Wednesday, 6 July 2022

నేటి బ్రాహ్మణ యువత పోకడ

 

నేటి బ్రాహ్మణ యువత పోకడ

https://cherukuramamohan.blogspot.com/2022/07/blog-post.html

నేటి బ్రాహ్మణ యువత పోకడను గూర్చి వ్రాసిన ఈ పద్యమును ఒకసారి చదివి మీ బాధను తెలియబరచేది. తల్లిదండ్రులకు పెంచే తీరుబాటులేదు. పిల్లలకు వినే అలవాటూ లేదు. దిశా నిర్దేశము చేసే నాటి పండితులు నేడు లేరు. సినిమాలు, క్లబ్బులు, పబ్బులు, internet, restaurants, ఆడమగ తేడాలేని friendships, junk food, ఒకటేమిటి బలహీనమైన మనసును ప్రతియోక్కటీ తనవైపు లాగెదే. బ్రాహ్మణుడు రుజువర్తన కలిగినవాడయితే సాటి మనుషులకు, సమాజానికీ చెప్పగలుగుతాడు.

నాకు తెలుసు. వెంటనే 'ఆఁ ఈ కాలము చెబితే ఎవరు వింటారండీ' అన్న మాట వస్తుంది. మనము చెప్పకుండానే 'ఎవరు వింటారు అంటే ఎవరు వింటారు. 'కృషితో నాస్తి దుర్భిక్షం...' ' ఆరంభింపరు నీచమానవులు...'అన్న నానుడులు మీకు తెలిసినవే కదా!

ఒకరి గుర్తింపు మనకు అవసరములేదు. ఆత్మ తృప్తి ఒకటి కలిగితే ఆరోగ్యముగా ఉండవచ్చును.

ఈ వాస్తవమును నీళ్ళు నిండిన కళ్ళతో మీ ముందుంచుచున్నాను.

ఉపనైన కార్యమ్ములొనరించుటయెగాని

జంధ్యముల్ గూటమ్ము జతను గూడె

భుజము పై జంధ్యంపు ప్రోవులుండినగూడ

సంధ్య వార్చుట మలి సంధ్య జేరె

మంత్రముల్ గొణుగుట మాత్రముండినగూడ

మనసంత మగువలే మసలుచుండె

తర్పణంబులకెల్ల తర్పణము గావించి

తనదైన సుఖముకై తపన బడియెఁ

        రెంటికింజెడు రేవడ రీతి గాను

        నడచుచుండగ బ్రాహ్మణ నవత యువత

         నలువ తలలకు నెనరుతో నయముగాను

         అమృతాంజన మునుబూని యలదె వాణి

 

ఉపనయనమయ్యీ జంధ్యములను గూటాలకు తగిలించినారు. ఒకవేళ అది వున్నా సంధ్యచేయుట మరచినారు. అది చేస్తూవున్నా మనసు మాత్రము మగువలపైనే తిరుగుతూ వుంటుంది. ఇక పితృ తర్పనముల విషయమునకు వస్తే తర్పణాలకే తర్పణము వదలినారు. అంటే అట్లాంటిది ఒకటి ఉందని కూడా మరచిపోయినారు.

ఈ విధముగా వుండే బ్రాహ్మణ యువతను చూసి బ్రహ్మదేవునికి తల నొస్తూవుంటే సరస్వతీ దేవి

తప్పు ఎవరిది అంటే

నరవరా నీచే నాచే

వరమడిగిన కుంతి చేత వాసవు చేతన్

ధర చేత భార్గవునిచే

నరయంగా కర్ణుడీల్గె నార్గురి చేతన్

ఏనాటి అగ్రహారమొ

మానాటికి మాన్యమాయె మా పని దీరన్

మీనాటి కండ్రిగాయెను

నానాటికి తీసికట్టు నాగంభట్టూ

ఈ రెండు పద్యముల భావమే సమాధానము.

ఒక జాడ్యానికి పల్లెటూరు, పట్టణము అన్న తేడా ఉండదు. అది అంటుకొన్నదంటే వదిలించే మార్గము తప్ప అన్యదా ఆలోచించి ప్రయోజనము లేదు. కారణాలేవయినా దానిని రూపు మాపే ప్రయత్నమూ ఇపుడు చేయవలసినది.

ఇక Time లేదు అన్నది తర్కమునకు నిలువదు. మనము దానిని అనుసరించవలసిందే. అది మనలను అనుసరించదు. మనకు పురీష శౌచములకు, ఇష్టపడితే దంత దావనమునకు, స్నానమునకు, తప్పనిసరిగా భోజనమునకు, సినిమాలు షికార్లు అన్నింటికీ Time వుంటుంది. సంధ్యావందనమునకు మాత్రము ఉండదు. Sonti Ganesh చెప్పినట్లు ముంద్ఫ్హు పర్షేచనము, (ఆపోశనము - పూర్వ ఉత్తర) చేయుట తో మొదలు పెట్టవచ్చును. కనీసము అర్ఘ్యము వదలి గాయత్రీ మంత్రమును ఉపాసించవచ్చును. సూర్యని కిరణము భూమిని చేరుటకు 8ని.20 సె. పడుతుంది. మరి గాయత్రీ మాత వెలుగు మనపై ఎంతకాలము పడుతుందో గమనించండి. అసలు వెలుగు పడాలంటే మాతను అనుష్టించి ప్రసన్నము చేసుకొంటేనే కదా! మంత్రజపము ఒక నిర్ణీత ప్రదేశమునకు ప్రయాణము వంటిది. మనము ఎంత దూరము నడుస్తామో ఆ దూరము మొదటినుండి తిరిగీ నడుబ్వనవసరము ఉండదని ఆర్యవాక్కు'శ్రేయాంసి బహు విఘ్నాని' అంటారు మరి దానిని త్రోసి రాజని 'కృషితో నాస్తి దుర్భిక్షం...' ను ఆశ్రయించవలసి వస్తుంది.

స్వస్తి.

 

 


1 comment: