Saturday, 3 December 2022

 ఒక వ్యాఖ్యానం (మన సంస్కృతి - నేటి విద్యా విధానము)


Srinivas Yanamandra శర్మ గారు, రావు గారు. నమస్కారములు. మీరు పంచుతున్న ఈ జ్ణానము ఎంతో విలువయినది. ప్రస్తుత సమాజానికి అవసరమయినది. కాని, దేశ సంస్కృతికి, దేశ సంపదకి చాలా అవినావభావ సంబంధముంది. సంపన్న దేశాలు తమ సంస్కృతిని పరిరక్షీంచుకున్నట్లుగా, అభివృద్ది చెందుతున్న దేశాలు చేసుకొన లేవు. సంస్కృతిపరముగా నేర్చుకున్న విద్య చివరికి తమ జీవితాలకు ఏ విధముగా మేలు చేకూర్చునో తెలియక చాలా మంది మధ్యలోనే అమ్మమాట, సంస్కృతి ఒదిలి పరాయి భాషలోకి పరకాయప్రవేశము చేస్తారు. కాలక్రమేణా తమ మాతృ భాష, సంస్కృతి మరుస్తారు. నా ఉద్ధేశములో సమూల ఆర్ధికాభివృద్ధి సాధించి, స్వావలంబన మన దేశము సాధించు వరకు ఈ పరిణామము తప్పనిసరి. మీలాంటి పెద్దలు చెప్పు మాటలు మాకు అప్పుడప్పుడు బాధ్యతలు గుర్తు చేస్తుంటాయి. కాకపోతే మార్పు పెంపకములో కన్నా, సమాజములో సమూలమార్పు దిశగా ప్రయత్నించే నాయకులు ఈ దేశానికి అవసరము. మన అభివృధ్ధి మన భాషద్వారా మనము పొందవచ్చు అని నమ్మకము కలిగించు నాయకులు ఈనాడు మనకి కరువయ్యారు. ఎంతసేపటికీ అభివృద్ధి చెందిన దేశాల ప్రగతితో మన భవిష్యత్తు ముడిపెట్టుకుంటామే తప్ప మన శక్తి యొక్క అంతఃపరిశీలన చేసుకునము. దానికి తగు మార్గదర్సనము లేదు ఈనాటి యువతకు. కొన్నాళ్ళపాటు పెంపకములో ఇలాంటి విషయాలు పిల్లలకు ఆసక్తి రేపినా, పెద్దవారయ్యేసరకి వారిలో ఏ మూలో శంక మొదలవుతుంది. ఇవి ఎంతవరకు జీవితానికి ఉపయోగము.అని. అప్పడు తల్లిదండ్రుల పాత్రకన్నా, సమాజ పరిస్థితులు యువత మీద ప్రభావము చూపుతాయి. మీలాంటి పెద్దలు ఇలాంటి జ్ణాన వాహిని

పంచినంతవరకూ పర్వాలేదు. కాని భావితరాలు ఈ బాటన నడవాలంటే మన సమాజానికి సమూలముగా దిశానిర్డేశము చేసి, మన సంస్కృతి మన సంపదకు బాట వేస్తుంది అని మనలను నమ్మించగలిగే నాయకుడి అవసరము ఎంతయినా ఉంది.

'ఆనోభద్రాః క్రతవోయంతు విశ్వతః' (ఋగ్వేదము). Let Noble Thoughts Come From All Sides.' సద్భావనా వీచికలు దశదిశల నుండి ప్రసరించు గాక.

మంత్రపుష్పం ఈ విధంగా చెబుతుంది 'పద్మకోశః ప్రదీకాశగుమ్ హృదయంచాప్యధో ముఖం ఆదౌ నిష్ట్యా వితశ్శాంతి నాభ్యాం ఉపరితిష్ఠతి జ్వాలమాలాకులం భాతి ........ తస్య మధ్యే వహ్ని శిఖా అనియో ఓర్ధ్వా వ్యవస్థితః....... తస్యా శిఖాయా మధ్యే పరమా ఆత్మా వ్యవస్థితః' ఈ మంత్రమునకు పెద్దలవద్ద నేను తెలుసుకొన్న అర్థమేమిటంటే మన శరీరములో నాభి కి జానెడు పైన ఎడమవైపు తలక్రిందులుగా వున్నా తామరమొగ్గ రూపములో హృదయముంటే దానికి దగ్గరగాఒక వడ్లగింజకు (నీవార ధాన్యమును నేను చూడలేదు అందువల్ల వడ్లగింజ అన్నాను.) పైనగాలముల్లు ప్రమాణములొ వెలుగు నీలపు జ్యోతి శిఖలో పరమాత్ముడున్నాడు. ఆశిఖను ఆంగ్లములో Sinus Node అని అంటారని విన్నాను. పై విషయమునకిది అప్రస్తుతమైనా ఎందుకు చెప్పినానంటే ఇంతటి గోప్పవిషయములు కూడా కోతలు పెట్టకుండానే మన పూర్వీకులు చెప్పినారు అనునది ఒకటైతే, ఆ జగన్నాయకుడు మనలోనే ఉన్నాడని మన ద్రష్టలు చెప్పినారు అన్నది రెండవ విషయము. ఈ విషయము తరువాత మనకు ఉపయోగ పడుతుంది.

సంపాదకు సంస్కృతికి సంబంధమున్నా సంపాదన వల్ల సంస్కృతి రాదు. సంస్కృతి వుంటే సంపాదించుకోవచ్చు. ఇక అభివృద్ది చెందిన దేశాలు చెందుచున్న దేశాలు అన్న మీమాంస లో పస తక్కువ. అనంతమైన కాలములో ఎవరక్కడ మునుగుతారో ఎవరెక్కడ తెలుతారో చెప్పేది కష్టము.ఎడారి తప్ప ఏమీ లేని ప్రాంతములో ఒక దుబాయిని ఊహించుకో గలిగినామా. వారు అమెరికాను ఆశ్రయించినప్పటికీ వారి మత పరమైన షరియా వదలలేదు.మత ఛాందసము కల్గిన సౌదీ అరేబియా దేశాలు కూడా ప్రగతిలోతక్కువగాలేవు.వారికిచమురునిక్షేపాలుఅయాచితంగాదొరికినాయనుకొందాము. అవి దొరకక మునుపు కూడా మంచో చెడ్డో వారి సంస్కృతి వారికుంది. దొరికిన తరువాతకూడా దానినే శ్రద్ధగా పాటించి తమదైన ప్రత్యెక ప్రతిపత్తి నిలుపుకొన్నారు

కానీ వారికి చమురు నిక్షేపాలు వెలికి తీయుటకు సాయపడిన కిరస్తానీయుల సంస్కృతి పాలు పడలేదు. అటువంటి బలహీనతలు మనకే చెల్లు. ఒకానొక కాలములో అత్యంత భాగ్యవంత దేశమై విలసిల్లిన ఈ భారతదెశము పై దండయాత్ర చేసిన ఘజినీలు, ఘోరీలు, తదుపరి భారత దేశాన్ని కనిపెట్టినాడని చెప్పుకొంటున్న సముద్రపు

దొంగలైన వాస్కోడ గామా బుడతకీచు ఈ దెస సంపద కొల్లగొట్టుటకే వచ్చిరికానీ అన్యథా కాదు. ప్రపంచములోనే ఒక కాలములో మన సూరత్ పట్టణము అత్యంత ధనిక పట్టణముగా పేరెన్నిక గన్నది. ఉన్న మాట చెప్పవలెనంటే 'ఒకటి కొంటె ఒకటి ఫ్రీ' అన్నట్లు సంపద ఓడలపాలు సంస్కృతి నీళ్ళ పాలు చేసినాము. మన బలహీనతలు, ప్రాంతీయ రాజుల మధ్యన అంతః కలహాలు గమనించిన విదేశీయులు మన ధనమునే కాక బలవంతముగా మానముల కూడా కొల్లగొట్టి తమ మతధ్వజమును లోతైన పునాదులు త్రవ్వి నిలబెట్టినారు. పలు విధాలుగా వారిచే చెరుపబడిన వారే ఈ రోజు ఈ దేశాన్ని చెరుస్తూవున్నారు. నేటికి కూడా మనము విదేశీయుల చేతనే పరిపాలింప

బడుతూ వుండుటయేకాక మన మహానాయకులు వారి అడుగులకు మడుగులొత్తుతూ వారి తొత్తులై చిత్తుగా పదవి మత్తులో తూగుచున్నారు.స్వాతంత్ర్య సంగ్రామములో మనఃపూర్వకముగా పాల్గొని అసువులు బాసిన,అధిక ప్రచారమునకు నోచుకోని, నిస్వార్థ నాయకులు కొందరు తప్పించితే మనము నాయకులని పూజించే వారలెందరో తమ తమ బలహీనతల విదాయకులే. ప్రపంచములో దాదాపు 200 ల దేశాలలో 14,15 దేశాలు మాత్రమే ఇంగ్లీషు మీద ఆధారపడినవి అని విన్నాను. అదినిజమైతే మన దేశము వానిలో ఒకటి, పైగా ప్రపంచములోనే అత్యధికులు మాట్లాడే దేశమౌతుంది. మరి ఇంగ్లీషు రాని ఫ్రాన్సు,జర్మనీ , స్పెయిను ,జపాను,చైనా,కొరియా మొదలగు దేశాలు వాళ్ళ మాతృ భాషల నమ్ముకొని, సంస్కృతిని కాపాడుకొంటూ అభివృధ్ధి చెందిన

దేశాలుగా ఎట్లు తయారు కాగాలిగినాయి. మన దేశానికి సంబంధించినంతవరకు మన భాషా సంస్కృతులను ఆకళింపు చెసుకొన్నవాళ్ళు, నాయకత్వము చేపట్టలేదు, నాయకత్వము చేపట్టినవాళ్లు ఆకళింపు చేసుకోలేదు.

కావున ముందు తగిన నాయకుడు మనకు కావలెను. మరి మనలోనే జగన్నాయకుడు వుంటే (పైన తెలిపినాను)ఆయనను మనపైకి ఆహ్వానిచుకొంటే మనమే నాయకులమౌతాముకదా. అంటే చిత్తశుధ్ధి వుంటే మనకు మనమే నాయకులము ,మన మన ఇండ్లకు మనమేరాజులము. ఇల్లాలు రాణి పిల్లలే పౌరులు. మనయిల్లు మనము చక్కబెట్టుకొంటే ప్రక్కవానికి ఆదర్శముకామా. సంఘము మంచివైపు మారుటకు దోహద పడమా. హోమము లోని సమిధలను ఒక కర్పూరపుబిళ్ళతొనే వెలిగిస్తారు.

తెలుసుకోవాలన్న తపన జిజ్ఞాస మనకుండాలి. మరి దీనికి మొదట నమ్మకము తోడుగా పట్టుదల కావలసి వస్తుంది. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్న వేమన వాక్కు మనకు తెలిసినదేకదా.

ఇక్కడ నేను ఒక విషయము నా గురించి చెప్పవలసి వస్తుంది. 4 రకాల A B C D లు 6వ తరగతి లో మాకు మొదలు పెట్టినారు. మరి మేము ఆంగ్లములో ఎప్పుడూ వెనకబడి యుండలేదు. నేను S.S.L.C (11 వ తరగతి) వరకు తెలుగు లోనే చదివినాను. అప్పటికి నా వయసు 13 సంవత్సరాలే. S.V.University లో చదువుటకు వయసు చాలదని Board Of Secondary Education వాళ్ళు నా register మీద stamp కూడా వేసినారు. Andhra University లో చదివి

యుండవచ్చును గానీ మా తండ్రి గారివద్ద కడప నుండి ఏ గుంటూరుకో, విజయవాడకో పంపే డబ్బులేక ఇంట్లోనే ఉండవలసి వచ్చింది. కాలేజీ చేరిన వెంటనే ఇంగ్లీషు

మీడియము.కడప లో ఉర్దూ మీడియము స్కూలు వుంది. పేరుకే ఉర్దూ మీడియము కానీ language తప్ప బోధన అంతా ఇంగ్లీషులోనే. వాళ్ళు కాలేజీలో చేరితే మా పరిస్తితి అర్థము చేసుకోగలరు. అయినా మేము కృషిచేసి వారికన్నా చదువులో ముందుండడమేకాక ఆంగ్లములో కూడా అగ్రగాములుగానే వుండినాము. ఇది కృషివల్ల కాదా. శర్మ గారు కూడా నాలాగానే చదివియుంటారని నాయూహ.

ఇప్పుడు అలసత్వము పెరిగిపోవుట చేత ఊహలెక్కువ ఆలోచన తక్కువ అయిపోయింది. మన సంస్కృతిని,మన, నాటి పాలకులు పథకము ప్రకారమే మట్టుబెట్టినారు.ఒక్క సారి వియత్నాం విషయము ఆలోచిస్తే ఫ్రాన్సు ఎన్నికుతిల ప్రయత్నాలు చేసిందో,ఆ దేశాన్ని కబళించడానికి,మనకు అర్థమౌతుంది. దాదాపు 17 వ శతాబ్దము నుండి 1954 లో ఇండోచైనా యుద్ధములో వోడిపోయేవరకు ఆ దేశాన్ని క్రిస్టియన్ దేశంగా మార్చాలని విశ్వ ప్రయత్నం చెసింది. ఎట్టకేలకు వియత్నామీయులు తమ ఉనికిని కాపాడుకోగలిగినారు. కావున పట్టుదల పనికి మూలము.

Pre KG,L KG, U KG లకు బదులు ఇంట్లోనే తెలుగు సంస్కృతము అందునా ముఖ్యంగా అమరము నేర్పించితే ఆ తరువాత ఆంగ్లమైనా నల్లేరు పై నడకే.మా కాలములో అమరము చదవని వానికి నేనమరను అని సరస్వతీ దేవి చెప్పిందని చెప్పి పెద్దలు నేర్పించేవారు. అంత ఓర్పు నేటి తలిదండ్రులకున్నదా !అసలు పెద్ద చదువులలో కూడా Scientific Terms ఆంగ్లము నుండి యధాతథముగా తీసుకొని

తెలుగులో Science, maths నేర్చుకోకూడదా! 'కృషితో నాస్తి దుర్భిక్షం జపతోనాస్తి పాతకం మౌనేన కలహం నాస్తి నాస్తి జాగరతో భయం' అన్నది నీతి శాస్త్రము. ఇక విజ్ఞానమన్నది ప్రవాహము.పొలానికి వాడుకొంటే ఫలితం ఎక్కువగా వుంటుంది. ఉన్నదే సర్వస్వమనుకొంటే అది అట్లే ఉండిపోతుంది. ఒక చిన్న చాటుపద్యాన్ని ఇక్కడ ఉటంకించుతాను :

ఏనాటి అగ్రహారమొ

మానాటికి మాన్యమాయె మా పని దీరన్

మీనాటి కండ్రిగాయెను

నానాటికి తీసికట్టు నాగంభొట్టూ

ఇది నేటి మన పరిస్థితి. యువత ఒక సముద్రము. అందు లేనిదుండదు. ఆలస్యమంతా వెలికి తీయడములోనే !

నా అభిప్రాయము తెలుపుటలో నేనేదైనా పొరబాటు చేసియుంటే మీ సంస్కారము తప్పుగా భావింప జేయనీయదని తలుస్తాను.