Sunday, 15 May 2022

విద్యార్థ సాధన – ఆరోగ్యము

 

విద్యార్థ సాధన ఆరోగ్యము 

https://cherukuramamohan.blogspot.com/2022/05/blog-post_15.html

ఆచార్యాత్ పాదమాదత్తే పాదం శిష్యః స్వబుద్ధినా ॥

పాదం సబ్రహ్మచారిభ్యః పాదం కాలక్రమేణత్ ॥

ఒక పదార్థాన్ని నాలుగు పాదాలుగా విభజించుట ఆనవాయితీ. చేతులు కలుపుకొంటే మనిషికి కూడా జంతువులవలె నాలుగు పాదాలే!  పాదం అంటే పావు భాగమని లేక పాతిక భాగమని లేక కాల్ భాగమని లేక నాల్గవ వంతని, లేక 25% అని  అర్థము. ఇపుడు పై శ్లోకము ఏమి తెలియజేయుచున్నదో చూద్దాము. విద్యార్థి లేక జ్ఞానార్థి  విద్యనూ జ్ఙానాన్ని, ఆచార్యుల నుండి పాతిక భాగము,  తన విచక్షణ విశ్లేషణలతో పాతిక భాగము, సహ విద్యార్థుల నుండి పాతిక భాగము సంపాదిస్తాడు. మిగిలిన నాలుగవ భాగము కాలము గడిచే కొద్దీ, జీవితాంతం వఱకు సంపాదిస్తూనే వుంటాడు. వాస్తవమేమిటంటే విద్యకు జ్ఞానానికి అంతు లేదు.  విద్య జ్ఞానము అని వేరువేరుగా చెబుతూ వచ్చినాను కారణము ఏమిటంటే ఆ రెండూ ఒకటి కాదు. గణితములో  

(a + b) 2 = a2 + 2ab + b2 అన్న సూత్రమును నేర్చుకొని ఆ ఫలితము సాధించుట విద్య. అదే  

14 x 14 యొక్క విలువను సాధించుటకు (10+4) 2 గా వేసుకొని 102+2x10x2+42 గా వ్రాసుకొని 156 అన్న ఫలితమును రాబట్టుట జ్ఞానము. ఎందుచేతనంటే కొందరు 14x14 వేసి హెచ్చించి ఫలితము పొందుతారు. అదే 1004 అయితే హేచించుట ఆలస్యమౌతుంది. తప్పుకూడా పోవచ్చు. కావున జ్ఞానము యొక్క ఆవశ్యకత ఇక్కడ ఏర్పడుతుంది.

ఈ ప్రపంచములో అందరమూ , జీవితాంతమూ విద్యార్థులమే. విద్య, ఒక ఊట చెలమ. నీరు తోడేకొద్దీ ఊరుతూనే ఉంటుంది. పరిపూర్ణత, వయోభేదము అన్నది విద్యకు వర్తించదు. సురేశ్వరాచార్యులుగా జగద్గురు ఆది శంకరులవారి శిష్యుడగు మండన మిశ్రుడు వయసులో శంకరులకన్నా చాలా పెద్దవారు. నేర్చుకోనవలసినాద్ ఉన్నపుడు పెద్దవారైనా చిన్నవారికి శిష్యరికము చేయవలసినదే!

గురుకులములలో కుల, మత, వర్గ, ప్రాంత విచక్షణా రహితముగా, విద్యార్థులంతా అక్కడే వుండి, గురువుకు సేవ చేస్తూ, తమ తమ వర్ణమునకు సంబంధించిన విద్యలను నేర్చుకొనేవారు. దీనితో వారికి పాతిక విద్య పట్టుబడేది.  రెండవ భాగము విద్యార్థి తనకున్న మేధోనిధిని ఉపయ్తోగించి నేర్చుకునేవాడు. మూడవ భాగము సహ సహపాఠకులతో, చర్చల ద్వారా గానీ, సంప్రదింపులా ద్వారాగానీ మంచి చెడులనరసి  జ్ఞానాభివృద్ధి గావించుకునేవారు. చివరి భాగం, పెరిగే కొద్దీ, తనచుట్టూ ఉన్న సమాజమును చూసి, ఆలోచనా పూర్వకముగా, అనుభవపూర్వకముగా అనుభూతి పూర్వకముగా ఆజన్మాంతమూ నేర్చుకుంటూనే వుంటాడు.

విద్యను, ఆచరణలో పెట్టుటే విజ్ఞానము. విజ్ఞానానికి సాధన అన్నది పట్టుకొమ్మ. దానితోనే జ్ఞానమును సాధ్యము చేసుకోవాలి. తను నేర్చుకుంటూ, ఇతరులకు నేర్పించడం వల్ల, విద్య వృద్ధి చెందుతుంది.

న చోరహార్యం, న చ రాజహార్యం,

న భ్రాతృభాజ్యమ్, న చ భారకారిl

వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం

విద్యాధనం సర్వధన ప్రధానమ్ll

దొంగలు దోచలేనిది, రాజులు స్వంతము చేసుకోలేనిది, అన్నదమ్ములతో పంచుకోలేనిది, ఎన్నతటి ఎంత సంపాదించినా భారము కానిది, ఖర్చుపెట్టే కొలదీ కలిసి వచ్చేది విద్య. ఇది నిరంతర ధారావర్దితమగు అమృతోపమానము.

ఈ విషయమై ప్ర్ద్దలు ఇంకా ఈ విధముగా తెలియజేసినారు.

శనైః పన్థాః శనైః కన్థా శనైః పర్వత లంఘనమ్ ।

శనైర్విద్యా శనైర్విత్తం పంచైతాని శనైః శనైః ।।

మెల్లగా అనగా అతిగా నడచి అలసట తెచ్చుకోకుండా,  నడవగా నడవగా గమ్యమును చేరుకొనవచ్చు, అది ఎంత దూరమైనదైనా కానీ. రోజూ కొద్ది కొద్దిగా కుడితే బొంత కొన్ని రోజులకు పూర్తి అవుతుంది. అంతా ఒకే రోజులో కుట్టలేము కదా! గమ్యమును చేరుటకు వెళ్ళే దారిలో ఏదయినా కొండ వస్తే  మెల్లిమెల్లిగా ఎక్కి దాటాలి గానీ తొందరపడితే పిక్కలు పట్టుకుపోయి మనము నడువలేక చతికిలబదడవలసి వస్తుంది. అదేవిధముగా చదువులో కూడా  కొద్దికొద్దిగా నేర్చుకుంటూ విద్యను సంపాదించవలసి వస్తుంది, ధనము విషయములో కూడా అంతే! ధర్మ మార్గమున సంపాదించే వాడు తన ఖర్చు పోగా కొద్దిగా మిగిలినది కూడబెట్టుకొంటూ పొతే లేనిరోజు కూడుబెడుతుంది. శనైర్విద్యా శనైర్విత్తం. అంటే విద్యా ధనములు సంపాదనా పూర్వకముగా రావలేనబనుకొనేవారికి సహనము కాలాఆసరము. మనలో అందరము కాళీదాసులము,నిస్సంతు వీలునామాకు అర్హులము కాలేము.

అందుచేత పెద్దలు  ఈ అయిదింటియందు తొందర పనికి రాదు అని శాసించినారు. ఏదయితే శాసించుతుందో అది శాస్త్రము. అది అజరామరము. దేశకాలపరిస్థితులు ఏవయినా ఈ శాస్త్రవచనములు మారవు. ఈవిషయములోనూ అతి అన్నది పనికిరాదు అని నిర్ద్వంద్వముగా తెలియజేసినారు.

అతిదానాద్ధతః కర్ణస్త్వతిలోభాత్ సుయోధనః ।

అతికామద్దశగ్రీవస్త్వతి సర్వత్ర వర్జయేత్ ॥ "

అతిదానము చేత కర్ణుడు, ఆయన తన సహజ కవచాకుండలములను కూడా దానముచేయుతయే గాక యుద్ధములో అవకాశము వచ్చినా అర్జునుని తప్ప తక్కిన ఉలుగురినీ చంపనని వాగ్దానము చేసి తన ప్రాణము మీదికే తెచ్చుకొన్నాడు. లోభము చేత, అనగా ధర్మరాజు శ్రీకృష్ణునిద్వారా ఐదు ఊర్లనివ్వమని కబురంపినా ససేమిరా అని లోభము చూపి ప్రాణాలు పొగొట్టుకొన్నాడు. అతి కాముకుడై ముందు వెనుక ఆలోచించకుండా సీతను చెరబట్టి రావణుడు అసువుల బాసినాడు.  

     మరొకమాట తెలుసుకొనేఅవకాశము వచ్చినపుడు చిన్న విషయమునైనా విద్యగా భావించి క్షణక్షణము నేర్చుకోవాలి. మన తాత్సారము వల్ల ఆ క్షణము గడిచితే ఆవిద్య మన చేయి జారినట్లే! చిన్న మొత్తమనుకోకుండా పైసా పైసా జమచేయాలి. ఆశ్చర్యకరముగా అదే పెద్ద నిధియై మనల కాపాడుతుంది. చీమ ఆహారాన్ని ముందుజాగ్రత్తగా వాన కాలములో బయటికి పోలేదు కాబట్టి అందుకు తగిన్విధముగా ఆహారు నిలువ చేసుకొంటుంది. అందుకే పెద్దలు ఈవిధముగా చెప్పినారు.

క్షణశః కణశశ్చైవ విద్యామర్థం చ సాధయేత్l

క్షనత్యాగే కుతో విద్యా కనత్యాగే కుతో ధనమ్ ll

వీటన్నింటికీ ఆరోగ్యము మూలము. దానిని గూర్చి కూడా పెద్దలు ముందే చెప్పినారు.

వ్యాయామాత్ లభతే స్వాస్థ్యం దీర్ఘాయుష్యం బలం సుఖం ।

ఆరోగ్యం పరమం భాగ్యం స్వాస్థ్యం సర్వార్థ సాధనం ॥

వ్యాయామము వలన ఆరోగ్యము చేకూరును. దీర్ఘాయుష్షు, బలము, సుఖము కలుగును. ఆరోగ్యమే మహా భాగ్యము. స్వామి వివేకానందుల వారు మన ఆర్ష ధర్మాలని గురించి, హిందూ మత గొప్ప తనాన్ని గురించి ఎంతో గొప్పగా మొత్తం ప్రపంచానికి తెలియ చెప్పి, దానికంటే ముందుగా, ఆరోగ్యము యొక్క ప్రాముఖ్యతను గుర్తించమని నోల్లి చెప్పేవారు.

పురుష స్త్రీ బాల వృద్ధులు అన్న అనే భేదం లేకుండా, తమ శరీర దార్ఢ్యమునకు తగిన విధముగా,   అందరూ వ్యాయామము తప్పక చేయవలసిన అవసరాన్ని ఈశ్లోకము తెలియ చేస్తోంది.

స్వాస్థ్యము సర్వవిధ సంపదకూ మూలము. వెల కోట్ల రూపాయలు సంపాదించి రక్త పీడనము, మధుమేహము కలిగియుంటే మహానిధులకు కాపోఅలావుండే కాలసర్పములుగా బ్రతుకవలసి వస్తుంది. చదువు విషయముననియితే మనసును మగము చేయలేక నిస్పృహతో నిస్సారమైన జీవితము గడపవలిసి యుంటుంది. ధనము లేకున్నా ఒక వ్యక్తి విద్వాంసుడైతే సర్వత్రా పూజింపబడుతాడు. అందుకే పెద్దలు ‘విద్వాన్ సర్వత్ర పూజ్యతే’ అన్నారు.

 

ఆరోగ్యం రెండు రకాలు. శారీరక ఆరోగ్యము. మానసిక ఆరోగ్యము.  మనిషి శరీరానికి ప్రతినిత్యము క్రమ శిక్షణతో కూడిన వ్యాయామము అత్యంత ఆవశ్యకము. నిత్య వ్యాయామము వలన శరీరము అరోగ్యముతో తొణికిసలాడుతూ ఉంటుంది.  మనసుకు నిశ్చల ధ్యానములాంటి ప్రక్రియల ద్వారా మానసిక ఆరోగ్యము చేకూరుతుంది. తద్వారా బుధ్ధి కుశలత పెరుగుతుంది. దీర్ఘ ఆయుర్దాయం చేకూరుతుంది. శరీర అవయవాలకి తగినంత  తగినవిధముగా వ్యాయామము చేయించు సాధనములు ఉపకరణములు ఎన్నోవచ్చినాయి. అవి కొను శక్తి లేకుంటే బస్కీలు దండేలు ఉండనే ఉన్నాయి. వీనిచే స్వాస్త్యత దార్ధ్యము చేకూరుతాయి. అవి వుంటే ఏపని చేయుటకైనా వలసినంత ఉత్సాహము ఉద్వేగము వద్దన్నా వస్తాయి. నిరాశా నిస్పృహలను దరి జేరనీయవు.

ఇటువంటి నేపధ్యములో, ప్రకృతి సిద్ధమైన వనరులతో పెరిగిన ఆహార పదార్థాలను తినడం, కల్తీలకు, బయటి తిండ్లకు దూరముగా ఉండటము, ప్రతి నిత్యమూ బాగా చెమట పట్టేవరకూ, వ్యాయామము, నడక తప్పనిసరి

చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణలో మంచి విలువలు, సాంప్రదాయాలతో జీవితం గడపడం వలన మానసిక ఆరోగ్యానికి తద్వారా బుద్ధి కుశలతకి దోహదపడుతుంది.

ఆరోగ్యమే మహా భాగ్యము. మంచి శారీరక ఆరోగ్యము వలన, చక్కటి మానసిక ఆరోగ్యము వలన  బుధ్ధి కుశలత పెరిగి మంచి ఆలోచనలు కలిగి అవి అన్నియునూ కార్య దీక్షకి, కార్య సాఫల్యతకీ దోహదం చేస్తాయి. మనిషికి ఉండే చక్కటి శారీరక మానసిక అరోగ్యములు సర్వార్థలను సాధించగలిగే సాధనం.

అప్పుడటు విద్యకుగానీ ఇటు దానానికి గానీ కొదువ ఉండదు.

స్వస్తి.

 

 

Friday, 13 May 2022

 

వార్తా పత్రికల సాక్షిగా

ఒకటి కడిగిన ముత్యం

ఒకటి కడగని ముత్యం

ఒకటి ఆణిముత్యం

ఒకటి అసలైన ముత్యం

ఒకటి ఆలిచిప్ప ముత్యం

ఒకటి అరుదైన ముత్యం

మొత్తానికి ఏదోఒక ముత్యం

నీతీ నిజాయితీ పత్యం

ఈ ముత్యా లనునిత్యం

చూస్తున్నామిది సత్యం

కొర్ట్ల కరిగెను  కొన్నిముత్యాలు

కోరకుండా జీత భత్యాలు

జీవితము తమ ప్రజలకేనని

వారి సంపద రక్షకులమని

మభ్య పెట్టిన మహా రాజుల

 మూటలను గొనిమాయమాటల

మభ్యపెట్టెడు న్యాయ వాదుల

నేతిబీరల వాదనమ్ములు

వాస్తవమ్ముల మరుగు పరచగ

తెలిసి కూడా తెలియ నట్లుగ

చూసికూడా చూడనట్లుగ

కళ్ళు మూసీ మూయనట్లుగ

కోర్టు లిచ్చెను తీరుపు

దేశాన కలుగదు మారుపు

మంచి సమయం మించ దొరకదు

మాయువులకిది మార్గదర్శం

అక్రమమ్ముల విక్రమార్కులు

వక్ర మార్గపు చండమార్కులు

కోర్టు వారిని ఆశ్రయించిన

కోరు ఫలితము వచ్చితీరును

చెరుకు రామ మోహన్ రావు

ఇది కొడవంటి సుబ్గారహ్రిమణ్యం గారి మాట. మాట,


ఇది వారు అంకరించిన నా మాట.



Gowri Shankar

మీమాటలు ముత్యాల సరాలు.మాటలు మంత్రాలు.చక్కటి రచన ధన్యోస్మి.
Sadanandeeswaraiah Vallamkondu
కోరకుండానే అనేక ఆణిముత్యాలు పంచారు. ధన్యవాదాలు.
2
  • Like

Murali Thotapalle Venkata

Chala bahu chakkaga neti samaja vyavasta gurinchi Chepperu.
Umapathi Bisilahalli
' SAMAAJAM. YEE ROJULA CHITRANNI ANDHANGAA NIROOPINCHINA , MEE AKSHARALA RANGULA-RAATNAM KI NAA JOHAARLU. GURUGAROO.
Sastry Vemuri
Namaskaram Sir, I can write in Telugu . But not learnt in posts . You have said right Sir, that only courts are Sharanyam. But courts are giving not categorical judgements ,in recent case about fatwas that they have upheld law of the land but one can obey fatwa , individual choice but law of the land is absolute and even if one wants to follow will not have laws protection . Now the chance
is to govts who do not legislate for fear of loosing vote banks .
Citizen for fear of reprisals as some loop exist dare not approach court and fear of litigation .
Our democracy is deteriorating into feudalism . We should change the system into American presidential form which neutralises group interests into one interest of popular vote in president. Governor. Mayor and police chief and judiciary which are strong institutional forces and checks and balances . One may think of emergence of conservatism if what? will not set the clock back and sell national interest nor undermine the March of progress nor surrender national strength. It can not revive facism. It is not so in absolute systems like even in communist regimes and military or faith directed governance of authoritarianism.
One may wonder how to achieve , simple popular vote will do it. Our constitution permits. The basic feature is federalism, checks and balances and elections and independent judiciary. Forms of democracy is not the basic feature as the basic features are of democratic governance. One may quote present American condition , it is not going to undermine the strength of system. In our case like any where when security is threatened nation emerges as one but in regular governance what govt can achieve is not happening because of myriad views welcome but are not gelling into one force of action that will push nation ahead. Since we have democracy it is still not weak as said rightly because of courts but here also aberration are visible lately.

Friday, 6 May 2022

నా పుస్తకోద్ఘాటన సమావేశమున నా ప్రసంగము.

 నా పుస్తకోద్ఘాటన సమావేశమున నా ప్రసంగము

ఇది 5 సంవత్సరముల క్రితము జరిగిన నా పుస్తకముల ఆవిష్కరణ సభ. ఉద్దండులు ఆసనములనలంకరించిన సభ. కొందరు ప్రముఖులు ఆత్మీయులు ఆరోగ్యము, వార్ధక్యము అడ్డుపెట్టుటచే హైదరాబాద్ రాలేకపోయినారు. వారి ఆశీస్సులు అభినందనలను మాత్రము అందజేసినారు. నా ఉపన్యాసములో వారందరినీ గూర్చి తగినమేరకు వ్రాసినాను. ఇందులో కొందరు మన మధ్యలేరు. వారి ఆశీస్సులు అభిమానము నన్నంటుకొనియే ఉంటాయి. సమకాలీన విజ్ఞులను గూర్చి తెలుసుకొంటారని, నా ఆశ. అందుకే నాటి విషయము నేడు తిరిగీ మీముందు ఉంచుచున్నాను.

 ఈ లేఖనము చదువుటకు పెద్దదే! కానీ సగము సగముగా నేను ప్రకటిస్తే చదువుటకు కొంత ఉత్సాహము తగ్గుతుందన్న ఉద్దేశ్యముతో పూర్తి పాఠమును మీ ముందుంచుచున్నాను.

నా సమావేశ ఉపన్యాస విన్యాసము

పుస్తకావిష్కరణ సమయమున నాచే చేయబడిన ఉపన్యాసము:

నా పేరు రామ మోహన్ రావు. మా తండ్రి నన్ను 'రాముడూ' అని పిలిచేవారు. ఆయన పెద్దవాడు కావున DO అని శాసించేవాడు. నేను ఆ అవకాశమును ఇప్పుడు పోగొట్టుకొన్నాను. కారణం ఆయన శివుని రాముని తలచి-తలచి , తన్మయుడై తపించి జపించి  కైలాసము చేరినాడు. దేవుని కలియుటకై. 'అమ్మ' లేని నన్ను పెంచిన మా అమ్మమ్మ కూడా శివారాధన చేసి-చేసి శివ సాయుజ్యము చేరింది. ఇక ఇద్దరూ అక్కడ వున్నపుడు, ఆ సాంబశివుని శిశువును మచ్చిక చేసుకొంటే నన్ను శివునికి వారు మువ్వురూ కొంచెము 'Recommend' చేస్తారన్న నమ్మకముతో మొదట ఆయనను ప్రార్థించి నా ఉపన్యాసమును ప్రారంభిస్తాను. తప్పక చెవులు మూసుకొని శ్రద్ధగా వింటారని ఆశ.

మీ వంటి సహృదయుల అభిమానమును తప్పించి జీవితములో నేను సాధించినది ఏమీ లేదు. సాధించినది లేదు కాబట్టి  నన్ను నేను దండగ రాముడు అని అనుకొంటూవుంటాను. ఇక వినాయకునికి నా ప్రార్థన:

దండగ రాముడ నీకై

దండల తగు అండనివ్వు దాక్షిణ్య నిధీ 

దండములు గూర్చి దండిగ

దండగ మెడవైతునేక దంతుడ నీకున్

శ్రీకరమౌ కరమ్ము మది చింతలు బాపుచు సేద తీర్చుచున్ 

ఆకరమౌచు నాకవన మమృత ప్రాయము గాగ ప్రణవమై 

భీకర భావజాలముల భీతిని బాపుచు మార్దవమ్ముగా 

శ్రీకర భావసంపదల సిద్ధిని గూర్చు గణేశు గొల్చెదన్

సభనలంకరించిన విజ్ఞులకు, ప్రాజ్ఞులకు, ఉపజ్ఞులకు, సర్వజ్ఞులకు, సంస్కార సంయుక్తులగు సదస్యులలోని సరస్వతీ మాతకు సవిధేయతా నమస్కారము. ఒక కార్యక్రమము సక్రమముగా జరుగ వలెను అంటే అందుకు అత్యంత ప్రధానమగు ఉపాంగము వేదిక. అది లేదంటే ఆవిష్కరణే లేదిక. కావున నా కృతజ్ఞత మొదట 'భారత్ వికాస్ పరిషత్' కు సమర్పించుకొంటాను. సంస్థకు ప్రాణము దానిని నడిపే వ్యక్తులే. ఈ సంస్థకు ఇంతటి పేరు ప్రతిష్ఠ కూర్చిన శ్రీయుతులు సుబ్బారావు గారు, హనుమంత రావు గారు, రాజేశ్వర రావు గారు, ఇంకా ఎందఱో ప్రముఖులు, నాకు పేర్లు గుర్తులేక తెలుపలేక పోతున్నాను, ఎన్నో సేవా కార్యక్రమములకు తోడుగా ఈ సారస్వత వ్యాసంగమును కూడా పెట్టుకొని సమర్థవంతముగా సాగిస్తున్నారంటే వీరపర భగీరతులు కాక వేరెవ్వరు. నన్ను అన్ని విధముల ఆదుకున్న, అట్టి సౌమనస్కులగు వారందరికీ నా సవినయ కృతజ్ఞతలు. ఇటువంటి వారి పరిచయము కలుగుట నా అదృష్టము, కలిగించిన శ్రీయుతులు నాగేశ్వరరావు, మూర్తి గార్లకు నా ఆశీస్సులు. నేను అను కదలలేని ఈ రథాన్ని కదిలించే రెండు చక్రాలు వారిరువురు.

ఇక పుస్తకము విషయమునకు వస్తే, కృతిని ఆర్యులు ‘కవన కన్య’ అంటారు. కన్యకకు నేను పితృత్వమును బడసిన తరువాత తగిన సమయములో తగిన వరుని తప్పక చూడవలసినదే కదా! అసలు మానవుడు ఆశాజీవి. అందునా తండ్రి తన కుమార్తెల మీద కొంచెము మమతానురాగములను ఎక్కువగా పెంచుకొంటాడు. పుట్టబోయేది ‘కవన కన్యక’ అంటే కూతురే కాబట్టి పుట్టుటకు ముందే వరాన్వేషణ ప్రారంభించినాను. శివుడు తగినవాడనిపించింది. ఎందుకంటే విష్ణువు వలె పట్టు వస్త్రములు కోరడు, ఎగరడానికి ఏ విమానమో కదలడానికి ఖరీదయిన కారో కోరడు. ఆయనకు ఎద్దు, ఆ ఎద్దుకు ఇంత మేత నీళ్ళు వుంటే చాలు. ప్రేమగా దువ్వి ఎంత దూరమయినా ప్రయాణము సాగించుతాడు. మరి అల్లుని మర్యాదకు పెట్టే ఖర్చు నాకు తగ్గిపోయినట్లే కదా! ఆయన నిత్య నిరంతర నిఖిలాత్మకుడు. అమేయుడు, అజేయుడు, అజరామరుడు. అప్పుడు నా కూతురు కూడా కలకాలము దీర్ఘుసుమంగళిగానే ఉండిపోతుంది కదా! ఆయన కాలకాలుడు. మరి తనతో ఉన్నవారికి నాశము ఉండదు కదా! అందుకే ఆయనను నా కూతురికి భర్తగా ఒప్పించినాను.

ఇక పెళ్లికుమార్తెను సర్వాంగ సుందరముగా తయారు చేయుటకు ‘Bridal Makeup’ అవసరము కదా! అంటే Printing అని నా ఉద్దేశ్యము. దానికి ప్రత్యేకముగా విశాఖపట్న వాస్తవ్యుడు శ్రీ ధర్మతేజ వెంకట్రావు ప్రత్యేకమగు శ్రద్ధ తీసుకొని  అచ్చొత్తించి సమయమునకు అందజేసినారు. ఆయనకు మిక్కిలి కృతజ్ఞుడను.

ఇక పెళ్లి పెద్దలను గురించి చెప్పుకొనవలె. నేను ఇటీవల అరుణాచలేశుని దర్శనమునకు పోయినపుడు ఆయనతో ‘స్వామీ మరి నీ పెళ్ళికి పెద్ద ఎవరని మొరపెట్టుకొన్నాను.’ అందుకు బదులుగా ఆయన “మూర్ఖుడా! కంటి ముందే నా పేరు గలిగిన  నీ గురువును పెట్టుకొని కలియ జూస్తున్నావే కనిపించని వారి కోసం “ అన్నాడు. నా జ్ఞాననేత్రము విప్పారింది. ఒక బరువు తీరింది. మరి ఈ పెళ్ళికి పురోహితుడెవరు అని అడిగినాను. అందుకు స్వామి “ విద్వన్ మణి, అవధాన సహస్ర ఫణి, మాడుగుల నాగఫణి వుండగా చింత ఏల” అన్నాడు. ఆవిధముగా శర్మగారు కూడా అమరినారు. మరి పెళ్ళిపెద్దలో, అవధానం నాగరాజ రావు, చొప్పకట్ల సత్యనారాయణ, చప్పిడి నీలకంఠా రెడ్డి , ఉన్నారు అని స్వామి అన్నారు. ఈ పెద్దల పేర్లకు ‘గారు’ ఎందుకు చేర్చలేదంటే వారి పేర్లు తెలియజేస్తూ వుండేది శంకరుడు కదా! ఇక ప్రేక్షకులు అంటావా నీ సభలో ఉండబోయేవారంతా నా గణములే! అన్నారు. నేను ఎంతో భాగ్యశాలిని, ఇంతటి ఉత్తమ ప్రేక్షకులు కలుగుట. ఎండాకాలము కాబట్టి మామిడి తోరణాలు కోయిల సన్నాయి ప్రకృతే సమకూర్చింది.  ఇక నాకేమి కొదవ.

ఇంకొక ముఖ్యమయిన విషయము , అసలు వివాహము హిమాలయములలోనే జరుగుచున్నదా అన్నట్లు మన భారత్ వికాస్ పరిషత్తు సమకూర్చిన ఈ వాతానుకూల వేదిక (Air Conditioned hall) అతిధులకు ఆహ్లాదమును సమకూర్చుతుంది. ఆడపిల్ల పెళ్ళి కదా! అంతో ఇంతో ఎంతో కొంత సహకరించుట ఉచితమని తలచి, ఈ పెళ్ళి ఖర్చునకు తమవంతు ఆర్ధిక సహాయమును చేసిన వితరణ శీలులందరికీ మనఃపూర్వక నమస్కారము నాచరించుచున్నాను.

ఈ పెళ్ళి ఇంత వైభవముగా జరుగుటకు దోహదపడిన ప్రముఖులకు పద్య రూపములో నా కృతజ్ఞతలు, వస్త్రమునకు నూలుపోగులా, అగరు బత్తీకి వెదురు పుల్లలా, వెన్నిలా ఐస్క్రీముకు వేఫర్ కోనులా, TV బొమ్మకు cable connection లా, నా కృతజ్ఞతలు చెప్పుకుంటాను.

1. Dr. శ్రీ పి వి అరుణాచలం గారు

వీరికున్న డిగ్రీలు వీరు నిర్వహించిన పదవులు గణితమునకు సంబంధించినవయితే ఆంధ్రమున వీరి పాండిత్యము అపూర్వము. వారి బిరుదులూ, హోదాలు, పట్టాలు నేను చదువబట్టితే సమయము అందుకే సరిపోతుంది. అందుకు ‘దాసరి తప్పు దండముతో సరి’ అన్నట్లు వారికి నమస్కరించి నా ప్రసంగము కొనసాగించుతాను. మొన్న ఈ మధ్య ‘తెలుగు విశ్వ విద్యాలయము వారు’ వీరిని సన్మానించుటయే ఇందుకు తార్కాణము.

కళ్ళు మసక గొన్న, కంటియద్దమతడు

జ్ఞానవని యతండు  జ్ఞాన ఖనియు

దారి గనని వాని దైవమే యాతండు

గురుతునుంచుకొనుము  గురువతండు

పి’ వివరమెరుగ   ప్రొఫెసరు (S V University)

వి’ విషయము తెలుసుకొన్న వీసీయగు నీ (Dravidian University, Kuppam)

పీవీ’ ని ముందు గల్గిన

పీవీ అరుణాచలార్యు ప్రీతిగ కొలుతున్

2. Dr. వల్లూరి విశ్వేశ్వర సుబ్రహ్మణ్య శర్మ గారు 

వీరు ఆది నుండి తుది వరకు చదువులో అగ్ర తాంబూల గ్రహీత. దేశంలో సుప్రసిద్ధమైన భారతీయ విఙ్ఞాన్ సంస్థాన్  (Indian Institute Of Science)) విద్యుత్ తాంత్రిక విభాగమునుండి 1964, 1966, 1971 లో BE, ME, PhDలు పొందినారు. 1967లో అక్కడే ఉపన్యాసకునిగా చేరిన వీరు, 2006 లో కంప్యూటర్ సైన్సు మరియు ఆటోమేషన్ విభాగంలో ఆచార్యునిగా పదవీ నివృత్తి పొందినారు. 2012 వరకు అక్కడే INAE Distinguished Professor గా ఉండినారు. ఎన్నో దేశ విదేశ విశ్వ విద్యాలయములకు Visiting Professor గా వుండినారు. సద్గురు శివానంద మూర్తిగారు స్థాపించిన సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్టు నుండి 2010 – విశిష్ట పౌర సన్మానాన్ని అందుకున్నారు. Indian Academy of Science, Indian National Academy of Science మరియు Indian Academy of Engineering లలో విశిష్ట సభ్యునిగా ఎన్నికైనారు. వారు తెలుగు ఇంగ్లీషులలో చరిత్ర, తత్వ శాస్త్రము, సాహిత్య విషయాలపై వ్యాసరచనా వ్యాసంగమును సద్గురువు శివానంద మూర్తిగారి కోరిక మేరకు చేబట్టి నిరాఘాటముగా నిరంతరాయముగా కొనసాగించుచున్నారు. నా మాట వీరిని గూర్చి

సాంకేతికంబైన చదువు నెవ్వరు సాటి

కలన విద్య యందు గాంచ మేటి

ఆచార్య పదవికే యాతడౌను కిరీటి

సందేహతప్తుని సతత సురటి

సరస గీర్వాణాంధ్ర సాహిత్య ఘనపాఠి

ధర్మ దర్శక వితతి ధన్వి ధాటి

విజ్ఞాన మధుపుష్ప విష్టపమ్మున తేటి

వసుధ మేధావిగ్రావంపుకోటి

నాదు ప్రార్థన మన్నించి నలువ రీతి

అట్టి విద్వచ్ఛిరోమణి యాదరాన

వ్రాసె దనమాట, శివునాఙ్ఞ వాటుగొనుచు

శంకరునిదాస విరచిత శతకమునకు

౩. Dr. మాడుగుల నాగఫణి శర్మ గారు

అజ్ఞాన తిమిరాంధక ద్యుమణి నాగఫణి. ఈయన జగమెరిగిన బ్రాహ్మణుడు. ఆ స్వయంప్రకాశక మణికి జీరో బల్బు అవసరమా! అయినా నా మాటగా ఒక మాట చెప్పుట నా బాధ్యత.

సంస్కృతాంధ్రమునందు సవ్యసాచియతడు

దేవగురుని, ధాత్రి, దీటతండు

ప్రావాణి మెడలోని ప్రాలంబ మాతండు

కచ్ఛ పీరవయుక్త  కంఠుడతడు

పృచ్ఛక  కల్హార పృశ్నిపూషుడతండు

వైరి పండిత దంతి వెట్టమతడు

శత సహస్రవధానజగతి ప్రఖ్యాతుండు

మన తెల్గుగళసీమ మణియతండు

మాడుగుల వంశ మకుటాయమానమతడు

మంచియను మాటకవనిలో మారతండు

గతము మరువక దలపోయు ఘనుడతండు

నాగఫణి శర్మ నామాన నెగడునతడు

4. వేదమూర్తులు సామవేదం షణ్ముఖ శర్మ  గారు

ఈయన విజ్ఞాన ఖని, ప్రజ్ఞాధని, సుజ్ఞాన సుమవని. ఈయనను గూర్చి నేను చెప్ప బూనటము శ్రీ గంధపు చెట్టు నకు చందనము వ్రాయుటయే! బాధ్యత కాబట్టి ఒక మాట చెప్పక తప్పదు.

ఋషుల ఘనత దెల్ప ఋషి పీఠమును నిల్పి

జనుల సేవ జేసె జగతి మెచ్చ

అపర షణ్ముఖుడతడన్యుండు కాదిల

మనకు మంచి పంచు మార్గదర్శి

సామవేదమన్న సామన్యుడామరి

సకల వేద మూర్తి సత్వవర్తి

అట్టి వ్యక్తి చిత్తమందున్న  షణ్ముఖు

నర్చి మ్రోక్కులిడుదు నాత్మ సాక్షి

5. Dr. వేటూరి ఆనంద మూర్తి గారు

వీరు అన్నమయ్య కృతులను వెలుగులోనికి తెచ్చుటయే గాక బహుళ పరిశోధనా గ్రంధములను వ్రాసి గొప్పగొప్ప విషయముల వెలికి తెచ్చిన మహనీయులు, బ్ర.శ్రీ.వే. వేటూరి ప్రభాకరశాస్త్రి గారి కుమారులు. పద కవితలపై doctorate పట్టా సాధించినారు. ఉస్మానియా విశ్వ విద్యాలయమున Professor గా 35 సంవత్సరములు పనిచేయుటయే కాక శ్రీలంక మొరీషియస్ విశ్వ విద్యాలయములకు పనిచేసి Cambridge University visiting Professor గా కూడా వుండినారు.

క్రొత్త యన్న చింత కొంతయైనను లేక

కావ్య మెట్టిదన్న కలత లేక

కూర్చె తనదు మాట కోరిన తడవుగా

అట్టి విజ్ఞునతము నంజలింతు

ఆనంద మూర్తి మనసది

ఆ నందన వనము, పలుకు, నాత్మీయతయున్

ఆనంద బంధురములవి

ఆ నందకుమారు పగిది యాతడు నాకున్

6. బ్ర||శ్రీ||వే|| చొప్పకట్ల సత్యనారాయణ గారు

వీరు సత్యసాయిబాబా  గారి పరమ భక్తులు.  వీరి రచనలన్నీ  సాయి సంకీర్తనే.  వీరు శ్రీ సత్యసాయి గీతాంజలి (2 భాగములు) శ్రీ సత్యసాయి సంకీర్తనా త్రిశతి, శ్రీ సత్యసాయి చరితము (2 భాగములు) శ్రీసత్యసాయి భాగవత సత్కథామృతము (4 భాగములు) (చంపూ ప్రబంధము -3419  గద్య పద్యములు)  వ్రాసిన మేటి కవి పండితులు. నాటి భారతి పత్రికకు ఎన్నో వ్యాసములు వ్రాసినవారు.  విద్యా జ్యోతి అన్న మాస పత్రికకు సంపాదకునిగా 2 సంవత్సరములు పని చేసినారు.  ఆంధ్రప్రాచ్య కళాశాలా  ఉపన్యాసకులుగా 30 సంవత్సరములు పనిజేసి  ఇప్పుడు D.D. Colony లోని తమ స్వగృహములో విశ్రాంతి తీసుకుంటూ వున్నారు.

సరసమైన రీతి సాహితీ రసప్రీతి

పాప కార్య భీతి బహుళ నీతి

సరకు గొనని ఖ్యాతి షడ్వర్గపు అరాతి

చొప్పకట్ల నియతి జయతిజయతి

7. Dr. నాగరాజారావు గారు

నాగరాజారావు గారు నాకు ఒక పెద్ద దిక్కు.  ఆయనను ఎప్పుడు నాకు అన్నగానే తలుస్తాను.  ఆయన సహవాసము బ్యాంకి  ద్వారానే అయినా,  ఆ తరువాత  మాత్రము  విడిపోని ముడియై నిలిచినది.

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయములో Reader గా పని చేసి ఇపుడు విశ్రాంతి తీసుకుంటున్నారు.  దత్త మండలమైన కడప కర్నూలు అనంతపురము బళ్ళారి జిల్లాలకు ‘రాయలసీమ’ అన్న నామకరణము  చేసిన మహనీయుడగు  చిలుకూరి నారాయణ రావు గారి పై పరిశోధన జరిపి Doctorate పొందినవారు.  

రావా కల్గెను నాకు కష్టమనగా రాకెట్ల నేనుందు నీ

రావాలేల యటంచు తక్షణమునన్ రాగంబుయున్ దీక్ష పా

రావారంబుగ  నొప్ప నాకు తగుసా రంబైన సద్బోధతో

రావా! వత్తువు  నీవు  నాగ, మహ,రాజావధానంబుతో

8. శ్రీ నీలకంఠారెడ్డి  గారు

నీలకంఠారెడ్డి నాకు నిజమైన తమ్ముడు. నిజమునకతడు నా బహిః ప్రాణము.  అసలా శంకరుడే తన అంశనీ నీలకంఠుని రూపములో పంపినాడని నా నిశ్చితాభిప్రాయము.  ఏమి విజ్ఞత. ఎంత సంస్కారము. ఆ నీలకంఠుడు దేవతల కష్టములను తీర్చ హాలాహలమును ఒక సారి మ్రింగితే తడవ తడవకు నాకు సంభవించిన హాలాహల సాదృశ్య మైన  కష్టములను అణుమాత్రము కూడా సంశయించక   ఆరగించి అరిగించుకున్నాడు.  ఆతనికీ సంస్కారము నిచ్చిన తల్లిదండ్రులకు, గురువు మరియు బిడ్డ నిచ్చిన  మామయగు శ్రీ శివశంకరరెడ్డి గారికి త్రికరణ శుద్ధిగా  నమస్కరించుచున్నాను.

నిక్కమైన మనసు నీటైన తలపులు

నింగి మీద బడ్డ నిలచునట్టి

తపనయున్నవాడు  తానాయె నాతోడు

నీలకంఠారెడ్డి నిజముగాను

మనసు వాడి పోని మల్లెల పూదండ

నిక్కమైన రెడ్డి నిండుకుండ

ఆపదన్న వారి కతడండయునుదండ

వైరి దయ్యములకు వేపమండ

9. శ్రీ  గొట్టిముక్కల  సుబ్రహ్మణ్య శాస్త్రి గారు

శ్రీ  గొట్టిముక్కల  సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నిజమునకు ఒక అరుదైన వ్యక్తి . వారి పరిచయ భాగ్యము  నా పూర్వ  జన్మ సుకృతము.  ఆయన మహోన్నత వ్యక్తి. వందకు పైచిలుకు కావ్యములు  వ్రాసినా పేరుకు ప్రాకులాడని మహా కవి, పండితుడు.   వీరు విశ్రాంత ఆంధ్ర పండితులుగా కర్నూలు జిల్లా నంద్యాల లో నివసించుచున్నారు.  సాహితీ వాచస్పతి మొవ్వ వృషాద్రిపతి వంటి లబ్ధప్రతిష్ఠులు  శాస్త్రి గారిని గూర్చి ‘ వీరు కవివతంసులు విపశ్చిదగ్రగణ్యులు  అనుటలో సందేహము లేదు అన్నారు.

ఈయన సంస్కృతాంధ్రాంగ్ల   కన్నడ భాషా ప్రవీణులు.  ఈయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు.  ప్రసిద్ధ మాసపత్రిక జ్యోతి కి ఒక నవలను వ్రాయుటయే కాక బుడ్డా వెంగలరెడ్డి గారి చరిత్ర పద్య కావ్యముగా వ్రాసి రేనాటి ఋణము తీర్చుకున్నాడు. వీరికివే నా కృతజ్ఞతలు

మహనందీశ మహా కృపాబ్ధిగతమౌ మాణిక్య మీరీతిగా

మహానీయంబగు గొట్టిముక్కల మహా మన్యంపు వంశంబునన్

మహదానందము గూర్చగా తెలుగుకున్ మహాత్మ్యమున్ చేర్చగా

మహ దేవాంకిత సుబ్రహ్మణ్య కవిగా మాన్యుండు గల్గెన్ ధరన్.

10. Dr. కోడూరి ప్రభాకర రెడ్డి గారు

పుస్తక రచన సంపూర్ణమౌతూనే నేను మాటలాడిన మొదటి వ్యక్తి డా.ప్రభాకరరెడ్డి గారు. ఆయన ప్రోద్దటూరి లో శిశు వైద్య నిపుణుడు. ఆయన సేద్యము, వైద్యము, పద్యము  దేనిలోనైనా దిట్ట. 

 సేద్యములో వైద్యములో

పద్యములో గద్యములో

విజ్ఞతలో విభవములో

లేడుసాటి లేదుపోటి

కోమల సాహితీ వల్లభ’ బిరుదాంకితుడు అనేకానేక పద్య, గద్య, నాటక రచయిత. వారు వ్రాసిన ‘రేనాటి పలుకుబళ్ళు’ అన్న కరదీపికతో రాయల సీమ మారు మూలాలు కూడా సులభముగా చూడవచ్చును. ఇంత వైదుష్యమున్నా నేను  వ్రాసిన శతకములో DTP తప్పులు, వ్యాకరణ దోషములు సవరించి పంపిన వారి అభిమానమునకు సర్వదా కృతజ్ఞుణ్ణి.

స్నిగ్ధ  భావ కమలాలను

ముగ్ధ మొహనముజేసే

కవితా సవితా  మూర్తికి

కడు కోమల హృదయానికి

సేద్య వైద్య పద్య విద్య

చేయగలుగు చేవగలుగు

ప్రతిభాకరుడౌ శ్రీయుత

ప్రభాకరున కిదేనా

సవినయంపు హృది స్పందన

సారస్వత అభినందన

కోమల సాహితీ వల్లభ

కొనుము కడప సుర్యపభ

చివరిగా ఒక్క మాటతో నా ఉపన్యాస విన్యాసము నుండి సన్యాసమును గైకొనుచున్నాను. నేను కొన్ని పుస్తక ఆవిష్కరణ సభలలో చూసిన ఒక ప్రత్యేక పాఠక వర్గమును గమనించిన తరువాత ఈ పద్యము వ్రాసినాను. మేధో పటుత్వము, ఆలోచనా సరళి, ఊహాలోకావలోకనము, పద సంపద, అన్నింటికీ మించి పాఠకాకర్షణా యోగ్యత  కలిగిన మానసిక సమతౌల్యము అవసరము వ్రాయసకానికి. సహాయ సహకారమునందించగల అంగ బలము అవసరము. ఇక మూడవది అర్థము. అర్థము లేకుండా పనిని తలపెట్టుట వ్యర్థము. అందుకే ఈ మాట వ్రాసినాను.

చదివియు పద్యమందుగల సాంద్రత గాంచగ లేని విజ్ఞునిన్ 

మొదలు తుదంట దా చదివి మోదము తెల్పని బుద్ధిమంతునిన్ 

ఉదియగొనంగదా కృతిని ఊరక పొందగా జూచు శ్రేష్ఠునిన్

కదియగ వీరికిద్ధరను గానము వీరికి వీరె సాటియౌ

శ్రద్ధతో వినిపింపజేసిన మీ సహనమునకు నమస్కరించుతూ ఇక ఈ ఉపన్యాస విన్యాసము నుండి సన్యాసము స్వీకరించుతాను.

స్వస్తి.