కేశవ నామాలు
ఆచమనం (ఆచమనీయం)- పూజాదికాలకు, సంధ్యావందనమునకు ముందు, దినములో ఆయా కార్యములు చేయు సమయములోఅనేక సార్లు శుచికై చేసే ప్రక్రియ. మనము సామాన్యముగా మూడు మార్లు ప్రణవ సహితముగా కేశవాయ స్వాహ, నారాయణ స్వాహా, మాధవాయస్వాహ తో ప్రారంభించి శ్రీకృష్ణాయనమః వరకుగల 24 నామాలతో చేసేది పురాణ ఆచమనీయము. గాయత్రీ మంత్రముతో చేసేది శ్రుత్యాచమనము. అచ్యుత, అనంత, గోవింద నామాలతో చేసే మరియొక ఆచమన పద్ధతి ఉంది. ఆచమనీయ పద్ధతులను అటుంచి ఈ 24 కేశవా నామములను గూర్చి తెలుసుకొందాము.
ఈ 24 నామాల ప్రత్యేకత ఏమిటి, ఆ వరుసకు ఏమైనా అర్థంఉందా? పూర్తి ప్రమాణాలు నాకు తెలియవుగాని విన్న, చదివిన విషయాలు చెప్పుకోవచ్చు కదా. కేశవ నామం నుండి కృష్ణ నామము వరకు ఉన్న నామాలను విష్ణుపదానికి సోపాన పంక్తిగా చెప్పుకోవచ్చు. విష్ణు సహస్రములోని వృషపర్వ అనే నామము (259), ఈ సోపాన పంక్తిని సూచిస్తుంది. పర్వము అంటే భారతములో కణుపు అనిచెప్పుకుంటాము. దీనికి మెట్టు అని కూడా అర్థం ఉన్నది. వృష అంటే ధర్మము. వృషపర్వ అంటే ధర్మ మార్గము. అంచెలంచలుగా విష్ణుపదానికి చేర్చే మార్గము. మార్గము గమ్యము కూడా ఆయనయే.
కేశవ నామము పరమపదమైతే శ్రీకృష్ణ నామము భూమిపై మనకు సమీపవర్తిగా మసలినది. మనకు కాల చక్రములో బుద్ధునిగా, వాసుదేవకృష్ణుని గా ఆయన అత్యంత సన్నిహితుడు. జైన తీర్థంకరుడు అరిష్టనేమి ఆయన పెదతండ్రి కుమారుడు. భాగవతము ప్రకారము విష్ణుని అవతారమైన బుద్ధుడు మనకు బాగా తెలిసిన గౌతమ బుద్ధుడు కాడు. గౌతమ బుద్ధునికి తండ్రి పెట్టిన పేరు సిద్ధార్థుడు. విష్ణుసహస్రము ప్రకారము సిద్ధార్థ కూడా విష్ణునామమే (నామం 252). సిద్ధించిన అర్థము కలవాడు. ప్రవృత్తి మార్గములో ఉండకుండా నివృత్తి మార్గములో ఉంటాడు. కోరిక తీరిన తరువాత అశాంతి అతనికి ఉండదు.అంటే ఏ కామన లేనివాడని అర్థము. రాముడు, కృష్ణుడు, గౌతమ బుద్ధుడు, మహావీరుడు, మహావీరుడు, అరిష్టనేమి అందరూ క్షత్రియులే. కృష్ణుడు గీతాచార్యుడుగా మనకు జగద్గురు స్థానములో ఉన్నాడు. యోగీశ్వరునిగా యోగి హృదయాకాశంలో కనుగొనగల పరమాత్మ. మన యోగక్షేమం వహిస్తానని చెప్పినవాడు. ఆయన నిర్వాణముతోనే కలియుగారంభము. మిగతా అవతారాలు కాలములో మనకు చాలా దూరం. మహాభారత పాత్రధారిగా ఈ భూమిపై నడయాడిన చారిత్రక వ్యక్తి. భూదేవికి పతి.
ఈ శ్రీదేవి భూదేవులకు పతి అనుట ఒక సాంకేతికము. విష్ణువు అంటే సర్వే సర్వత్ర ప్రకటితమై ఉండువాడు. పతి అంటే భర్త. భర్త అంటే భరించేవాడు. ఆయన భూమిని భరించి ధరించేవాడు. అట్లే లక్ష్మి దేవి భర్త అంటే, 8 విధములగు సంపదలకు అధికారిణియగు లక్ష్మిని భరించేవాడు. అందుకే ఆమెకు ఆయన హృదయములో స్థానము. ఆయనను హృదయ పూర్వకముగా భజించితే ఆయన హృదయము మన హృదయములో ఉండిపోతుంది. అది విష్ణు పూజా రహస్యము. శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తూ వాసుదేవా అన్నా, నారాయణా అన్నా, గోవిందా అన్నా మంచిదే. మనం రోజూ చదివే 24 నామాలు అన్నీ ఒకే మహావిష్ణువు యొక్క వివిధరూపాల పేర్లు. ఒకొక నామానికి ఒక విశిష్టత ఉంది. మనం స్మరించినప్పుడు వివిధ లక్షణములు కలిగిన ఆయా రూపములు ఆయా కార్యములయందు వినియోగించితే అత్యధిక ప్రయోజనం ఉంటుంది.
ఈ కేశవ నామములు 24 మాత్రమే ఎందుకు అన్నది మొదట గణిత పరముగా విశ్లేషించుకొందాము.
మాకాలములో Permutations and Combinations ను పౌనఃపున్యములు అనేవారు. చక్రీయముగా జరిగే ప్రక్రియలలో (పునరావృతం అయ్యే) అనగా భ్రమణ, డోలనాలను బట్టి వద్దనున్న వస్తు సమముదాయమును మార్చి పెర్చుటను పౌనఃపున్యములు అంటారు. ఈ పౌనఃపున్యములను తెలుగులో నేడు ప్రస్తార సంయోగములుగా పిలుస్తున్నారు. మనకు ఇక్కడ ప్రస్తారములు మాత్రమే కావలెను. అందుచే వానిని గూర్చియే మాట్లాడుకొందాము.
1,2,3,4 అన్న నలుగురు భోజనమునకు ఒక హోటలుకు వెళితే నాలుగు అరటియాకులు వేస్తాడు ఆ వడ్డించే వ్యక్తి. ఆ నాలుగు ఆకుల వద్ద, ఏఆకు వద్ద ఎవరు కూర్చోవలెనన్నదే ప్రస్తారము.
ఈశ్వరుడు 10 విధములగు ఆయుధములను ధరిస్తాడు. ఆయనకు 5 తలలు 10 చేతులు ఉన్నవి అని వేదము తెలుపుతుంది. ఆ 10 చేతులలో పది ఆయుధములు ఉంటాయి. అవి ఏవి అని ఒకపరి చూద్దాము.
అవి, పాశము. అంకుశము, సర్పము, డమరుకము, కపాలము, శూలము, ఖట్వాంగము(మంచపు కోడు కావచ్చు, గుదియ), శక్తి (Missile), బాణము, విల్లు, ఈ పది ఆయుధములు ఆయన చేతులలో పరిపరి విధములుగా అమర్చి దలచితే అవి 36,28, 800 అవుతుంది. అన్ని మూర్తులను గుర్తుంచుట మానవమేధకు దుర్లబమైన విషయమే! అందువల్ల ఆయనది ఒకటేరూపము. అది లింగరూపము.
అదేవిధముగా విష్ణువు చతుర్భుజుడు. శిరస్సు ఒకటే. ఆయన ధరించునవి నాలుగు ఆయుధాలు. అవి ఏవంటే, శంఖ చక్ర గదా పద్మములు. ఆయన అవతారమూర్తి. ఈ నాలుగు ఆయుధములను ఆయన చేతులలో 24 విధములుగా అమరించవచ్చు.
మరి ఈ 36,28, 800 మరియు 24 ఏవిధముగా వస్తుంది అంటే 10x9x8x7x6x5x4x3x2x1= L10=10!= Ten factorial అంటారు.
అదేవిధముగా 4x3x2x1=24=L4=4!= Four Factorial అంటారు. Factorial అన్న పదమును వాడినాను కాబట్టి ఇది ఏ పాశ్చాత్యులో కనిపెట్టినారనుకోవద్దు. ఇది మన భాస్కరాచార్యుడు- 2 సవిస్తారముగా 600 సంవత్సరముల క్రితమే, తన ‘లీలావతి’ గణితములో తెలిపినాడు. మనము మెకాలే మత్తులో మునగనంత వరకు ‘లీలావతి’నే అనుసరించేవారము.
ఇపుడు తిరిగీ విష్ణువు ఆయన యొక్క ఆయుధములను గురించి మాట్లాడుకొంటే ఆయన నాలుగు చేతులలో 24 విధములుగా(క్రమ గతులు=Patterns ) ఆ ఆయుధములను ధరించవచ్చును. ఒక్కొక్క విధముగా ధరించినపుడు ఒక్కొక్క పేరు విష్ణువునకు ఇవ్వబడినది.
మిగిలినది రేపు.....
చతుర్వింశతి కేశవ నామములు(24 కేశవ నామాలు)-2
1. కేశవ(శంఖం చక్రంగద_పద్మం)
2. నారాయణ (పద్మంగదచక్రం_శంఖం)
3. మాధవ(చక్రంశంఖంపద్మం_గద)
4. గోవింద(గదపద్మంశంఖం_చక్రం)
5. విష్ణు(పద్మంశంఖంచక్రం_గద)
6. మధుసూదన(శంఖంపద్మంగద_చక్రం)
7. త్రివిక్రమ (గదచక్రంశంఖం_పద్మం)
8. వామన (చక్రంగదపద్మం_శంఖం)
9. శ్రీధర (చక్రంగదశంఖం_పద్మం)
10. హృషీకేశ (చక్రంపద్మంశంఖం_గద)
11. పద్మనాభ (పద్మంచక్రంగద_శంఖం)
12. దామోదర (శంఖంగదచక్రం_పద్మం)
13. సంకర్షణ (శంఖంపద్మంచక్రం_గద)
14. వాసుదేవ (శంఖంచక్రంపద్మం_గద)
15. ప్రద్యుమ్న(శంఖంగదపద్మం_చక్రం)
16. అనిరుద్ధ(గదశంఖంపద్మం_చక్రం)
17. పురుషోత్తమ (పద్మంశంఖంగద_చక్రం)
18. అధోక్షజ (గదశంఖంచక్రం_పద్మం)
19. నారసింహ (పద్మంగదశంఖం_చక్రం)
20. అచ్యుత (పద్మంచక్రంశంఖం_గద)
21. జనార్థన (చక్రంశంఖంగద_పద్మం)
22. ఉపేంద్ర (గదచక్రంపద్మం_శంఖం)
23. హరి(చక్రంపద్మంగద_శంఖం)
24. శ్రీకృష్ణ నమః (గదపద్మంచక్రం_శంఖం)
ఈ రూపములలో 15 మూర్తులను మనము 15వ శతాబ్దములో, గుజరాత్ లోని పాటన్ లో నిర్మించిన రాణీ కి వావ్ (రాణీ బావి)లో చూడగలము. ఫనస్ వాడి గుర్గాఁవ్ ముంబాయిలో 1927లో కట్టించిన వెంకటేశ్వరాలయములో ఈ చతుర్విమ్శతి కేశవ నామములకు ప్రాతినిధ్యము వహించుచున్న 24శిల్పములనూ చూడవచ్చును.
తిరిగీ కేశవనామల విషయమునకు వద్దాము. ఈ కేశవ నామాల విశేషాలు తెలుసుకోవడానికి ముఖ్య గ్రంథం విష్ణుసహస్రనామ స్తోత్రం. వీనిలోని ఈ నామాలు ఆ స్తోత్రములో వస్తాయి. కాని ఈ వరుసలో ఉండవు. కొన్ని రెండు, మూడు పర్యాయాలు వస్తాయి. మొదటి 12 నామాల వరుసను నేను గమనించినది వరాహమిహిరుని బృహత్సంహితలో. 12 సంఖ్య, మాసములగాను, రాశులుగాను జ్యోతిషములో ప్రాధాన్యము కలది. కాల పురుష, నక్షత్రపురుష వర్ణనలో ఇవి వస్తాయి.
మృగశీర్షాయాః కేశవ నారాయణ మాధవాః సగోవిన్దాః
విష్ణుమధుసూదనాఖ్యౌ త్రివిక్రమో వామనశ్చైవ ||105.14||
శ్రీధరనామా తస్మాత్ హృషీకేశశ్చ పద్మనాభశ్చl
దామోదర ఇత్యేతే మాసౌ ప్రోక్తా యధా సంఖ్యమ్ ||105.15||
శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో "మాసానాం మార్గశీర్షో2హమ్" అన్నాడు. బహుశా ఆకాలంలొ అది సంవత్సరారంభం అయిఉంటుందేమో.
ఈ శ్లోకాలలో "యథా సంఖ్యం" 24 యొక్క వివరణ ఇస్తుంది. ఇది సాంఖ్య దర్శనానికిసంకేతం. ఆ దర్శనం ప్రకారం సృష్టికి ఆధారం చతుర్వింశతి (24) తత్త్వాలు. కేశవ నామము అవ్యక్తమును, నారాయణ నామము మహత్ (బుద్ధి) తత్త్వమును, మాధవనామము అహంకారమును, గోవింద నామము మనస్సును తరువాత 20 నామములు పంచ తన్మాత్రలను, పంచ భూతములను, పంచ జ్ఞానేంద్రియములను, పంచ ప్రాణములను సూచించును. సాంఖ్యమును విష్ణువు అవతారములలోని కపిలునిచేత దర్శించబడినదిగా చెబుతారు.
ఈ 24 తత్వముల వివరములను ఈ దిగువన పొండుపరచినాను.
చతుర్వింశతి తత్వములు (24)
పంచభూతములు 5 భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, పంచఙ్ఞానేంద్రియములు 5 శ్రోత్రము(చెవి), త్వక్కు(చర్మము), చక్షుస్సు(కన్ను), జిహ్వ(నాలుక), ఘ్రాణము(ముక్కు), పంచకర్మేంద్రియములు 5 వాక్కు(నోరు), పాణి(చేయి), పాద(కాలు), పాయువు (గుదము), గుహ్యము(రహస్యేంద్రియము)
విషయపంచకము 5 శబ్దము(చప్పుడు), స్పర్శము, రూపము(ఆకృతి), రసము (రుచి), 5గంధము(వాసన)
అహంకార త్రయము : 3 అహంకారము, 2 బుద్ధి, 3 మహత్తు (అవ్యక్తము), మనస్సు: 1,మొత్తము: 24
మనము ఇప్పుడు ఈ నామాల విశిష్టతను పరిశీలించుదాము. (ఆధారము సద్గురు శివానంద మూర్తిగారి "మహా విష్ణు తత్త్వము - భీష్మ బోధ.)
మనము రోజూ చదివే 24 నామాలు అన్నీ ఒకేమహావిష్ణువు యొక్క వివిధరూపాల పేర్లు. ఒకొక నామానికి ఒక విశిష్టత ఉంది. మనము స్మరించినప్పుడు వివిధ లక్షణములు కలిగిన ఆయా రూపములు ఆయా కార్యములయందు వినియోగపడితే అత్యధిక ప్రయోజనం ఉంటుంది. మూల తత్త్వము నుండి జగత్తు వ్యాప్తిచెందినప్పుడు ఆయన వాసుదేవుడు. నిర్గుణమైన బ్రహ్మ వస్తువునుండి సగుణముగా ప్రపంచమంతా వ్యాపించినది వాసుదేవ మూర్తి. జగత్తు అంతటినీ తనలోనికి ఉపసంహారము చేసినప్పుడు ఆయన నారాయణ మూర్తి. జగత్తులో ఉండే మనుష్యులలోని జ్ఞానులు ఆయనను ఉపాసనచేసి ఆయనను పొందే ప్రయత్నములో, ఆజీవులనే అనుగ్రహించి తనవద్దకు తీసుకొనేవాడు సంకర్షణ మూర్తి. జగత్తులో ఉండే సుఖభోగములను, ఇంద్రాది పదవులను ధర్మబద్ధంగా ఆయన అనుగ్రహముచేత పొందు లక్షణములున్నప్పుడు ఆయన గోవిందుడు.
ఈ 24 విష్ణురూపములలో ఆయన ధరించే శంఖము, చక్రము, గద, శార్ఙ్గము (శార్ఙము, విష్ణువు విల్లు) వేర్వేరు స్థానములలో ఉంటాయి. (4! = 4x3x2x1, factorial 4)
1. కేశవ - (23, 648 నామములు) - త్రిమూర్త్యాత్మకుడని మనము నిత్యమూ స్మరించు 24 నామములలో మొదటినామము. సంపూర్ణత్వానికి సంకేతం. 'సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్ఛతి' - అనే సూక్తికూడా ఇదే సూచిస్తున్నది. ఇక్కడ కేశ శబ్దము ఉంది. కాంతి కిరణములే ఆయన కేశములు. సూర్యచంద్రులకు కిరణములు ప్రసాదించువాడు. కిరణములద్వారానే సమస్త విశ్వమున వ్యాపించి ఉన్నవాడు. "అంశవో యే ప్రకాశంతే తే కేశ సంజ్ఞితా" అనే శ్లోకం ఉంది. బ్రహ్మ,విష్ణు, శివ, శక్తులను కేశవ నామం సూచిస్తుంది.
को ब्रह्मा ईशः रुद्रः तौ आत्मनि स्वरूपे वयति प्रलये उपाधिरूपमूर्त्तित्रयं मुक्त्वा एकमात्र-परमात्मस्वरूपेणावतिष्ठते इति ।
ఎవరైతే బ్రహ్మ, ఈశ, రుద్ర తత్త్వములను ఆత్మలో ధరించి, ప్రళయ కాలమున త్రిమూర్తుల రూపములను ఉపసంహరించి ఒకే పరమాత్మగా వెలుగునో ఆయనయే కేశవ విష్ణువు. ఈయన తత్త్వం ఇంద్రాదులకు కూడా దుర్లభం.
మిగిలినది మళ్ళీ ......
చతుర్వింశతి కేశవ నామములు(24 కేశవ నామాలు)-3
2. నారాయణ (245 నామము) – ‘నారం అయనం యస్యసః నారాయణం’
నారం అంటే బ్రహ్మజ్ఞానము. ఆయనం అంటే స్థానముగా కలిగిన వాడు నారాయణుడు.
మరొక విధముగా నారము అంటే నీరు అని అర్థము. “आपो नारा इति प्रोक्ता आपो वै नरसूनवः” मनुः జహ్ను నారాయణో నరః అంటుంది సహస్రనామం. సంసారమనే జలరాశినుండి మానవుల తరింపచేసి పరమపదానికి చేర్చువాడు జహ్నువు.
మరోవిధముగా నార శబ్దము జీవులను సూచిస్తుంది. నారములు అంటే జీవులే. ఆయనము అంటే ప్రయాణము. జగత్తులోని జీవుల గతిని నిర్దేశించువాడు అని చెప్పుకోవచ్చు. ఈ ప్రయాణములో ఆయన జీవులందరికీ గమ్యస్థానము. “यच्च किञ्चिज्जगत् सर्वं दृश्यते श्रूयतेऽपि वा । अन्तर्वहिश्च तत्सर्वं व्याप्य नारायणः स्थितः” అని మంత్రపుష్పం లో చెప్పుకుంటాం. శ్రావ్యము దృగ్గోచరము అగు ఈ సృష్టికి మూలాధారము ఆయనే! లోపల బయట అంతా ఆయనే! ఆయన సర్వవ్యాపి. ఆయనే నారాయణుడు.
‘నారాయణాత్ ప్రాణోజాయతే’ అంటుంది వేదము. అట్లే ‘మనస్సర్వేంద్రియాణిచ’ అంటుంది. ‘మనయేవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః’, ‘నారాయణదేవతా ముతద్యన్తే నారాయణే ప్రవర్తన్తే నారాయణే ప్రళీయంతే’. అంటే సృష్టి స్థితి లయములకు కారకుడు ఆయనే. ఇదే పరమేశ్వర తత్వము.
3. మాధవ (72,167 నామములు) - మహాలక్ష్మి భర్త. ఈ ప్రకృతి అంతా లక్ష్మీ స్వరూపము. దానిని భరించువాడు ఆయన. మా అంటే లక్ష్మి అనియే కాకుండా, విద్య అన్న అర్థము కూడా ఉన్నది. మాధవ అంటే విద్యలకు అధిపతి. రమాధవః అని అర్థం ముందే చూసినాము కదా! ఆత్మకు ఆత్మ జ్ఞానము కొరకు అవసరమైన విద్యలు అనంతముగా ఉన్నాయి. యోగ మార్గము, భక్తి మార్గము, పశుపతి మార్గము - ఇలా ఎన్నో మార్గములుగా ఉన్న ఆధ్యాత్మిక విద్యలన్నిటికీ ఆయనే అధిపతి అనే విషయం మాధవనామం సూచిస్తుంది. విష్ణువు లో రుద్రాంశ వున్నది. ఈశ్వరునిలో విష్ణ్వంశ వున్నది. అందుకే కదా శివాయ విష్ణురూపాయ అన్నది.
4. గోవింద (187, 539, 825 నామాలు) - (गां पृथ्वीं धेनुं वा विन्दतीति) గో శబ్దము పృథ్విని, గోవులను,కిరణములను, వేదములను కూడా సూచిస్తుంది. శ్రీ మహావిష్ణువు అనంతము, పాపరహితము ఐన ధరణిని పొందినవాడు. దేవతలకు, గోవులకు ఇంద్రుడు, అందుకు ఆయనను గోవిందుడని కీర్తిస్తారు. గోవు శబ్దమునకు వాక్కు కూడా (गोभिर्वाणीभिर्वेदान्तवाक्यैर्विद्यते) అర్ధముగా చెప్పబడినది. వాణి అన్న శబ్దమునకు వేదము అన్న అన్వయము వున్నది. ఆవాక్కును ప్రాప్తింపచేసేవాడు కాబట్టి గోవిందుడు. ఈ విశ్వములో గోవులుగా(ధేనువులు), చెప్ప బడేవన్నీ జీవాత్మలు. జీవులు పొందే శాశ్వతమైన ఆనందము ఇచ్చేవాడు కావున గోవిందుడు. వాక్కులను వేదవాక్కులుగా పరిగణిస్తే వేదముల వలన లభించువాడు గోవిందుడని చెప్పుకోవచ్చును.
5. విష్ణు (2,257,258, 657 నామములు) - వ్యాప్నోతి ఇతి విష్ణుః, అంతటావ్యాపించి ఉన్న వాడు. (all-pervading) సూర్యమండలములోను,
సూర్యమండలము వెలుపలా ఉన్నాడు. ద్వాదశ ఆదిత్యులలో ఒకరు విష్ణువే. కాని ఆ పరమాత్మ ఆ 12 మంది లోనూ ఉన్నాడు. (ద్వాదశ ఆదిత్యులు - ధాత, మిత్ర, అర్యమ, రుద్ర, వరుణ, సూర్య, భగ, వివస్వన్, పూషా, సవితా, త్వష్ట, విష్ణు). అందుకే ఆయన సూర్య నారాయణుడు. మనం భూగోళం మీద ఉంటాము. మన పితరులు పితృలోకములోను, దేవతలు స్వర్గంలోనూ ఉంటారు. విష్ణువు లోకములన్నిటిలోనూ, అందరిలోనూ, లోకముల మధ్య ఆకాశము లోనూ కూడా వ్యాపించి ఉంటాడు. విష్ణుపదమంటే ఆకాశం. అందుకే ఆకాశగంగ విష్ణుపాదోద్భవి అయింది. ఆయన బ్రహ్మాండమంతటిలోను, బ్రహ్మాండము అవతలా, సకల బ్రహ్మాండములలోను ఉంటాడు. సకలభూతములలో సర్వాంతర్యామిగా కూడా ఉన్నాడు. అందుకే సహస్రనామాలలో విశ్వమనే పేరు మొదట చెప్పి, విష్ణువు రెండవ నామముగా చెప్పబడినది. ఇదే పద్ధతిలో 256వ నామం వృషాహీః అని 257వ నామం వృషభః అని, 258వ నామం విష్ణుః అని చెప్పబడినవి. వృష అంటే ధర్మము. భ అంటే కాంతి అని కాకుండా అభివృద్ధి అన్న అర్థమును ఒక మహావేద పండితుని ద్వారా బాల్యములో విన్నాను. వృషాహీ, వృషభ నామాలు రెండు ఆయన ధర్మ స్వరూపుడని తెలుపుతాయి. ధర్మ పాలకుడు విష్ణువే. ధర్మగ్లాని కలిగినప్పుడు అవతరించేవాడు ఆయనే.
ధర్మ సంస్థాపన ఆయన కార్యం. దీనికొరకే ఆయన సర్వవ్యాపియైన విష్ణువు. ఉదాహరణకు భోజనముచేసిన తరువాత నీళ్ళు వదలి "అమృతాపిధానమసి రౌరవే అపుణ్యనిలయే పద్మార్బుద నివాసినాం అర్థినా ముదకందత్తం అక్షయముపతిష్ఠతు" అని మంత్రమును బ్రాహ్మలు భోజనము ముగుస్తూనే చదువుతారు. దాని అర్థము ఏమిటంటే, ఇప్పుడు నేను భుజించి అనుభవించిన నా సంతృప్తి కోటానుకోట్ల అపుణ్యనిలయములైన రౌరవాది నరకములలోని జీవులకు కూడా కలగాలి. ఈ విధముగా అనుష్ఠించిన ధర్మము వలన విష్ణువు సర్వ వ్యాపకత్వము వలన ఆ కోరిక నెరవేరుతుంది.
6. మధుసూదన (73వ నామం) - మధు అనే రాక్షసుని చంపినవాడు. मधुं तन्नामानं असुरं सूदयति नाशयतीति | ఈ నామ స్మరణ ఫలం శబ్ద రత్నాకరంలో ఈ విధముగా ఇచ్చుట జరిగినది: तस्य स्मरणफलम् । “महाविपत्तौ संसारे यः स्मरेन्मधुसूदनम् । विपत्तौ तस्य सम्पत्तिर्भवेदित्याह शङ्करः || మహా విపత్సమయాలలో ఎవరు మధుసూదన నామాన్ని స్మరిస్తారో వారికి ఆవిపత్తులే సంపత్తిగా మారుతాయని శంకర వచనం.
7. త్రివిక్రమః (530వ నామం) త్రీణి పాదాని విచక్రమే - శ్రుతి వాక్యం. వామనుడు మూడు పదములతో త్రిలోకములందు వ్యాపించి త్రివిక్రముడైనాడు. అందుకే వామనునినుండి త్రివిక్రమునికి అధిరోహణము. మూడులోకములను క్రమములో ఆక్రమించుట వలన త్రివిక్రముడు (वि + क्रमं).
మిగిలినది తరువాత.....
చతుర్వింశతి కేశవ నామములు(24 కేశవ నామాలు)-4
8. వామనః (152,351 నామములు) - వామన అనే పదానికి హ్రస్వ, సూక్ష్మ అని అర్థములు ఉన్నాయి. జీవులయందు సూక్ష్మరూపుడై ఉండు పరమాత్మ అని వామన పదానికి అర్థం చెప్పవచ్చును. వామనావతార గాధ తెలిసినదే. దేవతలను స్థానభ్రంశముచేసి త్రిలోకాధిపత్యము వహించిన బలిచక్రవర్తిని వంచించుటకై అదితి ప్రార్థనకు ఫలముగా ఉపేంద్రునిగా ఆవిర్భవించిన హరి అవతారము వామనుడు.
9. శ్రీధరః (610 నామం) - ఈ నామము శ్రీతో ఆరంభమయే అనేక నామాలలో ఒకటి. శ్రీ ధర - సిరులు ధరించిన వాడు, శ్రీ వాస - శ్రీకి నివాస స్థానము, శ్రీపతి - సముద్రమంథన సమయమున ప్రభవించిన శ్రీదేవికి పతి అయినవాడు,
శ్రీమతాంవర - శ్రీమంతులలో వరిష్ఠుడు అనగాశ్రేష్టుడు లేక గొప్పవాడు. శ్రీద - సిరులు ఇచ్చువాడు, శ్రీశ - లక్ష్మీదేవికి ఈశ్వరుడు, శ్రీనివాస - లక్ష్మీదేవికి నివాస స్థానమైన వాడు. శ్రీనిధి - సకల ఐశ్వర్యములకు నిధి, శ్రీకర – సంపదల నిచ్చువాడు. శ్రీమాన్ - లక్ష్మిని కలిగియున్నవాడు. మిగిలినవారందరు లక్ష్మిని సంపాదించేవారే. సిరులను ధరించి భక్తులకిచ్చువాడు శ్రీధరుడు.
10. హృషీకేశ (47 నామము) - హృషీక అంటే ఇంద్రియములు, వానికి అధిపతి అని సామాన్యార్థము. "హృష్యంతి అనేన ఇతి హృషీక" - హృషీకములు ఆనందస్థానములు. జీవుడు నిత్యము ఇంద్రియ సుఖములకు పరితపించి సుఖదుఃఖములను పొందినప్పుడు అవిద్యారూపునిగను, అంతర్యామిగా శుద్ధ ఆత్మవిద్యారూపుడై ఆనంద స్వరూపునిగను, ఉండువాడు హృషీకేశుడు.
11. పద్మనాభః (48, 196, 346 నామాలు) - తన నాభియందు ఉద్భవించిన పద్మమును బ్రహ్మలోకముగా చేసిన వాడు. సృష్టి కారణమును తన దేహ మధ్యమున ధరించిన వాడు. నాభియందే కాక హృదయ పద్మమందు భాసిల్లువాడు అనుకూడా చెప్పుకోవచ్చు. అందుకని ధ్యానం చేసేటప్పుడు శ్రీమన్నారాయణుని హృదయమందు నిలుపుకోవాలి. पद्मस्य नाभौ स्थिता
అనికూడా అర్థంచెప్పుకోవచ్చు. అంటే హృదయకమలంయొక్క నాభియందుండే కర్ణికయందుండువాడు. "స బ్రహ్మ సశివ స్సహరి స్సేంద్ర స్సోక్షర పరమ స్వరాట్" ఆయనయే బ్రహ్మ,శివుడు, హరి, ఇంద్రుడు, అక్షరుడు.
12. దామోదరః (367 నామం) - दमादिसाधनेनोदारा उत्कृष्टा मतिर्या तया गम्यते इति दामोदरः దమాది సాధనేనోదారా ఉత్కృష్టా మతిర్యా తయా గమ్యతే - ఇతి దామోదరః. యోగికి శమదమాది లక్షణములు విధిగా ఉండాలి. శమము అంటే శాంతి, దమము అంటే ఇంద్రియనిగ్రహము. దమాది సాధనములచేత కలిగే ఉదారబుద్ధికి గమ్యమైన వాడు దామోదరుడు. దమ అంటే పద్మము. పద్మమును ఉదరమందు కలవాడు. అంతర్ముఖుడైన యోగి అక్కడనుండే ఊర్ధ్వలోకములను దర్శించే అవకాశము వస్తుంది. జీవాత్మ ఒక్కొక్క లోకాన్ని దర్శిస్తూ ఒక్కొక్క విభూతిని పొందుతూ ఆనందంతో ఊర్ధ్వగతిలో వెడుతుంది. ఈ శక్తినే స్త్రీ రూపంలో హేమమాలిని అని, పద్మమాలిని అని పురుషరూపంలో దామోదరుడని చెబుతాం. ఈ షట్చక్రముల సమూహమునే లలితా సహస్రంలో కులమని చెబుతారు. కులాంగన, కుల సంకేత పాలిని, కులయోగిని అని అమ్మవారిని వర్ణిస్తారు. దామోదరుడు = కృష్ణుఁడు. యశోద బాల్యమునందు ఇతని నడుమున త్రాడువేసి రోటితో కట్టెను కనుక ఇతనికి ఈనామము కలిగెను అని కూడా అన్వయము.
13. సంకర్షణః (552 నామము) – సంకర్షణ మూర్తి స్వరూపయో అసావాదిత్యయో పరమపురుషో స ఏవ రుద్రోదేవతాః అంటే అర్థంఏమిటి? సంకర్షణ మూర్తి ఉపాసకుణ్ణి తన దగ్గర చేర్చుకొని ఆమోక్షార్థిని ఉద్ధరించి తనలో శాశ్వతంగా చేర్చుకుంటాడు. ఇది రుద్రతత్త్వంతో సమన్వయమౌతుంది. రుద్రుడుకూడా ఉపసంహారకర్తయేకదా! విష్ణువుకు రుద్రునికి కూడా సంకర్షణమూర్తి అనే పేరున్నది. ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి - అని రుద్రమంత్రము.
మిగిలినది మరొకసారి……….
చతుర్వింశతి కేశవ నామములు(24 కేశవ నామాలు)-5 (చివరి భాగము)
14. వాసుదేవ (332, 695, 709 నామాలు) - వసుదేవుని కుమారుడు కాబట్టి వాసుదేవుడని కృష్ణుని వ్యవహరిస్తాము. విష్ణువు అర్థంలో సర్వత్రా వసించేవాడు వాసుదేవుడు. ఇదే భారతంలో "వాసవః సర్వ భూతానాం" అని చెప్పబడినది. సమస్త భూతజాలమునకు, జగత్తుకు నివాసమైన వాడు వాసుదేవుడు. దేవ శబ్దమునకు ఆరులక్షణాలు ఉంటాయి - విజిగీష (జయేచ్ఛ) వ్యవహార (వివాదం) ద్యుతి (తేజస్సు) స్థితి, గతి, చ్యుతి. ద్వాదశాక్షర మంత్రం - ఓం నమో భగవతే వాసుదేవాయ - చేత ప్రతిపాదించబడిన సాక్షాన్నారాయణుడు. సూర్యుని వలె జగత్తును అచ్ఛాదించుటచేత వాసుడు, దేవుడు కూడా.
15. ప్రద్యుమ్న (640 నామము) – प्रद्युम्नः, (प्रकृष्टं द्युम्नं बलं यस्य ।) అపరిమితమైన ధనము, బలము కలిగిన వాడు అని అర్థము. సృష్టి, లక్ష్మీ (శ్రీ) అన్నీ కలిగిన వాడు ఆయనేకదా. రుక్మిణీ కృష్ణుల పుత్రుడు. మన్మధుని అవతారం.
“अनिरुद्धः स्वयं ब्रह्मा प्रद्युम्नः काम एव च ।
वलदेवः स्वयं शेषः कृष्णश्च प्रकृतेः परः ॥”
इति ब्रह्मवैवर्त्ते श्रीकृष्णजन्मखण्डे ११६ अध्यायः ॥బ్రహ్మవైవర్త పురాణము ప్రకారము అనిరుద్ధుడు బ్రహ్మ, ప్రద్యుమ్నుడు మన్మథుడు, బలదేవుడు శేషుడు, కృష్ణుడు పరా, ప్రకృతులే (శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః)
16. అనిరుద్ధ (185, 638 నామాలు) - ఆయన ఎదురులేని వాడు. ఆయనను నిరోధింపగలిగిన వ్యక్తి కాని వస్తువుకాని ఈసృష్టిలో లేదు. ఆయనపై విరోధించిన రాక్షసులు ఆయన చేతిలో హతులైనారు. ఆయనను ఎదుర్కొని ఎవరూ జీవించలేరు. ఆయన తనను ద్వేషించినవారిని కూడా తనలోకి తీసుకుంటాడు. ఆయన అనుగ్రహం కలిగితే సతాంగతి. అంటే ఎవరైతే అలాంటి సాధనయందు సత్పురుషులై ఉన్నారో వాళ్ళ గతిని నిరోధించనివాడు ఆయన. ఆయన వారికి రక్షకుడు. "యోగక్షేమం వహామ్యహాం" అనే గీతావాక్యం అనిరుద్ధమూర్తికి వర్తిస్తుంది.
సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ మూర్తులను పాంచరాత్ర, వైఖానసాది వైష్ణవాగమములలో చతుర్వ్యూహాలుగా చెబుతారు. సహస్రనామాలలో "ఓం చతుర్వ్యూహాయ నమః" 138వ నామము. విష్ణుదేవాలయమును నిర్మాణం చేసినప్పుడు అహిర్బుధ్న్య సంహిత వంటి పాంచరాత్రాగమ గ్రంధాలను ఉపయోగిస్తారు.ఈ నాలుగు మూర్తులతో విష్వక్సేనుడు కూడా ఉంటాడు. ఈ వ్యూహ సిద్ధాంతం శ్రీవైష్ణవ సిద్ధాంతానికి ప్రాతిపదిక. "ఓం చతుర్వ్యూహాయ నమః" 767 వ నామము కూడా.
17. పురుషోత్తమ (పద్మం శంఖం గద చక్రం )
విష్ణు సహస్రనామము మొదలైన 3వ శ్లోకములోనే 24వ ప్నామముగా ఈ పేరు వస్తుంది.
అసలు విష్ణువు శరీరపురుష, ఛందోపురుష, వేదపురుష, మహాపురుష గా చెప్పుకోవచ్చును.
పైగా దేహగత జీవులు క్షరములు. అనగా నశించునవి. స్త్రీ పురష భేదము లేని అవ్యయుని పురుషుడు అంటారు.ఈయన అవ్యయుడు, అనంతుడు మరియు ఆది పురుషుడు. ఆయన శ్రీహరి. లక్ష్మీ దేవిని అక్షర పురుష అంటారు. క్షరము లరనిది అనగా నాశము లేని దానిని అక్షరము అంటారు. ఈ అక్షర పురుషను హరించి హృదయములో బదాచుకొని ఆయన శ్రీహరి అయినాడు. ఈయన అక్షరపురుషా సమాన్వితుడైన పురుషుడు. అందుకే ఈయన అందుకే ఆయన పురుషోత్తముడు.
18. అధోక్షజ (415 నామము) - अधोक्षजः, (अधः ज्ञातृत्वाभावात् हीनम् अक्षजं प्रत्यक्षज्ञानं यस्य सः) విశ్వం గురించి, భగవంతుని గురించి యథార్థ జ్ఞానము తెలుసుకోవడానికి న్యాయశాస్త్రం నాలుగు ప్రమాణాలను గురించి చెబుతున్నది. వీనిలో ఉత్తమమైనది ప్రత్యక్షజ్ఞానం. జ్ఞానేంద్రియాలచేత తెలుసుకోగలిగినది. అక్షజం అంటే కంటితో చూచుటవలన కలిగినజ్ఞానం. దేవుని సామాన్య నేత్రాలతో చూడలేం. ఈశ్వరుని అనుమాన ప్రమాణంద్వారా తెలుసుకోవాలి. ధూమం ఉండడం వలన అగ్ని ఉన్నదని తెలుసుకోవడం. ఇదే హేతువాదం. మూడవది శబ్ద ప్రమాణం (ఆప్త వాక్యం ద్వారానో, వేద వాక్కు ద్వారానో తెలుసుకోవాలి). తరువాతది ఉపమానం. ఆకాశంలో సూర్యుని వలే హృదయాకాశంలోని పరమాత్మను అంతర్ముఖుడై చూడడం. మహాభారతంలో ఉద్యోగ పర్వంలో ఒక చోట " అధో న క్షీయతే జాతః యస్మాత్తస్మాత్దధోక్షజ " అని పేర్కొన బడినది. యస్మాత్తస్మాత్ అని వాడబట్టి క్షీణత లేనివాడు, సతతము ఊర్ధ్వరూపుడు, సంసార ధర్మ స్పర్శరహితుడై ఉండేవాడు కాబట్టి అధోక్షజుడు. అధోక్షజాయనమః = జ్ఞాతత్వాభావాన్ హీనం ప్రత్యక్షజ్ఞానం యస్య సః ఇంద్రియాగోచరత్వాత్ పంచ మహాభౌతికేంద్రియాగమ్య ఇత్యర్థః,
సమస్తేంద్రియములచేఁ దెలిసికొనఁబడని వస్తువు కొఱకు నమస్కారము. అధోక్షజ నామం యొక్క అన్వయం యోగశాస్త్ర సంబంధం. మనశరీరములో మూలాధారము నుండి సహస్రారము వరకు ఉన్న పద్మాలన్నీ అధోముఖంగా ఉంటాయి. యోగసాధకుడు భూసంబంధమైన మూలాధార స్థితుడైన గణపతిని ధ్యానిస్తూ కుండలిని జాగరణ చేసి ఊర్ధ్వలోకములను దర్శిస్తాడు. క్రమముగా ఈ పద్మములు తిరుగబడి ఊర్థ్వ ముఖంగా విచ్చుకుంటాయి. దేహాత్మ భావన కలవానిలో పద్మములు అధోముఖంగా ఉంటాయి. అది
కల్పించినవాడు అధోక్షజుడు. మాంసనేత్రాలతో బాహ్యవస్తువులను చూస్తున్నాము. అంతర్దృష్టితో ఆత్మను, అదే పరమాత్మను చూస్తున్నాం. ఇలా ధ్యాన గమ్యుడైన పరమాత్మయే అధోక్షజుడు.
19. నారసింహ (21వ నామము, ఓం నారసింహ వపుషేనమః (వపు = శరీరము)) - నరః, సింహః, నరసింహః మూడు నామాలు ఆయనవే. నామము 200, ఓం సింహాయనమః, నామము 246 ఓం నరాయ నమః. సింహవాహిని పరాశక్తి. ఆమెను ధ్యానిస్తే యోగసాధనలో ప్రాణశక్తి చిత్రిణీ నాడిలో సులభముగా ప్రవహిస్తుంది. నారసింహవపు - నరశరీరము, సింహ శరీరము ఏక కాలమున ధరించినవాడు. మానవ జాతిలోని దోషములు సంహరింప దగినవి. ఒక తపస్వి,పండితుడు ఐన హిరణ్యకశిపుని దోషనివారణకై ఆయన తనపై సగభాగమును సింహ రూపమున ప్రకటించుకొని, నిరాయుధుడై, వాని మూఢత్వమును,దానికి ఆశ్రయమైన ఆసురీ సంపత్తిని దానిని పోషించి పెంచిన అతని తపస్సును అతన దేహమును చీల్చి పెగలించినాడు. ప్రకృతి, పురుషుడు తానే అగుటవలన ఆ ఆసురీశక్తిని తనలో విలీనం చేసుకున్నాడు. 245, 246 లలో నారాయణ, నర నామములు వరుసగా వస్తాయి. కృష్ణార్జునులు నారాయణ -నర మహర్షులే. తెలియబడే నారాయణుడు, తెసుకునే నరుడు విష్ణురూపములే.
20. అచ్యుత – (100, 318,552 నామాలు) అచ్యుత అంటే నాశనములేని వాడు, చ్యుతి లేనివాడు. ఒక పదవినుండి పడిపోవడంగాని, పోగొట్టుకొనడం కాని, దానిని నష్టపోవడం కాని, ఏదీ అయిపోవడంగాని, ఖర్చుకావడం కాని లేనివాడు, నిత్యుడు, స్థిరుడు. "శాశ్వతం శివమచ్యుతం" అని మంత్రపుష్పం లో చెప్పుకుంటాం. न च्यवते स्वरूपतो न गच्छति यः नित्य इति यावत् | ఆయనకు షడ్భావ వికారములు ఏమీలేవు. స్వస్వరూప నాశనమై, రూపాంతరము పొందడము వికారము. ఉదాహరణకు పాలు పెరుగుగా, మట్టిముద్ద కుండగా మారుట. ఈ వికారములు లేకపోవడానికి కారణము ఆయనలోనున్న అనంతమైన ఇచ్ఛా, క్రియా, జ్ఞాన శక్తుల సమ్మేళనమే. ఆయనకు చ్యుతి కలిగించే శక్తి సృష్టిలోనే లేదు. అందుకే ఆయన అచ్యుతుడైనాడు.
21. జనార్దన (126 నామం) - సర్వజనులచేత కోరబడేవాడు. రక్షించుటకై దుష్ట సంహారం చేసేవాడు. जनं जन्म अर्द्दयति हन्ति भक्तस्य मुक्तिदत्वादिति जनार्द्दनः । किंवा जनान् लोकान् अर्द्दति हररूपेण संहारकत्वादिति जनार्द्दनः । జనోత్పాదనకు సృష్టికర్త బ్రహ్మ వలె, భక్తులకు ముక్తి ప్రదాత ఐన విష్ణువువలె, సంహార శక్తి, లయకర్త ఐన హరుని వలె ఉండువాడు. (శబ్దకల్పద్రుమం)
22. ఉపేంద్ర (151 నామము) - ఇంద్రునకు సోదరుడై శాసించు వాడు कश्यपादृषेः अदितौ वामनावतारे इन्द्रस्यानन्तरं जातत्वात् तथात्वम् | వామనావతార సమయంలో అదితి కశ్యపులకు ఇంద్రుని అనంతరం జననము పొంది ఉపేంద్రుడైన వాడు.
23. హరి (650 నామము) - సమూలముగా సంసార దుఃఖమును (సంసారము అనెడు దుఃఖమును) హరించు వాడు హరి. అందుకే ఆయన పరమాత్మ. అందుచేత हरति पापानीति | (హరతి పాపానీతి .) పాపములను హరించువాడు హరి. అసలు నిఘంటువులో హరి శబ్దమునకు లేని అర్థము లేదు. అదే ఆయన విశ్వరూపమును తెలియజేయుచున్నది.
24. శ్రీకృష్ణ (57,550 నామములు) - కృష్ణ నామానికి నల్లనివాడు అని సామాన్యార్థం. అనంత ఆకాశములో అనంతకోటి కాంతిపుంజములు, నక్షత్రములు ఉన్నాయి. దానికి కోటి గుణితమైన అంధకారం ఆకాశాన్ని నీలంచేసింది. కృష్ణుడు ఆ అనంత ఆకాశ స్వరూపుడు. అనంతాకాశానికే విష్ణుపదం అనేపేరుకూడా ఉంది. రామ, కృష్ణ నామములకు శ్రీ చేర్చడమే ఉచితం. శ్రీతో చేరిన కృష్ణుడే ఉపాస్యమూర్తి. కృష్ణ నామానికి కృష్ణ ద్వైపాయనుడు, వ్యాసుడని కూడా అర్థము చెప్పుకోవచ్చును. వ్యాసుడు కూడా విష్ణువు అవతారమే. భారత భాగవతాల ద్వారా శ్రీకృష్ణుని చరిత్రను అందించినది ఆయనే. "వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం" అన్నట్లు భగవద్గీతను మనకు అందించినది కూడా ఆయనే. విష్ణుసహస్ర స్తోత్ర మహామంత్రానికి ఋషి వేద వ్యాసుడే. కృష్ణతత్త్వ విశేషాలను పూర్తిగా తెలుసుకోవడానికి ఒక జీవితకాలం కూడా చాలదు.
‘కాయేన వాచా మనసేన్ద్రియాణాం
బుధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్
కరోమి యద్యః శకలం పరస్మై
నారాయాణాయ ఇతి సమర్పయామి.
స్వస్తి.