Tuesday, 1 November 2022

కీ. శే. శ్రీ గొట్టిముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు

 

 

  కీ. శే. శ్రీ గొట్టిముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు

https://cherukuramamohan.blogspot.com/2022/11/blog-post.html

శ్రీ గొట్టిముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నిజమునకు ఒక అరుదైన వ్యక్తి వారి పరిచయ భాగ్యము నా పూర్వ జన్మ సుకృతము. ఆయన మహోన్నత వ్యక్తి. వందకు పైచిలుకు కావ్యములు వ్రాసినా పేరుకు ప్రాకులాడని మహా కవి, పండితుడు. వీరు విశ్రాంత ఆంధ్ర పండితులుగా కర్నూలు జిల్లా నంద్యాల లో నివసించుచున్నారు. ఆయన నంద్యాల లోని ఏ పాఠశాలలోనైతే విద్యార్ధియో అదే పాఠశాలలో ఉన్నతాంధ్ర పండితునిగా ఉపాధ్యాయ వృత్తి నెరపి పదవి నుండి విశ్రాంతి పొందినా అవిశ్రాంతముగా సాహితీ సాగుబడి చేయుచునే యున్నారు. వారి వద్ద చదివిన మాజీ విద్యార్ధులంతా కలిసి వయసులో ఇపుడు వారెంత పెద్దవారైయున్నా కుడా శాస్త్రిగారెంత వారించినా వినకుండా వారికి మహాగురు సన్మానము నెరపినారు. ఇది ఆయన శిష్యవాత్సల్యమునకు, విద్యార్ధులపై ఆయన వేసిన చెరగని ముద్రకు తార్కాణము. ఈయన సంస్కృతాంధ్రాంగ్ల కన్నడ భాషా ప్రవీణులు. ఈయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు. నాయకురాలు (నాగమ్మ) కార్యసిద్ధి, కథామాల ఇత్యాది బాల సాహిత్యము, మహా నందీశ్వర సుప్రభాతము, జగజ్జననీ సుప్రభాతము, అష్టదిక్పాలక స్తోత్రము మొదలగు సంస్కృత రచనలు, జనారణ్యం, ఒక హృదయం మీటితే, ప్రణయతంత్రం (జ్యోతిలో ప్రచురింపబడినది) మొదలైన నవలలు, శ్రీనివాస ప్రభువు శతకం, జీవన శతకం ఇత్యాది శతకములు నవప్రణవ, శ్రీనివాసాక్షర కావ్యం, శ్రీనివాసస్తోత్రమంజరి (ద్విపద), శ్రీనివాసోదహరణము, వెంగళరెడ్డీయము, కవితా సామ్రాజ్యము (వాసికెక్కిన రచన, ముద్దులపల్లి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి – వావిళ్ళ వారి ఆస్థాన పండితుడు).

ఇటువంటి బృహత్కావ్యముల నెన్నింటినో వ్రాసినారు. సాహితీ వాచస్పతి మొవ్వ వృషాద్రిపతి వంటి లబ్ధప్రతిష్ఠులు శాస్త్రి గారిని గూర్చి ‘ వీరు కవివతంసులు విపశ్చిదగ్రగణ్యులు అనుటలో సందేహము లేదు అన్నారు. వీరు ఇన్ని పుస్తకములు వ్రాసినా అన్నీ ఆయనే అచ్చొతించి పంచినారు. అమూల్యమైన ఆ పుస్తకములను అమూల్యముగానే పంచినారు. వారికి డాక్టరేట్ లేకున్నా వారి నేతృత్వములో ఎందరో ఆంధ్రమున డాక్టరేట్లను సంపాదించినారు.

ఇక నా విషయమునకు వస్తే పరిచయమైనది మొదలు, నాకు ఏవిధమైన సందేహము కలిగినా ఆయన ఎప్పుడూ నవ్వుతూనే దానిని నివృత్తి చేసేవారు. ఆయన పరిచయ భాగ్యము నిజముగా నా పూర్వజన్మ సుకృతము.

 

మహనందీశ మహా కృపాబ్ధిగతమౌ మాణిక్య మీరీతిగా

మహానీయంబగు గొట్టిముక్కల మహా మన్యంపు వంశంబునన్

మహదానందము గూర్చగా తెలుగుకున్ మహాత్మ్యమున్ చేర్చగా

మహ దేవాంకిత సుబ్రమణ్య కవిగా మాన్యుండు గల్గెన్ ధరన్.

స్వస్తి.

 

No comments:

Post a Comment