Tuesday, 27 August 2019

నగ్న సత్యం(Naked Truth)


నగ్న సత్యం(Naked Truth)

ఈ మాట ఇటు తెలుగులోనూ అటు ఆంగ్లములోనూ వింటూవుంటాము. 

అసలు ఈ నగ్న సత్యం(Naked Truth) అన్న మాట యొక్క పుట్టుక ఎట్లు వచ్చిందో నా మెదడును అడిగినాను. నా ప్రశ్నను విన్నవెంటనే ఒక చిద్విలాసమైన నవ్వు నవ్వి ఈ విధముగా చెప్ప మొదలిడింది.

ఒకసారి 'సత్యము' 'అసత్యము'  బ్రహ్మ వద్దకు వెళ్లి స్వామీ మా ఇద్దరిలోనూ సత్యము ఉన్నది కదా! మరి మహాత్ములందరూ 'సత్య మార్గమును అనుసరించండి. అసత్య మార్గమును అనుసరించవద్దు' అని చెబుతూవుంటారు. ఏమి నేను చేసిన పాపము' అని అడిగింది. అందుకు బ్రహ్మ 'కేవలము నీ అవకాశ వాదము, అస్థిమిత మనస్తత్వము' అని చెప్పినాడు. 'మరి నాకు కూడ ఆ ‘అ’ అన్నది తీసివేసి స్థిమితత్వము చేకూర్చకూడదా' అని అడిగింది అసత్యము. అప్పుడు నీవు సత్యములో కలిసిపోతావు. ఆతరువాత నీ ఉనికి ఉండదు. మానవుడు కోరికల పుట్ట. అతని అందుబాటులో కనీసము రెండు విషయాలన్న వుంటే ఒకదానిని ఎన్నుకొంటాడు. అందువల్ల నీవు ఈ ప్రపంచము ఉన్నంత కాలమూ ఈ విధంముగా ఉండితీరవలసినదే! పై పెచ్చు మానవాళి అధికముగా నిన్నే ప్రేమించుతుంది,అనుసరించుతుంది. అంటే పలుకు బడి నీదే,' అని చెప్పి ' అదిగో ఆ కనిపించే సరస్సులో మీరిద్దరూ కట్టుకొన్న బట్టలన్నీ విప్పి నగ్నంగా స్నానము చేసి రండి' అని చెప్పిననాడు. ఇద్దరూ ఆ విధముగా స్నానము చేయునపుడు ‘అసత్యము’ తాను ముందే అనుకొన్న విధముగా ఒడ్డుకు  దగ్గరగా ఉండిపోయింది కానీ ‘సత్యము’ మాత్రము అచటి ప్రకృతికి పరవశించి బట్టలు వున్నా ఒడ్డుకుసమాంతరముగా ఉన్న ఒడ్డుకు దగ్గరగాపోయి ఆ ప్రకృతి సోయగాలు చూస్తూ ఉండిపోయింది. ఇక్కడ ‘అసత్యము’ ఒడ్డుకు చేరి ఇద్దరి బట్టలు తీసుకొని తన బట్టలు తగులబెట్టి ‘సత్యము’ యొక్క బట్టలను వేసుకొని బ్రహ్మవద్దకు పోయి నిలుచుంది. కాసేపు అయిన తరువాత సత్యము ఒడ్డుచేరి తన బట్టలు కానక నగ్నముగానే బ్రహ్మ వద్దకు చేరింది. అప్పుడు బ్రహ్మ ‘అసత్యము’ తో ఈ విధముగా అన్నాడు “చూచినావా! సత్యము నగ్నముగా నున్నా సిగ్గుపడి పారిపోక నావద్దకే వచ్చింది. అది సత్యము యొక్క నీతి నిజాయితి. మరి నీవో ఎప్పుడూ మసి పూసి మారేడు కాయ జేసే మనస్తత్వము కాబట్టి నా వద్దకు వస్తున్నవన్న భయము లేకుండా నీ బట్టలు కాల్చి ‘సత్యము’ యొక్క బట్టలు వేసుకొని వచ్చినావు. అదే ‘సత్యము’ సృష్టికి కారణ భూతుడనైన నావద్దకు వచ్చుటకు సిగ్గుపడనవసరము లేదని ఏ మాత్రము సిగ్గులేకుండా నాముందు నిలచింది. అందుచేత ఇకమీద అత్యంత వాస్తవము ‘నగ్నసత్యము’ గా పిలువబడుతుంది. నీవు నిజాయితీకి బద్ధమై ఉండవు కాబట్టి ఇకపైన ‘అబద్ధము’గా కూడా పిలువబడుతావు” అన్నాడు బ్రహ్మ.

అది ‘నగ్న సత్యము’ యొక్క కథ అని ముగించింది నా మెదడు.

స్వస్తి.

 

No comments:

Post a Comment