Saturday, 15 October 2016

రాయలసీమలో కడప జిల్లా (మా కడప జిల్లా)

రాయలసీమలో కడప జిల్లా
'కొండలలో నెలకొన్న కోనేటిరాయని' తొలి గడప కడప.
కాదనకు నామాట కడపరాయ నీకు గాదెఁబోసే వలపులు కడపరాయ అని అన్నమయ్య చే నుతింపబడిన ఈ పట్టణమునకు, ప్రాంతమునకు, ఇందలి తాలూకాలకు, మండలములకు ముఖ్యముగా పులివెందులకు చెప్పలేనంత చెడ్డ పేరునాపాదించినారు
సినిమా మరియు మీడియా వారు. ఈ విధముగా, ఈ చెడ్డ, ప్రజలలో ప్రాకుతూ పోతే, వారికి అసలు భయముత్పన్నమై ఆ ప్రాంతపు తలంపే మానుకుంటారేమో. అందుకే ఆ చింత మాని అంతో ఇంతో ఎంతో కొంత, నా చేతనైనంత ఈ రాయలసీమ లోని కడప యొక్క గొప్పదనమును గూర్చి చెప్పుటకు ఈ చిన్ని ప్రయత్నమును చేయుచున్నాను.
ప్రకృతి రమణీయాలైన కొండలు, కోనలు, చందన వృక్షాలు, వన్యమృగాలు కలిగిన ఈ జిల్లా ఒక రమణీయ దేశము అందులోని ప్రతి ప్రాంతము ఒక రమణీయ ప్రదేశము. మనసు పెట్టి చూచినవారికి తెలుస్తుంది ఈ ప్రాంతమంటే ఏమిటో. రెండు వర్గములకు నడుమ ద్వేషమేదయినా వుంటే  అది వారి వరకే పరిమితము గానీ సాధారణ పౌరులను ఎప్పుడూ బలి చేయరు. వారిది నీతి నిజాయితీ గలిగిన వైరము. ఆ వైరము ఎందువల్ల వస్తుంది అంటే పౌరుషము వల్ల. ఆ పౌరుషము ఎక్కడిదీ అంటే ఈ మట్టి వల్ల ఈ నీటి వల్ల.

చరిత్రలోనికి పోవుటకు ముందు కొన్ని ఆధునిక వాస్తవాలను తెలుపుతాను. 1931లో ‘భక్త ప్రహ్లాద’ తోలి తెలుగు చలన చిత్రమునకు జన్మస్థానము ఈ ప్రాంతమే! నాటి బళ్ళారి రాయలసీమలోని భాగమే! అటు నాటక రంగమును తొలి రోజలలో ఇటు  సినిమారంగమును తన అసమాన నటనా విభావముతో శాసించిన బళ్ళారి రాఘవ రాయలసీమ (బళ్ళారి)తెలుగువాడు. తెలుగు నాటకరంగానికి పితామహుడు మనం మరచిపోలేని మహా నటుడు, తన నటనా వైదుష్యంతో తెలుగు నాటక కళకు విశ్వ సన్మానం అందించిన మహానుభావుడు మరియు  నాటక కళా ప్రపూర్ణుడు బళ్లారి రాఘవ. నాయక పాత్రలే గాదు ప్రతినాయక పాత్రలలో కూడా, అప్పటి వరకు వున్న రాగాలు, కేకలు తగ్గించి, నూతన పంథాలో ప్రదర్శించి, పండిత పామరులను సైతం మెప్పించిన అనర్ఘ కళా రత్నం మన రాఘవ. నాటకాలలో స్త్రీ పాత్రలు స్త్రీ‌ల చేతనే పోషింపజేసి రంగస్థలమునకు నవ్యతను నాణ్యతను సమకూర్చిన మరపురాని మహానుభావుడు.
తెలుగు, కన్నడ హిందీ, ఇంగ్లీషు భాషలలో కలిపి సుమారు 54 వేర్వేరు నాటకాలలో ప్రధాన భూమికలలో నటించిన ప్రతిభావంతుడాయన. 1880 ఆగస్టు 2న తాడిపత్రిలో నరిసింహాచార్యులు, శేషమ్మ దంపతులకు తాడిపత్రి రాఘవాచార్యులు (బళ్ళారి రాఘవ) జన్మించినారు. 1882 లో అనంతపురము జిల్లా ఏర్పడు వరకు తాడిపత్రి కడప జిల్లా లోనిది.  ఆంధ్ర నాటక పితామహుడు ధర్మవరపు కృష్ణమాచార్యులు వీరి మేనమామ. బళ్ళారిలో మెట్రిక్యులేషన్‌, మద్రాస్‌లో బి.యల్‌. చదివే సమయంలోను, తెలుగు, ఇంగ్లీషు నాటకాలలో విరివిగా పాల్గొన్నారు. బళ్ళారిలో లాయరుగా స్థిరపడినారు. 1919లో బెంగుళూరులో జాతీయ స్థాయిలో జరిగిన ఒక నాటకంలో రాఘవ నటించిన పఠాన్‌ రుస్తుంఅభినయాన్ని వీక్షించిన విశ్వకవి రవీంద్రులు రాఘవను భారత దేశంలోనే అగ్రనటునిగా ఎంతగానో కొనియాడినారు. 1927లో రాఘవ నటించిన దీనబంధు కబీర్‌హిందీ నాటక ప్రదర్శన చూసి మహాత్మా గాంధీ పులకించిపోయి, పరవశంతో రాఘవ మహారాజ్‌కీ జైఅని అభినందించినారట. 1928లో యూరప్‌కు వెళ్ళిన సందర్భంలో జార్జి బెర్నార్డ్‌షా కోరిక మీద షేక్‌స్పియర్‌ నాటకంలోని కొన్ని సన్నివేశాలు రాఘవ నటించి ఆయన అభినందనలు పొందినారు. ఆయన నటుడే కాక, గాన గంధర్వుడు కూడా. ఈయన 1946 లో పరమపదించినారు.


తొలి రాజకీయ ఖైదీగా, అటు పత్రికా రంగానికి ఇటు గ్రంధాలయ ఉద్యమానికి రాచబాట వేసిన గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు పులివెందులకు చెందిన వారే.  క్రీడాభిరామ రచయిత వల్లభ రాయడు కడప జిల్లా పులివెందుల వాడు.

ఒకసారి కడప నైసర్గిక చారిత్రక స్వరూపమును తెలుసుకొందాము. తిరుమల రాయని కొండకు గడప యై కాలాంతరమున ‘కడప’ గా రూపాంతరము చెందిన ఈ ప్రాంతము మహాభారతములోని ద్రోణుడి బావమరదియైన క్రుపాచార్యునిచే ‘కృపాపురము’ గా ఈ ప్రదేశము నిర్మింపబడినది అన్నది పురాణ వాక్యము. రానురాను అది ‘కురుప’ యై ఆ పిమ్మట ‘కడప’ గా రూపాంతరము చెందినదని అంటారు. ఇప్పుడు దీనిని పాత కడప అంటారు. దీనిని ఆనుకొని యున్నదే దేవుని కడప. ఈ దేవుని కృపాచార్యులవారే ప్రతిష్ఠించినారని కూడా అంటారు. అసలు కడపను ఆనుకొని యున్న పాల కొండల నుండి గూడా తిరుమలకు మార్గమున్నదని అంటారు. ఇప్పటికీ ఆ దారిలో కొంత శిధిలావస్థలోనున్న మంటపములను చూడవచ్చు.
క్రీ.శ. 4 వ శతాబ్దముననే ఈ మండలమును చోళులు పరిపాలించినట్లు తెలియవచ్చుచున్నది. నాడు ఈ ప్రాంతమును రేనాడు అన్నారు. తెలుగు తొలి శాసనము ఈ రేనాటి చోళులదే! ఆ పిదప ఈ ప్రాంతమును బానులు, రాష్ట్ర కూటులు , వైదుంబులు, కాకతీయులు మొదలగువారు పాలించినట్లు తెలియవచ్చుచున్నది.

C.F. Brakenbury in Madras  Dist. Gazetteers Vol.1-Cuddapah లో ఈ విధముగా తెలియజేసినాడు:
‘Cuddapah’s history for many centuries affords but an index to the varying fortunes of neighbouring dynasties. The ‘Choolya State’ referred by Hiuen
T’sang was the Telugu Chola kingdom occupying most of the black cotton country of this district and perhaps parts of Kurnool and Anantapur.’
A Manuel of Cuddapah Dist.by late Mr. J.D.B.Gribble I.C.S. 1875 లో మనము ఈ విషయమును గమనించవచ్చు: “It’s true, as Col. Wilks says, that each stream in this part of the country has its song to sing, and every hill its story to narrate, but unfortunately they do not narrate them, or if they do, do it in language unintelligible to the modern historian. These streams and mountains being the only depositaries of the chronicles of Cuddapah, the early history of the district is and is ever likely remain, a sealed book’
చిత్రావతి, పినాకిని, పాపఘ్ని బాహుదా నదుల సంగమమైన ఈ  ప్రాంతపు అటవీ శైల నదీ ప్రవాహాదుల  నిసర్గ రామణీయకతకు మురిసిన అగస్త్య, మృకండ, దుర్వాస, కృపాది మహర్షులు తమ ఆశ్రమముల నిచటనేర్పరచుకొని తపమాచరించినటుల పురాణాధారములు కలవు.

ఈ ప్రాంతమునకు రెండు వైపులా నల్లమల అడవులు ఉండగా, ఒక వైపు పాలకొండలు గలవు. తిరుమల వెంకటేశ్వర స్వామికి గడపకావటంతో దీనికి ఆ పేరు సిద్ధించి యుండ వచ్చునని ముందే చెప్పుకొన్నాము. 11 నుండి 14వ శతాబ్దాల వరకు కడప, చోళ సామ్రాజ్యము లోని భాగము. 14వ శతాబ్దపు ద్వితీయార్థములో ఇది విజయనగర సామ్రాజ్యము లో భాగమైనది. గండికోట నాయకుల పరిపాలనలో రెండు శతాబ్దాల వరకూ ఉండినది. 1422 లో పెమ్మసాని నాయకుడైన పెమ్మసాని తిమ్మయ్య నాయుడు ఈ ప్రాంతంలో పలు దేవాలయాలను, నీటిని నిల్వ ఉంచే తొట్లని కట్టి అభివృద్ధి చేపట్టినాడు. 1594 లో రెండవ మీర్ జుమ్లా ఈ ప్రాంతాన్ని ఆక్రమణ చేసి చిన్న తిమ్మయ్య నాయుడిని మోసంతో గెలవటంతో ఇది గోల్కొండ ముస్లిముల పరమైనది. 1800 లో బ్రిటీష్ సామ్రాజ్యం లో భాగమైనది. కడప నగరం పురాతనమైనది .  తాడిపత్రి (నిజానికి తాడిపర్తి), కదిరి, ముదిగుబ్బ, నల్లమాడ, నంబులిపులికుంట, తలుపుల, నల్లచెరువు, ఓబులదేవరచెరువు, తనకల్లు, ఆమడగూరు మండలాలు 1910 లో అనంతపురం జిల్లాలో కలిసే వరకు కడప జిల్లాలోనే ఉండినాయి. 

కుతుబ్ షాహీపాలకుడైన నేక్ నాం ఖాన్ కడప పట్టణమును విస్తరించి దీనిని నేక్నామాబాద్ గా వ్యవహరించినాడు. కానీ ఇది ప్రజల చేత తిరస్కరింపబడినది. 18వ శతాబ్దపు రికార్డుల ప్రకారం నేక్నాం ఖాన్ కడప నవాబు అని తేలినది. 1830 ల్లో కాశీయాత్రలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఆనాటి కడప స్థితిగతులను తన కాశీయాత్ర చరిత్రలో రికార్డు చేసినారు. పురాణ ప్రశస్తి కల్గిన పుష్పగిరిని గూర్చి కూడా వివరించినారు. ఇక్కడ ఒక్క మాట కడప జిల్లా కు చెందిన పుష్పగిరిని గూర్చి చెప్పుకొందాము.
పుష్పగిరి:
‘హంస వింశతి’ కావ్యములోని ఈ పద్యమును గమనించండి.
తిరుమల కంచి పుష్పగిరి తీర్థములన్ జని కొంగుముళ్ళతో
వరములు దంపతుల్  వడయ వారికి కాన్కలు వైచి యంతటన్
బరికలు దృష్టి దీపములు పన్నిన గద్దెలు బెట్టి ఏమిటన్
గరమగు పుత్ర వంఛితము గానగ లేక విచార ఖిన్నులై  
తిరుమల , కంచితో ఒకానొకనాడు  సమానమైన, దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి కడప నుంచి 16 కి.మీ. దూరంలో ఉంది.  ఆదిశంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది. ఇక్కడ విద్యారణ్యస్వామి శ్రీచక్రాన్ని  ప్రతిష్టించినారు. కడప నుండి కర్నూలుకు వెళ్ళే మార్గంలో చెన్నూరు సమీపంలో ఎడమ వైపు ప్రక్క దారి చీలిపోతుంది. ఆ మార్గంలో పుష్పగిరి వస్తుంది. ఈ క్షేత్రం కొండ మీద ఉంది. క్రింద పుష్పగిరి గ్రామం ఉంది. గ్రామానికి, క్షేత్రానికి మధ్య పెన్నా నది ప్రవహిస్తుంది. శైవులకూ, వైష్ణవులకూ కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్య క్షేత్రం. వైష్ణవులు దీనిని 'మధ్య అహోబిలం' అనీ, శైవులు దీనిని 'మధ్య కైలాసం' అనీ అంటారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఇదొక్కటే ఆది శంకరులచే ఆంద్ర దేశమున స్థాపింపబడిన శంకరాచార్య మఠం. ఈ క్షేత్ర చరిత్ర చాలా ప్రాచీన మైనది, శ్రీశైలఖండమందును, స్కాంద పురాణమందును,సత్యనాధుని రసరత్నాకరమందును, పుష్పగిరి క్షేత్రమును గూర్చి విశేషములు ఎన్నో ఉన్నవి, ఇక్ష్వాకులు నాటి శాసనములలో శ్రీశైలమునకు దక్షిణ ద్వారముగా ఈ క్షేత్రము పేర్కనబడింది.


 పుష్పగిరి   క్షేత్రానికి మధ్య పెన్నా నది ప్రవహిస్తుంది. శైవులకూ, వైష్ణవులకూ కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్య క్షేత్రం. వైష్ణవులు దీనిని 'మధ్య అహోబిలం' అనీ, శైవులు దీనిని 'మధ్య కైలాసం' అనీ అంటారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఇదొక్కటే శంకరాచార్య మఠం.
పుష్పగిరి సమీపంలో పాపఘ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదులు పెన్నలో కలుస్తాయి. అందుకే పుష్పగిరిని పంచనదీక్షేత్రమంటారు.
హరిహరాదుల క్షేత్రం
శివ స్వరూపుడైన వైద్యనాదేశ్వరుడు, విష్ణు స్వరూపుడైన చెన్నకేశవస్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.
పరీక్షిత్తు వంశాన్ని నిర్విర్యం చెయడానికి జనమేజయుడు చేసిన సర్పయాగ పాప పరిహారార్థం శుక మహర్షి ఆదేశం పై పుష్పగిరి కొండ పై ఈ ఆలయమును నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. చోళులు, పల్లవులు, కృష్ణదేవరాయలు ఆ తర్వాతి కాలంలో ఆలయాన్ని అభివృద్ధి చేశారని చరిత్ర ద్వారా తెలుస్తుంది.
కొండ మీద ఒకే ఆవరణంలో చెన్నకేశవాలయం, సంతాన మల్లేశ్వరాలయం ఉన్నాయి. ఈ ఆవరణంలోనే ఉమా మహేశ్వర, రాజ్యలక్ష్మి, రుద్రపాద, యోగాంజనేయ, సాక్షిమల్లేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు.
పుష్పగిరిలోనే పాపవినాశేశ్వరుడు, డుంటి వినాయకుడు, పుష్పనాథేశ్వరుడు, కమలసంభవేశ్వరుడు, దుర్గాంబ ఆలయాలున్నాయి. రుద్ర పాదము, విష్ణు పాదము ఈ కొండ మీదనే ఉన్నాయి. .
వరదలు వచ్చినప్పుడు పెన్న దాటి ఆవలి వైపుకు వెళ్ళలేరు. అప్పుడు ఈవలి వైపు అభినవ చెన్నకేశవ స్వామికి పూజలు జరుగుతాయి పాతాళ గణపతిని దర్శించుకొని పూజలు చేసెందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు.

ఈ గ్రామాన్ని గురించి తెలుగులో తొలి యాత్రాచరిత్రగా చెప్పబడే కాశీయాత్ర చరిత్రలో ప్రస్తావనలున్నాయి. గ్రంథకర్త ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రలో ఈ
గ్రామంలో 1830 సంవత్సరాంతం నందు విడిది చేశారు. ఆ సమయంలో తాను గమనించి గ్రామవిశేషాలను గ్రంథంలో చేర్చుకున్నారు. గ్రంథంలో ఆయన పుష్పగిరి గురించి ఇలా వ్రాసినారు: “పుష్పగిరి పుణ్యక్షేత్రము. పినాకినీ తీరము. నది గట్టున కొండ వెంబడిగా రమణియ్యమైన యొక దేవస్థల మున్నది. అది హస్తినిక్షేపము చేయతగిన పుణ్యస్థలము. స్మార్త పీఠాధిపతి యయిన పుష్పగిరి స్వాములవారు, అక్కడ నివాసము చేయుచున్నారు. హరిహరాదుల విగ్రహమే గాక బ్రహ్మ విగ్రహము కూడా ఇచ్చట కలదు.”
 ఇంతటి మహత్తర పుణ్య క్షేత్రమును తాకి తలచేవారు లేకుండా పోయినారు. శ్రద్ధ కలిగినవారు గూగుల్ సర్చ్  లో ‘ పుష్పగిరి’ అని టైపుజేసి చదువుకొన వచ్చును. TTD వారికి ఈ దేవాలయమును దత్తత తీసుకొనే ఆలోచనే ఇంతవరకు వచ్చినట్లు లేదు.
ఇక మళ్ళీ కడప పట్టణమునకు వస్తాము.
18వ శతాబ్దపు ప్రారంభాన్ని మినహాయిస్తే మయాన నవాబులకు ఇది ముఖ్య కేంద్రంగా విలసిల్లినది. బ్రిటీషు పాలనలో సర్ థామస్ మున్రో క్రింద ఉన్న నాలుగు కలెక్టరేట్ లలో ఇది కూడా ఒకటైనది. దాని ప్రకారం అప్పటికి కడప మంచి స్థితిలోని పట్టణంగా చెప్పవచ్చు. అందరు పనివాళ్ళూ ఉన్నారని, జిల్లా కోర్టూ, కలక్టరు కచ్చేరీ కలదని వ్రాసినారు. ఆయా ఇలాకా ముసద్దీలు ఇళ్ళు కట్టుకుని పట్టణంలో కాపురమున్నారన్నారు. జలవనరులకై దగ్గరలో నది, ఊరి నడుమ నీటిబుగ్గ ఉందని, ఇళ్ళు సంకుచితంగా ఉండేవని వర్ణించినారు. ఊరివద్ద ఒక రెజిమెంటు ఉండేది, అందులో ఆ ప్రాంతపు దొరలు కాపురం ఉండేవారని తెలిపినారు. 2004 లో కడప మునిసిపల్ కార్పొరేషన్ గా గుర్తింపు పొందినది.

నేటి  హైదరాబాదు లోని గోలకొండ, గుంటూరు లోని కొల్లూరు కాకుండా నేటి అనంతపురములోని వజ్రకరూరు కాకుండా,  వజ్రపు గనులు రాయల సీమ ప్రాతంలో నాల్గు వుండెడివని, చారిత్రక ఆధారలతో నిరూపించినారు శ్రీ సురవరం ప్రతాప రెడ్డిగారు. అందులో కడప ఒకటి.  అనంతపురం, కడప జిల్లాల్లో  బంగారు గనులున్నాయని ఆంధ్రప్రదేశ్ ఖనిజ శాఖ వారు పరిశోధించి చెప్పిన మాట.  కడప‌ లో లెడ్, జింక్ నిక్షేపాలున్నాయని కూడా ఈ సంస్థ తన నివేదికలో పేర్కొంది.  కడప జిల్లాలో ప్రపంచంలో మరెక్కడా లభించనంత ముగ్గురాయి (బెరైటీస్) మంగంపేట గనుల్లో లభిస్తోంది. పులివెందుల ప్రాంతంలో రాతినార దాదాపు ఓక వంద సంవత్సరములకు ముందు నుండినే తీస్తున్నారు. ప్రపంచములో ఈ రాతినారకు పెట్టింది పేరు. క్రిసోలైట్ రకానికి చెందిన రాతినార  (ఆస్‌బెస్టాస్) దేశంలో ప్రధానంగా కడపజిల్లా పులివెందులలో లభ్యమవుతుంది. నాప రాళ్ళకు కడప లోని ఎర్రగుంట్ల, చిలంకూరు, ఒకప్పుడు జమ్మలమడుగు కూడా, ఇవికాక ఇంకా కొన్ని ఎర్రగుంట్లకు చుట్టూ వున్న ప్రాంతాలు ప్రసిద్ధి  . ఆ కాలములో ఈ రాళ్ళే ఇళ్ళలో పరిచేవారు. ఘనములు దీర్ఘ ఘనములుగా మలచిన సోగలు అనబడే ఈ  రాళ్ళతో ఇటుకలకు బదులుగా ఇళ్ళు కట్టుకునే వారు. జమ్మలమడుగు, ప్రొద్దటూరు ఎర్రగుంట్ల , ముద్దనూరు, చిలంకూరు పులివెందుల నియోజకవర్గంలో యురేనియం నిక్షేపాలను కనుగొన్నారు. వేముల మండలంలోని తుమ్మలపల్లె గ్రామంలో యురేనియం శుద్ధి కర్మాగారం ఉంది. యర్రగుంట్ల ప్రాంతంలో సిమెంటు పరిశ్రమ బాగా విస్తరించింది., జమ్మలమడుగులో ఉక్కు కర్మాగారం నిర్మాణంలో ఉంది. ముద్దనూరు దగ్గర ఏర్పాటైన రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు మెగా పవర్ ప్రాజెక్టు. దేశానికే, బహుశా ప్రపంచానికి కూడా నేమో, పలక పై వ్రాయు బలపముల గనులు కడప జిల్లా పులివెందులలో మాత్రమె కలవు.
ప్రపంచ ప్రఖ్యాత సురభి నాటక సమాజం ప్రస్థానం1885లో కడప జిల్లా సురభి గ్రామంలో 'కీచక వధ'నాటక ప్రదర్శనతో మొదలయ్యింది. ఈ సమాజ వ్యవస్థాపకుడు వనారస గోవిందరావు. సమాజము పెద్దదయి ఆంద్ర దేశపు నాలుగు చేరుగులకు వీరు ప్రాకినారు కానీ వీరి మూలము మాత్రము కడప జిల్లాలోని సురభి యే! నేటికీ వారి నాటకాలు ప్రపంచమంతటా ప్రదర్శింప బడుతూ వున్నవి అంటే వారి విద్యపై వారికి గల భక్తి, అనురక్తిని చాటుచున్నాయి.
    కడప జిల్లాకు సంబంధించిన తూరుపు ప్రాంతాలను పొత్తపి రాజధానిగా చేసుకొని పాలించిన మహారాజు నన్నె చోడుడు.  కడప జిల్లా తో బాటూ నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని కొంత భాగము వీరి ఎలుబడి  క్రింద ఉండేది. క్రీ.శ.రెండవ శతాబ్దంలో అరణ్యప్రాంతంగా ఉన్న "పొత్తపి" ప్రాంతాన్ని, సోమరాజు. మలిదేవరాజులు, సంయుక్తంగా బాగుచేసి, బాహుదానదికి దక్షిణంలో విశాలమైన కోట నిర్మించినారు. గతంలో దీనిని పలువురు రాజులు, రాజధానిగా చేసుకొని పరిపాలించినారు. దీనికోసం ముస్లిములు అప్పట్లో దండయాత్రలకు యుద్ధాలకు పాల్పడి, ముఖ్యమైన నిర్మాణాలను నాశనం చేసినారు. ప్రస్తుతం దీనికి చెందిన శివాలయాలు, అవశేషాలు, శాసనాలు ఉన్నవి. 30 మంది రాజులు దీనిని పాలించినారు. చివరగా బ్రిటిషువారు పరిపాలించినారు. గతంలో పొత్తపి, సిద్ధవటం తాలూకాలో ఉండేది. మండలాల పునర్వ్యవస్తీకరణలో భాగంగా, పొత్తపి, నందలూరు మండల పరిధి లోనికి వచ్చినది. దీనికి ఘన చరిత్ర ఉన్నది. ప్రముఖ పుస్తక పరిశోధన రచయిత, కవనికౌముది బిరుదాంకితులైన శ్రీ పోతురాజు వెంకట సుబ్బన్న, దీని ప్రాచీన చరిత్రను, ప్రాశస్త్యముపై, సమగ్ర పరిశోధన చేసి, పుస్తక రూపం లోకి తెచ్చినారు. మొట్టమొదట ఛందోబద్ధ పద్య పాదములు రేనాటి రాజుల కాలము లోనే కడప ప్రాంతములో దర్శనమిచ్చిన దాఖలాలున్నాయి. తిరిగీ నన్నెచోడుని విషయమునకు వస్తే, ఈయన కాళీదాస మహాకవి గారి కుమార సంభవమును తెనిగించినారు. కానీ రచనకు తనదైన శైలి ఉరవడిని జోడించినారు. కావ్య ప్రారంభములో సకల దేవతా ప్రార్థన , గురు ప్రార్థన , పూర్వకవి స్తుతి,, కుకవి నింద, కవి స్వ విషయం కృతి పతి వర్ణన, షష్ఠ్యంతాలు, రచియించి  భావి తెలుగు కావ్యములకు బాట వేసినాడు.
 పరిశోధక తపస్వి యనబడు బి.యన్. శాస్త్రిగారి శాసనాధారమగు పరిశోధనలో
నిర్ద్వంద్వముగా నన్నె చోడుడు ఆదికవి యని తేటతెల్లము గావించినారు.
''ఆదికవి నన్నెచోడుడు'' అనే పేరుతో ఆయన ప్రతిపాదిత అంశాలు 1972 భారతి, ఫిబ్రవరిలో ప్రచురింపబడినాయి.
''కుమార సంభవము తెలుగులో రచింపబడిన మొట్టమొదటి గ్రంథము'' అనే వాక్యాలతో ఆరంభమైన ఈ వ్యాసంలో ''నన్నెచోడుడు నన్నయ - తిక్కనల తరువాత కవి అనే అభిప్రాయానికి ఆధారాలు లేవు'' అని కుండ బద్దలు కొట్టినట్లు వ్రాసినారు ఆచార్య బి.ఎన్‌. శాస్త్రిగారు. కుమార సంభవము ''కావ్యశైలిలో రచించిబడిన ప్రబంధము'' అని సూత్రీకరించినారు. నన్నెచోడుడు ఎందుకు ఆదికవి అవుతాడో శాసనాల ఆధారంగా ఈ వ్యాసంలో సమగ్రముగా విశ్లేషింశించినారు. నన్నెచోడుడు రెండవ యుద్ధమల్లుని సామంతుడు (930-934) అని పేర్కొన్నారు. ఈ వ్యాసాన్ని ఒకటికి రెండుసార్లు శ్రద్ధగా చదివిన వారికి నన్నెచోడుడే తెలుగు ఆదికవి అనే అభిప్రాయం బలపడుతుంది. అంత తర్కబద్దంగా ఉన్న వ్యాసమిది. వ్యాసంలోని ముగింపు వ్యాఖ్యను ఒకసారి నిశితంగా పరిశీలించండి.
''ఇట్లు ఆంధ్రభాషలో తొలి కావ్యమును రచించిన ఆదికవి నన్నెచోడుడు శివకవియైనందున మరుగుపడి, పదియవ శతాబ్ధిలో ఆంధ్రమునందాది కావ్యము రచింప, ఇరువదియవ శతాబ్ధిలో ఆ గ్రంథము వెలుగులోనికి రాగా, ఆంధ్ర పండిత ప్రకాండులు చారిత్రకులు, నన్నెచోడుని పన్నెండవ శతాబ్దివాడుగా నిర్ణయించుట చూడగా కొన్నికొన్ని దురభిమానములెంత శక్తిమంతమైనవో ఊహింపవచ్చును."

కడప జిల్లాలోని  ఎఱ్ఱగుడిపాడు (జొన్నగిరి) గుట్టమీది అశోకుని శాసనము ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతంలో లభించే మొదటి వ్రాతలుగా భావిస్తున్నారు.
6, 7 శతాబ్దాలలో పల్లవ చాళుక్య సంఘర్షణల నేపధ్యంలో రాయలసీమ ప్రాంతం రాజకీయంగా చైతన్యవంతమయ్యింది. ఈ దశలో రేనాటి చోడులు సప్త సహస్ర గ్రామ సమన్వితమైన రేనాడు (కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలు) పాలించినారు. తెలుగు భాష పరిణామంలో ఇది ఒక ముఖ్య ఘట్టం. వారి శాసనాలు చాలావరకు తెలుగులో ఉన్నాయి. వాటిలో ధనంజయుని కలమళ్ళ శాసనం (కడప జిల్లా కమలాపురం తాలూకా) మనకు లభిస్తున్న మొదటి పూర్తి తెలుగు శాసనంగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఇది క్రీ.శ. 575 కాలము నాటిదని అంచనా. ఇది కాక ఈ శాసనములన్నీ కడప ప్రాంతములోనివే!
గమనించండి:
పుణ్యకుమారుని తిప్పలూరి శాసనము - 630 - - కమలాపురం తాలూకా - ఎపిగ్రాఫికా ఇండికా XXVII - పేజి 231
సత్యాదిత్య చోళుని మాలెపాడు శాసనము - 725 - - ఎపిగ్రాఫికా ఇండికా XI - పేజి 345
అరకట వేముల శాసనము - 8వ శతాబ్దం - ప్రొద్దుటూరు తాలూకా -
వేల్పుచర్ల శాసనము - జమ్మలమడుగు తాలూకా -
గణ్డ త్రిణేత్ర వైదుంబ మహారాజు వన్దాడి శాసనము - రాయచోటి తాలూకా
ఈ విధముగా చెప్పుకొంటూ పోతే లెక్కకు మిక్కుటములైన శాసనములను ఈ ప్రాంతమున చూడ వచ్చును.

ఇక ఈ విషయమును ఒక పరి గమనించండి. బమ్మెర పోతన అనుకరించిన/అనుసరించిన నాచన సోమనది కడప. సోమన తెలుగు సాహిత్యంలో తిక్కన యుగానికి చెందిన కవి. సోమన కాలాన్ని గురించి పరిశోధకుల్లో బేదాభిప్రాయములు  ఉండినవి. విజయనగర చక్రవర్తి బుక్కరాయలు నాచన సోమనకు చేసిన దానశాసనం క్రీ.శ.1344 నాటిదని పరిశోధకులు నిర్ధారించడంతో నాచన సోమన కాలం 1300 నుంచి 1380ల మధ్యదని అంచనా వేసినారు అంటే 14వ శతాబ్దమన్న మాట. నేను గ్రహించిన మేరకు ఈయన బుక్కరాయల ఆస్థాన విద్వాంసుడు. విద్యారణ్యుల సహపాఠి. కాంచీపుర విద్యార్థి. బుక్కరాయలు ఆయనకు పెంచికలదిన్నె లేక బుక్క పట్నం అన్న అగ్రహారమును బహూకరించినాడు. ఆతరువాత ప్రౌఢదేవరాయలు   ఆయనకు తరిమెళ్ళ దిన్నె అన్న అగ్రహారమును బహూకరించినట్లు తెలియవచ్చుచున్నది. రెండూ కడపలోనివే! అందుచేత ఆయన కడప జిల్లా వానిగా తెలియవచ్చుచున్నది. ఆయనకు తిక్కనపై గల అబిమానము అపారము. అందుకే ప్రతి ఆశ్వాసము చివరిలో
ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధనవిరాజి తిక్కన సోమయాజి  ప్రణీతంబైన శ్రీ మహాభారత కథానంతరంబున శ్రీమత్ సకల భాషాభూషణ  సాహిత్య రసపోషణ చక్రవర్తి సంపూర్ణకీర్తి నవీనగుణసనాథ నాచన సోమనాథ ప్రణీతంబైన యుత్తరహరివంశంబునందు ... అని వ్రాస్తారు.  
అసలు పోతనదే ఒంటిమిట్ట. అందుకు ఆధారాలు అనేకములు. ఆయన పూర్వీకులు మాత్రము బమ్మెర నుండి వచ్చిన వారే! కానీ నేను ఆ విషయముల జోలికి పోవుట లేదు. ఎందువలన అంటే ఆయన ఆంధ్రులందరికీ ప్రాతః స్మరణీయుడు. నాటి ముస్లిం పాలకుల అరాచకములను ముఖ్యముగా ఆడువారిని విచాక్షణా రహితముగా చెరచుటను అడ్డగించలేక తమకు అనుకూలమైన ప్రాంతములకు వలస వెళ్ళినారు. ఆ కాలములో వారికి కడప మొదలయిన ప్రాంతములతో ఎన్నో విధములుగా అనుబంధములుండేవి. అందుకే బమ్మెర, సనగరము, ఓరుగల్లు ఇత్యాది ప్రాంతముల నుండి ముఖ్యముగా కడప మండలములోని ఒంటిమిట్ట ప్రాంతమునకు వచ్చినారు . వారి వంశజులు నేటికినీ ఆ ఊర్ల పేర్లనే తమ ఇంటి పేర్లను చేసుకొని అక్కడున్నారు. వేరొక విషయము ఏమిటంటే  ఉర్దూ భాష తెలఘాణ్యమును ప్రవేశించక ముందు అక్కడి భాషకు కడప ప్రాంతపు భాషకు ఎంతో సారూప్యముండేది. జాగ్రత్తగా పరిశీలించితే యాస లోనూ భాష లోనూ పోలికలు గుర్తిచ వచ్చును. ప్రస్తుతము పోతన సోమనను అనుకరించిన అనేక పద్యములనుండి, ఒకే ఒక పద్యమును తెలియబరచుతాను. ఒకే భావము కలిగిన ఆ ఇరువురి పద్యాలూ  ఈ విధంగా వున్నాయి. ఈ తీరున పద్యము వ్రాయుటకు ఆద్యుడు సోమన.
నరకాసుర యుద్ధ ఘట్టములో కొన్ని పద్యాలను చూద్దాము. ఎంతటి గంభీరమైన పద ప్రయోగమో ఎటువంటి భావజాలమో గమనించుదాము. ఈ పద్యములను నరకాసుర ఘట్టములో పోతనే ఈయనను అనుకరించినాడు అంటే ఈయన గొప్పదనము మనము అర్థము చేసుకోన గలము .
ఈ పద్యము చూడండి
''తంత్రీ వినోదంబు తడవు సైపని వ్రేళ్ళగొనయంబు తెగలపై గోరికనుట
యద్దంబు పిడి ముట్టనలయు పాణి తలంబు, లస్తకంబిఱియించు లావు కలిమి
చెలికత్తెనొత్తిలి చీఱలేని యెలుంగు, సింహనాదంబుచే జెదరకునికి
ప్రమద నర్తన కేళి బంతవింపని పదం, బైదు రాణంబుల నలత బడమి

సోయగపు జిత్రరూపంబు జూచుచోట, వేసరు విలోచనంబులు వికృత దైత్య
లక్ష్యమీక్షించుటయు మొక్కలంపు గెలుపు గైకొనియె సత్యభామ సంగ్రామ సీమ''

తంత్రులను మీటుటకే కనలి పోయే వ్రేళ్ళు వింటి అల్లెత్రాటిని ఏవిధముగా వింటికి అనుసంధించ గలుగుతుంది.  అద్దము యొక్క పిడిని పట్టుకుంటేనే కందిపోయే చేయి ధనువు మధ్య గల ధృడమైన పిడిని ఏవిధముగా పట్టుకోగలుగుతుంది. చేలికత్తెలనే గట్టిగా పిలువలేని స్వరము సింహనాదముల నేవిధముగా చేస్తుంది, స్ద్త్రీ సహజమైన సౌకుమార్యముగల నాట్యమే చేయనోపని సుకుమార పదములు ఐదు విధములగు నైపుణ్యతలను అంటే 1.విల్లు ధరించుట 2. బాణమును సంధించుట ౩.  ఆకర్ణాంతము లాగుట, 4. ప్రత్యాలీఢ పాదమ్ముతో నిలచుట 5. శరమును వదలుట అన్న ఈ ఐదు పనులను    ఒకే సమయమున అలయకుండానే ఏవిధముగా చూపగలదు. సోయగముతో కూడిన రూప లావణ్యముల గాంచ వలసిన ఆమెలో వికృతమగు రక్కసుని
లక్ష్యముగాగొని ఆతని కదలికలు సునిశితముగా చూసి వేసారిన కన్నులు గలిగి  అలసి కూడా అసాధ్యమైన గెలుపు గైకొనె నా సంగ్రామ సీమ లో సత్యభామ.  

ఈ పద్యము సత్యభామా సౌకుమార్యమును తెలుపుతూ ఆమె యుద్ధము ఎట్లు చేయగలదు అన్న సందేహమును వ్యక్తము చేస్తున్నాడు సోమన.

ఇదే సందర్భమును, ఇదే భావమును, ఇదే పాత్రను , యథాతథముగా గ్రహించి పోతన భాగవత దశమ స్కందములోన ఏవిధముగా వర్ణించినారో  తిలకించండి.
వీణ చక్కగ బట్ట వెరవెరుంగని కొమ్మ బాణాసనంబెట్లు పట్ట నేర్చె
మ్రాకునదీగె గూర్పంగ నేరనిలేమ గుణము నేక్రియధనుష్కోటి గూర్చె
సరవి ముత్యము గ్రువ్వజాలని యబల ఏ నిపుణత సంధించె నిశిత శరము 
చిలుకకు పద్యంబు చెప్పనేరని తన్వి యస్త్రమంత్రము లెన్న డభ్యసించె
బలుకు మనిన బెక్కు పలుకని ముగుద యే                                         
గతి నొనర్చె సింహ గర్జనములు
ననగ మెరసె ద్రిజగదభిరామ గుణధామ
చారు సుకురసీమ సత్యభామ !
వీణ చక్కగా పట్టుకొనుట తెలియని ఈమె విల్లు పట్టుకొనుట ఎటుల నేర్చుకున్నది ? చెట్టుకు లతలను ఎక్కించ లేని ఈమె ధనస్సుకు, వింటినారిని ఎటుల ఎక్కించినదో ? ముత్యాలలో దారము గూర్చుట తెలియని మగువ బాణములు గురి తప్పక ఎటుల సంధించుచున్నదో? చిలుకలకు మాటలు నేర్పలేని సుందరి ఈ అస్త్రమంత్రముల నెప్పుడు నేర్చుకోన్నదో ? బిగ్గరగా మాట్లాడలేని ఈమె ఈ యుద్ధము సింహగర్జనలు చేయుచున్నది . ముల్లోకాలలో బహు సుందరి అయిన సత్యభామకు ఇవన్నీ ఎటుల సాధ్యమయెను ? సమాధానము కుడా ఆపరమాత్మకు తెలియును. సత్యభామ సాధారణ కన్య కాదు చక్రవర్తి కుమార్తె.  క్షత్రియులలొ స్త్రీ పురుషులకు ఈ విద్యలెల్ల నేర్పు ఆచారముండెడిది ఆ కాలంలో.. అవసరమైనపుడు మాత్రమె వానిని ప్రదర్శించెడి వారు.


రాయల ఆస్థాన ప్రథమ దిగ్గజము అల్లసాని పెద్దన బడసిన కోకటాద్యగ్రహారములుండేది కడప జిల్లాలోని కమలాపురములో! అష్ట దిగ్గజ కవులలో, రామరాజ భూషణునిది కడప(కసనూరు- సింహాద్రిపురము మండలము). అయ్యలరాజు రామభద్రునిది కడప. (ఒంటిమిట్ట) మొల్ల (మొల్ల రామాయణం), కవయిత్రి తిమ్మక్క, వేమన , బద్దెన (సుమతి శతక కర్త), కవిచౌడప్ప, గువ్వల చెన్నప్ప(గువ్వల చెన్న శతకము) కాలజ్ఞానం రాసిన బ్రహ్మంగారు.....వాగ్గేయకారుడు అన్నమయ్య పుట్టిన భూమి....అసలు కర్నాటక సంగీత త్రిమూర్తులలో శ్యామా శాస్త్రి గారి పూర్వులు కంభం నుండినే తిరువయ్యార్ కు వలస వెళ్ళినారు., కాకర్ల కంభమునకు అనుబంధ ప్రాంతము. త్యాగరాజు పూర్వులు ఇక్కడి వారే. వారుకూడా తిరువయ్యారు వలస పోయినవారే ! ఆ కాలము ఈ ప్రాంతములు కడప నవాబు ఏలుబడిలోనే ఉండేవి. ప్రసిద్దుడగు సంకుసాల నృసింహకవి కడప జిల్లా పులివెందుల తాలూకా సుంకేసుల కు చెందినవాడు. కాలాంతరమున సంకుసాల సుంకేసుల అయినది. కవికర్ణ రసాయనమను గ్రంధ రచయిత ఈ నృశింహ కవి. మనుచరిత్రకన్న ఈ గ్రంధము ఉత్తమమని అల్లసాని పెద్దనే ఈర్ష్య పడినాడని అంటారు.

కడప జిల్లాకు చెందిన ఇంకొక అనర్ఘ రత్నము రంగనాథ రామాయణ రచయిత గోన బుద్ధారెడ్డి ములకనాటి సీమకు రాజధాని అయిన గండికోటకు అతి చేరువలోని పెద్దపసుపల లేదా నరసోజి కొట్టాల అన్న పల్లెకు చెందినవాడు. వీరి వంశజుడే గోన గన్నా రెడ్డి. నేటికీ గోన వంశస్ధులు ఆగ్రామాలలో మరియూ జమ్మలమడుగులో నివసించుచున్నారు. అసలు మా S.S.L.C. (11th Class) సాంఘీక శాస్త్ర ఉపాధ్యాయులు సుబ్బారెడ్డి గారు గోన వంశజులే!

ఆధునికులలో కూడా జనమంచి శేషాద్రి శర్మ గారిది వారి తమ్ముడు సుబ్రహ్మణ్య శర్మ గారిదీ కడపే. సంస్కృతాంధ్రములందు వీరుభయులు గొప్ప పండితులు.  వావిళ్ల రామస్వామి శాస్త్రి, మద్రాసు వారి  ప్రచురణలలో అధికాంశము శేషాద్రి శర్మ గారివే! వీరు గాక గడియారం వెంకట శేష శాస్త్రిగారు, దుర్భాక రాజశేఖర శతావధాని గారు, పుట్టపర్తి నారాయణాచార్యుల వారు, డా. సి.వి. సుబ్బన్న శతావధాని గారు, శ్రీ అవధానం చంద్ర శేఖర శర్మ(19 14-19 9 6 ), కావ్య క వాసిష్ట గణపతి ముని బంధువైన శ్రీ అయ్యల సోమయాజుల నరసింహ శర్మ శ్రీ భూతపురి సుబ్రహ్మణ్య శర్మ, రాజన్న కవి గారు, నరాల రామా రెడ్డి గారు, గజ్జల మల్లారెడ్డి గారు, హిందీ భాషలో ఔత్తరాహికులనే అబ్బుర పరచిన బాలశౌరి రెడ్డి గారు, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత కేతు విశ్వనాథ రెడ్డి గారు, వీరంతా సాహితీ దిగ్దంతులు. ఉభయ భాష ప్రావీణ్యములోనూ, అవధానములోనో, అద్భుత కావ్య రచనల లోనూ అసమాన ప్రతిభావంతులు.  ప్రముఖ స్వాతంత్ర్య యోధులైన హరి సర్వోత్తమ రావు గారు కడప జిల్లాకు చెందిన వారే! వీరందరూ లబ్ధ ప్రతిష్ఠులు గావున నేను వివరముగా వ్రాయలేదు.

విశ్వనాధ వారి తరువాత జ్ఞాన పీఠ పురస్కారమునకు ఎన్నికయై కూడా లౌకికము లేని బ్రాహ్మణుడైన కారణమున పొందలేక పోయినారు పుట్టపర్తి నారాయణాచార్యులవారు. ఒక సందర్భములో విశ్వనాథ  సత్యనారాయణ గారే ఆచార్యులవారు కొన్నింట తమకన్నను గొప్ప అని చెప్పినారు.
మాయా బజార్ దర్శకులు  శ్రీయుతులు కదిరి వెంకట రెడ్డి (K.V.Reddy) గారు, ఒక విధంగా పులివెందుల వారే! వారు ఒకప్పటి కడప జిల్లా తాడిపత్రి వాస్తవ్యులు.  1882 లో అనంతపురము జిల్లా ఏర్పడే వరకూ తాడిపత్రి కడపకు చెందియుండినదని విన్నాను. KVరెడ్డి గారి  అల్లునిది పులివెందులే. ఇక K.V. రెడ్డి గారి దర్శక ప్రతిభకు గుణసుందరి కథ, పాతాళ భైరవి మాయాబజారు చాలు.  ముఖ్యముగా పాతాళ భైరవి, మాయాబజారు చలన చిత్రములు అజరామరములు.  
వేశ్యా వ్యామోహాన్ని గర్హిస్తూ బి.ఎన్. 1945లో తీసిన స్వర్గసీమ తొలి సారిగా భారతదేశపు ఎల్లలు దాటి వియత్నామ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొని ఒక విదేశీ చలనచిత్రోత్సవంలో పాల్గొన్న తొలి తెలుగు సినిమాగా గణుతికెక్కింది. ఘంటసాల గాయకుడు గానూ, సంగీతదర్శకుడు గానూ పరిచయమైన సినిమా, నటిగా, గాయనిగా భానుమతికి గుర్తింపు తెచ్చిన సినిమా, సినీ రచయితగా చక్రపాణి గారు పరిచయమైన సినిమా కూడా ఇదే., ప్రపంచవ్యాప్తంగా సినీ పండితులంతా ఒక్కసారి ఉలిక్కి పడి భారతీయ సినిమా వైపు దృష్టి సారించేలా చేసిన చిత్రం పథేర్ పాంచాలి. ఐతే అదే సంవత్సరం విడుదలై జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఆ సినిమాకు ధీటుగా నిలచిన తెలుగు చలనచిత్ర రాజం "బంగారుపాప". కరడుగట్టిన కసాయి గుండెను సైతం కదలించి సున్నితంగా మార్చగల శక్తి పసితనపు అమాయకత్వానికుందని హృద్యంగా చెప్పిన చిత్రమది. జార్జ్ ఇలియట్ వ్రాసిన 'ది సైలాస్ మార్నర్' నవలను మన నేటివిటీకి తగ్గట్లు మలచి వెండితెర మీదకెక్కించి అంత అపురూపంగా మనకందించిన ఘనత బి.ఎన్.దే., చిరస్థాయి సినిమాల దర్శకులు, దక్షిణ దేశములోని తొలి ‘దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్’ గ్రహీత అయిన బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి  (B.N.Reddy) గారిది కడప జిల్లా పులివెందుల. తెలుగు చలనచిత్ర చరిత్రలో సాటిలేని మేటి కళాఖండంగానూ, అపురూప దృశ్యకావ్యంగానూ మల్లీశ్వరి ఖ్యాతిగాంచింది. ఆ సినిమా ఎన్నిదేశాలు తిరిగిందో లెక్క లేదు. రాచరికపు ఆడంబరాలను, ఆచారాలను చిత్రించినా ఆ సినిమా కమ్యూనిస్టు దేశమైన చైనాలోనే వందరోజులకు పైగా ఆడింది. ఆ సినిమాకు మాటలు, పాటలు, కళ, నటన, సంగీతం, ఛాయాగ్రహణం, ఎడిటింగులతో సహా అంతా తానై బి.ఎన్. నడిపించినవే.
అందుకే కృష్ణశాస్త్రి గారు" మల్లీశ్వరి సృష్టిలో మేమంతా నిమిత్తమాత్రులం. బి.ఎన్.రెడ్డి గారు దీనికి సర్వస్వం." అన్నారు. సినీ హాస్యనటుడు ప్రసిద్ధ నిర్మాత పద్మనాభము గారు కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రి పురం మండలం వీర్నగట్టు పల్లె వాస్తవ్యులు.
నటనకు పరాకాష్టగా అనేకులగు నటీమణులకు ఆదర్శ మూర్తిగా వెలుగొందిన కన్నాంబ గారిది కడప జిల్లా. తమిళ చిత్రములు ‘కణ్ణగి’ ‘మనోహర’ తెలుగు చిత్రములు ‘ గౌరీ మహాత్మ్యం’ ‘తోడి కోడళ్ళు’ ఆమె విలక్షణ నటనకు గీటురాళ్ళు. ఈ నాలుగూ ఒక దాని కొకటి ఏమాత్రము పొంతన లేని పాత్రలు. వెంకటేశ్వర మహాత్మ్యం నిర్మాత్రి అత్యంత ప్రముఖ నటి, శాంతకుమారి గారిది, నటి P. రాజ్యం గారిది కడప జిల్లా ప్రొద్దటూరు.
**ఇక విజయ స్టూడియోస్. దీని అధినేత బొమ్మిరెడ్డి నాగిరెడ్డి గారు, అంటే B. నాగిరెడ్డి గారు. ఆయన పులివెందుల ఎద్దులయ్యగారి కొత్తపల్లె  గ్రామమునకు చెందినవాడు.
ఛాయా గ్రాహకునిగా అత్యంత పేరు ప్రఖ్యాతులు గాంచిన కసిరెడ్డి వెంకట నరసింహారెడ్డి గారిది కడప జిల్లా. వి.ఎన్.రెడ్డి గా ప్రసిద్ధి చెందిన కసిరెడ్డి వెంకట నరసింహారెడ్డి ప్రముఖ హిందీ చలనచిత్ర ఛాయగ్రాహకుడు.ఆగ్, బైజూ బాఁవరా, కాలిఘటా, జాన్వర్, చోరీ చోరీ, హల్‌చల్, ఉప్‌కార్ పూరాబ్ ఔర్ పశ్చిం, లుటేరా, కాశ్మీర్ కి కలి వంటి 33 సినిమాలకు మరియు తెలుగు లో పుట్టిల్లు, చిరంజీవులు సినిమాలకు ఛాయగ్రహణం అందించినాడు. ఈయన తెలుగులో గంగా గౌరీ సంవాదము, ఇంటికి దీపం ఇల్లాలే సినిమాలకు చాయాగ్రహణముతో బాటు దర్శకత్వము కూడా నిర్వహించినారు.  తమిళములో వీరు మనప్పందల్, ఆనంద జోది, మొదలైన సినిమాలకు దర్శకత్వము మరియు ఛాయా గ్రహణము నిర్వహించినారు. సినిమాలకు కూడా ఛాయాగ్రాహకుడిగా పనిచేసినారు. వి.ఎన్.రెడ్డి గారు 1907లో కడప జిల్లా సిద్ధవటంలో జన్మించినారు. 20 ఏళ్ల వయసులోనే 1937లో ఛాయగ్రహణంలో తన ఆసక్తిని అభివృద్ధి చేసుకొని ఆ రంగంలో స్థిరపడటానికి బొంబాయి చేరి మూడు సంవత్సరాల పాటు ఎస్.హర్‌దీప్ వద్ద సహాయకునిగా చరణోంకీ దాసి, వసంతసేన వంటి రెండు మూడు సినిమాలలో పనిచేసినాడు. ఐదేళ్లు కృషిచేసిన తర్వాత 1952లో ఛాయగ్రాహకునిగా పనిచేసే అవకాశం వచ్చింది. రాజ్‌కపూర్ నటించిన ఆగ్ సినిమాకు వి.ఎన్.రెడ్డి కైయారొస్కూరో లైటింగ్ టెక్నిక్‌ను ఉపయోగించి అందించిన అత్యద్భుత ఛాయాగ్రహణం విమర్శకుల ప్రశంసలను అందుకున్నది." ప్రఖ్యాత సినిమా నటుడు, నిర్మాత దర్శకుడు నగు మనోజ్ కుమార్ కు చాలా ఇష్టమైన ఛాయా గ్రాహకుడు. పైగా షమ్మీ కపూర్ సినిమాలకు పని చేయట మంటే ఎంతో ప్రతిభా సంపత్తులుంటేనేగాని( కాశ్మీర్ కి కలీ, లాట్ సాహెబ్) యాతడు అంగీకరించాడు. అంతటి బ్రహ్మాండమైన ఛాయా గ్రాహకుడు ఆయన.


 స్వయంగా B.N.రెడ్డి గారి తమ్ముడు. షావుకారు, పాతాళ భైరవి, మిస్సమ్మ, మాయా బజారు, ఎన్ని సినిమాలో తెలుగుతో, తెలుగుదనం తో, తెలుగు వనం లో పూసిన విజయా వారి వాడని పూవులు. చక్రపాణి గారితో కలిసి వీరు నిర్మించిన సినిమాలు నభూతో న భవిష్యతి. భారత ప్రధాని, నీతినియమనిష్ఠాగరిష్టుడు అయిన  మొరార్జీ దేశాయి ‘బాగున్నారా చందమామ రెడ్డి గారూ’ అని పలకరించేవారు ఎప్పుడు కనిపించినా! చందమామ మాసపత్రిక చక్రపాణి గారి మానస పుత్రికయైనా స్నేహితుని మాట తుచ తప్పకుండా పాటించి అటు సహవాసానికి, ఇటు బాలల మనో వికాసానికి, తెలుగు జాతి బావుటా కలకాలము ప్రపంచము నందు రెపరెపలాడటానికి కారణమైన అఖండ ఆంద్ర దేశపు కలికి తురాయి B. నాగిరెడ్డి గారు. ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డునందుకొన్న మొదటి అన్నదమ్ములు వీరే!

యోగి వేమన ఈ పులివెందుల ప్రాంతము వాడు.
ఒక్క వేమన పద్యమన్నా తెలియని 30 సంవత్సరములకు పై బడిన వారిలో ఉండరేమో!
ఆధునిక కవితకు శ్రీశ్రీని, వచనమునకు కొడవటిగంటి కుటుంబరావు గారిని చెప్పుకొన్నట్లు విమర్శకు కడపజిల్లా పులివెందుల వాస్తవ్యుడైన శ్రీయుతులు రాచమల్లు రామచంద్రారెడ్డి గారిని ఆంధ్రదేశములో తలపోస్తారు. ఇదేవూరి వాడయిన గజ్జెల మల్లారెడ్డి గారు ‘పాతికేళ్ళుగా నేను కూడబెట్టుకున్న కీర్తిని పాతిక గేయాలతో తస్కరించినా’ వని శ్రీశ్రీ  గారితో ప్రశంశలందుకొన్న యశస్వి. ఉన్నత పాఠశాల విద్యకు గూడా నోచుకోని ఈయనకు DOCTORATE యిచ్చి సత్కరించింది శ్రీ వెంకటేశ్వరా విశ్వ విద్యాలయము.
అసలు విచిత్రమేమిటో గానీ పులివెందుల తాలూకా లోని ఎద్దలయ్య గారి కొత్తపల్లె కు బహుశా ఆంధ్రదేశములో ఏ పల్లెకూ లేని గొప్పదనము వుంది. పైన తెలిపిన B.N.రెడ్డి,
B. నాగిరెడ్డి గారలే గాక మాజీ రాష్ట్ర మంత్రి శ్రీ పెంచికల బసిరెడ్డి ఇక్కడివారు. అసలు మొదటి ప్రపంచ యుద్ధమునకు ముందే ఇంగ్లాండు దేశమునకు ఒకేసారి  వెళ్లి Barister పట్టా పుచ్చుకున్న ఐదుగురు వ్యక్తులు ఈ ఊరి వారు. వారు 1. కొక్కంటి సుబ్బారెడ్డి, 2. లింగిరెడ్డి వెంకట రెడ్డి, ౩. చింతా నరసింహారెడ్డి, 4. గన్రెడ్డి సోమిరెడ్డి, 5. V.H. రామిరెడ్డి.
 రామిరెడ్డి గారు ఆ నాటి I.C.S. ఈ చిన్న గ్రామము నుండి 70 మంది ఉన్నతాధికారులు దేశములోని వివిధ ప్రాంతములలో  ఆ కాలములో పనిచేసే వారు. తనదైన శైలిలో సమర్థుడనిపించుకొన్న సంయుక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ YS రాజ శేఖర రెడ్డి గారు ఇక్కడి వారు. అన్నివిధాలా లోక ప్రసిద్ధులు కావున వారిని గూర్చి నేను ప్రత్యేకముగా ఏమి చెప్పగలను. ఇంతవరకు పులివెందులను గూర్చి చెప్పిన విషయములలో, నాకు తెలిసిన విషయములకన్నా ‘శ్రీయుతులు మారకా సూర్యనారాయణ రెడ్డి గారు వ్రాసిన చరిత్రలో పులివెందుల’ అన్న పొత్తము నుండి గ్రహించినవి మిక్కుటము.

జానపద బ్రహ్మ కలిమి శెట్టి మునయ్య

మునయ్య పేరు చెబుతూనే నాలో ఒక ఉత్సాహము ఒక ఉద్వేగము తెలియకుండానే కలుగుతాయి. ఈయన పుట్టినది 1943 లో.  జానపద గాయకునిగా లోకానికి పరిచయమైనది 1979 లో. అంటే తన ౩6 వ సంవత్సరములో . రోడ్డు ప్రమాదము ఆయన వెళుతూ వుండిన  జీపునకు జరుగుటతో  కీర్తిశేషుడైనది 1997లో (మె1). అంటే ఆయన గుర్తింప బడిన జానపద కళాకారునిగా కొనసాగినది కేవలము 18 సంవత్సరములు మాత్రమే! అయినా రాయల సీమను ఆంద్ర దేశాన్ని ఒక ఊపు వూపినాడు. తాను అకాల మరణము చెందకుండా వుండియుంటే ఎన్నో విదేశాలలో నిస్సందేహముగా తన గానామృత ఝరిని ప్రవహింప జేసి యుండే వాడు.

సాలెవారగుటచే పెద్దలది చేనేత వృత్తియైనా వారి తాత శ్రీయుతులు చౌడప్ప గారి వద్ద యక్షగానము, కోలాటము, పండరి భజన మొదలుగునవి బాల్యముననే సాధన చేసినాడు. తండ్రి కీ.శే. పెద్ద రామయ్య గారి వద్ద నుండి కూడా ఆయన ఎంతో నేర్చుకొన్నారు. అసలు తన అన్న తనను తెల్లవారు ఝామున నీటి లో ముంచి సాధన చేయించే వారన్నది తాను నాకు చెప్పిన మాట. ఎందుకంటే నేను అతని స్నేహితుని మరియు సహాధ్యాయిని. ఈ సందర్భములో ఒకమాట చెప్పుకోనవలసి వస్తుంది. మేము ఇరువురము ఒకే తరగతి ఒకే కక్ష్యలో వుండే వారము. ఆయనకు నాకు 4 సంవత్సరముల వ్యత్యాసము. 7వ తరగతి 8వ తరగతి లో మేము మంచి స్నేహితులము. మా డ్రిల్ టీచర్ శ్రీయుతులు సుబ్బారెడ్డి గారు  ఎండ అమితముగా వుంటే డ్రిల్ క్లాసులో ఒక నీడనిచ్చే చెట్టుక్రింద కూర్చోబెట్టి పాటలు పాడించే వాడు. మునయ్యది ప్రథమ స్థానము. ఆ తరువాత మరియొక మిత్రుడు గంగాధరయ్య. ఆతరువాత నేనో  నా మిత్రుడు గోపాలో ఎవరైనా ఒకటే! మా పాటల కచ్చేరీ తో ఆ పీరియడ్ గడచి పోయేది. కానీ మునయ్య ఘంటసాల గారి పాటలు పద్యములు పాడేవాడు. ఈ మాట వ్రాసేటపుడు కూడా ఆ దృశ్యము యధా తథముగా మనో ఫలకముపై  మెదలుతూ వున్నది. గంగాధరయ్య కూడా పద్యాలు, A.M. రాజా గారి పాటలు పాడేవాడు. వారి ఇంట్లో ఆ కాలానికే గ్రామఫోను వుండేది.
మునయ్య పాడిన ఆ పాటలు ఈనాటికీ ఆపాత మధురాలు. గంగాధరయ్య కూడా షణ్ముఖి ఆంజనేయరాజు వలె పాడేవాడు, గోపాలు దారినబోయే దానయ్య లాగా నేను మందుగొట్టిన మానయ్య లాగా పాడేవారము. 
ఆయన ఎనిమిదవ తరగతి వరకు స్కూలులో ఫస్ట్ వచ్చేవాడు. అక్షరాలూ ఆణిముత్యాలే. చదువు చాలించిన వెంటనే ఆయన మా గురువు తెలుగు పండితులైన వెల్లాల శేషాద్రి శర్మ గారి వద్దకు పోయి తెలుగు సంగీతము లోని కొన్ని మెళుకువలు గ్రహించేవాడు . అనతి కాలములోనే ఒక శతకమును వ్రాసి కవియైనాడు. ఆ తరువాత మరిన్ని రచనలు చేసినాడు.
మునయ్య మంచి చిత్రకారుడు. ఆయన దానినే వృత్తిగాచేసుకొని వీరపనాయని పల్లెలో డ్రాయింగ్ టీచరుగా ఉండినాడు. ప్రవృత్తి మాత్రము వదలేదు. అదే ఆయన కీర్తిని ఉన్నత శిఖరాలకు చేర్చింది.
ఎంతో కష్టపడినాడు ఆయన జానపద గీతములను పల్లె పల్లె తిరిగి సేకరించుటకు. అసలు ఈ జానపద కళకు వెలుగు తెప్పించినది జే.ఏ. బాయ్లీ అన్న ఆంగ్లేయ దొర యని  ఆయన తన పరిశోధన లో పేర్కొన్నాడు. గురువు పాలూరు సుబ్బన్న గారి వద్ద ఈ జానపద సాహిత్యమును గూర్చి తెలుసు కొనుటయే గాక ఆయన ద్వారా G.N.రెడ్డి డా. బిరుదురాజు రామరాజు వంటి ప్రముఖులతో కూడా పరిచయము అయినది. ఎన్నో విధములైన సహాయములు మరెన్నో వివరములు వారివద్ద నుండి గ్రహించి యా అనుభవములను తన పోత్తము లో వ్రాసినాడు.
ఆయన పాడిన పాటలు అన్నీ సుధా రస ధారలే. 'సైరా నరశింహా రెడ్డి....' అన్న పాట, ఆంగ్లేయులపై ధ్వజమెత్తి కోయలకుంట్ల తాలూకాఫీసుకే పోయి తహసీలుదారుని తలకోసి ఆంధ్రావని లోని మొదటి స్వాతంత్ర్య యోధుడైనాడు. 
నరసింహారెడ్డి గారు  అల్లూరి సీతారామ రాజు గారి కంటే ముందు వాడు, పాడితే వెంట్రుకలు ఎవరికైనా నిక్కబొడుచుకొని తీరవలసినదే! 'తూరుపూదిక్కూన...' అన్నపాట కూడా ఎంత విన్నా వినాలని పించేది.
ఇటువంటి ఒక మహా కళాకారుని అకాల మరణము కడప జానపద కళకు నిజముగా ఆశనిపాతమే!
ఇప్పుడు మీకు అర్థమై వుంటుంది నా ఉత్సాహానికి ఉద్వేగానికి కారణము.

ఇప్పుడు మరియొక ప్రముఖుని గూర్చి చెబుతాను. అట్టహాసమునకు, ఆడంబరమునకు ఆవగింజంత తావివ్వని మహానుభావుడు   కడప జిల్లాకు చెందిన ఉమామహేశ్వరరావు గారు. వీరు  ప్రముఖ న్యాయవాది మరియు రంగస్థల నటుడు. న్యాయవాది అయినా రచనలకే ప్రాధాన్యతను ఇచ్చినారు. ఈయన  రచయిత మరియు నాటక కర్త. వెల్లాల ఉమామహేశ్వరరావు గారు తెలుగు సినిమా తొలితరం హీరోల్లో ఒకరు.   ఈయన ఇల్లాలు సినిమాలో కథానాయకునిగా ఏకంగా నాటి మేటి నటి కాంచనమాలతోనే  సినీ రంగప్రవేశం చేసినారు. పెద్ద పొడుగరి కాదు  గానీ , చాలా అందంగానూ ఆకర్షణీయంగానూ  ఉన్న ఉమామహేశ్వరరావు గారు  సినిమాలపై మోజుతో సినీ నాయకుడైనాడు కానీ . ఆ తరువాత ఈయన 1943లో విడుదలైన మరో రెండు సినిమాల్లో మాత్రమే నటించినాడు. అవి నాగయ్య గారి సొంత చిత్రమైన భాగ్యలక్ష్మి (పి.పుల్లయ్య గారు దర్శకులు) మరియు గూడవల్లి రాంబ్రహ్మం గారి యొక్క పంతులమ్మ. రావు గారు స్వయంగా"లేపాక్షి" అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ ఫిలిమును నిర్మించినారు. ఆయన లాయరు, కానీ ఆంధ్రాంగ్లములందు గొప్ప పండితుడు. కాలేజీ రోజులలోనే తన మిత్రులు పాళ్ళూరు సుబ్బణాచార్యులు మఠం వాసుదేవమూర్తి తో కలిసి 'కవికుమారసమితి'గా ఏర్పడి క్రొక్కారు మెఱుగులు, తొలకరి చినుకులు అనే ఖండకావ్య సంకలనాలను వెలువరించినారు. 1960 లో షేక్స్పియర్ నాటకముల నన్నింటినీ ఆంధ్రీకరించినారు. వారున్న కడప లోని మోచంపేట లోనే మేమూ వుండేవారము. నేను చిన్నవాడిని కాబట్టి ఆయనతో ఏరోజూ మాట్లాడలేదు కానీ ఆయనలోని ప్రశాంతత నిగర్వము నన్నెంతో ఆకట్టుకొనేది.  తెల్ల లాల్చీ, తెల్ల పంచ ఆయన దుస్తులు. వీరు పుట్టపర్తి నారాయణా చార్యులవారి మిత్రులు.

పూర్వము, మట్లి రాజులు, చంద్రగిరి రాజులు అలిపిరి , శ్రీవారిమేట్టు మెట్లు కట్టించక పూర్వము భక్తులు ఈ జిల్లాలోని శెట్టికుంట నుండి అడవి, కొండ మార్గములో నేరుగా తిరుమల చేరేవారు. ఆ దారి వెంకటేశ్వరాలయమునకు ఎదురుగా ఉండే బేరి ఆంజనేయస్వామి వీపు వైపునకు చేరుతుందట. శెట్టికుంటకు దగ్గరగా వుండే ఔత్సాహికులు కొందఱు ఇప్పటికీ ఆ దారిన వెళుతూ ఉంటారని విన్నాను. తెలుగును ఆదరించిన బ్రౌన్‌ దొర కలెక్టరుగా పాలించిన గడ్డ. తిరుమలేశుని తొలి గడపగా పిలువబడుతున్న కడపకు ఎన్నో ప్రత్యేకతలు  ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. రాయలసీమ అంటే ఫ్యాక్షన్‌ ప్రాంతమని, అందులో  కడప జిల్లా అంటే ఇకా భయంకరమని, బాంబుల తయారీని కుటీర పరిశ్రమగా ఏర్పాటైన ప్రాంతమని చాలా మంది భావిస్తారు. ఇదే విధానాన్ని ఈ జిల్లా వాసులు కొనసాగిస్తున్నట్లు, సినిమాలు ప్రచారం చేయడంతో అది వాస్తవమని భావించేవారి సంఖ్య అధికమై పోయింది. అయితే కడప జిల్లా బాంబుల జిల్లా కాదు. ఉన్న మాట చెప్పుకోవలసి వస్తే కొందరు స్వార్థపరుల చేతిలో బడి ఈ చెడ్డ పేరునకు ఆస్కారమిచ్చిన మాట వాస్తవమే! అంత మాత్రాన కడప చెడ్డదై పోదు. ఈ జిల్లా బంగారు జిల్లా అనేందుకు అనేక నిదర్శనాలున్నాయి. ముందు అసలు ఈ  నాలుగు జిల్లాల ప్రాంతమునకు రాయలసీమ అన్న పేరెట్లు వచ్చిందో గమనించండి.
16, 17 శతాబ్దాలలో పరిపాలించిన ఈ మట్లి రాజుల కాలములోనే వ్రాయబడిన అభిషిక్త రాఘవముఅన్న ప్రబంధములో రాయల సీమఅన్న పేరు కానవస్తూ వుంది, కానీ ఈ దత్త మండలములు (నవాబులు ఆంగ్లేయులకు ధారపోసినవి అత్త సొత్తు అల్లుడు దానము చేసినట్లుగా!) రాయల సీమఅన్న పేరును మాత్రము పొందినది శ్రీయుతులు చిలుకూరి నారాయణ రావు గారి దయ వల్లనే అని సహేతుకముగా డాక్టరు అవధానం నాగరాజారావు గారు నిరూపించినారు.
1928 నవం బరు 17, 18 తేదీలలో దత్త మండల సమావేశము జరిగినపుడు, 18 వ తేదీన, మొదటిసారిగా కడప కోటిరెడ్డి గారి అధ్యక్షతన జరిగింది. అప్పుడు దత్తమండలమునకు బదులుగా ఏదయితే బాగుండునన్న ప్రస్తాపన బలము పుంజుకుంది. అప్పుడు సభలోనే ఉన్న నారాయణ రావు గారు రాయలసీమఅన్నారు. ఈ ప్రాంతమునకు చేయబడిన ఆ నామకరణము పప్పూరి రామాచార్యులువారిచే ప్రతిపాదింపజేసి సభచే ఆమోదింపజేయటము సంభవించినది. దత్తమన్న మాట మెత్తగా చేయి జారి చెత్తబుట్ట లోనికి పత్తా లేకుండా చేరిపోయింది.
శ్రీయుతులు నారాయణ రావు గారికి ఈ దత్తశబ్దము ఎంత వెగటో వారు వ్రాసిన ఈ మంజరీ ద్విపద చూదేండి.
దత్త నందురు నన్ను దత్తనెట్లగుదు
రిత్తస మాటల చేత చిత్తము కలగె
ఇచ్చినదెవ్వరో పుచ్చినది ఎవరొ
పుచ్చుకొన్నట్టియా పురుషులు నెవ్వరొ
తురక బిడ్డండిచ్చె దొరబిడ్డ బట్టె
అత్త సొమ్మును ఇచ్చె అల్లుండు దాన
మమరజేసినటన్న యట్లున్నదిదియ
వారు శ్రీకాకుళము నుండి అనంతపురమునకు ఔద్యోగిక బదిలీ లో వచ్చినారు. కానీ ఈ కర్మ భూమిని తన జన్మ భూమికన్నా మిన్నగా ప్రేమించి సేవ చేసిన మహానుభావుడాయన. రాయలసీమ పండితులకు స్వోత్కర్ష దూరమని తెలుసుకొని నాటి శ్రేష్ఠ పండితులగు దుర్భాక రాజశేఖర శతావధాని గారికి, గడియారం వెంకట శేష శాస్త్రి గారికి పుట్టపర్తి నారాయణాచార్యుల గారికి ఇంకా నాటి, ఉపఙ్ఞత కల్గిన   అనేకమందిని , అనేక పండిత సభలనేర్పరచి సన్మానించినారు, స్వతహాగా తనే గొప్ప పండితుడైయుండి కూడా! ఆంధ్రము సంస్కృత జన్య భాష యని నిరూపించి తెలుగులో మొదటి PhD ని దక్షిణ దేశమున ప్రఖ్యాతి గాంచిన మద్రాసు విశ్వ విద్యాలయము నుండి గ్రహించిన మేధావి.

ఖనిజ సంపద, పదకవితా పితామహుడు అన్నమయ్య, కాల జ్ఞాని శ్రీ మద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, ఇలాంటి వారందరికీ జన్మస్థలం ఈ జిల్లా. ఈ జిల్లా చరిత్రలోకి వెళితే హిరణ్య రాష్ట్రంగా పేరును పొంది మహానుభావుల పుట్టిల్లుగా విరాజిల్లుతోంది. రాయలసీమ జిల్లాలకు నడిబొడ్డున వున్న కడప గురించి ఎంతగా, ఎన్నిసార్లు, ఎన్ని విధాలుగా చెప్పినా రోజులు చాలవు. ఉత్తర అక్షాంశం 13 డిగ్రీల నుండి 40 డిగ్రీల వరకు 15 డిగ్రీల నుండి 15కు మధ్యగానూ, తూర్పు రేఖాంశం 77 డిగ్రీల నుండి 55 కు, 79 డిగ్రీల నుండి 30 కు మధ్య గానూ కడప జిల్లా విస్తరించి ఉంది. ఈ జిల్లా వైశాల్యం 15.373 చదరపు కిలోమీటర్లు. ఉత్తరంలో కర్నూలు, తూర్పున నెల్లూరు,దక్షిణాన చిత్తూరు, పశ్చిమాన అనంతపురం జిల్లాలు సరిహద్దులుగా కడప జిల్లా ఏర్పాటు అయింది. భౌగోళికంగా కడప జిల్లా రాయలసీమ నడిబొడ్డున వుంది.


నైసర్గిక విశేషాలు:
కడప జిల్లాలో జీవనదులు లేవు. ఒక్కప్పటి జీవ నది అయిన పెన్నా(పినాకిని) ఈ జిల్లాలో పడమర నుండి తూర్పు దిశగా ప్రవహిస్తూ వెలిగొండ కనుమల్లో నుండి సోమశిల వద్ద నెల్లూరు జిల్లాలోకి ప్రవహిస్తోంది. పెన్నా నది ఉపనదులు కుందేరు(కుముద్వతి), సగిలేరు, చిత్రావతి, పాపాగ్ని, చెయ్యోరు(బాహుదా), పించా, మాండవీ, ఇవి గాక మరెన్నో
వంకలు, వాగులు, ఈ జిల్లాలో అనేకం వున్నాయి. ఏజెన్సీ ప్రాంతాన్ని విడిస్తే ఆంధ్రప్రదేశ్‌లో కడప జిల్లా అత్యధికమైన పర్వత ప్రాంతం గల జిల్లా. ఈజిల్లాలో ఎర్రమల , నల్లమల, లంకమల, వరుసలు, పాలకొండ, భైనుకోటమల, మల్లెల కొండలు, కోకలెటి కనుమకొండలు, చిట్వేలి కొండలు, రాయచోటి తాలుకాలోని పెక్కు
చిల్లరమ్మ కొండలు, గుట్టలు అనేకం వున్నాయి. ఈ జిల్లాలో 1,180,198 ఎకరాల అటవీ ప్రాంతం వుంది. కడప జిల్లా వైశాల్యంలో ఇది 90 శాతం ఆక్రమించింది.

సామాజిక నాగరికత సంస్కృతి:
భారతదేశంలో సర్వత్రా కనిపించే సామాజిక లక్షణాలే కడప జిల్లాలోనూ కనిపిస్తాయి. ఎరుకుల, కురవ, సుగాలి(బంజారా, లంబాడి), గణాలున్నాయి. హిందూ మత శాఖలైన శైవ వైష్ణవ భేధాలకు చెందిన 50కి పైగా వున్న కులాలు కనిపిస్తాయి. అరవ, మహారాష్ట్ర జాతులు, మహ్మదీయులు, క్రైస్తవులు, గణనీయమైన సంఖ్యలో ఈ జిల్లాలో
ఉన్నారు. జైనులు, బుద్దులు, ఇప్పుడు స్వల్పంగా వున్నా జైన, బౌద్ద మతాల ప్రభావం ఒకప్పుడు జిల్లాలో ప్రముఖముగా వుండేవి. ఏడవ శతాబ్దంలో కడప ప్రాంతంలో పర్యటించిన హ్యూయన్‌సాంగ్‌, ఆనాడే కడప ప్రాంతంలో హిందూ దేవాలయాలు, బౌద్దారామాలు, జైననిర్గాంతాలున్నట్లు తెలియజేసినాడు. దానవులపాడు ఒకప్పుడు ప్రసిద్ధ జైన నిర్గాంతం పురాతత్వ పరిశోధన ద్వారా ఆవిష్కరించదగ్గ అంశాలు ఈ విషయమై చాలా ఉన్నాయి. జిల్లాలో అధిక సంఖ్యాకుల మాతృభాష తెలుగు, హిందుస్తానీ, కన్నడం, మరాఠీ, హిందీ, తమిళం, ఎరుకల, లంబాడీ బాష వ్యవహారాలు కూడా కడప జిల్లాలో తగు మేరకు ఉన్నారు. ఈ అంశాలు కడప జిల్లాలో గల వివిధ భాషా సంస్కృతుల సమ్మేళనాన్ని వ్యక్తం చేస్తాయి.
రేఖామాత్ర రాజకీయ చరిత్ర:
నేటి కడప జిల్లాకు దాదాపు రెండువేల ఏళ్ళ లిఖిత చరిత్ర ఉంది.  అశోకుడు
మొదలుకొని శాతవాహన, పల్లవ, చాళుక్య, చోళ, రాష్ట్రకూట, బామ, నైదుంబ మౌర్య చక్రవ, పాండ్య, కాయస్థ, కాకతీయ, విజయనగర మట్లి వంశ రాజరికాలను, మహమ్మదీయ పరిపాలకుల ప్రభుతనూ, మహారాష్ట్ర దండయాత్రలనూ, పాలెంగాడ్ర పెత్తనాన్ని, బ్రిటిష్‌ సామ్రాజ్యాధిపత్యాన్ని ఈ గడ్డ చవిచూసింది.
అటుతర్వాత భారత స్వాంతంత్య్రోద్యమం, ఆంధ్ర రాష్ట్రోద్యమం, సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమాల
వేడి గాలులు కూడా ఈ నేలమీద వీచినాయి. ఆయా చారిత్రక కాలాల్లో ఈ జిల్లా హిరణ్య రాష్ట్రం--- రేనాడు, ఇనగల్లూరునాడు, పొత్తపినాడు, గండికోట సీమ, సిద్దవటం సీమ మొదలైన భౌగోళిక విభాగాలకు చెందిన ప్రాంతంగా కనిపిస్తుంది.
మౌర్య చక్రవర్తుల నుండి రేనాటి చోళుల దాకా కడప జిల్లా రాజకీయ చరిత్రను నిర్దుష్టంగా తెలపడం ఇప్పటికి దొరికిన చారిత్రక సాక్ష్యాలను బట్టి సాధ్యం కాదు. కానీ పడమర ఉన్న అనంతపురం జిల్లా ఎర్రగుడి గ్రామంలోనూ ఉత్తరాన ఉన్న కర్నూలు జిల్లా రాజాలమందగిరి గ్రామంలోనూ లభించిన అశోకుని శాసనాలను బట్టి ఈజిల్లా మౌర్య సామ్రాజ్యంలో చేరి ఉండేదని చెప్పవచ్చు. అలాగే జమ్మలమడుగు తాలుకా పెద్దముడియంలో లబించిన శాతవాహన కాలపు నాణెములను బట్టి యా ప్రాంతం శాతవాహన రాజ్యంలో ఉండేదని భావించ వచ్చు. క్రీ.శ.18,19 శతాబ్దాలలో విచ్చలవిడిగా ఉండే పాలెగాళ్ళను అణచి ఒక క్రమ పరిపాలనా వ్యవస్థవు ఏర్పరచి రైతువారీ భూస్వామ్యాన్ని కూడా మన్రో స్థాపించినాడు. బ్రిటిష్‌ సామ్రాజ్యాధిపత్యం ఈ జిల్లాలో స్థిరపడింది. క్రీ.శ. 1832లో జరిగిన కథకు అడిషనల్‌ సబ్‌ కలెక్టర్‌ మాక్‌ డొనాల్డ్‌ హత్య ఘటన వెనుక 1857లో జరిగిన తొలి భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రజలను చేరవలసిందిగా షేక్‌ పీర్‌షా చేసిన విజ్ఞప్తి వెనుక భారత ప్రజలందరివలెనే, కడప సీమ వాసుల బ్రిటిష్‌ వ్యతిరేకతా, స్వాతంత్య్రేచ్ఛ కనిపిస్తాయి. క్రీ.శ.  1900 తర్వాత ఎందరో రాజకీయవేత్తలు, మేధావులు, సామాన్యులు భారత జాతీ య కాంగ్రేస్‌ సంస్థ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొని మాతృదేశ స్వాతంత్య్రం కోసం పోరాడినారు. హోంరూలు ఉద్యమంలో అనిబిసెంట్‌ నాయకత్వం క్రింద, విదేశీ వస్త్ర బహిష్కరణోద్యమంలోనూ, క్విట్‌ ఇండియా ఉద్యమంలోనూ గాంధీజి నాయకత్వాల క్రింద ఈ జిల్లా నాయకులెందరో పాల్గొన్నారు. రాయలసీమతో పాటు 1953 వరకు ఈ జిల్లా మద్రాసు అవిభక్త రాష్ట్రంలో ఉండేది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని రాజాజీ ప్రభుత్వంలో మంత్రిగా కడప కోటిరెడ్డి గారు వుండేవారు. బారిస్టరు చదివి కూడా వకీలు వృత్తి వదిలి దేశ స్వాతంత్ర్యమునకు పాటుపడిన మహనీయుడు ఆయన. వారి సతీమణి శ్రీమతి రామ సుబ్బమ్మ గారు కూడా భర్తతో బాటు రాజకీయాలలో చురుకుగా పాల్గొనేవారు. ఈయన నీలం సంజీవ రెడ్డి గారి రాజకీయ గురువు.   1953 ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత టంగుటూరి ప్రకాశం పంతులు గారి  మంత్రివర్గంలో కూడా పనిచేసినారు.
నాకు సహోదర సమానుడు, కడప వాస్తవ్యుడు అయిన నైషధము ప్రతాప్ ఇచ్చిన సమాచారమును యథా తథముగా ఆంగ్లములోనే మీకు మనవి చేసుకొంటాను.
  I like to inform you that Kadapa is the gate way of Kaasi and Rameswaram. In olden days people used to travel on river banks as habitations will be there to rest and path will be plain. Put to Cuddapah the riverbed comes from Raouji Gandi the hills will not be plain. Hilly way from Cuddapah the valley from Kanumalopalli begins. Valley is preferred instead of climbing hill. This route leads to Kanchipuram Rameswaram. Cuddapah was called Dehali pura. It means entrance gate. It was more popularly called KRUPAPURA. The town of mercy as the people here offered free food & shelter to all the travellers. The name existed till 1800 also .in Europe the district of Krupah indigo got good price and if mentioned as Cuddapah it was offered less as the name was not so Populer there. But in 1100 AD itself the name appears in Silasasana as Kadapa kati Cheruvu land was to Jainacharya by Chola king. In 2nd AD Poulomi a geographer mentioned in the map as Kirpa corrupt word to Kripa or prakrutha word Kariga was also a name in past means melting ( driven by the kindness of people that is, in telugu,  manushulu). Kadapa all sides will have hills and only one valley route towards south. Hence entrance gate to whole south .being all season route. Costal routes are not preferred as rivers deep wide and multiple divided river channels are to be crossed. Disturbed weather conditions. Tirupathi came to existence only in 12th A.D. prior to that it was Jain Buddhist shivites subramanya swami. So many conversions. Lankamala hills near Sidhout was Lanka's secret agent's place to observe the moment of enemies. Many more to say this for your information. I have studied deep in this matter Anna.
Thank you Prasad once again.

ఇక ఇక్కడ వెలసిన చారిత్రక పౌరాణిక ప్రసిద్ధి గలిగిన పుణ్య క్షేత్రాలను గూర్చి కాస్త విచారించుదాము.
దేవుని కడప:  ఇక్కడి వేంకటేశ్వర స్వామిని కృపాచార్యులు ప్రతిష్ఠించినారని ప్రతీతి. అందు వలన ఈ పట్టణానికి కృపాపురమని పేరు ఉండినది అని అంటారు. కృపాపురమే కడపగా మారినదేమో! క్రీ.శ. 2వ శతాబ్దంలో టాలెమీ అను విదేశీ యాత్రికుడు కడపను దర్శించినాడు. బహుశ విదేశీయుడు కాబట్టి ఈ ఊరిని కరిపె, కరిగె అంటారని తన యాత్రా పుస్తకములో వ్రాసుకున్నాడు. విజయనగర రాజులు, నంద్యాల రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినారు. మడిమాన్యాలు, బంగారు సొమ్ములు ఈ స్వామికి సమర్పించినారు. తాళ్ళపాక అన్నమాచార్యులు ఈ స్వామి మీద 12 కీర్తనలు వ్రాసినారు. దక్షిణ ప్రాంత యాత్రికులు కాశీ వెళ్ళడానికి ఉత్తర భారతదేశ యాత్రికులు రామేశ్వరం వెళ్ళడానికి తిరుమల వేంకటేశ్వరుని వద్దకు కాలిబాటన వెళ్ళేవారికి కడపే ప్రధాన మార్గం. ఈ కారణంగా మూడు చోట్లకు వెళ్ళే భక్తులు ఖచ్చితంగా ఇక్కడ మొదటిగా శ్రీ లక్ష్మీప్రసన్న వేంకటేశ్వరుణ్ణి, సోమేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం మూడు క్షేత్రాలకు వెళ్ళేవారు. ఇందువల్లనే ఇది దేవుని తొలి గడపగా ప్రసిద్ధి చెందింది.
తిరుమల వరాహ క్షేత్రం కాగా ఇది హనుమ క్షేత్రం. అందుకు చిహ్నంగా ఇక్కడ స్వామి వెనుక భాగాన నిలువెత్తు విగ్రహరూపంలో ఆంజనేయ స్వామి నెలకొని ఉన్నాడు. తిరుమల వేంకటేశ్వరుని వద్దకు కాలిబాటన వెళ్ళేవారికి కడప ప్రధాన మార్గముగా ఆ కాలములో వుండేది. ఈ కారణంగా భక్తులు ఇక్కడ మొదట శ్రీ లక్ష్మీప్రసన్న వేంకటేశ్వరుణ్ణి, తరువాత నందలూరిలోని సౌమ్యనాథ స్వామిని దర్శించుకుని అనంతరం తిరుమల వెళ్ళేవారు.  ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఉగాదినాడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మహమ్మదీయులు స్వామి వారిని దర్శించుకుంటారు. వారితో పాటు జైనులు కూడా వస్తూ ఉంటారు. రథసప్తమి రోజు క్రిక్కిరిసిన భక్తులు స్వామి రథాన్ని కులమతములకు అతీతంగా అందరూ లాగుతారు.
బ్రహ్మంగారిమఠం లేక కంది మల్లాయ పల్లి:
ఒక మహాయోగి,  చారిత్రక వ్యక్తి, కాలజ్ఞానకర్త, సిధ్ధపురుషుడు, సంఘసంస్కర్త  అయిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి  పవిత్ర సంచారం తో, పవిత్రబోధలతో ప్రసిద్దమైన ఈ కందిమల్లాయ పల్లి  దర్శనం  సర్వపాపహరణం  గా భక్తులు భావిస్తారు. 175 సంవత్సరములు జీవించి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు క్రీ.శ 1694 శ్రీముఖనామ సంవత్సర వైశాఖ శుద్ద దశమి ఆది వారం నాడు  జీవసమాధి అయినట్లు తెలియుచున్నది. శ్రీ బ్రహ్మంగారి కుమారుడైన గోవిందయ్య కుమార్తె శ్రీ ఈశ్వరమ్మ జన్మతః బ్రహ్మజ్ఞాని గా కొనియాడబడినది.  ఈమె సమాధి కూడ మనకు కందిమల్లాయపల్లె లో దర్శనమిస్తుంది. ఈశ్వరమ్మ నాయనమ్మ పేరు కూడా ఈశ్వరమ్మే! వారి చరిత్ర ఏ మంచి పుస్తక విక్రయ శాలలో నైనా కొని చదువ వచ్చు.
కందిమల్లాయపల్లె(లోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠము అంటే) బ్రహ్మం గారి మఠము.
బనగాని పల్లె రవ్వల కొండ లో కాలజ్ఞాన రచన గావించిన బ్రహ్మం గారి తాళపత్ర గ్రంధములు మఠములో నేటికీ భద్రముగా వున్నాయి. ఆయన బనగాని పల్లెలోని గరిమిరెడ్డి అచ్చమ్మ వద్ద గోపాలకునిగా ఉండినాడు. ఆయన మహత్తు తెలిసి ఆమె తన కుమారుని అంధత్వమును పోగొట్టమంటే తన తపశ్శక్తితో అతనికి చూపు తెప్పించినాడు.
కాలాంతరమున కందిమల్లాయపల్లె కు వచ్చి అచటనే స్థిరనివాసమేర్పరచుకొని సిద్ధి పొందిన మహనీయుడు. ఎన్నెన్నో మహిమలు, మహత్తులు చూపిన మహనీయుడు ఆ మహానుభావుడు.  బ్రహ్మంగారు వైదిక మతావలంబకులైనా కులమతాలకు అతీతంగా వ్యవహరించినారు. దూదేకులవాడయిన సిద్దడు, పంచముడైన కక్కడు ఈయనకు అనుంగు శిష్యులు.
ఈశ్వరమ్మ(1703 - జూలై 12, 1803) ప్రముఖ యోగిని. ఈమె పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి రెండవ కుమారుడు గోవిందయ్య సంతానం ఓంకారయ్య, సాంబమూర్తి, ఈశ్వరమ్మ, కాశమ్మ, శంకరమ్మ లలో ఒకతె. ఈమె గొప్ప యోగిని, మహమాన్వితురాలు. నిగ్రహానుగ్రమ సమర్థ. తాతకు తగ్గ మనుమరాలు. ఈమె వీరబ్రహ్మేంద్ర స్వామి సమాధి చెందక ముందే పుట్టినట్లు కొందరు, సమాధి చెందిన తరువాత పుట్టినట్లు కొందరు వ్రాసినారు.
బ్రహ్మంగారి కుమార్తె వీరనారయణమ్మ సంతతికి చెందిన (ఏడవ తరం)వీరభోగ వసంత వేంకటేశ్వర స్వామి ప్రస్తుత 11వ మఠాధిపతి. ఈయన బ్రహ్మంగారి సాహిత్యం, సారస్వతాలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చినారు. మఠంలో నిత్యాన్నదానం జరుగుతుంది. బ్రహ్మంగారి పేరుతో పలు విద్యాసంస్థలు వెలిసినాయి. సిద్దయ్య మఠము ఈశ్వరమ్మ మఠము చూడదగిన విషయములు కలిగిన స్థలములు.
తాళ్ళపాక: తాళ్ళపాకలో చెన్నకేశవాలయం, సుదర్శనాలయం ఉన్నాయి. సుదర్శనాలయంలో సుదర్శన చక్రం ప్రతిష్ఠించబడి ఉంది. సుదర్శన చక్రం కాశీలో తప్ప మరెక్కడా లేదు. తాళ్ళపాకలో సిద్ధేశ్వరాలయం కూడా ఉంది. సిద్దేశ్వరాలయము శివాలయము. ఈ ఆలయాలు 9, 10 శతాబ్దాల నాటివి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు 1982లో అన్నమయ్య ఆరాధన మందిరాన్ని నిర్మించి ఆ మందిరంలో అన్నమయ్య విగ్రహాన్ని నెలకొల్పినారు. ఇది అన్నమయ్య స్వస్థలము. ఆయన భార్య తిమ్మక్కను తోలి రచయిత్రిగా చెబుతారు. ఆమె సుభద్రా పరిణయము అన్న కావ్యమును రచించింది.
పుష్పగిరి: (పురాణ ప్రసిద్ధము, శంకర పీఠము కలదు. ఈ క్షేత్రము శివకేశవ నిలయము) పుష్పగిరిని గూర్చి వివరముగా, విశదముగా మునుపే మాట్లాడుకున్నాము.
గండికోట : 'బాలనాగమ్మ' సినిమా గుర్తున్న వారికి మాయల మరాఠీ, లేక మాయల ఫకీరు గుర్తుంటాడు. అతను గండికోట ప్రాంతములో ఉండేవాడని కథలో వినిపిస్తుంది. ఆతడు వుండినాడో లేదో గానీ గండికోట మాత్రం వుంది. అక్కడ కోట కూడా వుంది. ధ్వంసమైన రాజభవనాలు దేవాలయాలు కలిగివుంది. మొక్కవోని మసీదులను నిలుపుకొని వుంది . రంగనాథ,మాధవరాయ దేవాలయములు ఎంతో  పేరుపొందినవి, తప్పక చూడదగినవి. భోగపుసాని భవనము పావురాల గోపురము, ధాన్యాగారము, రక్తపు మడుగు, జుమ్మా మసీదు నేను బాల్యమున చూసినవి. ఇప్పుడది టూరిస్ట్ స్పాట్ అయినదని విన్నాను. శత్రువులను చంపిన కత్తులు కడుగుటవల్ల అమడుగులో నీరు ఎప్పుడూ ఎర్రగా ఉండేవి. దేవాలయాలు ధ్వంసమైనా శిల్పకళ చూసి తీరవలసినదే! ఇక జుమ్మా మసీదు గోడలు పాలరాతి గోడలు లాగా చాలా నునుపుగాను తెల్లగాను వుంటాయి. మెట్లపై, పై అంతస్తు చేరుటకు ఎక్కుతూ, దృష్టి పైవైపుకు సారించితే ఇంకొక అంతస్తుకు మెట్ల బాట ఉందన్న భ్రమ కలిగించుతుంది. నిజాని కటువంటిది లేదని నేను చెప్పకుండానే మీకు అర్థమైపోయి వుంటుంది. గండి కోట లోయ 
చూడవలసిన దృశ్యము. ఆ అందము నా మాటల కందదు. మైలవరం డాము ఇక్కడికి 3 కిలోమీటర్లే. గండికోట ప్రాజెక్ట్ ఎందఱో రాయలసీమ వాస్తవ్యులు కన్న కల. కలను కల్లగా జేసిన ఘనత నాటి 
పాలకులదే. ప్రాజెక్ట్ 'ఢాం' అనింది  గానీ ప్రక్కన dam మిగిలింది. నాకు తెలిసిన మేరకు గండి కోటను గూర్చి నాలుగు మాటలు చెబుతాను. గండికోట  కడప  జిల్లా  జమ్మలమడుగు తాలూకాలో పెన్నా  నది ఒడ్డున గల ఒక దుర్గం. ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నదికి మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చింది. ఈ ఇరుకు లోయల్లో నది వెడల్పు 300 అడుగులకు మించదు. దట్టమైన అడవుల మధ్య ఎంతటి బలమైన శతృవు దాడినైనా 
ఎదుర్కొనడానికి ఈ కోట అనువుగా ఉంది. చుట్టూ లోతైన లోయలతో, ఎర్రటి గ్రానైట్ శిలలతో ఏర్పడిన దుర్బేధ్యమైన కొండలతో, 300 అడుగుల దిగువన పడమటి, ఉత్తర దిశలలో ప్రవహించే పెన్నా నదితో, శత్రుదుర్భేద్యంగా వుంటుంది. 

 యన్.టి.ఆర్ నటించిన పాత చిత్రం " గండికోట రహస్యం " సినిమా గుర్తుకొస్తూ వుందా..! నిజమే చాలా మందికి ఈ " గండికోట " పేరు చెప్పగానే అదేదో యన్.టి.ఆర్ సినిమా ఉంది కదా అని అనిపిస్తుంది...! నిజముగా  " గండికోట ఉన్నది కానీ గండికోటకు 'గండికోట రహస్యానికి ఉండేది "తాతా చారికి పీర్ల పండగకు" మరియు "అబ్దుల్ ఖాదరు కు అమావాస్యకు” వుండే సంబంధమే! ఒక్క కడప వాసులలో కొందరికి తప్ప మిగతా తెలుగునాడు లోని తెలుగు ప్రజలెవ్వరికీ తెలియదు.., మన ప్రభుత్వ ఘనకార్యం అది, నిజంగా దౌర్భాగ్యమే...! ఎంతో చారిత్రాత్మక చరిత్ర కలిగిన 
ఒక ప్రాంతం గురించి.. అదీ మనల్ని మనం పరిపాలించుకున్న మన పాలకులు, రాజులు గురించి తెలిపే ఒక ప్రక్రియ గాని చేపట్టలేదు మనల్ని పరిపాలించిన ప్రభుత్వాలు, కనీస ఒక పర్యాటక కేంద్రముగా కూడ నోచుకోలేదు. ఒక చారిత్రాత్మక కట్టడం అలా మరుగున ఉన్నది... ! ఈ ఘనత వహించిన పాలకులు కేవలం ఏడెనిమిది  సంవత్సరాల క్రితం నిద్రనుండి మేల్కొని ఇప్పుడు అక్కడ టూరిజం వారిచే కొన్ని వసతులు, అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినారట. ఇలాంటి విషయాలలో పక్కనున్న 
కర్నాటక రాష్ట్రం ఎంత ముందంజలో వుందో చూసి మనం చాలా నేర్చుకోవాలి. విజయనగర సామ్రాజ్య  స్థాపకుడు బుక్క రాయలు క్రీ. శ. 1356లో మిక్కిలినేని రామానాయుడను యోధుని గండికోటలో సామంతునిగా నియమించినాడు. ఆతని తరువాత ఎందఱో రాజులు ఆ 
కోటనేలినారు కానీ  చివరి పాలకుడైన చినతిమ్మానాయుని కాలములో అది ముస్లిముల వశమయ్యింది.

మీర్ జుంలా పారశీక (ఇరాన్) దేశమునకు చెందిన ఒక తైల వర్తకుని కుమారుడు. గోలకొండ రాజ్యముతో వజ్రాల వ్యాపారము చేస్తున్న ఒక వర్తకుని వద్ద గుమాస్తాగా పనిచేసి, వజ్రాల గురించి జ్ఞానము సంపాదించి 
భారతదేశము చేరినాడు. స్వయముగా వజ్రాల వ్యాపారిగా మారి, గనులు సంపాదించి, ఎన్నో ఓడలు సమకూర్చుకొని గొప్ప ధనవంతుడైనాడు. తదుపరి గోలకొండ సుల్తాను అబ్దుల్లా కుతుబ్ షా ప్రాపకము సంపాదించి దర్బారులో వజీరు స్థానానికి ఎదిగినాడు . విజయనగర సామ్రాజ్యములో వజ్రాల గనులున్న రాయలసీమపై ఈతని కన్ను పడింది. విజయనగర రాజులకు విశ్వాసపాత్రులైన పెమ్మసాని నాయకులు పాలిస్తున్న గండికోట జుమ్లా ఆశలకు పెద్ద అడ్డుగా నిలచింది. గోలకొండ దర్బారులో మంత్రిగానున్న పొదిలి లింగన్న ప్రోద్బలముతో క్రీ.శ. 1650లో పెద్ద సైన్యముతో మీర్ జుంలా గండికోటపై దండెత్తినాడు. అతనికి సహాయముగా ఆధునిక యుద్ధతంత్రము తెలిసిన మైల్లీ అను ఫ్రెంచ్ ఫిరంగుల నిపుణుడున్నాడు. ఎన్నోరోజులు భీకరయుద్ధము జరిగినను కోట వశము కాలేదు. ఫ్రెంచివారి ఫిరంగుల ధాటికి కోట గోడలు బీటలువారినాయి . క్లాడ్ మైలీ అతి కష్టముమీద మూడు భారీ ఫిరంగులను కొండ మీదికి చేర్చి కోటగోడలు బద్దలు చేయుటలో కృతకృత్యుడైనాడు . యుద్ధము మలుపు తిరిగింది. యుద్దము ముగిసిన ఎనిమిది రోజులకు ప్రముఖ వజ్ర వ్యాపారి టావెర్నియర్ గండికోటలో నున్న మీర్ జుంలాను కలిసినాడు . ఆ సందర్భమున తిమ్మానాయుని శౌర్యపరాక్రమము గురించి విని తన పుస్తకములో ఎంతో గొప్పగా పొగిడినాడు. తిమ్మానాయుని బావమరిది శాయపనేని నరసింహ నాయుడు వీరోచితముగా పోరాడుతూ కోట సంరక్షణ గావిస్తూ అసువులు బాసినాడు. చెల్లెలు పెమ్మసాని గోవిందమ్మ , అన్న వారిస్తున్నా వినకుండా కాసెగట్టి, అశ్వారూఢయై తురుష్క, ఫ్రెంచ్ సైనికులతో తలపడింది. భర్త మరణమునకు కారకుడైన అబ్దుల్ నబీ అను వానిని వెదికి వేటాడి సంహరిస్తుంది. అదే సమయములో నబీ వేసిన కత్తి వేటుకు కూలి వీరమరణము పొందింది. కోటలో వందలాది స్త్రీలు అగ్నిప్రవేశము చేసినారు. ఎండు మిరపకాయలు పోగులుగా పోసి నిప్పుబెట్టి ఆందులో దూకి చనిపోయినారని చెబుతారు. హతాశుడైన చినతిమ్మ రాయబారమునకు తలొగ్గక తప్పలేదు. గండికోటకు బదులుగా గుత్తి కోటను అప్పగించుట ఒప్పందము. కోట బయటకు వచ్చిన నాయునికి పొదిలి లింగన్న కుతంత్రముతో విషమునిప్పిస్తాడు. అదే సమయములో గుత్తికోటకు బదులు హనుమనగుత్తి అను చిన్న గ్రామానికి అధిపతినిచేస్తూ ఫర్మాను ఇవ్వబడింది. మోసము తెలుసుకున్న చినతిమ్మ ఫర్మాను చింపివేసి బాలుడైన కొడుకు పిన్నయ్యను బంధువులకప్పగించి రాజ్యము దాటిస్తాడు. నాయునికి విషప్రభావము వల్ల మరణము ప్రాప్తిస్తుంది . మీర్ జుంలా గండికోటలోని మాధవస్వామి ఆలయము ధ్వంసం చేసి పెద్ద మసీదు నిర్మిస్తాడు . దేవాలయానికి చెందిన వందలాది గోవులను చంపించుతాడు. కోటను ఫిరంగుల తయారీకి స్థావరము చేస్తాడు. గండికోటపై సాధించిన విజయముతో మీర్ జుంలా మచిలీపట్నం నుండి శాంథోం (చెన్నపట్టణము) వరకు అధికారి అవుతాడు. బంధువుల సాయముతో మైసూరు రాజ్యము చేరిన పిన్నయ నాయుడు తమిళదేశానికి తరలించబడతాడు. గండికోట లోని అరువదియారు ఇంటిపేర్లు గల కమ్మ వంశములవారు చెల్లాచెదరై 
పోయి పలు ప్రాంతాలలో స్థిరపడతారు. వారిలో చాలామంది గంపలలో వస్తువులు పెట్టుకొని అడవులూ, కొండలు దాటుతూ కావేటిరాజపురం, మధుర, గుంటూరు, తిరుచినాపల్లి మొదలగు ప్రాంతాలకు పోతారు. వీరికే 
'
గంపకమ్మవారు', 'గండికోట కమ్మవారు' అను పేరులు వచ్చినాయి. మధుర చేరిన పెద వీరప్ప నాయుడు నాయకుల ఆస్థానములో పదవులు పొంది తదుపరి సింహళ దేశ యుద్ధములలో విజయాలు సాధించి పెడతాడు. వీరి వారసులు మధుర సమీపములోని కురివికులం, నాయకర్పట్టి మొదలగు జమీందారీలకు అధిపతులైనారు. మూడు శతాబ్దములు విజయనగర రాజులకు సామంతులుగా పలు యుద్ధములలో తురుష్కులపై విజయములు సాధించి, హిందూధర్మ రక్షణకు, దక్షిణభారత సంరక్షణకు 
అహర్నిశలు శ్రమించి, రాయలవారి ఆస్థానములో పలుప్రశంశలు పొంది, చరిత్ర పుటలలోనికెక్కిన యోధానుయోధులు గండికోట నాయకులు. ఇప్పటికి గండికోటలో ఒక చిన్న గ్రామం ఉన్నది, మూడు వందల ప్రజలు నివాసము ఉంటున్నారు. ఇక్కడ చూడదగ్గ శిల్పకళాసంపద చాలానే ఉన్నది, మాధవస్వామి దేవాలయం ఎత్తైన గోపురముతో నలువైపులా ద్వారాలతో తూర్పుముఖమై ఉంటుంది, లోపల నైఋతిమూల ఎత్తైన శిలాస్తంభములతో మధ్య ఉన్నతమైన వేదికతో నున్న కళ్యాణమండపము, ఆగ్నేయ మూల పాకశాల, అలంకారశాల, ఉత్తరమున ఆళ్వారుల ఆలయము, దాని ప్రక్కన మరొక కళ్యాణమండపము ప్రాకారము వెంబడే లోపలవైపుగా 55 స్తంభముల వసారా కలదు ఆలయము గర్భగృహము, మూసిన అర్థమండపము, నాట్యమండపము ఉన్నాయి. ఈ మండపాలలో 
శిల్పకళ కళ్ళు చెదిరేలా ఉంటుంది, అందుకే ఆ ఫ్రెంచ్ ట్రావెలర్ ఈ గండికోటను రెండవ హంపిగా కొనియాడినాడు. మాధవస్వామి ఆలయగోపురము నాలుగు అంతస్తుల కలిగి ఉన్నది. ఈ ఆలయాన్ని హరిహర బుక్క రాయులు నిర్మించినారు. రఘునాధా అలయము  ధాన్యాగారమునకు  ఉత్తరముననున్న  ఎత్తైన గుట్టపై ఉన్నది. ఈ ఆలయ  ప్రాకారము లోపల కళ్యాణ మంటపము ఉన్నది ఈ మండపానికి నాలుగు వైపుల నున్న స్తంభాలమీద రతి భంగిమల శిల్పాలు చెక్కి ఉన్నారు, ఇక గర్భగుడి చుట్టూ ఉన్న మండపంలో చూడదగ్గ ఎంతో 
శిల్పకళా సౌందర్యమున్నది.

గండికోట లోపల వెలుపల మొత్తం 12 దేవాలయాలు ఉన్నాయి, ఇక కోటలోపల " రాయల చెరువు " ఉన్నది ఇక్కడ నుండే కోటలోపల వ్యవసాయ క్షేత్రములకు నీరు, అలాగే ప్రజలందరికీ త్రాగునీరు అందించేవారు. ఇవి కాక పెన్నానది
 గండికోట 5 కిలోమీటర్ల పొడవునా లోతుగా ప్రవాహముంటుంది నిజంగా అది అందరు చూడవలసిన ప్రకృతి తయారు చేసిన సహజ కందకం, దాదాపుగా 1000 అడుగుల వెడల్పుతో 500 అడుగుల లోతుతో ఏర్పడిన ప్రవాహమది. సంక్షిప్తంగా ఇది గండికోట చరిత్ర..

ఎలా చేరుకోవాలంటే ... 
గండికోట జమ్మలమడుగు నుంచి పడమరగా దాదాపు ఆరు మైళ్ళ దూరంలో ఒక పర్వత శ్రేణిపై ఉన్నది. రెండు మూడు వందల అడుగుల ఎత్తున నిటారుగా ఉండే ఇసుకరాతి కొండల గుండా పెన్నా నదీ ప్రవాహం సాగే నాలుగు మైళ్ళ పొడవునా ఈ గండి ఏర్పడి ఉంది. నదికి దక్షిణతీరాన ఉవ్వెత్తున ఎగసిన కొండల మీద బ్రహ్మాండమైన రక్షణ గోడలున్నాయి. జమ్మలమడుగు నుంచి బస్సు సౌకర్యం కలదు .
ఇక గండి క్షేత్రమును గూర్చి నాకు తెలిసిన మేరకు చేబుతాను.
గండి క్షేత్రం:
 ( రాములవారు తన అంబు తో పెద్ద రాతి పై ఆంజనేయుని రేఖా చిత్రమును గీచినారని చేబుతారు. పాపఘ్నీ నది ఇక్కడశేషాచలం కొండను చీలుస్తుంది. కొండకు గండి కొట్టింది కాబట్టి ఈ ప్రాంతానికి గండి అని పేరు వచ్చింది. ఇది ప్రసిద్ధిచెందిన వీరాంజనేయ క్షేత్రం. త్రేతాయుగంలో శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో సీతాదేవిని రావణుడు అపహరిస్తాడు. రామలక్ష్మణులు సీతాన్వేషణలో దండకారణ్యం నుండి గండిక్షేత్రం మీదుగా రావడం జరిగింది. అప్పటికే వాయుక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన గండిక్షేత్రంలో వాయుదేవుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడట. అతడు రామలక్ష్మణులకు ఆహ్వానం పలికి తన ఆతిథ్యం స్వీకరించమని వేడుకొనగా, రావణ వధ అనంతరం తిరుగు ప్రయాణంలో నీ కోరిక తీరుస్తానని వాగ్దానం చేసినందువల్ల ఆదారిన వచ్చినాడు. రావణుని చంపి శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వస్తున్నపుడు ఆంజనేయుని తండ్రి వాయుదేవుడు గండిలోని రెండుకొండలకు బంగారు తోరణం నిర్మించి శ్రీరామునికి స్వాగతం పలికాడు. శ్రీరాముడు ఆ రాత్రికి ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. శ్రీరాముడు అక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడై సీతాన్వేషణం మొదలుగా రావణాసురునిపై తన విజయానికి మూలకారణమైన వీరాంజనేయుని తన బాణపు కొసతో కొండశిల మీద చిత్రించాడు. చిత్రం చివరిదశలో లక్ష్మణుడు వచ్చి కాలహరణం సంగతి గుర్తుచేయగా ఆ తొందరలో శ్రీరాముడు ఆంజనేయుని చిత్రం ఎడమచేతి చిటికెనవ్రేలు విడదీయకుండా వెళ్ళిపోయినాడు. ఆచిత్రరూపమే శ్రీ వీరాంజనేయుని విగ్రహముగా విరాజిల్లుతున్నది. ఈ విధంగా గండి క్షేత్రం ఏర్పడింది. ఇది పురాణం చెబుతున్న విషయం. సర్ థామస్ మన్రో దత్తమండలాలకు కలెక్టర్ గా ఉండేవాడు. అసలు ఆయన నిరీశ్వర వాది. ఆయన గండి క్షేత్రం దర్శించినప్పుడు ఆయనకు బంగారు తోరణం కనిపించింది. మహాపురుషులకే ఇలా బంగారు తోరణం కనిపిస్తుంది. బంగారు తోరణం చూసిన వారు ఆరు నెలల్లో మరణిస్తారు. మన్రో మరణం ఆ తర్వాత అరు నెలల్లోపే జరిగింది. నమ్మశక్యం గాని ఈ విషయం కడప జిల్లా గెజెటీర్ లో ఉంది.

కోదండ రామస్వామి దేవాలయము (ఒంటిమిట్ట):
విజయనగరం జిల్లాలోని రామతీర్థమును రెండో భద్రాద్రిగా స్థానికులు వ్యవహరిస్తూ వుంటారు. రామతీర్థము లోని రామాలయం కూడా పురాతనమైనదే. దీన్ని విజయనగర రాజులైన పూసపాటి వంశీయులు నిర్మించినట్లు చెబుతారు. ప్రస్తుత విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు ఆ వంశం వారే. రామతీర్థము విజయనగరానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది.  పర్వత సానువులతో  ఇక్కడి ప్రకృతి కనువిందు చేస్తుంటుంది. ఈ ప్రాంతం క్రీ.పూ. మూడో శతాబ్దం నుంచి ఉన్నట్లు చెబుతున్నారు. ఇది ఒకప్పుడు బౌద్ధులకు, జైనులకు నిలయం కూడా. రాముడితో లేదా రామాయణంతో సంబంధం ఉన్న ప్రాంతాల్లో రామతీర్థం కూడా ఒకటని 1903 నాటి ఆర్కియాలజీ సర్వే రిపోర్టు తెలియచేసింది. ఇక్కడ ఇప్పటికీ బౌద్ధుల, జైనుల సంస్కృతీ సంప్రదాయాలకు, ఆనాటి తీర్థంకరులకు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయి. ఘనికొండ, బోధికొండ, గురుభక్తుల కొండ మొదలైన చోట్ల ఈ రెండు మతాల ఆనవాళ్లూ కనబడతాయి. బౌద్ధారామాలు ఉన్నాయి. రామతీర్థంలో నిర్వహించే శ్రీరామ నవమి, వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు జనం భారీగా తరలి వస్తుంటారు. 

కడప నుండి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది. ఈ క్షేత్రము ఏకశిలానగరముగా  ప్రసిద్ధి చెందినది. ఈ పురము లో భూమిని ఎక్కడ త్రవ్వినా కూడా గడ్డ పారకు రాయి తగులుతుందంటారు. అందుకే ఏక శిలానగరమన్న పేరు వచ్చిందేమో. లేక ఒకే శిలలో రామ లక్ష్మణ సీతా విగ్రహాలు ఉన్నందువల్ల  ఈ పేరు వచ్చియుండవచ్చు.  ఒంటడు మిట్టడు అన్న దొంగలు  రామ భక్తులైనందువల్ల వచ్చినది అని కూడా అంటారు. గోపుర నిర్మాణము చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతముగా ఉంటుంది. ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ 16వ శాతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి "భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి" అని కీర్తించినాడు. ఏనుగుల వీరాస్వామయ్య తమ కాశీ యాత్ర అన్న గ్రంథములో కాశీయాత్రలో భాగంగా మజిలీలైన హత్యరాల నుండి భాకరాపేట వెళ్ళే మార్గ మధ్యమున ఒంటిమిట్ట వున్నదని తెలిపినారు. దీనివల్ల 1830 నాడు గ్రామ స్థితిగతులు తెలియవస్తున్నవి. అప్పటికి గ్రామంలో నాల్గు ప్రక్కల కొండలు కలిగిన భారీ చెరువున్నదని ఆ చెరువు యొక్క ఒకవైపు కట్టమీద ఉన్న బాటపైనే వారి ప్రయాణం సాగేది అని తెలిపినారు. ఆ అనుభవము నా వయసు వారందరికీ కూడా వుంటుంది. ఒంటిమిట్టలో చూడచక్కనైన గుళ్ళు ఉన్నాయన్నారు

ఇక్కడి గుడిలోని ఏకశిలా విగ్రహము జాంబవంతుని ప్రతిష్ఠ అని చెబుతారు. ఇక్కడ . ఒకే శిల లో శ్రీరామ సీతా లక్ష్మణ విగ్రహాలున్నాయని మనము ముందుగానే చెప్పుకున్నాము.. ఈ విగ్రహాలతో ఆంజనేయుడు వుండడు. ఆంజనేయుడు లేని రామాలయము దేశములో ఇది ఒక్కటే యని చెబుతారు.ఈ దేవాలయంలో శ్రీరామ తీర్ధము ఉన్నది . సీత కోరికపై శ్రీ రాముడు బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చినట్లు స్థల పురాణం. ఇది మిక్కిలి అపురూపమైన విషయము. పోతన ఇక్కడి వాడనుటకు అనేకమైన చారిత్రక ఆధారములు ఉన్నవి.

నందలూరు:   నందలూరులో సౌమ్యనాథ స్వామి ఆలయం విశాలమైనది. సౌమ్యనాథుని నారదముని ప్రతిష్టించినాడంటారు. 11వ శతాబ్దంలో కులోత్తుంగ చోళుడు ఆలయాన్ని నిర్మించినాడు. 12వ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఈ ఆలయానికి గాలి గోపురం కట్టించినాడు. ఇంకా ఈ ఆలయాన్ని పాండ్యులు, విజయనగర రాజులు, పొత్తపి పాలకులు, మట్లి రాజులు అభివృద్ధి చేసినారు. సౌమ్యనాథాలయం 12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఈ ఆలయానికి 108 స్తంభాలున్నాయి. కామాక్షీ దేవి సమేత ఉల్లంఘేశ్వర ఆలయము కూడా పురాతనమైనది. ఇది శివాలయము. ఇది 10 శతాబ్దములో నిర్మించబడిన ఆలయము. మా తండ్రిగారు తమ బాల్యమున ఈ గుడిలో అర్చకులుగా వుండినారు.

అత్తిరాల:
 (హత్యరాల. ఇక్కడ తండ్రి జమదగ్ని ఆజ్ఞ మేరకు తల్లియైన రేణుకను పరశురాముడు వధించినట్లుగా స్థలపురాణం. నరకబడిన చేతులతో ఇక్కడ ప్రవహించే చెయ్యేరులో స్త్నానము చేస్తూనే ఆయనకు పోగొట్టుకొన్న చేతులు వచ్చినవట, అందుకే ఆనదిని బాహుదా నది అంటారు. బాహు అంటే చేతులు '' అంటే అనుగ్రహించినది అని అర్థము.)

వెల్లాల: 
వెల్లాల కడప జిల్లా ప్రొద్దటూరు సమీపంలోని రాజుపాళెము మండలంలో ఉంది.  కుందూ నది ఒడ్డున వెలసిన ఈ వెల్లాల పురాతన గ్రామం. ప్రొద్దుటూరు నుంచి రాజుపాళెము మీదుగా చాగలమర్రి వెళ్ళే దారిలో ప్రొద్దుటూరు నుంచి దాదాపు 20 కి.మీ. దూరంలో వెల్లాల ఉంది. చాగలమర్రి నుంచి 4 కి.మీ., జమ్మలమడుగు నుంచి 23 కి.మీ.  వెల్లాలలో చెన్నకేశవస్వామి, భీమలింగేశ్వరస్వామి, లక్ష్మీనృసింహస్వామి దేవాలయాలున్నాయి. శైవ వైష్ణవభేదాలు లేకుండా సాగిన గ్రామమిది. ఇందరు దేవతలు కొలువు దీరినా ఇక్కడ సంజీవరాయనికున్న వైభవం గొప్పది.
సంజీవరాయడు అంటే ఆంజనేయస్వామి. సంజీవని పర్వతమును తెచ్చిన రాయడు సంజీవరాయడు. సంజీవని కోసం వెళ్తున్న ఆంజనేయుడు ఇక్కడ ఆగి కుందూ నది సమీపంలో ఒక గుండంలో స్నానం చేసినాడట. సూర్యునికి నమస్కారం చేసుకున్నాడు. ఆ గుండానికి హనుమంతు గుండం అని పేరు వచ్చింది. సంజీవని కోసం వెళ్తున్న స్వామి కాబట్టి సంజీవరాయడుగా ఇక్కడ కొలువు దీరినాడు. గుండం దగ్గర రాతి మీద స్వామి పాదముద్రలున్నాయి.
గ్రామం శిథిల దశకు చేరుకోగా అయిదారు దశాబ్దాల క్రితం చెన్నకేశవస్వామి దేవాలయంలో ఉన్న సంజీవరాయ స్వామిని గ్రామానికి దక్షిణ దిక్కున పునఃప్రతిష్ఠ చేసినారు. పదహైదవ శతాబ్దంలో హనుమద్మల్లు అనే యాదవరాజు సంజీవరాయ స్వామిని ప్రతిష్ఠించినాడు. సంజీవరాయ సందర్శనం కోసం పలు ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు. ప్రతి సంవత్సరం వైశాఖ పూర్ణిమ నాడు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. గ్రహదోషాలు తొలగిస్తాడని, వ్యాధి బాధలు దూరం చేస్తాడని ఇంకా ఎన్నెన్నో ఆశలతో ఈ స్వామిని సేవిస్తారు. వెల్లాల ప్రాంత అభివృద్ధికి వెల్లాల గ్రామ అభివృద్ధి ట్రస్టు ఏర్పడింది. దేవాలయ జీర్ణోద్ధరణ జరిగింది.



జ్యోతి: 
కొన్ని సంవత్సరముల క్రితము సిద్ధవటము మండలమునకు చెందిన ఈ జ్యోతి అన్న పల్లెలో పెన్నా నదీ తీరమున చేసిన త్రవ్వకాలలో ఐదు శివాలయములు బయల్పడినాయి. త్రవ్వకాలను కొనసాగించుటచే  క్రీ.శ. 1213 ముందు , ఎంత ముందు అన్నది తెలిసి రాలేదు, నిర్మించబడిన 108 శివాలయములు బయల్పడినవి. ఇవి కాకుండా, దొరికిన సాక్ష్యాధారాల ప్రకారము కాకతీయ సామ్రాజ్ఞి యగు రాణీ రుద్రమదేవి ఇచ్చినట్లుగా చెప్పబడే ఒక వెండి రథము , వజ్ర కిరీటము కూడా లభించినవి. ఇవి జ్యోతి సిద్దేశ్వరస్వామి యగు శివునకు అంకితమివ్వబడినట్లుగా చెప్పబడుచున్నవి.
సిద్ధవట్టము : 

సిద్ధవట్టమునకు చెప్పలేనంత చరిత్ర వుంది. పవిత్ర పెన్నానది ఒడ్డున క్రీ.పూ. 40-30 సంవత్సరాల మధ్యకాలంలో సిద్దవటం కోట రూపుదిద్దుకుంది. సుమారు 36 ఎకరాలపైబడి విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ కోటను 18 రాజవంశీయులు పాలించినారు. మౌర్యుల నుంచి తూర్పు ఇండియా వర్తకసంఘం వరకూ ఈ కోటను పాలించినారు. 1543 నుండి 1579 వరకూ సాగిన పాలనను స్వర్ణయుగంగా పరిగణిస్తారు. 1605 వరకూ ఉన్న మట్టి కోట కాస్తా రాతికట్టడంగా మారింది. క్రీ.శ. 1792లో టిప్పుసుల్తాన్‌ చేతి నుండి నైజాము నవాబుల పాలనలోకి, వారి నుంచి 1880లో తూర్పు ఇండియా వర్తకసంఘం ఆధీనంలోకి ఈ కోట చేరింది. బ్రిటిష్‌పాలనలో 1808 నుండి 1812 వరకూ ఇది తొలి జిల్లా కేంద్రంగా ఉండి, పరిపాలన కేంద్రంగా భాసిల్లింది.
ఇక్కడ మధ్యయుగం నాటి కోట ఒకటి ఉంది. దక్షిణం వైపు పెన్నా నది, మిగిలిన మూడు వైపుల లోతైన అగడ్తతో శతృవులు ప్రవేశించేందుకు వీలు కాని రీతిలో ఈ కోట నిర్మించబడింది.
కొందఱు ఈ పేరును సిద్ధ +వటము గా చెబుతారు. సిద్ధ అంటే సిద్ధి పొందిన మహనీయులు వట అంటే మర్రి చెట్లక్రింద తపమాచరించే వారని. నా దృష్టి లో అది సమంజసముగా కనిపించ లేదు. నిజమునకు అది అటవీ ప్రాంతమే కానీ అది సిద్ధవట్టము అంటే సిద్ధ + వట్టము అని నా అభిప్రాయము. వట్టము అన్న శబ్దమునకు పీఠము అన్న అర్థమున్నది. పీఠము అంటే నెలవు అని. అంటే ఈ ప్రాంతము సిద్ధులకు నెలవైయుండేది. అంతే గానీ మర్రిచెట్లతో సంబంధమున్నట్లు తోచదు.
నేను మీతో పంచుకోనబోయే  ఈ విషయము వాస్తవముగా ఒక ముస్లీం పిల్లవాని అనుభవము. నాకప్పుడు  24, 25 సంవత్సరాల వయసు వుంటుంది. రవాణా ఇబ్బంది వల్లనూ మరియు నాకు కలిగిన అత్యవసర పరిస్థితి వల్లనూ నేను రాజంపేట నుండి కడపకు లారీ లో రావలసి వచ్చినది. దారిలో మైకు సెట్లను అమర్చే ఒక 15 సంవత్సరముల ముస్లిం పిల్లవాడు నందలూరిలో ఎక్కినాడు. లారీ తొట్టిలో ఇద్దరమూ నిలుచుకొని యుండినాము.
కాస్త సమయము గడచిన తరువాత ఆ మాట ఈమాట మాట్లాడుతూ, ఆ పిల్లవాని స్వగ్రామమేది యని అడిగినాను. సిద్ధవటము అని చెప్పినాడు. మరి అచటి కోటను చూసినావా లోనికి పోయి యుండినావా అని అడిగినాను.  అప్పుడు ఆ అబ్బాయి తన అనుభవమును ఈ విధముగా చెప్ప దొడగినాడు తన ఉర్దూ యాసలో. నేను దానిని మీ ముందు నా బాస లో ఉంచుచున్నాను.
“ నేను సాటి బాలురతో కోటలో ఆడుకుంటూ దాగుకొనుటకు ఒక బిలములో ప్రవేశించినాను ఒంటరిగా. బాల్య చాపల్యముచేత ఇంకాస్త ముందుకు అనుకుంటూ లోలోపలికి పోవుట ప్రారంభించినాను. పోనుపోను దారి ఇరుకై వెనుదిరిగే అవకాశమే లేకుండా పోయింది. గత్యంతరము లేక ప్రయాణము ముందునకే బరుగుతూ సాగించినాను. ఆవిధముగా ఎన్ని రోజులు జరిగి పోయినవో నాకు తెలియలేదు. నా కంటికి వెలుగు కనిపించే సమయానికి నా చుట్టూ ఎంతో ప్రశాంతమైన వాతావరణము నెలకొని ఉంది. పరిశుభ్రమైన నీటితో నిండిన కోనేరు చెదురు మదురుగా లేళ్ళు, కుందేళ్ళు, నెమళ్ళు, తెల్లటి పావురాళ్ళు ఉదయము 7, 7.౩0 సమయములో ఉండే సూర్యుని వెలుగు నాకు అగుపించినాయి. ఆశ్చర్యముగా నేను అటు ఇటు చూచుచుండగా నా ముందు గడ్డము, కౌపీనము కలిగిన ఒక సాధువు (మనము తాపసి గా అర్థము చేసుకోన వచ్చును.) కనిపించినాడు. నేను ముందు ఆయనతో కడుపు గొంతు చేతితో చూపిస్తూ ఆకలి దప్పిక అన్నాను. నా వుద్దేశ్యం అవి తీరిన తరువాత నేను అచటికి ఏవిధముగా వచ్చినది చెప్పవలెనని. ఆయన కళ్ళు మూసుకో  అని సైగ చేసినాడు. నేను నందలూరి వద్ద ప్రవహించే బాహుదానది ఒడ్డున తేలినాను. నాలో ఆకలి దప్పిక, నిదుర లేమి వల్ల ఏర్పడిన నీరసము లేనే లేకుండా తుడిచి పెట్టినట్లు పోయినాయి. ఎలాగైతే నేమి ఇల్లు చేరినాను. ఇంచుమించు నెల రోజుల నుండి కనిపించని నేను కనిపించే సరికి మా ఇంటివాళ్ళే కాకుండా ఇరుగు పొరుగు కూడా ఎంతో సంభ్రమాశ్చర్యములకు గురియైనారు అని తన అనుభవవమును  చెప్పి ముగించినాడు. ఇపుడు ఆశ్చర్య పడుట నా వంతు అయినది. ఈ ఉదంతము వల్ల కూడా ఆ ప్రదేశము సిద్ధుల స్థావరము అని తెలుస్తూ వున్నది.
***రాజంపేట : సిద్ధవటమును మట్లి రాజయిన అంత భూపాలుడు పరిపాలించే సమయములో  తన చెల్లెళ్ళయిన రాజమ్మ కు పుల్లమ్మకు పెళ్లి కానుకగా రెండు ఊళ్ళను ఇచ్చినాడు. ఈ విషయమును నేను మా తండ్రిగారి ద్వారా విన్నది. అవియే రాజమ్మ పేట పుల్లమ్మ పేట అనబడు ఊర్లు. ఇవి ఈ పేర్లతో గాక వేరేవో పేర్లతో ముందు నుండి కూడా ఉండినవి . ఒకప్పుడు పుల్లంపేట నేత చీరలకు ప్రసిద్ధి. ఈ రాజంపేట ఒకప్పుడు అగ్రహారము అనగా బ్రాహ్మణ సముదాయము నివసించే ప్రాంతము . పేట అంటే పల్లెటూరి కన్నా పెద్దది. పట్టణము కన్నా చిన్నది . ఇప్పుడు నేను చెప్ప బోయే ఉదంతము రాజం పేట మాట అన్న పేరుకు ముందో వెనకో నాకు ఇదమిద్ధముగా తెలియదు గానీ ఈ విషయము మాత్రము జరిగినట్లు మా తండ్రి గారి ద్వారా విన్నాను.
ఒకసారి శృంగేరి పీఠాధిపతులు తానూ పల్లకీ లో కూర్చొని తన పరివారము తో కూడా ఆ దారిన పోవుచుండినారు. వారి రహదారికి దూరముగా, అగ్రహారము కాబట్టి, బ్రాహ్మలు సేద్యము చేసుకొంటూ వుండినారు.  స్వామీ వారిని గమనించినారు గానీ వారు స్వాములవారిని గమనించినవారు గారు. స్వామివారికి వారు గమనించలేదన్న కినుక ఏర్పడి తమ వైపునకు వారి దృష్టినాకర్షించుటకు గానూ పల్లకీ మోసే నలుగురు బోయలనుండి ఒకరిని తప్పించినారు. పల్లకి మాత్రము సజావుగా ముందునకు సాగుతూనే ఉండిపోయింది. దీనిని ఆ పొలములో ఉండే బ్రాహ్మణ బాలకుడు గమనించి తన తండ్రికి తెలిపినాడు. అది గమనించి యా బాపడు తాను కూడా మడకకు కట్టిన ఒక ఎద్దును విదిపించినాడు. మడక సజావుగా సాగుతూ వుండినది. స్వాములవారు రెండవది బోయాను కూడా తప్పుకోమన్నారు. బ్రాహ్మణుడు కూడా రెండవ ఎద్దును విప్పివేసినాడు.
స్వామికి ఎక్కడలేని కోపము వచ్చి ఆ ప్రాంతమున అహంకార భూఇష్టులైన బ్రాహ్మణులు లేకుండా పోదురు గాక అని శపించినాట. ఎన్ని వందల సంవత్సరములు గడచినవో తెలియదు గానీ రాజంపేటలో బ్రాహ్మడే లేక పోవుట నేను కూడా చూసినాను. తరువాత కాలములో చుట్టు ప్రక్కల నుండి బ్రాహ్మణులు వచ్చి ఆవాసమునేర్పరచుకొన్నారు. అహంకారమా యాద్రుచ్ఛికమా అన్న విషయమును ప్రక్కనుంచితే  కడప జిల్లాలో ఎంతటి ఘనులుండినారో మనము అర్థము చేసుకోగలము.
దానవులపాడు
క్రీ.శ. 7వ శతాబ్దం నాటి కన్నడ శాసనం (క్రీ.శ. 696-733) బయల్పడింది. 10 వ శతాబ్దానికి చెందిన రాష్ట్రకూటుల లోని  మూడవ ఇంద్రుని కాలం నాటికి దానవుల పాడు ప్రసిద్ధ జైన స్థావరంగా ఉండేది. విడి ప్రతిమలు తయారు చేసే కర్మాగారం కూడా ఇక్కడ ఉండినట్లు తెలుస్తున్నది. మూడవ ఇంద్రుడు 16తీర్థంకరుడగు శాంతినాథుని స్నపనవిధి కోసం స్నాన పీఠాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తున్నది. జైనులు మోక్షం కోసం కఠోర నియమం పాటించేవారు. ఉపవాస దీక్షతో క్రమంగా శరీరాన్ని కృశింపజేసి మృతి చెందే వారు. ఈ విధంగా మృతి చెందిన వారి బూడిద ఇక్కడ విస్తారంగా తువ్వమట్టి రూపంలో కనిపిస్తున్నది. పూర్వము యజ్ఞయాగాదులలో నర జంతు బలులు  విరివిగా జరుగుతూ వుండి యుంటాయి. అహింసా వాదులైన జైనుల ఆగమనముతో వానిని మానిపించి ప్రజలను అహింసా దిశగా మరల్చి యుంటారు. వారు అడుగుపెట్టిన తరుణమున చూసిన ఆ హింసను మనసులో నుంచుకొని వారే దానిని దానవుల పాడుగా నామకరణము చేసి యుండవచ్చు.
కడప నుంచి జమ్మలమడుగు మార్గంలో 20 కి.మీ. దూరంలో పెన్నా నదీ తీరాన దానవుల పాడులో జైనుల ఆలయం ఉంది. 2.75 ఎకరాల స్థలంలో ఈ జైనుల ఆలయం విస్తరించి ఉంది. ఈ ఆలయానికి పటిష్ఠ మైన ప్రాకారం ఉంది. ప్రాకారం 15 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ ప్రాకారానికి ఉపయోగించిన రాళ్ళు తెల్లనివి, బరువైనవి. పెన్న వరద తాకిడికి తట్టుకోవడానికి అన్నట్లుగా ఈ ప్రాకారం నిర్మించినట్లుంది. ఈ జైనాలయంలో కొలువైన దేవుడు పార్శ్వనాథుడు. ఈ విగ్రహం దిగంబరంగా ఉంటుంది. 12 అడుగుల ఎత్తుంటుంది. ఈ ఆలయానికి ప్రక్కనే మరో ఆలయ నిర్మాణముంది. నిర్మాణం మధ్యలో ఆగినట్లు అసంపూర్తిగా కనిపిస్తుంది. ఈ నిర్మాణం ఇసుక తిన్నెల్లో పూడిపోయి ఉంది. ఆలయం నుంచి పెన్నలోకి దిగేందుకు రాతి సోపానం 18 మెట్లతో నిర్మించినారు. ఈ సోపానానికి ఇరువైపులా శిల్పాలున్నాయి. బూరుగు చెట్టు కింద నాగకన్యలు, చెట్టెక్కుతున్న కోతి, పాము పడగలు, ఏనుగులు, గణపతి శిల్పాలు చూడవచ్చు. జైనుల శాసనాల్లో దానవుల పాడును 'కరిమారి' అని పేర్కొన్నారు. ఇక్కడ 1903లో తవ్వకాలు జరిపినారు. ఇక్కడ లభించిన విగ్రహాలను చెన్నైలోని సంగ్రహాలయంలో భద్రపరిచినారు.

ఇది దానవులపాడుకు సమీపంలో తూర్పున ఉన్నది. ఈ ఊళ్లో పురాతన తలకంటమ్మ (మూడు కళ్ల దేవత, ఫాల నేత్రి) గుడి ఉన్నది. దేవి గుడి ఉన్న స్థలము కాబట్టి ‘దేవిగుడిగా’ ప్రారంభమై ఈ గ్రామం పేరు కాలాంతరములో ‘దేవగుడి’ అయ్యింది. తలకంటమ్మ గుడి ప్రాంగణంలో 13వ శతాబ్దానికి చెందిన అనేక శాసనాలు చెక్కబడి ఉన్నవి. ఇందులో ఒక శాసనం నాలుగున్నర ఆడుగుల పొడవు, నాలుగడుగుల వెడల్పు ఉన్నది. శాసనం పై భాగంలో చక్రము, దానికిరువైపుల సూర్యచంద్రులు చెక్కబడి ఉన్నవి. పురాతన తెలుగు లిపిలో ఉన్న ఈ శాసనంలో రామరాజు కుమారుడు చిన్నతిమ్మయ్యదేవ, చెన్నూరు దేశంలోని తుంగల గ్రామానికి చెందిన ఒక బ్రాహ్మణునికిచ్చిన భూదాన ప్రస్తావన ఉన్నది. ఇతర శాసనాలపై లిపి స్పష్టంగా లేదు. కొన్ని ఈ శాసనాలపై గుర్రపు స్వారీ చేస్తున్న యోధులు, స్వారీ చేస్తూ ప్రత్యర్ధి మెడలో ఈటెను పొడుస్తున్న చిత్రాలు చెక్కబడి ఉన్నవి.

జమ్మలమడుగు,
జంబు అన్న ఒక విధమైన రెల్లు లేక తుంగ కలిగిన చెరువు ఉండుటచే ఈ వూరికి ‘జంబుల మడక’ అన్న పేరు వచ్చినది. రానురానూ జమ్మలమడక, జంబుల మడుగు , జమ్మడక్క కూడా అయిపోయినది. నారాపురము అన్న ఊరి యందు వెలసినందువల్ల నారాపురస్వామి, నారాపురేశ్వరుడు అన్న పేరు వచ్చియుండవచ్చు. అది నా బాల్యముననే జమ్మలమడుగు లోని భాగమే గానీ వూరికి చివరన ఇసుక దిన్నెలలో వుండేది. పెద్దలు వ్యాహ్యాళికి పిన్నలు ఆడుకొనుటకు అక్కడికి వెళ్ళేవారు. ఇది చాలా పురాతనమైన దేవాలయము కావున ఇసుకలో ఎన్నోమార్లు బూడిపోతే పునరుద్ధరించబడినట్లు చెప్పబడుతుంది. ఇప్పుడు ఇసుక దిబ్బలు మాయమైనాయి, బదులుగా గట్టి రోడ్లు ఇరు ప్రక్కలా ఇండ్లు వెలసినాయి. ఒక కాలములో పెన్నానది ఈ గుడిని ఆనుకొని ప్రవహించేదట. కాలాంతరములో దిశా మారినది. ఈ వూరికి భావసార క్షత్రియులు  అన్న తెగ మహారాష్ట్రము నుండి వచ్చి ఇక్కడ స్థిర నివాసము ఏర్పరచుకున్నారు. ‘రంగ రాజులు’ అనబడే వీరిని ఆ కాలములో ‘రంగు రేజులు’ అనే వారట. వారు రంగుల అద్దకములో అత్యంత నిపుణులు. చేనేత పరిశ్రమకు పెట్టినది పేరుగా విలసిల్లిన ఈ ప్రాంతమునకు వారు వలస వచ్చియుంటారు. ఒక్కమాటలో చెప్పవలసివస్తే వీరు మంచికి మారుపేరు. వారు అమ్మవారి భక్తులు. వారు కట్టించిన ఆ పురాతన దేవాలయము లోని ‘అంబా భవాని’ విగ్రహమును చూసి తీర వలసినదే కానీ చెప్పనలవి కాదు. ఇది అత్యంత సుందరమైన పాలరాతి విగ్రహము. మేము చదివిన ఉన్నత పాఠశాల జిల్లా బోర్డు ది యై ఉండేది. దానికి అత్యధికముగా విరాళమిచ్చిన మహనీయుడు పతంగే రామన్న అన్న భావసార క్షత్రియుడు. మద్రాసులో అతి పెద్ద వ్యాపారము కలిగి నాటికే అంటే 65 సంవత్సరముల క్రితమే మహా లక్షాదిపతులైన ఆయన కుమారులు మాతో బాటే అదే స్కూలులో చదివేవారు. అది వారి సౌమనస్యతకు తార్కాణము. ఇచ్చటి కాంప్ బెల్ ఆస్పత్రి వెల్లూరు ఆస్పత్రి తరువాత అంతటి పేరు కలిగి యుండినది . Dr. సామర్ వెల్, Dr. కటింగ్  వంటి ప్రఖ్యాత పాశ్చాత్య వైద్యులు ఇచ్చట పనిచేసినారు. Dr. కటింగ్  గారు ఈ ఊరి నుండి వెడలిన తరువాత WHO (World Health Organisation) లో సభ్యునిగా తీసుకొని యుండినారని విన్నాను. ఆయనకు నాపై ఒక ప్రత్యేక అభిమానము వుండేది. మా మామ గారిని చికిత్సకై అక్కడ చేర్చితే ఆయన బాగుచేసి పంపినాడు. కానీ విధి వ్రాతచే ఆయనను తిరిగి చేర్చవలసి వచ్చింది. ప్రొద్దటూరు నుండి మా అత్త గారు ఆయనను జీప్ లో పిలుచుకొని వచ్చినారు మా ఇంటికి. ఆ రోజు అష్టమి యగుటచే తరువాతి దినము విద్యాలయములో చేర్చ దలచి మా పరిచయమును పురస్కరించుకొని Dr. కటింగ్  గారి వద్దకు పోయి విషయము చెప్పినాను. ఆ సమయములో  Inpatient Ward లో వున్నా ఆయన అక్కడి కొన్ని మందులు ఇచ్చి, “ఓహో! ఈ రోజు అష్టమి అని చేర్చ లేదా” అని శుద్ధమైన తెలుగులో నన్ను అడిగితే కొంత సిగ్గుతోనే అవునన్నాను. “అలాగే, రేపు పిలుచుకొని రండి అని నన్ను పంపినాడు. ఆయనకు ఎన్నో డిగ్రీలు వున్నా చిన్న పిల్లల పై మక్కువ ఎక్కువగా వుండేది. పల్లెటూళ్ళ నుండి తల్లులు తెచ్చే పిల్లలకు చీమిడి కారుతూ వున్నా ఆయన తన వద్ద ఉంచుకొన్న బట్టతో తుడిచివేసే నిగర్వి మరియు సేవా తత్పరుడు. మన సాంప్రదాయాలపై ఆయనకు మక్కువ చాలా ఎక్కువగా వుండేది. నా ఊరు కాబట్టి కొంచెము ఎక్కువగా చెప్పినానేమో! అయినా ఇప్పుడు చెప్పకుంటే మరి అవకాశము రాదు కదా!

ప్రొద్దుటూరు:
 నా స్వస్థలము కడప జిల్లా. నా బాల్యమంతా ప్రొద్దుటూరు జమ్మలమడుగులలో గడిచిపోయింది . 
నాకు తెలిసిన నాలుగు మాటలు ఈ రోజు ప్రోద్దుటూరును గూర్చి వ్రాయవలెననిపించినది. కొన్ని రోజుల క్రితం జమ్మలమడుగు వద్ద గల గండికోటను గూర్చి తెలిపినాను. ప్రాంతీయాభిమాన మనుకోకుండా నాకు తెలిసిన ఒక ప్రాంతాన్ని గూర్చి వ్రాస్తున్నానని భావించ ప్రార్థన . 

శ్రీరామచంద్రుడు, రావణవధానంతరము, సీతా లక్ష్మణ హనుమంతులతో అయోధ్యకు పోతూ సూర్యోదయకాలానికి ఒక ప్రాంతములో దిగవలసి వచ్చింది. సూర్యోదయ సమయములో దిగుట వలన ఆ ప్రాంతానికి 'బ్రధ్న పురి ' అన్న నామకరణము చేసినాడు. అచట శివుని ధనుస్సగు పినాకము బోలె వంపుసొంపుల సోయగాలతో ప్రవహిచే నది ఆయనకు గోచరించుటవల్ల  అక్కడ దిగవలసి వచ్చింది. ఎందుకంటే స్నాన సంధ్యానుష్ఠానములకు నదీ తీరము శ్రేష్ఠము . ఆ నదిని పినాకిని అంటారని ఆయన తెలుసు కొన్నాడు. అసలు పినాకి అంటే శివుడు. శివుని భార్య శివాని అయినట్లు పినాకి భార్య పినాకిని అవుతుంది. అంటే ఆ తీర్థము గంగాదేవియొక్క ఒక పాయ అనేకదా. ఇక అంతకంటే ప్రశస్థమైన స్థలము వేరొకటుందని తలచి రాములవారు అక్కడ దిగటము జరిగినది. నదీ స్నానానంతరము సంధ్యా వందనము ముగించి, బ్రాహ్మణుడైన రావణుని జంపుట వలన కలిగిన బ్రహ్మ హత్యా పాతకమును తొలంగజేసుకొననెంచి శివార్చనకు ప్రయత్నించగా అక్కడ శివలింగము ఆయనకు ఆ ప్రాంతములో కనిపించ లేదు. అందుకు ఆయన సుముహుర్తము దాటక ముందే కాశీ నుండి ఒక శివలింగమును హనుమ తో తెమ్మని పురమాయించి, ఆయన ముహుర్త సమయము లోపల రాలేక పోయినందున తానే ఇసుకతో లింగమును చేసి దానిని ప్రతిష్ఠించి శివార్చనము చేసి తన బ్రహ్మ హత్యా పాతకమును తొలగింప జేసుకొన్నాడు. ఇప్పటికీ ఆ లింగముపై వ్రేలిముద్రలు అగుపించుతాయి. దీనిని ముక్తి రామేశ్వరమని దక్షిణ కాశి అని రామలింగేశ్వరమని కూడా అంటారు కానీ ఇప్పుడు మాత్రము రామేశ్వరముగానే స్థిరపడిపొయినది. ఇది అక్కడి స్థల పురాణము. 

'బ్రధ్నము' ప్రకృతి 'ప్రొద్దు' వికృతి. అందువల్ల రానురానూ బ్రధ్నపురి ప్రొద్దుటూరు అయినది. ఇది నదికి ఉత్తరముగా వున్నది. అందుకేనేమో ఆ పరమేశ్వర కృపాకటాక్ష వీక్షణములకు గురియై ఐశ్వర్య వంతముగా, కరువు ప్రాంతమైన రాయలసీమలో, అలరారుచున్నది. ఆ పినాకినీ నదినే నేడు పెన్న అంటారు. అసలు ఈ పెన్న 'పినాకినీ' 'పాపఘ్ని' నదుల సంగమము. ఆ పినాకి గంగాతోనే వుండి ఆమెను పినాకినిని చేస్తే మరి పరమేశ్వరినైన నా పరిస్థితి ఏమిటని అనుకొన్నదో ఏమో గోదావరి వద్ద గల పెనుగొండలో కన్యకగా పుట్టిన పరమేశ్వరి ఈ వూరిలో 102 గోత్రముల ఆర్యవైశ్యులకు అష్టైశ్వర్యముల గూర్చుచూ అమ్మవారిశాలలో అమరింది. అమ్మవారిశాల లో లభించే ప్రాచీన దస్తావేజుల ప్రకారము అమ్మవారిశాల యొక్క చరిత్ర ఈ ప్రకారంగా వుంది. 

పర్లపాడు వాస్తవ్యుడు, పడిగసాల గోత్రజుడు ఐన కామిశెట్టి చిన్నకొండయ్య కు కలలో కన్యకా పరమేశ్వరి కనిపించి తనకు ఆలయము నిర్మించమని కోరుటతో మనమీరోజు ఈ అమ్మవారిశాలను చూడగలుగుచున్నాము. ఆయన మద్రాసుకు పోయి వ్యాపారము అపారముగా చేసి ఆర్జించిన ధనముతో ఆ పని చేయగలిగినాడు. ఆ తల్లి ఈ ఆర్యవైశ్యులకు అండయై ,కైదండయై, వసివాడని పూదండయై నేటికినీ ఈ పట్టణమున విలసిల్లుతూవుంది.ఈ పట్టణములోని వైశ్యులు ఎంత బ్రాహ్మణ విశ్వాసపరులో అంతటి మానవతా వాదులు. ఎందరో వేద శాస్త్రపండితులకే కాక సంస్కృతాంధ్ర భాషా పడితులనాదరించి వారికి నిలువనీడ ఏర్పరచి తమ ఔన్నత్యము చాటుకొన్నారు. మహనీయులు లబ్ధ ప్రతిష్ఠులు అయిన పుట్టపర్తి నారాయణాచార్యులవారు, ఎల్లమరాజు శ్రీనివాసరావు గారు వీరి సత్కారములు ఆదరణ పొందిన వారే. వీరు ఎన్నో దశాబ్దములు కుల విచక్షణ లేకుండా విద్యార్థులకు భోజన వసతి సౌఖర్యములు ఏర్పరచిన వదాన్యులు.  మే 19,1929 మహాత్మా గాంధి ప్రొద్దుటూరుకు వచ్చి అమ్మవారిశాల వేంచేసి వైశ్య వర్గముచేత సన్మానించబడి, గౌరవముతో వారిచ్చిన 116 బంగారు కాసులను (ఇప్పటి తూకములో 230 గ్రాములు ) గ్రహించి ప్రొద్దుటూరుకు 'బంగారు ప్రొద్దుటూరు' అన్న గౌరవ నామము నొసంగినారు. ఇక్కడ అమ్మవారు కళామయి మరియు వాత్సల్యమయి. ఆ తల్లి కి ఆభరణాలు తొడుగులే కాక బంగారు రథము కూడా వున్నది. ఈ ఊరిలో వైశ్యకుల పతాకమునెగురవేసిన వారిలో  కొప్పరపు సుబ్బారావు గారు అగ్రగణ్యులు. 

ఇక్కడ అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన 'అగస్తీశ్వర ఆలయము' ప్రసిద్ధ దేవాలయము. సరస్వతీపుత్ర శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు వైష్ణవులై యుండి (వైష్ణవులు శివుని దర్శించనుగూడా దర్శించరు) కూడా ప్రతిదినము శుచిగా అగస్తీశ్వరునికి ప్రదక్షిణములు గావించి స్వామి ఎదురుగా వుండే చెట్టు క్రింద కూర్చొని అసమాన ప్రఖ్యాతి గాంచిన 'శివతాండవము'ను రచించినారు. వీరినిగూర్చి ఒక సందర్భమున విశ్వనాధ'వారే "మిక్కుటముగా మేము ఇరువురమూ సమానులమే అయినా కొన్ని విషయాలలో వారు నాకన్నా మిన్న" అన్నారు. వేరు యేకవి పండితునికైనా శిలావిగ్రహ మున్నదో లేదో నాకు తెలియదు గానీ వీరికి మాత్రము ప్రొద్దుటూరు నడి బొడ్డున,  ఏ రాజకీయ నాయకుడు నోచుకోనంత, నిలువుటెత్తు విగ్రహమును ఏర్పాటు చేసినారు. 

ఈ వూరు కవిపండిత నిలయము. శివభారత కర్త అద్వితీయ జ్యోతిశ్శాస్త్ర మరియు సంస్కృత పండితుడు, అవధాని, మొదటి తెలుగు ప్రపంచ సభకు వెళ్ళిన అవధాని పితామహ బిరుదాంకితుడు శ్రీ C.V. సుబ్బన్న గారి గురువు  'బ్ర.శ్రీ.వే.గడియారం వెంకట శేష శాస్త్రి గారు', రాణాప్రతాపచరిత్ర వ్రాసిన దుర్భాక రాజశేఖర శతావధానిగారు, C.V. సుబ్బన్న శతావధానిగారు , రాజన్న కవి గారు, నరాల రామిరెడ్డి గారు, గంటి కృష్ణవేణమ్మ గారు, అవధానం చంద్రశేఖర శర్మ గారు (ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు మరియు అవధాని), బహు గ్రంథ కర్త శ్రీయుతులు Dr. ప్రభాకర రెడ్డి గారు (children specialist) మొదలుగాగల విద్వచ్ఛిరోమణులను కన్నదీ గడ్డ. వేద విద్వాంసులకు ఒక కాలములో కాణాచి. వేదమూర్తులు శతవర్ష జీవితులు  కీ. శే. తిప్పాభట్ల వెంకటసుబ్బయ్య గారు వారు బ్రతికినంత కాలమూ కొన్ని వందల వేదవిద్య చదువ వచ్చిన పేద విద్యార్థులకు అందరికీ  తనయింట భోజనము పెట్టించి చదువు చెప్పి పంపినారు. వేదవిద్య వారివద్ద సాకల్యముగా నేర్చుకొన్న శాకల్య సుబ్రహ్మణ్యంగారు, వెల్లాల వెంకట శేషయ్య గారు మిక్కిలి ప్రసిద్ధులు. నేడు అట్టివారెవరూ లేక ఆ వూరు వెలవెల బోవుచున్నది. 

ఇక్కడ ముఖ్యంగా ఒక్క మాట చెప్పుకోనవలె మాన్యులు A.K. ముని గారి గురించి.  పేరు అవధానం కృష్ణముని. వారు చదివినది 8వ తరగతి వరకు. గణితము,ఆంధ్రము, సంస్కృతము, ముఖ్యంగా ఆంగ్లములో అపారపాండితీ ప్రకాండుడు. గాంధీ గారు కస్తూరిబాయి తో కలిసి, పైన తెల్పిన సమయములో, ప్రొద్దుటూరు వచ్చినపుడు బస చేసింది వీరి ఇంటిలోనే. వారి పాండిత్యమునకు గాంధీజీ అబ్బురపడినారట. మదరాసు లోనే వారిని గూర్చి వినుతవల్ల వారి యింటిలో దిగినాడట.  వీరికి 1. నవనవోన్మేష ప్రజ్ఞా ధురీణ 2కవి పండిత విమర్శకాగ్రేసర 3. ఆనంద కుమార అనే బిరుదులుండేవి. నెహ్రు బ్రతికియున్న కాలములో ఆయన పుట్టిన రోజున అత్యంత క్లుప్తముగా ఆయనను గూర్చి వ్రాసిన వారికి రూ.5,116 లు 'మద్రాసు ప్రెస్ గిల్డ్ ( ఎవరు అన్నది నాకు ఇదమిధ్ధముగా తెలియదు.)వారు ప్రకటించితే ఆయన 'Nation's Exalted Hero Rules Us' అని వ్రాసి ఆ బహుమతిని పొందినారు. 1950 దశకములో ఆ మొత్తము ఎంత పెద్దదో చదువరుల ఊహకు విడిచిపెట్టుచున్నాను. ఆయన కుమారుడు శ్రీయుతులు పద్మశ్రీ A.S.రామన్(అవధానం సీతా రామశాస్త్రి. )గారు ILLUSTRATED WEEKLY OF INDIA కు మొట్టమొదటి సంపాదకుడు. 
(ఈ పేరాలో కనబరచిన విషయాన్ని నాకు అగ్రజతుల్యులైన నంద్యాల సుబ్బరామ శర్మ, ప్రొద్దటూరు,గారి నుండి గ్రహించినాను.)

ఇంకొక విషయం. సాధారణంగా వైశ్యులలో రాజకీయాలు యూనియన్లు మొదలగు వానికి ఆదరణ తక్కువ. అందుకు విరుద్ధముగా వల్లంకొండు సదానందీశ్వరయ్య గారు విద్యార్థి దశలోనే వామపక్ష భావములకు ఆకర్షితుడగుటయే కాక SBI లో చేరి క్రొత్త యూనియన్ ఏర్పరచుటకు శ్రమించిన వారి లో ముఖ్యుడై  పిదప officer's association లో ప్రముఖ బాధ్యతలు నిర్వహించి ఆపై pensioner's association కు vice president గా తన సేవలందించిన,ఇంకా,వయసు మీద పడుటవల్ల, సామాన్య సభ్యునిగా సేవలందించు చున్న ఈయన 1989 లో USSR ఆహ్వానము పై May Day Celebrations కు వెళ్ళి వచ్చిన ఘనుడు. 

స్థానం నరసింహారావు గారు ' మీరజాల గలడా' అన్న పాటను ఈ వూరిలో కృష్ణ తులాభారము నాటకము వేయవచ్చి సాయంసమయములో మిత్రులతో వ్యాహ్యాళికి వెళ్ళినపుడు పెన్నా నది ఒడ్డున వ్రాసినారని ఇక్కడివారు చెబుతారు. మొదటి సారిగా ఆవూరి వేదిక పైననే పాడినారట. 

చివరిగా ఇంకొక్క విశేషము చెప్పి చాలించుతాను. ఈ వూరికి ఇంకొక ముఖ్యమైన ప్రత్యేకత వుంది. ఇక్కడ బంగారు వెండి ప్రత్తి నునెల వ్యాపారము అమితము. ఈ ఊరిని గూర్చి తెలిసిన వారు దీనిని రెండవ బొంబాయిగా చెప్పుకొంటారు. ఇక్కడి వైశ్యులు ఒక మానవ శృంఖలముగా నేర్పడి వ్యాపారములో ప్రపంచ ప్రసిద్ధులైన మార్వాడీలను ఈ వూరిలో అడుగు పెట్టనివ్వలేదని అంటారు. ఇది నేటికినీ గమనించవచ్చు. 

చలన చిత్రములలో చూపించు నటుల రీతిగా  ఈ సీమలో కక్షలు కార్పణ్యాలు కుళ్ళు కుట్ర ద్వేషము పగ 
లేవు. రెండు వర్గాల మధ్య ఒక వేళ పగ వున్నా అది ఆయా వర్గ సభ్యుల మధ్యనే పరిమితము. నాకు స్వయానా పిల్లనిచ్చిన మామ గారైనా శ్రీయుత నంగనూరిపల్లె క్రిష్టిపాటి వెంకట రామయ్య గారు మంది మార్బలముతో వర్గము కలిగి యుండుటయే కాక తన విరోధుల చేత కూడా మన్నన పొందిన వారు. ఆయన 45 సం. క్రితము సాధారణ మరణమే తప్ప వేరు విధముగా పరమపదమునందలేదు. 

సభ్యులు చాలా మందికి అక్కడి దేశకాల పరిస్థితులు తెలియవని తలచి నాకు చేతనైన రీతి లో విశధముగా వ్రాసినాను. తప్పక,తప్పని తలవరని తలుస్తాను. 
ప్రొద్దుటూరు గురించి నా మాటలలో ...
బంగరు వెండి వస్తువుల, బట్టల గుట్టల, పత్తి, నూనెలన్
రంగుల నేత వస్త్రముల  రంజగు దోశెల నాణ్యమందునన్
ఏగతి పోటి చేయనగు నేపురమైనను గాని పేటతో
చాగురె ప్రొద్దుటూరు గన చారు తరంబు పురంబు లన్నిటన్

గంటి కృష్ణవేణి గరితను ఎరిగించె
కొరటమద్ది వారి గొప్ప తెలిపె
సుబ్బారావు గారి సౌజన్యమును పంచె
ప్రొద్దుటూరు గాదు ముద్దుటూరు
దుర్భాక  జవ్వాది ధూప మాఘ్రాణింప
పృధివి నింపిన యట్టి ప్రొద్దుటూరు
గడియారమను పేర కస్తూరి వాసనల్
పృధివి నింపిన యట్టి ప్రొద్దుటూరు
పుటపర్తి పేరుతో పునుగు తావులనెల్ల
పృధివి నింపిన యట్టి ప్రొద్దుటూరు
సుబ్బన్న యత్తరు సౌగంధ వీచికల్
పృధివి నింపిన యట్టి ప్రొద్దుటూరు 
చంద్రశేఖర చందన చర్చితమ్ము
రామిరెడ్డియు రాజన్న రంజితమ్ము
వణిజ ప్రముఖాగ్రణీ సంఘ విలసితమ్ము
బరగ పేటగ  జగతిన పరిచితమ్ము



ఇవే కాక , కడప, అత్తిరాల (హత్యరాల. ఇక్కడ తండ్రి జమదగ్ని ఆజ్ఞ మేరకు తల్లియైన రేణుకను పరశురాముడు వధించినట్లుగా స్థలపురాణం. నరకబడిన చేతులతో ఇక్కడ ప్రవహించే చెయ్యేరులో స్త్నానము చేస్తూనే ఆయనకు పోగొట్టుకొన్న చేతులు వచ్చినవట, అందుకే ఆనదిని బాహుదా నది అంటారు. బాహు అంటే చేతులు '' అంటే అనుగ్రహించినది అని అర్థము.) రాజంపేట, గండి ఆంజనేయస్వామి దేవాలయము, (వేంపల్లె కు దగ్గర), సౌమ్యనాథాలయం, ఉల్లంఘేశ్వర స్వామీ ఆలయములు (అతి ప్రాచీనములు. అన్నమయ్య సౌమ్యనాథునిపై పదాలు కూడా పాడినాడు. తాళ్ళపాక ఇచ్చటికి అత్యంత సమీపము.) నందలూరు, నామాలగుండు, కనంపల్లెదేవరరాయి, సంబేపల్లి, వీరభద్ర స్వామి దేవాలయము, దేవళాలు (అల్లాడుపల్లె), చాపాడు మండలం, రాచవేటి వీరభద్ర స్వామి దేవాలయము, రాయచోటి, సంజీవరాయుడు దేవాలయము ప్రొద్దుటూరు మొదలగునవి కలవు.

ఇక ఇక్కడి శిలా చిత్తరువుల గూర్చి తెలుసుకుంటే ఈ ప్రాంతపు చరిత్ర ఎంతటి పురాతనమైనది అన్నది తెలియవస్తుంది. కడప జిల్లాలోని చింతకుంట ముంబాయి చెన్నపట్టణపు రైలు బాటలో నున్న ముద్దనూరునకు సమీపములో నున్నది. మధ్యప్రదేశ్ లోని భింబెడ్కా తరువాత అతిపెద్ద శిలాచిత్రములను గల్గిన ప్రాంతము ఇదియే!
తొలిసారిగా ఇర్విన్‌ న్యూ మేయర్‌అనే ఆస్ట్రియా దేశస్థుడు ‘లైన్స్‌ ఆన్‌ స్టోన్‌ - ది ప్రిహిస్టారిక్‌ రాక్‌ ఆర్ట్‌ ఆఫ్‌ ఇండియా’ అన్న పుస్తకంలో చింత కుంట రేఖా చిత్రాల గురించి వివరించారు. 1981 లో దక్షిణ భారతదేశంలోనే మొదటి, పెద్దదైన, ప్రముఖమైన మిసోలిథిక్‌ కాలానికి (బీసీ 8000-1500) చెందిన రేఖా చిత్రాల స్థావరంగా చింతకుంటను గుర్తించి, 1993లో పుస్తకాన్ని వారు ప్రచురించటం జరిగింది. దీనివల్ల ఐరోపా ఖండములోని రాతిపై చెక్కిన కళాకృతులకన్నా ఎన్నో వేల సంవత్సరముల పూర్వమే భారత దేశములో ఉన్నవన్న వాస్తవము బయల్పడింది.  చింతకుంటలో మధ్య శిలా యుగానికి చెందిన శిలాకృతులు నేలకు 3-5 మీటర్ల ఎత్తులోనే ఉన్నాయి. అందులో జింకల మరియు మనుషుల చిత్రాలున్నాయి.

రేఖలు చెదిరి, శరీర భాగం మీద అడ్డదిడ్డంగా వున్నాయి. ఇవి ఆరాధనా ప్రతీకలయి వుండవచ్చు. వాటితో పాటు నవీన శిలా యుగ శిలా చిత్రలేఖనాలు చింతకుంటలో వుండడం అరుదైన విషయం. చారిత్రక దశలోని శిలా చిత్ర లేఖనం కూడా వుండడం ఇంకా గొప్ప విశేషం. మరో గమనించవలసిన విషయం ఏమిటంటే విల్లంబులు కల్గివున్న మానవా కృతుల మూపురము కలిగిన  ఎద్దుల పక్కనే వుండటం. శిలల మీద గీట్లు అంటే గీతలు  పెట్టినట్లున్న చెక్కడాలు కూడా మూపురమును కలిగిన ఈ ఎద్దులకే ఎక్కువగా వున్నవి. కర్నాటకలో గానీ, మధ్య భారతమున గానీ ఈ మూపురపు ఎద్దుల శైలీపరమైన పోలికలు కానరావు.


రాతి చెక్కడాల్లో చింతకుంటలో కన్పించిన మరో విశేషం ఏమిటంటే కొపులేరూపములు. అనగా ‘కప్పుల’ ఆకారంలోని రూపములు. మధ్య శిలా యుగంలోని చిత్రాలు కనిపించిన శిలాశ్రయాల కుడ్యాల మీద ఇవి కన్పించాయి. ఇటువంటి కొపులెఆకారాలు కర్నాటకలోనూ, దక్షిణ భారతంలోని ఇతర ప్రాంతాలలోనూ బహిరంగ ప్రదేశములయందు బండరాళ్ళ మీదనో, శిలాశ్రయాల నేలల మీదనో కనిపిస్తాయి తప్ప, శిలాశ్రయాల గోడల మీద కన్పించవు మన చింతకుంటలో వలె అని పురాతత్వ శాస్తవ్రేత్తలు తమ గ్రంథములలో వ్రాయుట జరిగినది. చారిత్రక దశలోని శిలాచిత్ర లేఖనం, మత చిహ్నాలతో, వ్యక్తులతో, చిత్రించిన వర్ణమాలతో, రాతతో, గుర్రాలు, ఏనుగులు లాంటి చిత్రాలతో, వీరులు వాటి మీద స్వారీ చేస్తున్న చిత్రాలతో ప్రత్యేకతను సంతరించుకొంది.


చింతకుంటలోని శిలాశ్రయాలు ఎర్రమల కొండల్లో వున్నాయి. అవి ఎత్తు తక్కువ. మొత్తం పదిహేను శిలాశ్రయాలున్నాయి. వీటిలో పదింటిలో చిత్రాలు బాగున్నాయి. చిత్రాలు ఎరుపు, తెలుపు రంగుల్లో వున్నాయి. జింక, దుప్పి, మూపురము కలిగిన ఎద్దులు, ఏనుగులు, నక్కలు, కుందేళ్ళు, హైనాలు, సరీసృపాలు, పక్షులు, మానవ ఆకృతులు, రేఖాంశ రూపాలుగా మానము ఎన్నింటినో చూడ వచ్చు. మానవాకృతులు విల్లులు పట్టకోవడం, ఒకరికొకరు ఎదురెదురుగా వుండడం, ఏనుగుల మీద ఎక్కి సాగడం లాంటి ఎన్నో శిలాచిత్రములను మనము చూడవచ్చు. వర్ణ చిత్రాల సంఖ్య మొత్తం రెండు వందల దాకా ఉంటుంది. తెలుపు రంగు బొమ్మలు పది మాత్రమే వున్నాయి. ఇవి మత ప్రతీకలై ఒక ప్రత్యేక తరహాలోనున్నవి.


ఎర్రబొమ్మల్లో కొన్ని ఏనుగులవి. ఏనుగుల మీద స్వారీ చేసే వాళ్ళవి. ఇవి శైలి రీత్యానూ, వస్తువుకు సంబంధించిన తెలుపు బొమ్మల వలెనే ఉంటాయి. మూపురం ఎద్దులు ఒకే ఒక శిలాశ్రయంలో వున్నాయి. దీన్ని స్థానికంగా ఎద్దు ల ఆవుల గుండుఅంటారు. అలాగే దాంపత్య మైధున చిత్రము కూడా ఒకటి వుంది. శైలి, స్థితి దృష్ట్యా చూస్తే ఈ బొమ్మ మూపురం ఎద్దుల బొమ్మలకు సమకాలీనంగా వున్నాయని చెప్పవచ్చు. దక్షిణ భారతదేశ నవీన శిలాయుగ విశిష్ట లక్షణంగా వున్నాయి. ఇక మిగిలిన ఎర్ర చిత్రాలలో జింకలు, ఇతర శాకాహార,మాంసాహార జీవులున్నాయి.


ఇవి మధ్య శిలా యుగానికి చెందినవని ఎన్‌. చంద్రమౌళి గారు పేర్కొన్నారు. చింతకుంట దగ్గర్లోనే సూక్ష్మశిల, నవీనశిల పుష్కల స్థావరం వున్నదని శ్రీయుతులు వేంకట సుబ్బయ్య గారు  తమ పుస్తకం సౌత్‌ ఇండియన్‌ నియోలిథిక్‌ కల్చర్‌లో తెలిపినారు. 2010 ఆగస్టు 17న జరిగిన ‘పర్యాటక పర్యటనతో ఈ చింతకుంట రేఖా చిత్రాలు మీడియాలో ప్రాచుర్యము లోనికి బహుళముగా వచ్చినాయి. అప్పటి కడప జిల్లా కలెక్టర్‌ శశిభూషణ్‌ కుమార్‌ ప్రత్యేక చొరవ వల్ల, క్రషింగ్‌ లీజు రద్దు అయి నేటికీ ఈ చింతకుంట శిలా చిత్రాలు సజీవంగా మనకు కనబడుతున్నాయి.లెక్చరర్‌ పుల్లారెడ్డి, స్థానిక విలేఖరులు, ఇంటాక్‌ సభ్యులు, భారత పురాతత్వ సర్వేక్షణ అధికారులు, యోగి వేమన విశ్వ విద్యాలయ ఆచార్యులు, విద్యార్థులు, జమ్మలమడుగు ఆర్డీవోలు శ్రీసుబ్బారెడ్డి, శ్రీవెంకటరమణారెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి పథక సంచాలకులు గోపాల్‌ తదితరులు ఆది మానవుల రేఖా చిత్రాలను బాహ్య ప్రపంచానికి తెలియజేయడంలో విశేష కృషి చేసినారు.

ఈ రేఖా చిత్రములు గలిగిన 15 ముఖ్యమైన శిలలు ఈ విధముగా ఉన్నాయి. 1. గొడుగు గుండు 2. మబ్బు గుండు ౩. ఎద్దుల ఆవుల గుండు, 4. పెద్దావిడ గుండు, 5. చిన్నావిడ గుండు, 6. చిన్న మబ్బు గుండు, 7. పిడుగు గుండు, 8. పడగ గుండు, 9. దానం గుండు, 10. సన్నాసాయన   గుండు, 11. వనం గుండు, 12. చిలకల గుండు, 13. చెంబు గుండు, 14. కలం గుండు, 15. మల్లెలమ్మ గుండు.
పాండిచ్చేరి కేంద్రీయ విశ్వ విద్యాలయమునకు చెందిన  డాక్టరు N. చంద్రమౌళి గారి ‘Rock Art of South India’ మరియు కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయమునకు చెందిన డాక్టర్ P.C. వెంకట సుబ్బయ్య గారు అనేక విషయములతోగూడిన  “South Indian Neolithic Culture” (Pennar Basin, A.P) అన్న విస్తృత రచన మనకు ఎన్నో అద్భుతమైన విషయములను తెలియజేస్తాయి. వారి ఈ అమోఘమైన రచనల ద్వారా మనకు ఈ చిత్రములు క్రీ.పూ. 8000 1500 నాటివని తెలియచెబుతాయి. డాక్టరు వెంకట సుబ్బయ్య గారు నాటి ఎన్నో కళాకృతులను  ఎంతో వ్యయప్రయాసలకోర్చి సేకరించినారు.ఈ సేకరణలోని ప్రత్యేకత ఏమిటంటే పెన్నా నదీ పరీవాహక ప్రాంతములలో సేకరించిన ఈ కళాకృతులలో ఒక చింతకుంట లో దొరకినవి మాత్రము లక్షా యాభై వేల సంవత్సరముల నాడు నివసించిన జనుల చేత తయారు చేయబడినవి అని చెబుతున్నారు.  ఈ వాస్తవాన్ని శాస్త్రజ్ఞులు గుర్తిస్తే మతగ్రంధములలోని మానవుల పుట్టుకకు ఏ గతి పడుతుందో!
కడపకు చెందిన ఈ మహనీయుని గూర్చి తెలుసుకొందాము.
శ్రీ లక్కోజు సంజీవరాయ శర్మ గారు
శకుంతలాదేవికి మనదేశములో ఎంతో గుర్తింపు వుంది. ఆమెను 'మానవ గణిక (Human 
Computer) అనికూడా అంటారు. ఆమె చదువుకొన్నది. దేశ విదేశాలు తిరిగింది.  సర్వత్రా సన్మానాలు పొందింది కానీ చదువకుండానే గణితములో అసమాన పాండిత్యము గడించిన అంధుడైన శ్రీ లక్కోజు సంజీవరాయ శర్మగారిని గూర్చి ఎంతమందికి తెలుసు. నా వయసు వారికి కొంతవరకు తెలిసే అవకాశం వుంది. ఆ రోజులలో శ్రమతో కూడియున్నది అయినప్పటికీ ఆయన జీవనాధారము కొరకు గత్యంతరములేక ఆంధ్ర దేశములోని ఎన్నో పాఠశాలలు తిరిగి తిరిగి పొట్ట పోసుకోనేవారు. ఆయన జవాబు చెప్పే విధానము అతి విచిత్రముగా వుంటుంది. ఎటువంటి గణిత సంబంధిత ప్రశ్న నడిగినా కొన్ని సెకనులు తన వద్ద నున్న ఫిడేలును వాయించి తక్షణం జవాబు సరిగా చెప్పేవాడు. తప్పుకు ఆస్కారము ఉండేదే కాదు. ప్రభుత్వము ఆయన గొప్పదన్నాన్ని గుర్తించి సముచితంగా పారితోషికమిస్తే ఆయన రైలులో వచ్చు సమయమున  ఒక దొంగ కొట్టివేసినాడు. ప్రభుత్వము మళ్ళీ ఆయనకు సహాయము చేసింది లేదు. శకుంతలాదేవి స్వయంగా ఆయన ప్రతిభను కొనియాడినది. అమెరికా తెలుగు వారి ఆహ్వానమందినా వీసా సమస్యల వల్ల  పోలేక పోయిన అదృష్ట హీనుడు. 1996 లో ఆయనకు S.V.UNIVESITY వారు గౌరవ డాక్టరేటు ఇచ్చినారు. ఆయన చివరి రోజులు అతి 
దారుణంగా గడచినాయి. ఆయన అవసాన దశలో శ్రీ కాళహస్తి గుడి వద్ద కూర్చుని ఆయన వాయులీన వాదన విని భక్తులు వేసే చిల్లరతో పూట గడిపేవాడని విన్నాను. అయినా ఆయన  తన కిష్టమైన వాయులీనమును వదల లేదట.

ఆయన కడప జిల్లా ప్రొద్దటూరు తాలూకా ఆర్కటి వేముల ఫిర్కా కల్లూరికి  చెందినవాడు. గణిత బ్రహ్మగా పేరొందిన లక్కోజు సంజీవరాయశర్మ (1907 - 1997) ప్రపంచంలో ఆరు వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి సంజీవరాయశర్మ 1907 నవంబరు 22 న కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరు లో జన్మించాడు. ఈయన తల్లితండ్రులు నాగమాంబ, పెద్ద పుల్లయ్యలు. జన్మతః అంధుడు కావడంతో పురుడు పోసిన మహిళ గొంతు 
నులిమి దిబ్బలో పాతెయ్యమన్నదట. కొందరు ఆయన పుట్టుకతో అంధుడు కాకున్నా దోగాడే వయసులో  తనక్క ఆడుకొంటూ ఆక్కడ వున్న వడ్లగిజలు ఆయన కంట్లో వేసినందువల్ల కళ్ళుపొయినాయని కూడా అంటారు. నిజము దేవుడెరుగు. ఇవి ఏవీ ఆయన మేధస్సుకు విఘాతము కలిగించలేక పోయినాయి. కొందరు, బంధువులు కంట్లో వడ్ల గింజ 
వేసినారనియంటారు. ఏదియేమయినా ఆయనను మరణం ఏమీ చేయలేకపోయింది. అప్పట్లో బ్రెయిలీ లిపి కానీ, అంధుల్ని చేరదీసే వ్యవస్థ కానీ లేదు. శర్మ అక్క పాఠశాలలో చదివినవి ఇంటి దగ్గర గొంతెత్తి బిగ్గరగా మననం చేస్తే, అవి విని, గుర్తుపెట్టుకునే వాడు. ఆ కాలములో పెద్దలు గట్టిగా చదవమని నిర్బంధించేవారు. ఆయనకు  గణితము పైన మక్కువ ఎక్కువగా వుండేది. ఎక్కాలు మొదలైనవి అక్క ద్వారా నేర్చుకున్నాడు కానీ 
ఆయన వున్న గ్రామములొ, లేక దానికి చుట్టు ప్రక్కల ఉన్న గ్రామములలో విద్య ఆయన గడించిన పాండిత్యము మేరకు ఉండేది కాదు. కాబట్టి ఆయనే అపుడపుడు చెబుతున్నట్లుగా ఆయన అపార పాండిత్యము భగవద్దత్తము. 

చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో, తల్లి పెంచి పెద్దచేసింది. కల్లూరులో రైతులకు ధర  మేరకు ధాన్యం విలువ, భూమి కొలతలు ( గొలుసులు, లింకులు)   అడిగిన రైతులకు చెప్పి వారిచ్చే ప్రతిఫలము గ్రహించేవాడు. ఆయనకు వాయులీనముపై ఎప్పుడు ఎందుకు శ్రద్ధ కలిగిందో నాకు తెలియదు కానీ అది ఆయన ఆరవ ప్రాణము. ఆయనకు పందొమ్మిదవయేట వివాహమైనది. ఆయన భార్య పేరు ఆది లక్ష్మమ్మ. పెళ్లినాటికి ఈమె వయస్సు తొమ్మిదేళ్లు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం. భార్య ఆదిలక్ష్మమ్మ జనవరి 5, 1994  
శ్రీకాళహస్తి లో చనిపోయింది.

సంజీవరాయశర్మ తొలిసారి 1928 లో గణితావధానం నిర్వహించినట్లు వినికిడి. దీనికి ఏ పుణ్యాత్ముడు కారణభూతుడో తెలియదు. . అప్పటినుంచి 1995 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర,బీహారు, ఢిల్లీ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి, ఆరువేల ప్రదర్శనలకు తక్కువ లేకుండా ఇచ్చినట్లు అంచనా.. అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు 1928 నవంబరు 15 నంద్యాల లో జరిగినపుడు, ప్రధాన ఆకర్షణ సంజీవరాయశర్మ గణితావధానమే. సాధారణంగా, గణితావధానం లో, పుట్టిన తేదీ ఇస్తే, అది ఏ వారము అయిందో చెప్పడం ఒక అంశం. కాని, ఈ విషయంలో సంజీవరాయ శర్మకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ పుట్టిన తేదీ ఏ వారము అయినదో చెప్పడమే కాకుండా, ఆనాటి పూర్తి పంచాంగము చెప్పేవాడు. అంటే, పుట్టిన తేదీ, సమయము, ప్రదేశము చెప్పగానే,
దానికి సంబంధించిన తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము, వర్జ్యము, రాశి కూడా చెప్పి, కొంతవరకు జాతకం కూడా చెప్పేవాడు. ఈ ప్రత్యేకతను (మానవ గణనయంత్రము గా పేరొందిన శకుంతలాదేవితో సహా) మరెవరూ చూపలేక పోయినారు. ఆవిధంగా, ఇది అనితరసాధ్యమైన ప్రత్యేకత.  మన ప్రథమ దేశాధ్యక్షుడు Dr. బాబూ రాజేంద్ర ప్రసాద్ మరియు ప్రథమ ప్రధాన మంత్రి యగు జవహర్లాల్ నెహ్రూ గార్ల వద్ద తమ ప్రతిభను ప్రదర్శించి మన్ననలు పొందిన మహనీయుడు.
ఆయన అవధాన విద్యలో అవలీలగా పరిష్కరించిన అతి జటిల సమస్యలను ఒకటి రెండు చూద్దాము.
1966 డిసెంబరు ఏడో తేదీ హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం వేదిక
ఆయన అవధాన విద్యలో అవలీలగా పరిష్కరించిన అతి జటిల సమస్యలను ఒకటి రెండు చూద్దాము.
ప్రశ్న : 2 power 103 ఎంత?
జవాబు : అసలు 2^25=33554432 మరి ఈ సంఖ్యను దానితోనే నాలుగు మార్లు హెచ్చించి దానిని2^3 తో హెచ్చించితే వచ్చె లబ్ధము ఆ ప్రశ్నకు సమాధానము. అది 32 అంకెలలో వుంటుంది. 32 అంకెల జవాబు ఆయన అర నిముసములో చెప్పినాడట.

ప్రశ్న : నుంచి క్షవరకు ఉన్న అక్షరాలకు వరుసగా నంబర్లు వేస్తే, ‘, రి, , , , , నిఅక్షరాల లబ్దం ఎంత? ఏభై రెండు కోట్ల అయిదు లక్షల ఆరువేలు
జవాబు : కలం, కాగితం రెండూ ఉన్నా గంటల కొద్దీ సమయంలో కూడా చెప్పలేని సమాధానాల్ని ఆయన ప్రశ్న అడిగినంత సులభంగా, ఏమాత్రం తడుముకోకుండా, ఆలస్యం లేకుండా సమాధానం చెప్పినాడు.

రాజుని చదరంగంలో ఓడించినందుకు బహుమానంగా బ్రాహ్మణుడు   మొదటి గడిలో ఒక వడ్లగింజ, రెండో గడిలో రెండు గింజలు, మూడో గడిలో నాలుగు, నాలుగో గడిలో ఎనిమిది ఇలా అరవై నాలుగు గళ్లు నింపి ఇమ్మన్న కథ మనము విన్నదే. రాజు అదెంతపని అని అనుకొంటాడు. తీరా ఎన్ని వడ్ల గింజలో తేల్చాల్సి వచ్చేటప్పటికి సభలో  అందరూ తలలు పట్టుకుంటారు! దానికి సంజీవరాయశర్మ చెప్పిన సమాధానంఒక కోటి 84 లక్షల, 46 వేల 74 కోట్ల 40 లక్షల, 73 వేల, 70 కోట్ల, 95 లక్షల 51 వేల, 615 వడ్ల గింజలన్నమాట (1,84,46,74,40,73,70,95,51,615!) (దీనిని మనము geometric progression అంటాము. మేము దీనిని మా Digree లో నేర్చుకొన్నాము. ఇప్పుడు బహుశ intermediate లో నేర్చుకొంటారేమో.)
ఒక ఘనపు మీటరు పరిమాణం ఉన్న బస్తాలో దాదాపు ఒక కోటి యాభై లక్షల వడ్లగింజలు పడితే అటువంటి బస్తాలు ఒక కోటి ఇరవై లక్షల వేల కోట్లు ఘనపు మీటర్ల బస్తాలు అవసరం! నాలుగు మీటర్ల ఎత్తు, పది మీటర్ల వెడల్పు గల ఒక గాదెలో ఆ ధాన్యం నింపాలంటే ఆ గాదె పొడవు మూడు వందల కోట్ల కిలోమీటర్లు ఉండాలి. ఈ దూరం భూమికీ సూర్యుడికీ మధ్య ఉన్న దూరానికి రెండింతలు!
అంత ధాన్యం ఈ భూమండలంపై ఉండదు! ఇదంతా అబ్బురమనిపించవచ్చు. కానీ సంజీవరాయశర్మ గణితావధాన మహిమ అదంతా!
ఆయన ప్రతిభ రాయలసీమ నుంచి అంతర్జాతీయమునకు ప్రాకినదే కానీ తగిన పురస్కారము అందుకోలేకపోయినాడు ఆ అనితర ప్రతిభావంతుడు. . దురదృష్టం ఏమిటంటే 1993లో అమెరికా సందర్శించాలని ఆయన్ని అక్కడి తెలుగు సంఘాలు ఆహ్వానించినా సకాలంలో వీసా రాకపోవడంతో ఆ మేధావి ఇల్లు కదలలేకపోయారు. వివిధ విశ్వవిద్యాలయాలకు ఆయన ప్రతిభ ప్రాకినదే కానీ తగిన పురస్కారము వారినుండి  అందుకోలేక పోయినాడు ఆయన. ఆయన అసామాన్యుడు, అనితర ప్రతిభావంతుడు.  చిత్రమేమిటంటే 1964 అక్టోబరు పదో తేదీన శర్మ రేణిగుంట నుంచి తిరుపతికి రైల్లో ప్రయాణిస్తున్న సందర్భంలో ఆయనకు వివిధ సమయములలో బహుమతిగా నొసంగబడిన 14 బంగారు పతకాల పెట్టెను  దొంగలు తస్కరించినారు. ఇది కలకాలము మనకు సిగ్గు కలిగించే విషయము. మరొక సిగ్గుపడవలసిన విషయము ఏమిటంటే ఏ ప్రభుత్వ సంస్థ కానీ లేక పారిశ్రామిక సంస్థ గానీ, వ్యాపార సంస్థ గానీ ఆయనకు కలిగిన ఈ లోటుకు సహకారమును అందించలేదు. 
ప్రపంచంలో అంధులైన మహా ప్రతిభావంతుల్లో జాన్ మిల్టన్ , బ్రెయిలీ లిపిని  కనుగొన్న హెలెన్  కెల్లర్, ద్వారం వెంకటస్వామినాయుడు వంటివారు పుట్టుకతో అంధులు కారు. తదనంతర కాలంలో వారు అంధులయినారు. మన దేశంలో గణిత శాస్త్రజ్ఞుల్లో భాస్కరాచార్యులు, రామానుజన్, శకుంతలాదేవి వంటివారు మంచి శిక్షణ పొందారు. కానీ సంజీవరాయశర్మ అంధుడే కాక చదువు సంధ్యలు లేని వ్యక్తి. అంతా వినికిడి జ్ఞానమే ప్రపంచంలో ఆరుగురు గణిత శాస్త్రజ్ఞుల్లో ఒకరు శర్మ. ఆనాడే బ్రిటిష్ వైస్రాయ్ ఈయన మా దేశంలో పుట్టి వుంటే దేశం నడిబొడ్డున విగ్రహం పెట్టి రోజూ పూజలు చేసే వాళ్లంఅని శర్మను ఉద్దేశించి అన్నాడట. శకుంతలాదేవి స్వయంగా నాకన్నా ఆయన  ప్రతిభావంతుడు అని అంగీకరించింది. అయినా ఆయన జీవితము నిండు పేదరికములోనే నిలిచి పోయింది. సంజీవరాయశర్మ, శ్రీనివాస రామానుజన్ వంటి మేధావులను గుర్తించలేక పోయిన దేశమిది. శర్మ గారిని స్వతంత్రము వచ్చిన తరువాతనైనా గుర్తించలేదు మన కెంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.1997 డిసెంబరు రెండో తేదీన సంజీవరాయశర్మ దివంగతులైనారు.

సంజీవరాయశర్మ ఏవిధంగా చూసినా గణనము లో గొప్పవాడు. జాత్యంధుడైనా, ఏవిధంగా గణనము చేసేవాడో తెలుసుకొందామనుకున్న వారికి నిరాశే ఎదురయింది. పుట్టు గ్రుడ్డి అయినందున, అంకెల భావనయే కాని, రూపము తెలియదు. మరి ఎలా గణనము చేసేవాడోనని అడిగితే, తనకు చీకటి, అందులోనే వెలుగు తప్ప మరేమీ తెలియదనీ, అందులోనే సమాధానం తట్టుతుందనీ చెప్పినాడు. కనుక, అతనిది దైవదత్తమైన వరమే కాని మరొకటి కాదు. 
ఒకసారి, విశాఖపట్టణము లో గణితావధానం చేస్తున్నప్పుడు అడిగిన ఒక ప్రశ్న: 61 x2+1 = y 2
అనే సమీకరణానికి x, y లు ధన పూర్ణాంకాలు అయ్యేటట్లు సాధన చెప్పండని కోరగా, తనకు సాధన తట్టడం లేదని, కాని ఆ సాధనలో చాలా పెద్ద అంకెలు వస్తాయని చెప్పాడు. సాధన చెప్పలేక పోవడం ఒక చిన్న వైఫల్యం గా తీసుకున్నా, సాధనలో చాలా పెద్ద అంకెలు వస్తాయన్నది నిజం. సాధన : x = 226153980, y = 1766319049
ఇలాంటి సమీకరణాలను, పెల్ సమీకరణాలు అంటారు. ఇవి డయొఫాంటైన్ సమీకరణాల లో ఒక ప్రత్యేకమైన తరగతి. ఇలాంటి సమీకరణాలకు సాధనలు కనుక్కొనేందుకు చాలా కాలము క్రితమే ప్రముఖ భారతీయ గణితవేత్తలు, బ్రహ్మగుప్తుడు ( క్రీ.శ.628) సమాస పద్ధతిని, భాస్కరాచార్యుడు ( క్రీ.శ.1150) చక్రవాళ పద్ధతి ని సూచించినారు. ఆధునిక కాలంలో, ఈ సమీకరణాల సాధనకు, సతత భిన్న వాదము ను వాడుతారు. 

ఇక ఇక్కడ ఒకటి రెండు విషయాలు మనవి చేస్తాను. శర్మ గారి స్వస్థలమునకు దగ్గరైన జమ్మలమడుగు లోనే నెను చదివినది. ఆ విధంగా ఆయన అవధానము బహుశ 1959 లో ననుకొంటాను, చూచే అదృష్టానికి నోచుకొన్నాను. 1990-91 ప్రాంతములో నేను నా పిల్లలకు శకుంతలాదేవిని చూపిస్తామని మద్రాసు లోని తాజ్ కొరమాండల్ హోటలుకు పిలుచుకుపోయినాను. ఆవిడ జాతకము చెప్పుటకు ఒక్కొక్క జాతకమునకు 5 వేలు తీసుకొనేది. నా ఇద్దరు పిల్లలూ ఆమె ఘనత చూడవలెనన్న కోరికతో 10 వేలు ఇచ్చి వారి జాతకములు చెప్పించినాను! ఆమె వాణీ వదన సౌభాగ్య ధన   మరి శర్మ గారో ? కేవలము యశోధన మరియు   భగవత్ శోధన. అసలు ఇప్పటికైనా అటువంటి వారి పేరుతో సార్థకమైన జ్ఞాపికను ఏర్పరుచ గలిగితే మంచిది. 
ఆ అగణితగణిత' మేధావిని ప్రభుత్వము, ప్రజలు తగిన మేరకు గణించకున్నా మనమైనా ఈ సందర్భములో గుర్తు తెచ్చుకొని మనసారా నివాళులను అర్పించుకొందాము.
వావిలికొలను సుబ్బారావు గారు:
ఇక్కడ ఒంటిమిట్ట కోదండరామునికి జీవితమును అంకితము చేసి, వాసుదాసు అనబడు  అన్వర్థ నామధేయుడైన శ్రీయుతులు వావిలి కొలను సుబ్బారావు గారిని గూర్చి   నేను తెలుపకపోతే నేను తెలిపినది అసమగ్రము అసంపూర్ణము అవుతుంది. అంతకు మించి అన్యాయము చేసిన వాడినై శ్రీమద్ ఒంటిమిట్ట కోదండ రాముని ముందు దోషిగా నిలువ వలసి వస్తుంది. అందుకే వారిని గూర్చి కొంత వివరముగా తెలుపుకొనుచున్నాను. నేటి తరము వారయిన యువతకు,  కడప లోనే, అధిక శాతమునకు తెలియదు. ఇక వేరు ప్రాంతముల వారికి ఏమి తెలిసియుంటుంది. పరమభక్తుడగు రామదాసు వలె కూడా ఈయన ప్రభుత్వపు సొమ్ము దేవాలయ, విగ్రహాభూషణ విషయములకు ఉపయోగించక టెంకాయ చిప్ప పట్టుకొని ధన యాచనకు గడంగిన మహనీయుడు. ఇక ఆయనను గూర్చి వివరముగా తెలుసుకొనే ప్రయత్నము చేద్దాము.
కొందరు మహనీయులు కారణజన్ములై పుడమి పై ప్రభవించి వారు వచ్చిన లక్ష్యం సంపూర్ణము కాగానే పరమాత్ముని చేరుతూ వుంటారు. పూర్వము సుమారు ఐదు వందల సంవత్సరముల నాడు ఎవరైతే   శ్రీ బమ్మెర  పోతనా మాత్యుడై ఆంధ్రావని యందవతరించి  శ్రీ భాగవతమును భక్తి రసోపేతముగా తెనిగించి పరమాత్ముని మహిమను  లోకమునకు ఎరింగించి, కోదండ రామునికి సమర్పించి  పరమపదించినాడో ఆయనే తిరిగీ శ్రీయుతులు వావిలికొలను సుబ్బారావుగారిగా  వాసుదాసను అన్వర్థ నామధేయునిగా నవతరించి శ్రీమద్రామాయణమును తెనిగించి రామచంద్రుని దైవత్వమును చాటుటకు క్రొత్త పుంతలు త్రొక్కక వాల్మీకినే త్రికరణ శుద్ధిగా అనసరించి వాల్మీకి రామాయణమును దాని విమర్శనా గ్రంధమును 'మంధరము' పేరుతో మనకు అనుగ్రహించిన మహనీయుడు. వాల్మీకి రామాయణము 24,000 శ్లోకముల ఉద్గ్రంధము, పైపెచ్చు నిర్వచనము. సుబ్బారావు గారు కూడా  శ్లోకమునకు ఒక పద్యము వంతున తెనుగు సేత చేసినారు. మాతృకలో ప్రతి 1000 శ్లోకములకు ఒక గాయత్రి మంత్రాక్షరము నిక్షిప్తమై యుండగా వీరు కూడా తమ ఆంధ్రీకరణమున అదేవిధముగా గాయత్రీ మంత్రమును ప్రక్షిప్తము చేసినారు. 


వీరు శ్రీ కోదండ రామ సేవక సమాజ సమాజ సంస్థాపనాచార్యులు ఆంధ్ర వాల్మీకి రామాయణ శ్రీ కృష్ణ లీలామృత ద్విపద భగవత్ గీతాది బహుగ్రంధ కర్తలు ఒంటిమిట్ట కోదండ రామాలయ పునరుద్ధారకులు భక్తి మత ప్రచారకులు మహర్షి మౌని అకుంఠిత రామభక్తుడు తత్త్వ వేత్త వక్త విమర్శకులు.
శ్రీస్వామివారిజీవితాన్నిగురించిసంక్షిప్తంగానెమరువేసుకోవడంసాహసంఅయినఆయనజీవితాన్నిస్మరించుకోవడంసముచితం.
శ్రీ వావిలికొలను సుబ్బారావు వావిలికొలను వంశమను పాలసముద్రము నందు రాకసుధాకరుడై దుందుభినామ సంవత్సరం మాఘ శుద్ధ చతుర్ధశి నాడు 23-1-1863 నాడు కడప జిల్లా జమ్మలమడుగు నందు జన్మించారు. వారి పూర్వీకులది నైజాము రాజ్యమందలి వావిలికొలను గ్రామము. శ్రీ సుబ్బారావుగారికి పితృవియోగం 12వ ఏట సంభవించింది. పిమ్మట పినతండ్రి లక్ష్మాజీరావు సంరక్షణలో పెరిగారు. వారు వీరికి విద్యను చెప్పించి పెద్ద చేశారు.బాల్యం నుంచే శ్రీ వారికి సీతాకాంతుని యందు అత్యంత భక్తి. వారికి 13వ ఏటనే క్షయవ్యాధి సంప్రాప్తమయింది. వీరు గురుముఖుమున చదవకనే ఆంధ్ర సంస్కృత ఆంగ్ల భాషల యందు అసమాన పాండిత్యం కలవారైనారు. సహజ పాండిత్య విరాజితులు వారు. ఆ కాలంలో ఎఫ్. ఎ. వరకు చదివారు.
1883 సంవత్సరం ఆగష్టు 10వ తారీఖున ఉదర పోషణార్థం ప్రొద్దుటూరు తాలూకా కచ్చేరిలో 7-00 రూపాయుల జీతము మీద దప్తరుబంధు పనిలో ప్రవేశించారు. ఉద్యోగకాల మందు కూడా నేటి కొందరిలా పరపీడన మొనరించలేదు. వారు దైవమిచ్చిన దానితో సంతృప్తి చెందుతూ రెవిన్యూ డిపార్టుమెంటు నందు ఆక్టింగ్ తహశీల్దారువరకు పదోన్నతి పొందారు. నెల్లూరు జిల్లా కంచెనపల్లె వెంకటసుబ్బారావు పుత్రిక రంగనాయకమ్మ అను సాధ్వీమతల్లిని వివాహమాడిరి.క్షయవ్యాధి తీవ్రమగుటచే తప్పని పరిస్థితులలో ఉద్యోగజీవితాన్ని పరిసమాప్తం చేశారు. శ్రీ వారు ఉద్యోగంలో ఉండే సమయంలో కుమారాభ్యుదయం అనే ప్రౌఢప్రబంధాన్ని రచించిరి. ఒకప్పుడు శ్రీవారు నెల్లూరులో ఆ గ్రంధావిష్కరణప్పుడు అక్కడి పండిత ప్రకాండులు ఆయన కుమారాభ్యుదయ ప్రబంధ రచనాపటిమను సందేహించగా వారభీష్టం మేరకు రంగానాయకులపై శతకము వివిధ చిత్రకల్పనములతో ఒక్క పూటలో కంద పద్యములను గూర్చి వారిని విభ్రాంతులను చేశారు. తరువాత కౌసల్యా పరిణయము మొదలగు ఎన్నో గ్రంధాల్ని రచించి మాతృ భాషా సేవ గావించారు.తరువాత క్షయవ్యాధి ముదిరింది. మద్రాసు జనరల్ ఆసుపత్రి వైద్యులు ప్రయోజనం లేదని పెదవి విరిచి వదిలేశారు. చివరకు కడపనందు నన్నేసాహెబ్ అను మహమ్మదీయ యునానివైద్యుడు వారి క్షయవ్యాధి నయం చేయడం ఓక ఆశ్చర్యకరమైన విషయము.
వారు ఆరోగ్యవంతులైన తరువాత చెన్నపురిలో హైందవోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా రాజధాని కళాశాలలో తెలుగు ప్రధాన అధ్యాపకులుగా పదునారు సంవత్సరాలు పని చేసి ఉపకార వేతనం స్వీకరించి తక్కిన జీవితమంతా భగవత్ సేవలో గడపాలని నిశ్చయించుకున్నారు. ఆ మద్యకాలమందే వారు ప్రభుత్వం వారికి భాషాంతర కర్తగా నెలకు మూడువందలు గైకోనుచుండిరి.

వారు మొదట ఉపదేశాన్ని వాళ్ళ పినతండ్రిగారు లక్ష్మాజీరావుచే తీసుకొని తరువాత 22వ ఏట రాజంపేట మండలం కంప సముద్రవాసులు విశిష్టాద్వైతులు నగు శ్రీమాన్ నరసింహాచార్యులే శ్రీవారి సన్నిధి కేతించి  రామషడక్షర మంత్రము నుపదేశించినారు. అదే వారి తదనంతర ఆధ్యాత్మిక జీవితాన్ని నడిపించింది.
శ్రీ వారు తారకరామమంత్రము అత్యన్తనిష్టతో జపించుచూ రామకోటిరాయుచూ సదా శ్రీరామచంద్రమూర్తిని ధ్యానిస్తూ ఆంధ్రవాల్మీకి రామాయణాన్ని ఆంధ్రలోకానికి ప్రసాదించారు. వాసుదాసుగారి జీవితంలో అపూర్వఘట్టాలు రామాయణాన్ని ఒంటిమిట్ట కోదందరామునకు అంకితమివ్వడం శ్రీరామపట్టాభిషేక మహోత్సవం. శ్రీవారు భగవత్ కరుణాప్రేరితులై శ్రీరామాయణమునకు సరియగు ఆంధ్రవాల్మీకి రామాయణాన్ని రచించి 1908 లో శ్రీకోదండరామునకు అంకితమొనరించారు. అదొక చారిత్రాత్మక సంఘటన. ఆ సంబరాన్ని వేనవేలు జనం తిలకించి విద్వజ్జన శ్రేష్ఠలు శ్రీవారిని ఆంధ్రవాల్మీకి అనుబిరుదముతో సత్కరించినారు.
ఇంకొక అపురూప సంఘటన శ్రీవారు శ్రీమద్రామాయణమును నూట ఎనిమిది సార్లు ఏకదీక్షతో పారయణమొనరించి నూట ఎనిమిది సీతాకళ్యాణములు పట్టాభిషేకములు గావించి ఆసేతుహిమాచలమున గల ఐదు వందల పుణ్యతీర్దములందలి జలము తెప్పించి సహస్రఘటములతో శ్రీరామునికు అభిషేకం గావించి అధ్భుతరీతి శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకమొనరించిన వజ్రసంకల్పలు వారు.
1910 లో శ్రీవారికి భార్యావియోగ అనంతరము ఆయన ఘటికాచలంలో తారక మంత్రం ఏకాగ్రతతో యోగ సాధన చేయుచుండగా శ్రీరామచంద్రుడు ప్రసన్నులై ఒంటిమిట్టకు వెళ్ళి కైంకర్యం చేయనా జ్ఞాపించారు. భగవదాజ్ఞ శిరసావహించి శ్రీ వారు ఒంటిమిట్ట కేతెంచి ఒంటిమిట్ట కోదండ రామాలయ పునరుద్ధరణకు తన శేషజీవితాన్ని అంకితం చేశారు. కైంకర్యమునకు నిధుల లేమిచే కౌపీనధారియై టెంకాయచిప్ప గైకొని రామభజనతో రామాభిక్షకై అనేక పట్టణములే గాక పల్లెల్లో కూడ సంచారం గావించి ధనం గడించి ఒకపైసా అయిన వృధా చేయకుండా రామకింకర్యమునకై వినియోగించిన ధన్యజీవి. ఈ సందర్భములో  వారు పద్య రూపములో టెంకాయ చిప్పకు తమ కృతజ్ఞత తెలుపుకొన్న వైనము మీకు తప్పక తెలిపి తీర వలసినది.
 ఆంధ్ర వాల్మీకి హస్తంబు నందు నిలిచి 
రూప్యములు వేన వేలుగా ప్రోగు చేసి 
దమ్మిడైనను వాని లోదాచుకొనక 
ధరణి జాపతి కర్పించి ధన్యవైతి
కర్మ గుణపణముల కుప్ప ! టెంకాయ చిప్ప! "
ఈ ధనముతో శ్రీరామసేవాకుటీరం నిర్మించి అతిధి అభ్యాగతులకు ఆధారం కల్పించారు. విదేశ బైరాగులకు సదా బృతి నొసంగి ఆదరించిరి. జీర్ణమైన శ్రీరామకోవెల నుద్ధరించిరి. సంజీవరాయదేవాలయమునకు విమానగోపురం కట్టించిరి. నిత్యభోగ కల్పనం గావించిరి. నిత్యోత్సవములను ఏర్పాటు చేసిరి. రథం చేయించిరి. శృంగిశైలమందు ఆశ్రమం నిర్మించిరి. శ్రీరామతీర్థము పొదలచేత కప్పబడియుండగా దానిని బాగుచేయించి సకలభూతములకు ఉపయోగపడునట్లు చేసిరి.
కోదండ రామసేవకసమాజమను సంస్థ 1926 సంవత్సరమున ఒక కమ్మకులస్థురాలి కారణముగా స్థాపించిరి, దానికనుబంధముగా ఒక ధర్మవైద్యశాలను  స్థాపించిరి. 1929 సంవత్సరములో గుంటూరు మండలమందలి బాపట్ల తాలూకాలో జేరి బాపట్లకు సమీపమందుండు జమ్ములపాలెము గ్రామ నివాసులు మ రా శ్రీ కుఱ్ఱా సిద్ధయ్య గారి వదాన్యత తో  భక్తసంజీవని యను మాస పత్రికను స్థాపించినారు.
ఆనాటి బ్రిటిష్ చక్రవర్తి కుమారుడు శ్రీవారికి బిరుదు నొసంగ యిచ్ఛగించగా సున్నితంగా తిరస్కరించిన వైరాగ్యశాలి. ఆయన గుంటూరు ఆంధ్రసారస్వత పరిషత్తు శ్రీవారి కొసంగిన కవిసార్వభౌమ బిరుదు ఆయనకు తెలియనే తెలియదు.
వాసుదాసు మంధర సహిత రామాయణమేగాక కుమారాభ్యుదయం, కౌసల్యపరిణయం, టెంకాయచిప్ప శతకం, శ్రీకృష్ణ లీలామృతం, ద్విపద భగవత్ గీత ఆర్యకథానిధులు, ఆర్యచరిత్ర రత్నావళులు, హితచర్యమాలికలు, భక్త ప్రసూన మాలికా గ్రంథములు, సులభవ్యాకరణం మొదలగు శతాధిక కృతులను రచించి రామున కర్పించిరి.
చివరిగా వాసుదాసస్వామివారు ఆంధ్ర వాల్మీకి రామాయణమునకు వ్యాఖ్యానము మంధరమను నామమిడి ఒంటిమిట్ట వాల్మీకి ఆశ్రమమందు రాయదలచినారు. బాలకాండము ఒంటిమిట్ట యందే పూర్తి గావించిరి కానీ కొన్ని విషపరిస్థితుల వల్ల వారు ఒంటిమిట్ట విడిచి పోవలసి వచ్చినది. 
తరువాత శ్రీవారు శ్రీరామసేవాకుటీరమందు తమ అర్చామూర్తులగు శ్రీవరదాభయ కోదండరామమూర్తిని శ్రీపంచారాత్రాగమ ప్రకారం గ్రుహార్చనా పద్ధతి ప్రతిష్టించి పూజా ప్రవాహమునకు తగిన ఏర్పాట్లు గావించి భగవత్ప్రేరితులై సర్కారు జిల్లాలు పర్యటించి ఎంతో ఆదరంగా భక్తి పురస్సరంగా అనేకమంది భక్తులు వారి మందర రచనకు త్రికరణ శుద్ధిగా సహకరించి మందర రచనను సంపూర్తిగా గావింపజేసి ధన్యులైనారు.
శ్రీవారు చివరన ఆసేతుహిమాచల తీర్థయాత్రలు నిర్వహించినారు. అంగలకుదురు ప్రాంతమందు వారిపేర ఆశ్రమాలు నెలకొల్పబడినాయి. తన యావదాస్తిని కడపలోని స్వంతగృహము, చెన్నపురి యందలి స్వంతగృహము కోదండ రాముని పేర, ఆర్జించియున్న ఎన్నో ఆభరణాలు, పాత్రలు, తుదకు తానూ వ్రాసిన ఫౌంటెన్ కలముతో సహా వీలునామా వ్రాసి ఒంటిమిట్ట కోదండ రామునికర్పించిన మహిమాన్వితుడు శ్రీవాసుదాసు గారు.
చివరకు శ్రీవారు తన స్వగృహమైన చెన్నపురి శ్రీ రామజయమందిర మందు ధాతునామసంవత్సరము, శ్రవణ శుద్ధ చతుర్ధశి, శని వారము 1-1-1936 సంవత్సరము పరమపదమలంకరించారు. వీరు తమ 73 ఏట పరమవదించినారు. శ్రీ వారు లీలవిభూతి వదలి దివ్యదేహములోని నిత్య విభూతి నలంకరించిన శుభదినము.
ఈ విధముగా ఎందరెందరో మేధావులు ఈ కడప మండలమున పుట్టి అసామాన్య ప్రతిభా సంపత్తులుండి కూడా తగిన గుర్తింపు పొందలేక పోయినారు. వాతావరణము ఎపుడూ ప్రదూషణమును భరించినంతగా స్వచ్ఛ మారుతమును గ్రహించదు కదా!
కడప ప్రాంతమును శూద్ర వర్ణమునకు చెందిన జూపల్లి  ప్రభువులు  రాజ్యముల నేలినారు. వారు విష్ణుపాద సంభూతులుగా చెప్పబడినారు. వారిని జాహ్నవీ సంభూతులుగా కూడా. అంతే కాక పవిత్రులు గా కూడా పిలువ బడినారు. బ్రాహ్మణ వైశ్యాది వర్ణముల వారు తమతమ వర్ణ ధర్మముననుసరించి వీరి వద్ద ఉద్యోగములు చేయుచుండినారు. ఈ విషయమును శా.శ. 1446 (క్రీ.శ.1525) నాటి ఉప్పరపల్లె శాసనములో మనము చూడగలము.
అసలు శా.శ. 1457 (క్రీ.శ.15౩5) నాటిదిగా భావింప బడుతున్న పులివెందుల శాసనములో నాలుగు వర్ణములను అష్టాదశ ప్రజలుగా అభివర్ణించినారు. అవి ఏవన బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర, వ్యావహారిక, గోరక్షక, శిల్పక, పంచాణ ( వడ్రంగి, కమ్మరి, కంచరి, కంసాలి, కాసే అను ఐదు తెగలను పంచాణము అంటారు.), కుంభకార, తంతువాయ, క్షౌరక,  రజక, వస్త్రచ్ఛేదక, చర్మకార, తిలఘాతక, లుబ్ధక, చండాల, మాతంగులను 18 తెగలుగా విభజించి యుండినట్లు ఈ శాసనము ద్వారా తెలియవచ్చుచున్నది. ఇక్కడ మనము గమనించవలసినది ఏమిటంటే చర్మకార చండాలాది వర్గములు కూడా బ్రహ్మ క్షత్రియ వైశ్యులతో సమానముగానే విభజింపబడినారు అని మనకు తెలియవస్తూ వున్నది. పంచమ వర్ణములోనికి వారు రారు అని ఈ శాసనమును బట్టి మనకు తెలియుటలేదా! వర్ణ సంకరమునకు పాలుబడుటయేగాక నాటి శాసన ధిక్కారమును చేసినవారిని మాత్రమే నేరముల గరిష్ఠతను బట్టి వారిని జనపదములనుండి వెలివేయుట జరిగినది.  పంచమ వర్ణమన్నది ఈ విధముగా ఏర్పడినదే గానీ అన్యథా కాదు. అసలది నేడు నేరమే కాదు. కలతలు సృష్టించి అన్నదమ్ముల నడుమ అఘాతములు కల్పించ పూనుకున్న అన్యమతస్తుల  అక్రమ లేక వక్ర మార్గములు తప్పించి అన్యథా కాదు.
ఈ విషయములను డా|| అవధానం ఉమామహేశ్వర శాస్త్రి గారు వ్రాసిన ‘కడప జిల్లా శాసనాలు సంస్కృతిచరిత్ర’ అన్న గ్రంథము నుండి గ్రహించ బడినవి. దీనిని బట్టి కడపకు ఎంతటి చరిత్ర కలదో మనకు అర్థము కాగలదు.

దేశమంటే మట్టిరా
ఆ మట్టియే మా తల్లిరా
ఆ తల్లి పేరే కడప రా
ఆ కడప శ్రీపతి గడపరా!

మనసు మల్లెల తోట రా
మా మాట తేనెల వూట రా
మమత పూవుల బాటరా 
ఇది శౌర్యవంతుల కోట రా!

ఆంధ్ర సీమన ఆదిశంకర
పీఠమిదియే తెలియరా
దాని పేరే పుష్పగిరి యది
పురాణాల ప్రసిద్ధిరా!


నటులకిది పుట్టిల్లురా
కవిశేఖరుల కాణాచిరా
వాణి గళమున వాడిపోవని
మల్లెమరువపు మాలరా!

నిర్మాత దర్శక నట విరాట్టుల
నిరుపమానపు గడ్డ రా
ఏషియాలో పెద్ద స్టూడియొ
కట్టె కడపకు బిడ్డ రా!

పైడి భూషల పేట రా
చేనేత కళలకు నేత రా
జానపద గేయాలకీయది 
మధువులోలికే వూటరా!

అచ్చతెలుగుల వెల్గురా
అవధాన మణిహారమ్మురా
అసమాన పండిత వల్లిరా
ఈ గడ్డకే అది చెల్లురా!

 నోట నీరూరించు మా, తెలి
 కజ్జికాయల చూడరా
మా ఎర్ర కారెము కల్గియుండే
దోశలను చవి జూడరా!

తమలపాకులు దోసపళ్ళు
స్వర్గమును తలపించురా
కోడూరు చీనీ నారునకు 
ఈ లోకమే తలయొగ్గురా!

వజ్రాల గనులిటనుండెరా
ఖనిజాల గనులకు తల్లిరా
మా కొర్రలారికజొన్నసొజ్జలు
Oats కన్నా మిన్న రా!


రెడ్లు కమ్మల పాలనమ్మున
వైశ్య వర్గపు వితరణమ్మున
వృత్తి నైపుణ్యతల యందున 
సాటి లేనిది కడప రా!

చెడుగనే కుబుసమ్ము గల్గిన
స్వార్థపూరిత శాంతి దూతలు  
కడపకొచ్చిన ముప్పు రా
మా రాతనది ఎటు తప్పు రా!

కల్మషమ్ములు కలిసి కూడా 
నిర్మలమ్మగు గంగ రా
కడపరా ఇది కడప రా 

కడప దేవుని గడప రా!

No comments:

Post a Comment