Tuesday, 26 November 2019

కాళిదాసు కవన కమనీయత (ఒక చాటుకథ)

కాళిదాసు కవన కమనీయత (ఒక చాటుకథ)
https://cherukuramamohan.blogspot.com/2019/11/blog-post.html
ఒకమారు ధారా నగరాదీశుడగు భోజరాజు మారువేషమున వెళ్ళగా భోగపు వీథిలో  పడుచుపిల్ల  ఒకతె చెవిలో నల్లకలువ పువ్వును కలిగి  చెండాట ఆడుతూఉండే సమయములో ఆ కలువ పూవు జారి క్రింద పడింది. 
భోగపు వీధికి చెందిన ఒక జవ్వని యగు ముద్దురాలు బంతి ఆడునపుడు ఆమె చెవిని ఆనుకొని సిగలో ఉంచుకొన్న కలువ మొగ్గ క్రిందపడినది. దానిని కవిశేఖరులు ఏవిధముగా వర్నిన్చినారో గమనించండి.
భోగపు వీధిలో తిరిగినాడని భోజుని తప్పుగా తలువవద్దు. విదేశీ గుప్తచారులు ఎక్కువగా వేశ్యా వాటికలనున్దియే గోపనీయ విషయములను గ్రహించుతారు. వారి అనుపానములు తెలుసుకోనుటకే భోజరాజుగారి ఈ ప్రయత్నము. 
ఆడుతున్న బంతిని నేలపడిన కలువను అన్వయించుకొన్న భోజుడు, తరువాతి దినము సభచేసి తన ఆస్థాన కవిశేఖరులను అందమైన అతివ ఆడే భూమిని తాకి పైకగసే  కందుకక్రీడను  వర్ణించమని కోరినాడు. భోజుని ఆస్థానములో భవభూతి, దండి, కాళిదాసులు లబ్ధప్రతిష్ఠులైన కవులు. రాజు బంతి కలువల ఉదంతము చెప్పగానే, భవభూతి లేచి ఈ విధంగా వర్ణించినాడు:

విదితం నను కందుక! తే హృదయం
ప్రమదాధర సంగమలుబ్ద ఇవాl
వనితాకరతామరసాభిహత:
పతిత: పతిత: పునరుత్పతసిll
ఓ కందుకమా! నీ అభిప్రాయం నాకు తెలిసిపోయింది. యువతీమణి తనచేతితో
మాటిమాటికి కొట్టుచున్నా కిందపడి కూడ నీవు మరల మరల పైకెగురుచున్నావు.
ఆవిడ కెమ్మోవి రసాస్వాదనకే కదా సదా నీవు విరామము లేకుండా ఎగిరేది!
ఆ తరువాత దండి లేచి ఈ విధముగా వర్ణించినాడు.
ఏకోపి త్రయ ఇవభాతి కందుకోయం,
కాన్తాయాః కరతల రాగ రక్త రక్తః
భూమౌ తచ్చరణ నఖాంశు గౌర గౌరః
ఖస్థః సన్ నయన మరీచి నీల నీలః
ఈ బంతి నిజమునకు ఒక్కటే అయినా ఆ కాంత మూడు బంతులతో ఆడుచున్నట్లున్నది. ఆ కాంత అరచేతి యెర్రని కాంతుల వల్ల ఎర్రబడి బంతి ఎర్రగానూ, బంతి భూమి మీద పడి ఆమె కాలిగోళ్ళ తెల్లని కాంతి ప్రతిఫలించగా తెల్లగానూ, అదే బంతి లేచినప్పుడు ఆమె కన్నుల నీలికాంతులలో స్నానము చేయునపుడు  నల్లటి బంతిగానూ కనిపిస్తున్నది.
ఇపుడు కాళీదాసు శ్లోకము చెప్పనుంకించి లేచి నిలుచుని ఈ విధముగా చెప్పసాగినాడు.    పయోధరాకార ధరో హి కందుకః
కరేణ రోషాదభిహన్యతే ముహు:
ఇతీవ నేత్రాకృతి భీతముత్పలం
స్త్రియః ప్రసాదాయ పపాత పాదయో:
ఆ ఇంతి బంతి ఆట చూస్తే, ఆమె చెవిలో వున్న కలువమొగ్గకు భయం వేసిందట. ఎందుకు అన్నది ఈ విధముగా వివరించినాడు.
"తన పయోధరాలను ఆ బంతి అనుక్షణమూ అందుకోజూచుతున్నదన్న కోపంతో ఆ జవరాలు పదే పదే దానిని చేతులతో కొట్టి దండిస్తున్నది. మరి కలువపూవునైన నేను ఆమె కన్నులను అనుకరిస్తున్నాను కదా! తాను నన్ను కూడా అదే విధముగా దండిస్తుందేమో" నని భయపడి ఆమె పాదాలపై పడిపోయిందట భయపడి.
మొదటి రెండు శ్లోకాలలో కలువకు అన్వయము లేదు. మూడవదిగా చెప్పబడిన తన శ్లోకములోనే ఆ అన్వయమును సాధించినాడు.
అదే కాళిదాసు గోప్పదనమంటే!
స్వస్తి.

No comments:

Post a Comment