కోడి
రామ్మూర్తి నాయుడు గారు
'కలియుగ భీమ' కోడి రామమూర్తి నాయుడుగారి జయంతి జనవరి
16.
ఇండియన్
హెర్కులస్' గా
బిరుదు గడించిన ఏకైక భారతీయుడు, అందునా ఆయన మన తెలుగువాడు, అందుకుతోడు
ఆయన గొప్ప దేశభక్తుడు. ఆయన ఎంతమంది ఆంధ్రులకు గుర్తున్నాడో నాకు తెలియదు. అందువల్ల
ఆ మహనీయుని గూర్చి తెలియని వారికొరకు ఆయనను పరిచయము చేయబూనుకొన్నాను.
క్లుప్తంగా
ఆయన గురించి:
కోడి రామ్మూర్తి
నాయుడు గారు జనవరి 16, 1882 న శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో జన్మించినారు. వీరి తండ్రి కోడి వెంకన్న
నాయుడు గారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి, తండ్రి
ప్రేరణతో విజయనగరంలో తన పినతండ్రి కోడి నారాయణస్వామి గారి వద్ద పెరిగినారు.
ఈయనకు
స్ఫూర్తి ఎవరివద్దనుంది లభించినదో నాకు తెలిసిరాలేదు కానీ ఆయనకు చిన్న వయసులోనే ఈ
కలపి మక్కువ ఎక్కువగా వుండినది. ఆయన అక్కడ ఒక వ్యాయమశాలలో చేరి దేహ ధారుడ్యాన్ని
పెంచుకోవడంతో పాటు కుస్తీ కూడా నేర్చుకున్నారు. 21 సంవత్సరాల వయసులోనే తన రొమ్ముపై
1 1/2 టన్నుల భారాన్ని మోసేవాడు. కాలాంతరములో 3 టన్నుల భారాన్ని కూడా మోయగలిగినాడు.
రాను
రానూ ఆయన ప్రతిభ మలయా మారుతమై దేశాముయోక్క నలుదిశలా ప్రసరించింది. సంయుక్త మద్రాసు
రాష్ట్రములోని ఆంద్ర ప్రాంతమునకు చెందిన ప్రముఖ వస్తాదు మరియు మల్లయోధులుగా అనతి
కాలములోనే గుర్తింపబడినారు వీరు. సంయుక్త మద్రాసు రాష్ట్రమని ఎందుకు వ్రాసినానంటే
ఆయనకు సాటి తమిళ ప్రాంతమున ఎవరూ లేరు అని తెలుపుటకు. ఈయన ఇరవయ్యో శతాబ్దపు తొలి
దశకాల్లో ప్రపంచ ఖ్యాతి గాంచిన దేహదార్ఢ్య ప్రముఖులలో అగ్రగణ్యులు.
ఆశ్చర్యకరమగు
విషయము ఏమిటంటే ఈయన కమ్మవాడయ్యును పూర్తి శాకాహారి. సాధారణ కాపు కుటుంబం లో జన్మించినవాడై
కూడా భారతీయ యోగ శాస్త్రానికి సంప్రదాయ మల్లవిద్యకు ప్రపంచ ఖ్యాతి తీసుకుని వచ్చిన
మహా ప్రజ్ఞావంతుడు. ఈయన శాకాహారులు. భారతీయ యోగశాస్త్రము. ప్రాణాయామము తో బాటూ జల, వాయుస్థంభన విద్యలను
శారీరక బలప్రదర్శనలకు జోడించి జగదేక మల్లుడయినాడు.
విజయనగరంలో
పొట్టి పంతులు అనే మిత్రుని సహకారంతో సర్కస్ కంపెనీ నెలకొల్పినాడు. తుని రాజాగారి
నుండి సంపూర్ణ సహకారం లభించింది. రామమూర్తి సర్కస్ సంస్థ పలుచోట్ల ప్రదర్శనలిచ్చి
మంచిపేరు తెచ్చుకున్నది. తెలుగు జిల్లాల్లో ప్రదర్శనల తర్వాత 1912లో మద్రాసు చేరినాడు.
పులులు, ఏనుగులు,
గుర్రాలు, చైనా, జపాన్
కళాకారుల సహకారం ఆయనకు లభించినాయి. రామమూర్తి ప్రదర్శనలు అందరినీ ఆకర్షించినాయి.
ఈయన
ప్రతిభ మాటలకు అందనిది. తన శరీరమునకు కట్టిన ఉక్కు గొలుసును, ఊపిరితిత్తులలో గాలిని నింపుకొని,
ముక్కలుగా తుంచి వేసేవాడు. రెండు కార్లను రెండు భుజాలకు ఇనుప గొలుసులతో కట్టించుకునేవాడు.
కార్లను శరవేగంతో నడుప accelerator ను బలముగానొక్కమనేవాడు. driver seat లో కూర్చున్నవారు దానిని ఎంత
బలముగా నొక్కినా కార్లు కదలకుండా పోయేవి. రొమ్ముపై పెద్ద ఏనుగును ఎక్కించు కునేవాడు. 5 నిమిషాల పాటు, రొమ్ముపై ఏనుగును అలాగే ఉంచుకునేవాడు.
పూనాలో
లోకమాన్య తిలక్ గారి కోరిక మేరకు ప్రదర్శనలిచ్చాడు. తిలక్ రామమూర్తిగారికి 'మల్లమార్తాండ', 'మల్లరాజ తిలక్' బిరుదములిచ్చారు. వారి ప్రదర్శనలను ప్రజలు
తండోపతండములుగా చూచేవారు. దీనిని గమనించిన బాల గంగాధర తిలక్ గారు
విదేశాలలో
భారత ప్రతిభను ప్రదర్శించమని ప్రోత్సహించినారు. ఆవిధముగా ఆయన ప్రోత్సాహముతో కోడి
రామమూర్తి గారు విదేశములలో కూడా ఎన్నో ప్రదర్శనలను ఇచ్చినారు.
అప్పటి
వైస్రాయి లార్డ్ మింటో, రామమూర్తి గారి ప్రదర్శనలను చూడవలెనను ఆకాంక్ష వ్యక్తము చేస్తూ ఆదేశామునిచ్చి
తన అధికారిని పంపగా ఆయన వచ్చి , రామమూర్తి గారు ఆంజనేయ ఉపాసనలో వుండినందున పది నిమిషాలు
వేచియుండి ఆయనకు మింటో గారి మనోరథమును తెలియజేసినారు.
అందుకాయన వల్లెయనగా ఆ సందేశమును ఆతడు మింటో గారికి అందజేసినాడు.
రామమూర్తిగారి
ప్రదర్శనాసమయము రానేవచ్చింది. రామమూర్తి గారి
ప్రదర్శనలను చూచి అప్రతిభుడైనాడు మింటో! అసలు ఆయనను తానే పరీక్షించవలె ననుకుని తన కారును
ఆపవలసిందని కోరాడు. కారులో కూర్చుని లార్డ్ మింటో కారును నడపసాగాడు. త్రాళ్ళతో కారును
తన భుజాలకు కట్టుకున్నాడు. అంతే, కారు ఒక అంగుళము కూడా కదలలేక పోయింది. ఈ సంఘటనతో వైస్రాయి ప్రశంసలను,
దేశవిదేశములందు అఖండ ఖ్యాతినీ సంపాదించాడు రామమూర్తి నాయుడు.
ఈయనను
పండిత మదనమోహన మాలవ్య గారు కూడా ఎంతగానో మెచ్చుకున్నారు. విదేశాలలో ప్రదర్శనలివ్వమని
ప్రోత్సహించినారు.
లండన్
లో రాజదంపతులు కింగ్ జార్జి, క్వీన్ మేరి, రామమూర్తిగారి
ప్రదర్శనలను చూచి తన్మయతాకు లోనయినారు. రామమూర్తిగారిని తమ బక్కింగి హామ్ రాజభవనానికి
ఆహ్వానించి, విందు ఇచ్చిన తర్వాత 'ఇండియన్
హెర్కులస్' బిరుదుతో ఆయననుసత్కరించినారు. ఆ విధంగా బ్రిటిష్ రాజదంపతులచే, గౌరవింపబడిన భారతీయులలో మొదటి వాడు కోడి రామమూర్తి నాయుడు గారు. రామమూర్తి
గారు ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ వంటి దేశాలలో కూడా పలు ప్రదర్శనలిచ్చి అనేకానేక
పురస్కారములను అందుకొన్నారు.
ఇక్కడ
స్పెయిన్ లో జరిగిన Bull Fight ను గూర్చి చెప్పితీరవలసినది ఒక మాట ఉన్నది.
స్పెయిన్
దేశంలో 'కోడె
పోరాటం' (బుల్ ఫైట్) చాలా ప్రసిద్ధమైనది. ఇది చాల భీకరంగా ఉంటుంది. పాల్గోన్నస్వారి ప్రాణములు
పోయిన దాఖలాలు కూడా ఎన్నో వున్నాయి. రామమూర్తి గారిని ఆ పోరులో పాల్గొనమన్నారు
అక్కడి వారు. అట్టి పోరాటంలో ఏలాటి అనుభవంలేని
రామమూర్తిగారు తల వంచని వీరుడు కావున ‘సరే’నన్నారు. రామమూర్తిగారు రంగంలో దుకి దూసుకుని వస్తున్న ఆ పొగరుమోతు కోడె కొమ్ములను పట్టుకుని క్షణాల్లో క్రింద పడవేసిన
మేరు నగధీరుడాయన. ప్రేక్షకుల హర్షధ్వానాలతో ఆ ప్రదేశము మారుమ్రోగింది.
కోడి
రామమూర్తిగారు కోట్లు గడించినారు. ఆయన మహా దాత. తన స్డంపాదనను అధికాంశము దాన
ధర్మాలకు, జాతీయోద్యమాలకు
ఖర్చు చేసినారు. రామమూర్తిగారి ప్రశంసలు ప్రతిరోజూ పత్రికల్లో వెలువడేవి. భారతదేశం
అంతటా రామమూర్తిగారి పేరు ప్రతిధ్వనించింది.
తెలుగువాడయిన
ఈ మల్లయోధుడు ప్రపంచ ఖ్యాతిని తన స్వంతము గావించుకొన్న అశేష శేముషీధురీణుడు. హైదరాబాద్
లో ఆంధ్రభాషా నిలయం పెద్దలు ఘనసత్కారం చేసి ఈయనకు ‘జగదేకవీర’ బిరుదమిచ్చినారు.
ఆయన అసమాన
శక్తి, అజరామర
కీర్తి కొందరికి అసూయ కలిగించడంతో ఆయనపై దుర్మతులు కొందరు హత్యాప్రయత్నాలు కూడా చేసినారు.
లండన్ లో ఎదపై చెక్కపలకను పెట్టుకొని ఏనుగును ఎక్కించుకొన వలసిన సమయములో ఒక ద్రోహి బలహీనమైన చెక్కను ఆయన ఛాతిపై పెట్టగా
ఏనుగు ఎక్కగానే చెక్క విరిగి దాని ముక్క ఆయన పక్కటెముకల లోనికి దిగబడుట జరిగినది.
శస్త్రచికిత్స చేయించుకొని రెండు నెలలపాటు ఆయన లండన్ లోనే ఉండిపోవలసి వచ్చింది. మరొకసారి
రంగూన్ లో కూడాదుండగులు కొందరు ఆయనపై హత్యాప్రయత్నము చేయబోగా, ఆవ్యక్తులను
చితకబాది, సురక్షితంగా ఆయన బయటపడటం జరిగింది.
గుజరాతు
లోని మాల్కానగరములో అయితే, భారతంలో భీమునివలె
విషప్రయోగాన్ని కూడా ఆయన ఎదుర్కొన్నారు. ఆదేశాన ఒక విందులో ఆయనకు విషము కలిపిన పాలు
ఇచ్చినారు. ఆయన గుటగుటమని అది త్రాగి బ్రేవ్ మని త్రేన్చి విషాన్ని జీర్ణించుకొని మూత్రం
ద్వారా విష మలినమును విసర్జించినారు. అప్పుడు
ఆయనను కాపాడినది యోగ విద్యయే!
కీ.శే.
మేడేపల్లి వరాహనరసింహస్వామిగారు రచించిన దానిని బట్టి రామమూర్తిగారు కాలిపై రాచపుండు
లేచినందున కాలుతీసివేయవలసి వచ్చింది. శస్త్ర చికిత్స జరిగినప్పుడు ఎటువంటి మత్తుమందును
(క్లోరోఫామ్) తీసుకొనలేదు. ప్రాణాయామము చేసి నిబ్బరంగా వుండిపోయినారు.
సేకరించిన
ధనము పలువిధములుగా కరిగిపోయింది. 1942 జనవరి
భోగి పండుగ.. ఆ రోజు రాత్రి ఆయన వెంట ఉన్నది ఒకే ఒక శిష్యుడు. ఆయన విజయనగరానికి చెందిన
కాళ్ల పెదప్పన్న. ఆ రాత్రి కొంచెంసేపు తలపట్టమని శిష్యునికి చెప్పి, తాను లేచేవరకు
లేపవద్దని చెప్పి పంపినారు నాయుడు గారు. మరునాడు
సంక్రాంతి. కాని ఆయన నిద్ర లేవలేదు. సంక్రాంతితోనే జీవితానికి సమాప్తి. బహుశ
ఇంద్రునికి ఆయన కళానైపుణ్యము
చూడవలేననిపించినదేమో!
తెలుగు
నాడునకు మాత్రమే కాకుండా యావత్ భారతమునకు ప్రపంచమునకు కీర్తినార్జించిపెట్టిన
ధ్రువతార శ్రీ కోడి రామూర్తి నాయుడు గారు.
స్వస్తి.