Tuesday, 6 October 2015

పోతన జేసిన పరమేశ్వరుని వర్ణన

భాగవతము - అష్టమస్కందము - అధ్యాయము 7   
పోతన జేసిన పరమేశ్వరుని వర్ణన 
                
        భూతాత్మ! భూతేశ! భూతభావనరూప! దేవ! మహాదేవ! దేవవంద్య!
     యీ లోకములకెల్ల నీశ్వరుండవు నీవ బంధమోక్షములకుఁ బ్రభుఁడ వీవ
     యార్తశరణ్యుండవగు గురుండవు నిన్నుఁ గోరి భజింతురు కుశలమతులు
     సకల సృష్టి స్థితి సంహార కర్తవై బ్రహ్మ విష్ణు శివాఖ్యఁ బరఁగు దీవు
ఆ  పరమగుహ్యమైన బ్రహ్మంబు సదసత్తమంబు నీవ శక్తిమయుఁడ వీవ
     శబ్దయోని వీవ జగదంతరాత్మవు నీవ ప్రాణ మరయ నిఖిలమునకు. 222
క.  నీయంద సంభవించును
     నీయంద వసించి యుండు నిఖిలజగంబుల్‌
     నీయంద లయముఁ బొందును
     నీ యుదరము సర్వభూత నిలయము రుద్రా! 223
సీ. అగ్ని ముఖంబు, పరాపరాత్మక మాత్మ, కాలంబు గతి, రత్నగర్భ పదము,
    శ్వసనంబు నీయూర్పు, రసన జలేశుండు, దిశలు కర్ణంబులు, దివము నాభి,
    సూర్యుండు గన్నులు, శుక్లంబు సలిలంబు, జఠరంబు జలధులు, చదలు శిరము,
    సర్వౌషధులు రోమచయములు, శల్యంబు లద్రులు, మానస మమృతకరుఁడు,  
తే. ఛందములు ధాతువులు, ధర్మసమితి హృదయ, మాస్యపంచక ముపనిషదాహ్వయంబు
    లైన నీరూపు పరతత్త్వమై శివాఖ్యమై స్వయంజ్యోతియై యొప్పు నాద్యమగుచు. 224
క. కొందఱు కలఁడందురు నినుఁ
    గొందఱు లేఁడందు రతఁడు గుణి గాఁడనుచు\న్‌
    గొందఱు కలఁడని లేఁడని
   కొందల మందుదురు నిన్నుఁ గూర్చి మహేశా!

Monday, 5 October 2015

నా మొగుణ్ణి నన్ను కలపండి

నా మొగుణ్ణి నన్ను కలపండి

ఓ యమ్మో ఓరి కొడుకో నా మొగుణ్ణి నన్ను కలపండి ,  నామొగుణ్ణి నన్ను కలపండి
ఓ యమ్మలా ఒయబ్బలా నా మొగుణ్ణి నన్ను కలపండి నామొగుణ్ణి నన్ను కలపండి

తమలపాకుతో తానట్లంటే తలుపుచేక్కతో నేనిట్లంటి 
తప్పేం గిప్పేం లేదమ్మ నేను తప్పే చేయ లేదమ్మా 
ఓ యమ్మలా ఒయబ్బలా నా మొగుణ్ణి నన్ను కలపండి

మొగలిపూవు తో తానట్లంటే మొద్దు పొరకతో నేనిట్లంటి
తప్పేం గిప్పేం లేదమ్మ నేను తప్పే చేయ లేదమ్మా 
ఓ యమ్మలా ఒయబ్బలా నా మొగుణ్ణి నన్ను కలపండి

అప్పడాలతో తా నట్లంటే అట్లకాడతో నేనిట్లంటి
తప్పేం గిప్పేం లేదమ్మ నేను తప్పే చేయ లేదమ్మా 
ఓ యమ్మలా ఒయబ్బలా నా మొగుణ్ణి నన్ను కలపండి

చిగురుటాకుతో తానట్లంటే చింత బరికెతో నే నిట్లంటి
తప్పేం గిప్పేం లేదమ్మ నేను తప్పే చేయ లేదమ్మా 
ఓ యమ్మలా ఒయబ్బలా నా మొగుణ్ణి నన్ను కలపండి

మల్లెమోగ్గతో తానట్లంటే మచ్చు కత్తితో నేనిట్లంటి
తప్పేం గిప్పేం లేదమ్మ నేను తప్పే చేయ లేదమ్మా 
ఓ యమ్మలా ఒయబ్బలా నా మొగుణ్ణి నన్ను కలపండి

గడ్డి పోచతో తానట్లంటే గడ్డపారతో నేనిట్లంటి
తప్పేం గిప్పేం లేదమ్మ నేను తప్పే చేయ లేదమ్మా 
ఓ యమ్మలా ఒయబ్బలా నా మొగుణ్ణి నన్ను కలపండి

దూది పింజేతో తానట్లంటే దుడ్డుకర్రతో నేనిట్లంటి
తప్పేం గిప్పేం లేదమ్మ నేను తప్పే చేయ లేదమ్మా 
ఓ యమ్మలా ఒయబ్బలా నా మొగుణ్ణి నన్ను కలపండి

Sunday, 4 October 2015

చక్కనైన చాటువు

చక్కనైన చాటువు

కవులు నిరంకుశులు. తమ గొప్పదనాన్ని గుర్తించకుంటే వారు తిట్టటం లోకూడా 

చమత్కారాన్ని రంగరిస్తూ ఉంటారు . బయటివారికి ఆలోచిస్తేనేగాని ,అర్ధము బోధపడకుండా 

జాగ్రత్త లు తీసికుంటారు. ఒక్కోసారి ఆలోచిచినా అర్థము కాదు. ఈ పద్యం ఒక పర్యాయము 

గమనించండి. -

కం:- నగపగతు పగతు పగతుని

పగతుండగు మగధరాజు బరిమార్చిన యా

జగజెట్టి యన్న తండ్రికి

దగువాహనమైనయట్టి ధన్యుడితడే!

వివరణ:- నగపగతుడు- పర్వతవిరోధి, దేవేంద్రుడు; అతని పగతుడు- నరకుడు

అతనిపగతుడు - శ్రీకృష్ణుడు; అతనివిరోధి - మగధరాజు జరాసంధుడు; అతనిపరిమార్చన 

జగజెట్టి - భీముడు; అతనియన్న- ధర్మరాజు; అతనితండ్రి- యమధర్మరాజు;

అతనివాహనము - దున్నపోతు;

చూచినారు కదా! అసలది తిట్టా, పొగడ్తా! తెలియకుండా ఎంతచక్కగా ఒరే దున్నపోతా!

అంటూ ఎంత ఇంపుగా చెప్పినాడో!