సమస్య మనది – సలహా గీతది – 22
బాహ్యేంద్రియాలనే గుర్రాలపై నా కోర్కెలు సవారీ చేస్తున్నాయి.వాటి కళ్ళెములు లాగే శక్తి నాకు గోచరము అగుట లేదు. నాగతి ఏమిటి ?
గాలిబుడగ (Balloon )ను చూసివుంటావు. దానిని సాధారణమైన గాలితో నింపవచ్చు లేదా ఉదజని ( hydrogen ) తో కూడా నింపవచ్చు. గాలిబుడగ సాధారణ వాయువుతో నిండియున్నంతసేపూ నీతోనే వుంటుంది, దానికి బదులుగా ఉదజనితో నింపినావనుకో అది ఎప్పుడైనా నీచేయి దాటి పోయేదే! ఇందులో నీకేమి అర్థమౌతూవుంది. సాధారణమైన కోరికలు అంటే సహజమైన గాలి తో సంతృప్తి చెందే వరకూ జీవితమనే గాలిబుడగ నీతోనే వుంటుంది. నీ ఆశ పెరిగి పెను కోరికలకు మరిగి, ఉదజని కొరకు తిరిగి బుడగ నింపితే అది ఎప్పుడైనా నీ చేయి జారేదే ! ఈ వాస్తవము గుర్తెరుగు. వెనుకటికి ఒకడు తన స్నేహితునికి ఒక చెట్టు చూపించి "ఈ చెట్టు ఎక్కితే ఇంజనీరింగ్ విద్యార్థినులు అందరూ కనిపించుతా"రన్నాడటట. స్నేహితుడు వెంటనే " అవును చేతులు వదిలితే మెడికల్ కాలేజి విద్యార్థినులు కూడా కనిపించుతా"రన్నాడట. కాబట్టిఎంత చెట్టుకంత గాలి . దురాశ దుఃఖమునకు చేటు అన్న నానుడులు వినలేదా ! వినియుండవేమో ! అవి ఇంగ్లీషు బళ్ళలో నేర్పించరు కదా!
సాత్త్విక గుణ సంపన్నులు ఆధ్యాత్మిక పురోగతిని అభిలషించితే, రాజసిక గునపోషకులు భౌతిక వస్తువిషయ సంపద కొరకు అత్యంత ఆసక్తిని కనబరచుతారు. ఈ భూమిపై నీవు కోరుకోనేదేదయినా తాత్కాలికమైనదే! మరియు ఇహపరమగు ఆ వాసనలు అనుభవాలు ఆస్తులు అన్నీ ఇక్కడ ఎదో ఒకరోజు వదిలి వేయవలసినదేనని అని అర్థంచేసుకోరు. మితిమీరిన రాగముతో ఉద్వేగపూరితులై పవిత్రత అన్న పదమును దరిజేరనీయరు. అందుకే, వారికి అందిన దానితో తృప్తి చెందక, ఇంకా కావాలనే దురాశతో ఉంటారు. ఇతరులు తమకన్నా ఎక్కువ సాధిస్తూ, ఎక్కువ సంపాదిస్తూ, ఎక్కువ భోగిస్తూ ఉంటే వారు ఈర్ష్యతో హింసాప్రవృత్తులై, సాటి మనిషి అన్న జాలినివీడి, ప్రాణము తీయుటకు కూడా వెనుకాడరు. క్షణికమగు కోరికలు తీరినప్పుడు అతి సంతోష పడతారు, అవి తీరకపోతే నిరాశ చెందుతారు. ఈ విధంగా, వారి జీవితములకు నిశాలత ఉండదు. ఎప్పుడూ డోలాయమానమే. ఆకారణముచే ఆరోగ్యము చెడుతుంది, అనర్థము జరుగుతుంది. నీవు నాటుకొన్న విషయ వాంఛా బీజములు విష బీజములై వయసు ఉడిగేకొద్దీ ప్రకోపించి నిన్ను నిర్వీర్యుని చేస్తాయి. సంతృప్తి సంతోషములు స్వర్గసమములు. క్రింద కనబరచిన ఆ అద్వితీయమైన ఆలోచనను ఒకసారి చదువు:
సత్వము సత్యమార్గమును సాధన చేసిన పొందజేయు నా
తత్వము నీవెరింగి రజ తామస రీతుల వీడనాడి యం
ధత్వము నుండి బైట పడి ధర్మము తప్పక సంచరించుచో
సత్వర మీవు చేరనగు సంతత రీతిని చక్రి పాదముల్
ఇక అసలు విషయానికి వస్తాము . నీ సమస్యకు పరమాత్మ ఏమి సలహా చెబుతున్నాడో చూస్తాము.
ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే
తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావ మివాంభసి 67-2
బాహ్యేంద్రియముల వశ వర్తినియౌ
మది పెనుగాలిగ మారుచు బుద్ధిని
నడిసంద్రములో నావజేయుచును
తీసుకపోవును తెలియని దారుల 67 - 2
తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః 68 - 2
ఇంద్ర్యాణీంద్రియార్థేభ్య స్తస్యప్రజ్ఞా ప్రతిష్ఠితా
అందుకేనయా అర్జున! తెలియుము
నీ బాహ్యేంద్రియ నిగ్రహమ్ముతో
బాహ్య విషయముల పరికించనిచో
నీ వివేకమును నిలువరించెదవు 68 -2
నీ బాహ్యేంద్రియములు కోరినవి నీమనసుకు చేరవేస్తున్నాయి. నీ మనసు బుద్ధిని కోరిక తీర్చుకొనుటకు వుశిగొల్పుతూవుంది.
మరి నీ బుద్ధికి కళ్ళెం వేస్తే అది మనసుకు, మనసు ఇంద్రియాలకు వేయగలుగుతుంది. పరమాత్మునిచే చెప్పబడిన ఈ ఉపమానమును గమనించు. భగవానుడు చెప్పిన నావ నీవు.సముద్రము నీ చుట్టూవుందే ప్రపంచము. గాలులే నీ కోరికలు.నావను నియంత్రించే సరంగు నీ వివేకము. ఇక ఆ నావికుని దిక్సూచియే వేదశాస్త్రాలు. చేరవలసిన తీరమే ప్రశాంతి. అక్కడ ఏ చీకూ చింతాలేదు . రాగం ద్వేషం లేదు. ఈర్ష్యాసూయలు లేవు. అంతా ప్రశాంతము. ఎటువంటిపోలికో చూడండి. ఇటువంటి పోలిక ఇచ్చుట వ్యాసులవారికే చెల్లుతుంది. చెప్పుటకు భగవంతునికే ఒప్పుతుంది. ఆయన ఈయన ద్వారా చెప్పినాడా లేక ఈయన చెప్పినది ఆయన మనకు తెలియబరచినాడా అన్నది మనకు అప్రస్తుతము. ఆమాట మనకు శిలాశాసనము. కాబట్టి శ్రీకృష్ణుడు ఏమయితే అర్జనునికి చెప్పినాడో నీవు నేను చేయవలసినది కూడా అదే! కాబట్టి నీ బాహఎంద్రియముల నిగ్రహించు. అప్పుడు నీవు బాహ్య విషయముల జోలికి పోవు. అప్పుడు నీ మనసుకు తటస్థత పోయి నిశ్చలత సమకూరుతుంది. మనసు నిశ్చలమైతే బుద్ధి, బుద్ధిగా కుదుతబడుతుంది. అర్థమైనదికదా మరి ఆచరణలో పెట్టు.
మనోబల ప్రాప్తిరస్తు.
సమస్య: ఏపనీ చేయకుండా ఏదో విధంగా జీవితము గడచిపోవాలని నా కోరిక . అది సాధ్యమౌతుందా?
సలహా: పనీ పాట లేకుండాజీవితము గడచిపోవలెనన్న మాటతోనే, నీకు కష్టమనిపించే అడ్డంకులు ఏవీ లేకుండా
‘చిన్ని నా బొజ్జకు శ్రీరామ రక్ష’ అన్నట్లు జరిగిపోవలెనన్నది నీ అత్యాశ. నీ ప్రశ్న వింటూవుంటే నాకొక కథ గుర్తుకు వస్తూవుంది.
గ్రీష్మఋతువు రోహిణీ కార్తె లోనిఎర్రటి ఎండలో చెట్టు చేమ కనిపించని బీడుమార్గములోనురగలుకక్కుకుంటూ పరుగెత్తలేక పరుగెత్తుతున్న గుర్రముపైనెక్కి అమితమైన దాహముతో వస్తూ వున్నాడు.
అమితముగా అలసిపోయిన అతనికి అనుకోకుండా అక్కడ ఒక అల్లనేరెడు చెట్టు అగుపించింది. చెట్టు నీడకు చేరి అశ్వమును అవరోహించి అటు ప్రక్కగా చెట్టు నీడలో,ఒకచేతివ్రేళ్ళ సందులలో మరియొక చేతి వ్రేళ్ళను దూర్చి తలక్రింద ఆ కలగలిసిన చేతులను చేర్చి వెల్లకిలా ఆకాశము వంక జూస్తూ పడుకున్న ఒక బవిరి గడ్డము సాహెబుగారిని గమనించినాడారౌతు. తదేకముగా అతనిని చూడటముతో రౌతుకు సాహేబుగారి గడ్డముపైకలమాగిన అల్లనేరెడు పండు పడియుండుటను గమనించినాడు. కాసేపు అలాగే చూసిన పిదప తన ఉత్సుకతను ఆపుకోలేక సాహెబుగారినిఆపండు నోటిలోఎందుకు వేసుకోలేదోఅడిగినాడు. దానికతను “నేను, నీలాగా ఎవరో ఒకరు రాకపోతారా నేనడిగితే నోట్లో వెయ్యకపోతారా” అనివేచియున్నా నన్నాడు. వళ్ళుమండిన రౌతు తన నడుముకు వ్రేలాడుతున్న ఒర నుండి వ్రేలాడుతున్న కత్తిని తీసి సాహెబుగారి గొంతుమీద పెట్టి“పండునోట్లో వేసుకొంటావా లేదా “ అని ఒక్క సారి హూంకరించిన వెంటనే నోట్లో వేసుకొన్నాడు. కాబట్టి ఏతావాతా నేను చెప్పవచ్చిందేమిటంటే కర్మ నుండి నీవు తప్పించుకొనలేవు.
అసలు కర్మ చేయకుండానే ఉండగలుగుట మనిషికి సాధ్యమే కాదు. నీవు దగ్గడము ,తుమ్మడము, తినడము, త్రాగడము, నిదురించడము ఇవన్నీ కర్మలే. కాకపోతే నీవు చేయదలచు కొంటున్నావు కాబట్టి చేస్తూ వున్నావు. నీ కన్నా బిడ్డ చిన్న బిడ్డగా వున్నపుడు ముక్కున చీమిడి వస్తే తీయకుండా అట్లే వుంచినావా! తీయడము నీ బాధ్యత, తీసివుంటావు.ఒకసారి ఒక మంచుగడ్డ రాతిగుండుతోఅనిందట
“ మనమిరువురమూ గట్టిపిండాలమే గానీ నాలోవున్న గొప్పదనము నీలో లేదు. వెలుగు నాపై బడితే తళతళ మెరుస్తాను నేను. నీవు అలా కాదు. నాలో సౌకుమార్యము ఎక్కువ. ఎండలోనిలుస్తే చెమటలు విపరీతంగా పట్టేస్తాయ్తి. ఏ మంచుకొండ లోనో, శీతకరండము (Rrefrigerator ) లోనో నా జీవితము గడిచి పోతుంది. అప్పుడు రాతిగుండు ఈ విధంగా అనింది."నీ వుండే చోటనే కలకాలమూ వుండిపోలేవు. నీవు వున్న చోటునుండి బయట పడకనూ తప్పదు ఏవిధముగానయినా ఆవిరి కాకనూ తప్పదు ఆపై వానగా మారి ఏ మురికి గుంటలోనన్నా పడవచ్చు మహా సముద్రమునైనాచేరవచ్చు. ఏది ఎట్లయినా నీవు నీవుగా వుండలేవు. నిరంతరము జనన మరణ చక్రపు పరిధి పై బిందువై తిరుగుతూ వుండవలసినదే. కానీ నేను నా అకారమును తగ్గించుకొంటూ సూక్ష్మరూపమైన ఇసుకరేణువునై శర్వేశ్వరునితో పోల్పబడే సాగరతోనే వుండిపోతాను.నాకు నియమింపబడిన కర్మ నేను చేయకుండా వుండిపోను.జీవికి పరమాత్మ సంగమమే పరమావధి. మరి నాపరిస్థితి ఎప్పటికీ అంతేనా అన్నది మంచు. లేదు అంటూ రాయి ఈ విధంగా చెప్పింది." ఒక్కసారి నీవు వానరూపములో ఒక చెట్టును చేరినావనుకో అంతే ఏదో ఒకరోజు నీవు ఏ విత్తనము రూపములోనో సాగరము చేరిపోతావు. ఇక ఆప్రాంతమే నీ నివాసము. కాబట్టి కర్మల
చేయకనూ తప్పదు పరమాత్ముని చేరుటకు అవి సత్కర్మలై యుండకనూ తప్పదు.
అసలు అచ్యుతుడౌ కృష్ణ భగవానుడీ విషయములో ఏమంటున్నాడో చూస్తాము.
నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మ కృత .
కార్యతే హ్యనశః కర్మ సర్వః ప్రకృతి జైర్గుణైః 5--3
కర్మలటక నెక్కించి కనులు మూసి కూర్చొనడం
కానేరదు కడు సులభం కాదది హస్తామలకం
ప్రకృతి తనదు త్రిగుణాలను ప్రసరించుచు నీమీదికి
కర్మకారకుని జేయును కాసింతయు వ్యవధినీక 5--3
అనగా ఎ మనిషైనా ఎ కాలంలో నైనా క్షణం కూడా కర్మను ఆచరించకుండా వుండలేడు .దీనిలో ఎలాంటి సందేహం లేదు . ఎందుకంటే, మనుష్యులంతా ప్రకృతికి చెందిన త్రిగుణాలకి లోబడి కర్మలని చేయవలసిందే .
మరి కర్మ అంటే అసలేమిటి ?
క్రియతే ఆనేన ఇతి కర్మ ---చేయబడేది ఏదైనా కర్మయే . కర్మ అనగా మానసికంగా గాని , శారీరికంగా గాని చేయబడేది .. పూర్తి అయిన పనిని కర్మ అని, ఇంకా జరుగుతున్న పనికి క్రియ అని అన్నారు .అనగా కర్మ తాలూకు భీజం క్రియ లోనే వుంటుంది . కర్మ మంచి కావచ్చు , చెడు కావచ్చు .లేదా మంచి చెడుల మిశ్రమం కావచ్చు .
నిర్మలమైనదియు, ప్రకాశింపజేయునదియు, ఏ దోషములేనిదియు నగు సత్వగుణము . తృష్ణచేతను, ఆసక్తిచేతను, పుట్టి మానవులను ఐహికర్మలపై అనురాగమును కలిగించునది రజోగుణము . జ్ఞానమునావరించి ప్రమాదమును, కర్తవ్య మూఢతయందాసక్తిని కలుగజేయునది తమోగుణము. ఈ త్రిగుణముల పౌనఃపున్యములే మానవులను వివిధ సత్కర్మల లేక దుష్కర్మలయన్ దనురక్తుల ఝేయుచున్నది.
నీతు భోగాద్రుతే పుణ్యం కిమ్చిద్వా కర్మ మానవం
పావకం నా పునాత్యాషు క్షయో భోగా త్ప్రజాయతే
--కర్మ విపాక సంహిత
అనగా సుఖ దుఃఖ రూపాలైన కర్మలని , అంటే పాప పుణ్యాలని అనుభవించక మానవుడు వాటి నుండి విముక్తుడు కాలేడు అంటే పరమాత్మను శాశ్వతముగా అందుకోలేడు.
కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ |
ఇంద్రియార్థాన్ విమూఢాత్మా విథ్యాచారఃస ఉచ్యతే 6--3
వాగ్వపుషమ్ముల వనరుగ వంచుచు
మునివేషములో మురియగ తలవకు
మనసును, కోర్కెల మబ్బులు ముసిరిన
కపటవేషమే కనబడు మరువకు 6--3
బాహ్యేంద్రియ నిగ్రహాన్ని "దమము"అంటాము. అంతరేంద్రియమయిన మనోనియంత్రణను "శమము" అంటాము. "దమము" వుండి శమము లేకపోతే కోరికలు మనస్సులో అంతర్ముఖంగా విజృంభిస్తూనే వుంటాయి; అలాంటి మానవుడు తన అలవాట్లకు బానిసౌతాడు అంటే దుష్కర్మల బానిసైపోతాడు.
అట్లని భాహిరముగా ఇంద్రియ నిగ్రహత చూపుతూ ఆంతర్యములో అన్నీ అనుభవించవలెనను కపటి కలకాలమూ గౌరవము పొందలేడు. జీవితంలో సహజంగా బ్రతకాలి.
"దమము"తో ప్రారంభమయి,"శమము"నకు చేరుకోవాలి. కాబట్టి మనసును మంచి కర్మలపైకి మరలిచు.అప్పుడు బుద్ధి నీ కర్మలకు అనుగుణముగా వుంటుంది. ఎందుకంటే 'బుద్ధిః కర్మానుసారిణీ అన్నారు కదా!
ఏపనీ చేయకుండా ఏదో విధంగా జీవితము గడచిపోవాలని ఎప్పటికీ కోరుకోవద్దు. సత్కర్మలనాచరించు. సత్వమునాశ్రయిచు. సత్సమాజమును స్థాపించు.
శుభం భూయాత్
******************************************************
సమస్య మనది – సలహా గీతది – 24
సలహా :మొదట నీప్రశ్న లోనే తప్పువుంది. అదేమిటంటే కర్మ, తలరాత అన్నవి క్రైస్తవ ఇస్లాం మతములలో అవి
ఒకటిగా పరిగణింపవచ్చు గానీ మన వైదిక ధర్మములో అవి వేరు వేరు. పై రెండు ధర్మములలోనూ దేవుడు జీవి
చేసే మంచి చెడ్డలను ముందే నుదుట వ్రాసి పంపుతాడని నమ్ముతారు మన ధర్మము ఆ విధముగా చెప్పదు.
మనిషి ఆధీనంలో కర్మ మరియు భగవంతుని ఆధీనంలో కర్మఫలం ఉంటాయి. ఈ వ్యత్యాసం ఎరుగక మనలో కూడా కొందరు కర్మని విధి నిర్ణయం (fate) గా పొరబడతారు.
మానవుడు చిత్త చాంచల్యముతో కానీ చిత్త స్థైర్యముతో కానీ తాను చెడ్డ మంచి కర్మలను ఆచరించుతాడు. కాబట్టి కర్మ మనచేత నుంటుంది కానీ కర్మఫలము పైవాని చేతిలో వుంటుంది. తలరాత అంటూ తల పట్టుకొని కూర్చుంటే పనులౌతాయా. గాలిలో దీపము పెట్టి దేవుడా నీవే దిక్కంటే అవుతుందా ! దేవుడే 'పనిచేయి ఫలితము నాకొదిలిపెట్టు ' అన్నాడు. కాబట్టి ఆలోచన వుండవలసిందే అచరణా వుండవలసిందే, అప్పుడే అనుగ్రహము దేవునిది వుంటుంది.
జీవితము నాటకము భూతలము నాటక రంగము , మనము పాత్ర ధారులము పైవాడు సూత్ర ధారి అన్నది అందరకూ తెలిసినవిషయమే. మరి నీ పాత్రకు నీవే కర్తవు కదా !కర్తవు నీవైతే కార్యము నీ కొరకు సిద్ధముగా వున్నట్లేకదా ! కార్యము సిద్ధముగా వుంటే నీ క్రియ మొదలు కావలసినదే! క్రియ ముగుసినది అంటే ఆ కర్మ ముగిసినట్లే ! తిరిగీ వేరొకటి మొదలు.నీ కర్మకు ఫలితము పాపము పుణ్యము. కట్టె కాలిన తరువాత నీ వెంట నడిచేది ఈ కర్మ ఫలితాలే అంటే పాపపుణ్యాలే. ఈ విషయాన్నే పెద్దలు ఈ విధంగా అన్నారు
ధనాని భౌమౌ పశవశ్చ గోష్టే
నారీ గృహద్వారె జనః స్మశానే
దేహాశ్చితాయా పరలోక మార్గే
కర్మానుగోగచ్చతి ఏకమాత్రాః
నీధనము దార దాయలు దేహము అన్నింటికీ తాము నీతో సహగమించుటకు కట్టుబాట్లున్నాయి కానీ నీ కర్మము మాత్రము నీతోబాటే వుంటుంది. అందుకే ఆచరించేవి సత్కర్మలైతే తనువు బాసిన తరువాతకూడా నీకు బాసటగా నిలిచి మేలు చేస్తాయి. ఇక పరమాత్మ ఈ విషయములో ఎమంటున్నాడో చూస్తాము.
నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యరకర్మణః !
శరీరయాత్రాపాపి చ తే న ప్రసిద్ధ్యేదకర్మణః ! 8 - 3
చేయవలసినది చేయ మానకుము
చేర్చు కర్మమే జీవన గమ్యము
నిష్క్రియత్వమును నిజముగ జేర్చదు
నీదు వపుషమిది నిక్కము నమ్ముము 8 - 3
నీకు విధించిన కర్మలు నీవు చేయక తప్పదు. అకర్మ కన్నా సకర్మ సర్వస్రేష్ఠము. అసలు నిష్కర్ముడవైతే నీ శరీరమునే
కాపాడుకోలేవు. విస్త్రుతముగా దిన కర్మలను మూడు . అవి 1. నిత్యకర్మ 2. నైమిత్తిక కర్మ 3.కామ్య కర్మ. వాతిని గూర్చి ఒక్క
మాట మాట్లాడుకొందాము.
నిత్యం : ప్రతిరోజూ చెయ్యాల్సినవి
నైమిత్తికం : ఒక కారణము కొరకు చేసేవి
కామ్యం : ఫలితాన్ని ఆశించి చేసేవి
1996 Atlanta Olympics లో 18 సంవత్సరాల Kerri Allyson Strug అన్న అమెరికా అమ్మాయి Pole Vault లో తన కాలు విరిగినా, ఆ క్రీడలో నిపుణులైన రష్యా దేశస్థులను అధిగమించి, గెలిచింది. అది కాదు గొప్ప అసలు ఆమె గొప్పదనము ఏమిటంటే ఆ క్రీడ మొదటి round లోనే ఆమె కాలి ముణుకు దగ్గర బెణికింది. దానిని ఆమెCoach Béla Károlyi గుర్తించడము జరిగింది.ఇంక ఒక్క round లో పాల్గొంటే ఆమె గెలుస్తుంది. అప్పుడు Károlyi ఆమె "చెంతకుపోయి నీ బాధ నేను గుర్తించినాను. ఈ రాబోయే round లో పాల్గొనేది నీవు కాదు నీ దేశము అన్న ఒక్కమాట గుర్తు పెట్టుకొని పాల్గొను"మన్నాడు. అంతే ఆ ఒక్క మాట లోని స్పూర్తితో ఆమె విజయాన్ని సాధించి కుప్ప కూలిపోయింది. Károlyi ఆమెను medals podium వద్దకు మోసుకుపోయినాడు. తరువాత అంతా సుఖాంతమే.White House కు ఆహ్వానింపబడిన ఆమెను, అప్పటి President Bill Clinton ఎంతగానో ప్రశంసించినాడు.
ఈ ఉదంతమును పై మూడు కర్మలకు ఉదాహరణ గా తీసుకొందాము.
ఆమె ప్రతిరోజూ ఆ క్రీడలో ప్రావీణ్యత కొరకు పరిశ్రమించుట నిత్యకర్మ. తన పరిశ్రమను ఇంకా ఏ అంతస్తువరకు పెంచవలెన్న ఆలోచనతో లేక క్రీడా స్పూర్తి కొరకో చిన్నచిన్న క్రీడా స్పర్దలలో (ఆటల పోటీలు ) పాల్గొనడము నైమిత్తికము. Olympics లో పాల్గొనుట కామ్య కర్మము మరియు కాంచన పథకము సాధించుట కామితము.
ఇప్పుడు ఆమె కర్మాచరణను ఒకాసారి తలపుకు తెచ్చుకో. వడలు గగుర్పొడిచితే కర్మచేయుటకు వలయు చిత్తశుద్ధికి నీవు స్పందించినట్లే.
పైమూడూ ఈ జన్మలో నీవు ఆచరించే కర్మలు. ఇవి కాకుండా నీ జీవి ఆచరించే కర్మలు మూడున్నాయి. అవి జీవిని జన్మ జన్మలకూ వెంటాడుతూనేవుంటాయి. అవి :సంచితం (భూతకాలానికి సంబంధించినది), ప్రారబ్ధం
(వర్తమానానికి సంబంధించినది) ఆగామి (భవిష్యత్తునకు సంబంధించినది.) ఈ మూడింటిని త్రివిధ కర్మలు అంటారు.
అబద్ధం, కపటం, చౌర్యం, హింస,మోసం, వ్యభిచారం మొదలైనవన్నీ సామాజిక జీవనాన్ని కలుషితం చేసేవి దుష్కర్మలు. అందుకే వేత్తలు వీటిని వదిలి జీవించుటను ఉత్తమ జీవనగతిగా పేర్కొంటారు. పునర్జన్మల పై నమ్మకం, స్వర్గప్రాప్తి, నరకభీతి లాంటివి కూడా ఈకర్మవాదం కిందకి వస్తాయి. ఈ స్పృహ నీకు కలిగితే కర్మలు మాని కాళ్ళు ముడుచుకొని కళ్ళు మూసుకొని కూర్చోవు. త్రివిధ కరమలను సత్సంకల్పముతో ఆచరించి శ్రేష్ఠునివనిపించుకొంటావు.
శుభం భూయత్
************************************************
సమస్య మనది – సలహా గీతది – 25.
సమస్య : దేవతలు వారికి ప్రీతి గలిగించుటకు యజ్ఞ యాగాలు అర్థవంతముగా నాకగుపించవు మనకు అందుబాటులో వున్నది మన మనుభవించుటలో తప్పేమున్నది ? దేవతలు మనకగుపించుట లేదు కదా ?
సలహా : చర్మ చక్షువులకిది అక్షరాలా నిజము. ఒక సారి పంచ భూతములను గుర్తు చేసుకో ! భూమికి శబ్దస్పర్శరూపరసగంధములైదూ ఉంటాయి . మరి రెండవదైన నీటి విషయములోనో శబ్దస్పర్శరూపరసములు మాత్రమే ఉంటాయి . ఇక వెలుగు విషయములొ శబ్దస్పర్శరూపములే వుంటాయి .వాయువుకంటేనో శబ్దస్పర్శలు మాత్రమే. ఇక మిగిలిపోయింది ఆకాశము ( Ether ). ఆది కేవలము శబ్దాత్మకము.దేవతలకు పంచభూతములకు ఏమిటి సంబంధము అని తలచుతున్నావేమో చెబుతాను విను. పైన తెలిపిన ఈ ఐదు గుణాలను భూతములలో గమనించితే భూమికి ఐదు గుణాలూ వుంటే నీటికి నాలుగే తరువాత మూడే. ఆపై రెండూ, ఒకటి . మరి గుణాలు తగ్గుతూ వస్తూవున్నా భూతాలు ఐదు అని నమ్ముతున్నావు. ఎందుకంటే ఈ విషయాన్ని ఆధునిక శాస్త్రాలు కూడా ఒప్పుకొన్నాయి కాబట్టి. ఇపుడు ఆకాశము విషయానికి వస్తాము. ఆకాశము అనంతము. దానికి పెరుగుదల కానీ తరుగుదల కానీ లేదు. అర్థము చేసుకొంటే అది శూన్యమే. ఈ విషయము అవగాహనకు వస్తే ఈ పంచ భూతానుభూతులు మాయమయి, అసలు వీటికి కర్త ఎవరు అన్న ఆలోచన వస్తుంది. వస్తువుంటే కర్త వుండవలసినదేకదా ! ఆ కర్తను మనము పరమాత్మ అన్నాము.
కార్యాలయమును మనసునందు ఊహించుకో! దాని ప్రధానాధికారియొకడే కానీ అతనిక్రింద ఇద్దరు వారిక్రింద నలుగురూ ఈ విధముగా పోతూనే వుంటుంది. ఆ కార్యాలయములో మనకు పనిబడినపుడు క్రిందినుండి మన సాధన మొదలుపెట్టి ఏ అంతస్తు అధికారివద్ద మనపని జరిగిపోతే అక్కడితో మనపని ముగుస్తుంది. లేకుంటే సాధనను పెంచి అత్యున్నత అధికారి వరకు పోతాము. దీనిలొ అత్యున్నత అధికారి పరమాత్మ ఐతే మిగిలిన అధికారులే దేవతలు. దీనిని విధుల కేటాయింపు (Allocation of Duties) అనవచ్చు.
గౌరవనీయుల వద్దకు పోయినపుడు పత్రం పుష్పం ... పట్టుక పోవడము మన పెద్దల కట్టుబాటు. అది పెద్దలయందు గౌరవము విధేయతకు చిహ్నము, మనము వారియందు మన కోర్కెలనీడేర్చే భగవంతుని చూస్తాము కాబట్టి. ఇది లంచము కానేరదు. పరమాత్మనే ఈ మాట చెప్పినాడు.
పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి
తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మన: (భగవద్గీత 9 - 26)
ఫలమో పుష్పమొ పత్రము జలమో
ఆత్మ శుద్ధితో అమిత శ్రద్ధతో
పరమ ప్రీతితో భక్తుడొసంగిన
అందుకొందునతి ఆదరమ్ముతో (భగవద్గీత 9 - 26)
సుదాముడు (కుచేలుడు ) కృష్ణుని స్నేహితునిగానే ఎంచి చూడబోయినాడని మనకు తెలిసినదే అయినా తనకు గలిగిన అటుకులను తీసుకుపోయినాడు. ఈ పద్ధతి గౌరవము, ప్రేమ, అభిమానము, భక్తి, స్నేహము మొదలగువానికి నిదర్శనము.
దళమైన బుష్పమైనను,
ఫలమైనను సలిలమైన బాయని భక్తిం
గొలిచిన జను లర్పించిన,
నెలమిన్ రుచిరాన్నముగనె యేను భుజింతున్. (పొతన భాగవతం-దశమ స్కందము-కుచేలోపాఖ్యానము)
అంటే దేవతలను కూడా భక్తి ప్రేమ భావములటొ వారికి ఫలము నొసగవలెనని తెలియుచున్నది కదా ! ఆ ఫలము నొసగితే, అంటే ఇక్కడ వారి హవిస్సులు అని అర్థము, ఎందుకంటే హవిస్సులే యజ్ఞ ఫలములు, వాని వాహకుడే అగ్ని. ఆయనే దేవతలకు మానవులకు సంధానకర్త. వారు తృప్తులయి మన కోర్కెల నీడేరుస్తారు. కరువు కాటకములళో యజ్ఞములుచేసి వర్షమును కురిపింపజేయుట మనము గమనించే విషయమే కదా! కాబట్టి దేవుడొకడైనా దేవతలు మెండు. చదువు (Education) సరస్వతి ,సంపద (Wealth) లక్ష్మి శౌర్యము (Velour) శక్తి. ఇంద్రుడు సౌభాగ్యము నకు బ్రహ్మ విష్ణు మహేశులు సృష్టిస్థితిలయములకు ఈ విధముగా దేవతలకు వారి వారి విధులు ఏర్పరుపబడినాయి. మనపని ఎవరివల్ల లేక ఎవరి ద్వారా జరుగుతుందో వారిని
మనము కొలుస్తాము. అందరినీ అంటె యజ్ఞము చే తృప్తుల జేయవచ్చు.
ఇక భగవానుడేమంటున్నాడో విను.
దేవాన్ భావయతా నేన తే దేవా భావయంతు వః
పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ 11 - 3
ఇచ్చి పుచ్చుకోవడాలు ఇహపరముల సాధనాలు
దైవ ప్రీతి జేయ నరులు దయ వారిది పొందగలరు
నిస్వార్థపు భావనయే నిజము నరుల కండదండ
ఒకరికొకరు, ఇది గల్గిన ఒనరు నిష్టకామితములు 11--3
ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపఱచుడు. మఱియు ఆ దేవతలు మిమ్మలను అనుగ్రహింతురు. నిస్వార్థ భావముతో మీరు పరస్పరము సంతృప్తిపఱచుకోనుచు పరమశ్రేయస్సును పొందగలరు.
ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః
తైర్ధత్తానప్రదాయైభ్యో యోభుంక్తే స్తేన ఏవ సః 12 --3
హవన ప్రీతులై యఖిల దేవతలు
ఇత్తురయాచిత ఇష్ట భోగములు
ఏమి ఇవ్వకనె ఎల్లసుఖములను
పొందెడువారలు పోల్పగ చోరులు 12 --3
యజ్ఞముల ద్వారా సంతృప్తి పొందిన దేవతలు మానవులకు ఆయాచితముగనే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు. ఈ విధముగ దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదనచేయక తానే అనుభవించు వాడు నిజముగా చోరుడగును.
దైవానుగ్రహ ప్రాప్తిరస్తు .
ఒక Super Market కు పోతే మనకు కావలసిన వస్తువులను కొంటాము. ఆ వస్తువు పై ఆ company పేరు అందు ఏ పదార్థములు వాడినారో మొదలగు వివరములు వుంటాయి. మరి కలకాలమూ మనము వాడే నేల నీరు నిప్పు మొదలగు పంచభూతములకు Expiry Date లేదు కదా! మరి ఆ వస్తువులనిచ్చిన దేవతలకు మనము కృతజ్ఞత కబరచుకోనవసరము లేదా ! అట్లు కనబరచక అవి వాడుకొనుట కృతఘ్నత మరియు చౌర్యము కాదా!
దదాతి ప్రతిఘృణ్ణాతి గుహ్యమాఖ్యాతి పృచ్ఛతి
భుంక్తేచ భోజయింత్యేవ ఇత్యేతత్ మిత్రలక్షణం
అన్నారు పెద్దలు. మరి దానిని పాటించుట మన బాధ్యత.
కాబట్టి దేవతలు వున్నారని వారి కరుణ చేతనే మనము సుఖముగా వుండ గలుగుతామని, వారిని సంతృప్తిపరచ వలసిన బాధ్యత మనపై కలదని గ్రహించి సంచరించి సత్ఫలితములను పొందుము.
దైవానుగ్రహ ప్రాప్తిరస్తు .