Friday, 21 June 2019

డాక్టర్ లలిత-(డాక్టర్) శ్రీవాణి


డాక్టర్ లలిత-(డాక్టర్) శ్రీవాణి


భేషజమునకు పోకుండా, అహంకారము లేకుండా ఆత్మ సాక్షిని అనుసరించి పోయే వారిలో శ్రీమతి డాక్టర్ అయ్యగారి లలతా ఫణికుమార్ ఒకరు,  శ్రీమతి (డాక్టర్) అన్నం  శ్రీవాణి అర్జున్ ఇంకొకరు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయమునకు డాక్టర్ లలిత నాయిక.  శ్రీమతి శ్రీవాణి సహనాయిక.
ఈ ఇద్దరు మానసిక పుత్రికలద్వారా నాకు లభించిన గౌరవము నేను పదిమందికీ తెలుపుకొనక పోతే హీన పశు సమానుడనే. నేనూ మనిషినే అని అనిపించుకొనుటకు ఈ యదార్థమును మీ ముందుంచుచున్నాను.
నేను పాటలు, పద్యములు, వ్యాసములు, కథలు, హాస్య ఖండికలు మొదలగు ఎన్నో దైవ సంబంధమైన, చరిత్ర సంబంధమైన, శాస్త్ర సంబంధమైన, మనదేశపు వీరవిక్రమ విభూషితులైన మహారాజుల పైన, తమ సాధనా సంపత్తితో పరమాత్మ సాయుజ్యము పొందిన సత్పురుషులపైన, ఎన్నో విషయములను 2013 నుండి ఆస్యగ్రంధి మాధ్యముగా తెలుపుచూ వస్తూనే వున్నాను. ఓపికతో చదివినవాళ్ళు ఎందఱో వున్నారు. అట్లని చదవని వాళ్ళు లేరా అంటే,  వాళ్ళు అంతకంటే ఎక్కువగానే ఉన్నారు. 'నా రచనలు వస్తు ప్రాముఖ్యత మీదనే ఆధారపడి ఉంటాయి. ఈ స్వోత్కర్ష ఎందుకు అనుకొంటున్నారేమో, నేను పంచబోయే ఆనందమయ అనుభవానికి ఇది ఆలంబనము.
నా బిడ్డలు గా భావించినాను కాబట్టి ముందుముందు లలిత, వాణి అని వారిరువురిని సంబోధించుతూ  వారిని గూర్చి వ్రాస్తాను. అన్యథా భావించవద్దు.
లలిత నాకు 2004 నుండి పరిచయము. ఆమె విషయములో, భారతీయ వార్దుషి లో (In State Bank Of India) నేను పనిచేయుకాలములో, ఆమె ఎవరు ఏమి అని తెలుసుకోకుండానే నా బాధ్యత యగు ఒక పనిని చేసి పెట్టినందుకు ఆమె నన్ను గుర్తుంచుకొని, మా ఇరువురు అంటే నేను నా శ్రీమతి పై ఎనలేని అనురాగమును పెంచుకోనింది. ఆమె ఇంతగా గుర్తుంచుకొనుటకు సహాయపడిన, అదే వార్దుషి లో పనిచేయుచుండిన ఒక అధికారి కారణము. ఆమె మొదట తనసమస్యను అతనితోనే చెప్పింది. దీని బాధ్యత నాది కాదు, ఆ పొడవాటి ఆయనదని చెప్పి, అయినా ఆయన మీకు పలికేవాడు కాదని చెప్పినాడు. కానీ నావల్ల కలిగిన అనుభవము వేరొక విధముగా ఉండుటచే ఆమెకు ఆ అభిమానము ఏర్పడినది. అంతా జరిగిపోయిన కొంత కాలానికి గాని ఆమె డాక్టరని నాకు తెలిసి రాలేదు.
ఇక ఆతరువాత అంతా ఆమె చేత మేలు పొందుటయే తప్పించి నేను చేసినది ఏమీ లేదు. నన్ను 2 సంవత్సరముల వయసునుండి సాకిన మా అమ్మమ్మను, నా భార్య తప్ప, (ఇంట్లో ఉన్నపుడు నేను) చూసుకొనే వారు వేరే లేని సమయములో ముఖ్యమైన పెళ్ళికి పోవలసివస్తే, లలిత హాస్పిటల్ లో మేము వచ్చే వరకు తన సంరక్షణలో ఉంచుకొనింది. మా అమ్మమ్మకు ఆరోగ్య పరమైన అన్ని సలహాలు ఇచ్చుటయే కాక ఆమె అవసరమగునపుడు, తాను  హైదరాబాదులో ఉండుటచే, ఇంటికి వచ్చి చూసి పోయేది. ఈ సేవంతా ఉచితముగానే సుమా! మా అమ్మమ్మగారు గతించిన తరువాత, లలిత ఉక్కునగరము (విశాఖ) చేరిన తరువాత, మమ్ములను తన ఇంటికి పిలిపించుకొని కొన్ని రోజులకు ఉంచుకొనింది. ఆ సమయములోనే నా రాతలను, నాలో వున్న చమత్కారమును, నా విషయ విశ్లేషణలను అర్థము చేసుకొని మీలో ఇంత సత్తా ఉందే మీరెందుకు లోకానికి తెలుప కూడదు అనేది. అమ్మ నాకంత స్తోమత లేదు అనేవాడిని.
కొంత కాలము తరువాత నా శ్రీమతికి అత్యవసరమగు ఆపరేషన్ చేయించవలసి వచ్చింది. రిపోర్ట్ లలితకు వాట్సాప్ లో పంపి తన అభిప్రాయమును అడిగినాను. మారు మాట్లాడకుండా తత్కాల్ లో బుక్ చేసుకొని ట్రైన్ లో విశాఖకు రమ్మన్నది. ఏరోజు రాత్రయితే బయలుదేరినానో అదేరోజు ఆమె భర్త ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రి లోని ICU లో చేర్చబడినాడు. అదే రోజు ఆమె స్వంతము మరిది వేరొక ఆక్సిడెంట్ లో అసువులు బాసినాడు. అటువంటి సమయయములో తనతో పనిచేసే సాటి డాక్టర్లు చెప్పినా వినకుండా, మాకు విషయములు చెప్పకుండా, మమ్ములను ఉక్కునగరమునకు పిలిపించుకొని ఆస్పత్రిలో చేర్చి సర్జన్ తో మాట్లాడి తరువాతి రోజే ఆపరేషనుకు ఏర్పాటు చేసినది. ఆమె స్పెషలిస్ట్ ఫిజీషియాన్. ఆమెకు ఆపరేషన్ తో సంబంధము లేదు. నా భార్య కోరిక మేరకు  ఆమె డ్యూటీ ముగిసిన తరువాత ఆపరేషనుకు ఏర్పాటు చేసి ఆసాంతము తానువుండి నా భార్యకు ధైర్యము చెబుతూ కాపాడిన తల్లి ఆమె. ఆతరువాత ఆస్పత్రి ఖర్చులు నాపై పడకుండా తన ఇంటికి షిఫ్ట్ చేసి తానె చూసుకొంటూ అవసరమైతే సర్జన్ సలహాలు పొంది నా శ్రీమతిని కాపాడిన అపర లలిత.
చెప్పుకొంతూబోతే ఇటువంటి సహాయాలెన్నో! ఇది ఇంతటితో ఆగలేదు. ఆమెకు ఒక కుమారుడు ఒక కూతురు. ఇరువురూ MBBS చదువుతూ వున్నారు. ఒక మూడు నెలల క్రితము తన కుమార్తె వివాహము నిశ్చయమైనది. ఆ శుభవార్త నా చెవిన వేసినది ఆమె. కాసేపు ఆమాట ఈ మాట అయిన తరువాత నేను ఆమెతో, రిసెప్షను సమయములో ఏదయినా సాంప్రదాయ సంగీత కచేరీ ఏర్పాటుచేస్తే బాగుంటుందే? అని నేననటము జరిగింది.
అందులకామె "లేదుసార్ వేరే ప్రోగ్రామ్స్ ఏవో ఫిక్స్ అయినాయి అన్నది. నేనూ మిన్నకుండి పోయినాను. ఆ తరువాత ఒక వారమునకు ఆమె హైదరాబాదుకు వచ్చి బంధుమిత్రులకు వివాహ పత్రికలు పంచుతూ మాయింటికి రాత్రి 10.30 కి తన చెల్లెలుతో కూడా వచ్చింది. ఆమె ఎంతో కలుపు గోలుగా వుంటుంది కాబట్టి రాత్రి ఒక 10 గం. సమయములో "సార్ పెళ్లి పత్రిక ఇచ్చుటకు కొరియర్ వస్తాడు మీ అడ్రసు మరియు ల్యాండ్ మార్క్ చెప్పేది అని అనింది. నేను చెప్పినాను. నేను తలుపు లోనికి వేసుకొని వుంటే ఆమె బెల్ కొట్టింది. తలుపు తెరుస్తూ ఆమెను చూడకుండానే "రామ్మా! లలిత" అన్నాను. ఆమె “చూడకుండానే ఎట్లా నేను అని తెలుసుకొన్నారు” అని అడిగింది. ఇంత రాత్రి సమయములో అడ్రసు అడిగి వచ్చే కోరియారు ఎవరుంటారమ్మా నీవు తప్ప అన్నాను”. నవ్వుకొన్నాము సరిపోయింది. వెంటనే 'అమ్మా ఒక్క సారి నాతోబాటు రా' అంటూ నా డెస్క్ టాప్ ఉన్న చోటికి పిలుచుకుపోయి ఆమెకు అగంతుకురాలయిన ఒక గాయకి పాట వినిపించినాను. "చాలా బాగుంది" అని అప్రయత్నముగానే ఆమె నోటినుండి వచ్చినది. అప్పుడు ఆమెకు ఈ విధముగా చెప్పనారంభించినాను. " అమ్మా ఆమె పేరు శ్రీ వాణి. నాతో బాటు బాంక్ లో ఆఫీసరుగా పనిచేసిన శ్రీ TV సుబ్బరావు  గారి కుమార్తె. ఆమె భర్త పేరు అర్జున్. ఆయన లాయరు. ఆమె బాల్యములో తండ్రి వద్దనే సంగీతము అభ్యసించినది. ఆతరువాత గురువుల ద్వారా కూడా నేర్చుకొని ఇపుడు సంగీతములో PhD. చేయుచున్నది. అదికూడా ముగింపు దశలో వుంది అని చెప్పినాను.
అప్పుడు నాతో ఏమీ చెప్పకుండా విశాఖ పట్ణము పోయి వాణి మొబైల్ నంబరు నన్ను అడిగి తీసుకొని ఆమెకు ఫోన్ చేసి అన్నీ నేను వ్రాసిన పాటలతో ఒక CD తయారుచేయుట మరియు Live Concert పెళ్లిరోజు అనగా 2019 జూన్19 వ తేదీ రాత్రిన చేయుట ఒప్పజెప్పినది.
ఇక్కడ వాణిని గూర్చి తెలియజేసుకొంటాను. వైశ్యులలో సంగీతము అబ్బుట బహు అరుదు. అందునా కడపలో దానికి గుర్తింపు ఇంకా అరుదే. అయినా ఆమె తండ్రి తదేక దీక్షతో శాస్త్రీయ సంగీతమునభ్యసించి గొప్పగా పేరు గాంచి, తన జ్యేష్ఠపుత్రికకు కూడా తానే గురువై సంగీత విద్యను నేర్పినాడు. ఆమె స్వరము భగవద్దత్తము. దానికి తోడూ అణుకువ మణుకువలకు ఆమె పెట్టింది పేరు. బహుశ తల్లి పెంపకము కారణమై ఉండవచ్చు. ఎంత ఎదిగినా ఓదిగియుండే మనస్తత్వము. అసలు ఒక్క మాటలో చెప్పవలెనంటే ఆమె విద్వత్తు కలిగిన నిరహంకారి. ఆమె తల్లిదండ్రులు అనగా శ్రీయుతులు సుబ్బారావు గృహలక్ష్మి గారాలు మరియు కట్టుకొన్న భర్త అన్నం అర్జున్ ధన్యులు. వైశ్యులలో, అందులోనూ కడపలో ఇటువంటి ఒక అన్ర్ఘరత్నము ఉండుట కడపకే అలంకారము.
నాకు 2017 దీపావళి తరువాతి రోజే బైపాస్ హార్ట్ సర్జరీ జరిగింది. ఆపరేషనయిన నాలుగవరోజే డాక్టరు డిశ్చార్జ్ చేసినాడు. ఆరోజు రాత్రికి ఇల్లు చేరినాను. ఈ విషయములేవీ తెలియని వాణి నాకు ఫోన్ చేసి "శివ నామావళి వ్రాయదలచినాను బాబాయి గారు ముందు ఒక నాలుగైదు నామాలు మీరు వ్రాసియిస్తే మిగతావి నేను ప్రయత్నిస్తాను" అని అన్నది. నేను నా పరిస్థితి చెబుతూ కూడా, వ్రాస్తాను అని అన్నాను, ఆమె ఎంతగానో నన్ను వారించినాకూడా! తరువాతి రోజే ఆమెకు నా రచన పంపినాను. అందు ఒక రెండు మూడు ప్రత్యేకతలు ఏమిటంటే నామావళికి పూర్వ పీఠిక ఉత్తర పీఠిక ఉంటాయి. ప్రతి నాలుగు నామాలు ఒకే అక్షరముతో మొదలౌతాయి. నిర్దుష్టముగా కష్టములేని తాళానుగుణముగా రచన పరమేశ్వరుని దయతో సాగింది. ఆమెకు చేరిన వెంటనే కంట తడి పెట్టుకొంటూ నాకు ఫోన్ చేసి అంతటి క్లిష్టమైన పరిస్థితిలో కూడా నా కొరకు వ్రాసినారా బాబాయిగారు. మీ ఋణము నేను తీర్చుకోలేనిది అయినా మీ పేరు నిలిచే విధముగా ఉడుతా భక్తిగానయినా మీ ఋణము తీర్చుకొంటాను అని అనుటయే కాక, కడపలో అందుబాటులో ఉండే ఒక మ్యూజిక్ స్టూడియో లో నేను వ్రాసిన మహాదేవు నామావళి, రెండు శాస్త్రీయ పరమైన పాటలు నేను వ్రాసిన రెండు శతకములలో తనకు ఇష్టమైన పద్యములు పాడి రికార్డు చేసి పంపించింది. అయితే ఆర్కెస్ట్రా దొరకలేదు. అందుకు నేను 'అమ్మా నీవు పాడుటయే చాలా ఎక్కువ'  అంతే చాలు అన్నాను. అందులో కొన్ని సవరణలు నేను తెలుపగా, ఆమె చేయ సంకల్పించిన తరుణములో లలిత వద్ద నుండి ఫోన్ వచ్చింది. తనను ఇంట్రడ్యూస్ చేసుకొంటూ అన్నీ రామ మోహన్ గారు వ్రాసిన పాటలతో ఒక CD తయారుచేయుటయే గాక పెళ్లిరోజు లైవ్ కాన్సర్ట్ ఇవ్వవలెనని కూడా తెలియజేసింది. నాతో తానే చేబుతాననింది లలిత. ఇక వాణి ఆనందానికి హద్దేలేదు. ఆమె ఆ CD తయారు చేయించుటకు పడిన తపన, శ్రమ అంతాయింతా కాదు. 16 పాటలు, అందులో శాస్త్రీయము, మిత శాస్త్రీయము, లలితము, దండకము ఈవిధముగా వివిధ ప్రక్రియలలో, ఆమె పాటలలో మమేకమై, పాడిన రీతిని మనసారా వింటే ఆనంద భాష్పములు రాక తప్పదు. విజేత యైన పురుషుని వెనుక స్త్రీ వుంటుంది అన్న సామెత విన్నాము గానీ, అనుక్షణము ఆమె వెనుకల తానుండి ఆమె భర్త అర్జున్ అంత జటిల కార్యమును చక్కగా పూర్తి చేయించినాడు. మద్రాసు నుండి వాద్య సహకారము తెప్పించుటలో గానీ తిరుపతి లో మంచి స్టూడియోను ఏర్పాటు చేయించుటలోగానీ, పదేపదే ఎర్రటి ఎండలో కడప తిరుపతి ఒకటిబట్టు నాలుగుమార్లు తిరిగి పని అద్భుతముగా పూర్తి చేసినారు. వెనుకనుండి లలిత నేనున్నాను మీరు సంకోచించకుండా కార్యము నెరవేర్చండి అని ఎంతగానో వత్తాసు పలుకుతూ వచ్చింది. సరియన సమయమునకు ఇటు CD పూర్తి అయ్యింది, అటు 19 రాత్రి శ్రోతలందరికీ నచ్చిన విధముగా సంగీత విభావరీ నడచినది.
తానూ సంఘములో ఒక ఉన్నతి కలిగియుండుటచే ఒక్కగా నొక్క కూతురికి వివాహము వైభవముగా జరిపించాదలచుకోంది. ఆమె మామ గారు పేరుగాంచిన డాక్టర్ అశ్వనీ కుమార్ గారు. వియ్యాలవారూ డాక్టర్లే ! మరి ఆమె భర్తకు బొత్తిగా ఆరోగ్యము సహకరించదు. కావున ఆమె ఒక్కటే ‘ఒక సూర్యుండు సమస్త జీవులకు తానోక్కొక్కడై తోచు పోలిక’ గా వివాహ కార్యక్రమము చక్కగా నడిపించింది. ఆమె పిలువకముందే మనః పూర్వకముగా పని చేయుటకు సిద్ధమయినా 100 కు పైన స్టీల్ ప్లాంట్ లో పని చేసే ఉన్నతాధి కారులు ముందుకొచ్చి తమయింటి కార్యమైనట్లు చేసినారు. పెళ్ళికి వచ్చిన నావంటి వారికి తమ తమ ఇండ్లలో గల A\C గెస్ట్ రూములనిచ్చి  ఆదరించినారు. అసలు సంగీత కార్యక్రమునకు మైక్ స్టాండ్స్ కావలసి వస్తే ఎంత కష్టపడినారో ఏమో 10 నిముసములలో సిద్ధము చేసినారు. ఇదంతా లలిత కార్య కుశలతకు, మంచితనానికీ గీటురాళ్ళు. అసలు CD కి Concert కు (ఆర్కెస్ట్రా 2 పర్యాయములు) ఎంత ఖర్చయినదో నేను చెప్పలేను.
ఇక శ్రీవాణి తన్మయతతో పాడుతూవుంటే అన్ని పాటలు ఏవిధముగా పాడినావమ్మా అని ఆమెను అడిగినవారు ఎందఱో! వీరిరువురూ ఇంతకు ఈ పనులు చేసింది, ఉత్తపుణ్యానికి నా కోసం. ఉభయులూ నాకు ఉభయ కైంకర్యము చేసినారు. మరి ఈ విషయము పంచుకోక నిమ్మకు నీరేత్తినట్లుంటే నన్ను మనిషిగా తలవ గలుగుతారా! అందుకే ఈ తపన.
ఇక్కడ నేను చెప్పదలచుకొన్నది ఒకటే మాట. వారిరువురు అంటే Dr. లలిత (Dr.) వాణి పట్టుదలతో పనిచేసి సాధించినది వారి కోసము కాదు. అనామకుడనైన నాకోసము. కలియుగములో ఇంకా,  మంచి, గౌరవము, అభిమానము, ఆప్యాయత, అంతః కరణ, ఆత్మీయత, అనురాగము, ఆర్ద్రత  అన్నీ వున్నాయి అనుటకు ఇది ఒక చక్కని నిదర్శనముగా భావించుచున్నాను. భగవంతుడు ఆ బిడ్డలిద్దరికీ  దీర్ఘ సౌమాంగళ్యమును, ఆయురారోగ్య ఐశ్వర్యములను ప్రసాదించవలెనని మనసారా పరమేశ్వరుని కోరుకొనుచున్నాను.
స్వస్తి.