మదర్స్ డే
https://cherukuramamohan.blogspot.com/2018/05/blog-post.html
దయ వుంచి ఓపికతో ఒక్క సారి ఈ వ్యాసము చదవండి. ఆరోజు ఉగాది పండుగ.
ఉగాది
సందడి ముగిసింది. తలంటి స్నానాలు. కొత్త బట్టలు. పూజలు. దేవాలయ సందర్శనాలు. బంధుమిత్రులకు శుభాభినందనలు.
మిఠాయి పంపకాలు. మృష్ఠాన్న భోజనాలు ఇంకా ఎన్నో వేడుకలు. అన్నిటినీ అనుభవించి అలసిన
నన్ను నిద్రాదేవి ఆహ్వానిస్తున్నవేళ ఒక చిన్న ఆలోచన చిగురించింది. పాశ్చాత్యులు
ఎన్నోవిధములగు DAY లు
ప్రాచుర్యమునకు తెచ్చి మనకు రుద్ధినారుకదా! వారు మనకు తెలుపక మునుపు మనము ముఖ్యము
అనుకొన్నవి మనము ఆచరించుట లేదా అని. నా ప్రశ్న దానికి జవాబుగా నా బుద్ధి యొక్క
స్పందన మీరు చదువుటకు గానూ అదే రూపములో మీముందు ఉంచుచున్నాను.
1. అమ్మ అంటే?
అమ్మ
అడిగిన వరాలిచ్చే దేవుని బొమ్మ. వేసవిలోచెట్టు నీడ అమ్మ ,
దాహార్తికి వాన మేఘమమ్మ,తీయనైన నీటి చలమ అమ్మ,
ఇంటి వెలుగు అమ్మ, కంటి చూపు అమ్మ. అసలింటికి
పట్టుకొమ్మ అమ్మ, అందుకే ఆమెను మనకిచ్చింది బ్రహ్మ.
అమ్మ
తల్లి మాత జనని అన్న ఎన్నో ప్రతినామాలు ఉన్నాయిఅమ్మకు. అమ్మ అనే పదము ఓం నుండి
వచ్చిందని పెద్దలంటారు. మనము అంకాళమ్మ, ఎల్లమ్మ,
మల్లమ్మ అని దేవతలకు అమ్మను చేరుస్తాము. తల్లిని అమ్మ అంటాము.
సమాజములు స్త్రీని అమ్మ అని పిలుచుట మన సాంప్రదాయము. దీనిని బట్టే అమ్మ అన్న మాట
ఎంత పవిత్రమైనదో మనకు తెలుస్తుంది. మాతృ శబ్దము నుండి మాత అంటే అమ్మ
అన్న శబ్దము వచ్చిందని అందరికీ తెలిసిన విషయమే! మాతృ శబ్దమమునుండినే లాటిన్ లోని matter,
మితెర (గ్రీక్) మదర్ అన్న శబ్దాలు వచ్చినాయి. అంటే పురాతన నాగరికత
గా చేప్పుకునే గ్రీకు అరబ్బీ,జర్మన్(mutter) డచ్ (moeder) ఈ
భాషలే కాకుండా అనేకమైన భాషలలో మాతర్ అన్న సంస్కృత శబ్దాన్నే కృతకము చేసి తల్లికి
ప్రత్యామ్నాయముగా వాడుకుంటారు.
కావున
ప్రపంచము లోని భాషలకు సంస్కృతము మాతృక , ప్రపంచములోని
తల్లులకు మన 'మాత' యే మాతృక. అదే
విధంగా పితృ, భ్రాతృ, దుహితర్ అను
సంస్కృత శబ్దాలనుండి పుట్టినవే father, brother, daughter
మొదలగునవి. మాత అన్న శబ్దము కూడా ఆ పరాశక్తి అమ్మకు వాడుతాము .
దీనిని బట్టే అమ్మ అన్న మాట యొక్క ప్రాశస్త్యము మనకు తెలుస్తుంది. ఇది ఇంకొక
విషయము కూడా తెలుపుతుంది, అది ఏమిటంటే
మన సంస్కృతి ఎంత ప్రాచీనమైనది అన్నది పాశ్చాత్య నాగరికత ఎంత నవీనము అన్నది.
2. మరి అమ్మ అన్న శబ్దమునకు ఇంత మహత్తు ఉన్నదికదా మనము 'మదర్స్ డే' రోజున మాత్రమె తల్లిని తలచుకొనవలెనా?
ఫాదర్స్ డే రోజే తండ్రిని తలచుకోవలేనా?
ఈ మాటకు జవాబు
చెప్పేముందు పండుగ అన్న మాటను గూర్చి చెప్పుకుందాము. మనము ఇంకా కాస్త
ముచ్చటించుకున్నా తరువాత ఈ 'మదర్స్ డే'
గూర్చి చెబుతాను.
మనము మన సనాతన ధర్మములో ఆచరించే ఈ పండగలన్నింటికీ చారిత్రక, పౌరాణిక కారణాలు ఏమైనప్పటికీ…నా అభిప్రాయములో…మూల కారణము (Central
Point) చెడుపై మంచి
సాధించిన విజయాన్ని సంబరంగా జరుపుకోవటమే.
మనకు అకారణమైన పండుగలు వుండవు. పాశ్చాత్యులకు సకారణమైన పండుగ ఒక్కటీ
లేనట్లు. వాళ్ళు అతి గొప్పవనుకొనే పండుగలు కూడా, పాత
పుస్తకాలపై కొత్త లేబుళ్ల లాంటివే! మిగిలినవన్నీ దివసాలే ! దివసము అంటే దినము అని
అర్థము (Day) అది వాస్తవమే. వానిని తద్దినాలు అనికూడా అనవచ్చు. తప్పుగా అనుకోవద్దు.
తత్+దినము అంటే ఆ రోజు అని అర్థము .అది అమ్మ రోజు కావచ్చు నాన్న రోజు కావచ్చు మరే రోజైనా
కావచ్చు. కానీ మన సాంప్రదాయమదికాదు. కాలే వత్తిని కాస్త ఎగ దోస్తాము ఎందుకంటే అది
ఇంకా బాగా మండాలని. అంటే మన అన్ని పండగల సారాంశము ఒకటే కాబట్టి మనలో వుండే మంచిని
మళ్ళీమళ్ళీ ఉత్తేజితము చేస్తాము. పెద్దలైన తలిదండ్రులు గతించిన తరువాత కూడా వారు
గతించిన దినమును గుర్తుంచుకొని మరీ జ్ఞాపకార్థము పేదలకు అన్నము పెట్టుట, బ్రాహ్మణునికి దానము చేయుట మొదలైనవి చేసి తృప్తి
చెందుతాము. పాశ్చాత్య సంస్కృతికి మన సంస్కృతికి హస్తిమశకాంతరము, పర్వత పరమాణు సారూప్యము మరియు అజగజ సామ్యము. వాళ్ళ పద్ధతికి మన పద్ధతికి
పండుగకు తద్దినానినికి ఉన్నంత తేడా వుంది.
3.స్త్రీలకూ పాశ్చాత్యులు అమిత గౌరవమునిచ్చినారని చెబుతారు. దానిని
గూర్చి కాస్త తెలుపుతారా?
దాదాపు 13 వ శతాబ్దపు చివరి వరకు నాగరికత లేని ఆ జాతికి
పెళ్లి అన్నది ,నేటికి
కూడా,ఆడామగా సంబంధము. అదే మనకు రెండు కుటుంబాల అనుబంధము.
వారిది సంబంధమే కాబట్టి ఈ రోజు ఒకరితో వుంటే రేపు వీనికి లేక ఆమెకు విడాకులిచ్చి
వేరొకరితో సంబధం ఏర్పరచు కొంటారు . విడాకులు అన్న మాట మనకు కూడా ఉన్నదే అని
ఆశ్చర్య పడవద్దు. 'ఆకు' అనే మాటకు 'కాగితము' అన్న అర్థము ఒకటుంది. 'విడి' అంటే విడిపోవుటకు అని అర్థము. ఈ పదము 'divorce papers' అన్న
మాటకు అనువాదార్థకముగా వచ్చినది. మన సాంప్రదాయములలోని పెళ్లి మంత్రములలో ఈ
ప్రస్తాపన ఎక్కడా రాదు. ఇక పెళ్లి చేసుకొన్నా దంపతులు అదృష్ట వశాన రెండు మూడేళ్ళు
వుంటే వారికి సంతానము కలిగితే ఎవరితో వుండేది ముందే వ్రాసుకొంటారు లేకుంటే ఆ
పిల్లలకు అనాధాశ్రయమే గతి. ఆమె వేరోకనితో పెళ్లి చేసుకొంటే అతడు ఆమె పిల్లలకు 'అంకులు'. ఆ మగ వాని పిల్లలకు ఆమె 'ఆంటి'. ఇట్లా స్వంత తల్లి దగ్గర లేని వాళ్ళు mothers' day రోజు
వాళ్ళ అమ్మను కలిస్తే లేక వాళ్ళ అమ్మ వాళ్ళను కలిస్తే వారు కలిసి భోంచేస్తారు.
తరువాత ఎవరి దోవ వారిది. ఇది MOTHERS' DAY. ఆలాగే Fathers' Day కూడా.
మిగతవన్నీ మతాకర్షణ మారణాయుధాలు.
PALTO పాశ్చాత్యుల
మహా పురుషుడు. ఆయన 'THE REPUBLIC' 'THE
LAWS' అన్న రెండు
పుస్తకాలు వ్రాసినాడు. ఆ వ్రాతలు వారికి శిరోధార్యములు. ఆయన గారి 'THE REPUBLIC' లో 'స్త్రీ' కి ఆత్మ వుండదు. అది పురుషునిలో మాత్రమె ఉంటుందని నుడివినారు. అనగా
స్త్రీ కేవలము ఒక వస్తువుతో సమానము. ఇది ఆయన వచనము లోని తాత్పర్యము. వారే తమ 'THE LAWS'అను పుస్తకములో స్త్రీ కి ఆత్మ లేనందున
ఆమెకు ఆత్మానాత్మ విచారణ కలుగదన్నారు. అందువల్ల స్త్రీ కి న్యాయస్థానములో
సాక్ష్యము నిచ్చు అర్హత లేదు.
ఇంచుమించు 14 వ శతాబ్దము వరకు ఓటు హక్కు వారికి లేదు ఎందుకంటే
వారికి ఆత్మా లేదు కావున. ఇటువంటి అసమానతలు ఎన్నో కలిగి యుండిన ఈ ప్రథ ఇంచుమించుగా 1950 వరకు ఐరోపా
దేశాలలో ఉండినదని విన్నాను. వారు '50 వరకు బ్యాంకులలో ఖాతా ప్రారభించుటకు కూడా
అనర్హులు. ఒకవేళ భర్త భార్యను వదిలిపెడితే ఆమెను 'మంత్రగత్తె'(डायन,Witch) గా
పరిగణించేవారు. అటువంటి ఆడవారిని అమిత క్రూరముగా కాల్చి చంపిన ఉదంతములు వేనకు
వేలు. వ్యభిచారము విచ్చలవిడిగా వుండేది. కన్న బిడ్డలను కాన్వెంట్ల వద్ద (అంటే
సన్యాసినుల మఠము)(మనము బడి కి ప్రత్యామ్నాయముగా వాడే కాన్వెంటుకు ఆ అర్థము ఆంగ్ల
నిఘంటువులో దొరకదు. అది కూడా తెలుసుకోకుండా మన పిల్లలను కాన్వెంటు కు
పంపుచున్నాము) దిగ విడిచి పోయేవారు. వ్యభిచార నేరము కోర్టులో విచారణ జరిగితే
ఆడవారి సాక్ష్యములు అంగీకరింప బడేవి కావు.
దాదాపు 200 వందల సంవత్సరాల చరిత్రలో ఇంతవరకు ఒక్క స్త్రీ
కూడా ఆమెరికాలో ప్రసిడెంటు కాలేదు. ఈ సారి Hillary
Clinton కు పోటీ చేయుటకు అవకాశము వచ్చింది. ఆమె గెలువగలిగితే మొదటి US
President అవుతుంది.
అటువంటి సమయములో ఫ్రాన్సు కు చెందిన 'Simone de Beauvoir' 1949 లో 'The Second Sex'
(a detailed analysis of women's oppression and a foundational tract of
contemporary feminism) అన్న విశ్లేషణ గ్రంథము ఫ్రాన్స్ లో మహిళా
చైతన్యమును తీసుకు రాగలిగినది. తన 14 వ ఏటి వరకు
తీవ్ర మత ఛాందసత కల్గిన'కాథలి' క్కయిన ఆవిడ మతమును వదలి మానవతను అవలంబించి'jean-Paul-Sartre' తో అవివాహితగా కాలం గడిపినా స్త్రీ స్వాతంత్ర్యము కొరకు
మిక్కుటముగా శ్రమించినది. ఆతనుకూడా ఆమెకు చేదోడు వాదోడు గా ఉండినాడు. ఆ ఉద్యమము
ఐరోపా ఖండములో చెప్పుకోదగిన చైతన్యమును తెచ్చింది.
ఇక్కడ ఒక్క మాట చెబుతాను. పాశ్చాత్య నాగరికత తెరచిన అరచేయి లాంటిది.
వాళ్ళకు చెప్ప గలిగినవి చెప్ప కూడనివి, చేయ గలిగినవి చేయ కూడనివి అన్న తారతమ్యము వుండదు.అది వాళ్ళ
నాగరీకత. మనది సంస్కృతి వారిది నాగరికత. ఇది బహు చక్కని మాట. ఇక కమునిష్టు దేశాలది ముడిచిన అరచేయి. వారిది 'గవి లో మాయ'అంటే లోపల ఏముందో
ఏమి జరుగుతూందో ఎవరికీ తెలియదు. మన సంస్కృతి 'గోకర్ణము' లాంటిది. అనగా ఆవు చెవి లాంటిది. మనము తీర్థము తీసుకోనేట్లుంటే
చూపుడు వ్రేలుకు మధ్య వ్రేలుకు నడుమన బొటన వ్రేలును దూర్చి తీర్థము తీసుకొనవలెను.
అది ఆవు చెవి ఆకారాన్ని కలిగియుంటుంది. అంటే సగము మూసి సగము తెరిచి వుంటుంది చేయి.
కావున చెప్పగలిగినవి చెప్పకూడనివి అన్న విచక్షణ కలిగి యుంటాము. 'మధ్యేమార్గము మంచి మార్గము''అతి
సర్వత్ర వర్జ్యేత్' అన్న నానుడులు
మనము ఆచరణలో పెట్టే వారము. మనసు మాటలో మాట చేత లో ప్రతిఫలించ వలెనన్న 'త్రికరణ శుధ్ధి' ఇచట ప్రతిబింబించు చున్నది కదా! మరి మన
సంస్కృతిని విస్మరించ నగునా!
మంచిని ఎక్కడ వున్నా గ్రహించ వలసిందే. కానీ దానికి విచక్షణ అవసరము
కదా! ఇక్కడ ఇంకొక చిన్న విషయాన్ని వివరించ దలచు కొన్నాను. ఎవరో సహనము పాటించుట
తప్పు కాదు కదా! అన్న అబిప్రాయమును వ్యక్తము చేసినారు. మన దేశపు ఇప్పటి పరిస్థితిని
ఒక మధుమేహ రోగితో(మోసాలు ద్రోహాలు, మానభంగాలు, కుళ్ళు,కుట్ర మొదలగు విషయముల
కలగా పులగమే ఈ మధు మేహము) పోల్చవచ్చు. మొదలే తాను తనను వదలని వ్యాధితో బాధపడుతూ
వుంటే కాలికి దెబ్బ తగిలితే ఏమి చేయాలి. సహనము మాత్రం పాటించే వీలు లేదు.
పాటించితే కాలే తీసివేయ వలసి రావచ్చు. 'యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః
--యత్రైతాస్తు అపూజ్యన్తే తత్రైతాస్తఫలాక్రియాః' అనిచెప్పిన
దేశమునకు, తమతమ దేశములలోని 'Red Light
Area' లలో 'జాగ్రత్త మీరు మీ బిడ్డ వద్దకు వెళ్ళుట లేదు కదా'(ఆ విధంగా ఆ దేశాలలోని ఆ ప్రాంతాలలో వ్రాసి యుంచుతారని విన్నాను) అని
వ్రాసుకొనే దేశాలతో పోలిక ఎక్కడ?
ఇక ఈ విషయాలు కాస్త గమనించండి.
4. వివాహము విడాకులు ను గూర్చి కాస్త తెలుపుతారా?
1. విడాకులు:
జనాభా
పెరిగే కొద్దీ మనస్తత్వాలు కూడా ఒకరికొకరికి సంబంధము లేనంత ఎక్కువౌతాయి. 'పుర్రె కొక బుద్ది జిహ్వ కొక రుచి' అన్నారు పెద్దలు. 'లోకో భిన్న రుచి' అన్నది ఆర్య వాక్కు. రెండు
వస్తువుల మధ్య కరుకుదనము ఎక్కువైతే రాపిడి కూడా అధికముగా వుంటుంది. ఈ సూత్రము
జీవితానికి ఎంతో అన్వయించుతుంది. కరుకు దనానికి నునుపు దనము తోడైతే రాపిడి
తగ్గుతుంది. అసలు ఇంకొక విషయం. చిన్నవయసులో అబ్బాయికి అమ్మాయికి పెళ్లి జరిగిందను
కొందాము. వారు ఆటపాటల్లో ఒకరి నొకరు అర్థము చేసుకొంటూ ఏంతో ఆనందంగా జీవితాన్ని
గడిపి వేస్తారు. కాలము మారింది. పరిస్థితులు మారినాయి. పరదేశ వాసనలు పెరిగినాయి.
సంపాదనలోనే సర్వస్వ మున్నదన్న అపోహ ప్రబలిపోయింది. అన్నిటికీ మించి పెరిగే వయసుతో
ఏర్పడిన స్థిరాభిప్రాయలతో 26-30 సంవత్సరాలమధ్య పెళ్ళిళ్ళు జరిగి తమ గ్రాహ్యత(perception ) మార్చుకోలేక ఎన్నో పెళ్ళిళ్ళు
పెడాకు లౌతున్నాయి. సర్దుబాటు తనము తగ్గిపోయింది. భార్య భర్తను గానీ భర్త భార్యను
గానీ తన వైపు మార్చుకోవాలన్న తపన తగ్గిపోయింది. సర్దుబాటు తనమే 'క్షమ'(tolerance )అంటే తాలిమి. అది ఇప్పుడు మనలో వుందా. పెద్దలు 'తాలిమి తనను గాయు ఎదుటి వారిని
గాయు' అని చెప్పినారు. రామాయణము బాలకాండ 33వ సర్గలో కుశ నాభుడు తన
కుమార్తెలకు ఇట్లు చెబుతాడు 'అమ్మా మీరు క్షమ లో దేవతలనే
మించినారు' అని చెబుతూ ఈ క్రింది శ్లోకాలను చెబుతాడు.
'అలంకారోహి నారీణాం క్షమాతు పురుషస్యవ
దుష్కరం తచ్చయత్ క్షాంతం త్రిదసేషు విశేషతః '
యాదృశీ వః క్షమా పుత్రః సర్వాసా మవిసేషితః
క్షమా
దానం క్షమా యజ్ఞః క్షమా సత్యం హి పుత్రికాః''
క్షమా
యశః క్షమా ధర్మః క్షమయా నిష్ఠితాం జగత్' ఈ 2 1\2 శ్లోకాల సారాంశము ఓర్పు అనగా
క్షమా అధికంగా కలిగి యుండటమే . విడి పోవుటకు మూల కారణము ఆవేశము. అదే అన్ని
అనర్థాలకు మూలము. విడిపోయిన తరువాత అంతా బాగుంటుందని ఎవరైనా చెప్పగలుగుతారా. రెండు
వైపులా పెద్దలు ఒక తటస్తమైన మంచి మనసు కలిగిన మధ్య్వర్తితో చర్చలకు కూర్చుంటే మంచి
ఫలితము రాదా. ‘శతకోటి దరిద్రాలకు అనంతకోటి వుపాయాలంటారు పెద్దలు.'మనసుంటే మార్గ మదే కనిపిస్తుంది.
నిలకడ లేని ఆకుకు కంప చేట్టే గతి. ఆకు ఆడ గానీ మగ గానీ.
ప్రజాస్వామిక ప్రభుత్వాలు వచ్చిన తరువాత, కంపూటర్లు వచ్చిన తరువాత, విదేశీ సంస్కృతులు విరివిగా
దిగుమతి చేసుకొన్న తరువాత విడాకులు విచ్చలవిడి అయినాయి గానీ, అంతకు ముందు ఈ సమస్యలు అరుదుగా
తలెత్తినా ఇంటి గడప కే పరిమిత మయ్యేవి.
అసలు
భారతీయ సాంప్రదాయ బద్ధమైన ‘వివాహం’ అన్న శబ్దానికి వ్యుత్పత్తిని గమనించండి.
సంస్కృతంలో 'వహ్' అనే ధాతువుకు 'వి' అనే
ఉపసర్గను 'ఘఞ్' అనే ప్రత్యయాన్ని చేరిస్తే వి+వహ్+ఘఞ్ =
వివాహః అనే పదం ఏర్పడింది. దీనికి అర్ధం విశేష ప్రావణం అనగా విశేషమైన
(ప్రత్యేకమైన) సమర్పణం. ఈ పదానికి అనేక పర్యాయ పదాలున్నాయి. పరిణయం, ఉద్వాహం, కల్యాణం, పాణిగ్రహణం, పాణిపీడనం, పాణిబంభం, దారోప
సంగ్రహణం, దార పరిగ్రాహం, దారకర్మ, దారక్రియ మొదలైనవి.
ఇయం సీతా మమ సుతా సహ
ధర్మచరీ తవ |ప్రతీచ్ఛ చ ఏనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా |
పతివ్రతా మహభాగా
ఛాయే వానుగతా సదా ||ఈ శ్లోకం, జనకుడు రాముని చేతిలో మంత్రజలం విడుస్తూ చెప్పింది.
పై శ్లోకమునకు అర్ధం -
'ఇయం సీత' ఇదిగో సీత. నా పుత్రిక. "కౌసల్యానంద వర్ధనా! రామా! . ఈమె నీకు
సహధర్మచారిణి. ఈమె నంగీకరించి పాణి గ్రహణం చెయ్యి. పతివ్రత అయిన మా సీత
నిన్నెప్పుడూ నీడలాగ అనుసరిస్తుంది" అని చెప్పినాడు. ఎంతటి గొప్ప మాటనో
చూడండి. నీడ
వస్తువును వెన్నంటియే వుంటుంది. ఇంతటి సంస్కారముతో కూడిన భావములు వేరు ఏ మతముల
కల్యాణము లందును కనిపించవు. అవి కేవలము ఆడ మగవారి మధ్య వడంబడికలే! అందుకే వారికి DIVORCE , تالق (TALAQ) వున్నాయి. మనది రెండు కుటుంబముల బంధము.
ఒకరి కొకరై తమ మధ్యన ఎటువంటి పొరపొచ్చులు వచ్చినా ఇరు పార్శ్వముల వారు ఒకచోట చేరి
సదవగాహన సాధించి ఒక్కటి యగుటయే తమ ధ్యేయముగా కలిగి మంతనాలు సాగిస్తారు.
అటువంటప్పుడు విడాకులు పొడాకులై కొట్టుకు పోతాయి గాలికి.
కళ్యాణ
సమయములోని ఈ మంత్రమును వినండి.
విశ్వంభర
స్సర్వ భూతా సాక్షిణ్య స్సర్వదేవతా
ఇమాం
కన్యాం ప్రదాస్యామి పితౄణాం తారణాయవై
బ్రహ్మాదులు, సర్వ భూతములు, సర్వ దేవతల సాక్షిగా నా కన్యను స్వీకరించి మన ఇరు వర్గముల పితృ దేవతలను
తరింప జేయుము.
ఇంకొక
అతి ముఖ్యమైన మంత్రము గమనించండి.
అష్టాదశ
వర్షాత్కన్య పుత్రవత్ పాలితా మయా
ఇదానీం
తవ దాస్యామి దత్తం స్నేహేన పాలయా
'ఓ వర రత్నమా 18 సంవత్సరముల, కుమారునిగా పెంచబడిన, నా బాలికను నీకు దాసిగా
సమర్పిస్తున్నాను. ఆమెను నీవు స్నేహితురాలిగా చూసుకొనేది' అని బాలిక తండ్రి వరునితో
చెబుతాడు. అంటే భార్య దాసి కాదు అన్నది మనము అర్థము చేసుకొనవలసిన విషయము. ఈ విషయము
గమనించండి, కన్యా దాత
వరుని ఎంత నిర్దుష్టముగా నిర్మొహమాటముగా అడిగి అతని సమ్మతిని పొందుతాడో చూడండి.
కన్యాదాత :
"ధర్మేత్వయా ఏషానాతి చరితవ్య"
ధర్మాచరణమున నీవు ఈమెను అతిక్రమించి చరింపరాదు.
వరుడు : "నాతిచరామి". అతిక్రమించి చరించను
క.దా : "అర్ధేత్వయా ఏషానాతి చరితవ్య" అర్ధార్జనమున నీవు
ఈమెను
అతిక్రమించి చరించరాదు.
వ. : "నాతిచరామి"
క. దా : "కామేత్వయా ఏషా నాతి చరితవ్య"
కామాచరణమున ఈమెను అతిక్రమించి చరింపరాదు.
వ. : "నాతిచరామి"
ఇక సంస్కృతములో
మంత్రాలు చెబుతారు అంటే అందులో ప్రతియొక్క మాట ఒక హిత వాక్యము తప్పితే వేరేమీ
ఉండదు. అందులోని మంత్రములను ఉదాత్త, అనుదాత్త, స్వరితములను
స్థాయీ భేదములతో ఉచ్చరించుట వలన మంత్రము పరిపుష్టి చెంది యా మంత్ర ఫలమును
అందజేస్తుంది. ఇది నేటి SCIENCE కూడా నిరూపించిన వాస్తవము. ఇటువంటి కొన్ని విషయములు తులసి, తులసీదళము అన్న ఎండమూరి వీరేంద్రనాథ్ నవలలు చదివితే కూడా తెలియవచ్చు. అసలు
సంస్కృతము లేకుంటే సంస్కృతి లేదు మనము లేము అన్న వాస్తవాన్ని కలకాలమూ
గుర్తుంచుకొనుట మనకు మన దేశ ప్రతిష్ఠకు ఎంతో ఆవశ్యకము.
ఇల్లాలు యొక్క
ప్రాశస్త్యము ఎంత గొప్పగా విశధీకరించినారో మన పూర్వులు గమనించండి.
కార్యేషు దాసీ
కరణేషు మంత్రీ
రూపేచ లక్ష్మి
క్షమయా ధరిత్రి
భోజ్యేషు మాతా
శయనేషు రంభా
షట్కర్మయుక్తా
సహధర్మ పత్ని
అన్నారు. ఎక్కడా
స్త్రీ ని మన పూర్వులు అగౌరవ పరచినది కానరాదు.
నీకు
ఒక దాసిలా అన్ని పనులకు నా బిడ్డ చేదోడు వాదోడుగా వుంటుంది, ఆమెను స్నేహితురాలిగా చూసుకో అన్న ఈ మాట ఎంత గొప్ప మాటో చూడండి. నీకు దాసీ గా ఇస్తున్నా, నీవు
స్నేహితురాలిగా చూసుకొనవలెను సుమా అంటున్నాడు. అది ఒకరికొకరు మమేక మైనపుడే
సాధ్యమౌతుంది. అంటే ఆ విధముగా మీరు పాలూ నీరుగా కలిసి వుండండి అని చెబుతున్నాడు
తండ్రి. ప్రపంచములోని ప్రబల మతములలో ఇటువంటి సూక్తులను వివాహక్రియ లో చూడలేరు.
వారు కలిగిన అమానుషాచారములు ఈ ధర్మమున ఆవగింజంత యైనను
కానరావు. కావున పరమత పరాయణత్వమును మాని , ఆర్ష ధర్మావలంబులై జీవితమును కొనసాగించి
కష్టములను ఎదుర్కొని పారద్రోలగల్గు శక్తిని కల్గి ఆలూ మగలు సుఖముగా జీవించ గలుగు
మార్గము ఈ ధర్మమున మాత్రమె ఉన్నదని నా గట్టి నమ్మకము. ఇట్టి వివాహ బంధము
జీవితమునకు అందము ఆనందము మధుర మకరందము.
*******************************************************************************
మదర్స్ డే ఫాదర్స్
డే -- 8
5. మరి స్త్రీలకు మన శాస్త్రములందు గౌరవ మివ్వ బడినదా?
స్త్రీ గౌరవము
జీవితములోని
వివిధ సందర్భములలో వివిధ పరిమాణములు గల గౌరవము స్త్రీల కంగీకరింపబడినట్లే వివిధ
పదవులలో నుండు స్త్రీలకు గూడ వివిధ పరిమాణములు గల గౌరవ మంగీకరింప బడినవి. అనగా
తల్లి కొక విధమగు గౌరవమును, భార్య కొక విధమగు గౌరవమును, కూతున కొకవిధమగు గౌరవమును
వితంతువున కొక విధమగు గౌరవమును ఇట్లే యొక్కొక స్థానములో నున్న స్త్రీ కొకవిధమగు
గౌరవమును నంగీకరింపబడినవి. అందందఱికంటె మాతకు చూపబడిన గౌరవము సర్వాధికమై
యొప్పుచున్నది. తల్లి, తండ్రి, గురువునను మువ్వురు పైనను భక్తి గల్గి యుండుట
పరమధర్మము.
ఇమంలోకంమాతృభక్త్యా పితృభక్త్యాతుమధ్యమం
గురుశుశ్రూషయాత్వేవ బ్రహ్మలోకం సమశ్నుతే
(మను 2-233)
(ఈలోకమును మాతృ భక్తి చేతను మధ్యమ లోకమును పితృ భక్తి చేతను బ్రహ్మలోకమును
గురు శుశ్రూష చేతను పొంద వచ్చును.)
మాతా మాతామహీ గుర్వీ పితృ మాతృష్వసార్దయః:
శ్వశ్రూ: పితామహి జ్యేష్ఠా జ్ఞాతవ్యా
గురప:స్త్రియ:
(ఉశన: 1-26)
(తల్లి, మాతామహి, గురుభార్య తలిదండ్రుల యక్క చెల్లెండ్రు, అత్తగారు,
నాయనమ్మ, అక్క-అను స్త్రీలు గురువులు)
ఆడపడుచులకు గూడ గృహములో గొప్ప గౌరవ మీయబడినది.
జామయోయా నిగేహాని శవంత్యవ్రతపూజితా:
తానికృత్యాహ తానీవ వినశ్యన్తి నమంతత:
(మను. 3-58)
(ఎవరి యక్క చెల్లెండ్రు పూజింపబడని వారై శపింతురో
వారిగృహములు దయ్యము చేత కొట్టబడినవివలె నశించును)
సౌభాగ్యవంతురాండ్రగు నింటి యాడపడుచులకును గర్భిణులకును నతిథులకు కంటెనుగూడ
ముందుగ భోజనము పెట్టవలెను.
సువాసినీ: కుమారీశ్చరోగిణో గర్భిణీస్త్రియ:
అతిథిభ్యోగ్రఏవైతాన్ భోజయేదవిచారయన్.
(మను. 3-114)
సాధారణముగ స్త్రీలందఱును పూజింపతగినవారే.
భర్తృభ్రాతృపితృ జ్ఞాతిశ్వశ్రూశ్వశురదేవరై:
బంధుభిశ్చస్త్రియ: పూజ్యాభూషణాచ్ఛాదనాశనై:
(యాజ్ఞ. 1-88)
(భర్తలు, భ్రాతలు, తండ్రులు, జ్ఞాతులు, మామలు,
అత్తలు, మఱదులు, బంధువులు
గూడ స్త్రీలను భూషణములతోను, భోజనములతోను, వస్త్రములతోను పూజింపవలెను.)
'పాణిగ్రహణాద్ధి సహత్వం సర్వకర్మను,
(ఆ.ధ.2-14-17)
(పాణిగ్రహణమువలన స్త్రీకి కర్మలలో
పురుషునితో సహత్వము కల్గుచున్నది.) అని చెప్పుటచేత పురుషుడే కర్మ చేసినను దానిని
భార్యకూడ చేయుచున్నట్లే యర్థము. ఆమెకొన్ని కర్మలలో పాల్గొనవలసికూడ నుండును.
అంతేకాదు, కొన్నిటిలో నామె వేదమంత్రములనుగూడ నుచ్చరింపవలసి
యుండును.
మరి ఎక్కడ
స్త్రీలకు గౌరవమివ్వలేదో చూడండి. పాశ్చాత్యులు కానీ వారి అనుయాయులుకానీ మన
గ్రంధాలను అందుబాటులోనికి రానిక, మన జ్ఞాన
గృహమును అంధకార బంధురము జేసినారు. మనము కుటుంబ బాధ్యతలతోనో, డబ్బు
సంపాదించవలెనను తపన తోనో , వీటిని గూర్చి తెలుసుకొనక ,
మనలను తప్పుదారి పట్టించే ప్రచ్రనలను చదువుతూ గతి తప్పినాము. మనలను పెడత్రోవ
పట్టించు రచనలు చేయుటకు అటువంటి రచనలు చేసే వారికి డబ్బిచ్చి ప్రోత్సహించి మరీ
వ్రాయించుకొనుచున్నారు. ఆ వసతి ఈ ధర్మములో లేదు. ఏది చేసినా మనఃపూర్వకముగానే
చేస్తాము. ప్రలోభాలకు లొంగి కాదు. ఈ విషయమును ఒక సారి గమనించండి:
6.మరి మన శాస్త్రాలలో 'న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి' అని అంటారు కదా నిజ
మెంత?
'న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి'
ఈ వాక్యము యొక్క పూర్తి పాఠము ఈ విధముగా వున్నది
'పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవ్వనే
పుత్రస్తు స్తావిరే భావే న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి'
ప్రకృతి
సిద్ధమైన వాస్తవమేమిటంటే ఆడ మగల శారీరిక గుణ గణములు ఒకటి కాదు. ముదిమి మీద పడిన
తరువాత ఒక జంటను గమనించితే భర్త భార్య కన్నా పెద్దవాడై యుండి కూడా ఆమెను తాను చేయి
పట్టుకొని, అవసరమైనప్పుడు, నడిపిస్తుంటాడు.
కొడుకులు,ఆ కాలములో అధికముగా నీతి వర్తనులుండే
వాళ్ళు(రావణుడు,దుర్యోధనుడు మొదలగు వారంతా కూడా తల్లిని దేవత
గానే భావించి పూజించినారు. ) తల్లి విషయములో తప్పుడు పనులు చేయలేదు. ఆ తల్లులు
తనయుల సంరక్షణలో సంతోషంగా వుండినారు. ఇపుడు అసలు విషయానికి వస్తాము. నేటి కాలములో
కూడా interview,
college seat securing,మొదలగు విషయాలకు
తండ్రులు పిల్లల వెంట పోవుచున్నారు. భార్యా భర్త సినిమాకు పొతే సాధారణంగా భర్త
భార్య వెనకాలవుంటాడు. పురాణెతిహాసములలో ఎక్కడా స్త్రీలు మేము అస్వతంత్రులము అని
చెప్పలేదు. 'న
స్త్రీ స్వాతంత్ర్యమర్హతి.’ అనే
మాటను విచక్షణతో ఆలోచించితే, వారికి భగవంతుడొసగిన శారీరికాకర్షణలు సమాజములో
తెచ్చిపెట్టే ఇబ్బందుల నుండి తప్పించ వలెనంటే రక్షణ కావలెను కావున వారు
విచ్చలవిడిగా సంచరించ కూడదన్న అర్థములో 'న స్వాతంత్ర్యం' అని వాడినారు గానీ అన్యధా కాదు.'పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవ్వనే' పెళ్లి అయ్యే వరకు తండ్రి పిమ్మట భర్త, ఆపై 'పుత్రస్తు స్తావిరే భావే’ అంటే
వయసుడిగి కదలలేని తనము వచ్చినప్పుడు, ఆమె భర్త అంతకన్నా ముసలివాడై ఉంటాడు , లేక గతించి కూడా ఉండవచ్చును. కావున 'పుత్రః' కొడుకుల తోడ వద్దా! మరి తోడుంటే స్వాతంత్రము లేదు అనేనా అర్థము!. ఇప్పుడు ఈ శ్లోకము
స్త్రీలకూ తగునో తగదో మీరే నిర్ణయించుకోండి. ఇప్పుడు వాడే ‘స్వాతంత్ర్యము’ అన్న
పదమునకు అర్థము మారి పోయింది. స్వతంత్రము అన్న పేరుతో తమ పుత్రికలు విచ్చలవిడిగా , నియమ రహితముగా తిరిగితే నిజమైన తండ్రి ఊరుకోగలడా! తండ్రికి వయసు మీరితే ఆ బాధ్యత అన్న దమ్ములు
తీసుకోరా! పెళ్లి అయిన తరువాత భార్య (భరింప బడునది)కు రక్షణ చేసే బాధ్యత భర్త
(భరించువాడు) ది కాదా!
విశృంఖలముగా, విచ్చలవిడిగా వీధులు బట్టి తిరుగుతఎనా స్వాతంత్ర్యము. Software సంస్థలలో సాయంకాలము,
రాత్రి సమయములలో పనిచేసే స్త్రీ పురుషులలో కొందఱు Office Spouse అన్న దగ్గరితనమును గలిగి యుంటారని ఒక వినికిడి. నిజానిజములు మనకు తెలియనివి.
దీనిని స్త్రీ స్వాతంత్ర్యము అనగలమా!
పూర్వము భర్త భార్యను వశేన్ వశిని అని పిలిచేవారు. అర్థము తెలియక 'ఒశేవ్' 'వాశినీ...’అన్న
అసభ్య అర్థములకు అవకాశాన్ని కలిగించినారు కొందరు. అసలు 'వశేన్' 'వశిని' అంటే అది అమ్మవారి
పేరని, లక్ష్మి యన్న అర్థము
వున్నదని నేను నా బాల్యములో
గొప్ప పండితులైన పెద్దవారు చెప్పగా విన్నాను.
ఈ సందర్భములో ఒక సామెత చెబుతాను. " కాశీ పాత్ర విక్రయితి, కాంఛీ పాత్ర విక్రయితి, తిరుపతి
మానిముంత నిశ్చయితి" అన్నది నా సామెత. యాత్రకు పోతే పాత్ర తేవలె నన్నది నాటి
ఆచారము. బహుశ ఆ యాత్ర జ్ఞాపికగా ఉండవచ్చు. ఒక పేద బ్రాహ్మడు కాశీకి, కంచికి పోయినపుడు, ఒక్కొక్క ఇత్తడి పాత్ర
తెచ్చినాడట. ఆ కాలములో తిరుపతిలో మాత్రమె మాని ముంతలని ఎర్ర చందనముతో చిప్పలు,
అబక కర్రలు ( కొయ్య గరిటెలు) బొమ్మలు తయారుచేసేవారు. తిరుపతి యాత్ర
వెళ్ళిన వారు ఆ సామాను కొనటము కద్దు. ఆ బ్రాహ్మడు ఇల్లు జరగక ఇత్తడి పాత్రలను
అమ్ముకున్నాడుగానీ తిరుపతి మానిముంతలు మాత్రము అమ్ముడు పోక తానె నిలుపుకున్నాడు .
అందుకు అతడు బాధతో పై మాటలు అన్నాడు. మనము కూడా ఆవిధమైన లోహ పాత్రలవంటి కలకాలము
విలువగలిగిన మాటలను వదిలి పెట్టి మానిముంతలవంటి విరిగి,పగిలి,
కాలిపోయే సరుకును పట్టుకున్నాము, పెట్టుకున్నాము.
( పై మాట సందర్భానుసారముగా తీసుకునేది. ఈ నాడు ఎర్రచందనము ఎంతో విలువైనది. దానితో
చేసిన వస్తువులు ఇప్పుడు తిరుపతిలో దొరుకుట కూడా లేదు, అక్రమ
రావాణాదారులకు తప్ప)
7. అసలు ఈ మదర్స్ డే అనే ఆనవాయితీ ఏవిధముగా వచ్చింది కాస్త
తెలుపుతారా?
3. మదర్స్ డే-Anna
Jarvis 1914 లో వుడ్రో
విల్సన్ కు 'అన్నాజార్విస్' చెప్పే వరకూ అమ్మ గుర్తుకు రాలేదు. ఆయన
సెకరెట్రీ లకు గుర్తు రాలేదు. అసలు అమ్మ సేవాభాము తో మరణించే ముందు వరకూ అన్నా
జార్విస్ కే అమ్మ గుర్తుకు రాలేదు. మన సాంప్రదాయమది కాదు. అమ్మ ఏ విధముగా
మరణించినా ఆమె మరణ తిథి ని మరవకుండా గుర్తు పెట్టుకొని ప్రతి యేటా ఆ తిథిన అమ్మకు
తద్దినం పెట్టె సాంప్రదాయము మనది. బ్రతికినంతకాలము ఆమె ఆ కుటుంబమునకు చేసిన సేవ
అమూల్యము. ప్రతి అమ్మ కు ఆవిధం గా తద్దినమో తర్పణమో వదులుతూ వుంటే తల్లిని ఇంట
జనాభా వుండే దేశము లో రోజూ తలచు కొన్నట్లు కాదా. అది daily, Mothers ‘Day అయిపోదా.
పాశ్చాత్యులు బ్రతికియున్న తమ స్వంత తల్లి\తండ్రి
తో సంవత్సరానికి ఒక సారి భోజనము చేయుట వారి సాంప్రదాయము. క్రొవ్వొత్తులు కార్డు
ముక్కలు వారి సంప్రదాయమే కానీ మనది కాదు. కావున ఆమె ప్రకటన (statement ) తమ వారికే గానీ మనకు కాదు. అసలు తన తండ్రితో
తాను పుట్టిన పిదప తన అమ్మ తన తండ్రితో ఎంత కాలము వుండినది, విడిపోయిన తరువాత తలిదండ్రులు ఒక్కొక్క పర్యాయము
ఒక్కొక్కరి వంతున ఎంత మందిని పెళ్లి చేసుకున్నారు అన్న వివరాలు మరియు , వారు ఒక వేళ స్వర్గస్థులై ఉంటే ఆ తేదీ వారికి తెలిసే అవకాశము మృగ్యము. అందుకే
ఉమ్మడిగా ఒక తేదీ ఏర్పాటు చేసుకొన్నారు. మరి మనకు ఆయా తేదీలు మరపు రావు కదా!
అటువంటప్పుడు మనకెందుకు వివిధములైన దినములు. అన్నా జార్విస్ అమ్మ మే 9, 1915 లో చనిపోతే, అన్నా మే 10, 1918 నాటికి
సాధించింది. On May 10, 1908, three
years after her mother's death, Jarvis held a memorial ceremony to honor her
mother and all mothers at Andrews Methodist Episcopal Church, today the International
Mother's Day Shrine, in Grafton, West Virginia, marking the first official
observance of Mother's Day. The International Mother's Day
Shrine has been a designated National Historic Landmark since
October 5, 1992. Although
Jarvis did not attend this service, she sent a telegram that described the
significance of the day as well as five hundred white carnations for all who
attended the service. As
she spoke in Philadelphia at the Wanamaker's Store
Auditorium, she moved her audience with the power
of her speech.
In the ensuing years, Anna Jarvis embarked upon a campaign to
make "Mother's Day" a recognized holiday. She spent a significant
amount of time writing to countless business executives, church groups, and
politicians at the state and national level to promote the commemorative day. (Wikipedia).
ఆమె గొప్ప వనిత . తన తల్లి జ్ఞాపకార్థము తాను ఏర్పరచిన రోజుననే ప్రపంచములోని ప్రజలంతా తమ తల్లులను కూడా తలచుకొమ్మని లోకానికి సందేశము నందించినది. ఇంకా ఈ
విషయమును గమనించండి.
1909 లో ఎందరో సెనేటర్లు ఆమె యొక్క ‘Mother’s Day holiday’ ఆలోచనను అవహేళన
చేసినారు. ఆమె తీర్మానమును మూర్ఖత్వమునకు ప్రతీక యని హెన్రీ మూర్ అను సెనేటరు ఈసడించినాడు. నేను పొందె
ప్రతిదినము Mother’s
Day నె
అన్నాడు. సెనేటరు జాకోబ్ గల్లింజెర్ (Senator
Jacob Gallinger) అసలు ఈ ఆలోచనే మాతృ భావనకు కళంకమన్నాడు. ప్రతి మే
నెల రెండవ ఆదివారమున (పై సంవత్సరమున మే 10 న ఆ రెండవ ఆదివారము వచ్చినది) వచ్చే
ఈరోజున బాహిరములైన ఆర్భాటములు మాతృ ప్రేమకు మాయని మచ్చ అన్నారు. ఆమె ఈ ప్రతిపాదన
తెచ్చినపుడు ఆమెను బాల పరచినవారు పుష్పగుచ్చ సంస్థల యజమానులు. ఆమె వారి మద్దత్తును అంగీకరించి విరాళాలు
కూడా వారినుండి గ్రహించినది. అట్లు వారి మద్దత్తుతో పుష్ప గుచ్ఛములను (carnations) ఇచ్చుట ఒక ఆపలేని ఆనవాయితీ కూడా అయి
కూర్చొన్నది. ఆ తర్వాత కాలములో ఆమె వద్దన్నా ఆ విషయముల పట్టించుకున్న వారు లేరు.
ఇది ఇట్లుండగా ఈ సంస్థలు బ్రతికియున్న తల్లుల కోసం అమితముగా ఆకర్షించే పుష్పములను ధరించుటను ఆనవాయితీ
గా చేసినారు. ఆపై ఇంకా ఎన్నో మార్పులు చేర్పులు కూర్పులు తప్ప హార్దికమైన అనురాగము
అమావాస్య
నాటి చంద్రుడే!
ఆవసానదశ లో అప్పులపాలై ఆరోగ్యము బాగులేక
ఆసుపత్రి పాలైన అన్నా అప్పులను అంతో ఇంతో ఉదాత్తముగా కట్టినారట ఆ carnations వారు . ఆమె 1948 నవంబరు 24 న దయనీయముగా మరణించినది.
ఎవరి స్వార్థము వారిది అన్న రీతిలో మొదలైన ఈ 'డే' లకు మనము ఫిడేలు
వాయించవలసిందేనా! A B అన్న జంట పెళ్లి చేసుకొని ఇద్దరు
పిల్లలు పుట్టి కళ్ళు తెరిచే లోపలనే A, C తో B, D తో పెళ్లి చేసుకుంటారు ఆ శృంఖల ఆ విధముగా కొనసాగుతూనే వుంటుంది. అందుకే ఆ
జంటలు ముచ్చటించుకునేటపుడు ' Your children and my children are playing
with our children' అని అనుకుంటూ సంతోష పడుతూ వుంటారు. ఇటువంటి
సాంప్రదాయము కలిగిన వారు సంవత్సరములో ఒకరోజయిన తమ తల్లిని,'మదర్స్
డే' నాడు తమ తండ్రిని 'ఫాదర్స్ డే'
నాడయినా అంటే సంవత్సరములో ఒకరోజయినా కలిసి భోంచేద్దామని అనుకుంటారు.
మనకా సాంప్రదాయము ఉందా! ఒకవేళ లేదు అన్నది మీ జవాబైతే అటువంటివి జరుపుకోనుట
అవసరమా! 'పుష్ప గుచ్చాలకు' GREETING CARDS (ఈ ఆనవాయితీనే మనకు లేదు. కాబట్టి తగిన తెలుగు పదము మన వద్ద లేదా అంటే మన
భాష లో నాకు తెలిసినంత వరకు 'అభినందన పత్రిక'అని పెట్టుకొనవచ్చును.), WRIST BANDS
(కంకణములు, తోరములు) వ్యర్థముగా డబ్బు
ఖర్చుచేయుట అవసరమా! మన సాంప్రదాయములో తోరములు కట్టుకునే నోములలో తోరపూజ తప్పనిసరి.
అది సమంత్రకముగా కట్టుకుంటారు. రాఖీ నాడు కూడా ఒక పసుపు దారమును దేవుని ముందుంచి
మనసారా నమస్కరించి నాలుగు అక్షింతలు వేసి ఆడబడచు తన సహోదరునికి కట్టితే
సరిపోయేదానికి ఈనాడు వందలు వేల రూపాయలను పెట్టి వానిని మార్కెట్లలో కొంటున్నాము.
ఇకనైనా ఈ కట్టు 'పాట్లు' మానుకుని మన 'కట్టుబాట్ల'లలో మనము వుండే ప్రయత్నమూ చేద్దాము. అసలు
ఇంత కష్టపడి వ్రాసిన ఈ వ్యాసము మీ పిల్లలు చదువుతారు అన్న నమ్మకము నాకు లేదు .
కారణాలు రెండు.
1. వారు ఇంత తెలుగు చదవలేరు\ఓపికగా
వినలేరు.
2. వారు ఇంతసేపు చదవలేరు\ విననూలేరు.
3. ఒకవేళ తల్లిదండ్రులు చదివినా బిడ్డలకు చెప్పుకునే
అవకాశము ఉండదు. ఒకసారి వీరబ్రహ్మము గారు తన శిష్యుడు సిద్దయ్యతో 'లోకమెట్లుందిరా సిద్దా' అని అడిగినాదట! అందుకు బదులుగా సిద్దయ్య ' ఏం జెప్పెది సామీ ఎవరిలోకం వాళ్ళది' అన్నాడట. ఇదీ నేటి పరిస్థితి లేక దుస్థితి.
8. మన దేశపు తల్లులు తమ పిల్లలు ఇల్లును గూర్చి, తమ దేశమును గూర్చి బాధ్యత ఎంతవరకు తీసుకుంటారు?
గృహిణి -- ఇంటికి పొదిగిన మణి
చదువు సంధ్య లేకున్నా సంస్కారములో మిన్న
పెంపకాన మనసుంచును కలిగియున్న బుద్ధికన్న
మెతుకు గతుకునోలేదో తనకు మాత్రమె తెలుసు
బిడ్డ కంటిలో ఎపుడూ పడనీయదు నలుసు
కన్న కలలు పగలంతా రెప్పలపై ఏర్చిపేర్చు
పనులన్నీ ముగియుదాక రేయినిదురనోదార్చు
ఇంటిబయట తనపేరును అంటించగ తా కోరదు
తన సేవాధర్మముతో ఇంటి యశము సమకూర్చు
మొగుని విసుగు నంతయును ముసినవ్వున మరుగుపరచు
మూతిని ముడిచిన మొగ్గను కుసుమముగా వ్యక్త పరచు
మానై తా నెండ నోర్చి తెరువరులకు నీడనిచ్చు
ఇంటికి తా దేవతయై స్వర్గమునే నిలిపియుంచు
ఇక మన దేశపు తల్లుల గూర్చి ఒక నిముసము తలపొస్తాము.
బన్‌బీర్
అనే రాజు చిత్తోఢ్ ను ఆక్రమించి యువరాజు ఉదయ్ సింగ్‌ను చంపడానికి వస్తే, దాసి
పన్నాతాయి తన కొడుకును ఉదయ్ సింగ్ స్థానంలో వుంచి ఉదయ్‌ని తప్పించుటకు ఆమె తన
కన్నకొడుకును బన్‌బీర్ కత్తికి బలిచేసిన యదార్థము నిజంగా
కంటతడి పెట్టిస్తుంది. ఇక అనంతామాత్యుడు వ్రాసినాడని
చెప్పబడే ఆవు పులి
కథ అందరికీ తెలిసినదే! నిజము , నిజాయితి,
కన్నా బిడ్డపై మమకారము తెలిపే కథ, పిల్లల
కొరకు ప్రాణాలనే త్యాగము చేసిన తల్లుల గాథలు ఎన్నో! ఇవేవి గాకుండా మరి జార్విస్
గారి Mothers’Day నే మనము
పాటించవలసిన అవసరము వున్నదా! ‘ తల్లికి పెద్ద పీట వేసిన ‘మాతృదేవోభవ’ అన్న ఆర్య వాక్కు జార్విస్ గారి Mothers’Day కన్నా కొన్ని వేల
(మాట వరుసకే, ఇంకా ఎక్కువ కాలమే కావచ్చు) సంవత్సరాల క్రితము
నాటి మాట మనము సరకుగొన నవసరము లేదా! మనము తిథి వార నక్షత్ర యోగ కరణ సహిత
నిర్దుష్ఠమైన మన పంచాంగమును అనుసరించి తిథిని
పాటించుతాము. ఆ ప్రకారమే మన పితరుల స్వర్గస్థ దినమును గుర్తుంచుకొని ఆ రోజు మన
శక్త్యానుసారము పుణ్య కార్యములుచేసి వారిని తలంచుకుంటాము. వాళ్ళకన్నా పూర్వీకులు
గానీ లేక ముఖ్యులై (ఒకవేళ తల్లిదండ్రులే కావచ్చు గాక) వారి స్వర్గస్థ తిథి
తెలియకపోతే మహాలయము నాడు తర్పణము వదులుటయో, లేక
ఏదయినా పుణ్యకార్యము చేయుటయో చేస్తాము. మాహాలయము నాడే ఈ విశ్వము లయమైనది అన్నది
శాస్త్రవాక్కు. అందువల్ల ఆ రోజుకు అంత ప్రాముఖ్యత. అసలు భాద్రపద
కృష్ణ పక్షము అంతా మహాలయ పక్షము అంటారు. నేను పాశ్చాత్యులను తప్పు పట్టుట లేదు. మన
ఆచారముల మరచి వారి మాట మనకు శిరోధార్యము అన్న తలపులు కలిగిన వారి కొరకు ఇది వ్రాయ
వలసి వచ్చింది.తలిదండ్రులను గౌరవించు విషయము మనము ఇతరుల వద్ద నేర్చుకోను కర్మ పట్టలేదు.
సంస్కృతిని సనాతన కాలము నుండి నే సకల దిశలకూ
వ్యాపింప జేసిన ఈ దేశమునకు, అనుబంధము, ఆప్యాయత అనురాగము, ఆత్మీయత,
అంతఃకరణ, అంటే తెలియని అన్య దేశములనుండి
ఉపదేశములు వినే దుర్గతి పట్టనీయకండి. ‘ధర్మ ఏవ హతో హన్తి ధర్మో రక్షతి రక్షితః’ అన్న ఆర్య వాక్కును మనసున ధరించండి. దేశాన్ని, ధర్మాన్ని, సంస్కృతిని
కాపాడండి. గర్వముగా మన దేశ పతాకను హిమాలయాలపై సదా ఎగురనివ్వండి.
మరొకసారి మరొక విషయముతో…..