Saturday, 23 June 2018

డా. కోడూరు ప్రభాకర రెడ్డి (ఆస్య గ్రంధి లో జులై 1, 2016 న వ్రాసిన వ్యాసము)


డా. కోడూరు ప్రభాకర రెడ్డి గారు 
(ఆస్య గ్రంధి లో జులై 1, 2016 న వ్రాసిన వ్యాసము)

డాక్టరు ప్రభాకరరెడ్డిగారిని గూర్చి నాలుగుమాటలునేనుతెలుపుటకు స్పూర్తి నిచ్చినది తాను పర్వతమైయుండి కూడా పరమాణువునని చెప్పుకొనే సంస్కారము. ఇది అతిశయోక్తి కాదు స్వభావోక్తి.

నేను 'శంకరదాస అష్టోత్తర శతి' అన్న1౩5 (ఉత్పలమాలలు1౩0 + చంపక మాలలు 2 + మత్తేభములు2+ శార్ధూలము 1) వృత్తములు వ్రాసినాను. దానిని అచ్చువేయించవలెెనన్న ఆశతో ఒక 10 మంది సామవేదం, మాడుగుల, వేటూరి ఆనందమూర్తి గారి వంటి ప్రముఖులకు తమ అభిప్రాయములు తెలుప బంపి నాను. వారిలో రెడ్డిగారు ఒకరు.

రెడ్డిగారినిగూర్చితెలుపుటకు ముందు ఈవాస్తవాన్నిఅవధరించండి.
కడపజిల్లా ప్రొద్దటూరు కవులకుకాణాచిపండితులకుపట్టుకొమ్మ.

బంగరు వెండి వస్తువుల, బట్టల గుట్టల, పత్తి, నూనెలన్
రంగుల నేత వస్త్రముల రంజగు దోశెల నాణ్యమందునన్
ఏగతి పోటి చేయనగు నేపురమైనను గాని పేటతో
చాగురె ప్రొద్దుటూరు గన చారు తరంబు పురంబు లన్నిటన్

గంటి కృష్ణవేణి గరితను ఎరిగించె
కొరటమద్ది వారి గొప్ప తెలిపె
సుబ్బారావు గారి సౌజన్యమును పంచె
ప్రొద్దుటూరు గాదు ముద్దుటూరు


దుర్భాక జవ్వాది ధూప మాఘ్రాణింప
పృధివి నింపిన యట్టి ప్రొద్దుటూరు
గడియారమను పేర కస్తూరి వాసనల్
పృధివి నింపిన యట్టి ప్రొద్దుటూరు
పుటపర్తి పేరుతో పునుగు తావులనెల్ల
పృధివి నింపిన యట్టి ప్రొద్దుటూరు
సుబ్బన్న యత్తరు సౌగంధ వీచికల్
పృధివి నింపిన యట్టి ప్రొద్దుటూరు

చంద్రశేఖర చందన చర్చితమ్ము
రామిరెడ్డియు రాజన్న రంజితమ్ము
వణిజ ప్రముఖాగ్రణీ సంఘ విలసితమ్ము
బరగ పేటగ జగతిన పరిచితమ్ము

ఇటువంటి ప్రోద్దుటూరి పేరుప్రఖ్యాతులను ఇనుమడింప జేసిన సమర్థుడు డాక్టరు ప్రభాకర రెడ్డి గారు.
నా పుస్తక రచన సంపూర్ణమౌతూనే నేను మాటలాడిన మొదటి వ్యక్తి డా.ప్రభాకరరెడ్డి గారు.
ఆయన ప్రోద్దుటూరి లో శిశు వైద్య నిపుణుడు.

ఆయనతో నా పరిచయము ఎట్లు జరిగిందో తెలుపుకుంటాను. నేను వ్రాసిన ‘రామమోహనుక్తి రమ్యసూక్తి’ అన్న శతక ఆవిష్కరణ ప్రోద్దుటూరి లో శ్రీ C.V. సుబ్బన్న శతావధాని గారి చేతుల మీదుగా జరిగినది. ఆయన అవధాన మత్తేభము. అప్పటికి ప్రభాకర రెడ్డి గారితో నాకు పరిచయము లేదు. ఆ కార్యక్రమమునకు ప్రభాకర రెడ్డి గారిని, నేను అన్నగా భావించే బ్ర.శ్రీ.వే. సుబ్బరామ శర్మ గారు పిలిస్తే వచ్చినారు. ఆ పిలుపు వారి ఇంటికి వెళ్లి శర్మగారు పిలిచినారు. ఆ సందర్భములో నేను వ్రాసిన శతకములోని కొన్ని పద్యముల Photo Copy ఆయన చేతిలో ఉంటె రెడ్డి గారికి చూపించి నారు. అమితమైన ఆనందాన్ని ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ ఇప్పుడు ఆయన వయసెంత అన్నారాయన. శర్మ గారు 62 అంటే, అయ్యో చిన్న వయసులో రచన మొదలు పెట్టియుంటే ఎంతో మంచి కావ్యములు వ్రాసే వాడే అని తన బాధను వ్యక్తము ఆయన చేసినారు. ఆయన వస్తానన్న ప్రకారము కార్యక్రమానికి వచ్చినాడు. ఆయన వేదిక మీద కూడా కూర్చోక ప్రేక్షకులలో కూర్చొని, ఆ తరువాత ఒక పాఠకునిగా, ఒక శ్రోతగా వేదిక పైకి వచ్చి, నేను వ్రాసిన ఆ పుస్తకములోని, అంతవరకు ఎవరూ ఉటంకించని, పద్యములనుదహరించి ఎంతగానో మెచ్చుకున్న నిగర్వి. మా పరిచయమునకు అదియే బీజము. మేమెప్పుడు చరవాణి లో మాట్లాడుకున్నా మీ విలక్షణమైన ఆలోచనా విధానము నాకెంతో నచ్చుతుంది అంటారు ఆయన .
ఆయన నిగర్వి, నివురుగప్పిన నిప్పు, నిక్కమైన నీలము. ఆయనలో అన్నీ సల్లక్షణాలే! నాకూ ఆయనకూ వున్నా ఒకే ఒక పోలిక మాది 'అజగజ సామ్య' మగుటయే!
ఆయన సేద్యము, వైద్యము, పద్యము దేనిలోనైనా దిట్ట. శిశు చికిత్సాభిషగ్వరునిగా అమృత మూర్తి ఆచంద్ర కీర్తి. రెడ్డి గారు కాబట్టి స్వతహాగా సేద్యము ఆయన రక్తములోనే అంతర్లీనమై ప్రవహించుతూ వుంటుంది. ఈయన సేద్యమునకు పాండిత్యము, కవిత్వము జోడెడ్లు. సంస్కృతాంధ్రాంగ్ల హిందీ భాషలపై పట్టున్న చెట్టు. చెట్టు అని ఎందుకన్నానంటే సప్తప్రభావిలసిత చరార్క రాగములను (కిరణములను) అనురాగముతో గ్రహించి వానిని ఫల పత్ర ఛాయా రూపములలో ఆంద్ర భాషా తెరువరులకు అందజేయుచున్నాడు. అంటే సూర్య కిరణములలోని 7 రంగులనూ కిరణ జన్య సంయోగ క్రియ ( Photosynthesis) ద్వారా గ్రహించిమనకు నీడ, ఆకులు, పళ్ళ రూపములో ఇస్తున్నవిధముగా సమాజమునకు వివిధ ప్రతిభా వ్యుత్పత్తుల ద్వారా సమాజ సేవ చేస్తున్నారు. మరి ఆయన చేట్టేకదా!

సేద్యములో వైద్యములో
పద్యములో గద్యములో
విజ్ఞతలో విభవములో
లేడుసాటి లేదుపోటి

‘కోమల సాహితీ వల్లభ’ బిరుదాంకితుడు అనేకానేక పద్య, గద్య, నాటక రచయిత. వారు వ్రాసిన ‘రేనాటి పలుకుబళ్ళు’ అన్న కరదీపికతో రాయల సీమ మారు మూలాలు కూడా సులభముగా చూడవచ్చును. నా పై అభిమానముతో వారు వ్రాసిన ప్రతి పొత్తమునూ పంపే అత్యంత అభిమాన సాహితీ మిత్రుడు. ఇంత వైదుష్యమున్నా నేను వ్రాసిన 'శంకరదాస అష్టోత్తరశతి' లో DTP తప్పులు, వ్యాకరణ దోషములు సవరించి పంపిన వారి అభిమానమునకు సర్వదా కృతజ్ఞుణ్ణి.

స్నిగ్ధ భావ కమలాలను
ముగ్ధ మొహనముజేసే
కవితా సవితా మూర్తికి
కడు కోమల హృదయానికి
సేద్య వైద్య పద్య విద్య
చేయగలుగు చేవగలుగు
ప్రతిభాకరుడౌ శ్రీయుత
ప్రభాకరున కిదేనా
సవినయంపు హృది స్పందన
సారస్వాత అభినందన
కోమల సాహితీ వల్లభ
కొనుము కడప సుర్యప్రభ

ఆయన వ్రాసిన కావ్యముల రాగ విపంచి, పల్నాటి భారతం, ద్రౌపది, హృదయ రాగం, శ్రీనాధుని చాటువులు, కవి కోకిల దువ్వూరి రామిరెడ్డి కవిత్వం వ్యక్తిత్వం, శ్రీనాధ విజయం (రేడియో నాటికలు), కవితారస ‘పానశాల’, దేవర ఇత్యాది కావ్యముల కృతికర్త .
వుండేల విజ్ఞాన కళా పీఠము వారిచే 1997 లో తమ పద్య కావ్యము పల్నాటిభారతానికి ఉత్తమ కావ్యంగా రూ.25,000/- బహుమతిగా పొందినారు.
సేద్యము, వైద్యము, పద్యము అన్నమూడుకన్నులుకలిగిన ముక్కంటి ఈయన. ఇన్ని పనులను చేతబూనిన ఈయనకు దేవుడుదినమునకు24 గంటలకు బదులుగా ౩6 గంటలు ప్రసాదించినాడేమో!
ఆయనపై పరమేశ్వరుని కరుణాకటాక్షము కలకాలమూ ఉండుగాక!
స్వస్తి

Wednesday, 20 June 2018

నేరెళ్ళ వేణుమాధవ్ గారి మానవత

నేరెళ్ళ వేణుమాధవ్ గారి మానవత.
నేరెళ్ళ వేణుమాధవ్ గారి ధ్వన్యనుకరణ కళాప్రతిభను గూర్చి నేను చెప్పుట కేవలము చర్వితచర్వణమౌతుంది. పై పేచు ఆయనఘనత హిమాలయమునకన్నా ఎత్తయినది, సూర్యునికన్నా వేలుగైనది, సముద్రముకన్నాలోతైనది. పైపెచ్చు ఇప్పటికే వారిని గూర్చి చెప్పియున్నారు. అందుచే వారివలన నాకు కలిగిన అనుభవము పంచుకోదలచుకొన్నాను.
వారి కళా ప్రదర్శన నేను కళాశాల విద్యార్థిగా ఉన్నపుడు N T రామారావు గారితో వచ్చినపుడు చూచుట తటస్తించినది. ఆతరువాత కూడా కడపలోనూ తిరుపతిలోనూ చూసినాను. కడపలో చంద్రశేఖర్ గారి అసమాన వైవిధ్య వేషధారణా ప్రతిభ కూడా చూసినాను, కాలేజీ చదివే రోజులలో.
నాకు వేణుమాధవ్ గారితో ఎటువంటి పరిచయము లేదు. నేను 1982-83 లో SBI లో
పనిచేస్తున్న కాలములో SBI-అనంతపురము ఇంజనీరింగ్ కాలేజి బ్రాంచి లో SAVINGS BANK ACCOUNT Tally 10 సంవత్సరములుగా కాకుంటే నాకు జేష్ట సహోదర సమానులైన S.నాగభూషణ్ రావు గారిని,నన్ను ఆపనికి గానూ Deputation కు పంపినారు. అది బ్రాంచ్ అగుటకు మునుపు Sub-Office గా వుండేది. దాదాపు 2 నెలల కాలము ఆ పనిని చేయవలసి వచ్చింది.
ఒకనాడు నేనూ, రావు గారు పనిలోబడి రాత్రి సమయమును మరచిపోయినాము. అది రాత్రి 1 గంట సమయము. వీధి దీపములు కూడా లేవు. వూరికి చాలా దూరము కాబట్టి వాహన సదుపాయములు లేవు. ఇటువంటి వ్యతిరేక పరిస్థితులలో బ్రాంచ్ తాళము వేసి బయటికి వచ్చినాము. ఇంజనీరింగ్ కాలేజ్ కాంపస్ లో రంగు రంగుల లైట్లు వెలుగుతూ కనిపించినాయి. కాలేజీ కార్యక్రమము ఏదో ముగిసినట్లనిపించింది. ఆ రోజు COLLEGE DAY.
మేము ఇరువురము, వేరు దారిలేక నడుస్తూ వస్తూ వుండినాము. అంతలో మా ప్రక్క ఒక VAN ఆగింది. వెనుక కూర్చున్న వ్యక్తి తలుపు తెరచి లోపలి రమ్మన్నాడు. కృతజ్ఞతా పూర్వకముగా దేవునికి నమస్కరించి VAN లో కూర్చొని చూతుముకదా ఆ తలుపు తెరిచినా వ్యక్తి వేరేవరోకాదు. సాక్షాతూ వేణుమాధవ్ గారు. ఇద్దరమూ నమస్కారం సార్ అంటూ కృతజ్ఞతా పూర్వకముగా నమస్కరించినాము. అనంతపురము ఇంజనీరింగ్ కాలేజీ ఊరికి దూరము. మీరు, మేమేవారము అన్న ఆలోచనే లేకుండా ఎక్కించుకొన్నారు. మీ సహృదయతకు నమస్కారము అంటూ మాట కలిపినాము. అందుకు ఆ మహానుభావుడు 'ఇంత రాత్రి పూట చీకటిలో మీరు నడుస్తూవుంటే, పరిచయము లేక పోనీగాక, మానవత్వము చూపించాలి కదా' అన్న ఆయన మాటలు నేను బ్రతికినంత వరకు మరచిపోలేను. ఈ రోజులలో, ఆ మాటకొస్తే ఆ రోజులలో కూడా అంతటి ఆదార్యము కలిగినవారు ఆరుదే! పై పెచ్చు ఆయన పేరుమోసిన వ్యక్తి ఆయె. మావంటి అనామకులను ఎక్కించుకొని పోవలసిన అవసరము లేదుకదా!
ఆయన మమ్ము ఒక్క క్షణము ఊరక కూర్చోనివ్వక N T రామారావు గారిని, A. నాగేశ్వర రావు గారిని, SVR గారిని, గుమ్మడి గారిని, భానుమతి గారిని, దిలీప్ కుమార్ గారిని, పృథ్వీరాజ్ కపూర్ గారిని, 10 కమాండ్మెంట్స్ సినిమాలోని సీన్స్ అండ్ స్పీచ్ Imitate చేసి మమ్ము ఉక్కిరి బిక్కిరి చేసిన నిష్కల్మష మానవతా హృదయానికి త్రికరణ శుద్ధిగా నమస్కరిస్తున్నాను. మా మా దిగవలసిన స్థలములలో దింపి ఆరోజు వారు తమ బస  చేరుకొన్నారు. అంతటి వ్యక్తికి పరమాత్మ సాయుజ్యము లభిస్తుంది.                            
ఒక్క విషయము ఆలోచించండి . అంతటి పేరు ప్రతిష్ఠ కలిగినవారు ఎవరైనా ఇంత సౌమ్యముగా వ్యవహరించ గలుగుతారా! ఒకవేళ వున్నా ఎంతో అరుదు.

Friday, 1 June 2018

ఆగండి - ఆలోచించండి

ఈ దిగువ శ్రీయుతులు రామకృష్ణ అదూరి గారు వ్రాసిన మాటకు అనుబంధముగా నేనూ నసలుగు మాటలుు జోడించినాను. చదివేది.
70 సవత్సరముల పరాయి పాలన మనకు ఇంకా సరిపోయినట్లు లేదు. నాడు పాలించిన ఆంగ్లేయులు చదువుకొన్నవారు. వారు మన సంపదనే కాక జ్ఞాన సంపద వేద సంపదను కూడా కొల్లగొట్టి ధనకనక వజ్రాదులను తమ దేశము పేరుతోనూ , జ్ఞానము తమ పేర్లతో స్వంతము చేసుకొన్నారు. మొన్నటి వరకు మనము మరులా విదేశీ పాలననే పొందియుండినాము. బ్రిటీషు కాలము నాటికీ, ఒక 4 సంవత్సరముల క్రితము నాటికీ తేడా ఏమిటంటే నాడు వారు విద్యావంతులు, వీరు విద్యాగంధము లేనివారు. ఏ hotels లోనో పనిచేస్తూ వుండినవారు, లేక చదువు లేకుండానే చదివినట్లు certificates ను పుట్టించ గలిగినవారు, మనదేశపు,అపూర్వ, పూర్వ సంపదను విదేశములకు తరలించి అమ్ముకొనేవారు, కుల,మత ప్రాతిపాదికలపై మనలను విడగొట్టి పాలించేవారు, మన దేశపు అ సంపదను కైవసము చేసుకొన్నవారు, ఈ నాటికి స్వదేేశ పౌరసత్వమును అట్టిపెట్టుకొని తమ పాచిక పారకపోతే తరలిపోవుటకు తగిన మార్గమును వుంచుకొన్నవారు, దేశ భాషలలో దేనినీ తమ మాతృభాషగా లేనివారు, నేటికీ మన సంస్కృతమును మన సంస్కృతిని అర్థము చేసుకొనే ప్రయత్నము చేయని వారు, పదవిని తప్ప పక్కలకు చూడనివారు, మనలను ఏలితేనే మనసుకు సంతోషమని తలచే వారము.
నేటి ప్రభుత్వమును వెనకేసుకొని మాట్లాడుటలేదు. ఒక వేమన పద్యము నాకు గుర్తుకు వస్తూ వుంది.
చాకివాడు కోక చీకాకు పడజేసి
మైలబుచ్చి మంచి మడత పెట్టు
బుద్ధిజేప్పువాడు గుద్దితే నేమిరా
విశ్వదాభిరామ వినుర వేమ!
మరి వదలుకుండా పట్టిన చీడను వదిలించుకొనుటకు సమయము పట్టదా! ఈ నాటి ప్రధానికి డబ్బు సంపాదించి తన వారసులకు ఇవ్వనక్కరలేదు, తన అయిన వారికి, అన్య పార్టీల ప్రముఖులవలె సంపద కానీ , పదవులు కానీ కట్టబెట్టుట లేదు. ఇండొనీషియ అధ్యక్షుడు గర్వముతో ఏమి చేబుతున్నాడో చూడండి.
May 30, 2018 Indonesian President Joko "Jokowi" Widodo today shared an interesting detail about his family with Prime Minister Narendra Modi and told him that his grandson is also named after him.
ఇంతటి గౌరవము గతములో పనిచేసిన ఫలానా పార్టీ మహనీయులకు దక్కినదా!
కలకాలమూ ఇతనికే పట్టము కట్టమని నేనుటలేదు. అతనికి కాస్త ఊపిరి పీల్చుకొనే అవకాశామునొసగుట ఆవశ్యకము.
' ఆ బైల్ ముఝె మార్' అన్నట్లు చేయకుంటే మంచిదేమో!


Rama Krishna Adury
2019 లో జరిగేది ఎన్నికల పోటీ కాదు. ఒక యుద్ధం.
1. దేశం బాగుపడాలి అనుకునే వారికి
2. దేశం ఏమైనా పర్లేదు, నేను బాగుంటే చాలు, అనుకునే వారికి.
నేనూ నాదేశం కోసం నాయకత్వం వహించి శక్తి వంచన లేకుండా పోరాడతాను. ఉపాధ్యాయునిగా నేను ఎంతోమందిని కార్యోన్ముఖులను చేస్తాను. సమాజ హితాన్ని కోరని విద్య వృధా.