తమలపాకు
https://cherukuramamohan.blogspot.com/2023/07/blog-post_31.html
‘తాంబూలం సమర్పయామి’ అని పూజావిధి లో భగవంతునికి కర్పూరనీరాజనము ఇచ్చే ముందు తాంబూలమును
సమర్పించుకొంటాము. దీనిలోని అర్థము, అనగా దేవునికి భక్ష్య భోజ్య లేహ్య చోష్య పానీయములను
సమర్పించిన తరువాత పచ్చకర్పూరముతో కూడిన తమలపాకులు,వక్కలు, సాధారణముగా మూడు ఆకులు, రెండు వక్కలు,
మర్పించి తాంబూలం సమర్పయామి అని చెబుతారు. ఈ తాంబూల సమర్పణలో తమలపాకులకు ఇంత ప్రాధాన్యత ఎందుకు అన్న విషయమును
గూర్చి తెలుసుకొందాము.
తమలపాకును సంస్కృతములో నాగవల్లి అంటారు. వల్లి
అంటే తీగ అని అర్థము. సాధారణముగా ఈ తీగను అవిశె చెట్టుకు పెనవేసి పెంచుతారు. ఇది
నాగు వలెనె చుట్టుకొంటూ ప్రాకుతుంది కాబ్బట్టి నాగవల్లి అయిఉండే అవకాశము ఉన్నది.
ఇప్పుడు ఈ నాగవల్లి కి సంబంధించిన ఒక కథ చెప్పుకొందాము.
సముద్ర మంథనము జరిగినపుడు ఇంద్రునికి అందునుండి ఉద్భవించిన ఐరావతము అన్న ఒక తెల్లని ఏనుగును కానుకగా ఇచ్చుట జరిగినది. ఆయన దానిని స్వర్గములోని
నందన వనములో కట్టింప
దలచి ఏనుగుల కాపరి మావటి యగు మతంగునికి ఆ పని అప్పజేప్పినాడు. ఏనుగుల వెనుక
కాళ్ళకు సంకెలు వేసి బంధించుతారు. అందుకొరకై నేలను ఆనుకొనియుండే బలమైన ఆధారము
కొరకు చూస్తే
అతనికి ఒక బలమైన కల్పవృక్షపు ఏరు కనిపించింది తనవద్దనున్న బలమైన తాటితో ఏనుగు యొక్క ఒకకాలికి ఆ మోకును ఆ వేరుకు కట్టినాడు. ఆవేరు నుండి వచ్చిన ఒక అతిసన్నని పిల్లవేరుకు ఐరావతముయోక్క మడమ తగిలి అది ఆకులను దాల్చినది. ఆ వల్లిక నాగము అనగా ఏనుగు ను తాకి ఏర్పడినది కావున నాగవల్లి అన్నపేరుతో భూమికి చేర్చబడినది. నాకము నుండి వచ్చినది కాబట్టి నాకవల్లి అని కూడా పిలువ బడుచూ రాను రానూ నాగవల్లి అయి ఉంటుంది.
ఇక ఈ నాగవల్లిని తాంబూలములో ఎందుకు విశిష్ఠముగా వాడుతారో చూద్దాము. దేవునికి ఫలం పత్రం పుష్పం తోయం సమర్పించవలెనన్నది ఆర్య వాక్కు. నైవేద్యము ముగిసిన పిదపగూడా స్వామికి వీని అవసరము ఉంటుంది. అందుకనే అన్నింటికీ ప్రత్యామ్నాయముగా తమలపాకులను ఉంచుతారు. మూడు తమలపాకులు రెండు వక్కలు ఎక్కువమంది తాబూల రూపములో సమర్పించుకొంటారు. మరి పూలు పళ్ళు నీరు ఆకులకు బదులు తమలపాకులనే ఎందుకు పూజా సమయమున వాడుతారో చూద్దాము. ఈ నాగవల్లికి ఒక్కొక్క ఆకే మొలుస్తూ ఎగబ్రాకుతూ వుంటుంది.
స్వతహాగా అది పత్రము, దానిలోనే పుష్పము ఫలము నిక్షిప్తమై ఉంటాయి. ఫలములోని బీజము నాటకనే, పూవు పూయకనే, కాయకాయకనే ఒక్కొక్క ఆకును కలిగి ఆ తీగ పైపైకి ప్రాకుతూ వుంటుంది. అంటే ఈపత్రములో పుష్పము ఫలము నిక్షిప్తమై ఉన్నాయి అనేకదా అర్థము. అంటే తమలపాకు లో పత్రం ఫలం పుష్పం ఉన్నాయి. తమలపాకులు సులభముగా వాడిపోవు. వాతావరణము చల్లగాఉన్నా, లేకున్నా, ఆకులను ఒక తడిపొడి బట్టలో చుట్టిపెట్టి అతిగా చెమ్మ తగిలించకుండా ఉంచితే 20 రోజులైనా ఉంటాయి. అంటే స్వతహాగా వానిలో నీరు ఉన్నదనే కదా! అందుకే పత్రం పుష్పం ఫలం తోయానికి బదులుగా భగవంతునికి తాంబూలములో సమర్పించుతారు. ఎటూ తమలపాకు తోడుగా పూగీ ఫలము అనగా వక్క లేక పోక ఉంచనే ఉంచుతారు. ఇక అన్నీ భగవంతునికి సమర్పించినట్లే కదా! రాయలసీమ ముఖ్యముగా కడప జిల్లాలో తాంబూలమును వక్కాకు అనే అంటారు. చతుర్విధ పురుషార్థాలలోనూ ఈ తాంబూలము మూలము. ఎట్లు? అన్నది ఒకసారి గమనించండి. ఒక గృహస్తు తనపుణ్య కార్యములో భాగముగా దానము చేయుట అతని ధర్మము. ఆధనముతోబాటు ‘తుభ్యమాహం సంప్రతతే నమమ’ అనిచెప్పి మూడు ఆకులు రెండు వక్కలు ఇచ్చి దానము చేస్తాడు. అది అతడు నిర్వహించిన ధర్మము. భార్య భర్తకుభోజనానంతరము, శయ్యాగృహములో తాంబూలము ను అందించుట ఆమె ధర్మము. గురువుకు దక్షిణ తోబాటూ తాంబూలము నందించుట శిష్యుని ధర్మము.
ఇక అర్థము. అర్థము అనగా ధనము. కవులచే కావ్యములు వ్రాయించవలెనంటే ఆయనకు పుష్కలముగా ధనమో, ధాన్యమో అగ్రహారములో రత్నకనక రాసులో తాంబూలముతో సహా ఇచ్చి కృతిని వ్రాయ అర్థించుతారు. ఒక సైన్యాధ్యక్షుని యుద్ధమునకు పంపవలెనంటే పుష్కలమగు ధనముతో బాటూ తాంబూలమునిచ్చి ఆజ్ఞాపించుతారు.తమలపాకు – 2
ఇక కామము.
కామము అంటే లైంగికమైన కోరికయే కాదు. ఒక వస్తువును అనగా ఒక ఆభరణము కావచ్చు, రత్నాలు పొదిగిన పట్టు వస్త్రమే కావచ్చు, స్థలము, పొలము, ఇల్లు, అధికారము, స్త్రీ, ఈ విధముగా
ఏదయినా కావచ్చు, వానిని సాధించి స్వంతము చేసుకొనవలెననుకొనుటయే కామము ఇటువంటి ప్రతిపాదనలో
ఆకూవక్కా పెట్టి తాంబూలమునిచ్చేవారు. భార్యా భర్తల మధ్య శృంగారపరమైన అనుబంధమునకు
తమలపాకు చిలకలతో మొదలవుతుంది. యుద్ధము చేయుటకు తాంబూలము పుచ్చుకొంటే, ఆ
పుచ్చుకొన్న వ్యక్తి ప్రాణాలకు తెగించి పోరాడుతాడు. పెళ్లి చూపులలో తాంబూలము, ఒక స్థలమో పొలమో
కొనుటలో తాంబూలము సంస్కారము (Advance) ఇచ్చేవారు. ఈ విధముగా తాంబూలము మన సంస్కృతిలో ఒక ప్రముఖ్యమమైన స్థానమును
ఆక్రమించియున్నది.
ఈ తాంబూలమును గూర్చి జనపదములలో నానెడు భారతమునకు సంబంధించిన ఒక
కథ తెలియజేస్తాను.
ఇంద్రప్రస్థమున నభూతో నభవిష్యతి అన్న చందమున మయనిర్మిత సభాభవనములో సకల యోద్ధ విభుదాగ్రగణ్యుల సమక్షములో అగ్ర తాంబూలము అచ్యుతునకిచ్చుట అందరికీ తెలిసినదే! పరమాత్మ తన విడిది గృహమునకు వెడలి రుక్మిణితో తనకు ధర్మజుడు అగ్ర తాంబూలమొసగిన విషయమును ఎంతో సంతోషముగా తెలిపినాడు. అందుకు జవాబుగా రుక్మిణి ‘ఇక మీరు అనుక్షణమూ ధర్మజుని ఆజ్ఞ పాటించవలసినదే!’ అన్నది. అందుకే సలహాదారునిగా, రాయభారిగా, చివరకు రథసారధిగా కూడా ఆయన బాధ్యతలు తీసుకొనవలసి వచ్చినది.
ఇక తమలపాకు ప్రాశస్త్యము
మీకు తెలిసినదే! అయినా ఒక్కమారు ఆ విషయమును స్పృశించి ఈ వ్యాసమును ముగించుతాను.
ఆయుర్వేదములో తమలపాకుకు ‘నక్షత్ర
గుణం’ ఉన్నట్లు చెప్పబడినది. వైదిక గణిత శాస్త్రములో ‘భూత సంఖ్య విభాగము’ లో నక్షత్ర
అంటే 27 అని అర్థము. అంటే తమలపాకులో 27 విధములగు ఔషధీ గుణములు ఉన్నాయట. పంచాఙము ప్రకారము
మనకు ఉండేది 27 నక్షత్రములే కదా! ఈ తమలపాకు యొక్క ఉపయోగములు అన్న విషయమును google సౌజన్యముతో మీ ముందు ఉంచుచున్నాను. క్రింద తెలియజేసిన
విషయములలో వైద్యుని సలహా మేరకు నడుచుకొనేది.
మిగిలినది మరోమారు.......
తమలపాకు – 3 (చివరి భాగము)
తమలపాకుల
రసమును గొంతునొప్పి నివారణకు ఉపయోగిస్తారు.
శ్వాసకోశ వ్యాధుల
నివారణకై ఈ ఆకులను నూనె రాసి కొద్దిగా వేడిచేసి ఛాతీపై ఉంచుతారు.
తమలపాకులకు నేయి రాసి
గాయాలకు కట్టుకడతారు.
తమలపాకుల రసమును చెవిలో
పిండిన చెవినొప్పి తగ్గిపోవును.
అపస్మారకమును
నివారించుటకు తమలపాకుల రసమును పాలతో కలిపి త్రాగించెదరు.
ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలను పక్కన పెడితే, శరీరానికి తాంబూల సేవనం చాలా ఉపయోగకరమైనది. ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఎ విటమిన్. సి.విటమిన్ లు తమలపాకులో పుష్కలంగా ఉన్నాయి. తాంబూలం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఫైబర్ - అంటే పీచు పదార్థం తమలపాకు లో చాలా ఎక్కువగా వుంటుంది. ఆకుకూరలు ఏవిధంగా అయితే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయో తమలపాకులు కూడా అలాగే, అంతకంటే ఎక్కువగా పని చేస్తాయి. సున్నం, వక్క తప్పించి, కృత్రిమ పదార్థాలను చేరిస్తే మాత్రం తమలపాకు శరీరానికి హానికరంగా మారుతుందని గ్రహించాలి.
తమలపాకు యాంటాక్సిడెంట్‌గా
పనిచేస్తుంది. అంటే ముసలితనపు మార్పులను కట్టడి చేస్తుందన్నమాట.
నూనెలూ ఇతర తైల
పదార్థాలూ ఆక్సీకరణానికి గురై చెడిపోవడాన్ని ‘ర్యాన్సిడిటి’ అంటారు. తమలపాకు ఈ
ప్రక్రియను అడ్డుకుంటుంది- తైల పదార్థాలు చెడిపోవడానికి గురికాకుండా ఉంచుతుంది.
నువ్వుల నూనె, ఆవనూనె, పొద్దుతిరుగుడు నూనె, వేరుశనగ నూనె. ముఖ్యముగా నెయ్యి కాగినవెంటనే అందు ఆ
వేడిలోనే తమలపాకును వేయుట కద్దు.
తమలపాకులో ‘చెవికాల్’
అనే పదార్థం ఉంటుంది. ఇది బ్యాక్టీరియా పెరుగుదలను కట్టడి చేస్తుందని పరిశోధన.
తమలపాకులో ఉండే స్థిర
తైలం (ఎసెంషియల్ ఆయిల్) ఫంగస్ మీద వ్యతిరేకంగా పనిచేసి, అదుపులో ఉంచినట్లు పరిశోధనల్లో
తేలింది.
ఒక ముఖ్య విషయం.
తమలపాకును తొడిమతో సహా తింటే మహిళల్లో వంధ్యత్వం వచ్చే అవకాశం ఉంటుందని పరిశోధకులు
గమనించారు. కాబట్టి సంతానంకోసం ప్రయత్నించేవారు తమలపాకును తొడిమ తొలగించి
వాడుకోవాలి.
తమలపాకు ఔషధం లాంటిది.
ఔషధాల మాదిరిగానే దీనినీ పరిమితంగానే వాడుకోవాలి. ఈ సందర్భంగా తమలపాకు నేపథ్యంగా
జరిగిన ఒక అధ్యయనం గురించి ప్రస్తావించాలి. రోజుకు 5-10 తమలపాకులను 2 ఏళ్లపాటు
తినేవారు తమలపాకులకు డ్రగ్స్ మాదిరిగా బానిసలవుతారని ఇటీవల జరిగిన తాజా అధ్యయనంలో
తేలింది.
అధిక రక్తపోటు
కలిగినవారు తాంబూలాన్ని యధేచ్ఛగా వాడకూడదు- తాంబూలాన్ని తయారుచేసేటప్పుడు సున్నం
కలుపుతారు కాబట్టి ఈ పదార్థం రక్తనాళాల మీద, రక్తసరఫరామీద వ్యతిరేక ప్రభావం చూపుతుంది.
తాంబూలానికి పొగాకును
కలిపి తింటే ‘సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్’ వంటి ప్రమాదకరమైన నోటి వ్యాధులు వచ్చే
అవకాశం ఉంటుంది. సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్ అనేది నోటి క్యాన్సర్‌కి ముందు స్థితి.
తమలపాకు, సున్నం, వక్క... ఇవి మూడూ చక్కని
కాంబినేషన్. సున్నంవల్ల ఆస్టియోపోరోసిస్ (ఎముకలు గుల్లబారటం) రాకుండా ఉంటుంది; తమలపాకు రసం సున్నంలోని
క్యాల్షియాన్ని శరీరాంతర్గత భాగాల్లోకి చేరవేస్తే తమలపాకుకు చేర్చే వక్కపొడి
లాలాజలాన్ని విడుదలయ్యేలా చేసి అరుగుదలకు సహాయపడుతుంది.[8][9]
ఔషధంగా తమలపాకుని
వాడుకోదలిస్తే, రసం పిండి 1-2 చెంచాల మోతాదులో తీసుకోవాలి.
ప్రతిరోజూ 7 తమలపాకులను
ఉప్పుతో కలిపి ముద్దగా నూరి వేడి నీళ్లతో తీసుకుంటే బోధ వ్యాధిలో చక్కని ఫలితం
కనిపిస్తుంది.
ప్రతిరోజూ రెండు
నెలలపాటు ఒక తమలపాకును పది గ్రాముల మిరియాలను కలిపి తిని వెంటనే చన్నీళ్లు
తాగుతుంటే స్థూలకాయులు సన్నగా నాజూగ్గా తయారవుతారు.
స్వర్ణక్షీరి, విడంగాలు, ఇంగిలీకం, గంధకం, చక్రమర్ధ, చెంగల్వకోష్టు, సింధూరం వీటిని ఉమ్మెత్త ఆకులతోనూ, వేప చెట్టు బెరడుతోనూ, తమలపాకుతోనూ కలిపి ముద్దగా నూరి
చర్మంమీద లేపనం చేస్తే ఎగ్జిమా, తామర, దురదలు వంటి చర్మవ్యాధుల్లో ఉపశమనం లభిస్తుంది.
తమలపాకు రసం, తేనె సమపాళ్లలో కలిపి కళ్లలో
డ్రాప్స్‌గా వేసుకోవాలి. (వైద్య పర్యవేక్షణ అవసరం)
తమలపాకు రసం, తులసి రసం, అల్లం రసం, మిరియాలు పొడి, తేనెలను కలిపి నాకిస్తే పిల్లల్లో
జలుబు, దగ్గు
తగ్గుతాయి.
చెవుల మీద తమలపాకులను
వేసి కట్టుకుంటే తలలో చేరిన వాతం శాంతించి తల నొప్పి తగ్గుతుంది.
తమలపాకు రసాన్ని పాలతో
కలిపి తీసుకుంటే మహిళల్లో కనిపించే పిశాచ బాధలు, క్షణికావేశాలు తగ్గుతాయి.
తమలపాకు రసాన్ని రెండు
కళ్లల్లోనూ చుక్కలుగా వేస్తే రేచీకటి సమస్య తగ్గుతుంది. (వైద్య పర్యవేక్షణ అవసరం)
గుండె అపసవ్యంగా, అపక్రమంగా కొట్టుకుంటున్నప్పుడు
తమలపాకు రసాన్ని టీ స్పూన్ మోతాదుగా తాగుతుంటే హితకరంగా ఉంటుంది.
తమలపాకు షర్బత్‌ని
తాగితే గుండె బలహీనత తగ్గుతుంది. కఫం, మందాగ్ని దూరమవుతాయి.
ఏ కారణం చేతనైనా
పసిపాపాయికి పాలివ్వలేకపోతే రొమ్ముల్లో పాలు నిలిచిపోయి గడ్డలుగా తయారై నొప్పిని
కలిగిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో తమలపాకు కొద్దిగా వేడిచేసి స్తనాలమీద కట్టుకుంటే
వాపు తగ్గి ఉపశమనం లభిస్తుంది.
చిన్న పిల్లలకు
చీటికిమాటికి జలుబు చేసి ఇబ్బంది పెడుతున్నప్పుడు తమలపాకును వేడిచేసి, కొద్దిగా ఆముదాన్ని రాసి, ఛాతిమీద వేసి కడితే హితకరంగా
ఉంటుంది.
తమలపాకు కాండాన్ని
(కులంజన్), అతిమధురం చెక్కను నూరి తేనెతో కలిపి తీసుకుంటే ఇన్‌ఫెక్షన్‌తో
కూడిన జలుబు (దుష్టప్రతిస్యాయం) తగ్గుతుంది.
పాటలు పాడేవారు, ఉపన్యాసాలను ఇచ్చేవారు తమలపాకు
చెట్టు కాండాన్ని చిన్న ముక్క తీసుకొని బుగ్గనుంచుకొని చప్పరిస్తుంటే అమితమైన
ప్రయోజనం కనిపిస్తుంది. చక్కని శ్రావ్యమైన కంఠం వస్తుంది.
హిస్టీరియాలో కంఠం
పూడుకుపోయి మాట పెగలకపోతే తమలపాకు రసం తీసుకుంటే కంఠం పెగులుతుంది. మాట స్పష్టతను
సంతరించుకుంటుంది. కఫం తెగి వెలుపలకు వచ్చేస్తుంది. 2-5 తమలపాకులను వేడి నీళ్లకు
కలిపి మరిగించి పుక్కిటపడితే కూడా హితకరంగా ఉంటుంది.
తమలపాకును తింటే
శ్లేష్మం కరిగి పెద్ద మొత్తాల్లో స్రవిస్తుంది. దీంతో అరుగుదల తేలికగా జరుగుతుంది.
నోటి దుర్వాసన తగ్గుతుంది. తిన్న వెంటనే ఆయాసం రాకుండా ఉంటుంది. మాటలో స్పష్టత
వస్తుంది. అలాగే చెడు వానలు కురిసే రోజుల్లో, జలవాయు కాలుష్యాలవల్ల చెడిపోయిన ఆహారాన్ని ఇది
శుద్ధపరుస్తుంది.
తమలపాకును తినడంవల్ల
లాలాజలం విడుదలై దప్పిక తీవ్రత తగ్గుతుంది.
తమలపాకు తొడిమకు ఆముదం
రాసి చిన్న పిల్లల్లో మల ద్వారంలోనికి చొప్పిస్తే మలనిర్హరణ జరుగుతుంది. (వైద్య
పర్యవేక్షణ అవసరం)
తమలపాకును కడుపులోపలకు
తీసుకుంటుంటే ఎరక్టైల్ డిస్‌ఫంక్షన్ (అంగ స్తంభన ) ఇబ్బంది పెట్టదు. తమలపాకు
రసాన్ని బాహ్యంగా కూడాప్రయోగించవచ్చు.
తమలపాకు షర్బత్‌ని
తీసుకుంటే బలహీనత దూరమవుతుంది.
తమలపాకు రసాన్ని టీ
స్పూన్ మోతాదులో మూడుపూటలా మిరియం పొడి కలిపి తీసుకుంటుంటే జ్వరం తగ్గుతుంది.
తమలపాకును వేడిచేసి వాపు, నొప్పి కలిగిన కీలు మీద కడితే
నొప్పి తగ్గుతుంది.
మొండి వ్రణం త్వరితగతిన మానాలంటే
వ్రణంమీద తమలపాకును అమర్చి కట్టుకట్టుకోవాలి.
తమలపాకు రసాన్ని
ముక్కులో డ్రాప్స్‌గా వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.
తమలపాకు ముద్దను తలకు
పట్టించి గంటసేపు ఆగి తల స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.
తాంబూలము దేవునికి సమర్పించుట
అంటే ‘స్వామీ మాకు నీవే రక్ష’ అని చెప్పుట. మనము చేసే సకల సత్కార్యములకు ఆయన తోడూ
నీడ ఉండవలెనని కోరుతా అన్నమాట. సన్యాసులు పరమాత్మకు తాంబూలము సమర్పించనే కూడాడు. వారికి తాంబూల సేవనము కూడా
పనికి రాదు.
తులసియు నాగవల్లికయు పరమాత్మ అనుగ్రహించినవి. పూజ్యభావముతో వానిని గౌరవించుట మన
ధర్మము.
స్వస్తి.