన్నది జరుగలేదని మనచరిత్ర కారులు రుజువు చేయగా, పాఠ్యగ్రంధముల నుండి తొలగించలేదు.

మన చరిత్ర విస్పష్టముగానున్నది. మన పురాణములయందలి మగధరాజ వంశాదులయందలి యధార్ధచరిత్ర ననుసంధించి నేను పురాణవైర గ్రంధమాలను పండెండ్రు నవలలను వ్రాసితిని. అందులో ' చంద్రగుప్తుని స్వప్న ' మన్న నవల గుప్త చంద్రగుప్త, మౌర్య చంద్రగుప్తుల భేదమును చెప్పును."

(ఈ భాగము శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు వ్రాసిన ' నేను - నా సాహిత్య రచనలు ' అనే వ్యాసం యువభారతి వారి ప్రచురణ, ' మహతి ' స్వతంత్ర్య యుగోదయం (1947-1972) లో తెలుగు తీరుతెన్నులు సమీక్ష వ్యాస సంకలనం నుండి గ్రహించబడినది)

స్వస్తి.