శ్రీకృష్ణ
https://cherukuramamohan.blogspot.com/2017/07/blog-post_71.html
కర్ష యతి ఇతి కృష్ణ అని తెలుపుతుంది నిరుక్తము. మనసును చిలికి వెన్న తీస్తాడు అని తలువ వచ్చు. లేక భూమి దున్ని భక్తిబీజము నాటి సత్ఫలితమునందిస్తాడని చెప్పవచ్చు. నల్లగా ఉంటాడు అనీ చెప్పవచ్చు, ఇవికాక 'క' అంటే బ్రహ్మ. 'ఋ' అంటే అనంతుడు. 'ష' అంటే శివుడు. 'ణ' అంటే ధర్మము. 'అ' అంటే విష్ణువు. విసర్గ (అః) అంటే నరనారాయణులు. కృష్ణునిలో కృషి ఉంది. కర్షణ ఉంది, ఆకర్షణ ఉంది, సంకర్షణ ఉంది. (అందుకే ఉపసర్గలు) అని సద్గురు శివానందమూర్తి గారు తమ అనుగ్రహ భాషణములో ఒక పర్యాయము పేర్కొన్నారు.
కృష్ణుని తెలుసుకొనుట సులభమైన విషయము కాదు. అది మహామహులకే అంతుబట్టని విషయము. నేనో ఒక పిపీలిక పాదమును. మహనీయుల వల్ల విన్నది, నేను చదివి తెలుసుకొన్నది, నాకు గుర్తున్నంతవరకు తెలియజేయ ప్రయత్నము చేస్తాను. కృష్ణ తత్వము తెలుసుకొనుటకు భాగవతము మాత్రమే చాలదు. ముఖ్యముగా బ్రహ్మవైవర్త పురాణము, హరివంశమే కాకుండా భారతము కూడా చదువవలసి వుంటుంది.
మస్త్య కూర్మ వరాహస్య నారశిమ్హస్య వామనః
రామో రామస్య రామస్య బుద్ధః కల్కి రేవచ
అన్న ప్రచారములోనుండే శ్లోకములో శ్రీకృష్ణ అవతారము కనిపించదు, కానీ రామావతారము వుంది. రాముడు పరోక్షముగా, మనము ఎటువంటి నీతి నియమములను పాటించవలెను అని తానే ఆదర్శముగా నిలిచి మనలను అనుసరించమన్నాడు. తన భగవత్తత్వమును ప్రదర్శించలేదు. పైగా రామలక్ష్మణభరత శత్రుఘ్నులుగా తానే ఉద్భవించుతాడు, కాకపోతే నిష్పత్తులు మారుతాయి. అంటే పైన తెలిపినవి అన్నీ అంశలే. ఈ కృష్ణావతారము అలాంటిది కాదు. విష్ణువు దశావతారములలోని ఒక్కొక్క అవతారములో ఒక్కొక్క దుష్టశక్తిని దునుమాడుతూ వచ్చినాడు. ద్వాపరములో త్రుణావర్తుడు, శకటాసురుడు, పూతన వంటి రాక్షసులు వున్నా వారు కంస, జరాసంధాది మానవ రాజన్యులకు లోబడి పనిచేసినవారే! అంటే ద్వాపరము లో అసుర గణములకు బదులుగా అసుర గుణములు భూమిపై వ్యాప్తిలోనికి వచ్చినాయి. అధర్మము ప్రబలింది, అజ్ఞానము వ్యాపించింది. అందువల్ల శ్రీకృష్ణుడు భూమిపై అవతరించవలసివచ్చినది. అసలు వ్యాసులవారే 'కృష్ణస్తు భగవాన్ స్వయం' - అని అన్నారు. వాల్మీకి ఆ మాట అనలేదు. రాముడూ ఆమాట చెప్పలేదు. అందుకే పైన తెలిపిన శ్లోకములో శ్రీకృష్ణుడు లేడు. శ్రీకృష్ణుడికి కంస జరాసంధ శిశుపాల, నరకాసురాదులందరూ ఒక విధముగా బంధువులే! అయినా ధర్మ సంస్థాపన కొరకు, సాధువులను రక్షించుట కొరకు ఆయన ఉద్భవించినాడు. మిగతా ఏఅవతారములలోలేని విశిష్ఠత ఈ అవతారమునకు మాత్రమే వుంది. ఈ అవతారములో మాత్రమే 'కృష్ణం వందే జగద్గురుం' అన్నారు. ఈ కృష్ణుడు త్రిమూర్తులలో విష్ణువు కాదు. పరాశక్తి, శివుడు, సుబ్రహ్మణ్యుడు ఇలా అనేక దేవతల సంగమం ఆయన. ఆయనే భగవద్గీతలో చేబుతాడు 'యోగక్షేమం వహామ్యహం' అని. యోగం అంటే లేనిదీ లభించుట క్షేమం అంటే ఉన్నది నిలుపుకొనుట. ఇటువంటి ఉపదేశాలు మనకు విష్ణువు బోధించినట్లు ఇతర అవతారములలో అగుపించవు. ఆసలు ఈ విహయమును గమనించండి. విష్ణు సహస్ర నామమావళిని భీష్ముడు ధర్మజునకు బోధించితే శ్రీకృష్ణుడే స్వయంగా ధర్మ రాజునకు శివసహస్రనామావళిని బోధించుతాడు. ప్రభాస తీర్థములో (నేటి సోమనాథ్)శివ దీక్ష శివ పూజ నిర్వహించుతాడు. శివ పూజా ప్రాశస్త్యం బోధించినాడు. పైగా ప్రభాస తీర్థంలో (సోమనాథ క్షేత్రం)శివ దీక్ష, శివ పూజా నిర్వహించుతాడు. అర్జునుని శివునికై తపస్సుచేసి పాశుపతం పొందమని చెబుతాడు. శివుని బోధరూపం దక్షిణామూర్తి. అంతేకాక శ్రీకృష్ణుని భంగిమ, ముఖ్యముగా మోవికి మురళిని ఆనించియుండేది, నటరాజ తాండవము లోని పాద భంగిమ యొక్క కుంచిత పాదమును గుర్తుకు తెస్తుంది. ఆయన వేణువు శివుడే. కృష్ణుడు వంశీ మోహనుడైతే, శివుడు వంశ మోహనుడు (శివసహస్ర నామాలలో ఒకపేరు).
సుబ్రహ్మణ్యుని శివగురువు అంటారు. ఆయన వాహనం నెమలి. అందుకే కృష్ణుడు శిఖిపింఛమౌళి. కృష్ణునిబోధలు భగవద్గీత, ఉత్తర గీత, ఉద్ధవ గీతలు భ్రమర గీతలు. కృష్ణుని భంగిమ విష్ణువు ఆవాసము క్షీరసముద్రమని మనము వింటాము,అంటాము. క్షీర సముద్రము, ఇక్షుసముద్రము, అన్న పేర్లు సంకేతములు. రంగు మాత్రమే పరిగణనలోనికి తీసుకోవలెను కానీ రుచికాదు. ఆవిధముగా క్షీరసముద్రమును మనము ఆధునిక పరిభాషలోని Milky Way గా తీసుకొనవచ్చు. ఆయన సృష్టికోసం విశ్వాన్ని సృష్టించినాడు. ఆది బ్రహ్మాండము. దీనిలో భూమితొ సహా భూ, భువ, సువ, మహ, జన, తప, సత్య - అనే 7 ఊర్ధ్వలోకాలు , అతల, వితల,సుతల, తలాతల, రసాతల పాతాళ మనే 7అధోలోకాలు సృష్టించినాడు. సృష్టి కొనసాగింపునకు సత్యలోకములో బ్రహ్మను సృష్టించినాడు. ఇక్కడ మనము తెలుకొనవలసిన ముఖ్యమగు విషయము ఒకటి వుంది. ఈ బ్రహ్మలోకంపైన వైకుంఠం, కైలాసం, గోలోకం, మణిద్వీపం ఉంటాయి. అక్కడ లక్ష్మీనారాయణులు, శివపార్వతులూ, రాధాకృష్ణులూ, లలితా పరమేశ్వరి వరుసగా వారి వారి లోకాలలో ఉంటారు. సంఖ్యులు ప్రకృతి పురుషుడు అని చేసిన ప్రతిపాదనకు పుష్టిని కూర్చుటయే సరస్వతీబ్రహ్మ, లక్ష్మీనారాయణ, సాంబశివ ( స+అంబ+శివ) తత్వము. ఆవిధముగా గోలోక నివాసులు రాధా కృష్ణులు. 'గొ' అన్న శబ్దమునకు గల అనేకార్థములలో కిరణములు, వేదములు, వృషభ జాతి అన్న అర్థములు వున్నాయి. అందుకే కృష్ణ పరమాత్ముడు భూమిపైన గోలోకమునే ప్రతిష్ఠించినాడు. రేపల్లెలో ఆలమందలతోనే కదా ఆయన అనుబంధము. బ్రహ్మవైవర్త పురాణములోని కృష్ణ ఖండములో ఈ వివరాలను మనమ తెలుసుకొనగలము.
శ్రీ కృష్ణునికి మానినీ చిత్తచోరుడనే ఒక ప్రథ అన వచ్చు అపప్రథ అనవచ్చు. మగవారికన్నా ఆడువారిలో చంచల స్వభావమేక్కువ అని పెద్దలు చెబుతారు. అందుకే స్త్రీ కి చంచల అన్నపేరు కూడా వుంది. ఈ చంచల స్వభావము కలిగినది చిత్తము అంటే మనసు. శ్రీకృష్ణుడు మనసు దొంగాలించినాడు అంటే వేరెవ్వరికీ అణుమాత్రముకూడా చోటు లేక తానే నిండియున్నాడని అర్థము. మరి వారే అట్లుంటే ఇక మగవారిని గూర్చి తలువనే అక్కరలేదు. గోకులము వదలి అన్న బలరామునితో కూడి, అక్రూనితో మధుర వెడలినతరువాత ఆయన కార్యకలాపములు మారిపొయినాయి. పైగా గోకులములో శ్రీకృష్ణుడు ఒక్కడే పురుషుడు తక్కిన వారంతా స్త్రీలే! బృందావనములో వల్లభాచార్యుల వారిని చూడ దలచి సాధ్వి మీరాబాయి సందేశమునంపితే ఆయన ఆడువారిని చూడనంటాడు. అప్పుడు ఆమె జవాబుగా బృందావనములో కృష్ణుడు ఒక్కడే పురుషుడు అని పంపుతుంది. తన తప్పు తెలుసుకొని వల్లభులవారు మీరాబాయిని కలుస్తారు.
ఈ విధముగా ఆయన మానినీ చిత్తచోతుడైపోయినాడు.
ఇంకొక విచిత్రమైన విషయము ఏమిటంటే అసలాయనకు ‘కృష్ణ’ అన్న నామకరణము ఎవరు చేసినట్లు? చెరసాలలో బారసాల జరుగలేదు కదా! నందవ్రజములో గర్గమహాముని వస్తే ఆయనకు బాలుని చూపితే ఆయన “ఈ బాలుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. ఈతనిని ‘కృష్ణ’ అన్న పేరుతో పిలవండి అనిచేప్పినారు. ఈ ప్రకారముగా ఆయన గూర్చి ఏమి చెప్పుకొన్నా విచిత్రమే! పైగా అతిచిన్నవయసులోనే మహాబలవంతులగు రాక్షసులను చంపడము, వేరు ఏ అవతారమునందునూ జరుగలేదు.
కృష్ణునికీ కాత్యాయనీ వ్రతానికీ గోపికావస్త్రాపహరణానికీ సంబంధం ఏమిటి అన్నది ఒకసారి చూస్తాము. వ్రజభూమిలోగోపికలు నందకిశోరుడే భర్తకావాలని కాత్యాయనీవ్రతంచేస్తారు. కాళిందిలో(యమునలో) స్నానంచేసి అమ్మవారిని పూజిస్తారు. తమ వస్త్రాలు ఒడ్డునే ఉంచి నదిలోదిగుతారు. స్నానంచేస్తూండగా కృష్ణుడు వచ్చిఆ వస్త్రములు అపహరించి ఆప్రక్కన ఉన్న వృక్షంపైన ఎక్కి వాళ్ళను పిలుస్తాడు. మీరు వస్త్రాలు లేకుండా వ్రతభంగం చేసినారు. (నదీ స్నానమునాచారించునపుడు వస్త్ర ఆచ్చాదన లేకుండా స్నానము చేయకూడదు.) పైకి వచ్చి నమస్కారంచేయండి. అనిచెబుతాడు. కథ తెలిసినదే. గోపికలు జీవాత్మలు. అజ్ఞానం వస్త్ర రూపంలో వారిని కప్పి యుంచింది. అజ్ఞానపు తెరతొలగిస్తే అంతా పరమాత్మస్వరూపమే. చెట్టుపైనా క్రిందనూ ఉన్న వస్తువు ఒకటే. వ్రతఫలం అప్పటికప్పుడు పురుషరూపంలో కాత్యాయనియే ఐన కృష్ణ దర్శనం లభించింది. వారి అజ్ఞానపు తెరలు తొలగినవి.
పైన తెలిపిన విషయములనుబట్టి శ్రీకృష్ణుడు సకలదేవతా స్వరూపమని, కేవలము విష్ణ్వంశ కాదని తెలియవస్తుంది. ఈపరమాత్మ తత్వము ఎంతయినా చెప్పుకొంటూ పోవచ్చు. అసలు గోలోక వాసి మరియు రాధా సమేతుడగు శ్రీ కృష్ణుని ఎంతోమంది ఎన్నోవిధములుగా తమ మతమునకు మూలపురుషునిగా చేకొన్నారు.
మహారాష్ట్రమున జ్ఞానేశ్వర్, నామదేవ్, జనాబాయి, ఏక్ నాథ్, మరియు తుకారాం తమతమ పంథాలో శ్రీకృష్ణుని సాధించిన మహాభక్తులు. మీరాబాయి సరేసరి. చైతన్య మహాప్రభు యొక్క గౌడీయ సాంప్రదాయమును ISCON వారు ప్రపంచాదేశాలలోనే ఎంతో ప్రాచుర్యమునకు తెచ్చినారు. కలిసంతారణ ఉపనిషత్తు లోని ‘హరే కృష్ణ (1) హరేకృష్ణ(2) కృష్ణ కృష్ణ హరే హరే(3) హరేరామ(4) హరేరామ(5) రామరామ హరే హరే(6) ’ అన్నది వీరి మహా మంత్రము. వియత్నాం, కంబోడియ, థాయ్ లాండ్ లో కృష్ణభక్తిని విస్తారముగా మనము చూడవచ్చు.
ఈ విధముగా శ్రీకృష్ణుడు విష్ణు స్వరూపునిగా కాకుండా గోలోక వాసియగుచు కృష్ణునిగానే కొలువబడినాడు.
స్వస్తి.