Showing posts with label ధర్మములో ఎన్నెన్ని వింతలో!. Show all posts
Showing posts with label ధర్మములో ఎన్నెన్ని వింతలో!. Show all posts

Monday, 11 December 2017

మానవులను రాళ్ళగా మార్చే కిరాడు దేవాలయ సముదాయములు

మానవులను రాళ్ళగా మార్చే కిరాడు దేవాలయ సముదాయములు 
https://cherukuramamohan.blogspot.com/2017/12/blog-post.html
కిరాడు దేవాలయ సముదాయముల గూర్చి తెలుసుకొనుటకు మనము ముందు రాజస్థాన్ రాష్ట్రము చేరవలసి యుంటుంది.
బర్మార్‌ జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో హాత్మ అన్న గ్రామము ఉంది. ఇక్కడ ఒక ఆలయముల సమూహము ఉంది. ఆధునిక కాలములో వీనిని కిరాడు ఆలయాలు అని అంటారు. ఈ ప్రాంతమునకు కిరాతకూ‌ప మన్న  పేరు ఉండేదట. కొందరు 'కిరాడ్ కోట' అనుట కూడా కద్దు. ఇచట ఒకే ప్రదేశంలో ఐదు దేవాలయాలు ఉన్నాయి. ఇందులో ఒకటి మాత్రమే వైష్ణవాలయము, మిగతా నాలుగూ శైవాలయములే. ఈ నాలుగు గుళ్లలో కూడా సోమేశ్వరాలయము ప్రధానమైనది. ఈ ఆలయములు అపురూప శిల్ప సంపదతో అలరించుతాయి. అందుకే కిరాడు ను 'రాజస్థాన్‌ ఖజురహో'గా పిలుస్తారు. . క్రీస్తుశకం 11,12, శతాబ్దములలో చాళుక్య రాజులు(సోలంకి) వీటిని నిర్మించినారని చరిత్రకారుల నిర్ణయము.
 దాదాపు వంద సంవత్సరముల వరకూ  వీటి వైభవం కొనసాగింది.  నేడు కిరాడు ఆలయాలను దర్శించుకోవడానికి వందలాది మంది పర్యాటకులు తరలివస్తుంటారు.  పర్యాటకులతో హాత్మ గ్రామ ప్రజలకు ఉపాధి కూడా బాగానే ఉంటుంది. గ్రామంలోని యువత 'Guides'గా పర్యాటకులకు సహకరించుతారు. వారి జీవనోపాధి ఇదే! అసుర సంధ్య కు అందరూ ఆ ప్రదేశము వదలి పోవలసిందే! పర్యాటకులు ఎవరైనా రాత్రిపూట ఆలయం అందాలు చూడాలని' అంటే  ఎంత డబ్బులిస్తామన్నా తోడు వచ్చేవారు ఉండరు. అందుకు కారణము ఏమిటో తెలుసుకొందాము.
అసుర సంధ్య దాటి రాత్రి గడిచే కొద్దీ వాతావరణం మారిపోతుంటుంది.  ఆలయ ప్రాంగణాలలో వింత వింత శబ్దాలు మొదలవుతాయి. ఏడుపులు, పెడబొబ్బలు వినిపిస్తాయి. అయినా మొండిగా రాత్రంతా అక్కడ వుండ ప్రయత్నిస్తే వారు శిలగా మారిపోతారు. ఇది నిజమా కాదా అని తెలుసుకొన దలచినా సహకరించే స్థానికులు ఎవరూ తోడురారు. ఎందుకంటే రాత్రి అక్కడ వుంటే   రాయిగా మారిపోతారని మాత్రం నేటికీ ఆ ప్రాంతపువాసుల, పరిచయస్తుల గట్టి నమ్మకము.

గ్రామస్తులు ఎంత చెప్పినా వినకుండా, ఒక పరిశోధకుల బృందము కిరాడు ఆలయాలకు వెళ్లిందట. తెల్లవారే సమయానికి వారు కనిపించలేదు. భయముతో జాగ్రత్త పడి పారిపోయినారా లేక రాళ్ళయిపోయినారా దేవునికే ఎరుక.

సంధ్యా సమయము దాటిన పిదప ఇచట  మనుషులు శిలలుగా మారడం వెనుక స్థానికంగా ఒక కథ ప్రచారంలో ఉంది. సుమారు ఎనిమిది వందల సంవత్సరాల కిందట, ఒక ఆధ్యాత్మిక గురువు తన శిష్యునితో కలిసి దేశ సంచారంలో భాగంగా హాత్మ గ్రామానికి రావటం జరిగింది. అక్కడి కిరాడు ఆలయంలో వాళ్లు కొన్నాళ్లు ఉన్నారు. ఆ ప్రాంతమునేలే సామంత రాజు పై మ్లేచ్ఛులు దండెత్తి రాగా ఎంతో నష్టపోయి చివరకు వారిని ఆ రాజు తరిమి కొట్టగలిగినాడు. వారు తిరిగీ దండయాత్ర చేస్తే నిలువరించగల శక్తి వారిలో సన్నగిల్లింది. రాజు ఆ గురువును ఆశ్రయించి పరిష్కార మార్గము ఉపదేశించమన్నాడు. అందుకు గురువు తన శిష్యుడు తపోదీక్షతో ఆ పని చేయగలడని చెబుతూ గురువు తాను వచ్చే వరకూ శిష్యుని  అక్కడే ఉండమని చెబూతూ, తన పనిమీద వెళ్ళినాడు. ఆ గురువు మళ్లీ కిరాడు ఆలయానికి వచ్చేసరికి శిష్యుని ద్వారా తెలుసుకొన్న వాస్తవమేమిటంటే ఒక్క కుమ్మరి స్త్రీ తప్ప ఆ శిష్యుడు అనారోగ్య వివశుదయినపుడు ఊరిని కాపాడే అతనికి ఎవరూ  సానుభూతి, సహకారము అందించలేదు. ఆమె రాత్రులు ఆతనికి ఒక తల్లిలాగా సేవ చేసింది.అంత గురువు ఆ స్త్రీని వెనుదిరిగి చూడకుండా వలస వెళ్ళమని చెప్పి
సాటి మనిషి ప్రాణం మీదకు వస్తే.. పట్టించుకోకుండా పాషాణములా వ్యవహరించిన ఆ వూరివారిని పాషాణములు కమ్మని శపించుతూ రాత్రి వేళల ఈ ఆలయంలోకి ఎవరు ప్రవేశించినా వారు పాషాణములై పోదురుగాకఅని శపించినాడు. ఆ మహిళ.. కొంత దూరం వెళ్ళిన పిదప మనసునణచుకోలేక  వెనుదిరిగి చూసిందట. అంతే, ఆమె కూడా అక్కడే శిలగా మారిపోయిందట. ఇప్పటికీ ఆమె విగ్రహం హాత్మ గ్రామశివారులో కనిపిస్తుంది. అప్పటి నుంచి కిరాడు ఆలయంలో రాత్రి వేళలో ఎవరూ ప్రవేశించరు.
ఇటువంటి అద్భుతములకు, మహాపురుషులకు పుట్టినిల్లు ఈ భూమి.
భారతమాతకు వందనములతో,

స్వస్తి.