సమస్య మనది సలహా గీతది – 33
నా తలిదండ్రులు తమ వారసత్వమును నాకందించినారు. నేను సునిశితముగా పరీక్షించిన పిమ్మట నాకు అనిపించినది ఏమిటంటే నా ధర్మము లోపభూయిష్టము. పర ధర్మములు ప్రయోజనకరముగా కనబడుచున్నాయి. ఈ పరధర్మమునకు చెందినవారు సంపాదన, సుఖము సంతోషము మిక్కుటముగా కలిగియున్నారు. కష్టములు వారిని కన్నెత్తికూడా చూచుట లేదు. సుఖమయమైన ఆ పరధర్మమునే నేను ఆశ్రయించ దలచినాను.
సలహా: ముందు నీవీ కథ విను.
ఒక ఊరిలో ఒక చాకలి వుండేవాడు. కాపలా కోసం ఒక కుక్కను, బట్టలు మోయడానికి ఒక గాడిదను పెంచేవాడు. పగలూ, రాత్రి గొడ్డు చాకిరి చేయించుకునేవాడు కానీ ఎప్పుడు వాటికి కడుపునిండా తిండి పెట్టేవాడు కాదు. ఒకరోజు బట్టలు ఎక్కువగా ఉండి ఉతికి ఉతికి అలసిపోయి ఇంటికి వచ్చి బాగా నిద్రలోకి జారుకున్నాడు. ఆ రోజు అర్ధరాత్రి ఒక దొంగ, చాకలివానింటిలోకి చొరబడి సొమ్మంతా కాజేయ్యాలనుకున్నాడు. దొంగ ఇంట్లోకి ప్రవేశించడాన్ని కుక్క చూసింది. కానీ మొరగలేదు. గాడిద కుక్కను గమనించి ‘ఎందుకు నువ్వు అరవడంలేదు. వెంటనే అరిచి మన యజమానిని నిద్ర లేపు’ అన్నది. అందుకు కుక్క ‘నేనెందుకు మొరగాలి. ఏనాడైనా మన యజమాని మనకు కడుపు నిండా తిండి పెట్టలేదు. కడుపునకు తిండిలేక నాకు అరిచే శక్తి లేదు. యజమానికి ఇలాగే జరగాలి. జరగనీ. మంచిదే’ అంది. అందుకు గాడిదకు కోపం వచ్చి నువ్వు యజమానిపై చూపించే విశ్వాసం ఇదేనా? ద్రోహీ. నేను నీలా కాదు. ఇన్నాళ్లు యజమాని మనలను సాకుతూవున్నాడు అందుకు కృతజ్ఞతగా ఆయనకి సాయం చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. నేను ఓండ్ర పెట్టి యజమానిని నిద్ర లేపుతాను అని గాడిద ఒండ్రపెట్ట సాగింది. దాని అరుపునకు భయపడి దొంగైతే పారిపోయినాడు కానీ యజమాని లేచి వచ్చి ముందూ వెనుక చూడకుండా తనకు నిద్రాభంగం ఆ గాడిదను చావబాదినాడు.
చూసినావా ధర్మము తప్పినందుకు గాడిదకు పడిన శిక్ష. తన ధర్మములో కుక్క లోసుగును చూపించింది. దానికి కారణము కూడా చెప్పింది. అయితే ఇక్కడ మనము ఆలోచించవలసినది, యజమాని తప్పుచేసినాదని కుక్క కూడా తన ధర్మాచరణలో లోపమును చూపించింది. మరి కారణములను వెదకి మరీ తప్పులు చేస్తూపోతే ధర్మము కనుమరుగై పోలేదా!
తన ధర్మము పాలించుటకు అతి కష్టమైనదనీ పరుల ధర్మమేమో ఆచరణకు ఎంతో సులభము మరియు ఫలితమునిచ్చేది అని తలచే వారికి నా విషయములో జరిగిన ఒక సంఘటన తెలుపుతాను.
నేను తిరుపతిలో Officer గా పనిచేసే కాలములో Performance and Budget మరియు Premises and Fixed Assets ఒంగోలు ప్రాంతమునకు చూసేవాడిని. Advances wing లో ఒక వ్యక్తి Returns చూసేవారు. అప్పుడు P.Rama Raju గారు AGM గా వుండేవారు. అప్పుడు శనివారము నాడు Office 2pm వరకు మాత్రమె వుండేది. AGM గారు తన కేబిన్ లోనూ నేనూ, ఆ ఆఫీసరు హాల్ లో పని చేసుకొంటున్నాము. అంతలో AGM గారు బయటికి వచ్చినారు. మేమిద్దరమూ ఇంకా వున్నది గమనిన్చినారు. సమయము అప్పటికి సాయంకాలము 3.30 అయివుంటుంది. మీరిద్దరూ ఇంకా వున్నారా అని, ఆ ఆఫీసరు వైపు తిరిగి ఏమి చేస్తున్నారు అన్నారు. Advances Returns Files అన్నీ Order లో పెట్టుకొంటున్నాను Sir అని అని చాలా కష్టముగా వుంది ఈ Seat Maintain చేయటము అన్నారు. వెంటనే AGM గారు అయితే మీరు రామమోహన్ గారి Seat Maintain చేయండి ఆయనను మీ సీటుకు పంపుతాను అన్నారు. ఆ ఆఫీసరు వెంటనే ఎందుకులెండి నేను ఇదే చూచుకొంటాను అన్నాడు. ఆయన కష్టమంతా తానె పడుతున్నట్లు ఒక image ని create చేయడలచుకొన్నాడు. అంటే ఇది ఒక Deal లాంటిది. నాబరువు ఇంకా తగ్గిస్తే ఈ ధర్మమునే పాటిస్తాను లేకుంటే నేను వేరే దారి వేడుక్కొంటాను అని. AGM గారు అంతకన్నా కష్టమైనా Seat చూపిస్తూనే ఇదేచాలు అనుకొన్నాడు ట్రాన్స్ఫర్ వచ్చేవరకు. పని చేయుట నీ ధర్మము దానిలో ఎక్కువ తక్కువ అన్న వ్యత్యాసమును గూర్చి తలచితే నీ ధర్మమునకు న్యాయము చేయలేవు. ఒకవేళ నీవు వేరే ధర్మమునకు మారినా నీ మనస్తత్వము అదే కదా! బలహీనత నీలోనిదిగానీ ధర్మములోనిది కాదు. ఇది నీవు గుర్తించవలసిన విషయము.
అనారోగ్యముతో అవస్తపడు తల్లిని వదిలి రోడ్డుమీద రికార్డు డాన్సు చూడను ఎవడూ పోడు కదా! ఈ మాట ఎంత గొప్పదో చూడు.
ధర్మ ఏవ హతో హన్తి ధర్మో రక్షతి రక్షితః
తస్మాద్ధర్మో న హన్తవ్యో మా నో ధర్మో హతోవధీత్
అన్న మనుధర్మ శాస్త్ర సూత్రమును వినలేదా! మన దేశ స్వాతంత్ర్యమును కాపాడుకొనుట మన ధర్మము. దానిని మరచి ఆంగ్లేయులు విసరిన మాసపు ముక్కలకై వారిముందు కుక్కలమైనాము. ఇంతకంటే ఉదాహరణ కావాలా! ఆవిధముగా తోకలు ఊపిన వారి పేర్లు ప్రయత్నించినా జ్ఞాపకమునకు రావు. చత్రపతి శివాజీ కుమారుడు ధర్మ వీరుడగు శంభాజీ ధర్మ నిరతిని మరువ గలమా! ధర్మము తప్పుతకంటే తల నరికిన్చుకోనుతకే సిద్ధపడి నరికించుకొన్న గురు తేగ్ బహదూర్ను మరచి పోగలమా! వారిని చిత్రహింసల పాలుజేసిన క్రూరుడు ఔరంగజేబును మరచిపోగలమా! ఎన్ని విధములుగా ఆలోచన చేసిననూ మనము వారికంటే గొప్ప కాదు. అటువంటి మహనీయుల మార్గమే మనకు శిరోధార్యము. అసలు ఈ విషయములో పరమాత్మ ఏమంటున్నాడో చూద్దాము.
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాస్వనుష్టితాత్I
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహఃII 35--3
పవిత్రమైనా అది పర ధర్మము
నీకగు శ్రేయము నీదగు ధర్మము
పర ధర్మమ్మది బహు భయ భరితము
నీ ధర్మమమ్మున నిధనము ఉచితము 35--3
ఇది బాధ గురువులు చెప్పిన మాట కాదు పరమాత్మయే బోధగురువుగా చెప్పిన మాట. అనుభవ శాలియైన వ్యవసాయదారుని చూసి నేను ఆపని చేస్తే బాగుండునని ఒక వైదీకి అనుకొంటే అటు అదీ నాశనమే ఇటు ఇదీ నాశనమే! HAIR OIL సువాసన కలిగి వున్నదని పోపు పెట్టుటకు వాదము కదా! ఎవరి ధర్మము వారిదే! ఇక్కడ ఇంకొక మాట. గీతా బోధ సమయానికి పర మతములు లేవు. ఇప్పుడు కొత్తగా ఒక 2౦౦౦ వెల సంవత్సరముల మరియు 15౦౦ క్రితము ఉత్పన్నమైన మతములు కపట ప్రేమ తోనో కత్తి మొన తోనో తాయిలాలతోనో, తరుణీ కళ్యాణాలతోనో, విందుల ద్వారానో విభజన ద్వారానో, ఆరోగ్య కూటములతోనో అతిదారుణ మారణ కాండతోనో, నయానో, భయానో తమ మతములో చేర్చుకొంతూవుంటే విచక్షణా రహితముగా వారి ఆకర్షణలకు వివశులమౌతూ ఉన్నాము. లక్షల సంవత్సరములనుండి, పరమాత్ముని నిశ్వాసమైన వేదప్రామాణికత గల్గిన ధర్మమును వీడి తమకే తెలియని ప్రామాణికత కల్గిన మతగ్రంధముల ఆధారముగా ఏర్పడిన మతములనాశ్రయించుట మేలా! అందుచే నీకు చెప్పవచ్చేదేమిటంటే పరమతము పై రాగము మన మతము పై ద్వేషము ఉంచుకొంటే నీవు చూసే ప్రతి విషయాన్నీ తడనుగునముగానే ఆలోచిస్తావు. ఈ మాట ఒక సారి గమనించు:
రాగద్వేషమను రంగుటద్దములు
కలిగిన కనులకు కడు సుందరముగ
రాగయుక్తమౌ రంగు దీపములు
కాంతులు నింపుచు కనబడజేసే
పర ధర్మమ్ములు బహు ప్రియతమములు
అని అన గలవా అనుభవించనిదె
చెట్టు తొర్రలో చేయి పెట్టకనె
ఏముందని నీవెట్లు తెల్పెదవు
పామోతేలో పాణిగ్రహణము
చేసిన నీవిక చేసేదేమిటి
ప్రయోగములతో ప్రయోజనమ్ములు
అందివచ్చునని ఆశ చెందకుము
ఆ భగవంతుని ఆత్మ దలంచుము
అన్యధర్మముల నాశించకుము
స్వస్తి.
****************************************************************
సమస్య మనది సలహా గీతది – 34
https://cherukuramamohan.blogspot.com/2020/11/34.html
సమస్య: నా మనసు అనుక్షణమూ చంచలమే! చక్కని నిర్ణయము తీసుకొనే మనఃస్థిమితము లేదు నాలో! అందువల్ల నేనేమీ సాధించలేకుండా ఉన్నాను. మరి దేవుడు మనలో ఆత్మ రూపమున వుంటాడంటారు కదా! మరి మనసును ఎందుకు నియంత్రించడు?
సలహా: You can't have your pie and eat it too అన్న ఒక ఆంగ్ల సామెత వుంది. తెలుగులో కూడా ‘ఆవ్వా కావాలి బువ్వా కావాలి అంటే కుదరదు’ అన్న సామెత బహుళ ప్రచారములో వుంది. అది కుదరదు కదా!. ఇంకొక మాట సముద్ర స్నానమునకు పోయినవాడు అలలు ఆగిన తరువాత స్నానము చేస్తామనుకొన్నాడట. ఇప్పుడు నీవు చెప్పేది కూడా ఆవిధంగానే వుంది. కాబట్టి ఈ అన్ని విషయాలవల్లా అర్థమయ్యేది ఏమిటంటే నీ మనసు ఎంత అల్లకల్లోలముగావున్నా నీ ధ్యేయము నీవు మరువ కూడదు. నీ పట్టుదల నీవు విడువకూడదు. నీ మనసు చంచలము. అత్యంత చపలము. దానిని నిజానికి పంచ కర్మేంద్రియములు పంచ జ్ఞానేంద్రియములు అనుక్షణము అంటిపెట్టుకొనియే వుంటాయి.
వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థ అన్న ఐదూ కర్మేంద్రియ పంచకము. త్వక్చక్షుర్జిహ్వశ్రోత్రాఘ్రాణాలను జ్ఞానేంద్రియ పంచకము అంటారు. ఈ పదీ మనసుకు మేతను అందించే సాధనాలు. మరి ఇన్ని పనిముట్లు మనసుమీద పనిచేస్తున్నపుడు మనసు స్థిర నిశ్చలతలో వుండగలుగుతుందా! ఉండలేదు. తటస్థ నిశ్చలతలో మాత్రమే ఉండగలదు. ఇంకాస్త బలహీనమైన మనసైతే అస్థిర నిశ్చలతకు కూడా పోగలదు. మనసనే రథానికి కోరికలే గుర్రాలు. కళ్ళెములు నీ చేత లేకుంటే నిన్నేక్కడికో ఏగించుకొని పోనూవచ్చు అట్లే ఎక్కడో పడదోయనూ వచ్చు. అందుకే కళ్ళెములను చాలా జాగ్రత్తగా నీచేతిలో ఉంచుకొంటే ఆ గుర్రాలు నీ అదుపులోనే వుంటాయి. గుర్రములు అడుపులోనుంటే తేరుకు వచ్చిన తొందర లేదు. Steering చేతిలో ఉంటే, Car, Control లో ఉంటుంది.
కాబట్టి నీ లక్ష్యము పై గురి పెట్టు. తక్కిన కోరికలు, ఆలోచనలు వదలిపెట్టు. అప్పుడు నీ ధ్యేయము నీ లకష్యము అవుతుంది. అక్నుకోన్నది సాధిస్తావు. అది నీ ఎదుగుదలకు ప్రారంభము. మాన్యులు APJ అబ్దుల్ కలాము గారు 1౦౦ కిలోల బరువైన భావాన్ని 1 గ్రాము వాక్యముతో చెప్పినారు. ‘If you want to shine like a sun, first burn like a sun’ ‘You got success only when your signature converts into Autograph’. ఇవి గురుతు పెట్టుకొంటే చాలు కోరికలనే పక్షులు పారి పోవటానికి ఉండేలు చేతిలో ఉన్నట్లే. ఆ విధంగా నీ పంట బాగా పండినట్లే!
నేటి చదువులు చదివిన వారిలో TERMINATER ఆంగ్ల సినిమా చూడని వారు బహు అరుదు. అందు హీరో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ ను Hollywood లో నటునిగా అందరూ త్రుణీకరించినవారే! ఇటుక ఇటుక పోవు చేసి జీవితమనే భవనమును, ఇంటిని కాదు, నిర్మించుకొన్నాడు. ఆర్నాల్డ్ అలోయిస్ స్క్వార్జెనెగర్ 1947, జూలై 30న జన్మించిన ఒక ఆస్ట్రియన్-అమెరికన్. ఈయన ఒక దేహదార్ఢ్య సాధకుడు, నటుడు, మోడల్, వ్యాపారవేత్త మరియు రాజకీయనాయకుడు. ఈయన కాలిఫోర్నియా యొక్క 38వ గవర్నరుగా సేవలందించినారు. ఈయన గవర్నరుగా 2003 లోనూ, 2006 లోనూ ఎన్నికయినారు. ఒక సాధారణ మధ్యతరగతి బహు కుటుంబీకుని కుమారుడు. కేవలము పట్టుదలతోనే పైకి వచ్చినవాడు. ఆయన సందేశము ఏమిటో ఒకసారి విను నీకర్థమముతుంది నీవేమి చేయవలసిందీ. 'I set a goal first and then I do whatever it takes to achieve it”. అంటే రెక్కలు విదిలించు. లక్ష్యమునెంచు. ఎగురుట ప్రారంభించు. ఆకాశమే హద్దు. మధ్యలో ఆగవద్దు.
ఇంకోక్జ ముఖ్యమైన విషయము. దేవుడు నీ మనసులో ఉన్నాడన్నది నిజమే కానీ నిన్ను నీ చాలనచలనములను నియంత్రించుటకు కాదు. నీ కర్మకు ఆయన సాక్షీ భూతుడు. నీ బుద్ధి నిన్ను ప్రచోదనము అంటే నడిపిస్తూవుంది. అందుకే నీవు సదా సర్వదా నీబుద్ధిని సక్రమ మార్గములో నడిపించమని కోరుకో. అసలు నీ బుద్ధి అస్వతంత్ర. 'బుద్ధిః కర్మానుసారిణి అన్నది శాస్త్రము. ఈ కర్మలు నీ పూర్వజన్మ లో మిగిలిపోయి, ఈ జన్మకు కొనితేబడినవి. నీ బుద్ధిని నియంత్రించేది అవే! నీవు నిరంతర ధ్యానమగ్నుడవైయుంఢుటవలన నీ దుష్కర్మల యొక్క దుష్ఫలితములను తగ్గించమని నీలౌన్న పరమాత్ముని, నీ ఏ పేరున తలచుకొంతావో ఆపేరుతో ప్రార్థించు. ఆయన భక్త సులభుడు నీ కోరిక తీరుస్తాడు. బాలకులైన మార్కండేయ ప్రహ్లాదులు shiva కేశవులను తమ తమ అచంచల భక్తిచే సాధించినారుకదా! మన ధర్మము తర్క బద్ధము. దేవసుతులో దేవదూతలో చెప్పినవి కావు.
దేవుడు ఆత్మ రూపములో ఉంటాడు అని ఎవరో అనటంకాదు, ఆ మాట వేదమే చెబుతూ వుంది. ‘నీవారశూకమత్తన్వి పీతాభా స్వస్త్యణూపమా’ అని. వడ్లగింజకు ముల్లు వుంటుంది. ఆ పరిమాణములో గుండెకు దగ్గరగా ఒక వడ్ల గింజ ముల్లంత నీలిరంగు జ్యోతి వెలుగుతూ వుంటుంది. దాని శిఖలో అణువు రూపములో భగవంతుడు తిష్ట వేసుకొని యున్నాడు. కానీ ఆయన నిన్ను నియంత్రించడు. నీ కర్మ ఫలితములే నీ జీవన గమనానికి ఉపాధులు. ఆయన కేవలము సాక్షీభూతుడే! కావున జరిగినదేమిటో నీకు తెలియదు కాబట్టి జరుగవలసినది చక్కజేసుకో! నీ పనులకు ఆత్మను సాక్షిగా ఎంచుకో ! మనసును లేక బుద్ధిని సాక్షిగా ఎంచుకోవద్దు. పాపమన్న పశ్చాత్తాపము లేకుండా గుడ్డివానికయినా చెడ్డదారి చూపిస్తాయి. అందుకే భగవానుడు ఈ విధముగా చెబుతున్నాడు.
మమైవాంశో జీవలోకే జీవ భూతః సనాతనః l
మనఃషష్ఠానీన్ద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి 15-7
అఖిల జీవులకు ఆత్మ రూపమున
అనాది నుండీ అంశీ భూతుడ
ప్రకృతి మయమౌ పంచేంద్రియముల
మరియు మనసును ఆకర్షింతును 15-7
సర్వ ప్రాణుల దేహములలో వున్న సనాతనమైన జీవాత్మ నా అంశయే! అదే ఆత్మ. మనసు పంచేంద్రియములు వెరసి ఈ ఆరున్నూ ప్రకృతియందు స్థితములై ఉన్నాయి. ఈ ఆరింటి కర్మలను ఆత్మ రూపములో దేహిలో వున్న పరమాత్మ తన వైపునకు ఆకర్షించుకొనుచున్నాడు.
దైవం సృష్టించిన ప్రాణికోటిలో మనుష్యులే మాట్లాడగలరు. వీరిలో రెండు జాతులున్నాయి అంటోంది గీత.
ఆ జాతిలో మనమెవరమో మనమే కనిపెట్టాలి ...
ద్వౌభూత సర్గౌ లోకేస్మిన్ దైవాసుర ఏవచ l
దైవో విస్తరశః ప్రోక్త అసురం పార్థమే శృణు ll... (16-6)
పార్థా జనులను పరికించినచో
సురాసురాళిని చూడగ వచ్చును
దేవ గుణములను తెల్పితినికపై
అసుర గుణమ్ములనాలకించుము
ఎవరి హృదయంలో దైవీ గుణాలు పనిచేస్తుంటాయో వారు దేవతలు ఎవరి హృదయంలో అసురీ గుణాలు పనిచేస్తుంటాయో వారు దానవులు. ఈ రెండు రకాలు మాత్రమే ఉన్నాయి. మరి మనము దేవతలమా లేక దానవులమా అన్నది మనకు మనమే తేల్చుకోవాలి. కాబట్టి సత్వగుణమును ఎక్కువగా ప్రోవు చేసుకొంటే మిగిలినదానిలో రజోగుణము, ఏకొద్దిగానో ఇంకా ఖాళీ వుంటే అదులో మాత్రమే తమోగుణము వుంటే నీ నడవడికే నిన్ను నెమ్మదిగా లక్ష్యానికి చేరుస్తుంది.
స్వస్తి.
************************************
సమస్య మనది సలహా గీతది – 35
సమస్య: దేవుని ఎందఱో పూజించుచున్నారు. కానీ అందరిహృయము ఒకటి కాదు. నిజమైన
భక్తులు ఉన్నారు. ఇహపరమైన వాంఛలు తీర్చుకొనుటకు దేవుని ప్రలోభపెట్టే వారూ
వున్నారు. ఇక ఉద్యోగ విషయములోనూ అంతే. ఉద్యోగమూ వచ్చేవరకూ గుళ్ళూగోపురాలు
తిరుగుతారు. వచ్చిందంటే ఎవిధమైనదైనాసరె సంపాదనే తమ సర్వస్వమనుకొంటారు.
సలహా: నీవు చెప్పినది వాస్తవము. కానీ లోకాన్నంతా ఒకే గాట కట్టివేయలేము. ఈ
విషయముగా శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఏమంటున్నాడో ముందు విను. తరువాత ఈ
విషయముపై విశ్లేషణ జరుపుకొందాము.
చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోஉర్జున I
ఆర్తో జిఙ్ఞాసురర్థార్థీ ఙ్ఞానీ చ భరతర్షభ II 16 - 7
ఆర్తులు, స్వార్థులు అర్థాతురులు
జ్ఞానపథికులు జ్ఞానపెన్నిధులు
పూర్వపుణ్యమున పూజింతురు నను
భరతర్షభ పరికించి చూసినను 16 - 7
“భరత శ్రేష్ఠా ! అర్జునా! నిస్సహాయులు, నీ నైజము తెలియదలచినవారు, అర్థబలమునూ, అంగబలమునూ కోరేవారు, నా
ఎరుకను గుర్తించినవారు నిలకడగా నన్ను సేవిస్తున్నారు. “
ఈ విషయమును కాస్త వివరముగా పరిశీలించు.
కష్టాలలో ఉండి, ఆ
కష్టాలను గట్టెక్కించమని ప్రార్ధించేవారు “ఆర్తులు”. కానీ ఈకూటమిని కూడా 4
విధములుగా వర్గీకరించ వచ్చును. పరుల ఆర్తి తీరుటకు దేవుని తాము ప్రార్థించేవారు, తమ బాధలు తీర్చమని తామే
ప్రార్థించుకొనేవారు, విచక్షణారహితముగా ఇతరులకు చెడుపు చేసి
అయినా సరే తమకు మేలు చేయమని కోరుకొనేవారు. ఇతరులకు కీడు చేస్తేచాలు తమకు మేలు
జరుగాకపోయినా పరవాలేదు అని అనుకొనేవారు. ఈ సందర్భములో భర్తృహరి మహాశయుని ఒక
సుభాషితమును, దానికి తెనుగు సేతయగు ఏనుగు లక్ష్మణకవి గారి
పద్యమును ఒకసారి నెమరు వేసుకొందాము.
ఏతే సత్పురుషా: పరార్ధఘటకా స్స్వార్ధాన్ పరిత్యజ్య యే
సామాన్యాస్తు పరార్ధ ముద్యమభృత: స్వార్ధావిరోధేన యే,
తే2మీ మానుషరాక్షసా: పరహితం స్వార్ధాయ నిఘ్నంతి యే
యే తు ఘ్నంతి నిరర్ధకం పరహితం తే కే న జానీమహే.
తమకార్యంబు పరిత్యజించియు పరార్ధప్రాపకుల్ సజ్జనుల్,
తమకార్యంబు ఘటించుచున్ పరహితార్ధవ్యాపృతుల్ మధ్యముల్,
తమకైయన్యహితార్ధ ఘాతుకజనుల్ దైత్యుల్,వౄధాన్యార్ధభం
గము గావించెడువార లెవ్వరొ యెరుం గన్ శక్యమే యేరికిన్?
స్వకార్యములను విడిచి పరులకార్యములను చేయువారు సత్పురుషులు. వీరు మహనీయులు.
బహుకొద్ది మంది ఈ కోవకు చెందుతారు. ఈ కాలములో ఇటువంటివారు దొరుకుట దుర్లభమేమో
కూడా! ఇక రెండవ కోవకు చెందినవారు తమ కార్యములకు భంగము లేకుండా
జాగ్రత్త పడుతూ, పరుల కార్యములను చేయువారు మధ్యములు అనబడతారు. దీనిని Win-Win
Situation అంటారు ఆంగ్లములో. ఇది లౌకికమూ ఉభయ తారకమూ అవుతుంది. ఈ
మార్గము శ్రేయస్కరము. ఇక మూడవ కోవకు చెందిన వారు స్వప్రయోజన నిమిత్తమై
పరులకార్యములను చెడగొట్టువారు. వీరిని మనము మనుష్యులలో
రాక్షసులుగా గుర్తించవచ్చును. దుష్కృతులైన వారి జీవనము స్వార్థపూరితము,క్రమరహితము, ఆధ్యాత్మికగమ్యశూన్యమై
యుండుట వలన వారికి భక్తిలో నెలకొనుట అతికష్టము కాగలదు. ఇక
తమకు ఏమాత్రమూ ప్రయోజనము లేకున్నా పరులకు నష్టము చేయువారిని ఏమని పిలువవలేనో
ఎరుగుటకు మన మేధస్సు చాలదు. ఈ నాలుగు విధములయిన మనుషులూ భగవంతుని పూజించేవారే!
కానీ పరమాత్మ, తనను ఎవరైతే నిజమైన ఆర్తితో పరహింస, పరకీయ విత్తహరణా
భావము లేక వేడుకొంటారో వారికే తాను సాయపడుతానంటున్నాడు. ఎందువల్లనంటే ఒక వ్యక్తి
తాను కూడబెట్టుకొన్న సత్కర్మ ఫలితముల వల్లనే అంటే సంచిత కర్మల వల్లనే సద్బుద్ధిని
పొందగలుగుతాడు. అప్పుడే అతనికి సదాలోచన, సదాచరణ, సత్సంగము, సద్భక్తి, సద్భుక్తి
అన్నీ లభ్యమౌతాయి. అటువంటి వారి ఆర్తితో కూడిన ఆత్మ నివేదనకు ఆసరాగా నిలుస్తాడు ఆ
పరమాత్ముడు. కాబట్టి ఇటు ఆర్తికి అటు అర్థార్తికి కూడా అన్వయమౌతుంది ఈ సుభాషితము.
ఇక మిగిలింది జిజ్ఞాసువు మరియు జ్ఞాని.
జిజ్ఞాసువులో తెలుసుకోవలెనన్న తపన తప్ప తప్పుడు ఆలోచనలకు తావివ్వడు.
జిజ్ఞాసువు Musquito
coil లాంటి వాడు. తెలుసుకోవలెనన్న తపన అగ్ని రూపములో ఆ చుట్ట యొక్క
బయటి కొనను అంటుకొంటుందో, కారణాంతరాలచేత బయటి శక్తులచే
ఆర్పివేయబడక పోతే అంతము అంటే చివరికోసను చేరుకొంటుంది. అదే ఆ జిజ్ఞాసువు
తెలుసుకోదలచిన బ్రహ్మతత్వము. ఈ విషయమునే శంకరులవారు
“సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వమ్ l
నిర్మోహత్వే నిశ్చలితత్వం నిశ్చలితత్వే జీవన్ముక్తిః ll”
అని ఉపదేశించినారు. అంటే జీవన్ముక్తికి ప్రథమ సోపానము సత్సాంగత్యము. దానివల్ల
లబ్ధిని పొందగా పొందగా వ్యక్తి ఇక నాకు ఏ సాంగత్యమూ అవసరము లేదు అన్న స్థితికి
వస్తాడు. కొంతకాలానికి ఆ స్థితిని దాటి మొహమే లేని స్థితికి చేరుకొంటాడు.
ఎప్పుడయితే మోహము నేలమట్టమవుతుందో అపుడు చిత్త చాంచల్యము ఏర్పడదు. చచలత ఎప్పుడయితే
లేదో అప్పుడు మనసు ఆత్మను పరమాత్మతో అనుసంధించ గలుగుతుంది. అది జరిగితే ఇక
జీవన్ముక్తియే కదా!
ఇక జ్ఞానిని గూర్చి ఒక్కమాట, కాదు కాదు ఒక్కొక్కమాటలో చెబుతాను. భాగవతము,
ప్రహ్లాద చరిత్రము లోని ఈ పద్యమును గుర్తు తెచ్చుకొండి.
మందారమకరందమాధుర్యమునఁ దేలు
మధుపంబు బోవునే మదనములకు
నిర్మల మందాకినీవీచికలఁ దూఁగు
రాయంచ జనునె తరంగిణులకు
లలిత రసాలపల్లవ ఖాదియై చొక్కు
కోయిల చేరునే కుటజములకుఁ
బూర్ణేందుచంద్రికా స్ఫురితచకోరక
మరుగునే సాంద్రనీహారములకు
అంబుజోదర దివ్యపాదారవింద
చింతనామృతపానవిశేషమత్త
చిత్త మేరీతి నితరంబుఁ జేరనేర్చు
వినుతగుణశీల! మాటలు వేయునేల
అన్నటువంటి, ఈ
పద్యము, అందరికీ
నోటికి రాక పోయినా తెలియనిది మాత్రము కాదు.
మందార పుష్పముల మకరంద మాధుర్యమునకు అలవాటు పడ్డ తుమ్మెద దిరిసెన పూవుల
దిక్కు చూడగలదా! నిర్మల మయిన గంగానదీ డోలల తేలియాడు రాజ హంసలు వాగులకు వంకలకు
ఉరకలెత్తునా! లేత మామిడి చిగుళ్ళు ఆరగించు కోయిలలు, కొడిసె లేక కొండ మల్లె చెట్ల
చెంతకు పోవునా! నిండు పున్నమిలో విహరించు చకోర పక్షులు పొగమంచు దరికి చేరునా!
కావున, జ్ఞానియైనవాడు, ఆ
పరాత్పరుని దివ్య పాదారవింద ధ్యానములోనే, ఆ
అమృత సుధాస్వాదనలోనే, సదా
పరవశిస్తూ ఉంటాడు. అన్యము పై ఆసక్తి కాదుగదా అసలు దృష్టియే ఉండదు.
దుష్కృతులకు భిన్నముగా శాస్త్రములందు తెలుపబడిన
నియమములకు కట్టుబడి వర్తించు వారు “సుకృతిన:” అనబడుదురు. అనగా వారు శాస్త్రములందలి
సాంఘిక మరియు నైతికనియమములను పాటించుచు పరమాత్ముని యెడ భక్తిని కలిగియుందురు.
అటువంటి వారిలో ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు అను నాలుగుతరగతుల
వారు ఉంటారని చెప్పుకొన్నాము. మొదటి రెండు వర్గములకు చెందినవారు తాము చేయు భక్తికి
కొంత ప్రతిఫలమును కోరియుండుటచే వాస్తవమునకు వారు శుద్ధభక్తులు కారు. శుద్ధభక్తి
యనునది ఆశలకు మరియు భౌతికలాభాపేక్షకు అతీతమైనట్టిది. అటువంటి శుద్ధభక్తిని
భక్తిరసామృతసింధువు (1.1.11) ఈ విధముగా నిర్వచించినది.
అన్యాభిలాషితాశూన్యం జ్ఞానకర్మాద్యనావృతం I
అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమా II
“అన్యములగు ఎటువంటి కోరికలూ లేకుండా జ్ఞానము తత్సంబంధమగు నిత్య నైమిత్తికమగు
అనుకూల కర్మలను ఆచరించుతూ, శ్రీకృష్ణానుశీలనము
కలిగి సేవింపవలసియున్నది. అదియే శుద్ధమైన భక్తియుక్తమగు సేవ అని యనబడగలుగుతుంది.”
ఈ నాలుగుతెగల మనుజులు భక్తియోగమును నిర్వహించుటకై శ్రీకృష్ణభగవానుని
దరిచేరినపుడు శుద్ధభక్తుని సాంగత్యములో పరిశుద్ధులు కాగాలిగినారంటే వారును
శుద్ధభక్తులు కాగలరు.
ఇక లౌకికమైన విషయమునకు అన్వయమును గూర్చి ఆలోచించుదాము. పనిలోనే పరమాత్ముడు
వున్నాడన్నది పెద్దల మాట. తమకు భగవానునిచే మన కర్మలననుసరించి వ్రాసిపెట్టబడినదే
మనము చేయవలసిన కర్మ. ఈ విషయమునకు నేనే ఒక ఉదాహరణ. నేను M.Sc. (Moths) చదివిన వెంటనే
కళాశాలలో గణిత ఉపన్యాసకుడను కావాలనుకొన్నాను. నాకు అది వ్రాసిపెట్టబడిలేదు అందుకే Bank
లో చేరినాను. మరి కోరినది రాలేదని నిరుత్సాహపడక వచ్చిన ఉద్యోగమే
పరమాత్ముని ప్రసాదముగా భావించి ఆసాంతము ఆ ఉద్యోగమును ఆత్మ తృప్తితో చేసుకొన్నాను.
వంశానుక్రమణముగా సీరధ్వజుడు (జనక మహారాజు, సీతమ్మ తండ్రి) రాజయినాడు. కానీ ఆయన దానిని
బాధ్యతగా చేసినాడు తప్పించి ఎన్నడూ వ్యక్తి గతముగా తీసుకొని రాజభోగములనుభావించలేదు.
అట్టివారు జ్ఞానులు. ఆయన రాజు గానే ప్రజారంజకముగా పాలించినాడు కానీ చక్రవర్తి
కావాలనుకోలేదు. అట్టివారికి ఆశలు ఆశయాలూ వుండవు. వారిధ్యేయము పరమపదమే. మన
ఉద్యోగములలో కూడా పదవీ నిరపేక్ష కలిగి ఉన్న బాధ్యతనే సక్రమముగా చూసుకోనువారుంటారు.
ఆవిధంగా పనిలోనే పరమాత్ముని చూస్తారు. మరి కొందరు ఉపాధి కొరకు ఉద్యోగములో
చేరుతారు. తనపైగల వరిష్ఠ ఉద్యోగి అరచినా తిట్టినా సహచరులు హేళన చేసినా తనపని తానూ
శ్రద్ధతో చేసి నేర్చుకొంటాడు. ఇతడు జిజ్ఞాసువు. ఇట్టి జిజ్ఞాసువులలో మానసిక
బలహీనులు కొందరు తన పై అధికారులతో, సహచరులతో పడిన ఇబ్బందులు
మరువ కుండా అదే రీతిని క్రొత్తగా చేరిన వారిపై చూపించుతారు. ఇటువంటి వారికి ఎదుగు
బొదుగు ఉండదు. జిజ్ఞాసువైకూడా దారి మార్చుకొన్నాడు. సరియైన దారిలో వెళ్ళిన
జిజ్ఞాసువు తన కర్మ ఫలముననుసరించి చేరవలసిన అంతస్తు చేరుతాడు. కలిగిన దానితో
తృప్తి చెందుతాడు. ఇక అర్థార్తులు. వీళ్ళను రెండు రకములుగా విభజించవచ్చు. మొదటి
తరగతికి చెందినవారు విధి నిర్వహణములో ఎటువంటి లోపమూ చూపకుండా, తమ వరిష్ఠుల కనుసన్నలలో మెదలుతూ పై పదవి వస్తే వెళ్లుతారు. ఇక రెండవ తరగతి
వారు. వీరు ఉద్యోగములో ఉన్నంత కాలము పదవీ వ్యామోహము, లంచగొండితనము,
తిండి పెట్టే సంస్థకే కన్నమువేసే గుణము కలిగి ఉంటారు. వారుచేసిన
అకృత్యములకు ఇక్కడ అనుభవించక పోయినా, పైవాడు మాత్రము విడిచి
పెట్టడు. అసలు భూమి పైనే నరకము చూపిస్తూవుంటాడు అట్టివారికి. ఇక ఆర్తులు, పని చేయుట క్రొత్త అగుట చేతను, చురుకుదనము తక్కువగా
వుండుటవల్లనో తన పైవారినో లేక సహచరులనో ఆశ్రయించినపుడు అతనిని సక్రమముగా
నడిపించగలిగితే తరువాత కాలమునకతడు కరదీపిక అగుటయేగాక, సంస్థకు
ఆస్తియై అభ్యున్నతికి పాతుపడుతాడు. పారలౌకిక విషయములో భగవంతునిపై ధ్యాస ఎట్టిదో,
లౌకికమునందు, పనిపై ధ్యాస అట్టిది. పని
పరమాత్ముడు, వేరు కాదు అన్న చిన్న సత్యాన్ని ఎంత త్వరగా తెలుసుకొంటే తన మనుగడ అంత
సుఖముగా సాగుతుంది.
స్వస్తి.
****************************************
సమస్య మనది -- సలహా గీతది -- 36
సమస్య: గతములో చేసిన పాపపుణ్యముల
ఫలితములను ఇప్పుడు మనము అనుభవిస్తున్నామన్నది తెలిసిన విషయమే! కానీ ఈ పాపములను
తెలిసితెలిసీ ఎందుకు చేస్తున్నాము? అసలు
కార్యాలయములో నా మిత్రుడొకడు బలహీనమైన ఒక క్షణములో చేసిన తప్పును కప్పిపుచ్చుకొంటూ
పోయి చివరకు ఉద్యోగమునే ఊడగొట్టుకొన్నాడు. తాను చేసిన తప్పులు పైవారికి తెలిస్తే
తనకు నిష్క్రమణ జరుగుతుందని తెలియదా!
పై శీర్షిక అనగా ‘సమస్య మనది సలహా
గీతది’ అన్న శీర్షిక క్రింద నేను వీలు దొరికినపుడల్లా ఒక్కొక్క సమస్య తీసుకొని
దానిని విశ్లేషించి గీత బోధించే పరిష్కార మార్గమును తెలియజేస్తూ వస్తూవున్నాను.
భగవద్గీత 3వ అధ్యాయమును గతములో చదివినా, ఈ పర్యాయము తిరిగీ
చదువు సమయములో అందుగల 36 నుండి 41 వరకు గల శ్లోకములు నన్ను ఆకర్షించినవి. ఇందలి ప్రత్యేకత
ఏమిటన ఇక్కడ ప్రపంచములోని ప్రతి మానవునికి
కలిగే సందేహమును తీర్చుటకు కంకణము కట్టుకొని అడిగినాడా అన్నట్లు పరమాత్మునికి తన
సందేహమును నివేదించుచున్నాడు. అసలు ఈ కోతివంటి మనసును, అవాంచిత ద్వేషాలు,ఆపదలను కోరి
కొనితెచ్చుకొనే ఉద్వేగాలు ఎందుకు కలుగుతున్నాయి. వాటిని ఎందుకు అణుచుకోలేక ఆ బాటలో
పయనించి అనర్థములు కొనితెచ్చుకొంటున్నాము. వీని మూల కారణమేమి? ఈ మాయాజాలపు మరుగునపడి మంచిని మనసు చేసే వంచనకు బలి
చేయవలసిందేనా!
ఈ జటిల సమస్యకు పరమాత్ముడు కూడా తన
సమాధానమును విస్తారముగా అందరికీ సులభమగు రీతిలో తెలియజేయుచున్నాడు. అందువలన నేను 36నుండి 41 వరకు గల అన్ని
శ్లోకములనూ నాచేతనగు రీతిలో తెలియజేయబోవుచున్నాను. ఇది ఏకాంతములో కూర్చుని తత్వ
విచారణ చేసుకొనే ప్రతి జిజ్ఞాసువుకు కలిగే సందేహమే! పరిష్కారమును చదివి ఆచరణలో
పెట్ట ప్రారంభించండి.
సలహా:
సుమతి శతకకారుడు కూడా అందుకే
'తనకోపమే తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తధ్యము సుమతీ!' అన్నాడు.
రజోగుణ సంతానము మోహము. మోహము యొక్క
సంతానము క్రోధము. మానవునికి, ఒక అందమగు స్త్రీ
అగుపించిందంటే అనుభవించవలెనన్న ఆలోచనలో
పడిపోతాడు. స్వంత భార్య పిలిస్తే విసుక్కొంటాడు, పిల్లలు ఏమయినా అడిగితే కసరుకొంటాడు. కార్యాలయములో తనవద్ద పనిచేసేవారిని అనవసరముగా
దూషించుతాడు. ఈ విధముగా క్రోధము శరీరమునకు, బుద్ధికి, కూడా శత్రువై కూర్చుంటుంది. కోపము వరద వంటిది. ముళ్ళ
చెట్టయినా పళ్ళ చెట్టయినా ప్రవాహములో కొట్టుకు పోవలసిందే! మరి పరిష్కారము ఏమిటి.
సహనమే! ఇది సత్వగుణము నుండి మాత్రమే సాధించ వీలవుతుంది. రాజసము కామ క్రోధములకు మూల
స్థానము.
కామః క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్ఠన్తి
తస్కరాఃl
జ్ఞానరత్నాపహారేణ తస్మాత్ జాగ్రత
జాగ్రతll
కామము-క్రోధము-లోభము అనే ముగ్గురు
దొంగలు జ్ఞానమనెడి రత్నమును దొంగిలించుటకు మనదేహంలో తిష్ట వేసి ఉన్నారు. మేల్కొనుడు
మేల్కొనుడు అనికదా పెద్దలు చెప్పినారు. ఎవరు చెప్పినా ఒకటేమాటే! అసలు జగత్ప్రభువే
ఆమాట చెప్పినారు. కావున ఆ జ్ఞానము కలిగితే అజ్ఞానము తొలగుతుంది. ఆ జ్ఞానము ఎట్లు
వస్తుంది అంటే, "శ్రద్ధావాన్ లభతే జ్ఞానం"
అనగా శ్రద్ధయే జ్ఞానమునకు మూల కారణము. కావున శ్రద్ధలేనన్ని రోజులు జ్ఞానము బలహీనమై అజ్ఞానము ఆవహించియుంటుంది.
మనసు పాలవలె స్వచ్చమైనది. అందులో ఏ ఉప్పు, మెరపకాయ చింతపండు
చేరినా విరిగి పోతుంది. అదే తన జాతికి చెందినా మజ్జిగతో కలిస్తే రుచికరమగు పెరుగు
అవుతుంది. కాబట్టి పెరుగు అను అట్టి జ్ఞానము రావలెనంటే, పాలు మజ్జిగతో సహవాసము చేయవలసివస్తుంది. ఉప్పు మెరపకాయ
చింతపండుతో సహవాసమునకు మరిగితే విరిగి
పోవుట వినా వేరు దారి లేదు.
నీ కార్యాలయ విషయములో కూడా అంతే. నీ
అలవాట్లు,
నీ పరిసరాలు, నీసహవాసాలు
నీ మీద అసాధారణ ప్రభావము చూపుతూ వుంటాయి.
కామము అన్న మాటకు అర్థము కేవలము
స్త్రీవాంఛ కాదు. ఏ వస్తువు పయినయినాకూడా పొందితీరవలెనను ప్రగాఢమైన కోరిక కలిగితే
చాలు. అది కామమే! నీవు అందుకోలేకపోతే ప్రపంచమే తలక్రిందులయిపోయినంత బాధ అది నీలో కలిగించి
అనేకమయిన మానసిక రుగ్మతలకు దారి తీయిస్తుంది.
చివరకు నీకు తిండిపెట్టే సంస్థకే ద్రోహముచేసే ఆలోచన కూడా కలుగుతుంది. అసలు
నా జీవితములో నేను చూసిన ఒక విషయము చెబుతాను. నేను వార్దుషీ(Bank) సేవ చేసిన
వాడిని కాబట్టి దానికి సంబంధించిన ఒక విషయమును మీకు తెలియజేస్తాను. ఇది జరిగినదా
లేక కల్పితమా అన్న చర్చ మనకు అనవసరము. అందువల్ల, కావలసిన మేరకు, కేవలము విషయ
పరిశీలనకు మాత్రమే అంకితమౌదాము.
ఒకానొక బాంకి శాఖలో నా సహోద్యోగి
ఒకతను ఉండేవాడు. ఆయనకు కాళ్ళు వున్నా అవి కట్టెపుల్లలవలె అతి సన్నగా ఉండుటవల్ల
చంకలో తగువిధమగు దండముల సహాయముతో నడచేవాడు. ఒక్క శౌచాలయము, మరియు మధ్యాహ్న భోజనమునకు తప్ప ప్రక్కకు కదిలేవాడు కాదు.
బ్రాంచ్ కస్టమర్ల వద్దనుండి అపారమైన మంచిపేరు సంపాదించినాడు. అది అమితముగా ప్రాకి NRI లకు చేరింది. దాంతో ఆయనను ఆ NRI సీటు నుండి కదిలించుట జరుగలేదు. పువ్వులో సువాసన, పుప్పొడి మాత్రమె కాకుండా పురుగులు కూడా చేరినట్లు అతనికి
బుద్ధి గతితప్పింది. ఏ బలహీనమైన
క్షణములోనో మనసు పెట్టిన ప్రలోభానికి లోనయినాడు. బాంక్ లో ఒక transaction పూర్తి అగుటకు ముగ్గురు నలుగురు దోహదపడవలసి ఉంటుంది. తప్పు
చేయదలచినవాడు తానూ చేయబోవు పనిని ఎన్నో కోణాలలో పరిశీలించి ఒక పథకము ప్రకారమూ
అమలుపరచుతాడు. మిగతావారు అది తాము చేసే సాధారణమగు పనిగానే తలచి ప్రత్యేకమైన శ్రద్ధ
తీసుకోరు. అందువల్ల అతడు చేసిన నేరములో తమ ప్రమేయములేకనే నిస్వార్థ పరులు, ఉద్యోగమునే నమ్ముకొన్నవారు, చిక్కుబడి తమ భవిష్యత్తును అసంకల్పితముగానే అతని స్వార్తమునకు అంకితము
చేసినారు. నేరము నిప్పు. అది వీడు వాడు అన్న భేదము లేకుండా అందరినీ కాలుస్తుంది.
ఇక్కడ మానసిక ప్రలోభమునకు గురియైన ఆ వ్యక్తి తానూ కారాగారము చేరి శిక్ష
అనుభవించినాడు. అమాయకులకు ఉద్యోగము కంటక ప్రాయము చేసినాడు. ఈ విషయమును పైన కూడా
అతి క్లుప్తముగా ప్రస్తావించినాను. ఈ కథ ఇక్కడితో ఆపి ఈ విషయమును విశ్లేషించుకొందాము.
ఆ
వ్యక్తి మొదట మంచివాడు. చీడ పట్టితే చెట్టు
చెడిపోవలసిందే! ఆ చీడ అతనికి పట్టింది. మరి అటువంటి చీడ మంచిమార్గములో నడువదలచిన
మనకు పట్టకుండా వుండవలెనంటే ఏమిచేయాలి? భగవంతుడు
దీనికి సమాధానమే మనకు తెలియజేస్తూవున్నాడు.
కావున కోరిక అన్నది
ఎప్పుడూ హద్దు దాటకూడదు. అటువంటివి గమనించితే వెంటనే ఆ వ్యక్తిని హెచ్చరించటమూ, వినకుంటే పై అధికారికి తెలియజేయటమూ చేయకపోతే దాని
దుష్ఫలితము అందరూ అనుభవించవలసివస్తుంది. అసలు ఈ విషయమును గూర్చి అర్జనుని ప్రశ్న శ్రీకృష్ణుని
సమాధానమును గమనించు:
అర్జున ఉవాచ| (భగవద్గీత 3వ అధ్యాయము 36 – 41)
అథ కేన ప్రయుక్తోऽయం పాపం చరతి పూరుషః|
అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ
నియోజితః||
3-36 ||
వలదని మది మరి వారించినను
వదలని శక్తికి వంచుచు శీర్షము
పాపపు పనులను బాయక చేతురు
వృష్ణివంశజా వివరము తెల్పుము
అర్జునుడు తన సందేహమును ఈవిధముగా
వ్యక్తము చేసినాడు. కృష్ణా ఇష్టం లేకపోయినా ఎవరో బలవంత పెడుతున్నట్లు మానవుడు పాపం
ఎందుకు చేస్తున్నాడు? ఆ ప్రేరణశక్తి
ఎవరిది?
ఎవరి కారణంగా ఈ ఇష్టములేని పాపాలను చేస్తున్నాడు?
భగవంతుని సమాధానము:
కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవ: l
మహాశనో మాహాపాప్మా విద్ద్యేనమిహ
వైరిణమ్ll 37-3
కన రాజసమున కామము
పుట్టును
దానికి క్రోధము దళపతి
ఎరుగుము
మహా భోక్త అది మహా
పాపి యది
అమిత శత్రువది అనర్థ
హేతువు ll37-3ll
రౌద్ర కామములు రజోగుణజములు
పాపి రజస్సది బాయదు జఠరము
ఆశాపాశములమరిన చేతికి
పోల్పగ కామము బొటికెన వ్రేలు || 37-3||
(ఇక్కడ కొంత స్వేచ్ఛను తీసుకొన్నాను. క్షంతవ్యుడను)
భగవానుడంటూవున్నాడు ఈ విధముగా, ఈ కామక్రోధములు,రజోగుణం
నుండి ఉద్భవిస్తాయి.దానికి మహా ఆకలి.అది పాపిష్టిది.ఈలోకంలో అందరికి అదేశత్రువని
తెలుసుకో.
ధూమేనా వ్రియతే వహ్నిః యధాదర్శో మలేన
చl
యధోల్బేనావృతో గర్భః తధాతేనేదమావృతమ్ll ll38-3ll
ధూమము అగ్నిని
ధూళి ముకురమును
మాయ గర్భమును మరియు
కామము
జ్ఞానాభ్రమ్మును
గప్పివేయునని
గమనించినచో కనుగొనగలవది
ll38-3ll
క్రమ్మినచో పొగ కనరాదనలము
మురికి క్రమ్మితే ముకురము దండుగ
మావి పిండమును మరుగున చేర్చును
కామ రజస్సులు కప్పు జ్ఞానమును ll 38-3 ll
అగ్నిని పొగ ఆవరించినట్లు,అద్దాన్ని దుమ్ము కప్పినట్లు,గర్భస్త శిశువుని మావి కప్పినట్లు జ్ఞానాన్ని కామం కప్పి వేస్తుంది.
ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణాl
కామరూపేణ కౌన్తేయ దుష్పూరేణానలేన చll ll39-3ll
విరోధి, కామము విపులజ్ఞానికి
తనివిని కోరని దాహకమయ్యది
నివురే తెలియని నిరత జ్వాలది
కౌంతేయా కనుగొనుమీ నిజమును ll39-3ll
కామం తృప్తి పరచడానికి వీలులేని అగ్ని
వంటిది. ఇది జ్ఞానానికి నిత్య శత్రువు.దీనితోజ్ఞాని జ్ఞానం కప్పబడి ఉంటుంది.
ఇంద్రియాణి మనో
బుద్ధిరస్యాధిష్ఠానముచ్యతే|
ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య
దేహినమ్||
40-3 ||
మనస్సు బుద్ధియు మరి ఇంద్రియములు
కామపు నెలవులు ఘన వాస్తవములు
మోహము దేహికి ముసుగును వేసి
కాంచగనీయదు జ్ఞాన రత్నమును ||4౦-3||
ఇంద్రియాలు మనస్సు,భుద్ధి,కామానికి ఆధార
స్థానాలు అని చెప్పబడుతున్నాయి.ఈ కామం జ్ఞానాన్ని కప్పి వేసి ఇంద్రియాల ద్వారా
దేహధారిని వ్యామోహ పరుస్తుంది.
తస్మాత్త్వమింద్రియాణ్యాదౌ నియమ్య
భరతర్షభ|
పాప్మానం ప్రజహి హ్యేనం
జ్ఞానవిజ్ఞాననాశనమ్ || 41-3 ||
భరతర్షభ సత్ఫలితమునందగ
నీ ఇంద్రియముల నిగ్రహించుము
జ్ఞానము విజ్ఞానము నెక్కొనుటకు
(పాదుకొనుటకు)
పాపపు కామము పరిహరించుము || 41-3 ||
అందువలన భరత కుల శ్రేష్టుడా;ముందుగానీవు ఇంద్రియాలని నిగ్రహించి,జ్ఞాన విజ్ఞానాలను నాశనం చేసే పాపిష్టి కామాన్ని
నిర్మూలించు. ||41-3||
రజోగుణసంపర్కముచే కామము ఉద్భవించి, తదుపరి క్రోధముగా పరిణమించి వినాశ హేతువగుచున్నది. అదియే
మనిషికి అసలైన శత్రువు. ఆత్మకు శరీరము
ఆచ్ఛాదనైతే శరీరమునకు మాయ ఆచ్ఛాదన. దేహము పేరుకేగానీ దేహము యొక్క ప్రభావము ఆత్మపై
లేదు. కానీ మాయ యొక్క ప్రభావము శరీరముపై ప్రతిక్షణమూ వుంటుంది. అది మంచీ కావచ్చు
చెడుగూ కావచ్చు. అది పూర్వ కర్మ ఫలితములను బట్టి వుంటుంది. ఇక్కడ భగవద్భక్తి
మనఃపూర్వకముగా ప్రదర్శించగలిగితే ఆటంకముల తీవ్రత తగ్గుతుంది. మైల పడిన పాత్రను
బలముగా తోమితే చక్కగా మెరుస్తుంది. ఇదీ అంతే! మసకబారినదేదయినా శుభ్రపరుపవలసిందే!
స్వచ్ఛత మనసుకూ శరీరానికీ అత్యావశ్యకము. శరీర స్వచ్ఛత ఆరోగ్యదాయకమైతే మానసిక
స్వచ్ఛత ఆనందదాయకము. ఈ ఆనందము క్షణికము కాకుండా చూసుకోనవలసిన బాధ్యత బుద్ధికి
ఇచ్చి ఆ బుద్ధిని మనము అదుపులో వుంచుకోనవలసి వుంటుంది.
ఇంకొక ముఖ్య విషయము నీవు గమనించవలసి
యున్నది. పరమాత్మ మూడువిధములగు ఆచ్ఛాదనలను గూర్చి చెప్పినాడు. వానిని మనము ఈ
విధముగా విశ్లేషించుకొనవచ్చును.
సత్వరజస్తమోగుణములను త్రిగుణములు
అంటారు. ఈ మూడు గుణముల పౌనఃపున్యములే మనకు ఎరుకయగు సృష్టి. మొదట సత్వ గుణమును
తీసుకొందాము. పైన తెలియబరచిన శ్లోకములో మొదటి తెర లేక ఆచ్ఛాదన అగ్నిని ఆవరించిన
పొగకు పోల్పబడింది. గాలివీచితే పొగ నిలువదు పారిపోతుంది. అగ్నికూడా
ప్రజ్వరిల్లుతుంది. ఆ అగ్ని మన పరిశుద్ధమగు ఆత్మకు ప్రతీక. సత్వగుణ సంపన్నత
కలుగియూ ఇంకా కొంత సందేహ నివృత్తి చేసుకొనవలసినది వున్నది కాబట్టి దానిని పొగతో
పోల్చుట జరిగింది. ఆ పొగ మనలో ఇంకా ఆవరించియున్న అజ్ఞానము. దానిని పారద్రోలవలేనంటే
గురువు అన్న గాలి అవసరము. ఆ పొగను పారద్రోలితే పరిశుద్ధాగ్ని మనకు బహిర్గతమౌతుంది.
అగ్నిలో ఎన్ని మలినములు కలిసినా అది తన శుచిత్వమును కోలుపోదు. ఆత్మా కూడా అంతే.
అగ్నిని తెరమరుగు లేకుండా చూస్తున్నామంటే ఆత్మను స్పుటముగా చూస్తున్నట్లే!
ఇక రెండవ దృష్టాంతరము. అద్దమును ధూళి
ఆవరించుట. ఇది ఆత్మను ఆవరించిన అజ్ఞానముతో పోల్చవలెను. ధూళి అత్యంత నునుపుగా మనము
ఊహించుకొంటే, అది అద్దమును కప్పినది అంటే కేవలము
గాలి ఎంత వీచినా అది పూర్తిగా చెరగదు. దానిని సున్నితమగు మెత్తటి బట్టతో తుడిచి
ఆపై నీటితో కడిగి పొడిబట్టతో తుడువవలసియుంటుంది. ఇది రాజసిక గుణము. అంటే ఏ గాలియో
వచ్చి దానిని రూపుమాపలేదు. దానికి స్వంత ప్రయత్నమూ కొంత అవసరము. ఆ శ్రమ తీసుకొంటే
అద్దము శుద్ధమౌతుంది. ఇక్కడ అద్దము ఆత్మ. దుమ్ము లేక ధూళి అజ్ఞానము. అంటే ఆత్మ
(మనసును కూడా పోల్చుకోవచ్చు.) సంపూర్ణముగా ధూళిదూసరితమై వుంది. దానికి గురువు
ప్రయత్నము మాత్రమే చాలదు. నీవైపునుండి కూడా కృషి అవసరము. అప్పుడే ఆత్మ అనబడే
అద్దము శుభ్రమౌతుంది. నీ ప్రయత్నముకూడా అద్దమును ఆవరించిన ధూళిని బట్టి వుంటుంది.
ఇక మూడవది. గర్భస్థ పిండమును
ఆవరించియున్న మాయ. స్త్రీపురుష సంగమమున ఏర్పడిన పిండము శిశురూపము దాల్చుటకు
రెండునెలలు పడుతుంది. ఆతరువాత ఏడు నెలలు దాని అభివృద్ధి. ఆపైననే శిశువు
భూపతనమయ్యేది. అటుపిమ్మటనే మాయను దానినుండి వేరుపరుపగలిగేది. ఇది తమోగుణమునకు
తార్కాణము. ఇప్పుడు ఇక్కడ ఏ తెర అయితే ఈ పిండమును కప్పియున్నదో అది ఉదరము.
పిండమును పొందుటకు ఉదరమును మనము కోయలేము. నిర్ణీత కాలము ఆగవలసిందే! అటుపిమ్మట కూడా
అన్నీ అనుకూలించితేనే అది బాధపెట్టి బయటకు వస్తుంది రానని మొరాయించితే మనము
వైద్యులు నిపుణుల సహాయము తీసుకొనవలసి వస్తుంది. అది అట్లుంచి లోపలవున్న ఆత్మ అనే ఆ
శిశువును ఎంతో జాగరూకతతో పోషింపవలసి వుంటుంది. దానికి గర్భవతి పరిసరము
పరిజనము ఎంతో దోహదము చేస్తాయి.
అంటే ఈ తెర తొలగుటకు మనము మాత్రమే
కృషిచేస్తే సరిపోదు. పైవాని తోడు కూడా అవసరము. కావున దైవచింతన, నిర్మల చిత్తము, పరిశుభ్ర పరిసరములు, అయినవారి
ఆదరణ,
ఆరోగ్య ఆహారము మొదలగునవి ఎంతో అవసరము. అంటే బరువును బట్టే
బలము ఉపయోగించవలసియుంటుంది. ఇంత కృషి జరిగితే ఆత్మ సాక్షాత్కారానికి అవకాశమును
అందిపుచ్చుకోగలము.
ఆత్మ నైర్మల్యమునకు త్రికరణములు అనగా
మనో వాక్కాయకర్మలు అదుపు చేసుకొన గలిగితే ఆత్మ సాక్షాత్కారానికి ఆమడ దూరము
చేరినట్లే! మిగిలినది మన సాధనమీద ఆధారపడి వుంటుంది.
లౌకికముగా కూడా ఆత్మశుద్ధి అవసరము.
అందుకే ఇంత వివరముగా చెప్పవలసి వచ్చింది. వేమన తన అనుభవ సారమును రంగరించి అందుకే
ఆత్మ శుద్ధిలేని ఆచారమదియేల’ అన్నాడు. కావున చెడుగునకు తావివ్వక మంచిని తలచుకొంటూ
మనము, ఎదుటివాడు అన్న బేధమును మరచి చరించగలిగితే అంతా మంచే జరుగుతుంది. అందుకే
ఋగ్వేదములో ఈ మాట చెబుతారు
పరమాత్ముడు మొదట ఈ మనో వికల్పమునకు
కారణము కామము క్రోధము అన్న రెండు లక్షణములు అని మొదలుపెట్టి అందులో క్రోధమునకు
కూడా కామమే కారణమని నొక్కిచెబుతాడు. దీనికి ఆలంబనము రజోగుణము. సత్వము సహనమునకు,సాదువర్తనకు, సద్బుద్ధికి, సహజతకు, సామరస్యమునకు
ప్రతీక. రజస్సు అటులకాదు. అవాంఛితమగు కోరికలను అది కలిగిస్తుంది. అంతటితో అసగాక
అవితీరే మార్గములను ఆలోచింపజేస్తుంది.ఒక్క మాటలో చెప్పవలసి వస్తే
జ్ఞానవంతుడవగుచున్న నీ ప్రతిబింబమును కననీయకుండా నీ జ్ఞానమనే అద్దమునుఈ గుణము ధూళి
రూపములోను, పొగ క్రమ్మిన అనలము అంటే అగ్నివలెనూ, మావి క్రమ్మిన గర్భస్థ శిశువు వలెను చేసివేస్తుంది. ఈవిధంగా
రజస్సు కామముల గూర్చి ఎంతగానో నొక్కి
చెబుతాడు పరమాత్మ. ఈ నాడు రజోహేతువులు, కామోద్దీపనములు, పగ ప్రతీకారాలు, నిర్లక్ష్యము, నిర్లజ్జ మొదలగు విషయములు మనము వద్దన్నా వివిధ విధములగు
ప్రసార మాధ్యమముల ద్వారా మనకు కనిపిస్తూనే ఉంటాయి.
అందుకే పెద్దలు ఎప్పుడో చెప్పినారు:
కామః క్రోధంచ లోభంచ దేహే తిష్టంతి
తస్కరాః ||
ఙ్ఞాన రత్నాపహారేణ తస్మాత్ జాగృత
జాగృత ||
అని. కావున కామమూ, క్రోధమూ, లోభమూ అనే ఈ
ఆంతరంగిక తస్కరులు అనగా దొంగలతో మనము ఎంతో జాగ్రత్తగా వ్యవహరించవలసియుంటుంది. మనలో
జాగరూకత లోపించితే ఈ దొంగలు ఙ్ఞానమనే రత్నాన్ని దొంగిలించుకొని పోతారు.
మన chatting, hearing, friends, TV
programmes, colleagues, friends, music, movies, books ఇవి అన్నీ నిజానికి చెడుగుకు దోహదాలు. యువత అధికముగా ‘సందులోసుందరి’ సినిమా
చూడాలని తహతహ పడుతారు గానీ ‘సతీ సావిత్రి’ చూడరు కదా! ఇది నేటి పరిస్థితి కావున
చెడుగుతో తెంచుకొని, మంచిని ఎంచుకొని
మనసును అదుపులో ఉంచుకొని, సత్సంగముపై అనురాగము
పెంచుకొని, సౌహార్ద్రత పంచుకొని జీవితము సాగిస్తే
సంతోషము తప్ప మరేదీ చెంతచేరదు. శంకరులవారు కూడా
సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే
నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చల తత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః
అంటారు.
ఇక్కడ Regulator\ Remote Control ను గూర్చి ఒకమాట చెబుతాను. మన విద్యుత్ సాధనములలో ఇవి లేనివి ఉండవు. ఇవిచెడితే మన మనుగడ
దుర్భరమే! ‘అతి సర్వత్ర వర్జ్యేత్’ అనికదా పెద్దల వాక్కు. ‘Too much of
anything is good for nothing’ అనికదా మనము
అనుకరించే\అనుసరించే ఆంగ్లేయుల వాక్కు. ఎప్పుడో
చెప్పిన మన పెద్దల మాట వినకున్నా, మనకాదర్శమైన
పాశ్చాత్యుల మాటయినా వినవచ్చు కదా!
అన్నింటికన్నా ముఖ్యమయినది మనో
నియంత్రణ. దానికి కావలసినది నీ ఇంద్రియ నిగ్రహము, ముఖ్యముగా బాహ్యేంద్రియములగు త్వక్ (చర్మము) చక్షుః (కళ్ళు) శ్రోత్ర (చెవులు)
జిహ్వ (నాలుక, రుచి) ఆఘ్రాణములు (ముక్కు, వాసన). బుద్ధిని ఆంగ్లములో Conscious Mind గా చెప్పుకొనవచ్చు. అప్పుడు మనసు Subconscious
Mind అవుతుంది. ఈ రెంటికీ inter connection
వుంటుంది. ఆ connectivity ని అరుదుగా తప్ప అతిగా వాడుకోగూడదు. ఈ విషయమును మనః పూర్వకముగా అర్థము
చేసుకొంటే ఆనందమును అందుకోబోతున్నట్లే!
ఆనోభద్రాః క్రతవోయంతు విశ్వతోऽదబ్ధాసో అపరీతాస ఉద్భిదఃI
దేవానోయథా సదమిద్ వృధే ఆసన్నప్రాయువో
రక్షితారో దివేదివేII (ఋగ్వేదము)
దశదిశలనుండి నిరంతర కళ్యాణకారకమగు
ఆలోచనలే లేక భావనలే మాలో ప్రసరించుగాక. అట్టి భావనలకు ఎటువంటి అవరోధము
వుండకుండుగాక. మంగళకరమగు అజ్ఞాత విషయములు కూడా మాకు కర్ణ శ్రావ్యమగుగాక. నిరంతరమూ
సకల దేవతలూ మమ్ము రక్షించుతూ మా ప్రగతికి కారణభూతులు అగుచుందురుగాక.
స్వస్తి.
****************************************
సమస్య మనది-సలహా గీతది-37
సమస్య: లోకములో అన్యాయము, అక్రమము, అదర్మము అన్నీ అంతము లేకుండా పెరిగిపోతున్నాయి. మంచికి మార్గము దృష్టికి దూరమై పోయింది. కాపాడేవాడు కనిపించుటలేదు. ఏమిటి గతి? మా Boss చాల దుర్మార్గుడు. అతనికి వత్తాసు పలికే వందిమాగధులు కొందరున్నారు. వీరివల్ల Office యొక్క Decency మరియు Decorum చాలా దేబ్బతింటూ వుంది. ఏమి చేయాలి?
సలహా: ఇది నీవు నేను తీర్చగలిగే సమస్యకాదు. కానీ ఈ లోకములోని పరిస్థితి చూస్తూవుంటే మన మనసు పరితపించుతూనే వుంటుంది. చెడ్డకు జయము ఎన్నోమార్లు కలుగుతుంది కానీ మంచి అది ఒక్కసారే జరుగుతుంది కానీ అప్పుడు భూమిపై చెడ్డ మిగిలి యుండదు.
ముందు ఈ కథ విను. ఈ కథకు మూలము మహాభారతములో అంపశయ్యపైనున్న భీష్ముడు ధర్మరాజుకు తెలిపిన ఉపదేశవాక్యములలో వినిపిస్తుంది.
ఒక మహర్షి తన పర్ణశాలకు దగ్గర ఒక క్రూర జంతువుచే దెబ్బదిని నిస్సహాయముతో పడివున్న ఒక కుందేలును జూచి జాలిపడుతాడు. దానిని తన ఆశ్రమము జేర్పించి సాకుతూ ఉంటాడు. ఒకరోజు ఒక నక్క దానిని చంపే ప్రయత్నమూ చేస్తుంది. అప్పుడు ఋషి దీనిని తోడేలుగా మారుస్తాడు. ఒక చిరుత దానిపైకి వస్తుంది. దానిని పెద్దపులిగా మారుస్తాడు. అప్పుడు దానికి ఒక పెద్ద అనుమానము వస్తుంది. ఒకవేళ ఈ ఋషి ఇంకొక జంతువును పెంచి నేను దానిని తినస్బోతే ఈయన దానిని సింహముగా మార్చి నామీదికి ఉసిగొల్పవచ్చు , కావున నేను ఈయననే ముగించివేస్తే ఒకపని అయిపోతుంది అని అనుకోని ఆవిధముగా చేద్దామనుకొని ఆయనపైకి ఉరకబోతే ఆయన దానిపై మంత్రజలము చల్లి నిర్జీవిని చేసినాడు. ఇక్కడ ఋషి భగవంతుడు. కుందేలు పూర్వజన్మ పుణ్యముచే ఋషి అభిమానము చూరగొంది. అది పూర్తిగా ఎప్పుడు ముగిసిపోయిందో దానిలోని దుష్టత్వము ప్రకటితమైనది. తాను దుష్కర్మచేయనున్కిచుటతో అసువులు బాయవలసి వచ్చింది. ‘దైవం మానుష రూపేణ’ అంటారు. కావున ఆ పరమాత్మ Holesale గానే కాకుండా Retail గా కూడా ఇటువంటి పనులుచేసి దుష్ట వినాశమునకు తోడుపడుతూ ఉంటాడు.
ఈ విషయమును ఒకపరి గమనించండి. ప్రజలు అధర్మ మార్గమున నడిస్తే ఆ పాపము రాజుది, రాజు పాపము అతనికి మంచిదారి చూపించవలసిన పురోహితునిది. స్త్రీ చేసే పాపము భర్తకు చెందుతుంది. శిష్యుడు పాపము చేస్తే అది గురువుకు చెందుతుంది.
రాజా రాష్ట్ర కృతం పాపం! - రాజపాపం పురోహితః!
భర్తా చ స్త్రీకృతం పాపం! - శిష్యపాపం గురుర్వ్రజేత్!! (భోజచరితమ్)
అంటే ఇక్కడ మనకు ఏమి తెలియవస్తూవున్నది అంటే ప్రతి అధర్మము జరిగినపుడు లేక పాప కార్యములు పెట్రేగినపుడు పరమాత్ముడు క్షణక్షణమూ అవతరించకుండా ఆ బాధ్యతలను పలువురికి పలు తెరుగుల పంచిపెట్టినాడు. అది మన ధర్మము లోని గొప్పదనము. బాధ్యతలను విస్మరించిన వీరు దేవుని దండనకు గురియౌతారు.
ఈ క్రింది శ్లోకమును చూడండి,ఇది ఒక చాటువుగా నాకు తెలుసు. కర్త తెలియదు. ఇందులో ఒక చక్కని నీతి దాగి వుంది. రాజు గుణగణములు ప్రజల గునగణములతో సమసంబంధ సామ్యములో ఉంటాయి. అంటే ఒక్కడు ధర్మపరుడైతే దేశము దేశమే ధర్మమునకు ప్రతీక ఔతుంది.
రాజ్ఞి ధర్మిణి ధర్మిష్టాః పాపేపాపాః సమే సమాః
లోకాస్తమనువర్తంతే యథారాజా తథా ప్రజాః
రాజు ధర్మాత్ముడయితే, ప్రజలు ధర్మిష్టులవుతారు. రాజు పాపి అయితే, ప్రజలూ పాపిష్టులవుతారు. రాజు రెండింటా సమానుడుగా ఉంటే, ప్రజలూ సమానులుగా ఉంటారు. రాజు ఎట్లా ఉంటే ప్రజలూ అట్లాగే ఉంటారు’’. ఇక్కడ ధర్మ రక్షణ రాజును దండిన్చుతతో ముగుస్తుంది. పరమాత్మ దానికి తగిన విధముగానే ఒక ప్రణాళిక ఏర్పాటుచేసియుంటాడు.
పై మాటలోని వాస్తవము ఈ విషయము తేటతెల్లము చేస్తుంది. మహాభారత కాలమునాటి మద్రదేశము ఎట్లు ఉండినదో, మద్రాధిపుడగు శల్యునితో ఆదేశ దురాచారముల గురించి కర్ణుడు శల్యునితో అన్నమాటలు ఒకసారి గుర్తుచేసుకొందాము.
: మద్రదేశంవారు చాలా దుష్టాత్ములు, దుర్మార్గవర్తనులు. మిత్రులకు కూడా కీడు తలపెట్టేవారు. మీ జాతిలో ఆడ, మగ, వావివరుసలు లేక సంచరిస్తారు. మీకది తప్పు కాదు. చనుబాలకు ముందే మధ్యాన్ని సేవిస్తారు.”
శల్యుడు మధ్రదేశపు రాజు మరియు పాండవుల మేనమామ. దురాచార దుర్వ్యసనబానిస. అతను భారత యుద్ధము అన్న నెపమున దుష్టులకే సహకరించి దుర్మరణము పాలగునట్లు చేసినాడు శకుని ని అందుకు కారణభూతుని చేస్తూ. అంటే ద్వాపర యుగాంతము కొరకు భగవానుడు ఎన్నిమాయలు పన్నినాడో చూడు. ధ్యేయము మాత్రము ధర్మ సంస్థాపనమే!
పరమాత్మ ఇన్ని విషయములను ఈ 4(2+ 2) పంక్తులలో చెప్పినాడు.
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత l
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహమ్ll 7-4
ధర్మక్లేశము దాపురించితే
అందలమందు నధర్మమేక్కితే
అవతరించెదను అనువగురీతిన
దానిని తెలియుము తప్పక భారత! 7-4
ధర్మానికి హాని కలిగి ఆదర్మం పెచ్చుమీరినపుడు నేను సాధుసంరక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం, ధర్మ పునస్థాపన కోసం ప్రతియుగంలోనూ అవతరిస్తుంటాను. నేను సమస్త ప్రాణులకు ఈశ్వరుడను, జనన మరణ రహితుడను అయినా గాని నా మాయాశక్తిచే నన్ను నేను సృజించుకొంటుంటాను. మానవులు నన్ను ఏవిధంగా ఆరాధిస్తారో ఆ రూపంలోనే వారిని అనుగ్రహిస్తుంటాను.
పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతామ్l
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ll 8-4
శిష్ట రక్షణే శిరౌధార్యముగ
దుష్టుల నెల్లర తుదముట్టించుచు
ధర్మోద్ధారణ తత్పరమతితో
అవనిపైననేనవతరించెదను 8-4
కృతయుగము లేక సత్యయుగములోనే శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుని జంపుటకు ఒకసారి ఒక అవతారముతోనూ, హిరణ్యకశిపుని జంపుటకు మరియొక పర్యాయము మరియొక అవతారముతోనూ ప్రస్పుతము కావలసి వచ్చింది. అందుకే తన ఉపదేశములో అర్జునునకు ధర్మమునకు హాని కలిగితే అని, దుష్టులను మట్టుబెట్టుటకు అని తానవతారములు దాల్చునట్లు చెప్పినాడు. కానీ యుగములో ఒకమారు అని చెప్పలేదు.
ఇక ఈ విషయమును ఒకపరి గమనించండి. ‘శివాయ విష్ణురూపాయ శివ రూపాయ విష్ణవే’ అన్నది మనకు తెలిసిన విషయమే! కలి ఆదిలోనే ధర్మగ్లాని సంభావించగా పరమేశ్వరుడు ఆది శంకరాచార్యుల రూపములో అవతరించి వైదిక ధర్మమును పునః ప్రతిష్ఠ చేసినారు. ఆయన ఆయుధమును చేత బూనక పరివ్రాజక దండమునే ధరించి తనకాలము నాటి వివిధ తత్వ మార్గానుగాములగు మహా పండితులను తమ అనంత విజ్ఞాన వాక్ప్రతిభలచే ఓడించి ధర్మమును నిలిపినారు. 32 సంవత్సరముల కాలము మాత్రమే భూమిపై నిలచిన శంకరులవారు అనేక ఛందోవృత్తములలో అనేక దేవతలను స్తోత్రము చేస్తూ ‘మాం’ ‘మః’ అన్న మాటలను ఉపయోగించుతారు. ‘మాం’ అంటే ‘నన్ను’ ‘మః’ అంటే ‘మమ్ము’ అని అర్థము. ఈ స్తోత్రములు ఎవరు చదివితే వారికి అన్వస్యము కావాలన్నది వారి ఉద్దేశ్యము. లోక కళ్యాణము, ధర్మ స్థాపన అన్నవి మాత్రమే కాకుండా దుష్టులను గాక దౌష్ట్యమును నిర్మూలిన్చావలేనన్నది ఆయన ఉద్దేశ్యము. కారము ఏమిటంటే ఈ కలియుగములో దుర్మార్గులు ఒకరు ఇద్దరు కాదు వందల కొట్లలో ఒకరు ఇద్దరు మాత్రమే మంచివారు. కావున అందరినీ చంపుటకంటే వారి దుర్గుణమును దూరము చేయవలేనన్నది ఆయన ఉద్దేశ్యము.
ఈవిధముగా పరమాత్మ తన అవతరణమును గూర్చి అటు పార్తునికి ఇటు పార్థివులమైన మనకు తన సందేశమును వినిపించుచున్నాడు.
ఇక ఇదే సందేశమును లౌకిక వ్యవహారమునకు అన్వయించి చూద్దాము. ఇక్కడ ఒక విషయమును గుర్తు పెట్టుకొని ముందునకు నడుద్దాము. భగవంతుడు దుష్ట శిక్షణార్థమై అవతరించుటకు ధర్మపరులు ఈ అధర్మమును ఎంతవరకు సహించగలరో చూస్తాడు. వారు కూడా తమ శక్తికి మించినపుడు పైవానికి నివేదించుకొంటారు.
ఒక కార్యాలయము వుంది. అందులో ఎక్కువమంది లంచగొండులే! అంటే రాజు లంచాగొండియై ధర్మము తప్పినట్లే కదా! కావున వున్నా మంచివారు ఒకటై ఆ పైవానికి తమ ప్రార్థన, లేఖ రూపములో విన్నవిన్చుకోవలసినదే! దానిని మనసులో పెట్టుకొని, వారుచెప్పిన విషయములు నిజమని తాను గ్రహించితే, తగిన చర్య తప్పక తీసుకొంటాడు. దానితో సమస్య తీరుతుంది. ఇక కొత్తవానిని పంపేటపుడు జాగ్రత్తగా పరిశీలించి మరీ పంపుతాడు. మనిషి ధర్మము తప్పుటకు ముఖ్యకారణము స్వార్థము. తానేదో అయిపోవలెనను తపన. ఒక్క సారి పదవీ విరమణ చేస్తే మళ్ళి పంకిన్చేవాడుండడు. మనము చేసిన మంచి ఉంటే అది మాత్రమే మన ఉనికికి గుర్తింపు తెస్తుంది.
బాసుకు దగ్గర అగుచును
కాసుకు కొరగాని చెత్త గప్పాలన్నీ
మోసుకు పోయెడు ధూర్తుల
వేసాలను బయట పెట్టు విధిగా రామా!
అట్లు నీవు చేయగలిగితే నీలాగా మంచిని పోషించేవారు నీకు చేరువౌతారు. దుష్టుల దురాగతాలకు తగిన ఆధారాలను ఇటు నీవో అటు నీ సహచరులో సేకరించి ఆపైవానికి అందించితే అధర్మము అడుగంటుతుంది.
లేకపోతే ‘నదీనాం సాగరోగతిః’ అన్న చందమే!
స్వస్తి.
****************************************
సమస్య మనది సలహా గీతది – 38
శివుడు గొప్ప అని కొందరు విష్ణువు గొప్ప అని కొందరు
తన్నుకొని తగలడుతున్నారు. దీనికి పరిష్కారమే లేదా! అసలు ఇందరు దేవుళ్ళు
ఉన్నందువల్లనే ఇన్ని తగవులాటలు. మనకూ ఒక 2000 సంవత్సరముల క్రితము లేక 1500
సంవత్సరముల క్రితము ఏర్పడిన మతములలోవలె ఆకారము లేకుండా ఒకే దేవుడు ఉంటె బాగుండేది.
ఇది చాలా చక్కటి సందేహము. సనాతన ధర్మమును అవలంబించే
ప్రతివ్యక్తికీ కలిగే సందేహము. నాకు చేతనైనంతవరకు నామాట చెప్పి పరమాత్మ ఈ విషయమై
ఏమంటున్నాడో తెలియజేస్తాను.
మరీ సూక్ష్మమగు పరిశీలలోకి పోకుండా మన శాస్త్రము మన
అంచనాలకందని కాలములో ఏమి చెప్పినదంటే మనకు సూర్య మండలము ఉన్నట్లే లెక్కకు
మిక్కుటములగు అట్టి మండలములు ఈ విశ్వములో వ్యాపించి ఉన్నాయి. మనసూర్య మండలములోని
గ్రహములు సూర్యుని చుట్టూ తిరుగుతాయని తెలుసు. కానీ సూర్యుడు కూడా అతి తక్కువ
వేగముతో తన సూర్యుని చుట్టూ తిరుగుతున్నాడని తెలియదు. అంటే విశ్వాంతరాళములో అనేక
సూర్యమండలాలు ఆయా మండలముల సూర్యులు ఒక సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. ఇది నేటి science కూడా ఒప్పుకొన్న మాట. ఈ విధముగా మనము చూస్తే చివరకు ఒక సూర్యుడు మనకు
మిగులుతాడు. విష్ణు సహస్ర నామములో జ్యోతిరాదిత్య అన్న ఒకపేరు వినవస్తుంది. అంటే
సకల అదిత్యులకూ ఇది జ్యోతి అనేకదా! జ్యోతి అంటే వెలుగు. మనకు సూర్యుడు
వేలుగునిస్తే ఆ సూర్యునికి విష్ణువు (సర్వ వ్యాపి) వేలుగునిస్తూవున్నాడు. రుద్ర
నమకములో కూడా ‘అరుణ’ అన్న పదము శివునికి వాడబడుతుంది. ‘నమో విరూపేభ్యో
విశ్వరూపేభ్య శ్చ వోనమః’ శివ సహస్ర
నామావళిలో కృష్ణః అన్న శబ్దము 14 వ శ్లోకములో వస్తుంది. అసలు శివునికి విష్ణు
నామములు విష్ణువుకు శివనామములు ఎన్నో చూడవచ్చు. ఈ విషయములు వారిరువురికీ భేదము
లేదని నిరూపిస్తూ వున్నాయి. తిరిగీ అసలు విషయమునకు వస్తే ఈ అనేక సూర్యులే చివరకు
ఒక సూర్యుని చుట్టూ తిరుగుచున్నారు. ఆ ఒక సూర్యుడే పరమాత్మ. తెజోరూపుడు. ఇక,
అటు శాస్త్రము, ఇటు science ఒప్పుకొన్న ఇంకొక విషయమును గూర్చి
మాట్లాడుకొందాము. వేదము మానవ శరీరములో పరమాత్ముడు ఎక్కడ వున్నది చెప్పినది. ‘నీవార
శూక మత్తన్వీ పీతాభా స్వస్త్యణూపమా’ అని చెప్పినది. అంటే గుండెకు చేరువలో అతిచిన్న
నీలిరంగు జ్యోతి వెలుగుచున్నది, దాని యొక్క శిఖ మధ్యన
పరమాత్మ ఉన్నాడు అని. దానిని sinus
node అని నేటి science చెబుతుంది. అంటే
పరమాత్మ వెలుగు రూపములో అటు బ్రహ్మాండమంతా నిండియున్నాడు, ఇటు
అణువు రూపములో శరీరములోనూ వున్నాడు. "అణోరనీయాన్ - మహతో మహీయాన్" ఆయన
అణువు లోన ఉండి అణువుకు కూడా అణువుగా ఉంటాడు. అందుకు విరుద్ధముగా ఆయన బయట అంతట
వ్యాపించి బయటి వాటి కంటే గొప్ప వాడై ఉంటాడు. దీనిని బట్టి వెలుగే పరమాత్మ అనీ ఆ
వెలుగు విశ్వమంతా వ్యాపించియుంది మరియు అణురూపములో మనలో కూడా వున్నది . పేర్లు మనము
పెట్టుకొని వివిధ రూపములలో పూజించుకొంటున్నాము. అన్యమతములు దేవుడు ఒకడు అతను
వెలుగు అని చెప్పినా ఆ మాటలు మన వేదశాస్త్రములు చెప్పినవే! పైగా ఆ మతస్థులు మనవలె ఈ
విషయమును ఇంత నిర్దుష్టముగా నిరూపించలేరు. ఇక్కడ వేద పండితుడూ, వెంకటేశ్వరా
భక్తుడు వైష్ణవమునకు మ్కుండు స్మార్తము తెలిసినవాడు 15వ శతాబ్దము వాడునగు అన్నమయ్య
‘తెలియ చీకటికి దీపమెత్తక, పెద్ద వెలుగు లోపలికి వెలుగేలా'
అన్నాడు. పల్లవి యొక్క అర్థమును తీసుకొంటే సంసార లంపతమను చీకటిని
చిదిమివేయలేక చిక్కుకొన్న ఇహకర్మ బందితులమైన మనకు ఆ పరమాత్మే వెలుగు. ఎంతవేలుగు
అంటే అంతకన్నా వెలుగు లేదు. మరి అంతటి వెలుగును చూచూపుట వేరు ఏ వెలుగునకు
సాధ్యమౌను. ఆ మహనీయుడు ఈ మాటను బైబిలు, ఖురాను చదివి చెప్పలేదు. కేవలము వేద
వాజ్ఞ్మయమును చదివి మాత్రమే చెప్పినాడు. ఆవెలుగును మన భావనానుసారముగా శివుడని
విష్ణువని లేక ఏ ఇతర నామముతోనైనా పిలుచుకొన వచ్చును.
ఇక దేవుడు మరి ఒకరే అయితే అనేక నామములు అనేక రూపములు ఎందుకు?
ఈ మాట ఒక సారి విను. అటు హోటలులో నయినా ఇటు ఇంటిలోనయినా దోశ
పిండి తయారుచేసి పెట్టుకొంటారు. ఉదాహరణకు హోటలును తీసుకొందాము. మన వసతి కొరకు
కస్టమరులు ఒకేసారి ఒక 5 మంది పోయినారని అనుకొందాము. ఒకడు దోశ అంటాడు, ఒకడు
ఊతప్ప అంటాడు, ఒకడు పొంగణము అంటాడు, ఒకడు
అట్టు అంటాడు వేరొకడు ఆవిరి దోశ అంటాడు. అన్నింటికీ వాడే పిండి అదే. ఒక్కొక్కడు ఒక్కొక్క
పేరుతో అదే పిండితో తయారుచేయబడిన వస్తువును తాను ఆస్వాదిస్తూ తింటూ వున్నాడు. మనమూ
అంతే! అసలు శాస్త్రమేమి చెప్పింది అంటే
ఆకాశాత్ పతితం తోయం యథాగచ్ఛతి సాగరంl
సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్ఛతిll
చినుకు చినుకు నీరౌచూ
నీరంతా ఏరులౌచు
ఏరులేమో నదులౌచూ
కడలి కడుపుకే కడకు చేరును
నామరూపములు వేరయి వున్నా
అన్నీ ఆతడె అది గనుమన్నా!
శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే l
శివశ్చ హృదయం విష్ణుం విష్ణోశ్చ హృదయం శివంll
శివుడే విష్ణువు విష్ణువు శివుడే
విష్ణువు హృదయము శివుడే కనగా
శివునిహృదయమా విష్ణుండే!
అది విషయము. ఈ సనాతన ధర్మమున వున్నది ఏమతమునైనా ఉండవచ్చు
కానీ ఇందు లేనిది మాత్రము మనము ఎందునా చూడలేము. అందుకేగదా పంచమ వేదమయిన భారతమును
గూర్చి ఢంకాపథముగా ఏమిచెప్పినాడో చూడండి.
ధర్మే చార్థేచ కామే చ మోక్షేచ భరతర్షభ l
యదిహాస్తి తదన్యత్ర యన్నేహస్తి న తత్ క్వచిత్ ll
చతుర్విధ పురుషార్థ సాధనకు మీరు వేరేదేనినీ అవలంబించనవసరము లేదు.
అనుకరించ నవసరము లేదు అనుసరించనవసరము లేదు. ఈ పంచమ వేదములో ఉన్నది వేరెచటనైనా ఉండవచ్చును
కానీ ఇందులో లేనిది ఎక్కడా ఉండదు. ఈ ఒక్క విషయమును సనాతన ధర్మీయులు అర్థము
చేసుకొంటే పరాయిపంచల బ్రతుకవలసిన పని ఉండదు.
ఈ సందర్భమున 33 కోటి దేవతల గూర్చి కూడా ముచ్చటించుకొందాము.
కోటి అన్న మాటకు 100 లక్షలు అన్న అర్థమే కాకుండా, అంచు,
సమూహము అన్న అర్థాలు ఉన్నాయి.
కోటి అన్న మాటకు 'సమూహము అన్నది ఇక్కడ
అన్వయమైతే మరి ఈ 33 మంది కలిగిన దేవతా సమూహములో ఎవరెవరున్నారు
అంటే అవి.
02 ఆశ్వినీ దేవతలు, 12 ద్వాదశాదిత్యులు,
11 ఏకాదశ రుద్రులు, 08 అష్ట వసువులు.
మొత్తం కలిపితే 33. ఇవే 33 కోటి దేవతలు.
అశ్వినీ దేవతలు
ఇద్దరు. వీరి పేరిట నక్షత్రములు ఉన్నాయి. సత్యాఖ్యుడు, దస్రు
అన్నవి వారి పేర్లు. వీరు సూర్య, సంజ్ఞా పుత్రులు మరియు కవలలు. సూర్య, సంజ్ఞలు
అశ్వ రూపమున రమించుటచే ఈ కవలలకు అశ్వనీ కుమారులన్న పేరు చిరస్థాయిగా నిలచినది.
అశ్వనీ దేవతలు అన్నది వీరికి మరియొక పేరు. మిథునరాశి లోని కేస్టర్, పోలక్స్ అనే నక్షత్రాల జంటకు అశ్వినులకు పోలికలు ఉన్నాయి.
ఆదిత్యులు 12 :
1)విష్ణు 2)ఇంద్ర 3)ఆర్యమన్
4)త్వష్ట 5)వరుణ 6)దాత. 7)భగ. 8)పర్జన్య 9)వివస్వంత
10)అంశుమన్ 11)మిత్ర 12)పుష్య. వీరంతా కశ్యపునకు అధితి వలన కల్గిన
తుషితులనబడు దేవతలు.
సంవత్సరము యొక్క పన్నెండు మాసాలు పన్నెండు ఆదిత్య దేవతలు.
ఒక్కొక్క మాసంలో సూర్యకిరణాలు ఒక్కొక్క గుణాన్ని కలిగి ఉంటాయి. ఆ పన్నెండు
ఆదిత్యులు వేరు వేరు గా ఉంటారు. ఆ యా మాసములందు పరివర్తన చెందుతూ ప్రాణుల
ఆయుస్సును కర్మఫలమును హరించు చుండడం చేత “ఆదదానః” ఆదిత్యులు అని పిలవ బడుతున్నారు.
11 ఏకాదశ రుద్రులు: 1.అజైకపాదుడు 2.అహిర్బుద్నుడు 3.త్వష్ట
4.రుద్రుడు 5.హరుడు 6.త్రయంబకుడు 7.వృష్టాకపి 8.శంభుడు 9.కపర్ది 10.మృగవ్యాధుడు
11.శర్వుడు. వీరు కశ్యప బ్రహ్మ వలన సురభి యందు జన్మించిన వారు.
పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు
మరియు ఆత్మతో కలిపి ఏకాదశ
రుద్రులౌచున్నారు. ఈ ఆత్మ మర్త్య శరీరాన్ని వదలి విడిచి వెళ్ళుట మానవునికి దుఃఖ
హేతువు. ఆ రకంగా ఏడ్పించడం వల్లనే “రోదయంతి రుద్రః” అన్న అర్థము అన్వయమైనది.
అష్టవసువులు 08.: 1.ఆపుడు 2.ద్రువుడు 3.సోముడు 4.అద్వరుడు
5.అనిలుడు 6.ప్రత్యూషుడు 7.అనలుడు 8.ప్రభాసుడు. వీరు బ్రహ్మ ప్రజాపతి పుత్రులు.
అగ్ని, పృథివి, వాయువు,
అంతరిక్షము, ఆదిత్యుడు, ద్యులోకము,
చంద్రుడు, నక్షత్రాలు అనే ఈ ఎనిమిదిలోనూ
సర్వమూ ఉంచబడింది.అందుచే వారికి వసువులని పేరు. భూమిపై గల సమస్త పదార్ధములకు రంగు
రుచి వాసన గుణము ఆకారము (అస్థిత్వము) కల్పిస్తూ ప్రకాశించేవాళ్ళు వసువులు. భూమి
యందలి ఏ రూపమైనా వసువులు లేకుండా ఏర్పడదు.
ఈ ౩౩ మంది దేవతలు అగ్ని, భూమి,
వాయువు, అంతరిక్షము, సూర్యుడు,
ద్యులోకము అనే ఆరు ఆరుగురు దేవతల లో నిక్షిప్తులగుచున్నారు. భూమి,
సూర్యుడు, ద్యులోకము అనే ఈ మూడు లోకాల
అధిపతులు ముగ్గురు దేవతలు. పైన తెలిపిన ఆరుగురు దేవతలు ఈ ముగ్గురిలో అంతర్భావాన్ని
కలిగి ఉన్నారు.
అసలు ఈ ముగ్గురు దేవతలు
అన్నము, ప్రాణము అనే రెండు దేవతల స్వరూపము. ప్రాణము అనగా ఉఛ్వాస నిశ్వాసములు.
'మనము మామూలుగా ప్రాణాలు పోయినాయి అని అంటూ ఉంటాము. ఈ ఉఛ్వాస
నిశ్వాసములు ఆగిపోతే ఆత్మ పరమాత్మను కలిసిపోతుంది. ఉఛ్వాస నిశ్వాసములు అంటే వాయువు
తప్ప వేరేమీ కాదు. అది పోతే ప్రాణిరూపము కట్టెగా మిగిలి పోతుంది. అందుచే అన్నము
అన్నది మనకు అర దేవత అయితే వాయువు ఒకటిన్నర దేవత. అసలు ఇందు దాగియున్న అతి పెద్ద
వాస్తవమేమిటంటే అన్నము లేకున్నా జీవుడు కొంత కాలము నిలుస్తాడు. ఎట్లు అంటే వాయువు
లేక ప్రాణము నిలుపుతుంది. అందుకే సర్వ
దేవతలు ఒక్క ప్రాణం లోనే ఉన్నారు. అందువల్ల ప్రాణమే సర్వ దేవాత్మక మైన బ్రహ్మము గా
అభివర్ణించుట . “జ్యేష్ట శ్రేష్ట ప్రజాపతి” అని నామాన్ని పొందిన ప్రాణమే సర్వ
దేవతా స్వరూపము. ప్రాణమున్నంతవరకే
ఆత్మ శరీరమునకు అంతర్భాగమై
ఉంటుంది. అందుచేత ఆ ఆత్మయే బృహత్స్వరూపమైన ఆ పరబ్రహ్మమని చెప్పబడుతోంది.
అంతే కానీ ౩౩ కోట్ల దేవతలు కాదు. ఈ వాదము ‘ఎద్దు ఈనింది
అంటే గాట కట్టివేయ’మన్నట్లు ఉంటుంది. యజుర్వేద, అథర్వణ వేద, శతపథ బ్రాహ్మణులు మొదలైన ప్రాచీన కృతులందు 33 విధముల దేవతలను
ఉల్లేఖించినారు. వీరే త్రయత్రింశతి కోటి (33 కోటి) దేవతలు. హిందూ గ్రంధములేకాదు
బౌద్ధ, పార్శీ మొదలైనవి కూడ 33 దేవవర్గముల గురించి
తెలుపుతాయి. బౌద్ధుల దివ్యవాదము మరియు సువర్ణప్రభాస సూత్రములందు వీటి ఉల్లేఖన
ఉన్నది.
ఇక ఈ విషయములో శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నాడో చూడు.
ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్ |
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః || 11 – 4
ఎవరే రూపము ఏ విధి కొలిచిన
అదే రూపమున అనుగ్రహింతును
నా జాడలనే నడతురు భక్తులు
ఎల్ల కాలముల ఎల్లరు పార్థా! 11 – 4
“ఎవరు ఏవిధంగా ‘నన్ను’ సేవిస్తే వారిని ఆవిధంగానే ‘నేను’
అనుగ్రహిస్తున్నాను. మానవులు అందరూ ఎప్పుడూ ‘నా’ మార్గాన్నే అనుసరిస్తున్నారు. “
పార్థా ఎవరు నన్ను ఎంత ధ్యాసతో ఏ విధముగా భజిస్తారో నేను
కూడా వారిని ఆ విధముగానే అనుగ్రహిస్తాను. వారికి నా సహయోగము, వారి
భక్తి ఎంతో, అంతే
పరిణామము కలిగియుంటుంది. అసలు ఉన్నమాట చెప్పవలెనంటే సాధకుని శ్రద్ధయే కృపగా
పరిణమించి అతనికి లభిస్తుంది. ఈ రహస్యమును
తెలుసుకొన్న సాధుజనులు సంపూర్ణ తాదాత్మ్యముతో నన్నుసరిస్తారు. వారికి ఏ ఫలితము
మంచిది అన్నది నా నిర్ణయమే!
యే உ ప్యన్య దేవతా భక్తా యజంతే
శ్రధ్ధయాన్వితాః |
తే உ పి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం || 9.23
కోర్కెలు తీరగ కుంతీపుత్రా
వివిధ దేవతల విధిగా కొలుతురు
అజ్ఞానముతో అవి కూడిననూ
అనుగ్రహింతును అవియూ గైకొని 9.23
ఓ కుంతీ పుత్రా! శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు అనేకములైన
దేవతలను పూజించినప్పటికీ అవి అజ్ఞానముతో కూడియున్నపటికీ,వారు
నన్ను పూజించినట్లే!
అహం హి సర్వ యజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ |
న తు మామభి జానంతి తత్త్వేనా తశ్చ్య వంతి తే || 9.24
అన్ని యజ్ఞముల
భోక్తను నేనే
అన్ని యజ్ఞముల భర్తను నేనే
అది తెలిసినచో వారికి ఉండదు
పునరపి జననం పునరపి మరణం 9.24
అన్ని యజ్ఞములకునూ భోక్తనూ నేనే, స్వామినీ
నేనే! వారు నా పరమాత్మ తత్వమును ఎరుగలేక పునరపి జననం పునరపి మరణం లో చిక్కుకొని
బయటపడ లేకున్నారు.
మరి నీ చింత తీరినట్లేనా!
స్వస్తి
***************************************సమస్య మనది సలహా
గీతది - 39
నాకు ఇంద్రియ
నిగ్రహములేదు. మనసుకు నిలకడ లేదు. మనసుకు తోచిన కర్మ తప్పితే మంచి చెడులనరసి
కర్మలనాచరించలేకున్నాను. ఆవిధముగా తిరిగీ మాయామోహముల తగుల్కొని తబ్బిబ్బవుతున్నాను. పరిష్కారము లేదా! అసలు ఆఫీసులో కూడా
పని విషయములో శ్రద్ధ చూపించలేకున్నాను. మంచి దారి దొరుకదా!
మిత్రమా! ఇంద్రియముల
నిగ్రహించుట అంత సులభమగు పనికాదు. ఇంద్రియములను గుర్రములతో పోల్చితే కళ్ళెము మనసు.
నీవు సారధివి నీ జీవితమే రథము. కళ్ళెము నీ కనుగుణముగా వుంచుకోగలిగితే గుర్రములు నీ
అదుపులో వుంటాయి. గుర్రములు నీ అదుపులోనికి వస్తే గమ్యము నీవు చేరగలుగుతావు. ఈ
విషయమును మరికాస్త వివరముగా మాట్లాడుకొందాము. కళ్ళెము అంటే మనసును గుర్రములతో
అనుసంధించేవరకూ ఇంద్రియములు స్వతంత్రములు. అందుచేత నీవు మొదట వానిని మచ్చిక
చేసుకో!
ఈ మాటలు ముఖ్యముగా
విను. ఇవి నేను చెప్పుచున్నవి కావు. అసాధారణ జ్ఞాని,
భక్తి తత్పరుడు, మహా వేదాంతి యగు విదురుడు
ఉద్యోగ పర్వములోని ద్వితీయాశ్వాసములో ధృతరాష్ట్రునికి బోధ చేసే నీతులలో మూడు
నాలుగు ఇచ్చట ముచ్చటించదలచినాను. ఇవికూడా నీ ఇంద్రియములను ఏవిధముగా అదుపులోనికి
తెచ్చుకొనవలెను నీ మనసును ఎట్లు నిగ్రహించవలెను అన్న విషయములగూర్చి మరియు నీవు
చేసే కర్మాచరణకు కోరముట్లు గా ఏ ఏ గుణములు కావలెనో ఇవి తెలుపుచున్నాయి. గమనించు,
ఆచరించు, అనుభవించు.
పురుషుండు రెండు
దెఱఁగుల
ధర నుత్తముఁ డనఁగఁ
బరఁగుఁ; దా నెయ్యెడలం
బరుసములు వలుక
కునికిన్;
దురితంబులు వొరయు
పనులు దొఱఁగుట కతనన్.
పురుషుడయినా స్త్రీ
అయినా ఎదుటివారిని పరుసముగా మాటలాడరాదు, ఎవరికీ ఎగ్గులు చేయరాదు. నచ్చకపోతే ఊరకుండుట మంచిది. నీవు చెడుగు చేస్తే
దాని ఫలము ఆతరువాత నీవు అనుభవించక తప్పదు.
తగిన వేషంబు, దనుఁ దాన పొగడుకొనమి
నొచ్చియును గీడు
వలుకమి, యిచ్చి వగవ
కునికి, దన కెంత నడవకయున్నఁ
బథము
దప్పకుండుట నడవడి
కొప్పు సేయు.
నీ వేషము నీ పనికి
తగ్గట్టు ఉండవలెను. గుమాస్తాగిరి చేస్తూ కోటు టై తో ఆఫీసుకు పోతే ఇటు మిత్ర
బృందములో ఎగతాళి అటు పై అధికారి యొక్క కోపమునకు కూడా గురికావలసియుంటుంది. కావున
ఎప్పటికీ ఎంత చెట్టుకు అంతగాలి ఉండుట మంచిది. ఇదే నీ కర్మలకు సరియగుదారిని
చూపిస్తుంది. ఆత్మస్తుతి పరనింద రెండూ పనికిరానివే. మనలోని గొప్పదనమును ఎదుటివాడు
గుర్తించాలి కానీ మనము డప్పుకొట్టుకుంటే అవహేళనకు గురి కావలసిందే! మరియొక
ముఖ్యమయిన విషయము. లోకములో ఇటు స్నేహితులలోనూ అటు అధికారులలోనూ, అంతెందుకు ఇంటిలో భార్య/భర్త ఆమాటకొస్తే వయసు వచ్చిన
స్వంత సంతానమే మనపై కోపగించుకొంటారు. అప్పుడు శాంతము వహించుట ఎంతో మంచిది.’క్షమయా
నిష్ఠితాం జగత్’ అని వాల్మీకి వ్యాసులు ఇరువురూ చెబుతున్నారు. క్షమా అంటే సహనము,
ఓర్పు.’ తాలిమి తనను కాస్తుంది ఎదుటి వానిని కాస్తుంది’ అన్న నానుడి
అందరికీ తెలిసినదే! ‘క్రోధో వైశ్వానరో’ అన్నారు పెద్దలు. కోపము అగ్నితో సమానము.
అది తననూ కాల్చుతుంది ఎదుటివారినీ కాల్చుతుంది. అప్పుగా ఏదయినా ధన సహాయము
చేయునపుడు ముందు నీ పరిస్థితి పిదప నీవు డబ్బు ఇచ్చే వ్యక్తి మనస్థితి గమనించు.
పిదప బాధ పడితే ఒరిగేదేమీ ఉండదు. ఇక సర్వోత్కృష్టమయిన విషయము ఏమిటంటే ఎట్టి
పరిస్థితిలోనూ నీ ధర్మపథమును వీడవద్దు. కర్మాచరణలో ఇవి అత్యంత ముఖ్యమయిన నియమములు.
ఇవి పాటించుటచే నీవు నీది అన్నభావన పోయి అంతా కృష్ణార్పణం అన్న తలంపుతో చేస్తావు.
అట్టి కర్మకు తగ్గ ఫలితము పరమాత్మ
తప్పక ఇస్తాడు.
మాలకరి పుష్పములు
గోయుమాడ్కిఁ, దేఁటి
పువ్వుఁ దేనియ
గొనియెడు పోల్కి నెదురు
గందకుండఁగఁ గొనునది
కార్యఫలము;
బొగ్గులకుఁ బోలె
మొదలంటఁ బొడువఁ జనదు.
ఒక మంచి పూల చెట్టు
ఉందనుకొందాము. భగవంతుని పుష్పమాలలచే అలంకరించుటకు మాలకరి అంటే మాలలు కట్టె వ్యక్తి
ఎంతో సుకుమారముగా పూవులు కోస్తాడు, తేనెటీగ తనకు కావలస్డిన మధువును పూవులనుండి ఎంతో సున్నితముగా గ్రోలుతుంది
కానీ ఆ చెట్టును బొగ్గుల కొరకు కొట్టివేస్తే అది ఎంత హీనమైన కార్యము అవుతుంది
అన్నది గమనించు. అందుకే నీవు కార్యమునకు గడంగుటకు మునుపు మంచి చెడులనాలోచించు.
చెడు జోలికి పోకు. చేసి
చింతించుటకంటే చింతించి చేయుట మంచిది. నీ ఇంద్రియములపై ఆ నియంత్రణను కలిగియుండు.
పాడి గలిగిన
నిహలోకఫలములెల్లఁ
జేరుటయ కాదు, కీర్తియుఁ జెందుఁ
బురుషు;
ధరణిఁ బొగడిత
యెందాఁకఁ బరఁగు, నంత
కాలమును బుణ్యలోకంబు
గల్గు నండ్రు
న్యాయ ధర్మ సంమతమౌ
పనులు చేయుట చేత ఇహలోక ఫలమును పొందుటయే కాదు కీర్తిని కీర్తిని కూడా పొందుతావు.
ధరణిపై ఆ కీర్తి ఎంత కాలము ఉంటుందో అన్త్య్హకాలము నీవు పుణ్యలోకముల కలిగియుంటావు.
అసలు పుణ్య లోకము మాట అటుంచి నీ ఆత్మా సంతృప్తిచే ఈ ఇహలోకములోనే ఆరోగ్యముగా
ఆనందముగా ఉంటావు. అంతకంటే నీకు కావలసినది ఏముంది. ఇందుకు సంబంధించిన, భారతములోని
ఒక కథ చెబుతాను విను.
పూర్వం
ఇంద్రద్యుమ్నుడనే ఒక రాజు ఉండేవాడు. అతడు ఎన్నో దానధర్మాలు చేసి ధర్మాచరణలో తనంతటి
వాడు లేడనే ఖ్యాతిని పొందినాడు. లెక్కగట్టలేనన్ని గో,భూ హిరణ్య దానములు, పాత్రులైన
వారికిచ్చి పుణ్యసంపదను ఆర్జించుకొన్నాడు. ప్రజారంజకునిగా పేరు తెచ్చుకొన్నాడుఆ విధముగా
ఎన్నో వర్షములు రాజ్యపాలనము చేసి తన పుణ్యఫలముచే మరణానంతరము స్వర్గం చేరుకొన్నాడు. చాలాకాలము స్వర్గభోగాలు
అనుభవించిన తరువాత ఒకరోజు దేవేంద్రుడు ఇంద్రద్యుమ్నుని పిలిపించి
“మహాత్మా! నీవు అనేక
దానధర్మాలు చేసి ఎంతో పుణ్యమును ఆర్జించినావు కనుక ఇంత దీర్ఘకాలము స్వర్గములో
ఉండగలిగినావు. కానీ పరమేశ్వరుని శరణువేడి ఆయన కృపతో పోందెడి మోక్షపదము ఒక్కటే
శాశ్వతమైనది, ఇతరములు శాశ్వతములు కావు. నీ పుణ్యఫలమును అనుభవించినావు కావున
సర్గమును వీడు సమయము వచ్చినది” అని చెప్పినాడు. స్వర్గాధిపతి మాటలు విని
ఇంద్రద్యుమ్నుడు ఇంతకొద్ది కాలములోనే తన పుణ్యరాసులు ఎలా కరిగిపోయినాయి? అని ఆశ్చర్యపోయినాడు. అది చూసి శచీపతి “రాజా!
భూలోకములో నిన్ను కానీ నీవుచేసిన సత్కర్మలను కానీ గుర్తుపెట్టుకొన్న వానిని నాకు
చూపిస్తే నీవు స్వర్గములోనే ఉండవచ్చు. చేసిన దానములు మహనీయములు కాకపోతే జనులు
చిరకాలము గుర్తుంచుకొనరు కదా! కావున నీ దానములను ఎంతకాలము ప్రజలు ఉపయోగింతురో
అంతకాలము నీవిక్కడనుండవచ్చు” అని హితవు చెప్పినాడు. ఇంద్రుని ఆజ్ఞతీసుకొని
అట్టివారు ఉన్నారేమో వెదకటానికి బయలుదేరినాడు ఇంద్రద్యుమ్నుడు ఇంద్ర భటులతో. ముందుగా
చిరంజీవి అయిన మార్కండేయ మహర్షి వద్దకువెళ్ళి నమస్కరించి “ఓ మహా తపస్వీ! నన్ను
మీరు ఎఱుగుదురా”? అని అడిగినాడు. అప్పటికి ఎంతోకాలముగా
తీర్థయాత్రలుచేసి ఉపవాస వ్రతాలు చేసి కృశించి ఉన్న మార్కండేయ మహర్షి గుర్తులేదని
చెప్పినాడు. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు “స్వామి! చిరంజీవులైన మీకంటే ముందుపుట్టిన ప్రాణి
ఏదైనా బ్రతికి ఉన్నదా”? అని అడిగినాడు. “పవిత్ర హిమాలయ పర్వత
ప్రాంతములో ప్రావారకర్ణం అనే గుడ్లగూబ ఉన్నది” అని బదులిచ్చినాడు మార్కండేయ
మహర్షి. వెంటనే ఆ ఉలూకము వద్దకు చేరి “అయ్యా! నెన్నెఱుగుదువా”? అని ప్రశ్నించినాడు. తెలియదు అని చెప్పి “ఇక్కడికి కొన్ని యోజనాల దూరములో
ఇంద్రద్యుమ్నమను సరోవరమున్నది. ఆ సరోవరములో నాడీజంఘమనే కొంగ ఉన్నది” అని
ప్రావారకర్ణం చెప్పగా ఇంద్రద్యుమ్నుడు బ్రహ్మదేవుని స్నేహితుడైన నాడీజంఘుని వద్దకు
చేరి “ఓ బకరాజా! నన్ను మీరు గుర్తుపట్టినారా”? ప్రశ్నించినాడు.
“లేదు. ఈ సరోవరములో ఆకూపారమనే తాబేలు ఉన్నది. అది నాకంటే పెద్దది. దానికి నీవు
తెలుసేమో కనుక్కో” అని చెప్పినది.
ఇంద్రద్యుమ్నుని
చూడగానే ఆకూపార కళ్ళుచెమ్మగిల్లాయి “అయ్యా! వెయ్యి యజ్ఞములు సాంగోపాంగముగా చేసి
వెయ్యి యూపస్తంభాలు కట్టించినావు. ఆ యజ్ఞదానాలలో లెక్కలేనన్ని గోదానాలు ఇచ్చినావు.
నీవు దానము ఇచ్చిన గోవుల పదఘట్టనముచే ఈ భూమి దిగబడి యింత సరోవరము అయినది. ఇది అంతా
నీ చలవే” అని కృతజ్ఞతాపూర్వకముగా చెప్పినది. మరుక్షణం దేవదూతలు దివ్యవిమానములో
ఇంద్రద్యుమ్నుని స్వర్గమునకు తీసుకొని వెళ్ళినారు.
కావున మన కీర్తి
భూలోకములో ఉన్నంత కాలము సర్గలోకవాసము సునిశ్చితము. ఆ విషయమును దేవదూతలు ఆకూపారము
ద్వారా వినుటచే ఇంద్రద్యుమ్నునికి పునః
సర్గలోక ప్రాప్తి కలిగినది. కనుక మనము నలుగురుకీ ఉపకరించే పనులు చేయాలి. అవియే
మనలను రక్షించు సంపదలు. అందుకే శాస్త్రము ‘కర్మానుగోగచ్ఛతి ఎకమాత్రాః’ అని అన్నది.
మన మంచిపనులే మన స్వర్గాలోకావాసమునకు దోహదకారి.
దేవేంద్రుడు చెప్పినట్లు
పునర్జన్మ రాహిత్యమగు మోక్షము ఒక్కటే
శాశ్వతపదము. ఇంత పుణ్యాత్ముడు కాబట్టే మహావిష్ణువు, గజేంద్ర రూపములో ఉన్న
ఇంద్రద్యుమ్నునిచే “నీవేతప్ప హితః పరంబెఱుగను …” అని అనిపించి
అతనికి శాశ్వతమైన మోక్షమును ప్రసాదించినట్లు భాగవతమున గజేంద్ర మోక్ష ఘట్టమున
తెలుసుకోనుచున్నాము. కావున మోక్షమునకు పుణ్యమే ప్రథమ సోపానము.
కర్మ మంచిదయితే, శంకరార్పణముగా భావించి చేస్తే పరమాత్మ సత్ఫలితమునే
అనుగ్రహించుతాడు. ఇక కర్మలను ఆచరించ లేకున్నాను అంటున్నావే అసలు జీవించియున్న
కాలములో కర్మచేయకుండా ఉండగలవా! కానీ చేసేపనిని అంకిత భావముతో చేయి, అది ఆఫీసులో నయినా సరే అన్యథా అయినా సరే! సత్కర్మలపై ఆలోచన, ధృడమైన మనసు, దేవునిపై భక్తి నిన్ను నీ
‘కంకర్తవ్యతావిమూఢత’ నుండి బయటికి తెచ్చి సత్కర్మలనాచరింపజేస్తుంది. ఆసలు ‘పనిచేయి,
నీపనిని బట్టి ఫలితము నేనిస్తాను కానీ నీవు కావాలన్నది పొందలేవు.’
అని పరమాత్మ చెప్పినది నీకు తెలిసిన విషయమే కదా! ఆ బుద్ధితో నీవు కర్మలనాచారించితే
నీకు పరమాత్మ సాయుజ్యమే లభిస్తుంది. ఈ విషయమై శ్రీకృష్ణపరమాత్మ ఏమంటున్నాడో చూడు.
న మాం కర్మాణి
లింపంతి న మే కర్మ ఫలే స్పృహాl
ఇతి మాం యోభి జానాతి
కర్మభిర్న స బధ్యతేll 14-4
‘కర్మ ఫలముపై కన్నులు
నిలపక
కడు బాధ్యతతో కర్మలు చేయుము’
అను నాతత్వము అరసిన
యాతని
కడకు రావు ఏ
కర్మబంధములు 14-4
కర్మలు నన్ను అంటవు, నేను కర్మఫలముల యందు కూడా ఆసక్తుడను కాదు. ఎవరైతే
నన్ను ఈవిధంగా తెలుసుకుందురో, వారు కర్మ బంధములలో
చిక్కుకోరు.
రామచరిత మానసము ఇలా
పేర్కొంటున్నది:
'సమరథ
కహునహిం దోషు గోసాయీ, రబి పావక సురసరి కీ నాయీ'
“అపవిత్రమైన
వ్యక్తులు లేదా వస్తువుల సంపర్కం వలన కూడా, పరిశుద్ధమైన వ్యక్తిత్వములు దోషములచే ఎప్పుడూ కళంకితులు కారు, ఉదాహరణకి సూర్యుడు, అగ్ని, గంగా
నది వంటివి.” తన కిరణములు అశుద్ధం మీద పడితే సూర్యుడు కళంకితుడు కాడు. సూర్యుడు తన
పరిశుద్ధ తత్వాన్ని నిలుపుకుంటూనే ఆ అశుద్ధమును కూడా శుద్ధి చేస్తాడు. అదే విధంగా
అగ్నిలో అపవిత్రమైన పదార్దములు సమర్పించినా, అది తన
స్వచ్చతను నిలుపుకుంటుంది – అగ్ని స్వచ్చమైనది, మనం ఏది దానిలో వేసినా అది కూడా శుద్ధమైపోతుంది. ఇదే
విధంగా, ఎన్నో మురికి కాలువలు పవిత్ర గంగా నదిలో
కలుస్తుంటాయి, కాని గంగా నది మురికి కాలువ అయిపోదు – గంగా నది
పవిత్రమైనది, ఇంకా, ఆ
మురికి కాలువలన్నిటినీ గంగా నదిగా మార్చివేస్తుంది. అదే విధంగా, భగవంతుడు కూడా తను చేసే కర్మల వలన కళంకితుడు కాడు. మనము కూడ్ఫా మనసా వాచా
కర్మణః అనుసరించవలసిన పంథా ఇదియే!
తెలిసినది కదా! కావున పనిలో
పరమాత్ముని చూడు. నీకు మొదట ఆత్మానందము కలుగుతుంది.నీ సహచరులకు, నీ అధికారులకు, నీ సంస్థకు
నీవు మేలుచేస్తే దేవుడు కూడా నీకు తగిన మేలు చేయక వేరేమి చేస్తాడు.
భగవదనుగ్రహమస్తు.
స్వస్తి.
****************************************
సమస్య మనది సలహా గీతది – 40
నిజమైన పండితుని గుర్తించుట ఎలా? అతని మనస్తత్వమేమిటి?
కష్టపడి పనిచేయుచున్న నన్ను మా పై అధికారి గుర్తించుట ఎలా?
ఈ రెండు ప్రశ్నలకు జవాబులు తెలుసుకొనుటకు ముందు కొంత అవలోకనము అనుశీలనము చేయవలసి వుంటుంది. ఒకసారి ఈ విషయములను శ్రద్ధతో గమనించు.
‘పండ’ అంటే వివేకము. అది కలిగినవాడు పండితుడు. పండితుడు అంటే వివేకము కలిగిన వాడు అని అర్థము అని మనము మొదట చెప్పుకొన్నాము. వివేకము ఉన్నచోట విచక్షణ వుంటుంది.విచక్షణ వుంటే విరాగముంటుంది. విరాగాముంటే విడుమర అంటే విమోచనము వుంటుంది.ఇవి అన్నీపొగబండి పెట్టెల వంటివి. మనసు అన్న గమనయంత్రము(Railway Engine) తాను నడువవలసిన దిశలో నడచిందంటే ఇవన్నీ ఒకదాని తరువాత ఒకటి వరుసగా వచ్చేవే! కావున ముందు సక్రమమగు దిశానిర్దేశము జరిగితే నీ ధ్యాస,ధ్యానము, ధ్యేయము అన్నీ వరుసగా నిన్ననుసరించేవే! అప్పుడు కర్మ చేస్తూవున్నా నీకు కర్తృత్వము అంటదు. నీవు ఒకరిపై ఆధారపడవు. నీబండికి నీవే చోదకునివి.
పండితుడు అన్న వాడు ఒక రసాలము అనగా మామిడి చెట్టు వంటివాడు. పండ్లను ఇచ్చువరకు మాత్రమే తన బాధ్యత. ఆ రుచిని అనుభవించి చెప్పగలిగినవాడు అందుకు సంబంధించిన జ్ఞానము కలిగినవాడు మాత్రమే ! ఇక్కడ నీవు గమనించవలసింది ఏమిటంటే, అటువంటి జ్ఞాని తనకు అందుబాటులో లేదని ఆ చెట్టు అతిమధురమగు తన ఫలములను ఇచ్చుట మానుకొనదు.
మరికాస్త వివరముగా చెప్పుకొందాము. మొగవానికి పుడుతూనే మీసాలు రానట్లే, ఒక వ్యక్తికి పుడుతూనే పాండిత్యము రాదు. ప్రారంభమున తానూ శాస్త్ర విహిహితములగు కర్మలనాచారించ మొదలుపెట్టినా తనలో తన ప్రమేయము లేకనే కొన్ని సంకల్పములు కొన్ని కామనలూ చోటు చేసుకొంటాయి. మనిషి ఒక అతీత స్థాయిని పొందువరకూ , స్త్రీ, పుత్రులు, ఇల్లు, వాకిలి, ధనము, గౌరవము మొదలగు విషయములపై ఇచ్ఛ కించిన్మాత్రమేని కలిగి యుంటాడు. దీనినే కామన లేక కామము అంటారు. అది కావలెను అన్న తలంపు ఎప్పుడు కలుగుతుందో అది అప్పుడు సంకల్పముగా పరిణతి చెందుతుంది. అందుబాటులో లేనపుడు, యాదృచ్ఛి కముగా ఒక మామిడి పండు తినవలెననిపిస్తుంది. అది సంకల్పము. అనుకోకుండా దానిని నీ స్నేహితుని చేతిలో చూస్తావు. అప్పుడు దానిని తినవలెననిపిస్తుంది. అది కామన. ఇక దానిని సాధించవలెనని నీలో ఒక ఆసక్తి ప్రబలుతుంది. కాసేపు తనకు తానుగా ఇస్తాడేమో చూస్తావు. ఇస్తే సరేసరి. ఇవ్వకుంటే అడుగుతావు. అప్పుడయినా ఇస్తే సరేసరి. ఇవ్వకుంటే, నీ కోరికయోక్క తీక్షణతనుబట్టి నీవు స్వంతము చేసుకొనవలెనని నీకోరికను ధృఢతరము చేసుకొంటావు. అంటే నీ హద్దులు దాటుట మొదలుపెట్టినావు అని అర్థము. అప్పుడు కామన పట్టుదలగా మారినది అని అర్థము. పట్టుదల పెరిగి పైశాచికమైతే (Nymphomania అంటారు ఆంగ్లములో) పర్యవసానము పరమాత్మునికే ఎరుక. కావున నీవు నీ కామనా పరిధిని తగ్గిచుకొంటూ వస్తే నీవు ‘పండ’ కు అతి చేరువలో వుండి పండితునివి కాగలుగుతావు. ఇక నీవు పండితునివి అన్న గుర్తింపు నీవు నిలచిన పరిసరములను బట్టివుంటుంది. ఒకనికి ఎటువంటి పాండిత్యము లేకనే ఒక మూర్ఖుల సమూహములో వుంటే ‘కోతిబట్టి తెచ్చి కోరి పట్టముగట్టి కొండముచ్చులెల్ల గొలిచినట్లు’ పండితుడైపోతాడు. మరియొక రీతి ఏమిటంటే ‘చెవిటి వాని జేరి శంఖమ్మునూదిన ఎముక గోరుకుచుంటివేలయనును’ అన్నట్లవుతుంది. ఇంకొక రఖము ఎటువంటిదంటే తనకేమీ తెలియకనే అన్నీ తెలుసుననుకొని జ్ఞానులతో ఢీకొనుట. అది ఎట్లంటే, ఒక బల్లి మొసలి వద్దకు పోయి నీవు నేను ఒకటే అనిందట. మాటలు పూర్తి కాకమునుపే బల్లిని భోంచేసింది మొసలి. ఇట్లు కాకుండా నీవు పండితునివై జ్ఞానుల సమూహమున నీకు ఉనికి ఏర్పరచుకొని ఉనపుడే నీవు పండితునివి అన్న గుర్తింపు లభించగలుగుతుంది. అట్టి పండితునివి నీవు కావాలనుకొంటే ఏమేమి కావలసి వస్తుందో చూద్దాము.
మొదట నీ మనసును నియంత్రించుకో. అప్పుడు దాని పరిధి నీ కోరికలపైనే ఆధారపడుతుంది. నీ కోరికలు సవ్యమై సక్రమమై సదాశ్రయములై ఉంటే, నీ మనసపుడు నీ సత్కాంక్షలను తీర్చుటకు బుద్ధిని సన్మార్గములో ప్రేరేపించుతుంది. అప్పుడు నీకు సత్సాంగత్యమబ్బుతుంది. అటువంటి సత్సంగము నీకు ఏర్పడితే ఆ పిమ్మట నీ ప్రయాణము జీవన్ముక్తికి ఏవిధముగా సాగుతుందో జగద్గురువులు ఆదిశంకరులవారే శెలవిచ్చినారు.
సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వమ్ l
నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిః ll
కావున ఒక్క సత్సాంగత్యము ఏర్పడినదంటే వారివల్ల మనకు రాను రాను అసలు వివిధములగు సాంగత్యములపై చింత తగ్గుతుంది. అది తగ్గితే విషయవాంఛలపైన కోరిక కొరవడుతుంది. కోరిక తగ్గితే మానసిక నిశ్చలత ఏర్పడుతుంది. ఆ నిశ్చలత నీదయితే నీవు జీవన్ముక్తిని పొందితీరవలసినదే కదా! ఆ జీవన్ముక్తికి ముందు మెట్టే జ్ఞానివి అగుట. నీవు నిర్మోహివి అంటే నీవు జ్ఞానివనియే కదా! ఈ విషయమై పరమాత్ముడు ఏమంటున్నాడో ఒకపరి గమనించు.
యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితా l
జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాఃll ll19 – 4ll
త్యక్త్వా కర్మ ఫలాసంగః నిత్యతృప్తో నిరాశ్రయఃl
కర్మణ్య భిప్రవృత్తోపి నైవ కిన్చిత్కరోతిసః ll ll20 - 4ll
కోరిక, ఫలితము కొరకై జూడక
శాస్త్ర కర్మముల చక్కగ చేయుచు
తనజ్ఞానముచే దగ్ధ కర్ముడై
బరగు నాతడే పండితుడనబడు ll19 – 4ll
కర్మ ఫలముకై కాంక్షను కల్గక
నిత్య తృప్తుడై నిరాధారముగ
నిర్వహించునో నిజముగనాతడు
ఆ కర్మమ్ములకకర్త యౌను ll20 - 4ll
సర్వ సంగ పరిత్యాగము అంటే ఇదే కానీ భార్యా బిడ్డలను వదలి అడవులకు పారిపోవుట కాదు. ఈ సలహాను మనము లౌకిక రీతిలో ఏవిధముగా విశ్లేషించుకొనగలమో కాస్త గమనించుదాము.
నీ కార్యాలయములో నీకు ఒక పని అప్పగించబడినది. నీకు వెంటనే వచ్చే ఆలోచన ‘చేస్తే నాకేమిటి’ చేసే ప్రతి పనినీ ఆ ప్రకారముగా స్వార్థ చింతనతో చూస్తే చేసే అవసరమే కలగదు. అందువల్ల కార్యాలయ పరముగా నీకు అప్పగించిన బాధ్యత నీవు చేయవలసినది. అందుకుగానూ నీవు వేతనమును పొందుచున్నావు. కావున ‘నాకేమిటి’ అన్న ఆలోచన రానీకు. చేయుట నీ బాధ్యత. నీ అధికారి నియతి కలిగిన వాడయితే నిన్ను గుర్తించి నీపదొంనతికి పాటుపడవచ్చు, లేక ఏ చెప్పుడు మాటలు వినుటవల్లనో నిర్లిప్తముగా వుండిపోనూ వచ్చు. కానీ ఇది ఇక్కడ ఆగుట లేదు. అనుకోని విధముగా నీ ప్రజ్ఞ నీ అధికారి పైఅధికారికి తెలిసి నిన్ను ఆదరించవచ్చు. ఇవేవీ జరుగకున్నా నీవు నీ బాధ్యత నిర్వహించి నిర్లిప్తముగా వుంటే నీకు ఏ మానసిక క్షోభ కూడా దరిచేరదు. నీ పరిధిలో నీవుంటే నీవు ఆరోగ్యముగా ఉంటావు. కబీరు దాసు అంటాడు:
సాఁఈ ఇత్నా దీజియే జామె కుటుమ్బ్ సమాయ్
మై భీ భూకా నారహూఁ సాధు న భూకా జాయ్
భాగవతములో కూడా బలిచక్రవర్తి ‘తృప్తిన్ చెందని మనుజుడు సప్త ద్వీపములనైన చక్కంబడునే’ అని. కావున ఒక పనిని నీవు పూర్తిచేసి తగిన గుర్తింపు పొందకపోతే క్రుంగిపోవలసినది ఏమీ లేదు. ఆత్మా సంతృప్తి కలిగితే ఆరోగ్యంగా ఉంటావు. ఆరోగ్యముగా వుండి మంచి ఆలోచనలు కలిగివుంటే ఆసాన్తమూ ఆరోగ్యమును కాపడుకొన్నవానివౌతావు.
అదిచాలు నీకు ఆనందమయమగు వార్ధక్యమును గడుపటానికి.
వార్ధక్యములో ఎవరయినా కూడా కోరుకొనవలసినది ఇదే నన్నది ఈ క్రింద తెలిపిన పెద్దల మాట.
అనాయేసేన మరణం వినా దైన్యేన జీవనంl
దేహాంతే తవసాయుజ్యం దేహిమే పార్వతీ పతేll
స్వస్తి.
************************************************
సమస్య మనది సలహా గీతది – 41
దేవుడు కాళ్ళు చేతులు ఇచ్చిన తరువాత కదిలించకుండా ఉండలేము. ఇష్టముతో కొన్ని పనులు చేస్తే అయిష్టముతో మరికొన్ని. మరి ఈ కర్మల ఫలమును అనుభవించవలసి వస్తుంది కదా! తప్పించుకొనే మార్గమేదీ?
మంచి ప్రశ్న. దేవుడు కాళ్ళు చేతులే కాదు కళ్ళు ముక్కు చెవులు ఇంకా కొన్ని శరీరాంగములను కూడా ఇచ్చినాడు. కాళ్ళు చేతులు నీ నియంత్రణలో వుంటాయి . మిగతవి నీ ప్రమేయము లేకుండా\లేకున్నా కూడా పనిచేస్తున్నాయి. నీ కాళ్ళు చేతులు కూడా నీ బుద్ధి యొక్క నియంత్రణలో వుంటాయి. నీవు బజారులో పోతూవుంటే నీకవసరమైనవి లేనివీ రెండూ చూస్తాసవు. అవసరమైనవి చూడవలసినప్పుడు నీ బుద్ధి వానికి తగిన సందేశమును పంపుతుంది. అప్పుడు అవి నీవు తలచిన వస్తువును చూస్తాయి. చెవులూ అంతే. కానీ ముక్కు అట్లు కాదు. తనపని తనదే! కానీ నేవేదో పెద్ద ఋషివై తపస్సు చేసుకొంటూ ఊపిరిని బంధించినపుడే అది నీ నియంత్రణలో వుంటుంది. ఇక గుండె మొదలగు శరీరావయవములగూర్చి చెప్పనే అవసరము లేదు. మరి వానికి నియంత ఎవరు?
నీవు మనసు పెట్టి ఈవిషయమై యోచించితే నీకర్తమై పోతుంది. నీ శరీర కర్మలకు పూర్తిగా నీవు కర్తవు కావు అని. కానీ నీవు తదేకముగా కర్తవు కాదలచుకొంటే నీ మనసును పరమాత్ముని పై నిలిపితే గుండె యొక్క స్పందనను కూడా నిలుపగలుగవచ్చు.
కానీ అటువంటి పనులు సామాన్యులమైన మనకు ‘అందని ద్రాక్ష పళ్ళే’. కావున జీవితములో కర్మలు నిరంతరమూ నీవు బ్రతికినంత కాలమూ వున్నవి కానీ అన్నింటికీ నీవు కర్తవు కాదు. నీవు నీ బుద్ధి,కాళ్ళు, చేతులను పనిచేయించినట్లు మిగతా భాగాలను చేయించలేవు. కాబట్టి ఇవి చేసే పనులను కూడా ఆ పరమాత్మునికే అంకితమయ్యే రీతిలో చేసినావంటే, ఆయన నీకు జవాబుదారీగా చేసుకొన్నట్లవుతుంది. నీ బాధ్యత తీరిపోతుంది. కాబట్టి నీ కాళ్ళు చేతులు బుద్ధిని ఆపరమాత్మకు మెచ్చే పనులకు ఉపయోగించితే చాలు నీ బాధ్యతలు తీరిపోతాయి. ఏదిచేసినా కృష్ణార్పణం అని తలచి చేస్తావు. అప్పుడు నీవు కర్మ ఫలములను తప్పించుకోన్నట్లుకాదా! బాధ్యత, కర్తవ్యము, పట్టుదల అన్నవి నీవుచేపట్టిన పనికి కొరముట్లు. ప్రతిఫలమాశించకు. ఫలితము ఏమిటి అన్నది పైవానికి తెలుసు. నీకు నిర్దేశించిన పని నీ బాధ్యత. దానిని అమలు పరచుట నీ కర్తవ్యము. అందుకు వలసినదే పట్టుదల. కావున
మనసు నీవు దైవ మందిరముగజేసి
కర్మ నెరుక చేయ కర్త యగుచు
నీకు ఫలమునిచ్చు నిక్కము దైవము
రామ మోహనుక్తి రమ్య సూక్తి
అందుకే మనసుంటే మార్గముందన్నారు మన పెద్దలు.
ఇక ఈ విషయములో పరమాత్మ ఏమంటున్నాడో ఒకపరి గమనించుదాము.
త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః ।
కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సః ॥ 20-4
కర్మఫలముతో కలుపకు చేతిని
ఆశను కానీకాశయమెప్పుడు
నిత్య తృప్తితో నిలచితివంటే
చేసియు కర్మము చేయని వాడవె 20-4
నిరాశీర్యతచిత్తాత్మా త్యక్తసర్వపరిగ్రహః ।
శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ ॥ 21-4
మమతల నెలవుగ మనసును చేయక
భోగ లాలసత పొందును గోరక
నిత్యము కర్మను నిర్వహించితే
పాపపాశముల బంధ ముక్తుడవు
యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః |
సమః సిద్ధావసిద్ధౌ చ కృత్యాపి న నిబధ్యతే || 22-4
తలువకనే నీ దరిజేరినదే
తలువుము నీదని తత్పర రతితో
ప్రాప్తాప్రాప్తము పరమాత్ముని దయ
అనుకొంటె అసలేదీ బంధము 22-4
ఇపుడు ఈ మాటను మనము లౌకికమగు అర్థములో అనుసంధించుకొందాము.
ముందే ఒప్పుకొంతున్నావు నీవు. కాళ్ళు చేతులు వున్నవాడు కర్మ చేయక తప్పదని. మరి చేసే కర్మకు విచక్షణ కావలెనంటే బుద్ధి ముఖ్యముగా నీ బంటు కావలె. అప్పుడు నీలో ఉచితానుచిత విచక్షణ ఏర్పడుతుంది. మనసు నీకివ్వబడిన కార్యముపై మరలుతుంది. అప్పుడు నీవు చేసే నీ కార్యాలయపు పనిలో కూడా పరమాత్మను చూడగలుగుతావు. నీవు చేసే పనిలో నిబద్ధతను కలిగియుంటావు. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఒక ఇర్వడి మంది పనిచేసే కార్యాలయములోనికి వారి అధికారి అడుగుపెట్టగానే 19 మంది లేచినిలుచుని Good Morning Sir అన్నారు. వారికి తిరిగి Good Morning చెప్పి కూర్చుండజేసి ఆ 20వ వ్యక్తి వద్దకు వెళ్లి “ నేను అడుగు పెట్టిన వెంటనే 19మంది లేచి నమస్కరించితే నీవు చీమకుట్టినట్లు కూడా లేకుండా తల వంచుకొని ఉండిపోయినావు” అని అన్నారు. దానికి అతను “నేను నా దృష్టినంతా పనిపై ఉంచి యుండుటచే మిమ్ము గమనించలేదు Sir” అన్నాడు. అప్పుడు ఆ అధికారి “చూచినారు కదా మీ సహచరుడు చెప్పిన జవాబు. అది పని మీద శ్రద్ధ అంటే. నేను వచ్చే సమయమైనదని మీరంతా నాకు
Good Morning చెప్పుట కొరకు మీ ధ్యాస నా రాకపై ఉంచినారు. ఈతనికి పని ముఖ్యము. ఇటువంటి వ్యక్తులు ఇంకొక 4గురు వుంటే మిమ్ములను ఇంటిదారి పట్టించి ఉండేవాడిని .” అని ఒక బాధకూడిన అధికార స్వరముతో చెప్పినాడు. అది పనిలోన పరమాత్మను చూడటమంటే! తాను చేపట్టిన దాన కార్యమును కలకాలము కొనసాగవలెనని తలచుతూ తనకేమి వలదో పరమాత్మ శ్రీ కృష్ణునితో కర్ణుడు ఏమంటున్నాడో గమనించు.
తన విధి బలీయమగుటచే, తనకవమానము జరుగు సందర్భమున తనతోడు నిలచినాడని తానూ అసువుల బాసే వరకు తన సేవనందించి తన జీవిత సర్వస్వమును ధారరపొసిన మహనీయుడు కర్ణుడు. అట్లయి కూడా తన దాన ప్రవృత్తిని మానలేదు. ఒకనాడు శ్రీకృష్ణుడు పొద్దున పూట కర్ణుని భవనానికి వెళ్ళినాడట. అప్పుడు కర్ణుడు అభ్యంగన స్నానానికి తయారవుతున్నాడు. తలకు నూనె రాచుకుంటున్నాడు. కర్ణునికి ఎడమ వైపు రత్నాలు పొదిగిన అందమైన గిన్నె నూనెతో వున్నది. కృష్ణుడు వచ్చి చూసిన తోడనే “కర్ణా ఆ గిన్నె చాలా బాగున్నది “ అని అనాడట. నాకిస్తావా అని అనేవడో లేదో గానీ . వెంటనే కర్ణుడు తీసుకో కృష్ణా అంటూ ఎడమ చేత్తో ఆ గిన్నె యిచ్చినాడట. కృష్ణుడు ఎడమచేతితో ఇచ్చుట తగునా అంటే సందర్భములో ఆయన శ్రీకృష్ణునితో ఈ విధముగా అంటాడు.
క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవిత మావయోl
యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితా గతి:ll
కృష్ణా!ఎడమ చేతిలోని గిన్నె కుడిచేతి లోకి తీసుకునే లోపే ఏమవుతుందో తెలియదు. చిత్తము చంచల మైనది. ధనము రాకపోకలను పసికత్తలేము, జీవితమా క్షణభంగురము యముడా దయలేనివాడు. గిన్నె ఈ చేతి నుండి ఆ చేతికి మారేలోపలే ఏ మార్పయినా రావచ్చు. అందుకే ఈ విధముగా చేసినాను అన్నాడు. ఆతని నియమ నిష్ఠకు మెచ్చి వరము కోరుకొమ్మన్నాడు కృష్ణుడు. అప్పుడు కర్ణుడు భోగాభాగ్యాలుకోరలేదు, మోక్షము కోరలేదు, కానీ ఏమి కోరినాడంటే :
'దేహి'తి వచనం కష్టం 'నాస్తీ'తి వచనం తథాl
దేహినాస్థితి యద్వాక్యం మా భూజ్జన్మని జన్మనిll
'దేహి' అంటే ఇవ్వమని, అడుక్కొనుట, 'నాస్తి' అంటే అడిగినవానికి లేదు అని చెప్పుకొనుట, ఈ రెండూ నాకు జన్మజన్మాంతరములలో కూడా కలుగకుండు గాక! అని కోరుకొన్నాడు. జన్మలేత్తుటకైనా సిద్ధపడినాడు కానీ తానుచేపట్టిన పనిపై పట్టు వదలలేదు. ఎంతటి మాటయో, ఎంతటి గొప్పదనమో గమనించుము. ఈనాడు చీటికి మాటికి కాళ్ళు పట్టుకొని అడుక్కొనే నాయకులను ఎంతో మందిని చూస్తూవున్నాము. ఇటువంటి మహానుభావులకు నీతి నియమము, నిష్ఠ, సిగ్గు ఎగ్గు అన్నవి వుండవు. వారికి మానాభిమానములు మట్టితో సమానము. వారిది కూడా ఒక జన్మమే! వారూ మనుషులే! వీరు చేసే ప్రతి పనికీ వారు కోరుకొనే ఫలితము కావాలనుకొంటారు. ఈ కోవకు చెందేవారెందరో అయినా రాజకీయ నాయకులు మాత్రము లెక్కకు మిక్కుటముగా వుంటారు.
కావున నీకు గీత చెబుతున్నది ఒకటేమాట. ఫలమునపెక్షించకు, కర్మ నుపేక్షించకు. సమయాన్ని బకాసురుని ఓలె భక్షించకు. మనసును చెదరనీకు. గుండెను బెదరనీకు. నీదు కర్మ ఫలమెపుడూ ఉన్నదిలే ఎదర నీకు.
స్వస్తి.
************************************
సమస్య మనది సలహా గీతది – 42
తత్వ దార్శనికులైన వారినుండి జ్ఞానమును పొందవలెనంటే మనకు కావలసిన అర్హత ఏమిటి?
నీవు అడిగిన ప్రశ్నలోనే కొంత సమాధానమును కూడా సకూర్చినావు. నిజామునకు జ్ఞానము విజ్ఞానము అన్నవి వేరువేరు శాఖలు. జ్ఞానము లౌకిక మరియు శాస్త్రీయ గుణములు కలిగియుంటుంది. విజ్ఞానము అన్నది పారలౌకిక లేక ఆత్మజ్ఞానము. జవాబు రెండింటికీ తెలిపే ప్రయత్నమూ చేస్తాను. విషయము పారలౌకికమైనా లౌకికమైనా ముందు నీవు గురువుగా ఎంచుకునే వ్యక్తి ఎటువంటి వాడయి ఉండవలెనన్నది గమనించుదాము. ఇప్పుడు నేను తెలిపే శ్లోకము పారలౌకిక తత్వమును గూర్చి తెలిపే గురువును గురించి:
శ్రోత్రియో బ్రహ్మనిష్ఠోయః ప్రశాన్తస్సమదర్శనః
నిర్మమో నిరహంకారః నిద్వన్ద్వో నిష్ఫరిగ్రహః
అనపేక్షశ్శుచిర్దక్షః కరుణామృత సాగరః
ఏవం లక్షణ సంపన్నః సగురుర్బ్రహ్మవిత్తమః
ఉపసాద్యః ప్రయత్నేన జిజ్ఞాసో స్సాధ్యసిద్ధయే
వేదశాస్త్రములు తెలిసినవాడు, నిరంతరము స్వస్వరూపానుసంధానపరుడు, జితేంద్రియుడు, దేహేంద్రియాదులందు నేను అను భావము అన్యమునందు నాది అనుభావము లేనివాడు, శీతొష్ణసుఖదుఃఖాదులను సమముగా సహించువాడు, సకల కామవర్జితుడు, శిష్యగణమును తరింప జేయగల సమర్థుడు, దయా సాగారుడగు బ్రహ్మవిదుడు సద్గురువనబడును, ఇట్టి గురువును ఆశ్రయింపవలెను అని సర్వవేదాంత సిద్ధాంతసార సంగ్రహము లో చెప్పబడింది.
మరి గురువు యొక్క అవసరమేమి? గురువునాశ్రయిస్తే వచ్చే లాభమేమిటి? అన్న విచారణ చేస్తే..
బన్ధముక్తం బ్రహ్మనిష్ఠం కృతకృత్యం భజేద్గురుమ్
యస్య ప్రసాదా త్సంసార సాగరో గోష్పదాయతే!
సంసారమునుండి ముక్తుడై, నిరంతరం బ్రహ్మమునందే రమిస్తూ కూడా ఈ జన్మలో చేయవలసిన సత్కార్యములనొనరిస్తూఉండుట చేత కృతకృత్యుడైన సద్గురువులను ఆశ్రయించిన వారికి ఆ గురువుయొక్క అనుగ్రహము వలన సంసార మహాసముద్రమును, ఆవు డెక్కతో ఏర్పడిన మట్టి గుంతను దాటిన రీతి సులభంగా దాటగలరు. అంటే గురువును ఆశ్రయించవలసినది సంసారముక్తి కొరకు కానీ సంసారంలో ఇంకా కుదురుకునే కోరికలగూర్చి కాదు.
మరి మనము సంసారబంధమునుండి అంత సులభముగా బయట పడలేము. లౌకిక ప్రపంచములో మనుగడ మనము సాగించవలసినదే! కావున లౌకిక విషయములకు కూడా మనకు యోగ్యుడగు గురువు కావలసిందే! మరి అతనికి ఉండవలసిన లక్షణములు ఏవి అంటే, అందులో కూడా చట్ట శుద్ధి కావలసినదే! పనిని పరమాత్మగా ఎంచవలసినదే! పర్యవసానము వరకు పట్టుదల కలిగియుండవలసినదే! ఈ లకశానములు కలిగిన గురువును ఆశ్రయించితే ఆయన తగిన విధమున బోధించగలడు.
ఇప్పుడు శిష్యుడు ఎట్లున్దవలెను అన్నది చూద్దాము. ఎంత గోప్పవాడగు గురువు కావలెనని మనము ఆశించుతామో శిష్యునిగా కూడా మనలో అటువంటి గొప్పదనము ఉన్నదా లేదా అన్నది తప్పక చూచుకోవాలి. అర్థికి కావలసినది వినయము. అదివుంటే అబ్బుతుంది సహనము. ఆ రెండూ వుంటే వెంబడే వుంటుంది సాదు గుణము. అవి వుంటే ఆ వ్యక్తి దేనినయినా పొందుటకు అర్హుడయినట్లే! ఒక సందర్భములో నేను వ్రాసిన ఈ పద్యము
ఇక్కఫ్డ సందర్భోచితమని తెలియజేస్తున్నాను.
అనయము వినయము గల్గిన
జన వంద్యుండగును నిజము జగతిన మరియా
వినయము వీడిన వానికి
అనవరతము అవమతమ్మె అందును రామా!
కాబట్టి విజ్ఞానానికయినా, జ్ఞానానికైనా జిజ్ఞాసువుకు వినయము అవసరము. ఈ విషయమై శ్రీకృష్ణుడు ఏమని జవాబు ఇస్తున్నాడో గమనించు.
తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయాl
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః ll 34 – 4
ప్రణీపాతమే ప్రథమ గుణముగా
వినయశీలివై వివరమునరయుము
గురువును కొలిచే గుణియై నిలుచుచు
సత్వర రీతిన తత్వము తెలియుము
ప్రణీపాతము (భక్తి ప్రపత్తి తో కూడిన నమస్కారము) పరిప్రశ్న(సందేహ నివృత్తి) సేవాభావము (శుశ్రూష) అన్నవి శిష్యునికి ఉండవలసిన ముఖ్య లక్షణములని శ్రీకృష్ణపరమాత్మ చెప్పుచున్నాడు. ఇపుడు ఒక విషయమునాలోచించు. నీమనసుకు నచ్చేవరకూ నీవుకోరిన గుణములుండేవరకూ గురువును వెదకినావు. నీకు గురువు దొరకినాడు. ఇక నీవు ఆయనకు శిష్యునివైనావు. ఇకపై నీ సర్వస్వమూ ఆయనే! అన్నింటికన్నా ముఖ్యమైనది
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథాl
పద్భ్యాంకరాభ్యాం కర్ణాభ్యాం ప్రణమోష్టాంగ ఉచ్యతేll
అని అన్నది శాస్త్రము. గురువు ఎదుట బోర్లా పడి భౌతికంగా, అంతరంగికంగా ఉదరము, శిరస్సు, చూపు, మనసు, వాక్కు, పాదములు, చేతులు, చెవులను నేలమీద ఆనించి శరీరమును భౌతికముగా అంతరంగికముగా అర్పించి నమస్కరించుటయే సాష్టాంగము. అప్పుడు నీ చిత్తవృత్తులనుండి విముక్తుడవై గురువును గౌరవించినవానివౌతావు. అంటే గురువు యొక్క గుండెలో నీదగు స్థానాన్ని ఏర్పాటు చేసుకొన్నావు అని అర్థము. ఇక విషయబోధ జరుగునపుడు నీ సందేహమును అక్కడికక్కడే అప్పటికప్పుడే తీర్చుకోవాలి. ఎందుకంటే ఆ సమయమున ఆయన ఆలోచన తానూ చెప్పే విషయముతోనే నిండి వుంటుంది. నీవు అడిగే విధానములో వినస్యము. విధేయత ఉట్టిపడుతూ వుండాలి. అప్పుడు నీ సందేహములు నివృత్తి కాగలవు. మరి అది అంతటితో ఆగిపోలేదు. నీకై తన గుండెలో గురువు ఏర్పరచుకొన్న స్థానమును నీవు పదిలపరచుకోవాలి. దానికి గురు శుశ్రూష ఎంతయో ముఖ్యము. కావున నీ హద్దు మీరకుండా, అతిని ప్రదర్శించకుండా ఎంతో నెమ్మదితనముతో గురువునకు సేవ చేయవలసియుంటుంది.
గురు శుశ్రూషయా విద్యా పుష్కలేన ధనేనవాl
అధవా విద్యయా విద్యా చతుర్థం నోపపద్యతేll
తా: విద్యను అభ్యసించుటకు మూడు మార్గములు చెప్పబడినాయి.1. గురువును సేవించి అంటే తగినవిధముగా ఆయనకు సపర్యలు చేసి , 2. ఆయనకు పుష్కలమైన ధనమును ఇచ్చి ,3. తన దగ్గర ఉన్న విద్యను ఆయనకు నేర్పి ఆయన దగ్గర ఉన్న విద్య ను నేర్చుకోవడం (విద్య యొక్క ఆదాన ప్రదానములు అనగా ఇచ్చిపుచ్చుకొనుట) ఈ మూడు రకాలుగా తప్ప నాలుగో రకము లేదు అని నీతి శాస్త్ర వచనము. నీవు గమనించితే ఇందుకూడా సేవ శుశ్రూష ప్రథమ స్థానములో వుంది. చివరి రెండు ఇచ్చుకొంటి వాయనం పుచ్చుకొంటి వాయనం లాగా' కానీ సేవ చిరకాలమూ గురుశిష్యులిరువురిలోనూ గౌరవ, వాత్సల్య రూపములో మెదలుతూనే వుంటుంది.
ఇది పారలౌకిక జ్ఞాని విషయములోనైనా లౌకిక జ్ఞాని విషయములోనైనా మారదు.
మంచిని ఎంచు, మంచిని ఉంచు, మంచిని పెంచు, మంచిన మించు .
స్వస్తి.
**********************************
సమస్య
మనది - సలహా గీతది - 43
త్రికరణ
శుద్ధిగా నేను ఒక్క పని కూడా చేయలేదు. స్వార్థము నా కనులుగప్పి యున్నది. 'చిన్ని నా బొజ్జకు
శ్రీరామ రక్ష' అన్నదే నా మనస్తత్వము. చేయుచున్నది పాపమని
తెలుసు, మరి నిష్కృతి లేదా!
సలహా:
త్రికరణముల గూర్చి నీకు తెలుసునో లేదో నాకు తెలియదు. ఈ ‘త్రికరణము’ అన్న పదమును యాదృచ్ఛికముగా వాడినావని భావించి దానిని గూర్చి ముందు నాలుగు మాటలు ముందు చెబుతాను.
ఈ మాట
ఎందుకు చెబుతున్నాడు అని అనుకోకుండా కాస్త ఓర్పుతో గమనించు. శ్రీమద్ వాల్మీకి రామాయణం
కిష్కింధాకాండ 34వ సర్గ లో 12 వ శ్లోకము
కృతఘ్నతా లక్షణమును గురించి ఈ విధముగా చెబుతుంది.
బ్రహ్మఘ్నేచ
సురాపే ఛ చోరే భగ్నవ్రతే తథా!
నిష్కృతిర్విహితా
సద్భిః కృతఘ్నో నాస్తి నిష్కృతిః!!
బ్రహ్మ
హత్య చేసిన వానికి, సురాపానము చేసిన వానికి, దొంగతనము చేసిన వానికి, ఒక వ్రతము
చేయబూని మధ్యలో ఆపిన వానికి ప్రాయశ్చిత్తము ఉన్నది కానీ, కృతఘ్నునకు ప్రాయశ్చిత్తము లేదు.
అనగా
నీవు చేసిన పాపములలో కృతఘ్నత లేనంతవరకూ నీవు ప్రాయశ్చిత్తమునకై ప్రయత్నించివచ్చును
కానీ, నీకు మేలుచేసిన వానికి కీడు తలపెట్టనంతవరకు, నీకు స్వార్థము ఎంతవున్నా, చిత్త శుద్ధితో దానినుండి విముక్తి పొందవచ్చును.
దీనికి నీ నియము నిష్ఠ మిక్కిలి అవసరము. నియమము నిష్ఠ అన్నవి భగవదారాధనతో సమానము. భగవంతుని
పూజలో త్రికరణములు ఏకీకృతం అయితేనే ఆ ఉపచారం అయినట్లు. నోటితో చెప్పిన మంత్రం, చేతితో చేసిన ఉపచారం,
ఈ రెండింటినీ దర్శనం చేసిన మనస్సు – ఈ మూడూ ఏకీకృతం కావాలి.
లేకుంటే పూజాపత్రి దండుగే! కావున నేను చెప్పవచ్చేదేమిటంటే నీ స్వార్థ
ప్రయోజనములకోరకు చేసిన నీ పాప కార్య ఫలమునుండి విడుదల పొందవలెనంటే ముందు ఆత్మ విమర్శ ఆపై అన్యుల యందు ఆరాధనా భావము
అత్యవసరము. నీ మేలుకు ఎదుటి వానికి కీడు తలపెట్టకు.
వేలాది
విధముల జన్మల సత్కర్మల ఫలితంగా లభించిన ఉత్కృష్ట జన్మ మానవ జన్మ. కానీ ఆ జన్మ తన
కర్మ ఫలితము అనుభవించక తప్పదు. నీవు చేసిన పుణ్యకర్మ ఫలము ఎక్కువ మరియు పాప కర్మ
ఫలము అంతకన్నా తక్కువ ఉండుటచే నీవు మానవునిగా నైతే పుట్టినావు. కానీ ఈ జన్మలో ఆ
పాప ఫలితమును తగ్గించుకోవలసిన బాధ్యత నీదే! అందుకే మంచి వైపు మరలు. ఏ పని చేసినా
త్రికరణ శుద్ధిగా చేయి. జన్మ పావనం కావాలంటే ఆత్మసాధన అవసరం. ఆ సాధన సదాచరణతో
సిద్ధిస్తుంది. సత్సాంగత్యముతో వృద్ధిపొందుతుంది. దానినే ధర్మమార్గంలో సత్యాచరణ, సత్కార్య, ఆధ్యాత్మిక, అహింసాచరణగా అనేక విధాలుగా ఆచరించి
విమలంగా వెలయించి మహాత్ములైనారు ఎందఱో నాటి మానవులు. మానవుడి జీవన సంపూర్ణ వికాస
సద్గతికి, పునీత బుద్ధికి ప్రమాణమైన భగవద్గీతను లోకానికి
అందించి మానవులను తరింపచేసినారు శ్రీకృష్ణ భగవానుడు. ఆయనే సర్వేశ్వరుడు. ఆ
సర్వేశ్వరుడే సర్వాన్నిభరిస్తు సంసారమనే సమద్రాన్ని దాటించే ముక్తి దాత. పరమాత్మ ఈ
సందర్భములో 3వ అధ్యాయమయిన కర్మయోగాములో ఒక మాట అంటాడు.
యస్త్వింద్రియాణి
మనసా నియమ్యారభతే௨ర్జున |
కర్మేంద్రియైః
కర్మయోగమసక్తః స విశిష్యతే || 7-3
జ్ఞాపకముంచుము
జ్ఞానేంద్రియముల
తోడుగమనసును
దొరకబుచ్చుకొని
నిష్కామునివై
నిలచితివంటే
నీదేజయమగు
నిక్కము అర్జున
అర్జునా
! మనసుతో జ్ఞానేంద్రియాలను స్వాధీనంలో వుంచుకుని, కర్మేంద్రియాల ద్వారా నిష్కామకర్మ
చేస్తున్నవాడు ఉత్తముడు. ఎంత గొప్ప మాటో గమనించు.
నీవుచేసే
పనిలో, నీ పనికి సంబంధించిన సిబ్బందిని, చిన్న పెద్ద తారతమ్యములేక, బాధ్యతలప్పగించు.
వారిలో నన్ను ఈపనికి తీసుకోనలేదే అని వారు ఎన్నడూ బాధపడకూడదు.
ఇటుక
ఇటుక కలిస్తే ఇల్లు తయారౌతుంది
నీటిచుక్కలొకటైతే
నిండు సంద్రమౌతుంది
చేయి
చేయి ఒకటైతే చేయలేనిదేముంది
అందరు
ఒకటైనచో ఆనందం పండుతుంది
ఇది
మనసులో ఉంచు. నీవు బాగు పడు, నిను నమ్మినవారి బాగుకు పాటుపడు. నీ మనసుకు వద్దన్నా
ప్రశాంతత చేకూరుతుంది. నీవు జ్ఞానార్జనకు అడుగు ముందుకు వేసినట్లే! ఈ విషయములో
భగవంతుదేమంతున్నాడో గమనించు:
అపిచేదసి
పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః l
సర్వం
జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యసి l l 36-4
Even if you are the most sinful of all the sinners
you shall verily cross over all sin by the raft of knowledge.
పాపపు
పనులకె పరిమితమైనా
పరిమితి
గానక పాపము చేసిన
పశ్చాత్తాపమె
ప్రాయశ్చిత్తము
బ్రహ్మ
జ్ఞానమె పరమౌషధము 36-4
తెలిసినది
కదా! ఇటువంటి పనులలో ఆలస్యము కూడదు. ఈ వేదవాక్కు నీ మేజా పై ఉన్న గాజు ఫలకము
క్రింద వుంచుకో!
సర్వేపి
సుఖినస్సంతు
సర్వేసంతు
నిరామయా
సర్వే
భద్రాణి పశ్యంతు
మాకశ్చిద్దుఃఖభాగ్భవేత్
అంతా సుఖించాలి, అంతా వ్యాధిరహితులు కావాలి, అందరూ శుభాలను చూడాలి, ఏ ఒక్కడూ దుఃఖముచే బాధించబడరాదు. ఇంతకన్నా
మంచిమాట వేరొకటి ఉండదు ఇది పాటించు. అంటా నీకు జయమే!
స్వస్తి.
*******************************************
సమస్య మనది సలహా గీతది – 59
యుక్తాహారవిహారస్య
సమస్య: నేను విద్యార్థిని. ప్రాయములో ఉన్నవాడిని. ఆకలి ఎక్కువే! కనిపించినది తినవలేనాను చపలత కూడా ఎక్కువే! పుస్తకము పట్టుకొంటే నిద్ర వస్తుంది. పరిక్షలు దగ్గరకు వచ్చినాయి. కర్తవ్యము తెలిసినా సాధించే పట్టుదల క్షణములో నీరుకారి పోతూవుంది. పరిష్కారమేమయినా ఉందా!
ఎందుకుండదు. ‘కృషితో నాస్తి దుర్భిక్షం...’ అన్నారు పెద్దలు. ‘పట్టు వదులుకొంటే పడిపోతావు’ పట్టు వదలకుంటే పైకొస్తావు’ కొమ్ము తీసివేస్తే పైకి వస్తావు. ‘వాడికేమయినా కొమ్ములు వచ్చినాయా’ అంటారు, అంటే అంత పొగరు గలవాడా అని అన్వయము. కావున ‘పొగరు’ ను అణచివేస్తె నీలో కలిగేది అణకువ. అది పెరిగితే నీవు సాధించలేనిది ఉండదు. అది పెరగాలంటే నీ అలవాట్లలో కొన్ని తరగాలి. అందుకే ముందు జగద్గురువగు శ్రీ కృష్ణుడు నరునితో, అంటే అర్జనునితో అని మాత్రమే కాదు, నరుడు అంటే నీవు నేను కూడా, ఏమంటున్నాడో చూడు.
యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు ।
యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా ।। 17 -6 ।।
ఆహారము విహారము ఆపై చేష్టలు కర్మలు
నీ జాగృత్ స్వప్నమ్ముల నిబద్ధతను పాటించుచు
యుక్తమైన రీతి నీవు యోగ సాధనము జేసిన
చేరనీదు దుఃఖ తతిని చెంతకు నీ యోగ గరిమ
యోగమునకు ఎన్నో అర్థములను చేప్పుకొనవచ్చును. కానీ స్థూలముగా కలయిక, చేరిక, కూడిక అన్న అన్వర్థములను సంధించుకొనవచ్చును. ఆంగ్లములో సరియగు పదము లేదు కానీ ఈ సందర్భములో Total involvement అంటే ఏకాగ్రత అంచంచల శ్రద్ధ అన్న అర్థమును నేను సందర్భోచితముగా గ్రహించుచున్నాను.
ఈ యోగము అన్నివిధములగు బాధలకూ ఉపశమనము. ఈ యోగమునకు ఆహారము, విహారము, కార్యకలాపములు, స్వప్నములు, మెలకువ అత్యంత ముఖ్యమగు ఉపకరణములు. మన పనిలో తాదాత్మ్యము చెందుటకు ఈ విషయములన్నీ 'యుక్త'మగు రీతిలో అంటే క్రమబద్ధముగా ఉండుట అత్యవసరము. యోగము అన్నది ఏర్పడుతుంది. అంటే తాదాత్మ్యత కలుగుతుంది. అప్పుడు ఆ అనుభూతి ఏవిధమగు బాధకు కూడా తావివ్వదు.
మరి, ఒక విద్యార్థికి, ఒక యువకునికి, ఒక శ్రమజీవికి, ఒక కార్యాచరణ పరాయణునికి ఇంతకన్నా కావలసినది వేరేమి ఉంటుంది. అదుకే ఈ విధమగు నిబద్ధత, అంకితభావము, విధేయత తానూ తలపెట్టిన పనిపై యుండాలంటే మొదట వ్యక్తిలో ఉండవలసినది ఒక పరిధి అంటే ఒక కట్టుబాటుకు లోబడియుండుట. ఉదాహరణగా ఈ క్రింది నాలుగు మాటలను గమనించండి:
సిలెండరున ఉంటేనే గ్యాసు వంట చేస్తుంది
టాంకున నీరుంటేనే ట్యాపున నీరొస్తుంది
గిన్నెలోన బియ్యముంటె మనకు అన్నమొస్తుంది
కట్టుబాటులోనుంటే కలలు నిజము చేస్తుంది
వాస్తవము కన్నులముందు ఎంత చక్కగా ప్రస్ఫుటమౌతూవుందో గమనించండి.
ఇంకొక వాస్తవాన్ని చూడండి. బెంజమిన్ ఫ్రాంక్లిన్ (1706-1790), అమెరికా సంయుక్త రాష్ట్ర నిర్మాతలలో ఒకరు, ఆయన కేవలము స్వయం కృషి తో ఎదిగిన వ్యక్తి. తన వ్యక్తిత్వ వికాసమునకు 20వ ఏట నుండి డయరీ వ్రాసుకునేవాడు. 13 విషయాలలో తను వృద్ధి చెందుతూ ఉండాలని తన పనితీరుని ఆ డయరీ లో రాసుకునేవాడు.
అందులో మొదటి విషయం “Temperance: Eat not to dullness; drink not to elevation.” అంటే “పరిమితి: మరీ బద్దకము పెరిగిపోయే వరకు తినకు, నిషా నసాళమంటేవరకూ త్రాగకు"
Temperance. Eat not to dullness; drink not to elevation.
Silence. Speak not but what may benefit others or yourself; avoid trifling conversation.
నిగ్రహము: నీ మాట అటు నీకయినా ఇటు ఎదుటివారికయినా ఉపయోగ పడుతుందంటేనే మాటలాడు. అప్రస్తుత ప్రసంగము పనికిరాదు. అంటే వాకు పై నిగ్రహమెంత అవసరమో గమనించండి.
Order. Let all your things have their places; let each part of your business have its time.
అనుక్రమణిక: నీకు సంబంధించిన ప్రతి విషయమునకు సముచిత స్థానమును ఏర్పాటు చేసేది. ఏది ఎప్పుడు ఎట్లు చేయవలసినది నిర్దుష్ట సమయము ప్రకారము చేసేది.
Resolution. Resolve to perform what you ought; perform without fail what you resolve.
నిర్ణయము: చేసితీరవలసిన పనులను ముందు నిర్ణయించుకో! అవి నిరంతరాయముగా నెరవేర్చు.
Frugality. Make no expense but to do well to others or yourself; i.e., waste nothing.
పొదుపు: నీకయినా, పరులకయినా అవసరమును అనుసరించి ఖర్చుపెట్టు. వృధా ఖర్చు సదా చేటు.
Industry. Lose no time; be always employed in something useful; cut off all unnecessary actions.
శ్రమ: కష్టే ఫలి. సమయమును ఎపుడూ అందరికీ ఉపయోగమగు పనులలో గడుపు. అనవసరకార్యములలో సమయమును వ్యర్థ పరుచవద్దు. సమయము నీ కొరకు ఆగదు.
Sincerity. Use no hurtful deceit; think innocently and justly, and, if you speak, speak accordingly.
విధేయత: హృదయమును గాయపరచే మోసపు పనులు చేయకు. మాటలకు సందర్భశుద్ధి ఎంతో అవసరము.
Justice. Wrong none by doing injuries, or omitting the benefits that are your duty.
న్యాయము: ఇతరులను ఏ విధముగానూ గాయపరచకు. వారికి అందవలసిన ప్రయోజనమును అందించుట నీ బాధ్యత.
Moderation. Avoid extremes; forbear resenting injuries so much as you think they deserve.
మిత తత్వము: ‘అతి సర్వత్ర వర్జేత్’. హద్దు అతిక్రమించనంతవరకు సహనము పాటించు.
Cleanliness. Tolerate no uncleanliness in body, cloths, or habitation.
శుభ్రత: పరిసరములు, శరీరము, ఉడుపులు నిరంతరమూ పరిశుభ్రముగా ఉండవలసినవి.
Tranquility. Be not disturbed at trifles, or at accidents common or unavoidable.
ప్రశాంతత: పరిస్థితి ప్రమాదకరమైనా ప్రశాంతతను కోల్పోవద్దు.
Chastity. Rarely use venery but for health or offspring, never to dullness, weakness, or the injury of your own or another's peace or reputation.
పవిత్రత: కామవాంఛ అన్నది స్వాస్త్యము, సంతానము, నాకు తప్పించి వ్యసనము కాకూడదు.
Humility. Only a person who has passed through the gate of humility can ascend to the heights of the spirit.
అణుకువ: అణుకువ అన్న ద్వారబంధము గుండా ప్రవేశించినవాడే ఆత్మా స్వరూపమును అవగతము చేసుకోనగలడు.
అసలు ఈ పదమూడే కాదు. ఎన్నో విధములయిన నీతులు మనపూర్వులు నీతిశాస్త్రముగా మనకందించినారు. వశిష్ట, విశ్వామిత్ర, తార, మారీచ, విభీషణాది రామాయణేతిహాస పాత్రలచే మనకు ఎన్నో నీతి వాక్యములను వాల్మీకి మహర్షి అందజేసినాడు. ఇక వ్యాసులవారయితే చెప్పనే అవసరము లేదు. ఆయనకు ఈ కలియుగములో నీతి నియమములకు ఎంత ప్రాధాన్యత ఉన్నదో తెలిసినవాడు కాబట్టి భారతము లోని ప్రతి పాత్రతోనూ సమయోచిత నీతులను చెప్పించుతూనే వచ్చినాడు. మనమవి చదవము, తెలుసుకోము కాబట్టి, అమెరికా దిగుమతులపై మోజు కాబట్టి రూజ్వెల్ట్ గారి నీతిసూత్రావళి తెలియజేయవలసి వచ్చినది. ఏది ఎట్లయినా అందుబాటులోనికి వచ్చిన మంచిణి గ్రహించవలెను కదా!
మనము ముఖ్యముగా మన జీవన విధానమును సమీక్షించుకోవలసి ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లలపై తగు శ్రద్ధ చూపించుతున్నామా అన్నది తప్పక యోచించవలసిన విషయము. ఉపాధ్యాయులు పాఠ్యాంశములే కాక నీతి కథలు, మన పూర్వుల చరిత్ర, మన సంస్కృతి, రామాయణ, భారత, భాగవత కథలు, మన శాస్త్ర విజ్ఞానము మొదలగు అంశములను తప్పక పిల్లలకు తెలియజేయవలసిన బాధ్యతను తప్పక తీసుకొనవలెను. ఆవిధముగా మొక్క దశలోనే తగు మోతాదులో, సారవంతమైన భూమి, నీరు, ఎరువు ఏర్పాటు చేయుటవల్ల ఆ మొక్క మానై పత్ర పుష్ప ఫల ఛాయలను నిరంతరము తననాశ్రయించిన వారికి ఇస్తూనే వుంటుంది. ఇది మనము నేర్చుకోవలసిన పాఠము కాదా. పై శ్లోకము మొక్కకు కూడా అన్వర్తించుట లేదా!
అందువల్ల ఎవరి బాధ్యత వారు పాటించి, అనాదరించాకుండా అట్లని అతికి పోకుండా తగుమాత్రముగా మన బుద్ధి కాయములపై శ్రద్ధ జూపుచూ మనము చేయు కార్యముతో యోగమును సాధించితే మనము పొందలేనిది ఏదీ ఉండదు.
స్వస్తి.