Tuesday, 17 July 2018

కార్య శూరత (Management Science)


కార్య శూరత (Management Science)
https://cherukuramamohan.blogspot.com/2018/07/management-science-humandevelopment-man.html
నేడు పుట్టగొడుగులుగా మన మధ్యకొస్తున్న అనేకానేకములగు మానవ వనరుల మరియు మానవ సంబంధముల సంస్థలను(Human Development, Man Management Organisations) మనమెన్నో చూస్తున్నాము. ఎన్నో విషయాలలో వారు తమ మేదోవర్గపు సలహాలతో ఆచరణలో ఉంచిన నియమావళి సత్ఫలితములనివ్వక, అమెరికానే ఆర్ధిక సంక్షోభములో అతలాకుతలమై పోయింది. మన వేద శాస్త్రములను ఆకళింపు చేసుకొన్న శ్రీల ప్రభుపాదులవారు మన ఇంధనశక్తి (positive Energy = శక్తి సంకలనము) ని ఏవిధముగా పెంపొందించగలుగవచ్చునో ఎంత పరిశీలనాత్మకముగా చెబుతున్నారో చూడండి.

ఈ శ్లోకమును అభయ చరణారవింద భక్తి వేదాంత శ్రీల ప్రభుపాద స్వామీ వారిది అని పైనే తెలియబరచినాను.

उत्साहन् निश्चयत धैर्यात
तत् तत् कर्म प्रवर्तनात
संगत्यागत सतोवृत्तिः
षड्भिर् भक्तिः प्रसिद्यते

ఉత్సాహాన్ నిశ్చయత్ ధైర్యాత్
తత్తత్ కర్మ ప్రవర్తనాత్
సంగత్యాగాత్ సతోవృత్తిః
షడ్భిర్ భక్తిః ప్రసిద్యతే

1. ఉత్సాహము 2. పట్టుదల 3. ధైర్యము 4. కర్మానుసార సమయస్ఫూర్తి 5. అయోగ్యుని విడుచుట 6. యోగ్యుని అనుసరించుట అన్న ఈ ఆరు గుణములను పుణికి పుచ్చుకొంటే ఎపనినయినా సాధించ వచ్చును. పని మంచిదయితే ఫలితము భగవంతుడు కూరుస్తాడు అన్న నమ్మకముతో మనము పని చేయవలసి వుంటుంది.

ఇప్పుడు ఈ ఆరు విషయాలను గూర్చి కొద్దిగా విశ్లేషించుకొందాము.
1. ఉత్సాహము : ఏదయినా ఒక పనినిని తలపెట్టితే ప్రోత్సాహమిచ్చేదే ఉత్సాహము.దానినే ఆంగ్లములో Motivation అంటారు.అందుకే మన పెద్దలు 'మనసుంటే మార్గముంటుంది' అంటారు.
2. పట్టుదల: పట్టుదల వున్నవాడు తాననుకొన్నది సాధించుటకు ఎంతయినా కృషి చేస్తాడు. అందుకే 'కృషితో నాస్తి దుర్భిక్షం' అన్నారు. 'సాధనతోనే ధరన పనులు సమకూరుతాయి.
3. ధైర్యము: ఒక రాజు ఎదో తప్పిదము చేయుటతో అష్ట లక్ష్ములు ఆతనిని విడిచి పెట్టి పోతూవుంటే ఆతను పట్టించుకోడు. ఒక ధైర్య లక్ష్మి పోతూవుంటే మాత్రము ఆ తల్లి చేయి పట్టుకొని మాతా! నీవు ఒక్కదానివి నాతో వుంటే చాలు. నీవులేకపోతే ఇక నేను లేను అంటాడు. అంతే కదా! ధైర్యము లేకపోవుట అంటే భయమునకు మనిషి ఆలవాలమైనట్లే! బీరువు చేయగలిగింది ఏమీ ఉండదు. అందుకే కదా భర్తృహరి కూడా 'ఆరంభింపరు నీచమానవులు..' అని అంటూ ' ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యోన్నతోత్సాహులై ప్రారబ్దార్థము ఉజ్జగించరు' అన్నాడు. కావున ఎవరికయినా తలపెట్టిన పనిని పూర్తి చేయాలంటే అత్యంత అవసరము ధైర్యము. ధైర్యమును గూర్చి వ్రాసిన ఈ క్రింది పది వాక్యములలో మొదటిది తప్ప మిగతావి నేను వ్రాసినవి. ఒక్కసారి గమనించండి.
1. ధైర్యే సాహసే లక్ష్మి
2. ఆపదలోసాహాసం అత్యుత్తమ సహవాసం
3. ఎదలో ధైర్యము వుంటే అదురెక్కడ బెదురెక్కడ
4. ధైర్యము లేకుంటే దయనీయమే!
5. మానవత్వమున ధైర్యము మణి పొదిగిన ఆభరణము
6. ధైర్యమొక్కటున్న నీవు ధరణినేలగలవన్నా
7. ధైర్యమున్న చాలునులే దుఃఖమంత దూరములే
8. పట్టు విడకు నీ సాధన ఫలియించును శుభ కామన
9. ధైర్యమున్న బాహుబలి లేకుంటే విధికి బలి
10. ధైర్యము ధనువైతే నిశితబుద్ధి నీ శరము
కావున కార్యార్థికి ధైర్యము యొక్క ఆవశ్యకత ఎంత ఉన్నదో దీనిని బట్టి అర్థము చేసుకొన వచ్చు.

4. కర్మానుసార సమయస్ఫూర్తి : సమయస్ఫూర్తి లేకుంటే మనము లేము మనుగడ లేదు.ఒక మరచీలను కోయా నుండి విడదీయాలంటే Screwdriver కావాలన్నది అందరికీ తెలిసిన విషయమే! అవసరమేర్పనపుడు Screwdriver లేదని ఊరకుండిపోము కదా! ఎదో ఒక రేకును తీసుకొని దానిని వూడదీయ ప్రయత్నమూ చేస్తాము. రాయల ఆస్థానమునకు పోతూ ద్వారపాలకుడు తిమ్మయ్య కప్పుకొన్న శాలువను తీసుకోనవలెనని అష్ట దిగ్గజములలో నలువురు అనుకొంటారు. మొదటి ముగ్గురు ఎవరయినా నాలుగవ వాడు తెనాలి రామలింగడు. మొదటి ముగ్గురూ తిమ్మప్పను గూర్చి చెప్పిన మూడు పాదములు ఆతనికి తమ ఉద్దేశ్యము తెలియజేయలేక పోయినాయి. రామలింగడు మాత్రము 'నాకీ పచ్చడమె చాలు నయముగ నిమ్మా!' అని తన సమయస్పూర్తిని ప్రకటించి శాలువా పొందినాడు. ఇక్కడ రామలింగని సమయస్పూర్తి రెండు విధాలుగా కనిపిస్తుంది. ఒకటి ఆ నలుగురిలో తానూ చివరిగా నిలువడం. ఎందుకంటే పద్యమునకు నాలుగు పాదములు కదా! నీశాలువ నాకీ అని మొదటి ముగ్గురూ అనలేరు అంటే తరువాతి వారు పద్యాన్ని పూర్తి చేయరు. ఇక నాకెందుకులే అనుకొంటారు. అదీ విషయము. కావున మన మాట సూటిగానూ సున్నితము గానూ ఉంటూ సమయస్ఫూర్తి కలిగి ఉండవలెను.

5.అయోగ్యుని వదలుట : కుక్క తోక పట్టుకొని గోదావరినీదుట సాధ్యమా! కావున నీ కార్యాచరణలో అయోగ్యుని వుంచుకొనుటచే పని పూర్తికాక పోవుటయేగాక చేతగానివాడన్న పేరు ఆ కార్యాచరణ దళపతి కూడా మూటకట్టుకోనవలసి వస్తుంది. కావున ఇక్కడ పని పూర్తియగుట మాత్రమే ముఖ్యము. ఇది ధనుర్విద్యా ప్రదర్శనలో అర్జనుని గురివంటిది, కావున nee దృష్టి నుండి అతనిని తొలగించుకొనుట తప్ప వేరొక మార్గము వేడుక వీలు లేదు. తస్మాత్ జాగ్రత.

6. యోగ్యుని అనుసరించు: చిత్తశుద్ధితో యోగ్యుని అనుసరించినా అనుకరించినా నీ కార్యము నెరవేరినట్లే! యుద్ధము చేయను అని ఖండితముగా కృష్ణుడు చెప్పినా, తమసైనికబలగము 7:11 నిష్పత్తిలో వున్నా కృష్ణుని కోరుకొని అర్జనుడు మహాభారత యుద్ధమే గెలిచినాడు. ఈ ఉదాహరణ చాలదా కార్యశూరునికి!
మన ధర్మములో లేని మర్మము లేదు. ఆ కాలమునకు పాశ్యాత్య జాతులలో నాగరికత లేదు కావున వారు ఇంతటి జీవన శైలిని , నీతి నియమములను పాటించలేక పోయినారు. ఈ నాడు వారిదే మేధస్సని, వారిదే నాగరికత యని గంగను వదలి మురికి గుంటలో ఈదులాడు చున్నాము. మీలో ఎవరయినా నన్ను ఈ మాట అడుగవచ్చు. వారిది (1896 - 1977) 20వ శతాబ్దమే కదా అప్పటికి పాశ్చాత్యులు ఎంతో నాగరికులైయున్నారు కావున వీరు వారి నుండియే నేర్చుకొని యుండవచ్చుకదా యని. కానీ వారు 1950 లోనే సన్యాస దీక్ష తీసుకొని జీవితమును వేదాధ్యయనము భక్తితత్వ ప్రచారములోనే జీవితమును గడిపినారు. వారి ధీజలధి లో ప్రభవించిన ఒక స్వర్ణ కమలమే ఈ శ్లోకము.
 మన దేశ, శాస్త్ర, ఋషిగణ, మహిమాన్వితులను గుర్తించి అట్టి మహనీయుల బాటలో నడవండి.
స్వస్తి

2 comments:

  1. ఎన్నో చక్కని విషయాలు సోదాహరణంగా తెలిపారు. ధన్యవాదములు.

    ReplyDelete