Tuesday, 12 September 2023

అవధానము పై ఒక పండితుని అభిప్రాయము నా సమాధానము

 Ref.అవధానం - సమస్యా పూరణం - దత్తపది (సరసరస)

Nagaraja Sastry Gollapinni

ఔచిత్యం దాటతనంతవరకు అవధానం అభినందనీయం.కానీ సమస్యాపూరణం,దత్తపది, అప్రస్తుత ప్రశంసల్లో అశ్లీలత చోటు చేసుకోవడం దారుణాతి దారుణం. అవధానాలు కేవలం అవధాని పాండిత్య ప్రకర్షకే తప్ప , తెలుగు సాహిత్యానికి చేసిన మేలు చాల తక్కువ. నన్నయ,తిక్కన పోతన శ్రీనాధ మహాకవులజాషువా రచనలు కలకాలం కాల పరీక్షకు నిలబడ్డాయంటే అమూల్యమైన సాహితీ విలువలు వుండటం వల్లే.తిరుపతి వెంకటకవుల అవధాన పద్యాల కన్నా పద్యనాటకాలు కాల పరీక్షకు నిలిచాయంటే అవి హృదయం స్పర్శవికాబట్టే.

"తలయూపింపనిది రసజ్ఞతే

అలరి పట్టినది ఉంగరమే -అంటాడు నన్నె చోడ మహాకవి. అవధానం ముగిసిన వెంటనే అవధాన పద్యాలు అంతటితో సరి.గాలికి పోయిన ప్యాలపిండి కృష్ణార్పణం


అవధానము అన్న మాటకు ఏకాగ్రత అనిచేప్పుకోవచ్చును అనగా Concentration of mind.. ఒక విషయముపైనే ఏకాగ్రత . ఈ ఏకాగ్రత ముఖ్యముగా అష్టాంగ యోగము లోని ధ్యానము ధారణ మననము సమాధి మూలముగా ప్రాప్తించుతాయి. 

పతంజలి యోగమును ౮ విధాలుగా విభాజించినారు. దీనిని అష్టాంగ యోగము అంటారు. ఈ ఎనిమిది భాగములు యమము, నియమము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, మననము, సమాధి.

'యోగః చిత్తవృత్తి నిరోధః' అన్నాడు పతంజలి మహర్షి. సాధకుడు ఆత్మను పరమాత్మకు అనుసంధించటమే కాకుండా, లౌకికముగా ఒక వ్యక్తి తన మేధస్సును ఒక ప్రత్యేక విషయమునకు లేక విషయములకు అనుసంధించుటకూడా యోగమే! దీనినే అవధానము అంటారు. ఇది అష్ట శత సహస్ర  ద్విసహస్ర పంచసహస్ర అవధానములు కావచ్చు. సాధారనముగా అవధానులు శక్తి స్వరూపిణిని అనుష్ఠించుచుంటారు తమ ఏకాగ్రతకు. 

ఇక అవధానములో ఆశ్లీలతను గూర్చి- ఉదాహరణకు అష్టావదానమును తీసుకొందాము. అవధానికి పెట్టే భాషా పాండిత్యపరమైన 8 కష్టమైన   ప్రక్రియలకు\ ఆటంకములకు, అందునా నిషిద్ధాక్షరికి ఉద్దండ పండితులు కూర్చుంటారు, సమాధానము చెప్ఫి రక్తి  కట్టించుట అవధాని గొప్పదనము. ఇక దత్త పది, సమస్యా పూరాణములందు  అశ్లీలమును  కాలక్రమేణా జొప్పించి, అవధాని పూరణ మాత్రము అశ్లీలత లేకుండా పూరించామనుత కద్దు. ఈ ప్రతిభా వ్యుత్పత్తులు కల్గిన అవధానము తెలుగువారి సొమ్ము. మీరన్నట్లు పొల్లును చెరిగివేసి గింజలను చేటలో నిలుపుకొన్నచో మన భాషా గౌరవమును దేశ దేశాన్తరములకు విస్తరింపజేయవచ్చును. ఇది ఏభాషలోనూ లేని ఒక అసాధారణ ప్రక్రియ. రూపుమాపవలసినది కాదు.

ఇక ఇక నన్నయ తిక్కన పోతనాది  మహానుభావుల కవితా సుధారసధారలు అవధానములలో కనిపించే అవకాశము తక్కువ. కానీ దేనికదే! పాలకోవా ఎంతో రుచికరమైనదని అదే అదే పడే పడే తినలేదు. భోక్తకు ఎప్పుడైనా పకోడీ కూడా తినవలేనని అనిపించవచ్చు. ఆ పదార్థము మరియు దానిని చేసేవాడినే మరుగున బడవేసితే ఒక సాహితీ ప్రక్రియకు దూరమౌటాము. మీరు చెప్పిన కవికుల తిలకుల కావ్యములు, సత్కవితలు చదువదలచినపుదల్లా పాఠకుడు  చదువగలుగుతాడు. అందుకే ఈ ప్రక్రియను జారవిడువకూడదు. పైపెచ్చు దీనిని విద్యావిదానములో ఒక భాగముగా చేసితే విద్యార్థుల ధారణాశక్తి ప్రబలుతుంది. 

మీరు భాషా పండితులు నేను ఏదయినా తప్పు వ్రాసియుంటే తప్పుగా తలవారని 

Thursday, 7 September 2023

రామ కృష్ణులను గూర్చి ఒకే శ్లోకములో

 

రామ కృష్ణులను గూర్చి ఒకే శ్లోకములో

https://cherukuramamohan.blogspot.com/2023/09/blog-post.html

సంస్కృతము సకల ప్రపంచ భాషలకు తల్లి. ద్వ్యర్థి శ్లోకము అనగా ఒకే శ్లోకము రెండు విధములగు అర్థములను కలిగియుంటాయి. ఈ విధముగా ఏపాశ్చాత్య భాషకు, అరబ్బీ, ఫారసీ కి సాధ్యము కాదు. ఆ సంస్కృతానికి ముద్దుటాడుబిడ్డ కాబట్టి తెలుగునకు ఆ సుగుణమబ్బినది. తెలుగులో వేములవాడ భీమకవి రాసినట్లుగా చెప్పబడే 'రాఘవ పాండవీయ'మన్న ద్వ్యర్తికావ్యము పింగళి సూరన కాలమునకే అలభ్యము. కావున పింగళి సూరన వ్రాసిన 'రాఘవ పాండవీయ'మే మొదటి ద్వ్యర్తికావ్యమౌతుంది.

రాఘవపాండవీయం క్లిష్టార్థములు లేకుండా మృదుమధుర సులభ పదములతో రామాయణ భారతార్థములు వచ్చునట్లుగా, రచియింపబడిన శ్లేష కావ్యము. ఇంతటి సులభ శైలితో సంపూర్ణ శ్లేష కావ్యమును రచియించుట మరొకరికి సాధ్యము గాదు. మచ్చుకు ఒక పద్యము మీ ముందుంచుచున్నాను.

 

క. అతివినయాన్విత కుంతియు

ధృతమహిమాద్రియునగుచు నతిప్రీతి తరం

గితమతులై తను, గొలువఁగఁ

జతురమృగయు లేఁగుఁదేర జనియె న్వనికిన్

 

రామాయణార్థం

మిక్కిలి అణకువ కలిగిన వాడునూ, ఈటెలు మున్నగు ఆయుధలు ధరించిన సైనికులు గల వాడునూ, పర్వతంతో సమానమైన ధైర్య మహిమ కలిగిన వాడునూ అయిన దశరథుడు, తనకు అత్యంత ప్రీతిపాత్రమైన, సమర్థులైన వేటగాళ్ళు తనతో వచ్చుచుండ అడవి కేగెను. ఇక్కడ కుంతియు అనే శబ్దానికి ఈటెలు ధరించిన వారు అని అర్థాన్ని అన్వయించుకోవాలి.

 

భారతార్థం

అత్యంత వినయము కలిగిన కుంతీ దేవి, ధైర్యానికి స్థానమైన మాద్రి నవ్వుతూ తనను కొలుస్తూ వస్తుండగా, వేటగాళ్ళు తనతో వచ్చుచుండగా పాండురాజు అడవికి వేటకై బయలు దేరెను.

 

ఇక అసలు విషయమునకు వస్తాను

 

యః పూతనామారణ లబ్ధ కీర్తిః

కాకోదరో ఏన వినీత దర్పఃl

యశోదయా అలంకృత పుణ్య మూర్తిః

నాధో యదూనాం అథవా రఘూణాం

 

ఎవరైతే పూతనను చంపి కీర్తి కిరీటమును ధరించిన వాడు,  కాకోదర అనగా పాము, ఇక్కడ కాళీయుడు,  గర్వమును అణచిన వాడు, యశోద చేత (బాల్యములో) ... చెంగల్వ పూదండ, బంగారు మొలత్రాడు, పట్టు దట్టి, సందె తాయతలు, సరిమువ్వ గజ్జెలు అలంకరింపజేసుకొన్న పుణ్యమూర్తి యగు యదునాథునికి (నమస్కారము). ఇది శ్రీ కృష్ణుని పరముగా అన్వయము.

ఎవరైతే, పూత నామా అన్న చోట నిలిపితే పవిత్రమగు పేరుగలవాడు అని అర్థము,  'రణ లబ్ధ కీర్తిః' అంటే భీకర రణము నందు ఖరదూషణాది 14 వేల రక్కసులను తృటిలో వధించిన, భీకర రణమున రావణుని తెగటార్చిన రణకౌశలుడగు శ్రీరాముని, కాక+దార అనగా రాక్షసుడి కాకి రూపమున సీతమ్మకు హాని తలపెట్టబాగా దర్భాపోచను బ్రహ్మాస్త్రముగా అభిమంత్రంచి విడువ ఆ కాకి శరణు జోచ్చినంత అస్త్రమును వృధా కానీయక కాకి చూపును చూచే ఒక కన్నుకు మాత్రమె పరిమితము చేసినాడు, అనగా ఒకవస్తువును ఒకేసారి రెండు కళ్ళతో చూడలేదు. అందుకే కాకిని 'ఏకాక్షీ లోక సంచారీ'  అంటారు. ఆ విధముగా వాని దర్పమడచి. దర స్వల్పమైన వినీత అనగా గుణవంతునిగా చేసినాడో, దయాలంకృత పుణ్యమూర్తియై యశస్సును పొందినాడో అట్టి రామునికి (నమస్కారము).

 

మన సంస్కృతము, అణా సంస్కృతి, మన ఆంధ్రము అమోఘము అద్వితీయము అప్రతిహతము. =అట్టు పట్టండి, పట్టు సాధించండి.

స్వస్తి.