Monday 7 November 2022

అవధాన సహస్ర ఫణి వే. నాగపణి శర్మ గారు

 

అవధాన సహస్ర ఫణి వే. నాగపణి శర్మ గారు

Dr. మాడుగుల నాగఫణి శర్మ గారు

https://cherukuramamohan.blogspot.com/2022/11/blog-post_7.html

దేశాధ్యక్షుడు వే. శంకర్ దయాళ్ శర్మ, దేశ ప్రధాని మహా పండితుడు శ్రీయుతులు P,V నరసింహారావు గారు, సంయుక్త ఆంద్ర ప్రదేశపు ముఖ్యమంత్రి శ్రీ N.T రామారావు గార్ల చేతనే గాకుండా శృంగేరి, కంచి కామకోటి పీఠములందు, పీఠాధిపతుల  ఆజన మేరకు సంస్కృతమున అవధానములు సలిపి ఆ మహానీయులచే గౌరవము పొంది ఆశీర్వదించబడిన పండిత మేరువు. నిజమునకు ఈ జగమెరిగిన బ్రాహ్మణునికి నా ఉపోద్ఘాతము హింబ్డూ మహా సముద్రపు ఒడ్డున ఇసుక రేణువు. అయినా రెండు మాటలు చెప్పవలెనను ఆశతో ఈఅవకాశమును విడుచుకోలేక చెప్పుచున్నాను.

బ్ర.శ్రీ.వే. గౌరిపెద్ది రామసుబ్బశర్మ గారు శతావధాని. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ప్రాచ్యకళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసినారు. మా చిన్నాన్న అంటే నా భార్యకు స్వంత మేనమామ యైన వే. సాంబ మూర్తిగారికి బాల్య స్నేహితులు అనేకంటే గోచిపాత స్నేహితులు అంటే ఇంకా బాగుంటుందేమో!. బాల్యములో కోతికొమ్మంచి ఆడుకొనేవారు. నా కుమార్తె నామకరణము వారిచే జరుగుట నా పూర్వజన్మ సుకృతము. నా ఇరువురు కుమార్తెల జాతకమును గూడా శ్రీ గౌరిపెద్దివారే వ్రాసినారు. అన్నమయ్య సంకీర్తనల పరిష్కర్తలలో వీరు ఒకరు. శ్రీదేవీమాహాత్మ్యము అనే ఆధ్యాత్మిక గ్రంథాన్ని రచించినారు. ప్రముఖ అవధానులు గండ్లూరి దత్తాత్రేయశర్మ, నరాల రామారెడ్డి మొదలైనవారు వీరి శిష్యులు. వీరికన్నా వేదమూర్తులైన మాడుగుల నాగ ఫణి శర్మ గారు వీరికి అత్యంత ప్రియతమ శిష్యులు. వారున్నంతకాలము వారి ఇంట్లో వారి ఆసనమునకు ఎదురుగా గోడకు వ్రేలాడదీసిన, తమ గురువైన గౌరిపెద్ది వారిని గూర్చి వ్రాసిన, మాడుగుల వారి పద్యము కనిపించేది. గురుభక్తి శిష్య వాత్సల్యము అంటే అదే కదా! మాడుగుల వారిని గూర్చి చెప్ప బూనటము హిమాలయానికి మంచు ముక్క మోసినట్లే! 1985 లో మిత్రులు బాల కృష్ణా రెడ్డి, TG రామకృష్ణ గార్ల ద్వారా శర్మ గారితో నాకు తిరుపతిలో పరిచయము ఏర్పడినది. వారి యవధానములో నేను అప్రస్తుత ప్రశంస నిర్వహించినాను, ఆ కాలంలో . మళ్ళీ మా పునఃసమ్మేళనము 2014లో జరిగింది. సాహితీ మేరువైనా సామాన్యుడైన నన్ను మరువలేదు. అదే అభిమానము. అడిగినదే తడవుగా, నేను వ్రాసిన 'శంకరదాస అష్టోత్తర శతికి, ఆసాంతమూ చదివి తన అమూల్యాభిప్రాయమును తెలిపిన వారికి నా మనఃపూర్వక కృతజ్ఞతాంజలులు తెలుపకుండా ఎటుల ఉండగలను.

ఆయన వేద విజ్ఞాన నిఘంటువు. షడంగ షడ్దర్శన నిధానము ఆత్మీయతతో పరిశోధనాత్మకమైన వివరణమును ప్రతి పద్యమునకును వ్రాసి నాకు బహూకరించిన, ధూర్జటి మహా కవిగారి, 'కాళహస్తీశ్వర శతక వ్యాఖ్యానము' నా పుస్తక భండారములో నొక అనర్ఘ రత్నము. బృహద్విసహస్రావధాని ,పాండిత్య చక్రవర్తి అయిన వారిని గూర్చి ఒక్క మాటలో చెప్పాలంటే అజ్ఞాన తిమిరాంధక ద్యుమణి నాగఫణి.

 

సంస్కృతాంధ్రమునందు సవ్యసాచియతండు

దేవగురుని, ధాత్రి, దీటతండు

ప్రావాణి మెడలోని ప్రాలంబ మాతండు

కచ్ఛ పీరవయుక్త కంఠుడతడు

పృచ్ఛక కల్హార పృశ్నిపూషుడతండు

విద్వరేణ్య వ్యాళ వెట్టమతడు

శత సహస్రవధాన జగతి ప్రఖ్యాతుండు

తెలుగు తల్లి మకుట తేజమతడు

మాడుగుల వంశ మణి స్వర్ణ మాల యతడు

మంచియను మాటకవనిలో మారతండు

గతము మరువక దలపోయు ఘనుడతండు

నాగ ఫణి శర్మ పాండితీ నగమతండు

 [ధాత్రి=భూమి;ప్రావాణి=సరస్వతి; ప్రాలంబము=హారము; కఛ్ఛపి =వాణీ వీణ; కల్హారము= కలువపువ్వు , పృశ్ని=కిరణము, పూషుడు= సూర్యుడు (సూర్యుని చూస్తే కలువ ముడుచుకొంటుంది); విద్వ రేణ్యవ్యాళ వెట్టము = మదగజములవంటి మహాపండితులకు శత్రువు.

రసాలసాలము=మధుర ఫల వృక్షము.

స్వస్తి. 

1 comment: