Friday 20 September 2024

అత్త-కోడలు

 

అత్త-కోడలు

https://cherukuramamohan.blogspot.com/2024/09/blog-post_20.html

 ఈ జానపద గేయము  నన్ను పెంచిన తల్లి ( మా అమ్మమ్మ ) తాను నోటికి నేర్చుకొన్నది చెప్పినది. అసలామెకు చదువను వ్రాయను రాదు. కసారి చదవండి . ఆకాలములో కొట్లాడుకొన్నా వాళ్ళ అన్యోన్యత మనకు అర్థమౌతుంది.

అత్త -- కోడలు

అత్తమ్మ పెత్తనం అమలుజరిగే వేళ

ఆరళ్ల కోడళ్ళు అగచాట్లు బడు వేళ

చుట్టాలు పక్కాలు చూడవచ్చెడు వేళ

కోడల్ని బంపించి కొండ కట్టెలకు

మూడు చిట్ల బియ్యమొండి మునగ కూరొండి

అత్తయును మామయును అందరూ దినిరి

పైటాల కూలీలు పనివాళ్ళు దినిరి

ఏకులొడికే వాళ్ళు ఏడుగురు దినిరి

మాని ముంతల వాలె మనవళ్ళు దినిరి

కోడిపుంజులవాలె కొడుకులూ దినిరి

కుంపటి కుదుళ్ల వాలె కూతుళ్ళు దినిరి

వారి కూతులు కూడ వైనముగ దినిరి

అత్తమ్మ కూతుళ్ళ నతిప్రేమ తోడ

కూరుచోబెట్టుచూ గొంతు సవరించి

మూతి విరుపుల తోడ చేతి సైగలతో

కమ్మలను మరియును కడియాలు దొడిగి

చిలువ పలువలు జేసి చెవికెక్కు వరకు

ఆపైన ఇట్లనె అనుగు కూతురితో

ఆంబోతు కోడలి ఆపసోపాలు

చూడలేనే బిడ్డ, చూడు వంటింట్లో

కూతురా కుమ్మక్క! కూడెంత కద్దు

ఎంత ఉన్నా చాలు ఇక చేయ వద్దు

ఆమె చెప్పగ దొడగె అమ్మతో నిట్లు

మాపటికి తినకద్దు మరిమిగుల కద్దు

చేయనక్కరలేదు చేసింది చాలు

అన్నదే చాలనుచు అత్త కూర్చునెను

మోపు కట్టెల తోడ మొగమంత చెమటతో

అలుపు సోలుపుల కోడ లప్పుడే దిగెను

ఆవురావురటంచు  ఆకలిని గొనుచు

నెత్తి మోపునును దించి నీళ్ళిన్ని తాగి

కొంగుతో తా చెమట కూడా తుడువకనె

కొరకోరల అత్తమ్మ కోడల్ని యడిగె

కోడలా కొమరక్క కూడెంత కద్దే

మాపటికి లేదత్త మరి వండ వలెను

అత్తమ్మ కోపమ్ము అగ్గిమంటయ్యె

అమ్మోరు పూనినట్లడిగె తానంత

ఆరడి కోడలా అతిమాటలొద్దు

పోద్దుగునుకులు నీదు పోరుబడలేను

'వెంటనే కుంపటిని వేరుంచుకొమ్ము'

అన్న అత్తయ్యతో ననే కోడలిట్లు

'వేరుండ నాకేల వెతలు పడనేల

పాలుండ నాకేల  పంచుకొనేల

నాదు పెనిమిటి తోటె నా వూరు పేరు

కట్టుకోన్నోడె నా కనుపాప తీరు

వాని మాటలు వేదం వాక్యాలు నాకు

వాడు లేనిదె బతుకు వలదింక నాకు

వానితోనే జెప్పి వాస్తవము దెలిపి

అడగమందును నిన్నుఅత్తరోఇపుడు '

'నాయమ్మఓయమ్మ నను గన్న తల్లి

నీ ముద్దు కోడల్ని నీవన్నదేమి?'

'నేనేమి యంటిరా నే కన్న కొడుకా!

తలవాకిటన నిల్చి తలదువ్వ వద్దు,

పొరుగుతో మొగసాల పోరసలు వద్దు

ఇంటి సంగతనొద్దు ఇరుగు పోరుగులతో

మాట మాటకు బదులు మాటాడ వద్దు

అనితప్ప వేరేమి అనలేదు నేను

తప్పేమి వుందిరా తనయుడా ఇందు

అమ్మ కాకరకాయ ఆలేమొ చెరుకాయ

దాని మాటలు జోల తల్లేమో గోల

నీవు చిట్టెలుకవు నీభార్య పిల్లి

నీవు కుక్కిన పేను నీ తల్లి నేను'

అని దెప్పుతూ బోయి ఆమె పతిజేరె

ఇంత తగువులాట జరిగినా ఇక్కడ గమనిచ వలసినది ఏమిటంటే ఎవరి భర్త వద్దకు వారు పోవుట తప్పించి వేరు ఆలోచన వారిలో కలుగ లేదు.

ఈ గేయములో :

ఇవి రేనాటి పలుకుబడులు

వాలె = వలె

పైటాల = పగటి వేళ, మధ్యాహ్న సమయము

మాని ముంతలు = పూర్వము విరివిగా చందనము కొయ్యతో పాత్రలను తయారు చేసేవారు. మిగతా చోట్లలో కూడా వుండేది కానీ కొంత తక్కువ. వాటి వాడకము ఆరోగ్యమునకు చాలా మంచిదని ఇండ్లలో వాడేవారు. అసలు వండుతకు స్త్నానమునకు వాడు కట్టెలనుకూడా చట్ల జాతులను బట్టి ఏరిఏరి ,చండ్ర, చందనము,మద్ది మొదలగునవి, వాడే వారు. ఇప్పుడు మనకు వాటి పేర్లు గూడా తెలియదు.

కుంపటి కుదురు = బొగ్గుల పొయ్యి నుండి బూడిద కిందపడకుండా అటు కుంపటి కదలకుండా వుండే విధముగా ఒక ఇనుప లేక పలుచటి రాతి పలక వాడే వారు.

పోద్దుగునుకులు = తెల్లవార్లు

మొగసాల = చావిడి

చెరుకాయ = చెరుకు ఆయె

 

చెరుకు రామ మోహన్ రావు.