Tuesday, 17 July 2018
కార్య శూరత (Management Science)
Sunday, 15 July 2018
వాస్తవము --THE FACT
Monday, 9 July 2018
గురు శిష్య సంబంధం
గురు శిష్య సంబంధం
https://cherukuramamohan.blogspot.com/2018/07/blog-post.html
'గురువు' అన్నమాటకు అర్థము ఆంగ్లమున
Teacher అన్న పదము వలె సంకుచితమగు అర్థము కలిగినది కాదు.
చెప్పే చదువు కానీ, చేసే పనికానీ, నడచుకొనే
నడవడికగానీ, తన వర్ణాశ్రమ ధర్మమును పాటించుటయందుగానీ,
వివాహాది నిర్ణయములందుగానీ, అది ఇది అననేల
జీవితమున ఎదురగు ప్రతి సందేహమును తీర్చి చకని సలహాలిచ్చే వ్యక్తి గురువు.
తల్లి,దండ్రి, భార్య,
భర్త, అన్న, తమ్ముడు,
స్నేహితుడు, ఈ విధముగా వీరంతా ఏదో ఒక రూపములో
మనకు గురువులే! వీరేకాదు పశుపక్షి జలచారాదులను చూసికూడా చూసి నేర్చుకోనవలసినది
ఉంటుంది. అందుచేత దేనినీ తృణీకార భావముతో చూడరాదు. సద్విషయమును దేనినుండి అయినా
గ్రహించుట ఒక సద్వర్తనుని బాధ్యత.
గురువు
నేర్పు విద్య గుమ్మటమ్మున వెల్గు
గురువు
లేని విద్య గుడ్డి విద్య
గురువు
లేనివాడు గురిలేని బాణమే
రామమోహనుక్తి
రమ్యసూక్తి
సనాతన ధర్మము విశిష్ఠమైనది విలక్ష్నమైనది కూడా! ఇందు
తెలియజేయని లౌకిక పారలౌకిక విషయములు వాని విశ్లేషణ వివరణాత్మక నిరూపణ వేరు ఎక్కడ
కూడా చూడము అది ఏ ధర్మమైనా సరే ఏ మతమైనా సరే! ఈ ధర్మమునకంటే సనాతనమై కూడా అధునాతన
జీవన విధానమునకు అనుగుణముగా తానూ పరివర్తన చెందుతూ తన అనుయాయులను
ఋుజుమార్గములో నడిపించుటకు అనుక్షణము తానూ
సంసిద్ధముగా వుంది. బాధ అంతా ఆచరణ లేక అనుసరణ లోనే! మనకు మనమే ఎన్నో అవరోధాలు, అనుమానాలు
సృష్టించుకొని ఆదినుండి విశ్వవ్యాప్తమగు ఈ ధర్మమును, ఈ
ధర్మమునకు పునాది యగు వేదమును నిరసించి దూషించి ద్వేషించున్నాము. ఎందుకంటే వేదము
యొక్క ఔన్నత్యమే మనము మరచిపోయినాము.
మనం మరిచిపోయింది వేదాలను కాదు, ఒక
మహా జాతి వైభావాన్ని. వేదాలు సమస్తం జ్ఞానానికి మూలము విదేశీయులు చెప్తున్నారు. తమ విజ్ఞానమునకు
వేదమే పునాది అని ఎందఱో ప్రపంచ ప్రఖ్యాత పాశ్చాత్య సైంటిస్టులు చెప్పుకొన్నారు.
వారిలో ఐన్ స్టీన్ కూడా ఒకడు. కొందరిని మాత్రమే ఉదహరిస్తూవున్నాను.
1. Albert Einstein, American scientist: "We owe a lot
to the Indians, who taught us how to count, without which no worthwhile
scientific discovery could have been made."
2. Schopenhauer, "From every sentence (of the
Upanishads) deep, original and sublime thoughts arise, and the whole is
pervaded by a high and holy and earnest spirit...."In the whole world
there is no study so beneficial and so elevating as that of the Upanishads.
They are destined sooner or later to become the faith of the people."
Schopenhauer, who was in the habit, before going to bed, of
performing his devotions from the pages of the Upanishads, regarded them as:
“It has been the solace of my life -- it will be the solace of my death."
3. Lord Warren Hastings (1754-1826),
was the first governor general of British India:
He wrote with a prophetic and resounding pronouncement on the whole
body of Indian writings: "The writers of the Indian philosophies will
survive, when the British dominion in India shall long have ceased to exist,
and when the sources which it yielded of wealth and power are lost to
remembrances."
3. Lord Warren Hastings (1754-1826),
was the first governor general of British India:
He wrote with a prophetic and resounding pronouncement on the whole
body of Indian writings: "The writers of the Indian philosophies will
survive, when the British dominion in India shall long have ceased to exist,
and when the sources which it yielded of wealth and power are lost to
remembrances."
4. Repelled by the increasing materialism of the West,
Emerson turned to India for solace: "The Indian teaching, through its
clouds of legends, has yet a simple and grand religion, like a queenly
countenance seen through a rich veil. It teaches to speak truth, love others,
and to dispose trifles. The East is grand - and makes Europe appear the land of
trifles. ...all is soul and the soul is Vishnu
5. Wilhelm von Humboldt (1767- 1835) Prussian
minister of education, said about Bhagavatgita that "
this episode of the Mahabharata was the most beautiful, perhaps the only true
philosophical song existing in any known tongue ....perhaps the deepest and
loftiest thing the world has to show."
ఈవిధంగా పైన తెలిపినవారే కాకుండా ఈ దేశమును, వేదములను,
భగవద్గీతను తమ తమ గురువులుగానెంచి పొగడినవాళ్ళు అనేకానేకులు
వున్నారు.
రెండవ ప్రపంచ యుద్ధములోని అక్ష రాజ్యములలోని ప్రధాన రాజ్యమయిన
జర్మనీ నియంత, మిత్ర పక్షాలలో ప్రధానమయిన బ్రిటనుకు పరాధీనయై పనిచేయుచున్న భారత దేశ వేదసంపదను గుర్తెరింగి
ఇచ్చటి ఒక మహా వేదపండితుని తన గూఢచారుల సహాయముతో జర్మనీకి రప్పించుకొని ఏవిధముగా తన అణ్వస్త్ర సంపదను అభివృద్ధి
చేసుకొన్నాడో అచటి పార్లమెంట్ The German Bundestag భవనము
మనకు చెప్తుంది.. ఫ్రంక్పర్ట్ యూనివర్సిటీ మనకు చెబుతుంది.
హిట్లరంతటి వాడు గురుత్వముంచిన ఆ మహానుభావుని పేరే బ్ర.శ్రీ.వే. దండిభట్ల
విశ్వనాధ శాస్త్రి గారు.
ఒక్క యజుర్వేదమే నాలుగు ముఖములుగా, నాలుగు
రూపములలో అవగతమవుతుంది అని పెద్దలు చెబుతారు. వాటిని ఆపోశనము పట్టినవాడు ఈ మహానుభావుడు.
అంతటి సమున్నత ప్రతిభావంతులు కాబట్టే హిట్లర్ ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఆయనను
జర్మనీకి రప్పించుకొన్నారు.
మిగిలినది రేపు.........
గురు శిష్య సంబంధం - 2
రాజమహేంద్రవరం లో వ్యాకరణశాస్త్ర పండితులుగా పేరుపొందిన ఈ
దండిభట్ల విశ్వనాథశాస్త్రి గురించి ఇప్పుడు తెలుసుకొందాము. ఇందిరాగాంధీ
ప్రధానమంత్రిగా ఉన్నరోజుల్లో పశ్చిమ జర్మనీకి పంపిన రాయబారికి అక్కడి అధికారులు తమ
కార్యాలయములను దర్శింప జేయుచుండగా ఓ చోట ఒక సనాతన భారతీయ విప్రవర్యుని ఛాయా చిత్ర
పటము కనిపించింది. విస్మితుడైన ఆరాయబారి ఆయన ఎవరు అని జర్మనీ అధికారులను
అడుగుటతో వారు అతనికి బ్ర.శ్రీ.వే.
దండిభట్ల విశ్వనాథశాస్త్రి గారిని గూర్చి విపులముగా చెప్పవలసి వచ్చినది.
తొలి ప్రపంచ యుద్ధం అణగారి పోవుట, జర్మనీలో కెయిజర్ ప్రభుత్వం
పతనమగుట, ప్రపంచమంతా ఆర్థికమాంద్యము నెలకొనుట మనకు ఎరుకపడిన
అంశాలే! ఆ యుద్ధమునందు బందీలయిన
వేలాదిమంది జర్మనీ సైనికుల్లో ఒకరు హిట్లర్. ఆయన ఆ అవమానమును దిగమింగుకోలేక,
ప్రపంచ జాతుల్లో తనదే గొప్పజాతన్న తన విశ్వాసమును పుష్టి చేయదలచి,
తమ జాతి ఆధిపత్యమును నిరూపించదలచి ఆయన నాజీ పార్టీ స్థాపించి,
వైజ్ఞానికంగా, పారిశ్రామికంగా జర్మనీది
పైచేయిగా మార్చడానికి ఎన్నో సంస్కరణలు ప్రారంభించినారు. అదే రీతిలో కొత్త కొత్త
మారణాయుధాల అన్వేషణ ప్రారంభించినారు. సంస్కృతము తమ జాతి మూలభాష అని తాను నమ్మి
సంస్కృత భాషాధ్యాయనము పట్ల జర్మన్లకు ఆసక్తి
పెంపొందించినారు. భారతీయ వేద-శాస్త్ర వాఞ్మయములలో
మారణాయుధముల రహస్యములు దాగియున్నవని ఆయన గ్రహించి,
సంస్కృత
సాహిత్యాన్ని తమప్రజలకు అర్థమయ్యేలా అనువదింపచేసినారు. ఆ విధంగా తొలిసారిగా
ముద్రణకు నోచుకొన్న ఆ వాజ్ఞ్మయము నుండి జర్మన్లు లబ్ధిపొందడానికి గట్టిచర్యలు తీసుకొన్నారు. అయితే యుద్ధ పరికరాలు, ఆయుధాల
నిర్మాణానికి సంబంధించిన రహస్యాలను వేదశాస్త్ర వాజ్ఞ్మయము నుండి విడమరిచి
చెప్పేవారికోసం ఆయన అన్వేషణ సాగిస్తూనే వచ్చినారు. అదే సమయంలో దండిభట్ల
విశ్వనాథశాస్త్రి గురించి తెలుసుకున్న హిట్లర్ గుప్తచరులు ఆయన కోసం భారత దేశములో
అన్వేషణ ప్రారంభించినారు.
దండిభట్ల విశ్వనాథశాస్త్రి గారు తమ ఇంటికి వచ్చేవారితో
నిత్యం శాస్త్ర విషయాలపై చర్చలు జరిపేవారు తప్ప లౌకిక విషయాలను పట్టించుకొనేవారు
కారు. ఒకానొక దినమున ఆయన విశాఖపట్టణపు
సమీపానవున్న కొత్తవలస దగ్గర ఒక పల్లెటూరికి వెళ్లవలసి వచ్చింది. ఆ కాలములో
బస్సుల వసతి తక్కువ. వ్యక్తులలో దార్ఢ్యము ఎక్కువ. అందువల్ల ఊళ్ళు వెళ్ళుటకు
కాలినడకను ఉపయోగించేవారు. ఆ విధంగా వారు వెళుతూవున్న సమయంలో హిట్లర్ గూఢచారులు
ఆయనను సమీపించి ప్రతిఘటనకు తావులేని రీతిలో
ఆయనను అక్కడినుండి ముందుగా విశాఖపట్నానికి, తర్వాత కలకత్తాకు
ఆపైన జర్మనీకి తరలించినారు. ప్రతిఘటన వుండినదా లేదా అన్నది నాకు తెలియని విషయము.
దండిభట్ల గారు జర్మనీ చేరుకొన్న సమయానికి
రెండో ప్రపంచ యుద్ధానికి (1939-1945) రంగం సిద్ధమయి వుంది.
బాంబులు మిక్కుటముగా తయారుచేస్తున్నారు కానీ నిలువ
చేయుటలో ఏర్పడు వత్తిడికి అవి ప్రేలిపోతూవుండుటతో
విపరీతమైన ధన జన అస్త్ర నష్టము సంభవించేది. తమ దీన స్థితిని వివరించి వేదములనుండి
తగిన ఉపాయమును సూచించమని అర్థించినారు. హిట్లరు గుణగణములు తెలియని శాస్త్రిగారు
ఆర్త రక్షకుడై యజుర్వేదం నుండి ఆ సమస్యకు
పరిష్కారం సూచించినారు. వారి సలహా ఫలించింది. సైనిక దళపతులు దానితో ఆయనకు
బ్రహ్మరథము పట్టినారు. అప్పటినుండి ఆయన వారికి పరమ పూజనీయులైనారు.
తన వేదపాండితీ ప్రకర్షచే జర్మనులకు తనవంతు సహకారం అందించి
జర్మనీ పురోభివృద్ధికి ఇతోదికముగా పాటుబడినారు. కానీ వారు తర్వాత కాలములో
తిరిగీ భారతదేశమునకు రాలేక పోయినారు. కారణములు
నేను చదివిన మేరకు పెద్దలద్వారా విన్నమేరకు తెలిసిరాలేదు.
దండిభట్ల వారు జర్మనీకి పోయినప్పటి నుండి వారి సతీమణికి
మూడువందల రూపాయల సొమ్ము ప్రతినెలా అందేదని వినికిడి. ఆయన మరణం తర్వాత కుటుంబ
భృతిగా తొంభై రూపాయల వంతున వారి శ్రీమతికి అందేదట. ఆ తరువాత
ఎప్పుడు ఆగిపోయింది అన్నది మనకు ఊహకు అందని విషయము.
వేదమూర్తులగు దండిభట్ల వారు దేశానికి దూరమైనా, తర్వాత
కాలములో దేశ స్వాతంత్ర్యము వచ్చినా, అటు దేశము, ఇటు రాష్ట్రము కూడా ఆయనను వెనుకకు తెప్పించే ఆలోచన చేయలేదు. అసలు అటువంటి
ఒక మహనీయుడు ఆంధ్రుడై రాజమహేంద్రి లో నివసించినాడు అన్న విషయమునే పట్టించుకొని
వుండరు. కానీ జర్మనులు మాత్రం ఆయనను
తమవానిగా, మాననీయునిగా, మహనీయునిగా
ఇప్పటికి జర్మనీలో పార్లమెంట్ లోని , విదేశాంగ శాఖ కార్యలయంలో,దండిభట్ల వారి చిత్ర పటమును ఉంచుకొనుట వారి కృతజ్ఞతా హృదయమునకు, వారి పై గురుత్వమునకు వేదము పై భారత దేశము పై గౌరవ భావమునకు మనము
ధన్యవాదములు చెప్పవలసి వుంటుంది.
అది మన జ్ఞాన సంపద, అది మన జాతి వైభవం.
అటువంటి వేదాలను, వేదా విజ్ఞానాన్ని నాశనం చెయ్యాలని ఎందరో
ప్రయత్నిస్తూనే ఉన్నారు. మనము కూడా వారి నికృష్ట కార్యములకు మన మూఢ జ్ఞానమును
జోడిచి మన సంస్కృతిని, మన వేదములను, మన
సంస్కృతమును అవహేళన చేస్తూ అవనత శిరస్కులమై అవమానముల ఊబిలో కూరుకొని యుండుటకే
ఇచ్చగించుచున్నాము. గుర్తుపెట్టుకోవలసినది ఏమిటంటే భారతదేశం అంటే ప్రపంచానికి జ్ఞాన జ్యొతి,
మనము పాలు త్రాగిన రొమ్మునే గుద్దుతూ వున్నా,
ఆతల్లిని ఆదరించే సంస్కారవంతులు విదేశాలలో వుండుటయేగాక అంకిత భావముతో ఆ తల్లి బిడ్డలపై
గురుత్వముతో, సేవ చేస్తున్నారు. గురుత్వమును గురించి దాని
ప్రయోజనమును గురించి చెబుతూ ఈ మహనీయుని తలపోయుట జరిగినది. ఇక తిరిగీ అసలు
విషయమునకు వస్తాము.
మిగిలినది మరొకమారు .........
గురు శిష్య సంబంధం - 3
మన సాంప్రదాయములో విడాకులు (Divorce) అన్న మాట
లేదు. సంసారము అన్నది మోక్షసాధనకు ఆలంబన గా గుర్తింపబడినది. భార్యకు భర్తకు
నిర్దుష్ఠమైన బాధ్యతలు నిర్దేశించబడినవి. పిల్లల పెంపకమును గూర్చి చెప్పబడినది.
దశల వారీగా వారి దిశలు నిర్దేసించబడినవి. అవే బాల్య యౌవ్వన కౌమార వార్ధక్యములు. ఈ
విమర్శ, ఈ వివరణ,
మతములు అని చలామణి అగుచున్న వేరు ఎందునూ కానరాదు. అనాది
నుండి పునాది కల్గిన ఈ ధర్మము యొక్క పటిష్ఠత వానిలో లేదు.
మన మను ధర్మ శాస్త్ర ప్రకారము ముందు తల్లి, తరువాత
వరుసగా తండ్రి గురువు దైవము వస్తారు. ఆ మాటకొస్తే మొదటి ముగ్గురూ గురువులే! తల్లి
గురువై పరిసరాలను చూపుతుంది. పెద్దలపై గౌరవము, దేవునిపై
భక్తి కలిగింపజేస్తుంది. తండ్రి గురువై
లోకజ్ఞానాన్ని, సంఘాన్ని, సాంప్రదాయాలను,
పరిచయం చేస్తాడు. లౌకిక విద్యకు తానాదిగురువై నిలుస్తాడు. కావున
వీరిరువురు గురుతుల్యులుగా భావింపబడితే ఇక అసలు గురువు జీవితములో ప్రవేశిస్తాడు.
సక్రమమైన గురువు వద్ద ప్రవేశపెట్టే బాధ్యత తండ్రిదే. నేడు తల్లిదండ్రులు ఉభయులూ
చదువుకొన్న వారే కాబట్టి ఆ బాధ్యత ఇరువురూ తీసుకొంటున్నారు. అట్టి గురువును
తొలుదొలుత తలచుకోవలసిన బాధ్యత మనకెెంతయో వుంది. అందుకే పాఠశాలలో దినచర్య
గురువందనముతో ప్రారంభించవలసి వుంటుంది. విద్య నేర్చుకునేటంత కాలమూ, ఆపైన జీవితాంతము గురువును తలచుకోవలసినదే! ఆ గురువందనమునకు ఊతకర్రయే ఈ
శ్లోకము.
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైః శ్రీ గురవేనమః
ఇక్కడ ‘బ్రహ్మా’ అన్న పదము శ్లోకమునకు మొదట ‘బ్రహ్మ’ అన్న
పదము శ్లోకమునకు చివర అంటే శ్లోకములో రెండు పర్యాయములు వస్తూ వున్నాయి. మొదటిదయిన
బ్రహ్మ కు దీర్ఘము వుండాలి ఆయన ఈ ప్రపంచమును సృష్టించిన బ్రహ్మ. రెండవ బ్రహ్మ కు
దీర్ఘము ఉండకూడదు. ఈ బ్రహ్మ ‘ఆ బ్రహ్మావిష్ణుమహేశ్వరులసృష్టికర్త’ దేవుడు ఒక్కడే
అంటారు కదా! ఆయనే ఈయన. కావున వేదాలు ప్రతిపాదించినది ఒకదేవునే. కానీ ఆయనను ఏ
రూపములోనైనా పూజించి అనుగ్రహము పొందే వెసలుబాటు ఈ వైదిక ధర్మమునకు మాత్రమే వుంది.
ఒక మునిసిపల్ కార్యాలయము వుంది అనుకొందాము. మన పని జరుగుటకు నేరుగా మునిసిపల్
కమీషనరు వద్దకు పోము. అంచలంచలుగా పోతాము. ఈ అంచలంచలే మనకు ఇష్టమైన దేవుళ్ళు.
దేవునికి రూపమును ఏర్పరచి మనకు ఇష్టమగు రూపమును పూజించుతాము. ఇతరమతములలో దైవమంటే
వెలుగు. అది వారు స్వంతముగా చెప్పినదికాదు. అది వేదం వాక్యమే. సామాన్యునికి
అర్థమగుటకు పరమాత్మ సూర్య మండల స్థితుడై వున్నాడు అని చెప్పినారు. మన బాగోగులన్నీ
ఆయనవే. ‘ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్’ అన్నది మన శాస్త్రము. అందుకే రోజూ ఉదయాన సూర్యుని
వైపు తిరిగి శ్రద్ధ కలిగినవారు గురువు మూలముగా నేర్చుకొని సూర్య నమస్కారాలు
చేస్తారు. ‘cooling lenses’ లేకుండా సూర్యుని చూడగలమా! ఆయన వేడి భరించగలమా! మనకు
కనిపించేది సూర్య మండలమే! దానినే సూర్యుడు అంటున్నాము. కొందరు అదేమన్నా దేవుడా అoటూవుంటారు.
అందులో వసించువాడు పరమాత్మ. ఆయన ‘సవిత’ అన్న కాంతి శక్తిని మనకు ప్రదానము
చేస్తున్నాడు. కాబట్టి సర్వాంతర్యామి, ఆయన మనకు కనిపించే
దైవము. ఈ మాటనే ’ఎందెందు వెదకి చూచిన అందందే కలడు’ అన్న భాగవత పద్యము పుష్టి
చేస్తుంది. అందుకే ఈ సర్వాంతర్యామిని ఆయనను గూర్చి మరియు అనేకములైన లౌకిక
విషయములను గూర్చి చెప్పే గురువునకు మనసా వాచా కర్మణః నమస్కరించమంటుంది వేదము.
వేదము: తస్మాద్యత్ పురుషో మనసాభిగచ్ఛతి
తత్ వాచా
వదతి తత్ కర్మణా కరోతి
కానీ నేడు ఈ హైందవ సమాజములో ఎక్కువగా జడత్వము నిండియున్నది.
మంచి చెడ్డల విచక్షణ లేదు, మనము చేసే పని సమాజమునకు ఉపయోగపడుతుందా అని
యోచించే తీరుబాటు లేదు. 10 రూపాయలు పెట్టుబడి పెడదామా 10 లక్షలు సంపాదిద్దామా అన్న
ఆలోచన తప్ప. వీరికి మార్గము ముఖ్యము కాదు ధ్యేయము ముఖ్యము. అందువల్ల ఎవరైనా చెబితే
వినే ఓపిక సన్నగిల్లి పోయింది.
మారోజులలో ఎక్కువమందికి తల్లిదండ్రులపై మమకారము మరియు
గౌరవము,
పెద్దలముందు వినయము విధేయత, గురువుల ఎడ నమ్రత,
బందుజనులపై ఆదరము ఆప్యాయత, అతిథులముందు అణిగి
మణిగి యుండుట, మొదలగు సత్వగుణములు అనేకములు. దానికి తోడు
నాటి చందమామలు, బాలమిత్రలు, చెడు పై
మంచి జయించే అనేక పౌరాణిక జానపద చలన చిత్రములు మొదలగునవెన్నో కారణములు. నేటి
సమాజమునకు ఆ శక్తి లేదు, ఆసక్తీ లేదు.
చిత్రమయిన విషయము ఏమిటంటే ఒక 2౦౦౦ వెల సంవత్సరములకు పూర్వమే
ఈ పరిస్థితి మహానుభావుడు భర్తృహరి అనుభవము లోనికొచ్చింది. అందుకే ఆయన ఈ విధముగా
అన్నాడు.
మిగిలినది మరొకమారు……
గురు శిష్య సంబంధం – 4
బోద్ధారో మత్సరఃగ్రస్తా
ప్రభవః సమయ దూషితః
అభోదోపహతాశ్చాన్యే
జీర్ణమంగే సుభాషితం
ఏమన్నాడంటే, విద్వాంసులకు చెబుదాము
వారయితే కష్టము లేకుండా తెలుకొంటారు అనుకొంటే మాకన్నీ తెలుసు నీవు చెప్పనక్కరలేదు
అని పొగరుగా సమాధానము ఇస్తారు. రాజులు, ధనవంతులు, వ్యాపారవేత్త(Industrialists)లకు చెబుదామంటే తమ
సమయము అమూల్యమంటూ దానికి లెక్కలు కట్టి ఈ ఉపన్యాసాలు వింటూ కూర్చుంటే ఇంత నష్టపోవలసి
వస్తుందని, ఆ చెప్పవచ్చినవాడిని అక్కడి నుండి అట్లే అయ్యగారు
లేరు అన్న జవాబాబుతో అంపివేస్తారు. మరి సాధారణ జనగణమునకు చెబుదామంటే వారేమో
చెప్పించుకొని అంతావిన్న తరువాత మీరు చెప్పింది బాగుంది కానీ ఏమి చెప్పినదీ అర్థము
కాలేదంటారు.
ఇక్కడ ఒక చిన్న కథ చెబుతాను. ఒక 1౦౦ సంవత్సరముల క్రితము
ఇద్దరు గొర్రెల కాపరులు వుండేవారు. సూర్యోదయమునకు గోర్రెెలను తోలుకొని కొండకు
పోతే తిరిగీ చీకటి పొద్దుకు ఇల్లు
చేరేవారు. వీరికి చేతిలో పొడవాటి కర్ర వీపుమీద కంబళి ఆభరణములు. ఒకరోజు ఇద్దరూ చీకటి
పడుతూ వుండగా ఇల్లు చేరినారు. ముచ్చట్లు స్నానము భోజనము ముగించి పక్క పక్క ఇండ్లే
కాబట్టి బయట వేసియున్న మంచాలపై పక్కలను పరచి పండుకొన్నారు. ఒకడేమో నిదురబోయినాడు.
రెండవానికి నిదుర పట్టలేదు. కొంత దూరములో ఎవరో ఉపన్యాసము ఇస్తున్నట్లు
గ్రహించినాడు ఆ రెండవ వాడు. ఎటూ నిద్ర పట్టలేదుకదా అని కంబళి వీపు మీద వేసుకొని
చేతిలో ఊతకు కర్ర పుచ్చుకొని బయలుదేరినాడు ఉపన్యాసము చెప్పే చోటుకు. జనముతో ఆ
ప్రదేశమంతా నిండిపోయింది. వారిని వీరిని అడిగి తెలుసుకొన్నాడు అక్కడ రామాయణ కథా
కాలక్షేపము జరుగుతూ వుందని. సరే తాను ముందు వరసలలో కూరుచునే అవకాశము లేదు కాబట్టి
అన్ని వరసలకూ వెనకాల ఒకచోట నిలబడి తన కంబళి వీపుపైన కప్పుకొని కర్ర ఊదపొడుచుకొని , కర్ర
మీదికివంగి నిలబడినాడు. రావణుడు సీతమ్మను చెరపట్టి అశోకవాటికలో పెట్టినాడు. శ్రోతల
గుండెలు బరువెక్కి కంట తడి పెట్టుకొనే సమయములో కథలో లీనమై వింటున్న మనవాని వీపుపై
దబ్బుమన్న శబ్దముతో బరువెక్క సాగింది. ఒక క్షణము ఆలోచించి తిరిగీ వినుటలో
లీనమైపోయినాడు. కథ ముగిసింది. తెల్లవార వచ్చింది. మనవాడు ఇంటికి వస్తూనే అప్పుడే
నిద్ర లేచిన మిత్రుడు “సరిగా తెలావారనేలేదే, అప్పుడే
ఎక్కడికి పోయి వస్తూవున్నా”వని అడిగినాడు. “రామాయణ కాలక్షేపము అదో అక్కడ
జరుగుతూవుంటే పోయివుంటిని”. “ అయ్యవారు బాగా చెప్పినాడా” అని ఆడినాడు మిత్రుడు.
అందుకు మనవాడు “ఆయన బాగా చెప్పినాడా లేదా అన్నది నేను చెప్పలేనుగానీ నావీపు మీద
మాత్రము ఎదో బరువుగా వుండినది” అన్నాడు.
అసలు జరిగింది ఏమిటంటే అతడు వంగి నిలచినప్పుడు జానపద
చిత్రములో NTR(Senior) గుఱ్ఱము మీదికి లంఘించినట్లు ఒక పిల్లవాడు
అతని వీపుపై లాఘవముగా దుమికి కూర్చున్నాడు, కథలో రావణుడు
సీతమ్మను చేరపడుతున్న సమయములో! అందుకే అందరికీ గుండె బరువేక్కితే అతనికి వీపు
బరువెక్కింది.
ఇదంతా ఎందుకు చెప్పవచ్చినానంటే వినేవానికి తగినంత జ్ఞానము
లేకుంటే చెప్పేవానికి చెమటలు కారవలసినదేగానీ చేయగలిగినది ఏమీ ఉండదు. కాబట్టి
చెప్పేవాడు కేవలము పాత్రత కలిగిన వారికి చెబితే ఫలితము వుంటుంది. ‘చెవిటి వాని
చెవిలో శంఖము ఊదితే ఏమిరా ఎంక అంటే ఎముక
కోరుకుతున్నావే’ అన్నాడట.
ఈ విధముగా నేను చెప్పదలచుకొన్న సుభాషితములు, పండితులు
వినరు, ధనవంతులకు సమయముండదు, సామాన్యులకు
అర్థము కాదు కావున ఇవి కలకాలమూ నాలోనే వుండిపోవలసినదేనా అని బాధతో
నిర్ధారించుకొన్నాడట. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన మెరిసింది. అందుకే వారు ఏ కోవకు
చెందినవారయినా తమకు అవసరమైనపుడు తామిష్టపడినపుడు వారే వచ్చి చదువుతారని తన
సుభాషితములను నీతి, శృంగార, వైరాగ్య
శతకములుగా విభజించి గ్రంధస్థము చేసియుంచివేసినాడు. సాదు వర్తనకు సంఘ సౌభాగ్యమునకు,
సాటిమనిషికి సహకారమందించుటకు, ఒక్క మాటలో,
సదాచార సంపన్నతకు భర్తృహరి సుభాషితములు కాళరాత్రిలో కరదీపికలు.
ఒక విద్యార్థి ఏ విధముగా ఉండాలో చెప్పే ఈ సుభాషితమును గమనించండి.
వాంఛా సజ్జన సంగతౌ పరగుణే ప్రీతిః గురౌ నమ్రతా
విద్యాయాం వ్యసనం స్వయోషతి రతి ర్లోకాపవాదాద్భయం
భక్తిశ్శూలిని శక్తిరాత్మ దమనే సంసర్గ ముక్తిః ఖలైః
ఏతే ఏషు వసంతి నిర్మల గుణాః తేభ్యో మహాభ్యో నమః
దీని భావము ఈ ప్రకారముగా వున్నది. సజ్జనులతో సహవాసము చేయవలెనను
కోరిక. ఇతరులకు వున్న మంచి గుణములను తానూ నేర్చుకొనవలెనను తపన, చదువు
అంటే జ్ఞానము సంపాదించవలెనను విషయముపై ఆసక్తి, తన భార్య
పైననే ప్రేమ, లోకాపవాదము పై భయము, శివుని
మీద భక్తి, మనోనిగ్రహ శక్తి, దుష్టునికి
దూరముగా ఉండుట – ఈ విధములగు సద్గుణములు కల్గిన సత్పురుషులకు నమస్కరించుచున్నాను.
ఇప్పుడు ఈ విషయముల గూర్చి కొంత విశ్లేషణ చేసుకొందాము.
మొదటిదే సజ్జన సాంగత్యము. విద్యార్థులకు తరగతిలో సహాధ్యాయులతో పరిచయము
ఏర్పడుతుంది. అదే రాను రాను స్నేహితముగా మారుతుంది. తెలియని వయసు. ఒక ధనవంతుడయిన
తండ్రి కుమారుడు రోజూ రూ. 5౦౦ తెచ్చి తరగతిలో పిల్లలకు ఖర్చు పెట్టేవాడు. వారి
తరగతిలో పాఠము చెప్పుటకు వచ్చే టీచరుకు సిగరెట్ తాగే అలవాటుండేది. కానీ పాఠము బాగా
చెప్పేవాడు. ఈ ధనవంతుని బిడ్డకు సిగరెట్ తాగితే ఎట్లుంటుందో అనిపించింది. అంతే ఒక
గొప్ప బ్రాండ్ పాకెట్ తెచ్చి తన స్నేహితులను ఆహ్వానించి కాల్చటం మొదలు పెట్టినాడు.
అంటే ఒక దురలవాటు పిల్లలు నేర్చుకొనే దానికి వెనుక ఎవరో ముఖ్యమయిన వ్యక్తిదే
హస్తముంటుంది. ఆ టీచరు యొక్క పాఠము చెప్పే తీరును ఆ విద్యార్థి అనుకరించి
ఉండవచ్చును కానీ చెడ్డ చెవులకు, కంటికి చాలా తొందరగా ఎక్కుతుంది. ఆ
బాలుడు తాను చెడి పోవుట కాకుండా పది మందిని చేడిచినాడు. కారణము ఆ టీచరు. మరి
అతనైనా కోరి చెెడిచినాడా లేదు. అనుకరణ, అనుసరణ. పూర్వపు
సినిమాలలో మన NTR ANR R.నాగేశ్వర రావు గార్లు సిగరెట్ ఎట్లా
వ్రేళ్ళ మధ్యన పట్టుకొంటారో ఎంత STYLE గా నోట పెట్టుకొంటారో,
ఎంత హుషారుగా పొగను రింగులు రింగులుగా వదులుతారో చూసి ఎక్కువగా
నేర్చుకొనేవారు. తప్పు ఎవరిది? నటులదా! దర్శకునిదా!
కథకునిదా! నిర్మాతదా! సినిమా సెన్సారు బోర్డుదా! లేక సినిమాకు పిలుచుకు పోయిన
తలిదండ్రులదా! జవాబు లేదు. చెడినది ఒకడే! రేపు వాడే వందమందిని చెడుస్తాడు. అంటే
పిల్లవాని మనసు శ్రీగంధపు వనము లాంటిది. చల్లటి గాలి వీచిందా పరిసరాలకు పరిమళాన్ని
పంచుతుంది. నిప్పు అంటుకొందా వనము ఆనవాలే లేకుండా అంతరించి పోతుంది. మరి వనమును
కాపాడు బాధ్యత వనమాలిదా, యజమానిదా, నిప్పుదా
లేక దానికి తోడయిన గాలిదా! నిప్పు లేనంత వరకు గాలి తన పరిసరాలకు ఎంతో హాయినిచ్చింది.
కానీ అగ్గిని చూస్తూనే అన్నీ మరచిపోయింది. కాబట్టి చెడుగును ఊహించి తగిన విధముగా
అందుకు బాధ్యత గలుగబోవు వారంతా జాగరూకతతో ఆ వనమును కాలకాలము కాపాడి ఆ వనము యొక్క
పరిమళము తరతరాలకూ అందించాలి. కాబట్టి సజ్జన సహవాసము ఏర్పరచితే చాలు అదే
కల్పవృక్షమై కాపాడుతుంది తనను ఆశ్రయించినవారిని.
మిగిలినది మరొకమారు..........
గురు శిష్య సంబంధం – 5
ఇక మంచి గుణములను ఇతరులను జూసి నేర్చుకొనుట. మంచి ఎవరినైనా
చూసి నేర్చుకొనవచ్చును. అందుకే జగద్గురువు శంకరులవారు ‘చండాలోస్తు సతుద్విజోస్తు
గురురిత్యేషా మనీషా మమ’ అంటే ‘చెప్పదగినవాడు చండాలుడైనా నాకు గురువే’ అన్నాడు.
పూలమాలలో పూలతో కలిసి వున్న అదృష్టానికి, దారానికి కూడా సువాసన
అబ్బుతుందికదా! బొంగరము త్రిప్పే జాలిక లేక జాటి చిరిగిన బట్ట పెలికలతో పెనేవారు.
బొంగరము మాత్రము కొయ్యతో తయారుచేసి అమ్మే వారు. బొంగరపు ములికి ఒక ఇనప మేకు. కలయిక
మూడు వస్తువులది అయినా చూసేవారు బొంగరము ఎంత బాగా తిరుగుతూ వుంది అంటారు. పేరు
ములికికి గానీ జాటీకి గానీ రావు. తమకు పేరు రాలేదని బొంగరమును త్రిప్పుటకు
మొరాయించవు. ఈ దృష్టితో చూస్తే ఆ మూడింటిని చూసి ఎంత మంచి నేర్చుకొనవచ్చునో
గమనించండి. కాబట్టి మంచి గొప్పవారినుండియే కాకుండా సాధారణ వస్తువుల నుండి కూడా
నేర్చుకొన వచ్చును. కత్తి కాయనూ కొస్తుంది, కాయాన్నీ
కోస్తుంది. వాడకములోనే తేడా! అంటే మన పరిశీలనలోనే తేడా వేరేమీ కాదు.
దత్తాత్రేయులవారికి 24 మంది గురువులట. ఈవిషయాన్ని మనము
ఉద్ధవ గీతలో శ్రీకృష్ణుడు
దత్తాత్రేయుని యొక్క ఇరవై-నాలుగు గురువుల జాబితాను పేర్కొంటాడు. ఆగురువులు: భూమి, గాలి,
ఆకాశం లేదా ఖగోళం, నీరు, నిప్పు, సూర్యుడు, చంద్రుడు,
నాగుపాము, రామచిలుక, సముద్రం,
చిమ్మట, తేనెటీగ, మదపుటేనుగు,
ఎలుగుబంటి, జింక, చేప,
గ్రద్ద, పసిబాలుడు, కన్య,
వేశ్య, లోహపు పనివాడు, సర్పం,
సాలీడు మరియు కందిరీగ. ఇవి ఏవిధముగా గురువులు అని చెప్పుటకు సమయము
చాలదు. దీనివల్ల మీరు అర్థము చేసుకోవలసినది ఏమిటంటే అల్పము అన్న ఆలోచనకు
తావివ్వక లోతయిన పరిశీలన, నిరంతర అన్వేషణ అన్న రెంటినీ పుణికిపుచ్చుకొని మీరు మీ పరిధిలో ఆలోచించినారంటే ఎంతో గొప్పవారు
కావచ్చు. అసలు ఒక మంచిగురువు తన శిష్యునితో కలిసి భగవంతుని ఈ విధముగా
ప్రార్థించుతాడు.
ఓం సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహైః
తేజస్వినా వదీత మస్తుమా విద్విషావహైః II ఓం శాంతి శాంతి శాంతిఃII (కేనోపనిషత్తు)
మన ఉభయులను భగవానుడు రక్షించు గాక. మనల నిద్ధరిని పోషించు
గాక. మన మిరువురము శక్తివంతులమై శ్రమించెదము గాక. మన అధ్యయనము తేజోవంతము అగు గాక.
మనఁవిరువురము ఎప్పుడును ద్వేషము లేకుండ ఉండెదము గాక.
నేటి పాఠశాలలకు గురుశిష్య సంబంధ సందేశ సంకేతము కాదా! ఇందులో
ఏదేవునిపెరూ లేదు. ఆ నిరంజన నిరాకారుడగు పరమాత్మను ఉభయులూ ప్రార్థించుచున్నారు.
మరి నేటి విద్యా బోధన ఇంత ఉదాత్తముగా ఇంత గొప్పగా ఉందా! జవాబు
ఎవరికి వారు చెప్పుకొంటే చాలు. నేటి విద్యా బోధనకు ఒక ఉదాహరణము కథ రూపములో
చెబుతాను. నాకు తెలుసు మీరు తప్పక నవ్వుతారని. బాగా నవ్విన తరువాత నేను చెప్పబోయే
కథ లోని వాస్తవాన్ని మాత్రము మనసు పెట్టి యోచించండి.
మిగిలినది
మరొకమారు........
గురు శిష్య సంబంధం – 6
శివ ధనుర్భంగము
ఇది ఒక 7,8 దశాబ్దాల క్రిందటిమాట .
అనగనగా ఒక పాఠశాల. పాఠశాల అంటే పాఠములు వుండవలసినదే కదా.
తెలుగు
పాఠమూ ఉండవలసిందే. ఆ పాఠశాలకు ప్రధాన అధ్యాపకుడూ
ఉండవలసిందే. ఆయన క్రింద అధ్యాపకులూ ఉండవలసిందే. ప్రదానాధ్యాపకునిపైన జిల్లా
విధ్యాధికారీ(D E O) ఉండవలసిందే.
ఈ పాఠశాలలో మాత్రము, తెలుగు పండితుడు
లేనందువల్లనూ, D E O వచ్చుచున్నందువల్లనూ కార్యము గడుపుటకు
అటెండరుకు తెలుగుపండితుని వేషమువేసి, ఆ విషయము D E O వచ్చినపుడు ఆయనకు చెప్పవద్దని విద్యార్థులకు చెప్పి తగిన జాగ్రత్తలు
తీసుకొన్నాడు ఆ ప్రధానోపాధ్యాయుడు . తరగతి నుండీ పోతూ పోతూ పాఠ్యాంశము 'శివ ధనుర్భంగము' అని నల్ల బల్ల (BOARD)పై వ్రాసి పోయినాడాయన, ఆ పాఠము ఆ తరగతి వారికుందని
తెలుసు కాబట్టి . తన భయం తనకున్నా, తాను DEO వెంట వుండి Manage
చేసుకోగాలనన్న నమ్మకముతో!
అదృష్టమో దురదృష్టమో D E O, ప్రదానాధ్యాపకుడు
లేకుండానే,ఆ తరగతికే వచ్చినాడు . BOARD పై వ్రాత చూసి ఈ పాఠమైనదా అని పండిత వేషాధారినడిగినాడు. తల
వూపినాడపండితుడు. అంతట
D E O చివరి వరుస మూలాన కూర్చున్న బాలుని లేపి శివుని
విల్లు ఎవరు విరిచినారు?
అన్నాడు . అబ్బాయి ఉలుకు పలుకు లేక నిలబడినాడు. అధికారి
సహనము చచ్చుపడిన తరువాత వేరొక బాలుని లేపి అడిగినాడు . ఆ బాలుడు తనకు తెలియదన్నాడు . వేరొక బాలుడు
చూడలేదన్నాడు . ఇంకొకడు శబ్దము వినిపించింది కానీ తానూ చూడలేదన్నాడు . ఇలా అందరినీ
అడిగి వేసారిన అధికారి అసహనంగా అపండితుడైన ఆ పండితుని అడిగినాడు . అతను 'సార్
నేను Head Master గారు పిలిస్తే వెళ్ళినా నన్నాడు . D
E O గారికి వళ్ళు మండి "శివధనుస్సు ఎవరు విరిచినారు" అంటే
ఒక్కరూ సమాధానము చెప్పరే అని చాలా హెచ్చు స్వరములో అడిగినారు. ప్రధానాధ్యాపకుడు
తరగతి గదిలోనికి ప్రవేశించుతూ వున్నపుడు "ఎవరు విరిచినారు" అని D
E O గారు అనటం మాత్రము వినిపించింది. ఆయన ఆలోచించకుండా
ఆకస్మికాపన్నివారణ మంత్రము ప్రయోగించినాడు . అంటే ఆయన ఈ మాట చెప్పినాడు
."ఎవరు విరిస్తే ఏముంది లెండి తలా ఇంత వేసుకొని తయారు చేయిస్తా"మన్నాడు
. D E O స్పృహతప్పి పడిపోయినాడు.
ఇదీ మరొక విధమైన గురుశిష్య సంబంధమే!
‘స్వయోషతిరతిః’ అంటే భార్యాభర్తలు అనుపమాన అసమాన పరస్పర
అభిమానము కలిగి వుండాలి. తన భార్య/భర్త పైననే ప్రేమ అన్న అంశము ఇక్కడ చర్చించతగదు.
A
Certificate సినిమా చూచుటకు 18 సంవత్సరాల వయసు దాటాలి కదా! సరే
దాటిన వారికి చెబుదామా అంటే వారంతా అప్పటికే ముదిరిపోయి వుంటారు, వారికి అవసరము లేదు. కానీ అసలు భార్యాభర్తల బాధ్యతలను ఎంత క్రమబద్ధమైన ( Systematic
Way) రీతిలో చెప్పినారో ఒక్కసారి గమనించండి.
భార్యా భర్తల అనుబంధం
మూడు ముళ్ళకెపుడు ముసలితనము రాదు
పెరుగుచుండు ప్రేమ తరుగ బోదు
పెనము దోశపిండి ప్రేమతత్వము చూడు
రామమోహనుక్తి రమ్య సూక్తి
భార్య భర్తల అనుబంధము పెనము దోశపిండికి ఉన్న సంబంధము
వంటిది. ఎన్ని వందల సంవత్సరములు గడిచినా, పెనము ఎంత వేడెక్కినా
పెనమునకు పిండికి వున్న అనుబంధము తీరదు.
వయసు అందుకు ప్రతిబంధకము కాదు.
అసలు స్త్రీ యొక్క బాధ్యతలు లేక గుణములు, లేక
చేయవలసిన కర్మలు ఏవిధముగా వుండాలో ఈ శ్లోకము తెలుపుతుంది.
కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ,
భోజ్యేషు మాతా, శయనేషు రంభా షట్కర్మ
యుక్తా సహ ధర్మపత్నీ.
ఇంటి పనులు చెయ్యడంలో దాసీ
లాగా, మంచి ఆలోచన ఇచ్చేసమయమున మంత్రి లాగా, అలంకరణ చేసుకున్నప్పుడు లక్ష్మీదేవి లాగా, భోజనం
పెట్టేటప్పుడు తల్లి లాగా, పడకటింటిలో రంభ లాగా ఈ షట్కర్మలతో
ఉండేది ధర్మపత్ని, లేక ఈ షడ్ ధర్మములను పాటించేది ధర్మ
పత్ని.
అటులనే సహా ధర్మపత్నిగా స్త్రీ ఏవిధముగా వుండవలెననేకాదు, పురుషుడు
ఏవిధంగా ఉండాలో కూడా ధర్మ శాస్త్రం చెప్పింది, కానీ ఎందుకోఈ
శ్లోకము అంతగా జనబాహుళ్యం లో లేదు.
కార్యేషు యోగీ, కరణేషు దక్షః
రూపేచ కృష్ణః , క్షమయాతు రామః, భోజ్యేషు తృప్తః,
సుఖదుఃఖ మిత్రం, షట్కర్మయుక్తః ఖలు
ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని
ఆశించకుండా చెయ్యాలి
కుటుంబాన్ని
నడపడంలో,
కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో
వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి. రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే ఎల్లప్పుడూ
ఉత్సాహంగా,సంతోషంగా ఉండాలి. ఓర్పులో రామునిలాగా ఉండాలి.
పితృవాక్య పరిపాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి. భార్య/తల్లి
వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి. సుఖదుఃఖాలలో కుటుంబానికి
మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి. ఈ షట్కర్మలు - ఈ ఆరు
పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా , కొనియాడబడతాడు.
మిగిలినది మరొకమారు........
గురు శిష్య సంబంధం – 7 (చివరి భాగము)
భార్యా భర్తలకు ఇంతటి నిర్డుష్టమయిన నిర్వచనమును వేరే
మతములందు చూడగలమా! అందుకే దీనిని ధర్మము అన్నారు. మతము అనలేదు.
లోకాపవాదము పై భయము అన్న అంశమునకు శ్రీరామ చంద్రుడు మనకు
నిలువుటద్దము.
ఈ సుభాషితమును ఒక పర్యాయము చూడండి.
కే దస్యవః సన్తి కువాసనాఖ్యాః కః శోభతే యః సదసి ప్రవిద్యః ।
దొంగలు అంటే ఎవరు? – దుష్టవాసనలు. వాసనలు
అంటే సంస్కారాలు అని అర్థం.
సభలలో శోభిల్లేదెవరు? – గొప్ప పండితుడు.
పండితుడు అనగా శాస్త్ర జ్ఞానము కలిగిన వాడు.
మాతేవ కా యా సుఖదా సువిద్యా కిమేధతే దాన వశాత్సువిద్యా ॥
తల్లిలా మనలను ఆదరించేది, పోషించేది,
ఆనందాన్ని ఇచ్చేది ఏది? – మంచి విద్య.
ఏ సంపద దానం చేస్తూ ఉంటే పెరుగుతుంది? – మంచి విద్యయే దానం వల్ల పెరుగుతుంది.
విద్యలు తెలిసి కూడా ఎవరైతే నేర్పడో వాడు బ్రహ్మరాక్షసుడు
అవుతాడు అని పెద్దలు చెప్తూ ఉంటారు.
కుతో హి భీతిః సతతం విధేయా లోకాపవాదాద్భవ కాననాచ్చ ।
దేని గురించి భయపడాలి? – లోకాపవాదమను బీజముచే
ఏర్పడిన అరణ్యమును తలచుకొని భయపడాలి.
కో వాస్తి బన్ధుః పితరౌ చ కౌ వా విపత్సహాయః పరిపాలకౌ యౌ!!
గొప్ప బంధువు ఎవరు? – ఆపదలో సహాయపడే వాడే
గొప్ప బంధువు.
తండ్రి అని ఎవరిని అనాలి? – కన్నతండ్రి
కాకుండా మనలను పోషించే వాడు, పాలించే వాడు తండ్రియే.
బుద్ధ్యా న బోధ్యం పరిశిష్యతే కిం శివ ప్రసాదం సుఖ బోధ
రూపమ్ ।
దేనిని తెలుసుకుంటే మరేదీ తెలుసుకోవలసి ఉండదు? – శివుని అనుగ్రహం చేత ఆనంద స్వరూపము, చిద్రూపము అయిన
బ్రహ్మము గురించి తెలుసుకుంటే మరేదీ తెలుసుకోవలసిన అవసరం లేదు. అంటే సంపూర్ణమగు
భక్తితో పరమాత్ముని ఆరాధించుట అని ప్రస్తుతానికి అనుకొందాము. అదే శివునిపై భక్తి
అనేది. శివం అంటేనే సుఖము, శుభము కళ్యాణము,ఆనందము అన్న పలురఖములగు అర్థాలు వస్తాయి. ఇట్టి నీతులను కలిగిన 'నీతే శాస్త్రమును బోధించవలసిన బాధ్యత పాఠశాల Teachers ది. మరి వారు గురువులు కాదుకదా, కేవలము
భక్తికి మూలము మనోనిగ్రహము . మనసు పాదరసము(Mercury). ఒక తలము పై పోసి చూస్తే వున్న చోట ఒక క్షణము నిలువదు. అందుకే ముందు, దానిని గోడలు కలిగిన పాత్రయండు ఉంచవలెను. అంటే మనము మనసులో కామ
క్రోధ మద లోభ మోహ మాత్సర్యములను 6 శత్రువులను మన దరికి రాకుండా చూసుకోవాలి.
అప్పుడే మనోనిగ్రహము దానివల్ల భక్తి ఏర్పడుతాయి.
దుష్టునికి దూరముగా ఉండుట. ఇపుడు అసలు దుష్టుని తలపులు ఎంత
అనూహ్యములుగా వుంటాయి అన్నది చూడండి. ముందు ఒక శ్లోకము వినిపిస్తాను. అర్థము
చెప్పిన పిదప నవ్వక మానరు, ఆశ్చర్య పడకా మానరు.
అస్త్వం భద్ర ఖలేశ్వరోహం ఇహకిం ఘోరే వనే స్తీయతే
శార్దూలాదిభిరత్ర హింస పశుభిః ఖాద్యోహమిత్యాశాయా
కస్మాద్కష్ట మిదం త్వయాద్వివసితం, మద్దేహ
మాంసాశినః
ప్రత్యుత్పన్న నృమాంస భక్షణ ధియుః తేఘ్నంతు సర్వానితి
ఒక వనవాసియైన ఋషి అడవిలో సంచరించుతూ ఒంటరిగా ఉన్న ఒక వ్యక్తిని చూసినాడు. ఆయన ఆ వ్యక్తిని “అయ్యా! మీరు కౄరమృగములు సంచరించే ఈ కీకారణ్యములో ఒంటరిగా ఎందుకు కూర్చొని వున్నారు. సింహములు,పులుల వంటి భయంకర జంతువులు మిమ్ము తినివేయగలవు ” అని అడిగినాడు. అందుకు ఆ వ్యక్తి “నేను అందుకోసమే కూర్చొని వున్నాను” అన్నాడు. ఆ ఋషి “అంత ఆపద ఏమి వచ్చి పడింది నాయనా” అని అడిగినాడు. “ఆపద ఏమీ లేదు. ఆ పులియేదో వచ్చి నన్ను తిన్నదంటే అది నర మాంసమును రుచి చూచినట్లవుతుంది. అట్లు రుచి చూచుటచేత సమీపమున వున్న ఆపల్లెలోని ప్రజలందరినీ తినివేస్తుంది. నాకు కావలసినదీ అదే”నన్నాడు. చూసినారా దుష్టుడు తానూ బ్రతుకడు ఒకరిని బ్రతుకనీడు. దుర్యోధనుడు ఆవిధమగువాడగుటచేతనే కదా 18 అక్షోహిణుల సైన్యమును పొట్టన పెట్టుకున్నాడు ఒక 12 మందిని తప్ప.
గురుత్వము ఏర్పరచుకొనుటకు
తగిన వ్యక్తిని ఎన్నుకొనుట ఎంత కష్టమో చూడండి. అసలు సద్గురువును ఎన్నుకొనుటకు వినీతుడు
అనగా శిష్యుడు సద్గుణ సంపన్నుడై యుండవలెను.
అదే లేకుంటే ఈ క్రింది కథలో తెలిపిన దుర్బుద్ధులగు అన్నదమ్ముల
గమ్మత్తయిన కథ వలె ముగుస్తుంది.
ఒక వూరిలో ఇద్దరు
అన్నదమ్ములు వుండేవారు. ఇద్దరిదీ కౌరవుల మనస్తత్వమే! ఒకరంటే ఒకరికి పడదు.
ఒకనికన్నా మరియుకడు పై అంతస్తులోనే ఉండవలెనన్న తపన. ఒకసారి అన్న ఈ సంపాదన కొరకు
ఇంత కష్టపడటమెందుకు దేవుని గూర్చి తపస్సుచేసి మంచి మంచి వరాలు పొందుతామనుకొన్నాడు.
అనుకొన్నదే తడవుగా కొండ యొక్క ఒక శిఖరము చేరుకొన్నాడు. తపస్సు చేయుతకూడా వెంటనే
ఆరంభించినాడు. తమ్మునికి ఈ విషయము తెలిసింది తానుకూడా అదేకొండ పైకి ఎక్కి అన్నకు
దగ్గరగా వుండే వేరే శిఖరము చేరి తపస్సు ప్రారంభించినాడు. దగ్గరగా ఎందుకంటే అన్నకు
దేవుడు కనబడితే తనకు తెలియటానికి. అన్న తపస్సు ఫలించింది. దేవుడు ప్రత్యక్షమై వరము
కోరుకోమన్నాడు. “ స్వామీ! అదో ఆ శిఖరము పై తపస్సు చేసే నా తమ్ముని కోరిక తీర్చి
రండి. దానికి రెండింతలు నాకు ఇస్తే చాలు” అన్నాడు. దేవుడు ఆవిధంగానే తమ్ముని
వద్దకు వెళ్లి కోరికేమితని అడిగినాడు. తమ్ముడు మూర్ఖుడు కాదు కదా! వెంటనే “స్వామీ
అన్న ఏమి కోరినాడు” అని అడిగినాడు. దేవుడు ఉన్నమాట ఉన్నట్లు చెప్పినాడు. అంత
తమ్ముడు బాగా అలోచించి “స్వామీ నాకు ఒక కన్ను పోగొట్టండి” అన్నాడు. ‘తథాస్తు’ అంటూ
దేవుడు మాయమయినాడు. అన్న గుడ్డివాదయిపోయినాడు. దుష్ట బుద్ధి ఎట్లున్తుందో చూసినారు
కదా! దీనినే ‘స్వయం నష్టయ పరాన్నాశాయతి’ అంటారు సంస్కృతములో. ఈ మాటతో నా మాటలు
ముగిస్తాను.
గేయం గీతా నామ సహస్రం
ధ్యేయం శ్రీపతి రూపమజస్రం|
నేయం సజ్జన సంగే చిత్తం
దేయం దీనజనాయ చ విత్తం||
శ్లోకం అర్ధం : భగవత్ గీతను, విష్ణు
సహస్రనామములను సంకీర్తన చేయుచుండ వలయును, ఎల్లప్పుడూ
భగవంతుని రూపముపై మనసు నిలిపి ద్యానింప వలెను. ఎల్లప్పుడునూ సజ్జనులతో సహవాసము
చేయవలెను. బీదలకు ధనము పంచి పెట్టవలెను అని జగద్గురువులైన ఆదిశంకరుల వారి ఆదేశము.
స్వస్తి