Tuesday, 26 July 2022

నా మనోగతము

 

నా మనోగతము

https://cherukuramamohan.blogspot.com/2022/07/blog-post_26.html

ఒక విషయమును క్షుణ్ణముగా పరిశీలించి సాటి సహజాతులకు తెలుపుట నాలాంటివానికి సామాన్యమైన పని కాదు. తెలిసినది తెలుపక పోవుట కూడా పాపమే! అసలు 'పాపము' అన్న మాటను ప్రక్కన పెట్టినా విజ్ఞానము అన్నది వీధి దీపము వంటిది. వెలిగించిన వానికి ఆ వీధితోను దీపము తోనూ పని ఉండదు. అయినా వెలిగించి తన బాధ్యత నిర్వర్తించుతాడు. ఆ వెలుతురును సాటి మనుషులు ఉపయోగించుకొంటే అతడు సంతోషించుతాడు. నిజానికి వారిద్వారా అతనికి ఏమీ ఒరగదు.

స్థూలముగా నేటి సమాజ తత్వమును నేను వ్రాసిన ఈ రెండు పద్యములలో మీ ముందుంచుచున్నాను.

ఊరక ఏది వచ్చినను ఒక్కరు కూడను లేక్కచేయరా

కారణ మేమిటన్న తమ కైనటువంటిది సొమ్ము సుంతయున్

చేరదు ఇచ్చువానికిని చింతన చేయరు అందుచేతనే

తేరగ ఏమి ఇచ్చినను తీసుకు పోవక గౌరవింతురే

విత్తమెవ్విధి తనదైన విలువ మార్చు

విద్య అటుగాక వ్యక్తికి విలువ పెంచు

నేరమిని వీడి నేర్మితో నిపుణ మతులు

నిజము నరయంగ గలరులే నిక్కముగను

 నిజానికి ఆస్యగ్రంధి లోని నా వ్రాతలకు మీ Likes కాదు కావలసినది. దానిని నిర్లక్ష్యము చేయక చదవటం కావాలి. మీరు చదివినట్లు గుర్తుగా ఒక చిన్నమాట Comment Box లో వ్రాస్తే చదివిన వ్యక్తి ఎవరు అని తెలుసుకొనే అవకాశముంటుంది.  యువత ఈ దేశము పై, ఈ దేశ చరిత్రపై, అనుపమ మేదావులగు మన పూర్వీకులపై అవగాహన పెంచుకోవలెనన్నదే నా తపన అంతా!

చదివిన పిదప 'బాగుంది' అని ఒక్కమాట వ్రాసినా అది మిగతవారి కళ్ళలో పడుతుంది. వారుకూడా చదివే అవకాశము ఏర్పడుతుంది. Comment అన్నది హనుమంతుని తోక లాంటిది . అది ఎంతయినా పెరుగుతుంది తానూ కాలకుండా శత్రువుల రాజదానికేనిప్పుపెట్టగలుగుతుంది. సంపూర్ణ విషయావగాహన కలిగినవాడే తన వాడముతో శత్రువుల అపప్రథలను ఖండించగలడు.

నేర్చినట్టివాడు నెగడు పోలిక జూడ

ధర్మ మార్గ గతుల దారి జూపు

దానినార్పజూచు దాష్టీకులను గాల్చు

రామమొహనుక్తి రమ్య సూక్తి

అందువల్ల నేర్చుకొనుట అంటే ‘జ్ఞానము’ మన సందర్భములో విషయ పరిజ్ఞానము కలిగినపుడే మన ధర్మమును తెగడే వారి నోరు, మన వాదముతో మూయించగలము.

పూనుకొనితెచ్చెదము పునర్వైభవము

పూనికన తెలుసుకొని పూర్వ వైభవము

హిమనగధృవముపై ఎగురవేసేదము

జాతీయ ధ్వజ యుక్త జయకేతనమ్ము

స్వస్తి.

No comments:

Post a Comment