Saturday, 5 March 2022

మకుటాయమాన చాటువులు (మామిడి గొప్పదనము)

 

మకుటాయమాన చాటువులు

 https://cherukuramamohan.blogspot.com/2022/03/blog-post.html

వెలయాలును, శిశువల్లుడు

ఇలయేలిక, యాచకుండు నేగురుధరలో

గలిమియు, లేమిము, దలపరు

కలియుగమున గీర్తికామ! కాటయవేమా!

కాటయవేముని సంభోధిస్తూ, కీర్తిస్తూ ఎవరోకవి చెప్పిన పద్యమిది. వెలయాలు, పసిబాలుడు, ఇంటి అల్లుడు, భూపతి,  బిచ్చగాడు భూమిపై గల ఈ 5 మంది తాము ఆశించే వ్యక్తి వద్ద ఇవ్వగల సత్తా ఉన్నదా లేదా అని యోచించరు.

 

“ కవయః క్రాంత దర్శినః” అన్నారు పెద్దలు. సామాన్యులు చూడలేని దృశ్యాలని కూడా కవి తన మనోనేత్రంతో చూడ గలడు. అందుకనే “రవి గాంచనిచొ కవిగాంచును” అనగా సూర్యుడు చూడలేనివి కూడా కవి చూసి వర్ణించ గలడు అని అర్థం. చిన్ని ఉదాహరణ.

ఓ పెంపుడు చిలక దానిమ్మ పళ్ళ గింజలని భుజిస్తోంది. సాధారణంగా దానిమ్మ గింజలు కొంచెంతెల్లగా, కొంచెంఎర్రగా ఉంటాయి. మన కంటికి మామూలుగా కనపడే ఆ దానిమ్మ గింజలని కవి ఎంత అద్భుతంగా వర్ణించాడో చూడండి. ఆ చిలుక తినే దానిమ్మ గింజలు.

“ హరి నఖర భిన్న మత్త మాతంగ కుంభ రక్త ముక్తాపల సదృశాని దాడిమీ ఫల బీజాని” హరి అంటే సింహం. సింహం యొక్క నఖర=గోళ్ళతో (పంజాతో) భేదించ బడిన మత్త గజము యొక్క కుంభస్థలముపై నుండి కారుతున్న రక్తంతో తడిసిన, (ఏనుగు కనబడితే సింహం ముందుగా దాని కుంభస్థలం పైకి ఎగిరి కొడుతుందిట.)

ముత్యాలహారంలోని ముత్యాలవలె ( కుంభస్థలంనుండి స్రవిస్తున్న రక్తంతో తడిసి, కొంచెంఎరుపు, కొంచెం తెలుపుగా కనబడే ముత్యాలవలె) దానిమ్మగింజలు ఉన్నాయిట” చూసేరా! చిన్న విషయాన్ని ఎంత గొప్ప ఉపమానంతో వర్ణించాడో కవి. అందుకనే ---

“అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతిఃl

యధాస్మై రోచతే విశ్వం తధేదం పరి వర్తతే ll”  అనగా

కావ్య సృష్టి చేయటంలో కవి బ్రహ్మవంటివాడు. తనకి తోచిన విధంగా తన కవితాప్రపంచాన్ని సృష్టించు కొంటాడు. అని ఆర్యోక్తి. అట్టి కావ్య ప్రపంచంలో చాటువులని కూడ కవే సృష్టించాడు.

మామిడిని గూర్చి నా మనసులోని మాట:

మావీ నీదగు మాన్యతన్ దెలుప మా కేరీతి శక్యమ్ము  నీ

కేవీ సాటిగ రావు సత్యమిది నీకే చెల్లులే గాంచగా

మోవీ స్పర్శల పుల్కరింతలెగయన్ మూర్ధన్యవైనావులే

ఏవీ నిన్ బొగడంగ శబ్దములు ఎంతెంతేని యోచించినన్

అందరూ ఇష్టపడే మామిడి పండును కవి ఎంతగోప్పగా చాటువులో వర్ణించినాడో  ఇప్పుడు చూద్దాం.---        

 “ ఆభూచ్చామా జంబూ:, దళిత హృదయం దాడిమ ఫలంl 

సశూలం సంధత్తే హృదయమవమానేన పనసఃl 

భయాదంతస్తోయం తరుశిఖరజం లాంగలి ఫలంl 

సముద్భూతే చూతే జగతి ఫలరాజే ప్రసరతిll ” ఇది శ్లోకరాజం.

 

ఇప్పుడు ఇందులో ఉన్న గొప్పతనం చూద్దాం:--- “ జంబూ: = నేరేడు పండు. దాడిమ ఫలం= దానిమ్మ పండు. పనసః= పనసపండు. లాంగలి ఫలం = నారికేళఫలం.( కొబ్బరి కాయని సంస్కృతంలో ఫలమనే అంటారు) చూతం = మామిడిపండు.” ఇవి పై శ్లోకం లోని ఫలాలు. ఇప్పుడు వివరణాత్మకమైన భావాన్ని తెలుసుకొందాం. పై శ్లోకం మరలా చదవండి. ముందుగా నాల్గవ పాదం భావం చూద్దాం

 “పళ్ళలో మామిడిపండు ‘ఫలరాజము’గా ప్రపంచంలో కీర్తించ బడటం చూసి, మిగతాకొన్నిపళ్ళు చాలా బాధ పడ్డాయిట. ఎలా అంటే (ఇప్పుడు మొదటి పాదం నుండి చూద్దాం) నేరేడుపండు ముఖం మాడ్చుకొన్నదట, దానిమ్మపండు గుండె బ్రద్దలైనదట, పనసపండు గుండెలో కత్తి దిగినట్లు అయినదట, కొబ్బరికాయ గుండె నీరైపోయినదట. ఈ విధంగా పళ్ళన్నీ తమ బాధని వ్యక్తపరచినాయి”,  అని కవి ఎంత అద్భుతంగా వర్ణించినాడో చూసినారా! ఇందులో చమత్కారం ఏమిటంటే నేరేడు పండు నల్లగా కమిలినట్లు ఉంటుంది, దానిమ్మని పగలుకొట్టి కాని తినలేము, దానిని చెట్టునుండి విడదీయకుంటే చెట్టునంటుకొనియే పగిలిపోతుంది, పనసపండుని కత్తితో గుచ్చితేకాని తొనలను విడతీయలేము, కొబ్బరిలో నీళ్ళు ఉంటాయి. ఇవి ఆయా పళ్ళకు సహజంగ ఉండే గుణాలు. వీటిని కవి ఆయా పళ్ళ ఈర్ష్యకు ప్రతిరూపాలుగా చిత్రించి ఎంత గొప్పగా పైచాటు శ్లోకములో వర్ణించినాడో చూచినారా! అది కవియొక్క ప్రతిభ.

నా అనువాద పద్యములు కూడా ఒకపరి తిలకించండి:

కవితను ఆస్వాదించుట ఒక కళ. రసానుభూతి కలిగినవాడే నిజమైన, పాఠకుడు, శ్రోత మరియు ప్రేక్షకుడు.'రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు’ అన్నది ‘భాస్కర శతకకారుని’ మాట. కావున చదవండి, తెలుగు గొప్పదనము తెలియండి తెలుగును బతికించండి. 

చెట్టు పట్టు విడక చెదరె దాడిమగుండె

పనస గుండె దిగెను బాకు మొనలు

గుండె నీటి గుంత కొబ్బరి కాయెను

మావి రంగు రూపు మధురిమలకు

  చెట్టు కొమ్మను అట్టిపెట్టుకొని యుండగానే దానిమ్మ గుండె పగిలిందట( పండిన దానిమ్మ చెట్టుకు ఉండగానే పగిలి పోతుంది), పనస గుండెన బాకు మొనలు దిగినాయట, కొబ్బరి కాయ గుండె గుంత పడి నీళ్ళు నిలచినాయట, ఎందువల్ల అంటే అవి మావి పండు రంగు రూపు తీయందనము చూచి ఓర్వలేక!

అల్ల నేరెడేమొ అతి నలుపుగ మారె

పులిసి పోయె నిమ్మ పూర్తిగాను

కర్ర పుచ్చకేమొ కడుపంత నుబ్బెను

మావి రంగు రూపు మధురిమలకు

ఇంకా చూడండి మామి పండును చూసి కుమిలి కమిలి పోయింది నేరేడు పండు, నిమ్మేమో పులిశి పోయింది, కర్రపుచ్చకు కడుపంతా ఉబ్బిపోయింది, మావి రంగు రూపు మాధుర్యమునకు. నూతన వత్సరము అటువంటి మాధుర్యమును మామిడి పండులో నింపిన రీతిగా మనలో కూడా నింపమని భగవంతుని వేడెదము.

ఒక మామిడి పండు ప్రియుడు చవులు పుట్టించే ఆ పండును కైగొని తొక్క జాగ్రత్తగా తీసి  పెదవికి తాకించే లోపునే చేయి జారింది. అందుకు అతడు ఖిన్న వదనుడై ఆపండును ఎన్ని ఆకర్షణలు కలిగిన నీ తెనక రాతిగుండె ఎందుకయ్యింది? అని నిలదీయుచున్నాడు.

ఇదేదో అశ్లీల పద్యమనుకోవద్దు. ఇందు మీరు చూడవలసినది టెంకను గుండెగాను గుండెను రాయిగాను పోల్చుట. ఇది ఒక విధమగు కవితా చమత్కారము.

చక్కని రూపు చూడగను సాంద్రత గల్గిన నీ సువాసనల్

ముక్కున జేరి మానసము ముగ్ధము జేయగ నిన్ను పట్టి చే

జిక్కగజేసి కూసమును  చిన్నగ దీయుచు మోవి చేర్చగా

టెక్కును జూపి జారితివి టెంకయ నీదది రాతి గుండెయా!

 

ఇట్టిదే ఇంకొకటి.

“ధిఙ్మండలం పరిమళై: సురభీ కరోషి/

సౌందర్య మాహవసి లోచన లోభ నీయం/

అహో! రసాల ఫలవర్య! తవాస్మి దూయే/

యత్తుందిలంచ కఠినం హృదయం బిభర్షి //

“రసాలసాలము” అనగా మామిడి పండునే పై చాటు శ్లోకంలో కవి ఎంత గొప్పగా వర్ణిస్తున్నాడో చూడండి.—“ఎవరికైనా కీర్తి, అందము ఉంటే చాలదు, మెత్తనైన మనసు కూడ ఉండాలి అది నీకు (మామిడి పండుకు) లేదు” అని కవి చమత్కరిస్తున్నాడు. ఎలాగో చూడండి.

 

 “ ఓ రసాల ఫలమా! నీ సువాసనలతో దిక్కులను పరిమళింప చేయుచున్నావు. నీ సౌందర్యంతో అందరిని ఆకట్టుకొని అనందింపజేస్తున్నావు. ఇలా అందరిచే పొగడ బడే నీకీర్తి చాలగొప్పది; కానీ నీవు కఠినమైన టెంక అనే మనస్సు కలిగి ఉండడం మాత్రం బాధగ ఉంది;” అని మామిడిపండులో సహజంగా ఉండే టెంకని కఠినమైన మనస్సుతో పోల్చి వర్ణించడం కవి “క్రాంత దర్శిత్వానికి” నిదర్శనం. కనుకనే కవిని ‘ప్రజాపతి’తో పోల్చేరు. పైభావనకు నా అనువాద పద్యము:

సంసిద్ధ గంధ యుతముగ

సంసర్గము కల్గు చర్మ సౌందర్యముతో

సంసరిత స్వాదు సంయుత

సంసారము టెంక తోడ సాధ్యమె సలుపన్

సంసర్గము=సంబంధము; సంసరితము=జన్మించిన

స్వస్తి.

2 comments:

  1. కాటయవేముని చాటువుతో చక్కని వివరణ...
    దాత సమర్ధతను గురించి ఆలోచింపక అర్ధించే
    ఐదుగురి గురించి చాలా బాగా చెప్పారు.
    2.కవయః క్రాంత దర్శనః...
    రవి గాంచనిచో కవి గాంచుననే విషయాలను
    సోదాహరణంగా రమ్యమైన గొప్ప ఉపమాలంకార శోభిత మైన సంస్కృత చాటువును చాలా చాలా గొప్పగా వివరించేరు.
    మామిడి పండును గురించి మీరు రచించిన పద్యము అద్భుతమైనది...
    దానిమ్మ,పనస,నారికేళం, మామిడి పళ్ళను గురించి సంస్కృత చాటువులు తెల్పి,వివరించి దానికి మీ అనువాద పద్యమును ఉటంకించేరు.
    ఆ పద్యము సహజమైన ఒక చాటువులా రచించేరు.
    మామిడి పండును గల రంగు,రూపు,రుచి లను చూసి అల్లనేరేడు,నిమ్మ,కర్ర పుచ్చ అసూయపడి వాటి రంగు,రుచి,రూపములను యెలా పొందేయో
    తెలిపే చాటు పద్యమును అమోఘమైన రీతిలో రచించేరు.
    ఒక వ్యక్తి మామిడి పండును తినడానికై పెదవులకాన్చి,రసమునుపీల్చబోతూ ఉండగా
    అపుడు చేజారిపోవగా...అతడు చాలా బాధతో
    నీవు బయటకు మాత్రమే తీయన, నీ గుండె మాత్రం రాతి గుండె అన్నాడు...
    ఇక్కడ చమత్కారం యేమిటంటే మామిడి పండులో తియ్యని రసం ఉన్నా లోపల కఠినమైన గుండె అంటే టెంక ఉండడం చేతనే చేజారుతుందని.
    దానికి సమానార్ధముతో సంస్కృత శ్లోకమును తెలిపి బాగా వివరించేవారు...
    మీ రస హృదయాన్ని ఆవిష్కరణ చేసే అద్భుతమైన శ్లోకాలు పద్యాలు,మీరు రచించిన పద్యాలతో యీ మీ పోస్టు చాలా చాలా గొప్పది.మనోహరమైనది. మీకు అనేకానేక అభినందనలండీ రామ మోహన రావు గారూ...
    వందనములండీ 🌹👌👌👌👌🌹🙏🙏🙏🌹

    ReplyDelete
  2. నిజముగా మీరు తెలిపిన అభిప్రాయము నామనసను ఎడారిలో ఒయాసిస్సు. విషయము చిన్నదయినా చదివి వ్రాసినారు అంతకంటే అధ్యనము చేసి వ్రాసినారు. మీ సాహిత్య అభిలాషకు సాదరముగా నమస్సులు సమర్పించుకొనుచున్నాను.

    ReplyDelete