రామ కృష్ణులను గూర్చి ఒకే శ్లోకములో
https://cherukuramamohan.blogspot.com/2023/09/blog-post.html
సంస్కృతము సకల ప్రపంచ భాషలకు తల్లి. ద్వ్యర్థి శ్లోకము అనగా
ఒకే శ్లోకము రెండు విధములగు అర్థములను కలిగియుంటాయి. ఈ విధముగా ఏపాశ్చాత్య భాషకు, అరబ్బీ, ఫారసీ కి సాధ్యము
కాదు. ఆ సంస్కృతానికి ముద్దుటాడుబిడ్డ కాబట్టి తెలుగునకు ఆ సుగుణమబ్బినది.
తెలుగులో వేములవాడ భీమకవి రాసినట్లుగా చెప్పబడే 'రాఘవ పాండవీయ'మన్న
ద్వ్యర్తికావ్యము పింగళి సూరన కాలమునకే అలభ్యము. కావున పింగళి సూరన వ్రాసిన 'రాఘవ పాండవీయ'మే మొదటి
ద్వ్యర్తికావ్యమౌతుంది.
రాఘవపాండవీయం క్లిష్టార్థములు లేకుండా మృదుమధుర సులభ
పదములతో రామాయణ భారతార్థములు వచ్చునట్లుగా, రచియింపబడిన శ్లేష కావ్యము. ఇంతటి సులభ శైలితో సంపూర్ణ
శ్లేష కావ్యమును రచియించుట మరొకరికి సాధ్యము గాదు. మచ్చుకు ఒక పద్యము మీ
ముందుంచుచున్నాను.
క. అతివినయాన్విత కుంతియు
ధృతమహిమాద్రియునగుచు నతిప్రీతి తరం
గితమతులై తను, గొలువఁగఁ
జతురమృగయు లేఁగుఁదేర జనియె న్వనికిన్
రామాయణార్థం
మిక్కిలి అణకువ కలిగిన వాడునూ, ఈటెలు మున్నగు
ఆయుధలు ధరించిన సైనికులు గల వాడునూ, పర్వతంతో సమానమైన ధైర్య మహిమ కలిగిన వాడునూ అయిన
దశరథుడు, తనకు
అత్యంత ప్రీతిపాత్రమైన, సమర్థులైన
వేటగాళ్ళు తనతో వచ్చుచుండ అడవి కేగెను. ఇక్కడ కుంతియు అనే శబ్దానికి ఈటెలు ధరించిన
వారు అని అర్థాన్ని అన్వయించుకోవాలి.
భారతార్థం
అత్యంత వినయము కలిగిన కుంతీ దేవి, ధైర్యానికి
స్థానమైన మాద్రి నవ్వుతూ తనను కొలుస్తూ వస్తుండగా, వేటగాళ్ళు తనతో వచ్చుచుండగా పాండురాజు
అడవికి వేటకై బయలు దేరెను.
ఇక అసలు విషయమునకు వస్తాను
యః పూతనామారణ లబ్ధ కీర్తిః
కాకోదరో ఏన వినీత దర్పఃl
యశోదయా అలంకృత పుణ్య మూర్తిః
నాధో యదూనాం అథవా రఘూణాం
ఎవరైతే పూతనను చంపి కీర్తి కిరీటమును ధరించిన వాడు,
కాకోదర అనగా పాము, ఇక్కడ
కాళీయుడు, గర్వమును అణచిన వాడు, యశోద చేత
(బాల్యములో) ... చెంగల్వ పూదండ, బంగారు మొలత్రాడు, పట్టు
దట్టి, సందె
తాయతలు, సరిమువ్వ
గజ్జెలు అలంకరింపజేసుకొన్న పుణ్యమూర్తి యగు యదునాథునికి (నమస్కారము). ఇది శ్రీ
కృష్ణుని పరముగా అన్వయము.
ఎవరైతే, పూత నామా అన్న చోట నిలిపితే పవిత్రమగు పేరుగలవాడు అని అర్థము,
'రణ లబ్ధ కీర్తిః' అంటే భీకర రణము నందు ఖరదూషణాది 14 వేల రక్కసులను
తృటిలో వధించిన, భీకర
రణమున రావణుని తెగటార్చిన రణకౌశలుడగు శ్రీరాముని, కాక+దార అనగా రాక్షసుడి కాకి రూపమున
సీతమ్మకు హాని తలపెట్టబాగా దర్భాపోచను బ్రహ్మాస్త్రముగా అభిమంత్రంచి విడువ ఆ కాకి
శరణు జోచ్చినంత అస్త్రమును వృధా కానీయక కాకి చూపును చూచే ఒక కన్నుకు మాత్రమె
పరిమితము చేసినాడు, అనగా
ఒకవస్తువును ఒకేసారి రెండు కళ్ళతో చూడలేదు. అందుకే కాకిని 'ఏకాక్షీ లోక
సంచారీ' అంటారు. ఆ విధముగా వాని దర్పమడచి. దర
స్వల్పమైన వినీత అనగా గుణవంతునిగా చేసినాడో, దయాలంకృత పుణ్యమూర్తియై యశస్సును పొందినాడో అట్టి
రామునికి (నమస్కారము).
మన సంస్కృతము, అణా సంస్కృతి, మన ఆంధ్రము అమోఘము అద్వితీయము అప్రతిహతము. =అట్టు
పట్టండి, పట్టు
సాధించండి.
స్వస్తి.
Highly described realities spelt with good examples
ReplyDelete