గాయత్రీ మంత్ర ప్రాశస్త్యము-మహనీయుల అభిప్రాయములు
https://cherukuramamohan.blogspot.com/2015/02/blog-post_16.html
గాయత్రీ మంత్రమహిమ
గాయత్రీ మంత్రమును గూర్చి తెలుసుకొనుటకు ముందు మంత్రము అంటే ఏమిటో
తెలుసుకొందాము.
త్రికాలజ్ఞులై నిష్కాములైన భౌతికసుఖములనుకోరని ఋషీశ్వరులు యోగదృష్టితో
లోకకళ్యాణమునకు ఉత్కృష్టమైన మంత్రములు ప్రసాదించిరి.
మకారం మననం ప్రాహుః త కారః త్రాణ ఉచ్యతేI
మననః త్రాణసంయుక్తో మంత్రః ఇత్యభి ధీయతే II
అనగా మననం చేయువానిని రక్షించునది మంత్రమనబడును అని నుడివినారు. శిష్ఠాచార
కొన్ని విధివిధానాలు కొన్ని కట్టుబాట్లు వుంటాయి. మంత్రమును గురు ముఖతః
గ్రహించవలసి వుంటుంది. కొన్ని మంత్రములకు యజ్ఞోపవీత ధారణము తప్పనిసరి. మంత్ర
ఉచ్ఛారణా
నిర్దుష్ఠతను తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. మంత్రమననమునకు
నిర్దుష్ఠ సమయములు నిషిద్ధ సమయములు వుంటాయి.
అనుష్ఠాత అది మరువగూడదు. వెంటనే మరి అది ఒక వర్గానికే చెల్లుతుందా లేక చెందుతుందా
అన్నది ప్రశ్న. దానికి కాదు అన్నదే జవాబు. యజ్ఞోపవీత ధారణ
బ్రహ్మక్షత్రియ వైశ్యులకు వుంటుంది. రెడ్లు, కాపులు, కమ్మలు కూడా రాజ్యాలేలినవారే! ఒకానొక కాలములో
యజ్ఞోపవీత ధారణా చేసి మంత్ర సాధనతో అభీష్ట సిద్ధి పొందినవారే! మిగిలిన వారిలో
కూడా యజ్ఞోపవీతధారులు వున్నారు కానీ నేడు అందరి దారులూ మారిపొయినాయి. అందుకే దేహము
సందేహములతోనిండి సతమతమౌతూ ఉన్నాము. ఎవరైతే శూద్రులుగా వర్గీకరింపబడి సమాజ
శ్రేయస్సుకు తొలిసంధ్య నుండియే సమాయత్తమౌతూ ఉంటారో వారి అభ్యున్నతి చూసుకోనవలసిన
బాధ్యత బ్రాహ్మణ వర్గమునకు చెందుతుంది కానీ ఆ బ్రాహ్మణులలో అత్యధిక శాతము వేదచోదిత
బాధ్యతా విముక్తులయి హీనస్థితికి చేరుకొన్నారు. అందుకే నేటికీ కొందరు మహనీయులు
లలితా సహస్రము, విష్ణు
సహస్రనామము, కృష్ణాష్టకము, నామ రామాయణము,ఆపదుద్ధారక స్తోత్రము, కనకధారాస్తవము
మున్నగు ఎన్నో స్తోత్రములను సకలజన సమాజమునకు సానురాగముతో సమర్పించినారు. ఇవి తాకరు
కానీ అవే కావాలంటారు. ఒక బ్రాహ్మణుడు, మాటవరుసకు గాయత్రిని అనుష్టించుచున్నాడంటే, అది కేవలము తనకొరకు మాత్రమే
కాదు సమస్త జనుల శ్రేయస్సు కోరుతూ చేస్తున్నాడు. తన అనుష్టానమును ‘సర్వే జనాః
సుఖినోభవంతు’ అనే ముగిస్తున్నాడు. అదీ ఈ వైదిక ధర్మము యొక్క గొప్పదనము.
ఇక గాయత్రీ మంత్రమును గూర్చి తెలుసుకొందాము. మంత్రమును ప్రత్యేకముగా వ్రాయుట
లేదు. వివరణలో అంతా తెలుస్తుంది కాబట్టి.
‘మననాత్ త్రాయతే ఇతి మంత్రం’ అంటే మననము
చేయువానిని రక్షించునది
మంత్రమంటారన్నది
ఎక్కువమందికి తెలిసిన విషయమే!
ఈ
మంత్రములు 7 కోట్లు ఉన్నాయన్నది ఆర్యవాక్కు. అవి శక్తి మంత్రములు మూడు
కోట్లు, సౌరములు రెండు కోట్లు, శైవ
మంత్రములు ఒక కోటి, గణేశ
మంత్రములు ఏబది
లక్షలు, వైష్ణములు ఏబది లక్షలు గలవు.
ఈ సప్తకోటి మహామంత్రములలో ఆది
మంత్రము ‘గాయత్రి’.
'సర్వమంత్రేషు గాయత్రీ వరిష్టా ప్రోచ్యతే బుధై:' - సర్వమంత్రములలో
గాయత్రిమంత్రము
అత్యంత
శ్రేష్ఠమని పెద్దల మాట.
ప్రాణములను
ఉద్ధరించే సామర్థ్యము కారణముగా ఆదిశక్తి గాయత్రి అనుబడినది.
'గాయత్రీ వేద మాతా చ' గాయత్రి వేదములయొక్క తల్లి.
'న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్' అనునది సుప్రసిద్ధమైన వచనము – అనగా
తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి
మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది. గాయత్రి అనే పదము ‘గయ’ మరియు
‘త్రాయతి’ అను పదములతో కూడుకుని ఉన్నది. “గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ” అని
ఆదిశంకరులవారు తనభాష్యములో వివరించినారు. ‘గయలు’ అనగా ప్రాణములు అని అర్థము.
‘త్రాయతే’ అనగా రక్షించడం. కనుక ప్రాణములను రక్షించే మంత్రం గాయత్రీ మంత్రం.
'సర్వమంత్రేషు గాయత్రీ వరిష్టా ప్రోచ్యతే బుధై:' సర్వమంత్రములలో
గాయత్రిమంత్రం మిక్కిలి శ్రేష్టమైనది.
'గయాన్ త్రాయతేసా గాయత్రీ 'అనగా ఏది గయ
- ప్రాణమును రక్షిస్తుందో - అది గాయత్రి (ఐతరేయ బ్రాహ్మణం). ప్రాణములను ఉద్ధరించే సామర్ద్యము
కారణముగా ఆదిశక్తి గాయత్రి.
“గాయంతం త్రాయతే యస్మత్ గాయత్రీ
త్యభిధీయతే" (నిరుక్తము) గానం చేసేవారిని కాపాడేది గాయత్రి. ఇక్కడ గాయంతం అనే
మాట పాట పాడుట అనే అర్థంలో వాడలేదు. భక్తిశ్రద్ధలతో సుస్వరంగా ఉచ్చరించడం అన్న
అర్థంలో వాడబడింది. గాయత్రిని ఈవిధంగా జపించినవారు రక్షించబడతారు. వీరేకాదు
వినేవారుకూడా ఫలితాన్ని పొందుతారు. అసలు వినకున్నా అంటే వినుటకు వీలు లేకున్నా
ఇక్కడ ఈ మంత్రాన్ని గురించి వేదములు "గాయత్రీం ఛందసాం మాతా!” అంటూ
స్తుతించినాయి.
శంకరాచార్య
భాష్యములో గాయత్రీశక్తిని స్పష్టం చేస్తూ ఇలా చెప్పబడినది - 'గీయతే
తత్వమనాయ గాయత్రీతి ' అనగా ఏ వివేకబుద్ధి ఋతంభరా ప్రజ్ఞ ద్వారా
వాస్తవికత యొక్కజ్ఞానము లభింపజేస్తుందో అది గాయత్రి. ఇప్పుడు సూక్ష్మముగా రుతంభర
విద్యను గూర్చి తెలుసుకొందాము.
‘ఋతంభర’
అన్నది విశ్వ వ్యాప్త చైతన్యము. ఈ విద్య సాధించగలిగినవాడు
ఎక్కడ నుండియైనా పరబ్రహ్మను సృష్టితో అనుసంధానము చేయగలడు. దేవతలు, మహర్షులు, సాధకులు, మానవులు, జంతువులూ, ఇంకా జీవరాశుల, నిర్జీవ రాశుల చైతన్యమంతా
ఇమిడి ఉండి వాటిని నిర్దేశించే ఓ దివ్య శక్తి ఋతంభర. సాధకుడి భ్రూ మధ్యము, నుండి సృష్టి సంకేతాలు వస్తూ, పోతూఉంటాయి. సాధకుడు భూత, భవిష్యత్, వర్తమానాలను దర్శించగలడు.
ఆజ్ఞాచక్రము తెరుచుకుని, అంతర్ముఖమైన
జ్ఞాన చక్షువులు విచ్చుకుని, తానున్న ‘అహం’ అంటే 'నేను ' అనే
వృత్తము నుండి బయటికి వచ్చి, ఒక అసాదృశ శక్తిని అనుభూతి చెందుతూ ఉంటాడు.
ఆత్మను
పరమాత్మలో కలిపేదే యోగం. ఐతే యోగసాధన మార్గాలు అనేకం. ఈ
సాధనామార్గాలలో
గాయత్రీ సాధన ఒకమార్గం.
గాయత్రియే
ఆదిశక్తి - వేదమాత - దేవమాత - విశ్వమాత
సృష్టిని
తయారుచేసే ప్రారంభికశక్తి అయిన కారణముగా గాయత్రీనీ "ఆదిశక్తి "
అనిఅన్నారు.
గాయత్రి
బ్రహ్మప్రతిపాదకమగు మంత్రము. కుండలినీ శక్తి 24 తత్వంలతో జగత్తును
సృజించును
కావున గాయత్రి 24 అక్షరములు కలిగి యున్నదని శంకరులు
ప్రపంచసారమున
వ్రాసినారు. ఈ మంత్రము 'గాయత్రి' ఛందస్సులో ఇమిడి
యుండుటయే
గాక, 3చరణములు
మాత్రమే బ్రహ్మచారులు మరియు గృహస్తులకు
నిర్దేశింపబడినది.
4వ పాదముతో కలిపి సన్యాసులు అనుష్ఠించుతారని పెద్దలు చెప్పగా
విన్నాను.
ఈ
మంత్రోచ్చారణ సమయమందు శరీరములోని సర్వ నాడీస్థానములలో స్పందనాశక్తి
చేకూరుతుంది.
షట్ చక్రములలో స్పందన ఏర్పడి తద్వారా చక్రములు జాగృతమౌను. ఈ
బీజాక్షర
స్పందనాశక్తివలన శరీరావయములలో ఉన్న గ్రంధులలో శక్తులను మేల్కొలిపి
మహత్వపూర్ణమగు
సఫలతను, సంపన్నతను, సిద్ధులను చేకూర్చును.
గాయత్రి
మంత్రంలోని
బీజాక్షరములు శరీరములోని ఈ దిగువ వివరించినస్థానములయందు
స్పందనను
చేకూర్చి పూర్ణయోగత్వమును సిద్ధింపజేస్తుంది.
సూర్యున్ని ఆరాధించిన ఆరోగ్యం, కుశలం, పుత్రులు పుణ్యం; మహాదేవున్ని ఆరాధించుట
వలన
యోగం, జ్ఞానం, కీర్తి; విష్ణువును ఆరాధించిన
ధర్మార్ధ కామమోక్షములు;
దుర్గోపాసనచే
సర్వ మోక్షాది సకలకోరికలు; గణేశున్ని
ఉపాసించిన కర్మసిద్ధి,
విఘ్ననివారణ
ప్రాప్తించును. అయితే గాయత్రీ మంత్రానుష్టానమువలన పంచాయతన
దేవతలు
చేకూర్చు సర్వఫలములు సమిష్టిగా చేకూరును. ఈ మంత్రం పఠనం
చేయువారికి
చతుర్విధపురుషార్ధములు, ధర్మార్ధకామమోక్షములను
ప్రాప్తించును.
సమస్తకోరికలను
తీర్చు కామ్యఫలప్రదాత్రి 'గాయత్రీ'. గాయత్రి
కామధేనువు. ఆత్మశక్తిని,
మానసికశక్తిని, సంసారికశక్తిని లభింపజేయును.
ప్రణవం (ఓం), భూ:, భువః, సువః,
గాయత్రిమంత్రం
అనునవి పంచమహాయజ్ఞములు (దేవయజ్ఞం, ఋషియజ్ఞం లేక
బ్రహ్మయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞములు). ప్రణవ
వ్యాహృతిత్రయ
గాయత్రీమంత్రమును
నిత్యమును జపించినయెడల పంచపాపములనుండి పావనమై
పంచయజ్ఞముల
ఫలితంను పొందుదురు.
ఈ మంత్రమును జపించుటకు పూర్వము అపరమూ కూడా, ఆచరించే వ్యక్తి అనుష్ఠించే, విధులు కొన్ని వుంటాయి.
అన్నీ కలిపితే అది సంధ్యావందనమౌతుంది. ఇది ప్రొద్దున మధ్యాహ్నము సాయంకాలము మూడు
పూటల ఆచరించవలసియుంటుంది. ఎందుకు అన్నది తరువాత విశ్లేషించుకొందాము.
వరదాభయహస్తాలతో... సకల వేద స్వరూపమైన గాయత్రీదేవిని ఆది శంకరులు అనంతశక్తి
స్వరూపముగా అభివర్ణించినారు. ప్రాతఃకాలంలో గాయత్రి గానూ, మధ్యాహ్న కాలంలో
సావిత్రిగానూ, సాయంసంధ్యలో
సరస్వతి గానూ ఆమె భక్తుల పూజలు అందుకుంటుంది. గాయత్రీ ఉపాసనతో బుద్ధి
తేజోవంతమవుతుంది. పాలు నేయిగా పరివర్తన చెందినట్లు, పుష్పముల మధువు, మకరందముగా మారినట్లు, ప్రభాకరుడు ప్రజావాహినికి
ప్రకాశమైనట్లు, గాయత్రీ
మంత్రము సర్వవేద సారమై శోభిల్లుతూ వుంది.
ఈ మంత్రమును ఋగ్ యజుస్ సామ వేదములనుండి ఒక్కొక్క పాదము గైకోనబదినట్లు పెద్దలు
చెబుతారు. మరి మూడు పాదములే అయినాయి కదా అంటే నాలుగవ పాదము అధర్వణ వేదములో వుంది.
దీనికి మరొకసారి యజ్ఞోపవీత ధారణా చేయవలసి వుంటుందని శాస్త్రవచనము.
ప్రతి దినము త్రి సంధ్యలలో ఉపాసింపబడే దేవత
గాయత్రీమాత. సకల వేదసార సర్వస్వమే గాయత్రీ మంత్రం. త్రిమూర్త్యాత్మక స్వరూపం
గాయత్రీ తత్వం. గాయత్రి, సావిత్రి, సరస్వతి త్రిముర్త్యాత్మక
స్వరూపం. అంటే ఉదయము గాయత్రిగానూ, మధ్యాహ్నము సావిత్రిగానూ, సాయంత్రము సరస్వతిగానూ
ఆదివ్యశక్తి బాసిల్లుతుంది. దేహేంద్రియములను కాపాడునది గాయత్రి. ప్రాణశక్తిని
పోషించునది సావిత్రి. ప్రజ్ఞాశక్తిని ప్రకటింపజేయునది సరస్వతి. ప్రజ్ఞాశక్తి ప్రాణశక్తిని, ప్రాణశక్తి జడమైన దేహమును
చైతన్యవంతం చేస్తుంది. గాయత్రీ మంత్రోపాసన దేహ, ప్రాణ, ఆత్మ శక్తులను ప్రచోదనము చేస్తుంది. అసలు
ఈ ‘నీవు’ లో మూడు మూడు రూపాలు వున్నాయి అని పుట్టపర్తి సాయిబాబా వారు చెప్పేవారు.
అవి (వారి మాటలలోనే)
1. The one who think you are
2. The one others think you are
3. The one really you are
ఇందులోని మొదటి రెండూ
తెలుసుకొంటే మూడవది సాధించ వీలుపడుతుంది. దీనికి సులబహమగు మార్గమును కూడా
వేదవ్యాసులవారు మనకు తెలియజేసినారు.
అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం l
పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనంll
ఈ గాయత్రి చేయుటకు వలసిన విధివిధానములు పాటించుటకు కష్టమయినవారు ఉపకారము
చేయడము, అపకారము
చేయకపోవడము చేస్తూ పోతే గాయత్రీ మంత్రఫలితము నిన్ను ఆవరించియే వుంటుంది. నీకోసం
చేసే వాళ్ళు నీకు తెలియకుండానే ఎంతోమందివున్నారు. ఇక మంత్రమును గూర్చి
తెలుసుకొందాము.
మిగతది రేపు .........
గాయత్రీ మంత్రమహిమ-2వ భాగము
ఈ మంత్రములో "ఓం" అనేది "ప్రణవము", భూః
భువః సువః అనునవి ప్రణవమంత్రపు విపులమైన
వ్యాహృతులు. ఇవి దివ్యశక్తిని కలిగిన పదములు. ఇవి మూడు లోకాలను సూచిస్తాయి. ప్రతి
దినము త్రి సంధ్యలలో ఉపాసింపబడే దేవత గాయత్రీమాత. సకల వేదసార సర్వస్వమే గాయత్రీ
మంత్రం. త్రిమూర్త్యాత్మక స్వరూపం గాయత్రీ తత్వం. గాయత్రి, సావిత్రి, సరస్వతి అన్నది ఈ
త్రిముర్త్యాత్మక స్వరూపం. అంటే ఉదయము గాయత్రిగానూ, మధ్యాహ్నము
సావిత్రిగానూ, సాయంత్రము సరస్వతిగానూ ఆదివ్యశక్తి
బాసిల్లుతుంది. దేహేంద్రియములను కాపాడునది గాయత్రి. ప్రాణశక్తిని పోషించునది
సావిత్రి. ప్రజ్ఞాశక్తిని ప్రకటింపజేయునది సరస్వతి. ప్రజ్ఞాశక్తి ప్రాణశక్తిని, ప్రాణశక్తి
జడమైన దేహమును చైతన్యవంతం చేస్తుంది. గాయత్రీ మంత్రోపాసన దేహ, ప్రాణ, ఆత్మ శక్తులను ప్రచోదనము చేస్తుంది.
సూక్ష్మస్థితిలో మన చేతన యొక్క మూడు స్థితులను, అంటే శరీరం,
మనస్సు, ప్రాణం అనే మూడు స్థితులలోనూ పనిచేసి
జీవితాన్ని పరిపోషణ గావిస్తాయి.
"తత్" నుండి మిగిలిన మంత్రాన్ని
"సావిత్రి" అని అంటారు. సవిత అన్న పదమునుండి సావిత్రి వచ్చింది. సవిత
అంటే ‘సూయతే అనే నేతిసవితా’ - ఈ జగత్తు సృష్టి స్థితి లయలకు కారణమైంది సవిత. 'సవితా అనగా స్రవించుట అనే
అర్థము కూడా కలదు. కనుక గాయత్రిని స్త్రీ స్వరూపముగానే ధ్యానిస్తాము.
మనుస్మృతి 'త్రిభ్య ఏవతు వేదేభ్యః
పాదమ్ పదమదూదుహమ్” అని చెబుతుంది. అంటే గాయత్రి ఒక్కొక్క పాదం ఒక్కొక్క వేదం నుండి
గ్రహించబడినదన్నమాట. సంధ్యావందనం విధిగా సకాలంలో
చేయాలి. మహాభారత యుద్ధంలో సంధ్యాకాలంలో యుద్ధంలో ఉండవలసి వచ్చిన వీరులు, సకాలంలో మన్నుతో అర్ఘ్యమిచ్చినారని చెప్పబడి ఉంది. వాల్మీకి మహర్షి ప్రతి
వేయి శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరమునుచేర్చి 24 అక్షరములతో 24,000
శ్లోకాలతో శ్రీమద్రామాయణమును రచించినారు. ఇక మంత్రము ఏమి చేబుతూవుందో చూస్తాము:
ఓం - శబ్ద
బ్రహ్మము,ప్రధాన బీజాక్షరం సృష్టికి ఆధారమైన బ్రహ్మ. పరబ్రహ్మకు ప్రతీక.
భూ - స్థూల
జగత్తు,
భూలోకము, ఉత్పత్తికి ఆధారభూతమైనది.
భువ -
సూక్స్మజగత్తు, భూ స్వర్గముల మధ్య లోకము - అనంత సూర్య చంద్ర తారలలో
నిండియున్న ఆకాశము అనగా విశ్వము.
సువ -
స్వర్గలోకము, కారణ జగత్తు.
తత్ -
బ్రహ్మపదార్థము, శాశ్వతమైన సత్ (అంటే యావత్ సృష్టికీ మూలమైన ఆ)
సవితుర్ - సూర్యునిలో నిండియున్న తేజోపుంజముల ప్రకాశము
వరేణ్యం -
శ్రేష్టమైనది
భర్గ -
జ్ఞానతేజస్సు (అట్టి శ్రేష్టమైన ఆ జ్ఞాన తేజస్సును)
దేవస్య ధీమహి -
దైవముగా నెంచి మేము ధ్యానించెదము,
య: - ఆ తేజస్సు
న: - మా యొక్క
ధియో -
బుద్ధులను,
ప్రచోదయాత్ –
(సర్వదా) ప్రేరేపింపజేయుగాక!
గాయత్రీ మాతకు 5 ముఖములు అవి గాయత్రీ మాత ధ్యాన శ్లోకములో ఈ
విధముగా తెలుపబడింది.
ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయై ముఖైస్త్రీ క్షణైః
యుక్తా మిందు నిబద్ధ రత్న మకుటాం తత్త్వార్ధ వర్ణాత్మికాం
గాయత్రీం వరదాభయాంకుశకశాశ్శుభ్రం కపాలాంగదాం
శంఖం చక్రమదార వింద యుగళం హసైర్వహం తీం భజేll
సకల వేద స్వరూపం గాయత్రి దేవి ! అన్ని మంత్రాలకు మూల శక్తి
ఈ తల్లి ! ముక్త,(ముత్యము) విద్రుమ(పగడము), హేమ(బంగారు), నీల(నీలము), ధవళ(తెలుపు
రంగు) వర్ణాలు కలిగిన ఐదు ముఖములతో , శంఖం ,చక్రం, కపాలము, గద, అంకుశం ధరించి వరదాభయ హస్తముతో దర్శనమిస్తుంది. ఈ శ్లోకముతో అందరూ ఈమెను ధ్యానిస్తే సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి. బ్రహ్మ
ఙ్ఞానము కలుగుతుంది. ప్రతి రోజూ ఈ ధ్యాన శ్లోకము చాలు యజ్ఞోపవీతము వేసుకోనవసరము
లేదని వేదము చెప్పిన వారికి. అదే వేసుకొమ్మని వేదమునందు చెప్పబడీ వేసుకొనని వారికి
రౌరవాది నరక ప్రాప్తి అనికూడా ధర్మశాస్త్రము చెప్పింది.
అసలు ఈ ఐదు ముఖములు వేరేమో కాదు పంచభూతములే! సూర్యుని యొక్క
5 ప్రదానాంగములే! ‘సర్వత్ర గాత్రస్య శిరం ప్రధానం’ అన్నది శాస్త్ర వచనము. అంటే ఈ 5
భూతములు అంటే పృథివీ, నీరు, వెలుగు(సూర్య
చంద్రాగ్నులు కలిపి, అసలు అవే అమ్మవారి మూడు కన్నులు),
వాయువు, ఆకాశము. ఇక అమ్మవారు సహస్ర కమలములో
కూర్చుని ఉంటుంది. ఆ సంకేతమును గూర్చి ఒక్కమాట చెప్పుకొందాము. సంస్కృతములో సహస్రము
అన్మ్న పదమునకు అనంతము అన్న అర్థము కూడా వుంది. పురుష సూక్తములో ‘సహస్ర శీర్షా
పురుషః సహస్రాక్ష సహస్ర పాద్’ అని చెప్పుకొంటాము కదా! అక్కడ ఈ ‘సహస్ర’ అన్న పదమునకు
అనంతము అని అర్థము. ఇక ఉదయార్కుని రంగు కమలముతో పోలిక కిరణములు రెక్కలు. ఒక
కమలములో రెక్కలు పద్మము యొక్క మధ్యలో వున్నా పీఠమునకు కట్టుబడి ఉంటాయి. దీనిని
సామాన్య భాషలో దుద్దు అనుట కూడా కద్దు. కావున అమ్మవారు ఈ అనంతదల పద్మ పీఠమును
అధీష్టించి యుంటారు.
సూర్యుని వెలుగు
అణువులతో నిండియున్నది అన్నది, సూర్య కిరణములు వక్రగతిన పయనించుతాయి
అన్నది నాడు వేదము నేడు Science చెప్పిన మాట. అంటే ఇవి మనలను
చుట్టుముట్టి యుండుటచేతనే మన బుద్ధిని సవిత్రుడు ప్రచోదనము అంటే పురోగమింప జేస్తూ
వున్నాడు.
ఈ క్రింది మాటతో ఈ వ్యాసమునకు భరత వాక్యము పలుకుచున్నాను.
ప్రఖ్యాత అమెరికన్ శాస్త్రవేత్త Dr. Howard
Steingeril, ప్రపంచవ్యాప్తంగా సేకరించిన మంత్రాల అర్ధమును, వాని
శక్తులను
పరీక్షించిన పిదప గాయత్రీ మంత్రమును గూర్చి “గాయత్రి మంత్రము సెకనుకు 1,10,000
ధ్వని తరంగాలు ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మంత్రము.
ఇది ఒక ప్రత్యేకమైన ధ్వని లేదా ధ్వని తరంగాల కలిగి, నిర్దుష్ఠమగు
ఆధ్యాత్మిక సామర్ధ్యములను అభివృద్ధి చేయగల సామర్థ్యం కలిగి ఉన్నది. ”అని ఈ విధముగా
తెలియజేసినారు, అని కొందరు వ్రాసినారు కానీ నాకు సాధక
పూర్వకమైన సాక్ష్యము లభించలేదు. అదే విధంగా K.E. = 1/2 m v2.ను గూర్చి:
“They also
noticed that the infinite mass of galaxies moving with a velocity of
20,000 miles/second was generating a kinetic energy = K.E. = 1/2 m v2. and this was balancing the total energy consumption of the cosmos. Hence they named it Pranavah, which means the body (vapu) or store house of energy (prana).” “The total kinetic energy generated by the movement of galaxies acts as. umbrella and balances the total energy consumption of the cosmos. Hence it was named as the Pranavah (body of energy). This is equal to
1/2 m v2.(Mass
of galaxies x v2 where v stands for velocity).
పై రెండు విషయములకు
ఆధారపూర్వకమగు అనుబంధములు లేనందున అంతగా నమ్మవలసిన అవసరము లేదని నా మనోగత
అభిప్రాయము. భవిష్యత్తులో దీనిని ఎవరైనా నిరూపించవచ్చునేమో? అంతవరకు
మనము ఇటువంటి విషయములపై అవగాహన లేకుండా వ్రాయుట సబబా అన్నది నా అనుమానము. ఏది
ఏమైయినా మన పూర్వుల గొప్పదనమును తెలుపుటకు ఈ ప్రయోగముల అవసరము కలుగదు. నాటి
మహనీయులకు తమ యోగ శక్తితో తాము ఎరిగినది తెలుపుట తప్ప వేరేటువంటి హీనమగు ప్రయత్నమూ
చేసినవారు కాదన్నదానికి వారి ఋజుప్రవర్తనే సాక్ష్యము. నేటి Scientists బహుశ భవిష్యత్తులో నిరూపించుతారేమో!
గాయత్రీ మంత్రము లో 24 బీజాక్షరాలున్నాయి. ఆ బీజాక్షరాల
ప్రశస్తి ఒకపరి
గమనించుదాము..
1.
కంచి కామాక్షి మందిరం లో అమ్మవారు మూలవిరాట్టుగా కూర్చుని ఉన్న
మంటపమును
గాయత్రీ మంటపమని అంటారు. ఆ ప్రాకారములో 24 స్తంభాలున్నాయి.
అవి
24 బీజాక్షరములకు ప్రతీకలు.
2.
కోణార్క్ లోని సూర్య దేవాలయము ఒక పెద్ద రథముగా నిర్మింపబడి అందు స్వామి
విగ్రహము
ప్రతిష్ఠింపబడి యుంది. ఆ రధానికి గాయత్రీ మంత్రానికి ప్రతీకగా 24 చక్రాలు
వున్నాయి.
3.
పురాణ కధనము ప్రకారము 24 ఋషులు వారి మంత్రశక్తిని ఈ 24 బీజాక్షరాలలో
నిక్షిప్తం
చేసినట్లు విన్నాను.
4.
ధర్మచక్రము లో వున్న 24 చువ్వలు (spokes ) ఆ బీజాక్షరములకు ప్రతీకలు. దానిని
మనము
సమయచక్రము అని కూడా అంటున్నాము. శక్తి రూపములో సావిత్రి (సవిత
అనగా
‘జ్యోతిస్’ అపారమగు వెలుగు) మంత్రం రూపములో ‘గాయత్రి’ అక్షర రూపములో
సరస్వతి.
ఒక్కమాటలో చెప్పవలసివస్తే ఈ రూపాల్నీ ‘గాయత్రీ మాతయే’
5.
జైన సిద్ధాంతంలో 24 తీర్ధంకరులు – ఇది అవైదిక మతమైనా వాటికి మూలం మన
వేదమే.
6.
24 కేశవ నామాలు
7.
24 తత్వాలు : ఐదు జ్ఞానేన్ద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచ
తన్మాత్రలు, 5
మహద్భూతాలు, బుద్ధి, ప్రకృతి, అహంకారం, మనస్సు
8.
ఛందస్సులో గాయత్రి ఛందస్సు పేరు మీద వున్నది. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఇలా
చెబుతాడు
: “ బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ చందసామాహం”
9.
రామాయణం లోని శ్లోకముల సంఖ్య 24 వేలు.
ఒకటవ శ్లోకము మొదటి
బీజాక్షరముతో
మొదలయి, ప్రతి వెయ్యి శ్లోకములతరువాత వచ్చే శ్లోకము యొక్క
ప్రారంభాక్షరము
వరుసక్రమములో మిగిలిన బీజాక్షరములను కలిగియుంటాయి.
10. ఒక వీణలో 24 చిర్రలు వుంటాయి. సంగీత శాస్త్రం తెలిసినవాళ్ళు దీన్నే గాయత్రి అంటారు.
గాయత్రీ
రూపమే సరస్వతి అని ముందే చెప్పుకొన్నాము. అందుకే ఆ మంత్రములోని 24
బీజాక్షరాలూ
24 మెట్లుగా వీణియలో ఇమిడియుండుటయే గాక
సంపూర్ణ వాద్యముగా
గణుతికెక్కిన
ఆ తంత్రీ వాద్యము సరస్వతీదేవి హస్తభూషణమైనది.
11.
మన వెన్నెముకలో 24 ఎముక పూసలు ఉంటాయి. వాటిని మృదులాస్తులు
(Cartilage) అంటారు.
వాటికి అధి దేవతలే గాయత్రి మంత్ర బీజాక్షరాలు.
సకల
దేవతా స్వరూపం గాయత్రి. విశ్వశాంతికి గాయత్రి, వాంఛాసిద్ధికి గాయత్రి. అంతటి
గాయత్రీ
మంత్రమును అర్హులు అనుష్ఠించి సభ్యసమాజ శ్రేయస్సుకు ఇతోధికముగా
పాటు
పడుతారని ఆశిస్తూ ఈ వ్యాసమునకు స్వస్తి పలుకుచున్నాను.
గాయత్రీ మంత్ర ప్రాశస్త్యము-మహనీయుల అభిప్రాయముల
గాయత్రి మంత్రమును జపించి తపించి సాధించిన మహనీయులు నాటినుండి
నేటివరకు
ఎందఱో గణించలేము . అటువంటి వారిలో కొందరు శ్రీ గాయత్రీ మంత్ర
విశిష్టతను
గురించి( మహాఋషులు, యోగులు, మహాత్ములు) తమ తమ
అభిప్రాయములను
వెల్లడించినారు. వారిలో కొందరి అభిప్రాయాలను ఈ దిగువన
తెలియబరచుచున్నాను.
ఇక్కడ ఒక విషయమును చెప్పవలసి యున్నది. ఇది
ఉపదేశించబడినవాడే
అనుష్ఠించవలెనన్నది వేద వాకు. దానికి యజ్ఞోపవీతధారులే
అర్హులు.
పూర్వము బ్రాహ్మణ, క్షత్రియ వైశ్య మరియు శూద్రులలో కూడా కొన్నితెగలు,
ఉదా:
సాలె వారు, విశ్వబ్రాహ్మలు, కాపు లేక బలిజలలో కొన్ని ఉపవర్గముల
వారు,
కమ్మవారు
యజ్ఞోపవీత ధారణ చేసి గాయత్రిని అనుదినమూ అనుష్ఠించేవారు. ఆ
ఆచారాలన్నీ
ఇప్పుడు ఆవిరి అయిపోయినాయి. ఏది ఏమయినా గాయత్రీ అనుష్ఠానము
అనుదినమూ
చేసేవారు అనుష్ఠానము చివర సర్వులూ, సర్వేసర్వత్రా సుఖముగా
ఉండవలెనని
కోరుతూ ముగించుతారు. కావున గాయత్రి చేయని వారికూడా ఫలితము
అందుతూ
వుంది. ఇది గమనించవలసిన విషయము. విజ్ఞులు ఏమన్నారో, ఇపుడు
చూద్దాము.
1.
విశ్వామితృడు - గాయత్రి మంత్రంతో సమానమైన మంత్రం నాలుగు వేదాలలో లేదు.
2.
యాజ్ఞవల్కుడు - గాయత్రీ మంత్రము సర్వశ్రేష్ఠము. అది సర్వోపనిషత్ సారము.
3.
పరాశరులు - సమస్త జప,
సూక్త, వేదమంత్రాలలో అత్యున్నతమైనది గాయత్రీ
మంత్రము.
4.
శౌనకుడు - ఎన్ని ఉపవాసాలు చేసినా, బంధ విముక్తి చేయగల శక్తి కలది గాయత్రీ
మంత్రము
మాత్రమే.
5.
వశిష్ఠులు - ఎంతటి దుర్మార్గుడైనా, చపలచిత్తుడైనా, గాయత్రీ
మంత్రోపాసన
ఫలితంగా, సర్వోన్నత పదవిని
పొందగలడు.
6.
వేదవ్యాసులు - సకల వేదసారం గాయత్రీ మంత్రం, సిద్ధగాయత్రీ మంత్రము
కామధేనువు
వంటిది. గాయత్రీ రూపమైన బ్రహ్మగంగ ఆత్మప్రక్షాళన చేస్తుంది.
7.
అత్రి - ఆత్మను శోధించు పరమమంత్రము గాయత్రీ మంత్రము. గాయత్రీతత్వాన్ని
గ్రహించువారు
సర్వసుఖములనూ పొందగలరు.
8.
భరద్వాజ - త్రిమూర్తులు కూడా గాయత్రీ ఉపాసన చేస్తారు. గాయత్రీ మంత్ర జపం
వల్ల
పరబ్రహ్మ సాక్షాత్కారం లభిస్తుంది.
9.
నారద మహర్షి - భక్తి స్వరూపమే గాయత్రి. ఎక్కడ గాయత్రి ఉపాసించబడునో అక్కడ
శ్రీమన్నారయణుడు
ఉంటాడు.
10.
రామకృష్ణ పరమహంస - మంత్రం చిన్నదైనా శక్తి మహత్తరం. అనేక సాధనలు
విడిచి
గాయత్రిని ఉపాసించండి,
సిద్ధుల్ని పొందగలరు.
11.
స్వామి రామతీర్ధ - గాయత్రి మనిషిని కామరుచి నుండి మరలించి, రామరుచిలో
లగ్నం
చేస్తుంది. పవిత్రాంతఃకరణతో అనుష్ఠించిన రాముని పొందగలరు.
12.
స్వామి వివేకానంద - గాయత్రీ మంత్రము సంవృద్ధి మంత్రము. అందుకే
మకుటమంత్రమన్నారు.
13.
శ్రీ రమణ మహర్షి - గాయత్రీ మంత్రశక్తి వలన అద్భుత ఫలాలు చేకూరతాయి.
ఐహిక, లౌకిక, పారమార్ధిక ఫలాలు లభిస్తాయి.
14.
స్వామి శివానంద - బ్రహ్మ ముహూర్తంలో గాయత్రీ మంత్రోపాసన వల్ల
హృదయనైర్మల్యం, చిత్తశుద్ధి,
శారీరక ఆరోగ్యము లభిస్తాయి. నమ్రత, దూరదృష్టి,
స్మరణశక్తి
లభిస్తాయి.
15.
దయానంద సరస్వతి - గాయత్రీ మంత్రము సర్వోత్కృష్ఠ శ్రేష్ఠ మంత్రము.
చతుర్వేదాలకు
మూలమైన మంత్రము.
16.
శ్రీ అరవిందులు - గాయత్రిలో నిక్షిప్తమైన శక్తి, మహత్వపూర్ణకార్యాన్ని సాధిస్తుంది.
17.
శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ - మనలో పునః జీవన స్రోతస్సును ప్రభావింపచేయగల
సార్వభౌమిక
ప్రార్ధనే గాయత్రీ మంత్రము.
18.
అమెరికాకు చెందిన ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు డాక్టరు Dr. Howard Steingeril గారు
ఎంతో
పరిశోధించిన పిమ్మట గాయత్రీ మంత్రము ఒక సెకనుకు 1, 10,000
శబ్దతరంగాలను
ఉత్పత్తి చేస్తుందని చాటినారు. ఇది ప్రపంచములోనే అతిగొప్ప
మంత్రమని
ప్రకటించినారు. దీనిని పుష్టి చేయగల పరిశోధన నాకు లభ్యము కాలేదు.
అనేక
ధార్మిక గ్రంథాలు గాయత్రీ మహిమను ప్రస్తుతించాయి. ఎందరో మహానుభావులు,
ఈ
మహత్తర మంత్రంలోని గుప్తమైన శక్తులను, గూఢరహస్యాలను గుర్తించి, ఉపాసించి
ఫలసిద్ధి
పొందినారని పై సందేశాలు తెలియజేస్తునాయి.
సర్వేపిస్సుఖినస్సంతు
సర్వేసంతు సమాశ్రయాః l
సర్వే
బధ్నాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్భవేత్ ll
స్వస్తి.
No comments:
Post a Comment